Monday, November 21, 2011

పాత చొక్కాను తడిమిన ఆనందం

జీవితం క్షణికం కావొచ్చు. కానీ క్షణం అసత్యం కాదు.
-యండమూరి వీరేంద్రనాథ్

యండమూరితోనే నాకు సాహిత్యం పరిచయం. కానీ "అనూహ్య' పరిచయం. అట్టలూడిపోయిన పుస్తకమొకటి మామయ్య వాళ్లింట్లో పడివుంది. అలా అంతకుముందు కూడా కొన్ని పడివున్నవి తిప్పిచూశానుగానీ అవి రాసినవాళ్ల పేర్లుగానీ, వాళ్లను మళ్లీ చదవాలన్న కోరికగానీ కలగలేదు. ఈ చీకట్లో సూర్యుడు అందుకు విరుద్ధం. నన్ను అంతరిక్షంలో గిరికీలు కొట్టించాడు. కొన్ని రోజులు యశ్వంత్ లాగా మౌన గంభీరంగా ఉండటం గొప్పనుకునేవాణ్ని. కాదు, వాయుపుత్రలాగా అల్లరిగా ఉండటమే గొప్ప కాబోలనుకునేవాణ్ని. చివరకు ఇద్దరిగానూ ఉండలేక, నాలా నేను ఉండటానికి ఇప్పటికీ విఫల యత్నం చేస్తున్నాను.
మళ్లీ ఈ మధ్యలో ప్రకాశం జొరబడ్డాడు. మాసిన దిండులాంటివాడు. ఇంకెప్పుడో గాంధీ వచ్చిచేరాడు. రెపరెపలాడే కొత్తనోటులాంటివాడు. అయితే, అటు ప్రకాశంలా ఉండిపోనూలేము. ఇటు గాంధీలాగా పచ్చనోట్లు తగలబెడుతూ చిర్నవ్వుతో చూడనూలేము. కాకపోతే, మన ప్రియురాలు ఎప్పుడు పిలుస్తుందా? తలవాల్చేందుకు పల్చటి పొత్తి కడుపు ఎప్పుడు లభిస్తుందా? అని కలలు కనడం మాత్రం చేయగలిగాము.
ఇంకా, చెంగల్వపూదండలూ వెన్నెల్లో ఆడపిల్లలూ గోదారులూ ప్రేమలూ పర్ణశాలలూ అభిలాషలూ అనైతికాలూ ప్రార్థనలూ యుగాంతాలూ...
ఈయనెవరో నాకోసమే రాస్తున్నాడా?
మందాకిని స్నానించినప్పుడు ప్రవహించే సబ్బు నురుగు పుట్టించే కొన్ని ఉత్తేజిత క్షణాలు... యండమూరిని చదవడం.

పైనెక్కడో సాహిత్యంతో పరిచయం అన్నానా!
కొంత పెద్దయ్యాక, పెద్దాళ్లు రాసింది చదివితే, యండమూరి రాసింది క్షుద్ర సాహిత్యం అని తెలిసింది. కానీ, దాన్ని క్షుద్ర సాహిత్యం అని అంగీకరించడానికి నాలో దాగివున్న క్షుద్రుడు అడ్డుపడ్డాడు.
ఇంకా యండమూరి దురదృష్టం ఏమిటంటే, "కామూ'ను చదివి ఆయన అంతర్ముఖం రాస్తే, కాపీ కాపీ అన్నవాళ్లు... అదే కామూలాంటివాళ్లను తెలుగులోకి తెచ్చినవాళ్లను సృజనశీలురుగా ముద్రవేయడం. బహుశా పేరొచ్చినవాడిని మనం సహించం. డబ్బు కూడా వచ్చినవాడంటే అసలు భరించం. సాహిత్యం సంపద ఇవ్వడమేమిటి మరి? చర్చలకూ, వాదోపవాదాలకూ పనికిరావాలిగానీ!

యండమూరి డబ్బు కోసం మాత్రమే రాసినవాడా?
ఒక మామూలు యువ ఉద్యోగి. మొదటిసారి స్లీపరు క్లాసులో ప్రయాణిస్తున్నాడు. అంగీ విడిచి, బనీన్ మీద పడుకోవాలి! సహ ప్రయాణీకులు ఖరీదుగా కనిపించారు. వాళ్ల మధ్య అలా చేస్తే తన పల్లెటూరితనం బయటపడుతుంది. ఎలా? ఇంతలో ఓ కాఫీ అమ్ముకునే కుర్రాడు వచ్చాడు. అతడికివ్వాల్సిన చిల్లర కోసం ఆ ఖరీదు మనుషులు ఎంత చిల్లరగా ప్రవర్తించారని! డబ్బులివ్వలేదు. రైలు కదిలింది. కుర్రాడు పరుగెత్తుకుంటూ వచ్చి కిందపడ్డాడు. మట్టిలో దొర్లాడు. యువకుడు చలించాడు. జేబులో ఉన్న డబ్బులో గుప్పిడితో తీసి పిల్లాడివైపు విసిరికొట్టాడు. ఖరీదైన వ్యక్తిత్వాల మీద తనకు ఉన్న భ్రమ అనే "మిస్ట్" ఇట్టే కరిగిపోయింది. ఇక వాళ్లను ఖాతరు చేయకుండా, లుంగీ బనీన్ మీదే కాళ్లు జాపుకుని హాయిగా పడుకున్నాడు.
బహుశా, యండమూరి కూడా తన విమర్శకుల విషయంలో ఇదే చేసివుంటాడు.

అయితే, నాటకాలు, నవలలు, వ్యక్తిత్వ వికాసాలు అనబడే మూడు దశలుగా ఉన్న తన సాహితీ జీవితంలో... యండమూరి మొదట్లో ఉన్నట్టు మధ్యలో లేడు. మధ్యలో ఉన్నట్టు ఇప్పుడు కనబడడు. అది మార్పుగా కాకుండా, తనను తాను ఏమార్చుకుంటూ వెళ్లాడేమోననిపిస్తుంది. సమాజపు కన్నీళ్లు తుడవడం కంటే, అందుకోసం టిష్యూ పేపర్స్ అమ్మితే బాగుంటుందన్న ఆలోచనాధోరణిలో పడిపోయాడు. పోరాటమే తప్ప జీవితంలో జయాపజయాలు ఉండవని తెలిసినా విజయసూత్రాలు లిఖించడం మొదలుపెట్టాడు.

ఇక ఇది నాకు సరిపోదని బీరువా అడుగున మడతపెట్టి దాచిన పొట్టి చొక్కా యండమూరి సాహిత్యం. వేసుకోవడానికి కుదరకపోయినా, తడిమి చూసుకుంటే అపురూపంగా ఉంటుంది.

(నవంబర్ పద్నాలుగున యండమూరి పుట్టినరోజు)

Monday, November 14, 2011

ఏమిటీ అస్తిత్వవాదం?సాక్షి ఫన్డేలో నవంబరు 13న ప్రచురితం.

Monday, October 31, 2011

నిజంగానే వీళ్లు నా బ్లాగ్ చూస్తున్నారా?

కొన్ని రోజుల క్రితం దాకా, బ్లాగ్-కు సంబంధించిన స్టాట్స్ చూసుకోవడం గురించి నాకు అవగాహన లేదు.
ఓహో... ఈ కౌంటింగ్ ఫెసిలిటీ ఉందని నేను గుర్తించాక, నా రీడర్స్ కౌంటర్ తీసేశాను. ఇంకెందుకు?

అయితే, ఇక్కడో నాకో పిచ్చిలాంటిది తగులుకుంది. ఏయే దేశాలవాళ్లు నా బ్లాగు చదువుతున్నారని?
సహజంగా అందులో ఇండియావాళ్లు ఉంటారు. అమెరికా వాళ్లు కూడా ఉంటారు. ఆస్ట్రేలియా వరకు ఓకే అనుకుందాం. ఏ యూకేలోనో, సౌదీ అరేబియాలోనో కూడా మన తెలుగువాళ్లు ఉంటారంటే నమ్ముదాం
ఇప్పుడు ఈ కింది దేశాల జాబితా చూడండి.
ఇవి నేను కొన్ని వారాలుగా సేకరిస్తున్న పేర్లు. నిజంగా ఇన్ని దేశాల్లో మన తెలుగువాళ్లున్నారా? లేకపోతే ఈ క్లిక్స్ నమోదు కావడానికి ఇంకేమైనా మార్గాలుంటాయా?
లేకపోతే ఏమిటి? అర్జెంటినానుంచి చదవడమా? స్వీడన్ నుంచి చదవడమా?
గ్రీస్, నైజీరియా, కొలంబియా, స్విట్జర్లాండ్, ఖతార్, డెన్మార్క్... ఈయా దేశాల్లో తెలుగువాళ్లు ఉండటమే ఒకెత్తయితే, అందరూ మన బ్లాగు చూడాలని లేదుకదా. ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ ఉంది.

Angola
Argentina
Australia
Bahrain
Bangladesh
Barbados
Belarus
Belgium
Bulgaria
Brazil
Cambodia
Canada
Chile
China
Colombia
Congo
Côte d’Ivoire
Czech Republic
Denmark
Ecuador
Egypt
El Salvador
Finland
France
Germany
Ghana
Greece
Hong kong
India
Indonesia
Iraq
Ireland
Israel
Italy
Japan
Kuwait
Latvia
Malaysia
Mexico
Moldova
Nepal
Netherlands
Nicaragua
Nigeria
Norway
New Zealand
Oman
Philippines
Poland
Qatar
Russia
Saudi Arabia
Singapore
Slovakia
South Korea
Sweden
Switzerland
Taiwan
Tanzania
Thailand
Ukraine
United Arab Emirates
United Kingdom
United States of America
Venezuela
Vietnam

Monday, October 17, 2011

వాస్తు

అటెల్ సాహెబ్ ఇంటి ప్రహారీ
ఆదుర్రు మల్లారెడ్డి క్యాష్ కౌంటరు
సరోజనమ్మ వంటగది
నిరంజనయ్య పూజగది
రంగారావుగారి చేదబావి
రాజాసుందరంగారి ఆఫీసుతావు
ఏవీ వాస్తుకు లేవంట.
అందుకే వాళ్లెవరికీ బాగాలేదంట.
అదిగందుకే వాటిని కూల్చేస్తున్నారంట.

నిజానికి-
ఈ ప్రపంచమే నాకు వాస్తుకు లేదనిపిస్తోంది.
దీన్ని కూడా చాలా చోట్ల కూల్చెయ్యాలి.
చాలా చాలా చోట్ల తిరిగి నిర్మించాలి.

Tuesday, October 11, 2011

నాకు బాగా నచ్చిన కథ 'అతడు మనిషి'సాక్షి సాహిత్యం పేజీలో "ఎంపు" శీర్షిక కోసం రాసిందిది.

Monday, September 12, 2011

Sunday, June 19, 2011

నాన్న వేసిన రెండు ప్రశ్నలుఒక సాయంత్రం, కౌమారంలోంచి యవ్వనంలోకి అడుగుపెడుతున్న కొడుకును పిలిచాడు తండ్రి.
ఆయన కుర్చీ మీద కూర్చున్నాడు. ముందరి టేబుల్ మీద ప్యాడు, కాగితం, పెన్ను ఉన్నాయి.
కాగితం చేతిలోకి తీసుకున్నాడు అబ్బాయి. అందులో మొదటి ప్రశ్న ఇలా ఉంది.
'మనిషికి దుఃఖం ఎందుకుండాలి?'
సమాధానం రాయమన్నట్టుగా సంజ్ఞ చేశాడు తండ్రి.
ఇన్నేళ్లుగా తండ్రి తనకు స్నేహితుడయ్యాడు. ఉపాధ్యాయుడిలా పాఠాలు చెప్పాడు. తాత్వికుడిలా జీవితసారాన్ని ఎరిక పరిచే ప్రయత్నం చేశాడు. దాన్నే కాగితం మీద రాయడానికి ఉపక్రమించాడు కొడుకు.
'మొట్టమొదటిది, సంతోషం అంటే ఏమిటో తెలియడానికి దుఃఖం ఉండాలి. దుఃఖం లేకపోతే, సంతోషంలో ఉన్న గాఢత మన అనుభవంలోకి రాదు.
మనలోని కరుణ మేల్కొనేందుకు దుఃఖం దోహదం చేస్తుంది. మనల్ని మరింత సున్నితంగా, మరింత స్పందనలున్న జీవిగా మలిచేందుకు దుఃఖం తోడ్పడుతుంది.
దుఃఖం వల్లే ప్రపంచపు లోపలి పొరల్ని తరచి చూడగలిగే కాఠిన్యం అలవడుతుంది. దుఃఖంలోంచే మానవ జీవిత మూలాల్ని అన్వేషించే వివేకం మేల్కొంటుంది'.

రెండో ప్రశ్న:
'దుఃఖాన్ని తొలగించుకోవడం సాధ్యమేనా?'
దానికి కొడుకు జవాబు ఇలా రాయసాగాడు.
'దుఃఖాన్ని తొలగించుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలాసార్లు మరింత దుఃఖాన్నే మిగల్చవచ్చు. దుఃఖం ఉందన్న కారణంగా మళ్లీ దుఃఖపడటం, ఆ దుఃఖాన్ని రెండింతలు, నాలుగింతలు పెంచుకోవడమే అవుతుంది. జీవనవ్యాపారంలో దుఃఖం అనివార్యం అన్న ఎరిక కలిగిననాడు, దుఃఖంలోని తీవ్రత తగ్గిపోతుంది'.

ఇన్నాళ్లూ తన గూడులో భద్రంగా ఉన్న తన ప్రియమైన కొడుకు రాసింది ఒకటికి రెండుసార్లు చదువుకున్నాడు తండ్రి.
ఉన్నట్టుగా కనబడని పోరులోకి, కనబడకుండా దాడిచేసే శత్రువుల్లోకి, మొత్తంగా ఈ ప్రపంచంలోకి కొడుకు ధైర్యంగా అడుగుపెట్టగలడన్న నమ్మకం కలిగి, అతడి కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

ప్రేమ కూడా దుఃఖం కలిగిస్తుందని ఆ ఇద్దరికీ తెలుసు.

* 'తండ్రి ఎవరైనా కావచ్చు, కానీ కొంతమంది మాత్రమే నాన్న కాగలుగుతారు' అని ఒక సామెత. ఇలాంటి 'నాన్న'లందరికీ 'ఫాదర్స్ డే' శుభాకాంక్షలు.Monday, May 16, 2011

చలాన్ని విన్నాను!

పురుషుడి నిర్జీవమైన బతుకులో రసం నింపడానికి స్త్రీ సృష్టించబడిందంటాడు చలం.
నిర్జీవమైన సాహిత్యంలో రసం వంపడానికి చలం పుట్టాడేమో!
అలాంటి చలాన్ని చూడగలిగే తరంలో పుట్టనివాణ్ని కాబట్టి, కనీసం ఆయన గొంతు వినడం ఒక భాగ్యమే కదా! అది ఈ మధ్యే తీరింది. వాడ్రేవు వీరలక్ష్మీదేవి వల్ల. "చలం సీడీ'ని ఆమె నాకు అభిమానంగా పంపడం వల్ల.
మూడు గంటల నిడివిగల ఇందులో వరుసగా-
౧ పురూరవ గంటన్నర రేడియో నాటకం
౨ చలం గురించి విశ్వనాథ, శ్రీశ్రీ, మో, రంగనాయకమ్మలాంటివాళ్లు వెలిబుచ్చిన అభిప్రాయాలు
౩ బాలాంత్రపు రజనీకాంతరావుకు చలం ఇచ్చిన రేడియో ఇంటర్వ్యూ
౪ చలం పాడిన పాటలు ఉన్నాయి.
చలం వీరాభిమాని గురుప్రసాద్ వీటిని సంకలించి, కొంత రికార్డింగు చేసి, "చలం ఫౌండేషన్' తరఫున రెండేళ్లక్రితం సీడీగా తెచ్చారు. ధర 100 రూపాయలు. ఫోన్: 9951033415.

చలం మాస్టర్ పీస్ పురూరవను వినడం బాగుంది. ఊర్వశిగా శారదా శ్రీనివాసన్ గొంతు ఒకలాంటి జీరతో మత్తుగా ఉంటుంది. గొప్ప వాయిస్. అయితే, పుస్తకంగా చదివినప్పుడు నాకు అజ్ఞాతంగా వినిపించిన ఊర్వశి గొంతంత గొప్పది మాత్రం కాదు. చదవడం కంటే ముందు వినివుంటే ఇలా ఉండేది కాదేమో! బహుశా, మనం ముందే ఒక ప్రమాణానికి లోబడినప్పుడు దాన్ని అంగీకరించేస్తాం. మన ఊహే మన ప్రమాణమైనప్పుడు దాన్ని అందుకోవడం ఎవరితరమూ కాదు.
ఇక, "చలం ఎంగిలిమాటలు ఎప్పుడూ వాడలే'దని ప్రశంసిస్తాడు విశ్వనాథ. వేమన, చలం ఇద్దరూ ఒకటేనని చెబుతాడు శ్రీశ్రీ. "వేమన ఇంట్యూటివ్గా చెబితే, చలం ఇంటెలెక్చు్యవల్గా చెప్పాడు'.

ఇంటర్వ్యూలోనూ, పాటల్లోనూ చలాన్ని వినగలుగుతాం. చివరిదశలో, ముద్దముద్దగా మాట వచ్చే వయసులో. అయినా అది చలం గొంతు! ఈ ప్రపంచంతో సమన్వయం చేసుకోవడానికి తనకు ఎప్పటికి కుదురుతుందోనని వాపోయే చలం, నాలోని చీకటినే కాగితం మీద పెట్టాను తప్ప, ఎవరినో, దేన్నో దండించడానికి కాదని ఒప్పుకునే చలం, సత్యం లోపల్నుంచి దొరకాలి తప్ప, బైటెక్కడో లేదనే అన్వేషి చలం, ఈ చలం అనేవాణ్ని మరిచిపోవడానికి ప్రయత్నిస్తున్నాననే ఆధ్యాత్మిక చలం, ఎందరో చలాల ఏక గొంతుకైన చలం...

పీఎస్:
ఒకప్పుడు నా ఊహలో ఉన్న ఊర్వశిని శారదా శ్రీనివాసన్ రీప్లేస్ చేశారు. "ఒరిజినల్ వాయిస్' మరిచిపోయాను. చలం గొంతు గురించి మాట్లాడాల్సిన సందర్భంలో కూడా నేను శారద గొంతు గురించి మాట్లాడుతున్నానంటే... ఖర్మ! కొన్నయినా చలం అక్షరాలేగా నాలోనూ ప్రవహిస్తోంది.

Wednesday, February 2, 2011

చలం పురూరవలోంచి నాలుగు మాటలు

నాకు సంబంధించినంతవరకూ చలం గొప్ప వర్క్ పురూరవ నాటకం.
బహుశా, ఆయన అచ్చంగా ఏం చెప్పాలనుకుంటున్నాడో, ఇందులో అర్థం అవుతుంది.
నిన్న ఉద్యోగంలో భాగంగా దాన్ని మరోసారి తిరగేస్తే, ఎక్కడ చూస్తే అక్కడే కొన్ని గొప్ప వాక్యాలు కొత్త వెలుగుతో కనిపించాయి.
అందులోంచి కొన్ని:

తాము ఎక్కడ సహాయపడలేరో, అక్కడ దిగులుపడి, తమ కర్తవ్యం తీర్చుకున్నామని సంతుష్టి పడతారు మానవులు.

వూరికే వాంఛిస్తారుగాని, తమ అర్హతల్ని తలుచుకోరు మనుషులు.

అసలు బాధలో అంత బాధ లేదు.

మరణం తరవాత ఎక్కడో మేలుకుంటే, ఇది కల అనుకోవా మరి! కల తరవాత మేలుకున్నప్పుడు నిద్రముందు జీవితాన్ని ఎక్కడ వొదిలావో, మేలుకుని ఆ కొనని అందుకోగలుగుతున్నావు గనక జీవితం నిజమయింది. నిద్రలో జరిగింది కల, అబద్ధం అయింది. ఎందుకూ? కల జరిగిన తరవాతి కొనను అందుకోలేవు గనక. మళ్ళీ యీ జీవితం కొన అందకండా ఎక్కడో మేలుకున్న రోజున యీ జీవితం కలకాదా?

నా విరహం పొందినకొద్దీ క్రమంగా, నేను ఇంకా గొప్ప శృంగారంతో, జ్ఞానంతో, నీ హృదయంలో వ్యాపిస్తాను.

ఏం చెయ్యను? ఆ ప్రశ్నే యీ ప్రపంచంలో దారుణం. ఇన్ని భయాలకి కారణం. ఏదీ చేసీ ఏది చెయ్యకా పోయిందేమీ లేదని గ్రహించరు(ఈ మనుషులు).

... ఈ చిట్టచివరి మాటతో నాకు అద్భుతమైన లింకు స్ఫురించింది. ఫుకుఓకా చెప్పేదంతా ఇదే. డు నథింగ్. ఏదో ఒకటి చెయ్యకుండా ఉండటం సాధ్యం కాదా? మామూలుగా ఉండొచ్చు కదా, అంటాడు. చలం కూడా మరోచోట, పిల్లలు ఊరికే ఏమీచేయకుండానే కాళ్లూపుకుంటూ ఆనందంగా గడిపేస్తారు. పెద్దాళ్లే వాళ్లకు ఇవి మాత్రమే అనందం ఇస్తాయన్న మూసలు తయారుచేసుకుని, అలా జరిగినప్పుడు మాత్రమే సంతోషిస్తారు, అంటాడు. పురూరవ గతంలో చదివినప్పుడు, బహుశా ఫుకుఓకా నాకు తెలియదు కాబట్టి, నేను ఇలా ఆలోచించలేదనుకుంటా.
కాని ఇప్పుడనిపిస్తోంది, చలం చెప్పినదానికి కొనసాగింపు ఫుకుఓకా చింతనలో ఉంటుంది.

Friday, January 28, 2011

2010లో నేను చూసిన సినిమాలు

పదేళ్ల క్రితం ఈ జాబితా చేయాల్సివస్తే కాస్త శ్రమించాల్సి ఉండేది. అప్పుడు ఏడాదికి కనీసం నూరు సినిమాలు చూసిన రోజులు.
నెమ్మదిగా ఈ సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. ఎనభై, అరవై, హాఫ్ సెంచరీ, పాసు మార్కులు, పాతిక... ఓ సంవత్సరం అయితే, ఆరో ఏడో అంతే. సినిమాల మీద ఇంటర్, డిగ్రీ చదివే రోజుల్లో ఉన్నంత ఇష్టం ఎందుకో తగ్గిపోయింది. చూద్దాంలే, అనిపిస్తోంది తప్ప, చూసితీరదాం, అనిపించట్లేదు. సినిమా అంటే కౌమారపు ఆటవిడుపు మాత్రమేనా!
సరే-
పుస్తకాల లిస్టు ప్రచురించాక, ఇది కూడా పెట్టేద్దాం, అనిపించింది.
అయితే, ఛానల్స్-లో(ముఖ్యంగా వరల్డ్ మూవీస్-లో) చూసిన సినిమాలు ఇందులో లేవు. థియేటర్కే ఇది పరిమితం.
సినిమాల జాబితా వాటిని చూసిన క్రమంలోనే...

1. త్రీ ఇడియట్స్
దర్శకుడిగా రాజ్ కుమార్ హిరాణీ తనదైన మార్గాన్ని దీంతో పటిష్టం చేసుకున్నాడు. అయితే, ఫైవ్ పాయింట్ సమ్ వన్ నవలను సినిమాకు అనుగుణంగా ఎంత మలుచుకున్నా, చేతన్ భగత్కు ఇవ్వాల్సిన క్రెడిట్ ఇవ్వాల్సిందే.
అయితే, జీవితంలో ఎదగడం అనేదాన్ని మళ్లీ పేటెంట్లు పొందడంకే పరిమితం చేయడం నచ్చలేదు.

2.నమో వెంకటేశ
దర్శకుడు శ్రీను వైట్ల. సహజంగానే కామెడీ. డోరు సన్నివేశం ఒకటి బాగా నవ్వొచ్చింది.

3.రణ్
మీడియా వాతావరణం మీద వర్మ ఇంకా కసరత్తు చేయాల్సింది. సుదీప్ ఆత్మహత్య చేసుకునే సన్నివేషం మాత్రం బాగా తీశాడు.

4.అవతార్
జేమ్స్ కామెరాన్ క్రియేట్ చేసిన వండర్. కాకపోతే, దీనికంటే నాకు టైటానికే నచ్చింది.

5.లీడర్
సినిమా నాకు నచ్చింది. శేఖర్ నిజాయితీగా తీశాడు. మిక్కీ సంగీతం మామూలుగా లేదు. గొప్ప కంపోజిషన్స్.

6.ఏ మాయ చేసావె
గౌతమ్ మీనన్ సినిమాల్లో ఉండే మిస్టిక్ బ్యూటీ ఇందులోనూ ఉంది. డైలాగులు బాగున్నాయి. సమంతా మైనస్ చిన్మయి ఎలా ఉంటుందో నేను ఊహించలేకపోతున్నా. రెహమాన్ మ్యూజిక్-తో నేను అంతగా ఇంప్రెస్ కాలేదు, పైవాడు ఎపుడో ముడివేశాడు... అన్న చోట తప్ప.

7.ఎల్.ఎస్.డి.(లవ్ సెక్స్ డిజైర్)
ఖోస్లా కా ఘోస్లా చూశాక, దివాకర్ బెనర్జీ అంటే అభిమానం ఏర్పడింది. హిందీలో నాకు ప్రస్తుతం మధుర్ భండార్కర్, దివాకర్ మస్ట్ వాచ్. ఈ సినిమా నిరాశపరచలేదుగానీ చూసి తీరాల్సినంతది కాదు. కానీ కొత్త ప్రయోగం. సీక్రెట్ కెమెరాతో షూట్ చేసినట్టుగా ఉంటుంది.

8.వేదం
ఒక దశ కొచ్చేసరికి, కొంపదీసి రాములు డబ్బులే రాజు ఎత్తుకొస్తాడా, అన్న ఆలోచన జొరబడగానే మెదడు మొద్దుబారినట్టయిపోయింది. ఏడుపొచ్చింది. అవును, నేనింకా సినిమాలు చూస్తూ ఏడుస్తున్నాను.
ఏదేమైనా క్రిష్ తనదైన ముద్రవేసుకున్నాడు.
ప్రత్యేకించి మా తాలూకా సిరిసిల్లాను నేపథ్యంగా తీసుకోవడంతో నాకు కొంచెం ఎక్కువే మనసు ఉప్పింగిన విషయాన్ని దాచుకోలేను. కాకపోతే, తెలంగాణలో, ప్రత్యేకించి కరీంనగర్లో వెలమల్లాగా, రెడ్డీలు అంత డామినంట్ ఫోర్సు కాదు.

9.విలన్
మణిరత్నం సినిమా కోసం ఎదురుచూసే వాళ్లలో నేనొకడిని. వీరాభిమానిని. సినిమా మాత్రం డిజప్పాయింట్ చేసింది.

10.కొమురం భీం
కొమురం భీం జీవితాన్ని తెరకెక్కించే మంచి ప్రయత్నం. కాకపోతే సినిమా కళ ఒడుపు తెలియకముందు తీసినట్టున్నాడు అల్లాణి శ్రీధర్. క్లోజప్స్ అవసరమైనచోట కూడా క్లోజప్ ఉండవు.

11.ఇన్సెప్షన్
క్రిస్టఫర్ నోలాన్ దర్శకుడు. అర్థం చేసుకోవడం కష్టమే అయింది. చూసింది, వచ్చాక నెట్-లో చదువుకుని, ఓహో, అది ఇది కదా, అనుకున్నాను. తీయడం బాగుందని ఒప్పుకుని తీరాలి.

12.ఉడాన్
సహరచయిత అనురాగ్ కాశ్యప్ పేరు చూసి వెళ్లాను సినిమాకి. విక్రమాదిత్య మోత్వానీ బాగా తీశాడు. సున్నితంగా ఉంటుంది. సమస్య ఏమిటంటే, తండ్రినుంచి స్వేచ్ఛ కోరుకోవడం, అనేది ఎవరూ ఓన్ చేసుకోలేని సబ్జెక్టు.

13.స్నేహగీతం
మధుర శ్రీధర్ నుంచి మంచి ప్రయత్నం. వాళ్లందరూ ఏదో సాధించేశారు అనికాకుండా, సినిమాను ఒక పాయింట్ దగ్గరికి తీసుకెళ్లి ముగించిన తీరు నచ్చింది.

14.పీప్లీ లైవ్
అనూష రిజ్వీ దర్శకురాలు. మీడియా మీద పవర్ఫుల్ సెటైర్. అమీర్ ఖాన్ మీద నా అభిమానపు గ్రాఫు మరింత పెంచిన సినిమా.

15.కొమరం పులి
అయ్యబాబోయ్!
వాలి లాంటి సినిమా తీయగలిగిన సూర్య ఈ సినిమా ఎలా తీశాడబ్బా!

16.రోబో
చూడ్డానికి బాగుంది. రెండు మూడు చోట్ల మాటలు గొప్పగా ఉన్నాయి. అయితే, ఎన్ని వసూళ్లు చేసినా, శంకర్ అంటే భారతీయుడు అనుకుంటాం, లేకపోతే ఒకే ఒక్కడు, అపరిచితుడు అనుకుంటాంగానీ రోబోను తలుచుకోం.

17.ఖలేజా
టైటిల్-కు ముందు మహేష్ అని తగిలించి మరీ రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకోవడం వల్ల త్రివిక్రమ్ నాకు కొంత పలుచబడ్డాడు.
ఈ సినిమావల్ల జరిగిన ఒకే ఒక మంచి, ఓం నమో శివరుద్రాయ లాంటి పాట రావడం. మణిశర్మ నాకు ఎప్పుడూ నచ్చడు. అరుదుగా ఇలాంటి పాటలు చేస్తాడు.

18.రక్త చరిత్ర
వర్మ సినిమా, పైగా సుపరిచిత ఫ్యాక్షనిస్టుల నేపథ్యం కాబట్టి సహజంగానే కుతూహలం కలిగింది. చూడొచ్చు.

19.లవ్ ఇన్ షాపింగ్ మాల్
దర్శకుడు వసంతబాలన్. బాగుంది. తమిళ దర్శకుల ఆలోచనే వేరుగా ఉంటుంది.

20.ఆరెంజ్
భాస్కర్ ఏదో చెప్పాలని ప్రయత్నించాడు. ఓకే. కాకపోతే, తొమ్మిది మందిని ప్రేమించి వదిలేసిన సీనియర్ ప్రేమికుడు, తనకంటూ ఒక ప్రత్యేక ఫిలాసఫీ ఉందని చెప్పుకునేవాడు, ఏదో ఇంటర్మీడియట్లో చేసినట్టుగా, బుజ్జి బుజ్జి మాటలు, ప్రేమికుడ్ని చీటీ తీసి సెలక్టు చేసుకునే తింగరి బుచ్చిని ప్రేమిస్తాడా?
నేను నువ్వంటూ... పాట బాగుంది.

21.రక్త చరిత్ర-2
మొదటిది చూశాం కాబట్టి, రెండోది చూసి తీరాల్సిందే కదా! వర్మ పాట బాగా పాడాడు. కోర్టు సీన్ హైలైట్.


... ఒకట్రెండు చూడాలనుకున్న సినిమాలు మిస్సయినా పోయినేడాదితో పోలిస్తే ఈసారి నేను ఎక్కువ చూసినట్టే.

Wednesday, January 26, 2011

2010లో నేను చదివిన పుస్తకాలు (మరోసారి)

ఇలా ప్రచురిస్తే చదవడానికి వీలుగా ఉంటుందని నిన్నటినుంచీ తిప్పలు పడుతున్నా. ఇప్పటికి సాధ్యమైంది. ఏమైనా ఈ టెక్నాలజీ ఉంది చూశారా...
జ్యోతిగారికి థాంక్స్. ఎవరైనా చదవడానికి చిరాకు పడివుంటే సారీ.

stories - 2010 -2010-books

Tuesday, January 25, 2011

2010లో నేను చదివిన పుస్తకాలు

మళ్లీ కంపోజ్ చేసే ఓపిక లేక, ఈ మార్గాన్ని అనుసరించాల్సి వచ్చింది.
కాబట్టి ఈ లింకు నొక్కే ఓపిక చేసుకోగలరు.
అక్షరాలను జూమ్ చేసుకోవడానికీ పేజీని మనకు అనువుగా తిప్పుకోవడానికీ పేజీ పైన ఉన్న గుర్తులను పాటించగలరు.
http://www.scribd.com/doc/47521540/2010-books

Tuesday, January 18, 2011

ఒక ఒగ్గు కళాకారుడి గురించి...కొమురయ్య గురించి రాయడంలో ముఖ్యోద్దేశం, ఆయన మౌఖికంగా చెప్పే గొల్లల చరిత్రను పుస్తకంగా తేవడంలో ఆ తరహా అభిరుచి ఉన్నవాళ్లు ఎవరైనా ఆయనకు సహకరిస్తారేమోనని.
ఆయన్ని మళ్లీ ఎప్పుడైనా కాంటాక్ట్ చేయడానికి, ఫోన్ ఏమన్నా ఉందా?, అని అడిగాను.
ఒక్కొక్క మాటనే ఒత్తి పలుకుతూ, "నైను ఐటు ఫోరు నైను వన్ను త్రీ ఫైవు త్రీ సిక్సు సెవను' అన్నాడు.
"చదువురాదన్నవ్, ఇవ్వెట్లొచ్చె?'
"గీయింతమందం మా మనువరాలి దగ్గర నేర్సుకున్న'

ప్రచురణ: సాక్షి ఫ్యామిలీ- రిపోర్టర్స్ డైరీ శీర్షిక

Monday, January 10, 2011

నన్ను వివేకానంద అంటారు!సాక్షి ఫ్యామిలీలోని నేను శీర్షిక కోసం రాసింది.