పదేళ్ల క్రితం ఈ జాబితా చేయాల్సివస్తే కాస్త శ్రమించాల్సి ఉండేది. అప్పుడు ఏడాదికి కనీసం నూరు సినిమాలు చూసిన రోజులు.
నెమ్మదిగా ఈ సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. ఎనభై, అరవై, హాఫ్ సెంచరీ, పాసు మార్కులు, పాతిక... ఓ సంవత్సరం అయితే, ఆరో ఏడో అంతే. సినిమాల మీద ఇంటర్, డిగ్రీ చదివే రోజుల్లో ఉన్నంత ఇష్టం ఎందుకో తగ్గిపోయింది. చూద్దాంలే, అనిపిస్తోంది తప్ప, చూసితీరదాం, అనిపించట్లేదు. సినిమా అంటే కౌమారపు ఆటవిడుపు మాత్రమేనా!
సరే-
పుస్తకాల లిస్టు ప్రచురించాక, ఇది కూడా పెట్టేద్దాం, అనిపించింది.
అయితే, ఛానల్స్-లో(ముఖ్యంగా వరల్డ్ మూవీస్-లో) చూసిన సినిమాలు ఇందులో లేవు. థియేటర్కే ఇది పరిమితం.
సినిమాల జాబితా వాటిని చూసిన క్రమంలోనే...
1. త్రీ ఇడియట్స్
దర్శకుడిగా రాజ్ కుమార్ హిరాణీ తనదైన మార్గాన్ని దీంతో పటిష్టం చేసుకున్నాడు. అయితే, ఫైవ్ పాయింట్ సమ్ వన్ నవలను సినిమాకు అనుగుణంగా ఎంత మలుచుకున్నా, చేతన్ భగత్కు ఇవ్వాల్సిన క్రెడిట్ ఇవ్వాల్సిందే.
అయితే, జీవితంలో ఎదగడం అనేదాన్ని మళ్లీ పేటెంట్లు పొందడంకే పరిమితం చేయడం నచ్చలేదు.
2.నమో వెంకటేశ
దర్శకుడు శ్రీను వైట్ల. సహజంగానే కామెడీ. డోరు సన్నివేశం ఒకటి బాగా నవ్వొచ్చింది.
3.రణ్
మీడియా వాతావరణం మీద వర్మ ఇంకా కసరత్తు చేయాల్సింది. సుదీప్ ఆత్మహత్య చేసుకునే సన్నివేషం మాత్రం బాగా తీశాడు.
4.అవతార్
జేమ్స్ కామెరాన్ క్రియేట్ చేసిన వండర్. కాకపోతే, దీనికంటే నాకు టైటానికే నచ్చింది.
5.లీడర్
సినిమా నాకు నచ్చింది. శేఖర్ నిజాయితీగా తీశాడు. మిక్కీ సంగీతం మామూలుగా లేదు. గొప్ప కంపోజిషన్స్.
6.ఏ మాయ చేసావె
గౌతమ్ మీనన్ సినిమాల్లో ఉండే మిస్టిక్ బ్యూటీ ఇందులోనూ ఉంది. డైలాగులు బాగున్నాయి. సమంతా మైనస్ చిన్మయి ఎలా ఉంటుందో నేను ఊహించలేకపోతున్నా. రెహమాన్ మ్యూజిక్-తో నేను అంతగా ఇంప్రెస్ కాలేదు, పైవాడు ఎపుడో ముడివేశాడు... అన్న చోట తప్ప.
7.ఎల్.ఎస్.డి.(లవ్ సెక్స్ డిజైర్)
ఖోస్లా కా ఘోస్లా చూశాక, దివాకర్ బెనర్జీ అంటే అభిమానం ఏర్పడింది. హిందీలో నాకు ప్రస్తుతం మధుర్ భండార్కర్, దివాకర్ మస్ట్ వాచ్. ఈ సినిమా నిరాశపరచలేదుగానీ చూసి తీరాల్సినంతది కాదు. కానీ కొత్త ప్రయోగం. సీక్రెట్ కెమెరాతో షూట్ చేసినట్టుగా ఉంటుంది.
8.వేదం
ఒక దశ కొచ్చేసరికి, కొంపదీసి రాములు డబ్బులే రాజు ఎత్తుకొస్తాడా, అన్న ఆలోచన జొరబడగానే మెదడు మొద్దుబారినట్టయిపోయింది. ఏడుపొచ్చింది. అవును, నేనింకా సినిమాలు చూస్తూ ఏడుస్తున్నాను.
ఏదేమైనా క్రిష్ తనదైన ముద్రవేసుకున్నాడు.
ప్రత్యేకించి మా తాలూకా సిరిసిల్లాను నేపథ్యంగా తీసుకోవడంతో నాకు కొంచెం ఎక్కువే మనసు ఉప్పింగిన విషయాన్ని దాచుకోలేను. కాకపోతే, తెలంగాణలో, ప్రత్యేకించి కరీంనగర్లో వెలమల్లాగా, రెడ్డీలు అంత డామినంట్ ఫోర్సు కాదు.
9.విలన్
మణిరత్నం సినిమా కోసం ఎదురుచూసే వాళ్లలో నేనొకడిని. వీరాభిమానిని. సినిమా మాత్రం డిజప్పాయింట్ చేసింది.
10.కొమురం భీం
కొమురం భీం జీవితాన్ని తెరకెక్కించే మంచి ప్రయత్నం. కాకపోతే సినిమా కళ ఒడుపు తెలియకముందు తీసినట్టున్నాడు అల్లాణి శ్రీధర్. క్లోజప్స్ అవసరమైనచోట కూడా క్లోజప్ ఉండవు.
11.ఇన్సెప్షన్
క్రిస్టఫర్ నోలాన్ దర్శకుడు. అర్థం చేసుకోవడం కష్టమే అయింది. చూసింది, వచ్చాక నెట్-లో చదువుకుని, ఓహో, అది ఇది కదా, అనుకున్నాను. తీయడం బాగుందని ఒప్పుకుని తీరాలి.
12.ఉడాన్
సహరచయిత అనురాగ్ కాశ్యప్ పేరు చూసి వెళ్లాను సినిమాకి. విక్రమాదిత్య మోత్వానీ బాగా తీశాడు. సున్నితంగా ఉంటుంది. సమస్య ఏమిటంటే, తండ్రినుంచి స్వేచ్ఛ కోరుకోవడం, అనేది ఎవరూ ఓన్ చేసుకోలేని సబ్జెక్టు.
13.స్నేహగీతం
మధుర శ్రీధర్ నుంచి మంచి ప్రయత్నం. వాళ్లందరూ ఏదో సాధించేశారు అనికాకుండా, సినిమాను ఒక పాయింట్ దగ్గరికి తీసుకెళ్లి ముగించిన తీరు నచ్చింది.
14.పీప్లీ లైవ్
అనూష రిజ్వీ దర్శకురాలు. మీడియా మీద పవర్ఫుల్ సెటైర్. అమీర్ ఖాన్ మీద నా అభిమానపు గ్రాఫు మరింత పెంచిన సినిమా.
15.కొమరం పులి
అయ్యబాబోయ్!
వాలి లాంటి సినిమా తీయగలిగిన సూర్య ఈ సినిమా ఎలా తీశాడబ్బా!
16.రోబో
చూడ్డానికి బాగుంది. రెండు మూడు చోట్ల మాటలు గొప్పగా ఉన్నాయి. అయితే, ఎన్ని వసూళ్లు చేసినా, శంకర్ అంటే భారతీయుడు అనుకుంటాం, లేకపోతే ఒకే ఒక్కడు, అపరిచితుడు అనుకుంటాంగానీ రోబోను తలుచుకోం.
17.ఖలేజా
టైటిల్-కు ముందు మహేష్ అని తగిలించి మరీ రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకోవడం వల్ల త్రివిక్రమ్ నాకు కొంత పలుచబడ్డాడు.
ఈ సినిమావల్ల జరిగిన ఒకే ఒక మంచి, ఓం నమో శివరుద్రాయ లాంటి పాట రావడం. మణిశర్మ నాకు ఎప్పుడూ నచ్చడు. అరుదుగా ఇలాంటి పాటలు చేస్తాడు.
18.రక్త చరిత్ర
వర్మ సినిమా, పైగా సుపరిచిత ఫ్యాక్షనిస్టుల నేపథ్యం కాబట్టి సహజంగానే కుతూహలం కలిగింది. చూడొచ్చు.
19.లవ్ ఇన్ షాపింగ్ మాల్
దర్శకుడు వసంతబాలన్. బాగుంది. తమిళ దర్శకుల ఆలోచనే వేరుగా ఉంటుంది.
20.ఆరెంజ్
భాస్కర్ ఏదో చెప్పాలని ప్రయత్నించాడు. ఓకే. కాకపోతే, తొమ్మిది మందిని ప్రేమించి వదిలేసిన సీనియర్ ప్రేమికుడు, తనకంటూ ఒక ప్రత్యేక ఫిలాసఫీ ఉందని చెప్పుకునేవాడు, ఏదో ఇంటర్మీడియట్లో చేసినట్టుగా, బుజ్జి బుజ్జి మాటలు, ప్రేమికుడ్ని చీటీ తీసి సెలక్టు చేసుకునే తింగరి బుచ్చిని ప్రేమిస్తాడా?
నేను నువ్వంటూ... పాట బాగుంది.
21.రక్త చరిత్ర-2
మొదటిది చూశాం కాబట్టి, రెండోది చూసి తీరాల్సిందే కదా! వర్మ పాట బాగా పాడాడు. కోర్టు సీన్ హైలైట్.
... ఒకట్రెండు చూడాలనుకున్న సినిమాలు మిస్సయినా పోయినేడాదితో పోలిస్తే ఈసారి నేను ఎక్కువ చూసినట్టే.
My Favourites are:
ReplyDelete1. Leader (Political movies lo most honest movie. Shankar: Bharatheeyudu, Shivaji, Aparichithudu la kante chala nayamani na abhiprayam).
2. Vedam ( Good movie. Commerical stars tho ilanti movie theeyadam bagundi)
3. 3 Idiots (Director's movie)
4. Yem Maya Cheseve (For it's simpilicty)
good show.
ReplyDelete