Thursday, February 5, 2015

నేనేం మాట్లాడుతున్నాను?

ఒక మనిషికి, తన స్నేహితులతో- అది ఒక్కరో, ఇద్దరో, నలుగురో- లేదా తనకు చెందిన రోజువారీ గుంపుతో మాట్లాడటంలో ఏ ఇబ్బందీ ఉండదు. కానీ అదే మనిషి, ఒక పదిమంది తననే గమనిస్తున్నారని తెలిసినప్పుడు మాట్లాడటానికి తడబడతాడు. ఎందుకంటే అది తనకు అసహజమైన స్థితి. అలాంటి స్థితిలో కూడా సహజంగా మాట్లాడగలిగేవాళ్లే ఉపన్యాసకులుగా రాణిస్తారు.
కానీ నేను మాత్రం అలా మాట్లాడలేను. మాట్లాడటానికి ఉపక్రమించగానే నా చేతులు వణుకుతాయి, లోపలి నరాలు ఊగుతాయి. దీన్నే చాలామంది స్టేజ్ ఫియర్ అంటారు. అందుకే ఎక్కడైనా నాకు ఆవేశం తన్నుకొచ్చినప్పుడు కూడా మాట్లాడటానికి జంకుతాను. అలా మాట్లాడాలనిపించీ, ఎందుకొచ్చిందిలే అని వదిలేసిందాన్ని ఇక్కడ రాయడం కోసమే ఇదంతా చెప్పడం!
మొన్న మే 31, జూన్ 1 (2014) తేదీల్లో కర్నూలు ‘కథాసమయం’ మిత్రులు ఒక సమావేశం ఏర్పాటుచేశారు. అందులో విడతలుగా చర్చకు పెట్టిన కొన్ని అంశాలు ఉన్నాయిగానీ దానికంటే ముఖ్యమైంది ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు జరిగిన చివరి సమావేశం కావడం దాని ప్రత్యేకత! దానికి అన్ని ప్రాంతాలవాళ్లూ వచ్చారు. కొందరు కొత్తగా పరిచయమయ్యారు; మరికొందరు పేర్లుగా మాత్రమే తెలిసినవాళ్లు ముఖాలుగా పరిచయమయ్యారు. ఈ పర్యటనలో నావరకూ ముఖ్యాంశం: కర్నూలు నగరాన్ని మొదటిసారి చూడటం! కొండారెడ్డి బురుజును ఎక్కకుండా తిరిగిరాకూడదనుకున్నాను, ఎక్కాను. టీజీ వెంకటేశ్ కోటలాంటి ఇంటిగోడలు చూడకుండా సంపద స్వరూపం అర్థం కాదన్నారు, కాబట్టి వెళ్లాను. మద్రాసు నుంచి విడిపోయాక ఏర్పడిన ఆంధ్రరాష్ట్రానికి రాజధాని కర్నూలు కాబట్టి, అప్పుడు తాత్కాలికంగా గుడారాలు వేసి పనులు నడిపించిన స్థలాన్ని చూసుకుంటూ వెళ్లాను. పూర్వస్థితిలోలాగా కర్నూలును రాజధాని చేయమని పట్టుబట్టడానికి కావాల్సినంత చారిత్రక హేతువుండగా, సీమవాళ్లు ఎవరూ దాని ఊసు ఎందుకు ఎత్తడంలేదన్న ప్రశ్న సమావేశాల్లోనే వచ్చింది. ‘కానీ ప్రశ్నించగలిగేవాళ్లేరి?’ అన్న నిరాశే జవాబుగా ఎదురైంది. చివరగా, సాయంత్రం పూట- నక్షత్రాకార సాయిబాబాలయం పక్కన పారుతున్న తుంగభద్ర నీటిపాయలో కరిగిపోయిన సూర్యుడినీ చూశాను. థాంక్స్ టు విజయసారథి! బహుశా, ఇకముందునుంచీ కర్నూలు అంటే నాకు గుర్తుండబోయే ఇమేజ్ ఇదే!
*
నిజానికి భావనలు చాలా బలహీనమైనవి. అయినాకూడా ఒక నిర్దేశిత సమయంలో అవి చాలా ప్రభావం చూపిస్తాయి కాబట్టి, మళ్లీ బలమైనవి కూడా! రెండు వేడి వేడి దోసెలు తిని, ఉడుకుడుకు చాయ్ తాగాక- మా పొద్దుటి సమావేశంలో ఒక విడత మొదలైంది. ‘రాయలసీమ కథ అస్తిత్వం: వైవిధ్యాలు, వైరుధ్యాలు’ మీద వెంకటకృష్ణ మాట్లాడారు. అక్కడి కథ అందుకోవలసిందీ చెప్పారు; సీమ కథ అనగానే కరువు తప్ప మరొకటి గుర్తుకురానివ్వకుండా చేసిన ‘తామందరినీ’ నిందించుకున్నారు. అలాగే సాఫల్యతను ప్రస్తుతించారు. చాలా ఉటంకింపులతో ఆవేశంగా సాగిన ఆ మాటలు ఎక్కడ ఆగాయంటే… సీమరచయితలకు తగిన గుర్తింపు లేదని!
వెంకటకృష్ణ మాటలకు స్పందనగా నేను కొన్ని పాయింట్స్ ఏవో చెబుదామనుకున్నాను. ‘ఎందుకొచ్చిందిలే’ అని వదిలేశాను. సభాభయం ఒకటి ఉందిగా! పైగా నేనేమీ అకడెమిక్ కోణంలో చెప్పలేను. దీనికి అంత ప్రాధాన్యత ఉండదులే, అని కూడా నేను ఆగిపోవడానికి మరో కారణం. అయితే, తర్వాతి విడత చర్చలో, (ఈసారి కోడికూర, గోంగూర భోజనం తర్వాత- మనుషులు మాంసాహారులుగా, శాకాహారులుగా వేరుపడటం ఏంటబ్బా అనుకున్నాం… నేనూ, నా పక్కనే కూర్చున్న దగ్గుమాటి పద్మాకరూ!) సుభాషిణి మాటల్లో కూడా ఇలాంటి భావనే వ్యక్తమైంది. తమ సీమకథకూ, సీమభాషకూ మన్నన లేదని!
 వాళ్లు లేవనెత్తినట్టుగా ఈ రాయలసీమ కథకుల్ని ఎవరు గుర్తించాలి? బహుశా, తెలంగాణవాళ్లు సీమవాళ్లను కలుపుకొనే పోతారనుకుంటాను. మరి వీళ్లను గుర్తించ నిరాకరిస్తున్నది ఎవరు?
అలాగే, తెలంగాణవాళ్లు కూడా ఇన్నేళ్లుగా మాట్లాడుతున్నది తమను ప్రధాన స్రవంతి సాహిత్యంలో చేర్చుకోరనే. రాయలసీమ వాళ్లు చెబుతున్న భాష సమస్యే తెలంగాణకూ ఉంది. రెండు ప్రాంతాలూ ఒకే బాధను ఎదుర్కొంటున్నాయి. మరి వీళ్లను గుర్తించాల్సింది ఎవరు? అది ఒక ప్రత్యేక సమూహమా?
(ఉత్తరాంధ్ర తరఫున ఎవరూ ఆ సమావేశంలో మాట్లాడలేదుగానీ వాళ్లకూ ఈ బాధే ఉందేమో! )
ఇక విషయాన్ని నేననుకున్నట్టుగా కోస్తావారివైపే డ్రైవ్ చేస్తున్నాను. ఇండ్లదిండ్ల ప్రకాశం, నెల్లూరు జిల్లాలవారికి కొన్ని మినహాయింపులున్నాయి. సీమతో వారికున్న సరిహద్దులవల్ల కావొచ్చు.
వీటిని తీసేస్తే మిగిలినవి ఉభయ గోదావరులు, గుంటూరు, కృష్ణా. అంటే, ఈ నాలుగు జిల్లాల గుర్తింపే అందరికీ కావాలా? సమావేశానంతరం, నలుగురం- అజయ్‌ప్రసాద్, జీఎస్ రామ్మోహన్…- సేదతీరుతున్నప్పుడు, గోదావరి వాడైన ఒమ్మి రమేశ్‌బాబుతో ఇదే విషయం నవ్వుతూ అన్నాను: ‘మాకందరికీ దండలు వేయాల్సిన చాలా పెద్ద బాధ్యత మీమీద ఉంది’.
మొదటే చెప్పాల్సిన డిస్‌క్లెయిమర్ ఇప్పుడు చెబుతున్నాను. నాది చాలా పరిమితమైన భాష, ప్రాంత జ్ఞానం. పైగా ఇదేమీ థియరీ కాదు. నా మానసిక అలజడిని తగ్గించుకోవడానికి నేను పూసుకుంటున్న లేపనం మాత్రమే.
ఒకరు మనల్ని గుర్తించాలి, అనుకోవడంలోనే ఒక న్యూనత ఏదో ఉంది. ఇది భాషతో ముడిపడిన వ్యవహారంగా బయటికి కనబడుతోందంతే! ఎవరితో గుర్తింపబడాలనుకుంటామో వాళ్లు ఆర్థికంగానో, సాంస్కృతికంగానో బలవంతులై ఉంటారు. భాష అనేది ఆధిపత్యానికి ఒక రూపం మాత్రమే! అయితే, ఇదంతా చెప్పుకున్నంత కాంక్రీటుగా ఉండే విషయమేనా!
సమావేశాల్లోనే ఒక రాత్రి- విశాలమైన గార్డెన్‌లో అందరమూ గుండ్రంగా కూర్చునివున్నాం… ఇనాయతుల్లా మంచి నటుడు! ఏకపాత్రాభినయాలతో నవ్వించారు. దుర్యోధనుడికైతే చప్పట్లే చప్పట్లు!! ఆయన అనుకరించిన పల్లీయుల గొంతుల్లో ‘వచ్చాండా’, ‘పోతాండా’ లాంటి ఎన్నో మాటలు దొర్లిపోయాయి. అలాగే, కర్నూలు జిల్లాలోనివే అయిన నంద్యాల, ఆదోని యాసలు ఎలా వేరుగా ఉంటాయో మాట్లాడి వినిపించారు. అయితే, ‘రాయలసీమ యాస’ అని దేన్నయితే అనుకుంటామో, అక్కడి రచయితలెవరూ మాట్లాడలేదు. అందరూ ప్రామాణికభాష అని నిందిస్తున్నదాన్నే మాట్లాడారు. అంటే ఏ యాస అయితే ఇనాయతుల్లా నోట్లోంచి రావడం వల్ల నవ్వు పుట్టిందో, ఆ దశను వీళ్లందరూ దాటేశారు. అందులో అసహజం ఏమీ లేదనే అనుకుంటాను.
*
నేను ఆరో తరగతి చదవడానికి మా ఊరినుంచి మేడ్చల్‌కు వచ్చాను. బడి ప్రారంభం కావడానికి ముందే, మామయ్య వాళ్లు వేసవి సెలవుల్లో మా ఊరికి వచ్చినప్పుడు నన్ను తోలుకొచ్చారు. మళ్లీ నేను మా ఊరెళ్లింది దసరా సెలవులకే. ఆ ఆరేడు నెలల కొత్త వాతావరణం నన్నెలా మార్చిందంటే, ‘రాజిరెడ్డి బాగ శానికచ్చిండు; మన మాటే మాట్లాడుతలేడు,’ అన్నారు మా వదినలు. ‘అత్తన్నా’కు బదులుగా ‘వస్తున్నా’ అని బదులిచ్చివుంటాను. అదే వాళ్లు ప్రేమగా నిందించిన నా శానితనం!
ఇప్పుడు తెలంగాణ రచయితలు కూడా నిజజీవిత వ్యవహారంలో ‘అచ్చిన’ అనరు; ‘వచ్చిన’ అనే అంటారు. ఇందులో ఏది మరింత తెలంగాణ? పాతకాలపువాళ్లు, ఇప్పటి యువకులు; చదువుకున్నవాళ్లు, చదువుకోనివాళ్లు; ఆ కులంవాళ్లు, ఈ కులంవాళ్లు; ఆ జిల్లావాళ్లు, ఈ జిల్లావాళ్లు; హైదరాబాద్‌తో సంపర్కం ఉన్నవాళ్లు, లేనివాళ్లు; ఇలా తెలంగాణ భాష ఎన్నో రకాలుగా విభజించబడివుంది. అన్నింటినీ కలిపే అంతస్సూత్రం ఒకటి ఉంటూనే, మళ్లీ వేరుగా ఉండటం! ఇదే భాషలోని వైవిధ్యం.
నా వరకు నేను కనీసం నాలుగైదు రకాలుగా మాట్లాడుతాను. అంటే మా ఊరికి వెళ్లినప్పుడు మా తాత, పెద్దనాన్న వరస వారితో ఒకలాగా మాట్లాడతా. కొంచెం చదువుకున్న వాళ్లతో ఒకలాగా, నాకు పరిచయమున్న తోటి తెలంగాణ ఉద్యోగులతో ఒకలాగా, ఇతర మిత్రులతో ఒకలాగా. కార్టూనిస్టు శంకర్‌తో ‘ఏమన్నా ఏడున్నవే,’ అంటాను. జూకంటి జగన్నాథంతోనూ, దేశపతి శ్రీనివాస్‌తోనూ మొదటిసారి మాట్లాడినప్పుడు కూడా నేను సార్ అనలేదు; ‘నమస్తేనే’ అని పలకరించాను. అదే, వాళ్లిద్దరికంటే ఎంతో ఎక్కువ పరిచయమున్న సురేంద్రరాజును ఇన్నేళ్లయినా ‘ఏమే, ఏందే’ అనలేదు. ఏ కొంత చనువు తీసుకోదలిచినా నేను ఏత్వం ఉపయోగిస్తాను. ఏత్వం ఉపయోగించడం, నా దృష్టిలో దగ్గరితనమూ, అదేసమయంలో కొంతమేరకైనా తెలంగాణీయత!
అయితే, తుమ్మేటి రఘోత్తమ్ సార్‌ను ఏకవచనంలో సంబోధించలేను. ఆయన కూడా ‘రాజిరెడ్డి గారు’ అనే పిలుస్తారు, రాజిరెడ్డి అంటే సరిపోతుందని చెప్పినా! అలాగే, తెలంగాణలో జన్మించని అన్వర్‌ను వయసుతో నిమిత్తం లేకుండా ‘ఏం సార్, ఎక్కడున్నారు?’ అని పలకరిస్తాను. వయసులో పెద్దవాళ్లయినప్పటికీ తెలంగాణలో పుట్టని మాధవ్ శింగరాజుతోగానీ, నరేష్ నున్నాతోగానీ, అనంతుతోగానీ వాళ్లు నాకు పరిచయమైన తొలిరోజునుంచీ ఏకవచనంలోనే మాట్లాడుతున్నాను. వాళ్లతో ఈ చనువు తీసుకోవడానికి కారణమైందేమిటో నాకు అంతుపట్టదు. అదే చినవీరభద్రుడితోనో, వి.చంద్రశేఖరరావుతోనో మాట్లాడినప్పుడు, నా గొంతు మరింత మర్యాదను అరువు తెచ్చుకుంటుందనుకుంటాను!
అవతలివారిని బట్టి, నా నాలుక ‘వచ్చిండ్రా’ అనేది ‘వచ్చారా’ అనేస్తుంది. ఈమాత్రమేనా యాసల గొడవ అనిపిస్తుంది. గొడవ స్థానంలో లొల్లి రాయలేకపోవడం కూడా ఒక గొడవ! అంతోటి కాళోజీ కూడా ‘నా గొడ’వే అన్నాడుగానీ ‘నా లొల్లి’ అనలేదు.
నా భార్య మొన్నోసారి మావాణ్ని ‘పోయిన’ బదులుగా ‘వెళ్లాను’ అనిపిస్తోంది. ‘ఏందే?’ అంటే, పార్కులో ఒకామెకు అలా అంటే అర్థం కాలేదట! ఆమెకు అర్థంకాకపోతే రెండ్రోజుల్లో అలవాటవుతుందిలేగానీ అంత నాలుకను మలుచుకోవాల్సిన పనిలేదని చెప్పాను. మరి ఈ తెలంగాణ-ఆంధ్ర స్పృహ లేనప్పుడు, నాకున్న ఆంధ్ర రూమ్మేట్స్ సాయితోగానీ, సుధాకర్‌తోగానీ నేనెలా మాట్లాడానో, అసలు వాళ్లు నాతో ఎలా సంభాషించారో నాకు గుర్తులేదు. ఈ స్పృహ జొరబడ్డాక, నా నాలుకను ఎక్కడ స్థిరం చేసుకోవాలో తెలియక కొంత తికమకపడ్డాను. అందుకే ఒక్కోసారి నా నాలుక మాటల్ని కాక్‌టెయిల్ చేస్తుంది. డబుల్ యాక్షన్ చేస్తుంది.
నిజానికి ఒక మనిషికి నాలుగు నాలుకలు ఉండటం… తన భాష తాను మాట్లాడలేకపోవడం కూడా న్యూనతే! కానీ ఏది నా ఒరిజినల్ భాష? అది ఎక్కడుంది? ఇప్పుడు నేను రాస్తున్నది కూడా ఏ భాష? మాట్లాడినట్టుగా రాయాల్సివచ్చిన ‘పాత్రోచిత సందర్భం’ అయితే తప్ప… లేదంటే ఈ ఆర్టికల్‌లో మీరు చదువుతున్నట్టుగానే రాస్తున్నాను. ఆ పాత్రోచితం అనుకునేదాన్ని కూడా నేను తెలంగాణ యాస అనడానికి సాహసించను. అది మా నర్సింగాపురం యాస మాత్రమే!
*
మావాణ్ని స్కూల్లో వేస్తున్నప్పుడు, పర్మనెంట్ అడ్రస్ రాయాల్సివచ్చింది. డిస్ట్రిక్ట్: కరీంనగర్ అని రాసింతర్వాత, స్టేట్: ‘ఎ’ అని రాయబోయి, ‘టి’తో ప్రారంభించాను. కొత్త సంవత్సరపు తొలివారంలో అలవాటుగా పాత ఏడాదే వేస్తుంటాంకదా, అలాగ!
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి, ‘అండి’, ‘గారు’ పోవాలని నేను కోరుకోవడం లేదు. అది రిఫైన్డ్ లాంగ్వేజ్. నా వయసువాళ్లు ఎవరైనా మా బాపును ‘రాంరెడ్డీ’ అని పిలిస్తే నా ప్రాణం చివుక్కుమంటుంది. ఏకవచనాన్ని ఏకవచనంలా కాకుండా పలికించడం చాలామందికి తెలియదు. ‘ఓ పెద్దబాపు ఎటువోయినవే?’, ‘ఓ బావా కనవడుతలేవేంది?’, ‘మామా ఎట్లున్నవే’… అన్నీ ఏకవచనమే. కానీ పిలుపులో ఆత్మీయత ఉంది. అయితే, మనకు వరుస తెలియనివారితో కూడా వ్యవహారం చేసే జీవనశైలిలోకి ప్రవేశించాం కాబట్టి, మర్యాదను ప్రకటించడానికి నిర్దిష్టమైన రూపం కావాలి. ఆహారమూ, వ్యవహారమే కదా మన నాగరికతను తెలియజేసేవి!
ఆహారం గురించి కూడా రెండు మాటలు చెప్పాలి. మా ఇంట్లో(ఊళ్లో) పప్పుచారు తప్ప నాకు సాంబారు తెలీదు. హైదరాబాద్ వచ్చేదాకా నేను ఇడ్లీ, దోశ చూడలేదు. ఇప్పటికైనా ఈ రెండూ నా పిల్లలమ్మ చేస్తుందేగానీ మా అమ్మ చేయదు. అమ్మ చేసేవల్లా సర్వపిండి, ఉప్పుడువిండి, వరిరొట్టె, అట్లు. ఇవన్నీ నాకిష్టమే. అయినంతమాత్రాన ఇడ్లీ తినడానికి నాకు ఎందుకు అభ్యంతరం ఉండాలి?
నేను చిన్నప్పుడు అంగూర్లు తినేవాణ్ని. మా అత్తమ్మ మమ్మల్ని చూడ్డానికి వచ్చినప్పుడు కేలాపళ్లు తెచ్చేది. ఇక నాకు డబల్‌రొట్టె అయితే దానికోసం జ్వరాన్ని కోరుకునేంత ఇష్టం. ఇప్పుడా పదాలు వాడే మా అత్తమ్మల తరం పోతోంది. అందుకే, నేను నా పిల్లలకు అంగూర్లకు బదులుగా ద్రాక్షల్ని తినిపిద్దామనుకునేలోపే, వాళ్లు గ్రేప్స్ కోసం మారాం చేస్తున్నారు. హిందూ పేపర్ మాస్టర్‌హెడ్ మీది బొమ్మను చూసి బడికి వేయని చిన్నోడు ఏనుగనీ, స్కూలుకు వెళ్తున్న పెద్దోడు ఎలిఫెంటనీ కొట్లాడుతున్నారు. తెలుగు భాషే మునిగిపోతున్న స్థితిలోవుంటే, ఏ నిర్దిష్ట రూపమూ లేని తెలంగాణ భాష ఇంకెలా మనగలుగుతుంది?
నాకు కొంతకాలం ‘ఆనిగెపుకా’యే అనాలన్న పట్టింపుండేది. సొరకాయ అనకుండా ఉండటానికి ప్రయత్నించేవాణ్ని. కానీ ఇప్పుడది చాలా మామూలుగా నోట్లోకి వచ్చేస్తోంది. ఇది రుద్దడమే అనుకుందాం. అసలు ప్రతిదీ రుద్దడమే. మన భాష, మన మతం, మన ఆహారపుటలవాట్లు, ప్రాంతపు స్పృహ, సంప్రదాయాలు, దేశభక్తి, అంతెందుకు, చివరికి మన పేరు కూడా! అలవాటయ్యేకొద్దీ ఏదైనా మనదవుతుంది. కనీసం ఒక తరంలో రుద్దింది, తర్వాత తరానికి ‘వాళ్ల’దయిపోతుంది.
ఉర్దూ రాజ్యమేలితే చచ్చినట్టు ఉర్దూ నేర్చుకుంటాం. ఇంగ్లీషు ఏలుతోంది కాబట్టి దాన్ని నేర్చుకుంటున్నాం. ఒక కృష్ణా జిల్లా అమ్మాయి, రాయలసీమకు చెందిన మా భారతి మేడమ్ మాటల్ని అనుకరించడం నేను విన్నాను. అందుకే కోస్తాధిపత్యాన్ని అబద్ధం అనాలనే ఉంది నాకు. ఎందుకంటే కోస్తావారిలో కూడా అందరి భాషా ఒకటే అయే అవకాశమే లేదుకదా! అది కూడా పేదలుగా, ధనికులుగా, పల్లీయులుగా, నగరవాసులుగా, కులాలుగా, జిల్లాలుగా విభజించబడే ఉంటుంది కదా! అసలు ప్రమాణం అనుకునేదే ఒక ప్రమాణంలోకి ఒదిగేది కాదు. దీన్ని ఇలాగే అంగీకరిస్తే, ఇక ఈ ఐటెమ్ చెప్పవలసిందేదో చెప్పకుండానే ముగిసిపోతుంది.
 మరి వెంకటకృష్ణ పెయిన్ అబద్ధమా? తెలంగాణ మిత్రుల వాదన నిజం కాదా? అంతెందుకు, నాకు నేను నాలుగు నాలుకలుగా చీలిపోయిందంతా ఊరికే జరిగిపోయిందా?
నేననుకోవడం- ఇదంతా కూడా ఒక ప్రాక్టికల్ వాల్యూతో ముడిపడివుంటుంది. ఆ విలువే మన జీవితాన్నీ, ప్రపంచాన్నీ నడుపుతుంది. మాకు ఆతిథ్యమిచ్చిన ‘ఇండస్ పబ్లిక్ స్కూల్’ ముందుభాగంలో ‘జీపీఏ 10/10′ సాధించిన పదో తరగతి విద్యార్థిని ముకుంద ప్రియ పేరు, ఫొటోతో కూడిన ఫ్లెక్సీ వేలాడదీసివుంది. బహుముఖీనంగా ఉండే ప్రాక్టికల్ వాల్యూకు ఇదొక రూపం. ఏ తల్లో ఆ పాపలాగే తన కూతురినీ చదివించాలనుకుంటుంది. ‘సమాజం’ ఏయే కారణాలవల్ల ఏయే విలువల్ని పోషిస్తుందో, అవే కారణాలవల్ల మిగిలినవాళ్లందరూ వాటిని అందుకోవడానికి ప్రయత్నిస్తారు. అలా తెలుగువారందరికీ బహుశా ఆ ప్రాక్టికల్ వాల్యూ కోస్తా దగ్గర ఉందేమో! ఇదే ప్రపంచం మొత్తానికైతే ఆ వాల్యూ అమెరికా దగ్గర ఉండొచ్చు. అందుకే ప్రపంచదేశాలు అమెరికాను అనుసరించినట్టుగానే, మిగిలిన తెలుగు ప్రాంతాలు కోస్తాను అనుకరించక తప్పదేమో! ఇందులో మంచీ లేదూ చెడూ లేదు. అనివార్యం! రేపెప్పుడైనా ఇదంతా మారిపోయి, ఇంకో విలువ పైకితేలితే లోకం దాన్నే అనుసరిస్తుంది. ఆ విలువ ఎలా, ఎందుకు, ఎవరివల్ల పైకి లేస్తుందన్నది నమోదుకాబోయే చరిత్ర!
(జూన్ 2014లో రాసిన ఆర్టికల్)
(ప్రచురణ: సారంగ సాహిత్య వారపత్రిక, నవంబర్ 19, 2014)

No comments:

Post a Comment