Thursday, January 9, 2014

కిటికి ప్రయాణాల రియాలిటీ చెక్: జర్నలిజంలో ఒక వినూత్న ప్రయోగం

పూడూరి రాజిరెడ్డి ప్రస్తుత ప్రచురణ ఒక విలక్షణమైన రచన. రోజూ మనం చూస్తూ అంతగా పట్టించుకోనివారి గురించీ, రోజూ మనకు తారసపడీ అంతగా ఆలోచింపజేయని సంభావాల్ని గురించీ మనసుకు హత్తుకునేట్లుగా చెప్పిన 60 పదునైన కథనాల అపూర్వ సంపుటి ఇది. జీవన ప్రస్థానంలో కొన్ని జ్ఞాపకాల మజిలీలు, కొన్ని అసాధారణ దృశ్యాల చిత్రణ, కొన్ని సంభావాల వివరణ, కొన్ని ఘటనల విశదీకరణ, కొన్ని ఘట్టాల అనుభవం, కొందరు భిన్న పోకడల మనుషుల పరిచయం, కొన్ని వ్యవస్థల ప్రాతినిధ్య రూపాలు, కొందరు సామాన్యేతర వ్యక్తుల జీవన చిత్రణ, ఇన్నీ కలిసి ఒక అక్షర జ్యోతి, ఒక ఆర్తి జ్వాల- ఈ సంపుటి. 60 కథనాలు, 60 బాధా శకలాలు, 60 బతుకు గాథలు, 60 వచనంలో వచ్చిన కవితా వీచికలు.

'ఇరానీ హోటల్లో రెండున్నర గంటలు'తో మొదలై 'ఎవరి గెలుపు, ఎవరి ఓటమి'తో ముగుస్తుంది ఈ విశిష్ట రచనా సంపుటి. ఈ మధ్యలో చదువరి మెదడుకు మేతగా... ఎర్రగడ్డ హాస్పిటల్లో మానసిక రోగులూ, ఇందిరా పార్క్ లో ప్రేమికులూ, పంజాగుట్ట శ్మశానవాటికలో కాపరులూ, ఆత్మీయ సంభాషణలో హిజ్డాలూ, పోలీసు స్టేషన్లో ఈనాటి పోకడలూ, కోర్టుల్లో ప్రహసనాలూ, బస్సుల్లో కండక్టర్ల దిలాసాలూ, కొన్ని మొక్కలు, ఫస్ట్ డే ఫస్ట్ షో అనుభవాలూ, ఆర్టిస్టులూ... ఎంతో మంది, ఎన్నో దృశ్యాలు కళ్లముందు నిలిచి కలవరపెడుతాయి. అలజడి రేపుతాయి.
జర్నలిజం వేరు, జర్నలిజంలో సృజన వేరు. రాజిరెడ్డి రచనలో ఈ తేడాని గమనిస్తూ చదువుకుపోతాడు ఈ కథనాల్ని పాఠకుడు. తనదైన సొంతముద్రతో విశిష్టమైన వాక్యనిర్మాణ శైలితో రాజిరెడ్డి ఈ కథనాల్ని అనుభూతి ప్రదానం చేశారు. భావాన్ని కవితామయం చేసే వ్యక్తీకరణ శక్తి ఆలోచనా ప్రేరకంగా సాగింది.

ఉదాహరణకి- 'ఇచ్చేది చాయ్ కాదు/ అది జీవన రసం' అని ముగుస్తుంది... 'ఇరానీ హోటల్' కథ.
ఈ సమస్త ప్రపంచంలో ఒకానొక మనిషి మరణించడమంటే, ఒక అంకె తగ్గిపోవడం కాదు; ఆ ఒక్కడితో ముడిపడివున్న సమస్త ఆనందాల ప్రపంచం అంతం కావడం- అంటూ ముగుస్తుంది- 'ప్రతీక్ లేని ఇల్లు' అనే గుండెని కలచివేసే ఖండిక. ఇలాంటిదే 'శవాల గది' గురించిన కథనం కూడా. తెల్లబట్టలో చుట్టివచ్చే ఆ మాంసం ముద్ద కోసం వాళ్లు ఎదురుచూస్తూ నిల్చున్నారు. జీవితంలో ఏది నిజమో, ఏది అబద్ధమో ఒక పట్టాన తేల్చుకోలేంగానీ, జీవితపు సిసలైన వాస్తవికత మాత్రం మృత్యువు- వంటి వాక్యాలు ఆలోచనా ప్రేరకాలుగా వెంటాడుతూవుంటాయి. 'నీది మరణం- నాది జీవన్మరణం' కథనంలో... 'అసంపూర్ణ వాక్యంలా వెళ్లిపోయాడు శరత్' వంటి వాక్యాలు చదువరిని నిలవేస్తాయనటం అతిశయోక్తి కాదు. శతకోటి హృదయాల అవ్యక్త ఘోషకి ఆర్ద్రమైన అభివ్యక్తి రూపం ఈ 'రియాలిటీ చెక్'!

- విహారి
డిసెంబర్ 22, 2013 నాటి 'ఆంధ్రభూమి' 'మెరుపు' పేజీ.

No comments:

Post a Comment