Friday, September 16, 2016

నగరాన్వేషణలో గ్రామీణ మూలాల 'రియాలిటీ చెక్‌

నగరాల మీద రచనలు తెలుగులో ఎక్కువ వచ్చినట్లు లేవు. కానీ ఇంగ్లీష్‌లో విస్తృతంగా కన్పిస్తాయి. అసలు ఒక నగరం మీద రచన అంటే కేవలం ఆ నగరపు చరిత్ర మాత్రమే కాదు కదా. నగరాల సమకాలీన చరిత్ర మీద ఏమన్నా రచనలు వచ్చాయా అన్నదీ అనుమానమే. హైదరాబాద్‌ నగరపు చరిత్ర మీద పుస్తకాల్ని చూడొచ్చు. కానీ నగరంలో ఉండే విభిన్న సమూహాల గురించిన రచనలు వచ్చాయా అంటే ఆలోచించాల్సిందే. ఆ అవగాహనతో ఆలోచించినప్పుడు పూడూరి రాజిరెడ్డి 'రియాలిటీ చెక్‌' పుస్తకం ఆ ఖాళీని కొంతవరకు భర్తీచేస్తుంది. ఒక సంవత్సరం పాటు ఒక కాలంగా వచ్చిన 'రియాలిటీ చెక్‌' యిప్పుడు పుస్తక రూపం దాల్చింది. నగరానికి ఉన్న అనేక కిటికీల నుంచి కొన్ని ఎంపిక చేసుకున్న కిటికీల ద్వారా రాజిరెడ్డి తన నగరాన్వేషణలను కొనసాగిస్తాడు. ఊరినుంచి వచ్చిన వాడుగా అతనిలోని కుతూహలమే అతన్ని విభిన్న సమూహాలను పరిశీలించి వారిలో గ్రామీణ భయాల్ని గుర్తించినప్పుడు ఏదో తెలియని ఆనందం అతని వాక్యాల ద్వారా వెలువడుతుంది.
                  ఇంతకీ అతనిది నగరాన్వేషణా ! కచ్చితంగా చెప్పడం కష్టం. గ్రామీణ మూలాలను దర్శించి ఎక్కడో సంతృప్తిని పొందడమా! ఇంకో పక్క నగరంలో విభిన్న సమూహహాలను విభిన్న ప్రాంతాలను మనచేత దర్శింపచేయటమో అనుభూతి. ఒక చోట కల్లు కాంపౌండ్‌ లో సాయంత్రం సేదదీరే మనుషులకు బిన్నంగా పబ్‌ లో తూలిసోలే ఆధునిక యువత. మరోచోట హైదరాబాద్‌ సంస్కృతిలో భాగంగా వున్నా ఇరానీ కేఫ్‌ ను సవాలు చేస్తూ నిలిచే ఆధునిక కాఫీ షాప్‌ 'బరిస్తా'. ఇక నగర జీవితంలో ఒక భాగమైన ఎఫ్‌ ఎమ్‌ రేడియోలో మూడుగంటలు గడపడంతో నీలాగా నువ్వు బతుకు అన్న సూత్రాన్ని మరొక్కసారి రచయిత ధృవపరుచుకుంటాడు. ఒక శ్మశానానికో, ఒక మార్చురీకో, కూలీల అడ్డాకో, యాచకులని పరిశీలించటమో వంటి అంశాలను ఎంచుకోవడంలో రచయిత ఉరుకుల పరుగుల నగరంలో ఉలిక్కి పడే విషయాలుంటాయని చెప్పకనే చెబుతారు. హైదరాబాద్‌ నగర వారసత్వ ప్రతీకలయిన చార్మీనార్‌ ని, గోల్కొండ కోటను ఎంతో ప్రేమతో దర్శిస్తాడు. కానీ ఏం చెప్పాడు ! చార్మినార్‌ చుట్టూ అల్లుకుని వున్న జీవితాల్ని చూడమని లాలనగా చెప్తాడు. అలాగే గోల్కొండ కోట యిచ్చిన మతసామరస్యాన్ని కాపాడుకుందామని మథనపడుతాడు. ఆదివారం ఆబిడ్స్‌ లో పాతపుస్తకాల సందడిని వినమని ప్రేమగా చెబుతాడు. దుమ్ము పట్టిన అఫ్జల్ గంజ్‌ సెంట్రల్‌ లైబ్రరీని దర్శించి మన మస్తిష్కాలకు పడుతున్న బూజును వదిలించుకోమంటాడు. ఎర్రగడ్డ హాస్పిటల్‌ లోని దీనగాథలను మన ముందుంచి సన్నటి విభజన రేఖకు అవతల వాళ్ళు, యివతల మనం అని ఆవేదన చెందుతాడు.
                 ఇలాంటి రచనలకు ఏదో చెప్పాలన్న తాపత్రయం, సారళ్యమయిన వచనం, దోవచూపే దీపధారి కుండే నిబ్బరం, చిన్న చిన్న విషయాల్ని కూడా పాఠకులకు చూపగలిగే చొరవ.... ఇవే ఊపిరిగా నిలుస్తాయి. రాజిరెడ్డిలో ఆ లక్షణాలు పుష్కలంగా వున్నాయనిపిస్తుంది. అతని సున్నిత మనస్తత్వం కూడా చాలాసార్లు బయటకు తొంగి చూస్తు వుంటుంది. ఒక్కోసారి అది పాఠకులకు కొంచెం యిబ్బంది కూడా కలిగిస్తుంది. సంవత్సరం పాటు హైదరాబాద్‌ నగర సంస్కృతిని, ఆ సంస్కృతిలో నెమ్మదిగా చోటు చేసుకుంటున్న ఆధునిక పోకడలని, వైరాగ్య స్మృతులని పరిచయం చేయడం సామాన్యమయిన విషయం కాదు. ఆ పరిచయం చేసే క్రమంలో మనలోని అంతర్లోకాలని మనల్ని తడిమి చూసుకునేలా చేస్తారు. ప్రతి సందర్భాన్ని రన్నింగ్‌ కామెంటరీ లాంటి వ్యాఖ్యానంతో కొనసాగిస్తారు. కొన్ని చమక్కులు, విరుపులు, మెరుపులు, రసాత్మక వాక్యాలు యివన్నీ కలగలసి ఒక పరిమళాన్ని ప్రతి రియాలిటీ చెక్‌ కు అద్దాయి. ఇలా వచనంలో తనదయిన ముద్ర వేసుకున్నారు రాజిరెడ్డి.
                 నగర చరిత్రను చెప్పటం వేరు. నగరపు సమకాలీనతను చైతన్య స్రవంతి శిల్పంలా ఆవిష్కరించడం వేరు. అది పూడూరి రాజిరెడ్డి సాధించిన ఒక విజయం. అయితే చాలా సందర్భాలను రచయిత తనకు ఆన్వయించుకునే ప్రయత్నం చేశారు. అది కొంచెం పాఠకుణ్ణి కాస్త యిబ్బంది పెడుతుంది. అంత స్వీయాన్వేషణ అవసరం లేదేమో. దాన్ని లోపంగా చెప్పటం లేదు. కానీ ఒంటరిగా వుంటూనే సమూహాన్వేషణ జరిగినప్పుడు అది మరింత ఫలవంతంగా వుంటుంది.
         ఇక పుస్తకాన్ని చాలా సుందరంగా, ఒక తపనతో తీర్చిjదిద్దిన ' తెనాలి' ప్రచురణల వారిని అభినందించాలి. అతి తక్కువ ముద్రా రాక్షసాలు కన్పిస్తాయి. చక్కటి పేజీ మేకప్‌ తో దృష్టిని మరల్చనివ్వదు 'రియాలిటీ చెక్‌'. హైదరాబాద్‌ నగర వైదుష్యానికి, వైశిష్ట్యానికి సలాం చేస్తుందీ 'రియాలిటీ చెక్‌'.

-సి.ఎస్‌.రాంబాబు
(ప్రజాశక్తి ఆదివారం; 15 Jun 2014)

No comments:

Post a Comment