Thursday, February 20, 2014

రియాలిటీ చెక్ ప్రసంగాలు-2: అభిమాన మిత్ర వాక్యాలు

తెనాలిలో జరిగిన రియాలిటీ చెక్ ఆవిష్కరణ సభలో ఒక వక్త బి.ప్రవీణ్ కుమార్. ప్రవీణ్ నాకు మిత్రుడు. ఉద్యోగ రీత్యా ప్రస్తుతం హైదరాబాదులోని డిజిటల్ గ్రీన్ ఎన్జీవోలో పనిచేస్తున్నాడు. రైతులకు వీడియో పాఠాలు నేర్పడం చేస్తుంటాడు. అంతకుముందు లయోలా విద్యార్థులకు 'ఫిలిం' బోధించేవాడు. అయితే, పని ఒత్తిడిలో ఆ రోజు సభకు హాజరుకాలేకపోయిన ప్రవీణ్ తన మాటల్ని రాసి పంపాడు. వాటిని ప్రముఖ న్యాయవాది, సుప్రసిద్ధ న్యాయవాది బి.చంద్రశేఖర్ సహచరుడు అయిన నాగేశ్వరరావు చదివి వినిపించారు. ఆ పాఠాన్నే ఇక్కడ ఉంచుతున్నాను....

-----------------------------------------------------

రియాలిటీ చెక్ ఆవిష్కరణకోసం ఇక్కడికి రావాల్సి ఉండీ అనివార్యంగా రాలేకపోయిన మిత్రుడు ప్రవీణ్ తరఫున ఈ...
అభిమాన మిత్ర వాక్యాలు.

పూడూరి రాజిరెడ్డి పుస్తకం 'రియాలిటీ చెక్' తెనాలిలో ఆవిష్కరింపబడటం చాలా ఆసక్తికరమైన విషయం.

ఈ విషయం లోలోపలికి వెళితేనే రాజిరెడ్డి రచయితగా బాగా అర్థం అవుతాడు. ఎందుకంటే రాజిరెడ్డి ఎప్పుడూ ప్రాంతం గురించి రాస్తున్నానని చెప్పుకోలేదు. అలా ఎప్పుడూ రాయలేదు. అదేవిధంగా- సిద్ధాంతాల ముసుగులో కూడా ఆయన ఎప్పుడూ గంభీరమైన ప్రకటనలు చేయలేదు. మతాల గురించిగానీ, కులాల గురించిగానీ- వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్నానన్న భావన కూడా ఎప్పుడూ కల్పించలేదు. అయినా రాజిరెడ్డి చాలామంది ఆదివారం పాఠకులతో ఓ అర్ధగంటో, ఓ గంటో స్నేహం చేయగలిగాడు. అందుకే రాజిరెడ్డి పుస్తకం తెనాలిలో ఆవిష్కరింపబడటం నాకు చాలా ఆసక్తికరమైన విషయంగా తోచింది.

మనం(సాధారణంగా) ప్రమాణాలుగా పెట్టుకున్నటువంటి ప్రాంతాన్ని, కులాన్ని, మతాన్ని, ఇంకా చెప్పుకుంటూపోవాలంటే వర్గాన్ని కూడా ఆయన ప్రమాణంగా తీసుకోకపోవడమే అందుకు కారణమై ఉండొచ్చు. వీటన్నిటికీ అతీతమైనవాటిని ఏవో - ప్రస్తుతానికి నాకైతే స్పష్టత లేదు - రాజిరెడ్డి పట్టుకుంటున్నాడు. అందుకే రాజిరెడ్డి తెనాలి వాళ్లకు ఈ సందర్భంలో ఆప్తుడయ్యాడు. అలా సాహిత్యం ఉంటే- దానికి విశ్వసనీయత, విశ్వజనీనత ఉంటుందని నా నమ్మకం. ఆ దిశగా మిత్రుడు రాజిరెడ్డి పయనించడం నాకు ముచ్చట కలిగించే విషయం.

ఇప్పుడు రాజిరెడ్డి 'రియాలిటీ చెక్' పుస్తకం గురించి పదివాక్యాలు మాట్లాడుతాను.

నగరాలని కథగా చెప్పడం, లేదా వచనంలో ముక్కలుముక్కలుగా వ్యాసాలుగా చెప్పటం అనేది చాలా అరుదైన ప్రక్రియ. నాకు తెలిసినంత వరకు తెలుగులో నగరాన్ని బ్యాక్‌డ్రాప్‌గా తీసుకుని చాలా తక్కువమంది రాసారు. రాజిరెడ్డి అటువంటి ప్రక్రియను చాలా సమర్థవంతంగా రాయగలిగాడు. నగరంలో జీవితం ఉంటుంది- ఆ జీవితం చుట్టూ అల్లుకుపోయిన వైవిధ్యాన్ని, చరిత్రను రాజిరెడ్డి తన చక్కెర గుళికల్లాంటి వ్యాసాల్లో బాగా రికార్డు చేయగలిగాడు.

ఇంగ్లీషు సాహిత్యంలో అయితే- చార్లెస్ డికెన్స్... లండన్ నగరం గురించి, జేమ్‌స్ జాయిస్... డబ్లిన్ గురించి, ఓరహాన్ ఫాముక్... ఇస్తాంబుల్ గురించి చాలా అద్భుతమైన వర్ణ వివరణ చేసారు. ఇండియన్ ఇంగ్లీషులో సుకేతు మెహతా 'మ్యాక్సిమమ్ సిటీ' పుస్తకంలో ముంబయి గురించి ఆసక్తికరమైన వచన రచన చేసాడు. అలా మహా మహా రచయితలు భుజానికెత్తుకున్న నగర జీవితం అన్న అంశంపై పూడూరి రాజిరెడ్డి... హైదరాబాద్ గురించి రాయడం తెలుగు సాహిత్యంలో ఒక అరుదైన ప్రయోగం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో హైదరాబాద్ గురించి రాయబడిన పుస్తకం... రేపు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా కచ్చితంగా పాపులర్ అవుతుందని పాఠకునిగా నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన ప్రస్తుతం ఎన్నుకొన్న బ్యాక్‌డ్రాప్ హైదరాబాదే కావొచ్చు... కానీ అందులో రాసిన జీవితం కేవలం హైదరాబాద్‌కే సంబంధించినది కాదు.

అందుకే మళ్లీ చెబుతున్నాను...
పూడూరి రాజిరెడ్డి పుస్తకం 'రియాలిటీ చెక్' తెనాలిలో ఆవిష్కరించబడటం చాలా ఆసక్తికరమైన విషయం. గమనించాల్సిన విషయం.

కృతజ్ఞతలతో...
బి.ప్రవీణ్ కుమార్
(జనవరి 5, 2014)

No comments:

Post a Comment