Friday, January 19, 2024

గంగరాజం బిడ్డ పుస్తకంపై పద్మజ సూరపరాజు గారి స్పందన


(గంగరాజం బిడ్డ పుస్తకంపై పద్మజ సూరపరాజు గారు తన అభిప్రాయాన్ని జనవరి 3న తన ఫేస్‌బుక్‌ వాల్‌ మీద పోస్ట్‌ చేశారు. దాన్నే ఇక్కడ కాపీ చేస్తున్నా.)

 

గంగరాజం బిడ్డ - పూడూరి రాజిరెడ్డి

"ఈ వగలాడులు ఎందుకు వశం చేసుకోవాలి? ఎందుకు పశ్చాత్తాపానికి గురి చేయాలి?‘‘
వీటికి ముందువాక్యంలోనే ‘‘ఎందుకింత ఇమోషనల్ గా డిపెండ్ అవుతారు వీళ్ళు?‘‘ అంటూ ప్రశ్నరూపంలో పై ప్రశ్నలకు జవాబు!
‘‘ఎంత అనుభవించినా ఇంకా మిగిలిపోయే స్త్రీ శరీరం‘‘
ఈ కొన్ని వాక్యాలనే కాదు, ఈ ప్రస్తుత పుస్తకానికి క్రితం ఈ రచయిత కలం నుంచి వచ్చిన ఆత్మకథనాత్మక రచనలూ, ఇంకొన్ని వేరే కథలూ చదివిన వారికి ఇతని wonderment at woman కాస్త జాస్తిగానే amusing గా తోస్తుంది.
తనతో క్షణం సేపు, గుడికి ఒక ప్రదక్షిణ చేసినంతసేపు, ఆకాశం పంచుకున్నందుకా లేక ఈ ఆకాశం కింద ఎక్కడకు వెళ్ళినా తనతో ఆ నేలలను ఎప్పుడూ సమంగా పంచుకుంటున్నందుకా స్త్రీకి అంత ఆకర్షణ!?
కానీ ఈ ముచ్చట ఎక్కడినుంచో పనిగట్టుకుని రాదు, తీర్మానంగా కొన్ని specific స్త్రీ పురుష సంబంధాల గురించిన కథలైనందు వల్ల రాదు. ఆరాధనీయమైన ప్రేమకథలైనందువల్ల రాదు. ఎక్కడా, పెద్ద మోతాదుల సంఘర్షణలలోనో పుట్టిన ఉలికిపాటు వాక్యాలూ కావివి.
దినసరి చాయ్ రోటీల వలెనే, మరీ మాట్లాడితే ఊపిరి తీసుకోవడం వలెనే ఈ observations.
"ఒక స్త్రీ కలిగించగలిగే ఆవేశము, ఆమె మీద నాకు ఏ అధికారమూ లేదన్న వాస్తవమూ ఏకకాలంలో ఆశనిరాశల మధ్య ఊగించాయి" ఎంత మంది మగవాళ్ళు ఎవరూ కాదనలేని ఈ పురుష సత్యాన్ని ఒప్పుకుంటారు!
అన్ని బలహీనతలలోకి బలమైనది స్త్రీ అందం పట్ల ఆకర్షణ. అది ఉండదనటం ఎంత అబద్ధమో, దానికి చలించి వెంటపడం అంత అధమం.
మరో మగ వ్యథ!
పదో యేట నుంచే అస్తిత్వ భయం, తనకు నిరూపణకు వచ్చిందాకా తన పురుషాస్తిత్వ ఆందోళనం!
దీన్ని వ్రాతల్లో నమోదు చేయడమూ అంత తేలికైన పనేమీ కాదు.
ఏ కల్పిత పాత్ర వెనకనో నుంచోకుండా తనను సాంతం చదివేసుకున్న వ్రాతలు ఈ రచయితవి.
కానీ, ఈ సంచలనాలను నీళ్ళమీద గులకరాయి చేసే వలయాలను చూస్తున్నట్లు ఒడ్డున ఉండి చూసినప్పటి ముచ్చట్లు ఇవి. స్థితప్రజ్ఞత వంటి పెద్ద మాటలు పరిచయం అయిందాకా అతనికే తెలీదు అది తనకు కాస్తో కూస్తో ముందునుంచే ఉందని.
కాబట్టే ఇలా అనుకోగలడు, ఏం సంబంధం లేకపోయినా ఆ సౌందర్యస్వరూపాలతో ఒక ఉమ్మడితనమేదో తనకు ఉండగలిగితే బావుండునని.
అది ఇతనికి కేవలం అనుకోవడంలో ఆగిపోలేదు.
సౌందర్యాన్ని ఎంత నిశితంగా గమనిస్తాడో ఈ రచయిత తన శ్వాసను అంత నిమగ్నతతో చూస్తాడు, కళ్ళు మూసుకుని.
"మెడిటేషన్" ఈ పుస్తకంలో అత్యుత్తమ రచన. బోలెడంత హాస్యం, లిప్తపాటులో ఎగిరిపోయి ఎక్కడెక్కడో తిరిగి, తిరిగి వచ్చి ముక్కు కొనమీద వాలే మనసు తాలూకు అల్లరి కబుర్లు, తర్వాత కావలసినంత సద్విచారం, సత్యమైన అనుభవం!
ప్రాణికి నేర్చుకోకుండా అబ్బే మొదటి విద్య శ్వాసించడం. ఆ అనులోమ విలోమ శ్వాసలను ఎఱుకతో గమనించడం అంతిమ అధ్యయనం .
ఈ రెండింటి మధ్య చేసేవి చూసేవి నేర్చేవి కోటి విద్యలు. కొన్ని పొట్ట కూటికి అయితే కొన్ని కంటికి భోజనం.
మెడిటేషన్ లో 'రియల్ బ్లిస్' దొరికితే చాలా !?
ఎంత సేపు?!
చిన్న పిట్టొకటి వచ్చి పచ్చికాయ కొరికిన వాసన మరింతగా అనుభవానికి వస్తేనే ఈ తోటలో మనిషొక యోగి.
భోగి.
ధ్యానం నేర్పిన గురువు చేసిందల్లా, ధ్యానించటం అనే మానవ సహజ లక్షణానికి తనను మేల్కొలపటమే.
ఈ సంకలనంలోని కథలు కుదిపేస్తాయి, మీకూ తెలుసుకదా ఇవన్నీ అని నిలదీస్తాయి.
'ఎడ్డి', 'కొండ' కథలు కదిలిస్తాయి.
అన్నీ చదవవలసిన కథలే.
రచయిత స్టైల్ ఎవరూ అనుకరించలేనిది,
అతని పరిశీలనలు, వాటికి స్పందనలు, వ్యక్తీకరణలు అతనివే సాంతం అయుండటమే అందుకు కారణము.
Cover design, cover art ముచ్చటగా ఉన్నాయి.

(3-1-2024)


No comments:

Post a Comment