Saturday, January 25, 2014

వాక్యాలకు నులివెచ్చదనం

(పలక -పెన్సిల్ పుస్తకం గురించి ఇంకో అభిప్రాయం)

సాధారణ విషయాల గురించి అబ్బురపడేలా రాయడం జర్నలిజంలోని ఒక సుగుణమని జి.కృష్ణగారు చెబితేనే అర్థమయింది. అది కూడా మామూలు తెలుగులో మనసుకు హత్తుకునేట్టు చెప్పడం ఒక కళ. పత్రికారచనని ఒక కళాత్మక స్థాయికి తీసుకెళ్లడం అప్పుడే సాధ్యమని ఆయన చెప్పలేదుగాని నాకు అర్థమయింది. అర్థం కావడం వేరు. అనుభవంలోకి రావడం వేరు. కళాత్మకస్థాయిని అందుకోవడానికి ప్రయత్నపూర్వకంగా చేసినా అప్రయత్నంగా చేసినట్టు అనిపించడమూ ఓ కళ. ఈ కళ ఏదో పూడూరి రాజిరెడ్డికి పట్టుబడింది. ఇదివరలో 'మధుపం' రచన ద్వారా తెలుగు వాక్యానికి కొత్త జిలుగులు అద్దిన రాజిరెడ్డి ఇప్పుడు 'పలక-పెన్సిల్' అంటూ మన ముందుకొచ్చాడు. ఈ రెండిటికీ కాలం చెల్లిందో, చెల్లుతున్నదో అనుకుంటున్న దశలో ఈ శీర్సిక ద్వారా జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లాడు.
ఎంతగా చెరిపి చెరిపి రాస్తే అంతగా అక్షరాలు వచ్చినట్టు, ఎంత అల్లరల్లరిగా రాస్తే అంత కవిత్వంలా మనసును తాకినట్టు రాజిరెడ్డి పదాలు, వాక్యాలు మన మదిని అల్లుకుపోతాయి. అందుకే ఒక తెలియని ఉన్మత్త పరవశంతో ప్రేమ గురించి రాసినా, కోనసీమ గురించి చెప్పినా మురిసిపోతాము, ముగ్ధులమవుతాము.
వాక్యాలకు ఒక ఉన్మత్త పరవశాన్ని కూర్చిన కళానైపుణ్యం తెలియకనే రాజిరెడ్డికి అబ్బింది. మా ఊరి ముచ్చట అంటూ చెప్పినా, మనుషుల మ్యూజియం గురించి మాట మాత్రంగా రాసినా ఏదో లాలన, ఆర్తి కనిపిస్తుంది. సూక్తుల్లా కాకుండా తన జిగిరి దోస్తుతో చెప్పినట్టుగా వాక్యాలకు ఒక తడిని, నులి వెచ్చదనాన్ని అద్దడం వల్ల ఆ విషయాలు మనసులో నిలిచిపోతాయి. ఏదో సందర్భంలో గుర్తుకు వస్తాయి. రాజిరెడ్డి చెప్పినట్టుగానే (ప్రపంచం?) వుందనిపిస్తుంది.
ఇలా చెప్పడం కాదుగానీ మంచి తెలుగు పుస్తకం చదివి చాన్నాళ్లయితే ఈ పుస్తకం చదవండి. మీకు తెలియకనే మీరు పుస్తకాల ప్రేమలో పడతారు. జీవితం మీద ప్రేమను పెంచుకుంటారు. మనుషుల్ని కాసింత దయతో పలకరించడం ఎలానో తెలుసుకుంటారు. అన్నిటికీ మించి నేనేమిటో అనుకుంటూ మీ గురించి మీరు తెలుసుకొని విస్తుపోతారు. ఈ విధంగా చిత్రవిచిత్రమైన అనుభూతులకు లోనుచేసే వాక్య విన్యాసం, విషయబలం ఉన్న 'పలక-పెన్సిల్' చదవకపోతే రచయితకు పోయేదేం లేదు, పాఠకులే చక్కటి పఠనానుభవం కోల్పోతారు. 'ఇది ఒక మగవాడి డైరీ' అని ట్యాగ్ లైన్ ఇచ్చారు. అంటే మగవాళ్ల కన్నా ఆడవాళ్లే ఎక్కువ చదవాలన్నది రచయిత ఉద్దేశం కావచ్చు. కాదన్నది అవుననడం ఆడవాళ్ల తీరు అయితే రచయిత లక్ష్యం నెరవేరుతుంది.


-పాలపిట్ట మాసపత్రిక, డిసెంబర్ 2013

No comments:

Post a Comment