Saturday, December 29, 2018

చింతకింది మల్లయ్య ముచ్చట మీద చేపూరు సుబ్బారావు గారి సమీక్ష


నా చింతకింది మల్లయ్య ముచ్చట కథల సంపుటి మీద ప్రతిలిపి ఆంగ్ల విభాగంలో డిసెంబర్ 26 నాడు ప్రచురితమైన చేపూరు సుబ్బారావు గారి సమీక్ష లింకు ఇక్కడ:

Review of Chintakindi Mallaiah and Other Stories



Tuesday, October 23, 2018

నాకు ఇంత ఆశ్చర్యం కావాలి!


నాకు ఇంత ఆశ్చర్యం కావాలి!
ఏదో ఒకటి.
చిన్నది.
ఒక మంచి వాక్యం రాయగలగడమో; ఒక పాత మనిషి కొత్తగా తెలియడమో; జోరుగా వాన పడుతున్న సమయంలో బోర్లించిన సముద్రంలా ఆకాశం కనబడటమో; మన మీద లో ఒపీనియన్ ఉండివుంటుందనుకున్న అమ్మాయి మన ఎఫ్బీ ప్రొఫైల్ పిక్కు లైక్ చేయడమో; పదకొండు రూపాయల టికెట్కు రెండు పది నోట్లిచ్చినా గులగకుండా, వెనక రాయకుండా కండక్టర్ తొమ్మిది రూపాయల చిల్లర ఇవ్వడమో...
ఏదో ఒకటి.
చిన్నది.
నవ్వును బదులివ్వాల్సినంత సేపు కారులోని పసిపాప మనతో కళ్లు కలపడమో; బాత్రూములో జారిపడి హాస్పిటల్లో ఉన్న కలీగ్ మనల్ని గుర్తుచేశారని వినడమో; పేరు తెలియని బూడిదరంగు ఎత్తుతోక పిట్ట చేసిన ధ్వని మన పేరును ఉచ్చరించినట్టుగా అనిపించడమో; ఫుకుఓకా తత్వానికీ ఫైట్ క్లబ్ చిత్రానికీ ఉన్న సంబంధం ఏమిటో అవగాహనకు రావడమో; వర్జిల్ అని చిన్నప్పటినుంచీ వింటున్న పేరు కాస్తా డెత్ ఆఫ్ లజరెస్కుఅనబడే రొమేనియన్ సినిమా ద్వారా విర్జిల్ అనాలని తెలియడమో...
ఏదో ఒకటి.
చిన్నది.
మన బుడ్డోడుఎండ కొడుతుండు, మరి సూర్యుడు మొగాయినగదా అనడమో, ఆవలిస్తే చెవులు ఎందుకు వినబడవని అడగటమో; చీకటిపడ్డాక మన ఊరి చెరువు కట్టమీద పాత స్నేహితుడితో నడుస్తున్నప్పుడు, చెరువులోని తుమ్మచెట్ల మీద ముడుచుకున్న తెల్ల కొంగల గుంపును వెన్నెల కాంతిగా పొరబడటమో; పెద్ద సారు’ ఉన్నట్టుగానో లేనట్టుగానో ఒక రుజువో మరోటో దొరకడమోమనలాంటి చిన్నవాళ్లను కూడా ఒక్కోసారి  విశాల ప్రపంచం పెద్దవాళ్లమని అనుకునేట్టుగా చేయడమో...
ఏదో ఒకటి.
చిన్నది.
కొంచెం పెద్దదైనా ఫర్లేదు.
మరీ, ‘రేపటితో నీకు ఆఖరుఅని తెలియడం అంతటిది కాకుండా!


(నవంబర్ 2017; సాక్షి- సాహిత్యం)


ఈమాటలో నా రచనలు

2016 నవంబరులో 'నా టేస్టు లేనితనం'తో ప్రారంభించి, అప్పుడప్పుడు ఈమాట వెబ్ మాగజీన్లో రాస్తున్నాను.  ఈమాట రచయితల రచనలు మొత్తం ఒకే దగ్గర కనబడేట్టుగా 'వాళ్లు' మంచి ఏర్పాటు చేశారు. అందుకే ఏ రచన లింకు అది విడిగా ఇవ్వకుండా ఆ మొత్తం లింకు ఇస్తున్నా.


రెండో భాగం కథపై ఒక అభిప్రాయం


ఇవాళ సాక్షి ఫన్ డే (01-07-2018)లో పూడూరి రాజిరెడ్డి కథ  రెండో భాగం చదువుతుంటే నాకు బుచ్చిబాబు, గోపీచంద్ గుర్తుకు వచ్చారు . ఈ రెండో భాగం కథ ఉద్వేగాన్ని (ఎమోషన్ ను నేను ఉద్వేగం అంటున్నాను) కథ పొడవునా కొనసాగిస్తూనే ఒక సామాజిక వాస్తవికత లేదా దుర్నీతిని ఇది అరచేతిలో ఉసిరికాయలా కరతలామలకం చేసింది.

- వంశీకృష్ణ

(కొనసాగింపు ఇక్కడ)

రెండో భాగం: ఆక్టోపస్ కబళించిన మనం

రెండడుగుల నేల

2013.
    యుగాంతం అబద్ధమని తేలిపోయాక-
    ఒక శుక్రవారం నాడు...

    ఇలాంటి సమస్య ఒకటి వస్తుందని ఏమాత్రం ఊహించలేదు ఆనందరావు.

    మామూలు చికాగ్గా లేడతను.

    దించివున్న లుంగీని ఎత్తికట్టాడు. మళ్లీ ఎత్తికట్టిన లుంగీని కిందికి దించాడు. అసహనంగా హాల్లోంచి కిచెన్లోకీ, అంతకంటే అసహనంగా అక్కడినుంచి బెడ్రూమ్ లోకీ వచ్చాడు.

    రెండు నిమిషాలు కళ్లు మూసుకుని, సర్వం మరచిపోయి నిద్ర పోదామనుకున్నాడుగానీ సాధ్యం కాలేదు.

(మిగతా కథాజగత్ వెబ్ సైటులో)

'రియాలిటీ' ఇక్కడ వినొచ్చు!


పది నెలల కింద, అంటే 5 డిసెంబరు 2017 నుంచి, ఆకాశవాణి హైదరాబాద్ '' కేంద్రం నుంచిరియాలిటీ చెక్’ 13+4 వారాల పాటు ధారావాహికగా ప్రసారం అయింది.  ప్రతి మంగళవారం రాత్రి 8:30కు రియాలిటీ చెక్: హైదరాబాద్ గాథలు పేరిట ఇది వచ్చింది. నిడివి సుమారు పన్నెండు నిమిషాలు.

పుస్తకాన్ని, పాఠకులుగా చదువుకోవడం వేరు; అవసరమైతే ఓసారి వెనక్కి వెళ్లి చూసుకోవచ్చు; కానీ వింటున్నప్పుడే వేరే; అక్కడ దృష్టి(చెవి) పెట్టకపోతే మళ్లీ వినే వీలుండదు. అందుకే, అరవై అంశాలున్న రియాలిటీ చెక్ పుస్తకంలోంచి మళ్లీ వెనక్కి వెళ్లి ఏం రాసివుంటాడో చూడనక్కర్లేనంత సరళంగా ఉన్నవే చదవడానికి ఎంచుకోవడానికి ప్రయత్నించాను.

ఇది వచ్చిన నాలుగు నెలల పాటూ మా ఇంటివరకూ పండగలా ఉండేది. నా గొంతు నాకే ఇంకెవరిదో వింటున్నట్టుగా కూడా అనిపించేది. ఇంకో విషయం: నాది ప్రొఫెషనల్ గొంతు కాదు కాబట్టి, ఆ తేడా తెలిసిపోతుంది. ఆ ప్రొఫెషనల్ గొంతు కాకపోవడమే ఇవి చదవడానికి మరీ నప్పింది, అన్నవాళ్లున్నారు.

13+4 ఎందుకూ అంటే, ముందు పదమూడింటికే అనుకొని, మళ్లీ నాలుగు అదనంగా చదవమన్నారు. అప్పుడు వాటిని నేను కాకుండా దక్షిణామూర్తి గారు చదివేశారు.

ఇక ఆ చదివిన భాగాల్లో తొమ్మిదింటిని రియాలిటీ చెక్: హైదరాబాద్ గాధలుపేరిట యూట్యూబ్ లో ఉంచారు ఆకాశవాణి వాళ్లు. వాటిని వినే ఆసక్తి ఉన్నవాళ్లకోసం ఆ లింకు కింద ఇస్తున్నాను.