మెడలో మల్లెపూల దండ వేసుకుని, వాటి పరిమళం పక్కవాళ్లకూ పంచుతూ, తెనాలి వీధుల్లో తిరిగిన చలం సాయంత్రాల్ని ఒకసారి ఊహలోకి తెచ్చుకుంటే...!
సాక్షాత్తూ ఆనందరూపుడిగా కనబడతారు చలం. ఆయనకన్నీ, అంతటా ఆనందమే! ఊయల్లో ఉత్తినే కాళ్లూపుకుంటూ గడిపే పసిపిల్లల్ని చూసినా, పంది వెంబడి పడి రాయితో బెదిరిస్తున్న తుంటరి బాలుడిని కాంచినా, పరికిణీ రెపరెపల్తో, మువ్వల సవ్వడుల్తో వయ్యారాలుపోయే కన్నెపిల్ల ఎదురైనా, ఇంకా ఉడతలూ గోరింకలూ భీమిలి సముద్రమూ నక్షత్రాల వెలుగూ... దేనికైనా బాధపడటానికి ఏముందని? ‘అసలు బాధలో అంత బాధ లేదు’.
ఏనాడూ రచనల్లో ‘ఎంగిలి మాటలు’ వాడని చలం, అనవసర పదం ఒక్కటి అదనంగా రాసినా నేరమేనన్న చలం, తానే సాహిత్యంగా బతికిన చలం– మైదానం, పురూరవ, జీవితాదర్శం, దైవమిచ్చిన భార్య, బ్రాహ్మణీకం, శశిరేఖ, అమీనా, అరుణ... కథలు, నవలలు, వ్యాసాలు, సంభాషణలు, ప్రేమలేఖలు, ఉత్తరాలు, కవితలు, మ్యూజింగ్స్... ఏ రూపంలోనైనా ఆనందం చుట్టూ తాను తిరుగుతూ, అక్షరాల చుట్టూ పాఠకుల్ని తిప్పాడు, దోసిళ్లకొద్దీ జీవనరసం తాగిస్తో. ఒక్కోసారి ‘గీతాంజలి’ని చలమే రాసి తమాషాకి టాగూర్ పేరు పెట్టాడేమోనని అనిపించదూ!
జీవితాన్ని ఏలుకునే తెలివిడిలేనివాళ్లకు మళ్లీ గుడిపాటి వెంకటాచలమే వచ్చి అన్నీ చెప్పాలని ఉడుక్కున్నాడు. ‘ఏం చెయ్యను? ఆ ప్రశ్నే యీ ప్రపంచంలో దారుణం. ఇన్ని భయాలకి కారణం. ఏదీ చేసీ ఏదీ చెయ్యకా పోయిందేమీ లేదని గ్రహించరు’ అని మనుషుల సౌందర్యలేమినీ, వేగపుయావనీ నిరసించాడు.
ఆయన్ని ఎవరు ఎలా ఆరాధించినా, ప్రత్యేకించి స్త్రీవాదీ, పురుషవాదీకాని స్వేచ్ఛావాది... చలం. ఆయన ఎంపిక స్వేచ్ఛను కోరుకున్నాడు. స్త్రీ పురుషులు సమానంగా, హిపోక్రసీ లేకుండా, ఒకరి చిరునవ్వుతో ఒకరు హృదయాన్ని వెలిగించుకుంటూ, ఒకరి ప్రపంచం మరొకరయ్యేంత గాఢంగా జీవించే కలగన్నాడు; ఒక్కోసారి అది తాత్కాలిక నీతిచట్రంతో భేదించేదే కావొచ్చుగాక!
ఇప్పటి ‘నైతిక ముద్ర’ అప్పటి ఆయన గాయాలకు లేపనం ఎటూకాలేదుగానీ... ఆయన పొందినట్టుగా కనబడిందంతా ఆయన పొందాలనుకున్న కల్పనేనేమో! స్త్రీ లాంటి ఒక బలమైన ఇచ్ఛేదో లేకుండా రోజువారీ బతుకులోని నిస్సారత ఆయనకు తెలుసు. అందుకే అంటాడు: ‘నా విరహం పొందినకొద్దీ క్రమంగా, నేను ఇంకా గొప్ప శృంగారంతో, జ్ఞానంతో, నీ హృదయంలో వ్యాపిస్తాను’.
ఆయన స్వేచ్ఛ జీవితానికీ, కళకూ కూడా సంబంధించినది: ‘ఇంకోళ్ళ ఆజ్ఞల ప్రకారం తన కళని వంకరతిప్పే అలవాటు, కళని ధనానికి దాస్యం చేయించే ఆ బానిసత్వం, క్రమంగా అతని ఆత్మలోకి పాకి, అతని జీనియస్‌ని, స్వేచ్ఛని, ధైర్యాన్ని చంపేస్తుంది’.
ప్రేమికుడినుంచి అన్వేషిగా, అన్వేషకుడినుంచి ఆధ్యాత్మికుడిగా రూపాంతరం చెందుతూ... అసలు తొలినుంచీ అన్నీ ఆయనలో కలగలిసే ఉన్నాయి, ఆయన వచనంలోనే కవిత్వం మిళితమైనట్టుగా! అందుకే, తనలో ఉన్న చీకటినే కాగితం మీద పెట్టానేతప్ప ఏ బోధలూ చేయడం కోసం కాదన్నాడు. చీకాకు పరిచే ఈ ప్రపంచంతో సమన్వయం చేసుకోవడానికి ఎప్పటికి కుదురుతుందోనని వాపోయాడు. సత్యం లోపల్నుంచే దొరకాలి తప్ప, బయటెక్కడో కాదన్నాడు. చలం అనేవాణ్ని మరిచిపోయేంతగా నిత్యనూతన జీవితాన్ని, పాత మకిలి లేని జీవితాన్ని అభిలషించాడు. తనలో ఉన్న ప్రశ్నలకు ఒక మేరకైనా సమాధానపడాల్సిన పక్వస్థితికి వచ్చాక ‘అరుణాచలం’లో స్థిమితపడ్డాడు.
‘మరణం తరవాత ఎక్కడో మేలుకుంటే, ఇది కల అనుకోవా మరి! కల తరవాత మేలుకున్నప్పుడు నిద్రముందు జీవితాన్ని ఎక్కడ వొదిలావో, మేలుకుని ఆ కొనని అందుకోగలుగుతున్నావు గనక జీవితం నిజమయింది. నిద్రలో జరిగింది కల, అబద్ధం అయింది. ఎందుకూ? కల జరిగిన తరవాతి కొనను అందుకోలేవు గనక. మళ్లీ యీ జీవితం కొన అందకండా ఎక్కడో మేలుకున్న రోజున యీ జీవితం కలకాదా?’
తనలోని చివరి ప్రశ్నలు, వాటికి దొరికీ దొరకని సమాధానాలతోనే కన్నుమూసిన చలం– ఎక్కడైనా నిజంగానే మేలుకున్నాడేమో! ఈ జీవితపు కొనని అక్కడ అందుకుని ఇదంతా కలని చెప్పేందుకు కాచుకుని కూర్చున్నాడేమో!
–––––––––––––––––––––
మే 19న రచయిత చలం జయంతి
(సత్వం శీర్షికన ఫన్డేలో 18-5-2014న ప్రచురితం.)
No comments:
Post a Comment