Tuesday, October 23, 2018

నాకు ఇంత ఆశ్చర్యం కావాలి!


నాకు ఇంత ఆశ్చర్యం కావాలి!
ఏదో ఒకటి.
చిన్నది.
ఒక మంచి వాక్యం రాయగలగడమో; ఒక పాత మనిషి కొత్తగా తెలియడమో; జోరుగా వాన పడుతున్న సమయంలో బోర్లించిన సముద్రంలా ఆకాశం కనబడటమో; మన మీద లో ఒపీనియన్ ఉండివుంటుందనుకున్న అమ్మాయి మన ఎఫ్బీ ప్రొఫైల్ పిక్కు లైక్ చేయడమో; పదకొండు రూపాయల టికెట్కు రెండు పది నోట్లిచ్చినా గులగకుండా, వెనక రాయకుండా కండక్టర్ తొమ్మిది రూపాయల చిల్లర ఇవ్వడమో...
ఏదో ఒకటి.
చిన్నది.
నవ్వును బదులివ్వాల్సినంత సేపు కారులోని పసిపాప మనతో కళ్లు కలపడమో; బాత్రూములో జారిపడి హాస్పిటల్లో ఉన్న కలీగ్ మనల్ని గుర్తుచేశారని వినడమో; పేరు తెలియని బూడిదరంగు ఎత్తుతోక పిట్ట చేసిన ధ్వని మన పేరును ఉచ్చరించినట్టుగా అనిపించడమో; ఫుకుఓకా తత్వానికీ ఫైట్ క్లబ్ చిత్రానికీ ఉన్న సంబంధం ఏమిటో అవగాహనకు రావడమో; వర్జిల్ అని చిన్నప్పటినుంచీ వింటున్న పేరు కాస్తా డెత్ ఆఫ్ లజరెస్కుఅనబడే రొమేనియన్ సినిమా ద్వారా విర్జిల్ అనాలని తెలియడమో...
ఏదో ఒకటి.
చిన్నది.
మన బుడ్డోడుఎండ కొడుతుండు, మరి సూర్యుడు మొగాయినగదా అనడమో, ఆవలిస్తే చెవులు ఎందుకు వినబడవని అడగటమో; చీకటిపడ్డాక మన ఊరి చెరువు కట్టమీద పాత స్నేహితుడితో నడుస్తున్నప్పుడు, చెరువులోని తుమ్మచెట్ల మీద ముడుచుకున్న తెల్ల కొంగల గుంపును వెన్నెల కాంతిగా పొరబడటమో; పెద్ద సారు’ ఉన్నట్టుగానో లేనట్టుగానో ఒక రుజువో మరోటో దొరకడమోమనలాంటి చిన్నవాళ్లను కూడా ఒక్కోసారి  విశాల ప్రపంచం పెద్దవాళ్లమని అనుకునేట్టుగా చేయడమో...
ఏదో ఒకటి.
చిన్నది.
కొంచెం పెద్దదైనా ఫర్లేదు.
మరీ, ‘రేపటితో నీకు ఆఖరుఅని తెలియడం అంతటిది కాకుండా!


(నవంబర్ 2017; సాక్షి- సాహిత్యం)


1 comment:

  1. నాలాంటి వాళ్ళకి ఇసోంటి కబుర్లు చదవడమే పెద్ద ఆశ్చర్యం !
    ప్రతి మనిషీ తనకే ప్రత్యేకమైన ఒక రాయని పుస్తకాన్ని నిరంతరం చదువుకుంటూ ఉంటాడేమో ?

    ReplyDelete