Monday, October 27, 2014

హైదరాబాద్ నాకేమిటి?

ఐదో క్లాసులో ఉన్నప్పుడు పెద్దమామ గృహప్రవేశానికి మేడ్చల్ వచ్చాం. బంగ్లా మీదికి ఎక్కితే విమానాలు తలమీదే ఎగురుకుంటూ పోతున్నాయి. హైదరాబాదీకి మేడ్చల్ మేడ్చలే  కానీ.. వేములవాడ దగ్గరి పల్లెటూర్లో పుట్టిన వాడికి మేడ్చల్ అంటే హైదరాబాదే ! ఆ బంగ్లా మీది నుంచి ఎత్తుగా ఒక నిర్మాణం కనబడింది. నాలుగు గుమ్మటాలు! ‘ఓహో అయితే ఇదే పుస్తకంలో చదువుకున్న చార్మినార్ కావొచ్చు,’ అనుకున్నా.
దాన్ని మా సుహాసిని వదిన సరిదిద్దింది. ‘‘ఇది మసీదు; చార్మినార్ అంటే సిటీలో ఉంటుంది,’’ అంది.
మేడ్చల్‌లో ఏనాడూ హైదరాబాద్‌ను హైదరాబాద్ అనగా వినలేదు. ‘సిటీ’యే! అదీ హైదరాబాద్ అనే ఉనికితో నా తొలి సంపర్కం.

తర్వాత కీసరగుట్ట రెసిడెన్షియల్ స్కూల్లో చదివాను. దానికోసం ఉప్పల్ బస్టాపులో 242 జీ ఎక్కాను. ఆలియా కాలేజీలో ఇంటర్ చేశాను. సిటీ అంతా నాకు థియేటర్లుగా పరిచయం! ‘మనోహర్ టాకీస్ లేదా?’ ‘ఆరాధన నుంచి ముందుకువోతే...’ ‘వెంకటాద్రి ఉంది సూడు’ ఇట్లా!

సికింద్రాబాద్ ఏనాడో హైదరాబాద్‌ను పెళ్లాడింది కాబట్టి రెంటినీ ఒకటిగానే కలిపేసి చెప్పేస్తున్నా.
హైదరాబాద్‌లోనే మొదటిసారి థియేటర్లో టికెట్‌కు నంబర్ ఉంటుందని తెలుసుకున్నా. ప్రశాంత్; రౌడీగారి పెళ్లాం; హెచ్ 14.
టీ చుక్క చొక్కా మీద ఒలికిపోతే ఆ రోజంతా వాసన వచ్చిన ఇరానీ చాయ్‌ని మొదటిసారి ఇక్కడే రుచిచూశాను. బ్లూ సీ; సికింద్రాబాద్.
తొలి సిగరెట్ ఇక్కడే కాల్చాను. సీనియర్ ఇంటర్; జూ పార్క్ దగ్గర; శివిగానితో. కానీ కాల్చడం అంటే అది కాదని తెలియడానికి నాకు మరో రెండేళ్లు పట్టింది.
మొదటి సాఫ్ట్ పోర్న్ సినిమా ఇక్కడే చూశాను. లాంబా; హిజ్ వైఫ్ అండ్ హర్ లవర్; నాకు తొలి ‘దర్శనం’ ఇచ్చింది హెలెన్ మిర్రెన్!
 గప్‌చుప్ పేరుతో ఒక గుండ్రటి ఐటెమ్ ఉంటుందని ఇక్కడే తెలుసుకున్నా (రేతిఫైల్ బస్‌స్టేషన్).
మొదటి దమ్‌కీ బిర్యానీ ఇక్కడే తిన్నా (బాంబే హోటల్; రాణీగంజ్).
అప్పుడే చేస్తున్న బ్రెడ్ వాసన ఇక్కడే పీల్చాను  (చార్మినార్).
అమ్మాయి సిగరెట్ తాగడం ఇక్కడే చూశాను (సంగీత్ థియేటర్).
పార్కులో అమ్మాయీ అబ్బాయీ యథేచ్ఛగా  ముద్దుపెట్టుకోవడం ఇక్కడే చూశాను (సంజీవయ్య పార్క్).
నా తొలి ‘ఉద్యోగం’ ఇక్కడే చేశాను. అంకుర్ బట్టల షాపులో హెల్పర్‌గా! చెప్పుకోవడానికి బాగుండే కష్టాలు నాక్కూడా కొన్ని ఉన్నయ్!
యండమూరిని మాత్రమే చదివిన నాకు చలం పుస్తకాలు ఇక్కడే పరిచయం (సుల్తాన్‌బజార్ విశాలాంధ్ర). పాతపుస్తకాలు అమ్మడం ఇక్కడే చూశాను (కోఠి).

 నా తొలి కథ ఇక్కడే రాశాను. డిగ్రీ అయిన తర్వాత రామ్‌నగర్‌లో అద్దెకున్నాను ఫ్రెండ్స్‌తో. ఓనర్ అర్జునరావు. ఆ మేడమీద రాశాను ‘ఆమె పాదాలు’. అంతకుముందు కొన్నిరాసినా కూడా నేను స్టాంపు కొట్టుకోవచ్చు అనుకున్నాను దీంతో.
మొదటిసారి సెల్‌ఫోన్ వాడింది ఇక్కడే. ఇంటర్నెట్ వినియోగించింది ఇక్కడే. భోజనం లేకుండా ఒకే రోజు మూడు సినిమాలు చూసింది ఇక్కడే. రన్నింగ్ బస్సుల నుంచి దూకి పడ్డది ఇక్కడే! కర్ఫ్యూ ఇక్కడే మొదటిసారి అనుభవించాను. పోలీసు దెబ్బ ఇక్కడే తిన్నాను. కాలు తొక్కి కూడా పశ్చాత్తాపం ప్రకటించని మనుషుల్ని ఇక్కడే చూశాను. కొనకపోతే కొట్టేంత పనిచేసే పొగరుబోతు అమ్మకందారుల్ని ఇక్కడే చూశాను.

ఇం..త.. సందులో ఇళ్లుండటం ఇక్కడే చూశాను. ముందట డ్రైనేజీ పారుతుంటే మనుషులు తినాల్సిరావడం ఇక్కడే చూశాను. షాపుల ముందు మనుషులు చాలీచాలని బట్టలతో నిద్రించడం ఇక్కడే చూశాను. ఇంకా, ఇప్పటి చాలామంది మిత్రుల్ని కలుసుకుంది ఇక్కడే! నా ఇద్దరు పిల్లలు ప్రాణం పోసుకుంది కూడా ఇక్కడే!
అందుకే ఈ నగరాన్ని ఎంతగా ప్రేమిస్తానో అంతగా ద్వేషిస్తాను; ఎంతగా ద్వేషిస్తానో అంతగా ప్రేమిస్తాను. ఎందుకంటే నా జీవితంలోని చాలా విలువైన భాగం, విడదీయలేని భాగం ఈ నేలతో ముడిపడి వుంది కాబట్టి!

(సాక్షి, సిటీ ప్లస్, అక్టోబర్ 26, 2014)

4 comments:

  1. Interesting anecdotal post!

    ReplyDelete
  2. నీకు 242 జీ, నాకు 17K...
    నీకు "బ్లూ సి", నాకు "ఆల్ఫా"
    మిగితా మొత్తం నా అనుభవమే ..నేను రాయని నా డైరి చదువుకునట్టు ఉంది. నాకు లాగే చాలామందికి అనిపించి ఉండొచ్చు..అంత సహజంగా, అంత దగ్గరగా..మనుసును హత్తుకోవడం..! చాల బాగుంది.!

    ReplyDelete
  3. చాల బాగుందిరా...!

    ReplyDelete
  4. BAGUNDI ANTE THAKKUVA CHESINATLAVUTHUNDEMO NANI COMMENT CHEYATLEDU

    ReplyDelete