Saturday, September 14, 2024

ఈలోకం

 


చలం

మహారచయిత చలం(1929–89) కథ ‘ఈలోకం’ సంక్షిప్త రూపం ఇది. కానీ దీని పూర్తి పాఠం చదివితేనే అసలైన మజా!

–––––––––––––––

క్షణికంలో శాశ్వతానందం


మా పెద్ద తగాదా ఐన తరవాత మూడువారాలకి జయలక్ష్మి ఓనాటి ఉదయం చీటీ పంపింది. కాని నాకు తెలుసు. కలుసుకున్నా లాభం లేదు. సాయంత్రం లోపలే మళ్లీ పోట్లాడుకుంటాము. కాని పోట్లాడి విడిపడ్డ తరవాత, జీవితంలో యీ కాసిని గంటలూ ఎందుకు వృథా చేసుకుంటున్నామా అని నిశ్చయంగా పరితాపపడి నిలవలేక నిమిషాలమీద కలుసుకుంటాము.

కాదు. ఈవేళ స్పష్టంగా మాట్లాడి వొస్తాను. ఇక లాభం లేదని, నా కోసం చీటీ రాయవద్దని, నిశ్చయంగా చెప్పేసి వెళ్లిపోతాను. ఈ మాత్రం అందం దొరకదా ఏమిటి నాకు?

సామాను సద్దమన్నాను నౌకర్ని. బొంబాయికి బెర్తు రిజర్వు చేయించాను. తాత్సారం చేసి చేసి నాలుగింటికి బైలుదేరాను జయలక్ష్మి ఇంటికి. 

తలుపు లోపల గడియవేసి వుంది. గట్టిగా తలుపు కొట్టాను. దూరంనించి దాసీది కనకం వొస్తున్నానని కేకవేసింది. అమ్మగారు తలంటి పోసుకుంటున్నారుట.

గదిలో కూచున్నాను. అరగంటయింది. దూరంగా నీళ్లు పోసుకుంటున్న చప్పుడు తప్ప ఇంకేం వినపట్టంలేదు. రాదేం ఇంకా? కావలిసే ఈ ఆలస్యం? సరాసరి నీళ్ల గదిలోనికి వెడితే?

‘‘జయా!’’ నమ్రతగా పిలిచాను.

‘‘ఏం సంగతి!’’ వెక్కిరింపు.

‘‘ఎంతసేపు’’

‘‘నాలుగు గంటలు కాలయాపన చెయ్యగలిగిన అయ్యగారికి యీ పది నిమిషాలు భారమైనాయి గావును’’ అని చీదరించుకుంది.

నా కోపాన్ని మింగుకుని– ‘‘ఒక్కసారి నిన్ను చూడనీ.’’

‘‘వీల్లేదు. నేను వొచ్చేలోపల దొడ్లోకి వెళ్లి స్తానం చేస్తున్న నీటి కాలవని ఆరాధించండి.’’

విసుక్కుని దొడ్లోకి పోయినాను. తూములోనుంచి నవ్వుతో దూకుతున్నాయి తెల్లటి నీళ్లు– వట్టివేళ్ల సున్నిపిండితో పరిమళమైన నీళ్లు.

ఇంతేనా? ఈమెని విడవలేనా? మళ్లీ ఆ మాయలో పడుతున్నానా? స్త్రీలేంది బతకలేను. స్త్రీతో వేగలేను. ఈ చక్రంలోంచి విముక్తి లేదా? మోహప్రవాహంలో ఇట్లా కొట్టుకుపోవడానికి వొప్పుకోను.

ఆ నీళ్ల కాలవ వెంట పదడుగులు నడిచాను. ఆ నీళ్లు ఓ మురిగిన పేడకుప్పని పాయలై చుట్టుకుంటున్నాయి, స్త్రీ హస్తాల వలె. చప్పున పెద్ద విరక్తి తోచింది. ఇంతే స్త్రీ మోహం. ఇంతకన్న నీచం ఇంకేంలేదు.

నా కళ్లముందు ప్రపంచం తళతళమంది. దివ్యచక్షువు తెరుచుకున్నట్టయింది. ఇల్లు దొడ్డి అన్నీ మాయమైనాయి. నా ముందు ఆ మురిగిన పేడకుప్ప తప్ప యింకేం కనిపించలేదు. ఆ పేడకుప్ప పెరిగి నా లోకమైపోయింది. నా దృష్టి ఆ పేడని చీల్చుకుని చూస్తోంది. కుప్పనిండా పురుగులు– పెద్దవీ, చిన్నవీ. వాటి సంభాషణ కూడా అర్థమౌతోంది.

టీచరు: ‘‘భూమి గుండ్రముగా వుందనడానికి నిదర్శనం ఏమిటి?’’

విద్యార్థి: ‘‘ఎంత తిరిగినా పేడ తప్ప ఏం కనిపించదండీ.’’

టీచరు: ‘‘రైట్, పది మార్కులు. కొన్ని యుగాల కిందట, ఈ భూమి పొగలు కక్కుతూ ఉండేదిట. ఇప్పుడు చల్లారింది. అటు తరవాతే యీ జీవసృష్టి ప్రారంభమైంది.’’

(ఇందాకనేకదా ఆవు పేడ వేసింది. ఆ వేడి సంగతి గావును!)

పక్కనే ఇంకోచోట ఒక సభ జరుగుతోంది. అక్కడ కాషాయ వస్త్రాలు వేసుకున్న పురుగూ, నల్లటి సూటు వేసుకున్న తెల్లటి పురుగూ సభలో ఎత్తు స్తలం మీద కూచున్నారు. సూటు పురుగు ఉపన్యాసం ఇస్తోంది.

‘‘నిన్న రాత్రి నాకు కలలో ఈశ్వరుడు కనబడ్డాడు. ఈ కొత్త మతవిధానాన్ని ప్రసాదించాడు. ఇంక కొత్తయుగం ప్రారంభం కాబోతోంది. ఇంక మరణభయం లేదు’’

ఇంతలో పొరుగమ్మ వొచ్చి పేడ ఓ ముద్ద చేతిలోకి తీసుకుంది. ఆ ముద్దలో యీ ఉపన్యాసకుడు కూడా లేచి వెళ్లిపోయినాడు. సభాసదులంతా ‘బొందితోనే కైలాసానికి వెళ్లాడని’ అతనికి గొప్ప సమాధి కట్టించడానికి తీర్మానాలు చేసుకుంటున్నారు.

ఆ పక్కనే ఓ ఆడపురుగు తన పిల్లతో అంటోంది– ‘‘ఒసే ఎన్నడన్నా మన వంశంలో వుందే ఇట్లాంటి నీచపు గుణం? ఆ పాడు మురికి నల్లపురుగుని నీ తోకతో దాని ముదనష్టపు తోకని కలవనిచ్చావే!’’

ఇంకోవేపు చూశాను. రెండు పురుగులు పోట్లాడుకుంటున్నాయి.

‘‘నా గీతాలు ఆచంద్రార్కంగా నిలుస్తాయి. ఈ పేడకుప్పలో నా అంత అందంగా రాసేవాణ్ణి చూపగలవా? నీ మొహం నువ్వూ ఓ కవివే!’’

రెండో పురుగు: ‘‘నా కవిత్వం ఈనాటి ప్రజలకు కాదు. నాలుగు యుగాలు పోయాక పుట్టబోయే పురుగులకి. అవి నీకన్న తెలివైన మెదడుతో పుడతాయి.’’

ఇంతలో ఓ బొండుపురుగు సమీపించి ‘‘నాకో పుస్తకం అంకితం ఇవ్వరా మీలో వొకరు? నా పేరు ఆకల్పాంతం నిలుస్తుంది. నేను పుస్తకాన్ని అందంగా పేజీకి ఒక్క పంక్తి చొప్పున అచ్చు వేయిస్తాను’’ అంటోంది.

ఇంక కొంతదూరంలో ఒక మొండిగోడల ఇల్లు కనపడ్డది. దాంటో కొన్ని పురుగులు తలకిందుగా వేళ్లాడుతున్నాయి. కొన్ని మేకుల మీద పడుకునివున్నాయి. చెక్క మీద ‘‘యోగాశ్రమం. దీంటోకి స్త్రీలు ప్రవేశించకూడదు’’ అని వుంది.

వాకిలిముందు ఒక పెద్ద సభ. ఆశ్రమపు అధ్యక్ష పురుగు ఉపన్యాసం ఇస్తోంది. ‘‘ఈలోకం అసత్యం. ఆత్మ శాశ్వతం. ఇంద్రియాల్ని అరికట్టితేనేగానీ ఆత్మజ్యోతి దర్శనం కాదు. యోగప్రభావం వల్ల గాలిలో పైకిలేచే శక్తి వొస్తుంది.’’

అంటోవుండగా ఆ వేపుకు వొచ్చిన ఓ కోడి ఆ యోగిపురుగుని ముక్కుతో పైకెత్తింది. పురుగుల కళ్లదృష్టి అంతయెత్తుకి చూడలేదు గనక ఆ యోగి అట్లా పైకి లేచి వెళ్లిపోయినాడనుకొని భక్తితో అన్ని పురుగులు సాష్టాంగపడ్డాయి.

కొన్ని పురుగులు ఒకచోట చేరి, సభ చేస్తున్నాయి. ‘‘మన పేడ వేరు, మన జాతి వేరు. పక్కనున్న నల్ల పురుగులు, అవి పేడని వుండలుగా చేసుకునిగాని తినవు. మనం ఎట్లానన్నా సత్యాగ్రహం చేసి ఐనా సరే విడిపోవాలి’’ అంటూ వుండగా పైనించి ఆవు వుచ్చపోసింది. ఆ ధారతో ఆ దేశమంతా జలమయమయింది. బతికిన ఒక జడలపురుగు ‘‘ఈ వరదలు మన తాతలు చేసిన పాపాలకి ఈశ్వరుడు కోపించి చేసిన ప్రతీకారం’’ అంటున్నాడు.

ఒక తెల్లని గడ్డంపురుగు, ‘‘ఇదేమి మూర్ఖం, మన తాతలు చేసినదానికి మన మీద కోపం కలుగుతుందా ఈశ్వరుడికి? అదేదో నీటిధార పడ్డది. శాస్త్రజ్ఞులు దానికి కారణం కనుక్కోగలరు!’’ అన్నాడు. ఆ మాటలకి పురుగుజాతికి కోపమొచ్చి, ఆ గడ్డంపురుగుని మోసుకుపోయి గట్టిపేడలో వూపిరాడకుండా పాతి చంపేశాయి.

ఇంకొకచోట అఖిల సారస్వత సమ్మేళనం. ఒక సంపాదకీయ పురుగు చచ్చిన చిన్న పురుగుమీద నుంచుని ఉపన్యాసమిస్తోంది. ‘‘ఈ పురుగు పేడ వాంగ్మయానికి చాలా సేవచేసింది. మనం ఒక్క సన్మానమూ చెయ్యలేదు. మనం చందాలిచ్చి గొప్ప స్మారకచిహ్నం కట్టాలి.’’

గుసగుసలాడుతున్నారు సభాసదులు. ‘‘చందాలన్నీ వీడే కొట్టెయ్యడానికి.’’

అక్కడే ఓ ముసలిపురుగు కొంత పేడని పోగుచేసుకుని దానిమీద కూచుంది. పిల్ల కవి పురుగులు తమ రచనల్ని అర్పించి, వరుసగా చదువుతున్నాయి. ఆ పురుగు తన యిష్టప్రకారం ‘‘ఈ కావ్యం తుక్కు. ఈ కావ్యం పదేళ్లు నిలుస్తుంది’’ అంటోంది. అందమైన ఆడపురుగుల కావ్యాలు మాత్రం ఆచంద్రార్కంగా నిలుస్తాయని దీవించి, తన పీఠం మీద కూచోపెట్టుకుంటోంది.

ఇంతలో పెద్దపెద్ద జండాలతో అరుపులతో ఓ పురుగు గుంపు ప్రవేశించింది. ‘‘లాగెయ్యండి వాణ్ణి. కిందికి లాగెయ్యండి. ఇదంతా పేడ గలవారి సారస్వతం. వీళ్లు రాసే గ్రంథాలూ, కవిత్వాలూ, ఎవరికీ అర్థం కావు. దేవుడూ భక్తీ శృంగారం ఇట్లాటివే రాస్తారు వీళ్లు. వీళ్లనీ వీళ్ల కవిత్వాన్ని ధ్వంసం చేస్తేనేగానీ శాంతి లేదు లోకానికి’’ అని చిందరవందరచేసి పోయినారు వాళ్లు.

ఇంతలో పెద్ద పెద్ద జండాలు పట్టుకుని ఓ గుంపు ప్రవేశించింది. దాంటో బక్కపురుగు, గంభీరోపన్యాసం ప్రారంభించింది. ‘‘యీ పురుగు దేశముందే యిది దేవతలు స్వయంగా నిర్మించుకున్న భూమి. దీనికి పతనం లేదు. ఇది అనంతకోటి యుగాల వరకు ప్రపంచానికి జ్యోతిౖయె వెలగాలంటే, నాకు మీ ఓట్లు యివ్వండి...’’ 

ఇంతలో జయలక్ష్మి స్నానం నీళ్లు పేడకుప్ప చుట్టూ పెద్దమడుగు కడుతున్నాయి. పేడ నాని పెళ్లలు పెళ్లలుగా కూలిపోతోంది. 

‘‘అసలు పచ్చి పేడనేగానీ మగ్గిన పేడని తినకూడ’’దని కొన్ని పురుగులు బోధిస్తున్నాయి. పేడరసాన్ని పులిపించి తాగడంవల్ల ఘోరాలు తటస్తిస్తున్నాయననీ, పేడ మద్యాన్ని నిషేధించమనీ ప్రభుత్వానికి అర్జీలు పెడుతున్నాయి కొన్ని పురుగులు.

ఇంతలో జయలక్ష్మి దాసీది వొచ్చి పొయ్యి అలకడానికి ఆ పురుగులున్న పేడనంతా ముద్దచేసి తీసుకుపోయింది. ఆ ముద్దకింద నించి రెండు తెల్లటి పురుగులు బైటపడ్డాయి. ఒకదానికి జయలక్ష్మి మొహం, ఇంకాదానికి నా మొహం. వెంటనే పేడకుప్ప నా కళ్లముందు మాయమై ప్రపంచం మామూలుగా ప్రత్యక్షమయింది. జయలక్ష్మి తలలో కదంబం, గులాబి పువ్వులు పెట్టుకుని, ఆకుపచ్చ వెంకటగిరి చీర కట్టుకుని, నవ్వుతోంది నన్ను చూసి.

‘‘ఆరాధన అయిపోయిందా?’’

‘‘ఏం బతుకు మనది?’’

‘‘ఈ తగాదాలేనా?’’

‘‘అసలు ఈ ప్రేమ’’

‘‘బతుక్కీ ప్రేమకీ కూడా అర్థం కనపట్టం లేదా మీకు?’’

‘‘ఏమిటో యిప్పుడు పుట్టి రేపు నశించే పురుగులం’’

‘‘కాని ఈ రాత్రికి దేవతలం’’

‘‘పోట్లాడతావు నాతో’’

‘‘నా పోట్లాట మాత్రం ఏం శాశ్వతం? ఎందుకంత బాధగా తీసుకోవాలి నువ్వు? ఏదో రేపు పొద్దున్నకి నశించేవాడివి? పద.’’

రెండు పురుగులు గూట్లోకి వెళ్లాయి.


(సాక్షి సాహిత్యం: 2018 ఆగస్ట్‌ 27)


 

Wednesday, September 11, 2024

Guests of the Nation


Frank O'Connor
 

ఫ్రాంక్‌ ఓ కానర్‌(1903–1966) ఐరిష్‌ కథ ‘గెస్ట్స్‌ ఆఫ్‌ ద నేషన్‌’ సారం ఇది. 1931లో ప్రచురితమైంది. బ్రిటన్‌ మీద ఐర్లాండ్‌ స్వాతంత్య్ర సమరం జరుగుతున్న కాలం దీని నేపథ్యం. ఐర్లాండ్‌కు చెందిన ఓ కానర్‌ సుప్రసిద్ధ కథకుడు, కవి.

–––––––––

గెస్ట్స్‌ ఆఫ్‌ ద నేషన్‌


సాయంత్రం అవుతూనే బెల్చర్‌ పొడుగ్గా కాళ్లు చాపి, ‘ఊమ్, నేస్తుడా, దాని సంగతేమిటి?’ అంటాడు. వెంటనే నోబెల్‌ గానీ బోనపార్ట్‌ గానీ, ‘నువ్వంటే సరే, నేస్తుడా’ అని నవ్వుతూ బదులిస్తారు. ఈ నేస్తుడా అనే మాట వాళ్లిద్దరికీ బెల్చర్‌ వల్లే అలవాటైంది. వెంటనే అందరిలోకీ పొట్టివాడైన హాకిన్స్‌(వాళ్లు ఆకిన్స్‌ అంటారు) దీపం వెలిగిస్తాడు, కార్డ్సు బయటకు తీస్తాడు. ఇక ఆట మొదలవుతుంది.

ఒక్కోసారి వీళ్లను పర్యవేక్షిస్తున్న జెరమాయా డానవన్‌ వీళ్లున్న ఇంటికి వస్తుంటాడు. వాళ్ల వెనకాల నిలబడి, ‘ఆకిన్స్, నువ్వేం ఆడుతున్నావో చూసుకో’ అని అరుస్తాడు. హాకిన్స్‌కు ఆడటం రాదు. కానీ డాన్స్‌ బాగా చేస్తాడు.

బెల్చర్, హాకిన్స్‌ ఇంగ్లీషు సైనికులు. ఇంగ్లీషువాళ్ల కోసం (ఐరిష్‌) సెకెండ్‌ బెటాలియన్‌ తీవ్రంగా గాలిస్తున్నప్పుడు పట్టుబడ్డారు. ఇద్దరినీ నోబెల్, బోనపార్ట్‌ బాధ్యత కింద ఈ ఇంట్లో ఉంచారు. కొన్ని రోజులు గడిచేప్పటికి, వాళ్లమీద ఓ కన్ను వేసి ఉంచాలనే ఆలోచనే వీళ్లు మరిచారు. వాళ్లు ఎందుకు పారిపోతారు!

వీళ్లున్న ఇల్లు ఒక ముసలావిడది. ఈమెకు నోటి కొసనే శాపనార్థాలుంటాయి. అట్లాంటిది ఈ ముసలమ్మా బెల్చర్‌ ఎలా అలవాడుపడ్డారో చూడటం కళ్లకు వినోదం. బెల్చర్‌ భారీ మనిషి. ఐదడుగుల పది అంగుళాలున్న బోనపార్ట్‌ కూడా పైకి చూడాల్సి ఉంటుంది. అంత భారీకాయుడు నిశ్శబ్దంగా దయ్యంలా తిరుగుతుంటాడు. అసలు మాట్లాడడు. ఎప్పుడన్నా మాట్లాడాడంటే ఆ కార్డ్సు ఆడుదామనే. ఆటంటే బాగా ఇష్టం. ముసలమ్మ ఏ బకెటో, ట్రేనో పట్టుకొస్తుంటే అతడు సాయం వెళ్తాడు. వంటచెరుకు కోసం తిప్పలు పడుతుంటే ఆమె దగ్గరి చిన్న గొడ్డలి లాక్కుని కట్టెలు కొట్టిస్తాడు. బెల్చర్‌కు పూర్తి విరుద్ధం హాకిన్స్‌. బటాలియన్‌కు సరిపడా అతడే వాగుతాడు. ఎంత చిన్న టాపిక్‌గానీ ఎదుటివారిని తిట్టకుండా వదలడు. హాకిన్స్, నోబెల్‌ తరచూ మతం గురించి వాదులాడుకుంటారు. నోబెల్‌ సోదరుడు ప్రీస్ట్‌ అని తెలియడం దీనికి కారణం. ఎవరూ మాట్లాడ్డానికి లేకపోతే ముసలమ్మ మీద ప్రతాపం చూపిస్తాడు హాకిన్స్‌.

’ ’ ’

ఒక సాయంత్రం వాళ్లందరూ టీ తాగారు. హాకిన్స్‌ దీపం వెలిగించాడు. పెట్టుబడిదారులు, స్వర్గం, పూజారులు... ఇలా మాటలు దొర్లుతున్నాయి. అప్పుడు జెరమాయా డానవన్‌ వచ్చాడు. అందరినీ చూసి నెమ్మదిగా బయటికి నడిచాడు. చర్చ తెగేది కాదని బోనపార్ట్‌ ఆయన్ని అనుసరించాడు. ఇద్దరూ గ్రామం వైపు నడుస్తున్నారు. ఆగి, ‘వాళ్లకు కాపలాగా ఉండాల్సింది నువ్వు’ అన్నాడు డానవన్‌. ‘ఇంకెంతకాలం? వాళ్లను మనతో ఉంచుకుని ఏం ప్రయోజనం?’ అడిగాడు బోనపార్ట్‌. ‘వాళ్లను బందీలుగా పట్టుకున్నామని నీకు తెలుసనుకుంటున్నా.’ ఖైదీలు అనకుండా బందీలు అనడం అర్థంకాలేదు. ‘శత్రువుల దగ్గర మనవాళ్లు ఖైదీగా ఉన్నారు. ఇప్పుడు వాళ్లను కాల్చేస్తామని చెబుతున్నారు. వాళ్లు మనవాళ్లని కాల్చేస్తే మనమూ వాళ్లవాళ్లను కాల్చేసి దీటైన జవాబిద్దాం’ తీవ్రంగా బదులిచ్చాడు డానవన్‌. ‘కాల్చేయడమా?’ అసలు అట్లాంటిదొకటి సాధ్యమనే ఆలోచనే బోనపార్ట్‌కు ఉదయించలేదు. ‘అంతే, కాల్చేయడమే’ స్థిరంగా బదులిచ్చాడు డానవన్‌. ‘కానీ నాకూ నోబెల్‌కూ ఈమాట ముందే చెప్పివుండాల్సింది’ పీలగా అన్నాడు బోనపార్ట్‌. ‘ఎందుకు చెప్పాలి?’ ‘ఎందుకంటే వాళ్లను మేము కావలి కాస్తున్నాం కాబట్టి.’ ‘మిమ్మల్ని కాపలాగా ఉంచినప్పుడు ఆ మాత్రం ఊహించలేరా?’ తప్పుపట్టాడు డానవన్‌. ఇప్పుడు చెబుతున్నాగదా, ఎప్పుడు చెబితే తేడా ఏముంది? అన్నాడు. ‘చాలా పెద్ద తేడా ఉంది’ గొణిగాడు బోనపార్ట్‌. కానీ ఆ తేడా ఏమిటో వివరించలేకపోయాడు.

బోనపార్ట్‌ తిరిగి వెళ్లేసరికి చర్చ తీవ్రంగా నడుస్తోంది. మరణానంతర జీవితం ఏమీ ఉండదని మాట్లాడుతున్నాడు హాకిన్స్‌. మతగ్రంథాలను అనుసరించి కచ్చితంగా ఉంటుందని చెబుతున్నాడు నోబెల్‌. ‘నీకు స్వర్గం ఏమిటో తెలియదు, అదెక్కడుందో తెలియదు? అందులో ఎవరుంటారో తెలియదు, వాళ్లకు ఏమైనా రెక్కలుంటాయా’ అన్నాడు హాకిన్స్‌. ‘అవును, ఉంటాయి, చాలా’ చెప్పాడు నోబెల్‌. ‘అవి ఎక్కడ్నుంచి వస్తాయి? ఎవరు చేస్తారు? అక్కడేమైనా రెక్కల ఫ్యాక్టరీ ఉందా?’ వ్యంగ్యంగా అన్నాడు హాకిన్స్‌.

చర్చ పూర్తయ్యేసరికి అర్ధరాత్రి దాటింది. నీతో వాదించడం నా వల్ల కాదని నోబెల్‌ చేతులెత్తేశాడు. ఆ ఇంగ్లీషు వాళ్లిద్దరినీ వేరే గదిలోకి పంపి, తాళం పెట్టి, బోనపార్ట్, నోబెల్‌ పడుకున్నారు. దీపం ఆర్పేశాక డానవన్‌ చెప్పింది నోబెల్‌ చెవుల్లో వేశాడు బోనపార్ట్‌. నోబెల్‌ మౌనంగా ఉండిపోయాడు.

’ ’ ’

తెల్లారి సాయంత్రం వాళ్లు టీ తాగారు. బెల్చర్‌ తన ధోరణిలో ‘ఊమ్, నేస్తుడా, దాని సంగతేమిటి?’ అన్నాడు. అందరూ టేబుల్‌ చుట్టూ గుండ్రంగా కూర్చున్నారు. హాకిన్స్‌ కార్డ్స్‌ పంచాడు. బయట డానవన్‌ వస్తున్న బూట్ల చప్పుడు. నెమ్మదిగా బయటికి నడిచాడు బోనపార్ట్‌. ‘ఏం కావాలి?’ ‘నీ సైనిక స్నేహితులిద్దరు.’ డానవన్‌ ముఖం కోపంగా ఉంది. ‘మరో దారిలేదా?’ ‘శత్రువులు మనవాళ్లను నలుగురిని చంపేశారు. తెలుసా, అందులో ఒకతను పదహారేళ్ల కుర్రాడు.’

ఇంతలో నోబెల్‌ అక్కడికి వచ్చాడు. గేటు దగ్గరున్న ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ ఫీనీ కూడా కలిశాడు. ‘ఆ ఇద్దరినీ బయటికి తెండి, ఇక్కడినుంచి షిఫ్ట్‌ చేస్తున్నామని చెప్పండి’ ఆదేశించాడు డానవన్‌. ‘నన్ను ఇందులోంచి మినహాయించండి’ ప్రాధేయపడ్డాడు నోబెల్‌. ‘అయితే సరే, నువ్వూ ఫీనీ షెడ్లోంచి పార, పలుగు పట్టుకెళ్లి దూరంగా గొయ్యి తియ్య’మన్నాడు డానవన్‌. ‘ఇరవై నిమిషాల్లో మేము వచ్చేస్తాం. ఎవరికీ తెలియకూడదు’. ఫీనీ, నోబెల్‌ బయటికి నడిచారు.

డానవన్, బోనపార్ట్‌ ఇంట్లోంచి ఇంగ్లీష్‌ వాళ్లను బయటికి పిలుచుకొచ్చారు. నడుస్తుండగా, ‘పొద్దున మావాళ్లు నలుగురిని మీవాళ్లు కాల్చేశారు, ఇప్పుడు మీ వంతు’ చెప్పేశాడు డానవన్‌. హాకిన్స్‌ నమ్మలేదు. కావాలంటే బోనపార్ట్‌ను అడగమన్నాడు. ‘ఆ అవసరం లేదు, నేనూ బోనపార్ట్‌ నేస్తులం, కాదా?’ అడిగాడు హాకిన్స్‌. నిజమేనని బాధగా చెప్పాడు బోనపార్ట్‌. అయినా నమ్మలేదు హాకిన్స్‌. ‘నువ్వు నిజం చెప్పట్లేదు, నన్నెందుకు కాల్చేస్తారు? నోబెల్‌ కూడా ఇందులో ఉన్నాడా?’ అవునని తెలియగానే హాకిన్స్‌ నవ్వాడు. ‘హాకిన్స్, నీ చివరి కోరిక ఏమిటి?’ అడిగాడు డానవన్‌. ‘నోబెల్‌ నన్నెందుకు కాల్చేస్తాడు? నేను అతడినెందుకు కాల్చేస్తాను? మేము నేస్తులం కదా!’

దూరంగా దీపపు వెలుతురులో నోబెల్, ఫీనీ నిలబడివున్నారు. గొయ్యి సిద్ధంగా ఉంది. ‘హలో, నేస్తుడా’ నోబెల్‌ను పలకరించాడు బెల్చర్‌. బోనపార్ట్‌ గుండెలో మృత్యుబాధ వచ్చి కూర్చుంది. నోబెల్‌ బదులివ్వలేదు.

‘హాకిన్స్, నీ చివరి సందేశం ఏమిటి?’ అతడికి ఇలాంటివాటి మీద నమ్మకం లేదు. మరేదో మాట్లాడబోయాడు. ‘ఇక చాలిద్దాం.’ రివాల్వర్‌ను చేతిలోకి తీసుకున్నాడు డానవన్‌. హాకిన్స్‌ మెడ వెనుక గురిపెట్టాడు. బోనపార్ట్‌ కళ్లు మూసుకున్నాడు. బ్యాంగ్‌! నోబెల్‌ కాళ్ల దగ్గర పడిపోయాడు హాకిన్స్‌. బెల్చర్‌ జేబులోంచి కర్చీఫ్‌ తీసుకుని కళ్లకు కట్టుకోబోయాడు. పెద్ద తలకు ఆ చిన్న కర్చీఫ్‌ సరిపోలేదు. బోనపార్ట్‌ను ఇవ్వమని అడిగాడు. గంతలు కట్టుకునేముందు హాకిన్స్‌ కదులుతూ కనబడ్డాడు. అతడి ఎడమ మోకాలు పైకి లేవడం దీపం వెలుగులో కనబడింది. ముందు అతడిని ఇంకోసారి కాల్చేయండి, అన్నాడు బెల్చర్‌. శాశ్వతంగా ఆ నొప్పి నుంచి విముక్తం చేయడానికి మరొక బ్యాంగ్‌! బెల్చర్‌ నవ్వాడు. ‘రాత్రే వాడు ఈ మరణానంతర జీవితం గురించి తెగ కుతూహలపడ్డాడు.’ బోనపార్ట్‌ వెన్ను వణికింది. బెల్చర్, నీ చివరి ప్రార్థన చేస్తావా? ‘ఉపయోగం లేదు, నేను సిద్ధంగా ఉన్నాను’. బ్యాంగ్‌! రెండోసారి కాల్చే అవసరం కూడా రాలేదు.

ఆ గుడ్డి వెలుతురులోనే శవాలను మోసుకెళ్లి, గోతిలో వేసి పూడ్చారు. పనిముట్లు పట్టుకుని నోబెల్, బోనపార్ట్‌  తిరిగి ఇంటికి వెళ్లారు. వెళ్లేసరికి ముసలమ్మ జపమాలతో కూర్చునివుంది. ‘వాళ్లను ఏం చేశారు?’ అనుమానంగా అడిగింది ముసలమ్మ. బదులు రాలేదు. మళ్లీ అడిగినా బదులు లేదు. అయ్యో! ముసలమ్మ మోకాళ్ల మీద దేవుడి ముందు కూలబడింది. 


(సాక్షి సాహిత్యం: 2018 ఏప్రిల్‌ 23)




 

Sunday, September 8, 2024

కొడవటిగంటి కుటుంబరావు: దుక్కిటెద్దు


కొడవటిగంటి కుటుంబరావు

కొడవటిగంటి కుటుంబరావు(1909–1980) కథ ‘దుక్కిటెద్దు’ సంక్షిప్త రూపం ఇది. సౌజన్యం: అ.ర.సం. గుంటూరు శాఖ. కథలు, నవలలు, నాటికలు, గల్పికలు, వ్యాసాలు రాసిన బహుముఖ ప్రజ్ఞాశాలి కొ.కు. ఆయన ‘చదువు’ తప్పక చదవాల్సిన తెలుగు నవలల్లో ఒకటి.

–––––––––


దుక్కిటెద్దు


‘‘వద్దు, వద్దు! నాకు డాక్టరొద్దు! రెండు రోజులుంటే అదే నిమ్మళిస్తుంది!’’ అన్నాడు కిష్టయ్య ఆయాసంగా.

‘‘అదేమిటి, నాన్నగారూ? అసలు జబ్బేమిటో తెలుసుకోనివ్వండి. ముందుగా జాగర్తపడాలి గాని, రోగం ముదర బెట్టుకుంటారా?’’ అన్నది అనసూయ. ఆమె పిల్లలు నలుగురూ ఆమె చుట్టూ నిలుచున్నారు.

‘‘పిల్లల కోడి’’ అని కిష్టయ్య తన కూతురికి ఏనాడో పేరు పెట్టుకున్నాడు. కాని ఆయన ఆ మాట ఎప్పుడూ పైకి అనలేదు. ఆయన పెళ్లాంతోగాని, పిల్లలతోగాని అనని విషయాలు, ఇటువంటివి, బోలెడున్నై.

ఒకప్పుడు కిష్టయ్య తన భార్యను గురించీ, పిల్లల్ని గురించీ మురిసినవాడే. ఆయన చిన్నతనంలో కష్టాలు పడ్డాడు. ఆయన తన తల్లి నెరగడు. తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. మారుతల్లి కిష్టయ్యని హీనంగా చూసేది. వాళ్ల పల్లెటూళ్లో ఇంగ్లీషు బడి లేదు. బస్తీ చదువు డబ్బు దండగన్నది మారుతల్లి. తండ్రి కాదనలేదు. కిష్టయ్య– పదేళ్లవాడు– ఇంట్లో చెప్పకుండా బస్తీకి వెళ్లి వారాలు చేసుకుని, పుస్తకాలు, జీతం డబ్బులు, ఇతరులు పారేసిన బట్టలు ముష్టెత్తి చదువుకున్నాడు. తాను మేజరై తండ్రితో ఆస్తి పంపకం చేసుకునేసరికి కిష్టయ్య చదువు అయేపోయింది. ‘‘మంచివాడు’’ అనిపించుకోవటం ఇతరులను ఏ మాత్రమూ నొప్పించకుండా వారి సహకారం పొందటం, పొందిన సహాయానికి రెట్టింపు కృతజ్ఞత చూపటం ఆయనకు అలవాటైపోయింది. ఇదే ఆయనకు ఉద్యోగంలో పైకి రావటానికి కూడా ఉపకరించింది. చదివినది స్కూలు ఫైనలే అయినా పెళ్లి అయేనాటికి అప్పుడే నూరు రూపాయలు– ఆ రోజుల్లో బియ్యేలు కూడా చెయ్యలేని సంపాదన– సంపాదిస్తున్నాడు.

భార్య కాపరానికి వచ్చాక కిష్టయ్య ఆనందానికి మితి లేదు. ‘‘తన’’ అన్న మనిషంటూ కిష్టయ్య ఎరగడు. ఇప్పుడాయనకు భార్యా, సహజీవనమూ, తన యిష్టప్రకారం ఇల్లు అమర్చుకోవటం, వంట చేయించుకు తినటం ఏర్పాటయింది. పిల్లలు పుట్టుకొచ్చారు– ఇద్దరు కొడుకులూ, ఒక కూతురూ, మళ్లీ ముగ్గురు కొడుకులూనూ. భార్యనూ, ఆరుగురు పిల్లల్నీ సాధ్యమైనంతగా సుఖపెడతానని కిష్టయ్య శపథం చేసుకున్నాడు. అదనంగా రెండు రూపాయలు సంపాదించటానికి రెండు పూటలు తిండిలేకుండా తిరగవలసి వస్తే తిరిగాడు.

కిష్టయ్య ఏళ్ల తరబడి దుక్కిటెద్దులాగా పని చేశాడు. ఎన్ని వ్యాపారాలలోనో భాగం తీసుకున్నాడు. దీని ఫలితం, కిష్టయ్య తప్ప అందరూ అనుభవించారు. కిష్టయ్య పెళ్లాం నూరు రూపాయలకు తక్కువ చీర కట్టి బయటికి పొయ్యేది కాదు. కిష్టయ్య కొడుకులకు చదువు సంధ్యలు అబ్బినా, అబ్బకపోయినా సరికొత్త ఫాషన్‌లో దుస్తులు ధరించటం, మోటారు సైకిళ్లెక్కి తిరగటం, టెన్నిస్‌ ఆడటం మొదలైనవన్నీ అబ్బినై.

పెద్దవాడు చిన్న టెన్నిస్‌ ఛాంపియన్‌. తాను ఉద్యోగం చెయ్యబోవటం లేదని వాడు చదువుతూండగానే ప్రకటించాడు. రెండోవాడు ఇంజనీరు చదివి, జంషెడ్పూరులో ఉద్యోగం సంపాదించాడు. వాడి భార్య లక్షాధికార్ల బిడ్డ. ఆవిడ తాహతుకు తగినట్టుగా బతకడానికి తండ్రి దగ్గరినుంచి ప్రతి నెలా వందా, రెండువందలు తెప్పించుకుంటాడు. మూడోవాడికి చీట్లాట పిచ్చి. అందులో వాడు సంపాదిస్తాడని ప్రతీతి. కాని వాడికింద కిష్టయ్య ఏటా నాలుగైదు వేలు ఖర్చు చేస్తూనే ఉన్నాడు. నాలుగోవాడికి సినిమా స్టారు కావాలని. వాడు స్కూలు ఫైనల్‌తో చదువు ఆపేశాడు. చదవరా అని కిష్టయ్య అంటే, ‘‘నీవు చదివినంత నేనూ చదివాను. సినిమాస్టారు ఛాన్సు రానీ, నీకన్న ఎక్కువే సంపాదిస్తాను’’ అనేవాడు. అయిదోవాడు మట్టుకు చదువుతున్నాడింకా.

అనసూయకు పదోఏటనే పెళ్లిచేశాడు– శారదా చట్టాన్ని ధిక్కరించి. ఉన్నవాళ్ల పిల్లవాణ్ణే చూసి చేశారు. అనసూయను మొగుడి దగ్గరికి పంపిన కొద్ది రోజులకే డిప్రెషన్‌ వాళ్ల మీద పెద్ద దెబ్బ తీసింది. ‘‘మహాతల్లి మెట్టిన వేళావిశేషం’’ అని అనసూయ వింటుండగా అత్తవారు అన్నారు. పెట్టేబేడా సర్దుకుని పుట్టింటికి వచ్చేసింది. వారం రోజులు వెనకగా అనసూయ భర్త కామేశ్వరరావు కూడా వచ్చేశాడు.

అనసూయకు చాలారోజులు పిల్లలు లేక వరసగా నలుగురు పుట్టుకొచ్చారు. కిష్టయ్య వాళ్లందర్నీ పగవాళ్లళ్లే చూసేవాడు. కొడుకుల పిల్లలూ, కూతురి పిల్లలూ డజనుమంది దాకా ఉన్నారు. ‘‘లంకంత ఇల్లున్నది! వీళ్లు నేనున్నచోటికే ఎందుకువస్తారో?’’ అనుకునేవాడు.

కిష్టయ్యకు మనుషులంటే అసహ్యం మనవలతో మనవరాళ్లతో ఆరంభం కాలేదు; పెళ్లాం పిల్లలతో ఆరంభమయింది. వాళ్లు ఆయనను డబ్బు సంపాదించే యంత్రంగా చూడసాగారు. డబ్బు దేనికో తెలుసుకుందామని తాను ఎప్పుడన్నా విచారిస్తే చెప్పటానికి విసుక్కునేవాళ్లు. 

తాను ఏపూటా వేళకు భోంచేసేవాడు కాడు కిష్టయ్య. దానికి అందరూ అలవాటు పడిపోయారు. ఒకరాత్రి పన్నెండు గంటలకు ఇంటికి వస్తే అందరూ నిద్రపోతున్నారు. ‘‘భోజనం చేస్తావా?’’ అని అడిగినవాళ్లు లేరు.

ఇంట్లో కిష్టయ్య తప్ప మిగిలిన వాళ్లందరి మధ్యా ఏవో బంధాలున్నాయి. వాళ్లు ఆప్యాయంగా మాట్లాడుకునేవాళ్లు. అంతలో చడామడా తిట్టుకునేవాళ్లు. కాని వాళ్ల మధ్య కిష్టయ్యకు ఏమీ స్థానం లేదు.

‘‘వీళ్లందరి కోసం నేనెందుకు హూనం కావాలి. నా తిండికీ బట్టకూ యాభై చాలు, నాకు నస్యం కూడా అలవాటు లేదు’’ అని కిష్టయ్య చాలాసార్లు అనుకున్నాడు. కాని దొర్లే రాయి దొర్లుతూనే ఉంది. ఎప్పుడైనా పెందలాడే ఇంటికి వచ్చినా, ఇల్లుదాటి పోకపోయినా ఏదో ఆత్మద్రోహం చేసినట్టుగా తోచేది.

‘‘ఈవాళ తాత ఇంట్లోనే ఉన్నాడే!’’ అనేవాళ్లు కుర్రాళ్లు. అందులో కిష్టయ్యకి ఏదో వెటకారం వినిపించేది.

ఇంట్లో ఎవరికీ తన అవసరం లేదని తెలుసుకోవడనికి కిష్టయ్యకు చాలాకాలం పట్టింది. డబ్బు ఇవ్వటానికి తప్ప మిగిలిన అన్ని విషయాలకూ తాను పరాయివాడే.

కిష్టయ్యకు జబ్బు చేసింది. జబ్బు నుంచి ఆయనకు కోలుకోవాలని లేదు. ఈ అవతారం ఇక చాలించవచ్చు ననిపించింది.

మిగిలినవాళ్లకు ఆయనను చావనివ్వాలని లేదు. డాక్టరును పిలవనంపారు. డాక్టరు ఏవో ఇంజెక్షన్లూ టానిక్కులూ రాసి ఇచ్చాడు.

ఇంజెక్షన్లు పని చేశాయి. విశ్రాంతి కూడా పనిచేసిందేమో? కిష్టయ్య మంచంలో లేచి కూచుంటే అందరి ముఖాలూ విప్పారినై.

‘‘బంగారుగుడ్లు పెట్టే కోడి చావలేదని ఎంత సంతోషం!’’ అనుకున్నాడు కిష్టయ్య.

కాస్త ఆరోగ్యం కుదుటపడగానే కిష్టయ్యకు ఏమీ చెయ్యకుండా ఉండటం దుర్భరమనిపించింది. అధమం ఏదన్నా చదువుదామనుకున్నాడు. అనసూయ ఆఖరు కొడుకు కనిపిస్తే వాణ్ని పిలిచి, ‘‘చదువుకునేందుకు ఏదన్నా పట్రారా?’’ అని అడిగాడు.

వాడు వెళ్లి ఏదో పత్రిక తెచ్చి యిచ్చాడు. కిష్టయ్య పేజీలు తిరగేస్తూ, ‘‘వట్టి చెత్త! ఇహమూ, పరమూ లేని రాతలు!’’ అనుకున్నాడు. అకస్మాత్తుగా ఆయన దృష్టి కొన్ని పద్యాల మీద పడింది. పద్యాలకు ‘‘దుక్కిటెద్దు’’ అని శీర్షిక ఉంది. దాని కింద తన ఆఖరు కొడుకు పేరుంది.

‘‘వీడు తిక్కన సోమయాజి అని నేను ఎరగనే!’’ అనుకుంటూ కిష్టయ్య పద్యాలు చదవసాగాడు. పొలాల మొహం ఎరగని తన ఆఖరు కొడుకు దుక్కిటెద్దు గురించి పద్యాలు రాయటమేమిటి?

కాని కుర్రాడు, కిష్టయ్య అనుకున్నంత తెలివితక్కువవాడు కాడు. వాడు తానెరిగిన దుక్కిటెద్దు గురించే రాశాడు. ఆ దుక్కిటెద్దుకు జీవించటం చేతకాదు. తన కష్టసుఖాలను ఇంకొకరితో పంచుకోదు. ఇతరుల కోసం అస్తమానం శ్రమపడి వాళ్లను సోమరిపోతులను చేసి, వారంతా తనకు రుణపడి ఉన్నారని సంతోషిస్తుంది. వాళ్లు తనకు కృతజ్ఞత చూపటం లేదని మనసులో బాధపడుతుంది. ఆఖరుకు కోపం వచ్చి కొమ్ము విసరటం కూడా చాతగాని స్థితిలో పడి చావుకోసం ఎదురుచూడసాగుతుంది.

కిష్టయ్య ఆఖరు కొడుకు కొద్దిపాటి హాస్యధోరణిలో రాసిన అయిదు పద్యాల సారాంశమూ ఇంతే.

‘‘ఓరి పిడుగా!’’ అనుకున్నాడు కిష్టయ్య. కిష్టయ్యలో కొద్దిపాటి హాస్యం ఉంది. అదే తన కొడుక్కు కూడా సంక్రమించింది. 

అనసూయ గ్లాసులో పళ్లరసం తెచ్చింది.

‘‘ప్రతిపూటా నాకు పంచదార తక్కువవుతున్నది!’’ అంటూ గొణిగాడు కిష్టయ్య.

‘‘తక్కువైతే అడిగి వేయించుకోరాదూ?’’ అన్నది అనసూయ ఆశ్చర్యంగా.

‘‘అదే దుక్కిటెద్దు లక్షణం!’’ అన్నాడు కిష్టయ్య.

‘‘ఏమిటీ?’’ అన్నది అనసూయ, అయోమయంగా.

‘‘ఏం లేదులే! పిల్లల్నందర్నీ ఒకసారి పంపించు.’’

‘‘దేనికి?’’

‘‘దేనికేమిటి? పంపించమంటుంటే!’’

అనసూయ తల అడ్డంగా ఆడించి వెళ్లిపోయింది.

కాస్సేపటికి ఏడెనిమిది మంది పిల్లలు కిష్టయ్య గదిలోకి వచ్చి కుక్కిన పేలల్లే నిలబడ్డారు.

‘‘చదవండి, నా వెంట!’’ అంటూ ‘‘దుక్కిటెద్దు’’ పద్యాలు వాళ్ల చేత చదివించాడు. వాళ్లు మొదట బెరుకు బెరుకుగా చదివారుగాని రాను రాను గొంతులు హెచ్చినై.

తండ్రి పంచదార కావాలని అడిగినమాట మరచిపోయిన అనసూయ తిరిగి జ్ఞాపకం తెచ్చుకుని పంచదారసీసా, చంచా పట్టుకుని వచ్చేసరికి కిష్టయ్య గది వీధిబడిలాగా ఉంది. పిల్లలంతా కప్పెగిరిపోయేట్టు తాతవెంట పద్యాలు చదువుతున్నారు. పళ్లరసం గ్లాసు పక్కనే బల్లమీద ఖాళీగా పెట్టి ఉంది. దాని అడుగున చంచాడు పంచదార కరిగీ కరగకుండా మిగిలి ఉన్నది.

‘‘పంచదార చాలా ఎక్కువేశావ్‌!’’ అన్నాడు కిష్టయ్య అనసూయకేసి చూడకుండానే.


(సాక్షి సాహిత్యం: 2018 డిసెంబర్‌ 17)



 

Thursday, September 5, 2024

A Table is a Table


Peter Bichsel


పెద్దవాళ్లను ఉద్దేశించినట్టుగా కనబడే పిల్లల కథలు రాయడం పీటర్‌ బిక్సెల్‌ ప్రత్యేకత. ఈయన 1935లో స్విట్జర్లాండ్‌లో జన్మించారు. ఉపాధ్యాయుడిగానూ, పాత్రికేయుడిగానూ పనిచేశారు. ఆధునిక జర్మన్‌ సాహిత్యానికి ప్రతినిధి. ఇది ఆయన 1969లో రాసిన ‘ఎ టేబుల్‌ ఈజ్‌ ఎ టేబుల్‌’ కథాసారం. దీన్ని Lydia Davis ఇంగ్లీష్‌లోకి అనువదించారు. సౌజన్యం: The White Review మ్యాగజీన్‌. ఈ కథను షార్ట్‌ ఫిలింగా కూడా తీశారు. ఒక కథను, ముఖ్యంగా ఇలాంటి కథను ఎంత సమర్థవంతంగా తీయొచ్చో చెప్పడానికి అదొక ఉదాహరణ.  Vimeoలో ఉంది.

–––––––––––––––––


ఎ టేబుల్‌ ఈజ్‌ ఎ టేబుల్‌


ఒక్క మాట కూడా మాట్లాడటంలేని ఒక వృద్ధుడి కథ ఇది. ఆయనో చిన్న పట్టణంలో ఏ వీధి చివరో ఉంటుంటాడు. ఆయన్ని గురించి వర్ణించడానికి, మరొకరితో విడదీసి చూపేంత ప్రత్యేకమైన విశేషణాలేం లేవు. 

ఆయన గది, పై అంతస్తులో ఉంది. ఆయనకు ఒకప్పుడు పెళ్లయి ఉండొచ్చు, పిల్లలు కూడా ఉండిండొచ్చు, వాళ్లు వేరే పట్టణంలో ఉంటుండవచ్చు. 

ఆయన గదిలో రెండు కుర్చీలు, ఒక టేబుల్, ఒక కంబళి, ఒక మంచం, ఒక బీరువా ఉన్నాయి. చిన్న టేబుల్‌ మీద అలారం గడియారం, దాని పక్కన పాత న్యూస్‌పేపర్లు, ఒక ఫొటో ఆల్బమ్‌ ఉన్నాయి. గోడకు వేలాడుతూ ఒక అద్దం, ఒక పటం.

ముసలాయన ఉదయం, మధ్యాహ్నం నడకకు వెళ్తాడు, దారిలో ఇరుగుపొరుగుతో పొడిగా మాట్లాడుతాడు, సాయంత్రం టేబుల్‌ దగ్గర కూర్చుంటాడు. ఈ దినచర్యలో ఏ మార్పూ ఉండదు. ఆదివారాలు కూడా మారదు. ఆయన టేబుల్‌ దగ్గర కూర్చున్నప్పుడు గడియారపు టిక్‌టిక్‌ శబ్దం వినబడుతుంది. గడియారం ఎల్లప్పుడూ టిక్‌టిక్‌మంటూనే ఉంటుంది.

ఎప్పుడైనా ఒక ప్రత్యేకమైన రోజు వస్తుంది. చక్కటి పొద్దుపొడుపు, పక్షుల కిలకిలారవాలు,  స్నేహపూరిత మనుషులు, ఆడుకునే పిల్లలు– ఉన్నట్టుండి ముసలాయన వీటన్నింటినీ ఇష్టపడటం మొదలుపెడతాడు.

ఆయన నవ్వుతాడు. ఇక అంతా మారిపోతుందని తలపోస్తాడు. 

చొక్కా పై గుండీ తీసి, టోపీ చేత పట్టుకుని, వేగం పెంచి ఉత్సాహంగా నడుస్తూ సంతోషంగా కనబడతాడు. ఆయనుండే వీధిలోకి మళ్లి, పిల్లలకు అభివాదం చేసి, ఇంటి ముందుకొచ్చి, మెట్లు ఎక్కి, జేబులోంచి తాళంచెవి తీసి, గది తలుపు తెరుస్తాడు.

కానీ గదిలో ఏమీ మారలేదు. అదే టేబుల్, అవే రెండు కుర్చీలు, అదే మంచం, కూర్చుంటే అదే టిక్‌టిక్‌ ధ్వని. ఆయన సంతోషం ఆవిరైపోతుంది. ఏమీ మారలేదు.

ఆయనకు కోపం వస్తుంది. అద్దంలో చూసుకుంటాడు, ముఖం ఎర్రబారి ఉంటుంది. పిడికిలి బిగించి టేబుల్‌ మీద గుద్దుతాడు. ముందొకటే గుద్దు, తర్వాత ఇంకొకటి, తర్వాత ఇంకా ఇంకా గుద్దుతూ అరుస్తాడు, ‘ఇది మారి తీరాలి, ఇది మారి తీరాలి’.

ఆ కాసేపు మాత్రం గడియారం టిక్‌ టిక్‌ శబ్దం వినిపించదు. 

చేయి నొప్పెట్టి, గొంతు పోయి ఆగినప్పుడు, మళ్లీ గడియారం శబ్దం వినిపిస్తుంది. ఏమీ మారలేదు.

‘ఎప్పుడూ అదే టేబుల్, అవే కుర్చీలు, అదే మంచం, అదే పటం. నేను టేబుల్‌ను టేబుల్‌ అనే అంటాను, మంచాన్ని మంచం అనే అంటాను, కుర్చీని కుర్చీ. ఇలాగే ఎందుకు? ఫ్రెంచ్‌వాళ్లు టేబుల్‌ను తబ్లే అంటారు, కుర్చీని షెజ్‌ అంటారు, అయినా ఒకరిది ఒకరికి అర్థమవుతుంది.

మంచాన్ని పటం అని ఎందుకు అనకూడదు?’ ఈ ఆలోచన రాగానే ముసలాయన చిన్నగా నవ్వుతాడు, తర్వాత బిగ్గరగా, ఇంకా పెద్దగా నవ్వుతూనే ఉన్నాడు, పక్కనున్నవాళ్లు తలుపు కొట్టి, ‘నిశ్శబ్దం’ అని చెప్పేదాకా.

‘ఇప్పుడు మారుతుంది, ఇప్పటినుంచీ మంచం, పటం అవుతుంది’ అని అరిచాడు.

‘నేను అలసిపోయాను, పటంలో పడుకోవాలి’ అనుకుంటాడు. ఉదయాలు ఆయన చాలాసేపు అలా పటంలో పడుకునివుండేవాడు. పేరు మార్చుకున్న కుర్చీలో ముఖం చూసుకునేవాడు. ఇక కుర్చీకి ఆయన గడియారం అని పేరుపెట్టాడు.

అతడు మంచంలోంచి లేచి, బట్టలు వేసుకుని, గడియారం మీద కూర్చుని, చేతుల్ని టేబుల్‌ మీద ఆన్చుతాడు. కానీ టేబుల్‌ను ఇప్పుడాయన టేబుల్‌ అనడం లేదు, కంబళి అంటున్నాడు.

అంటే, ఉదయాన్నే అతడు పటంమీంచి లేచి, బట్టలు వేసుకుని, కంబళి దగ్గర గడియారం మీద కూర్చుని, మార్చాల్సిన పేర్ల గురించి ఆలోచిస్తాడు.

అద్దానికి ఆయన కుర్చీ అని పెట్టాడు.

వార్తాపత్రికను ఆయన మంచం అన్నాడు.

గడియారాన్ని ఫొటో ఆల్బమ్‌ అంటున్నాడు.

బీరువాను వార్తాపత్రిక అంటున్నాడు. 

కంబళిని బీరువా అంటున్నాడు. 

పటాన్ని టేబుల్‌ అంటున్నాడు. 

ఫొటో ఆల్బమ్‌ను అద్దం అంటున్నాడు.

అంటే:

ఉదయం కాగానే ముసలాయన చాలాసేపు పటంలో పడుకునివుంటాడు, తొమ్మిదింటికి ఫొటో ఆల్బమ్‌ మోగుతుంది, ఈయన లేచి కాళ్లకు చలేయకుండా బీరువా మీద కాళ్లు ఆన్చుతాడు, తర్వాత వార్తాపత్రికలోంచి బట్టలు తీసి వేసుకుంటాడు, గోడ మీద ఉన్న కుర్చీలో ముఖాన్ని చూసుకుంటాడు, కంబళి దగ్గర గడియారం మీద కూర్చుని అద్దాన్ని తిరగేస్తూ వాళ్లమ్మ టేబుల్‌ దగ్గర ఆగుతాడు.

ముసలాయనకు ఇది సరదా అనిపించింది. ఈ మాటల్ని రోజంతా కంఠస్తం చేస్తాడు. ప్రతిదీ పేరు మార్చకుంది. ఇంక ఆయన మనిషి కాదు, కాలు. కాలు అంటే ఉదయం. ఉదయం అంటే మనిషి.

ఇంక ఈ కథను మీకు మీరే రాసుకోవచ్చు. ముసలాయన లాగే మీరు కూడా పదాల్ని మార్చుకోవచ్చు.

మోగడం అంటే ఎక్కడం. 

చలేయడం అంటే చూడటం. 

పడుకోవడం అంటే మోగడం. 

నిల్చోవడం అంటే చలేయడం. 

ఎక్కడం అంటే తిరగేయడం.

అప్పుడు కథ ఇలా సాగుతుంది: 

మనిషి అయినా, ముసలి కాలు పటంలో చాలాసేపు మోగుతాడు. తొమ్మిదింటికి ఫొటో ఆల్బమ్‌ ఎక్కుతుంది. కాలు చల్లబడి, ఉదయం చూడకుండా ఉండటానికి బీరువాను తిరగేస్తాడు.

ముసలాయన తనకోసం కొన్ని నీలిరంగు స్కూలు నోటు పుస్తకాలు కొని, ఈ కొత్త పదాలన్నింటినీ రాస్తూపోయాడు. ఇదింక ఆయనకు తీరికనేది లేకుండా చేసింది. ఇప్పుడాయన వీధుల్లో ఎప్పుడోగానీ కనబడటం లేదు.

ఆయన ప్రతి కొత్త పదాన్ని కంఠస్తం చేస్తూ పోయాడు. ఈ కొత్త పదాలు నేర్చుకున్నకొద్దీ అసలు మాటలు మర్చిపోవడం మొదలైంది. దాంతో ఆయన ఒక్కడికే చెందిన ఒక ప్రత్యేకమైన భాష రూపొందింది.

కొన్నిసార్లు ఆయన ఈ కొత్త భాషలోనే తన కలలు కనేవాడు, తను విద్యార్థిగా చదువుకున్న ∙పాటలను ఈ కొత్తభాషలోకి అనువదించేవాడు, వాటిని తనకోసం తాను నెమ్మదిగా పాడుకునేవాడు.

కానీ త్వరలోనే ఈ అనువదించడం కూడా కష్టమైపోయింది. తన పాత భాషను దాదాపుగా మర్చిపోయాడు. ఒక్కోసారి సరైన మాట కోసం తన పాత నీలిరంగు నోటు పుస్తకాల్లో వెతకాల్సి వచ్చేది. ఎవరితోనైనా మాట్లాడాల్సి వచ్చినా ఇబ్బంది పడేవాడు. వాళ్ల మాటల్ని పోల్చుకోవడానికి చాలాసేపు ఆలోచించాల్సి వచ్చేది.

ఆయన పటాన్ని జనం మంచం అంటున్నారు.

ఆయన కంబళిని జనం టేబుల్‌ అంటున్నారు.

ఆయన అలారం గడియారాన్ని జనం కుర్చీ అంటున్నారు. 

ఆయన మంచాన్ని జనం వార్తాపత్రిక అంటున్నారు.

ఆయన కుర్చీని జనం అద్దం అంటున్నారు.

ఆయన ఫొటో ఆల్బమ్‌ను జనం అలారం గడియారం అంటున్నారు.

ఆయన వార్తాపత్రికను జనం బీరువా అంటున్నారు.

ఆయన బీరువాను జనం కంబళి అంటున్నారు.

ఆయన టేబుల్‌ను జనం పటం అంటున్నారు.

ఆయన అద్దాన్ని జనం ఫొటో ఆల్బమ్‌ అంటున్నారు.

దీంతో ఇది ఎక్కడిదాకా వెళ్లిందంటే, జనం మాట్లాడేది వింటే ఆయనకు నవ్వు రావడం మొదలైంది. ఎవరైనా, ‘నువ్వూ రేపు ఫుట్‌బాల్‌ చూడటానికి వస్తున్నావా?’ అంటే నవ్వొచ్చేది. ‘రెండు నెలలుగా వానలు పడుతూనే ఉన్నాయి’ అన్నా, ‘అమెరికాలో మా అంకుల్‌ ఉన్నాడు’    అన్నా ఆయనకు నవ్వాగేది కాదు.

వాళ్లు మాట్లాడేది ఏదీ అర్థం కాక ఆయనకు నవ్వు వచ్చేది.

కానీ ఇది సరదా కథ కాదు.

ఇది విషాదంగా మొదలై విషాదంగానే ముగుస్తుంది.

జనం మాట్లాడేది ముసలాయనకు ఏమీ అర్థమయ్యేది కాదు. ఇందులో అంత బాధపడవలసింది ఏమీలేదు, కానీ ఈయన మాట్లాడేది కూడా జనానికి అర్థమయ్యేది కాదు.

దాంతో ఆయన ఏమీ మాట్లాడేవాడు కాదు.

అతడు మౌని అయిపోయాడు,

తనతో తానే మాట్లాడుకుంటూ. 

(సాక్షి సాహిత్యం: 2018 ఆగస్ట్‌ 6)




 

Monday, September 2, 2024

పాలగుమ్మి పద్మరాజు: కూలిజనం

 


పాలగుమ్మి పద్మరాజు


పాలగుమ్మి పద్మరాజు (1915–1983) కథ ‘కూలిజనం’ సంక్షిప్త రూపం ఇది. దీని తొలి ప్రచురణ 1944లో ఆంధ్రపత్రికలో. సౌజన్యం: కథానిలయం. గాలివాన, పడవ ప్రయాణం, పద్మరాజు ప్రసిద్ధ కథల్లో కొన్ని. బతికిన కాలేజీ, నల్లరేగడి, రామరాజ్యానికి రహదారి, రెండో అశోకుడి మూణ్నాళ్ల పాలన, ఆయన నవలలు. సినిమా రచయితగానూ పనిచేశారు. ‘లోకం ఉండవలసినట్టుగానే ఉంది! నడవవలసినట్టుగానే నడుస్తోంది’ అని చెప్పే కథ ఇది.

––


కూలిజనం


ఈవేళో రేపో కాలవ తెరుస్తారు. తవ్వు ఇంకా పూర్తికాలేదు. కంట్రాక్టరు కోప్పడతాడు. ఇంకా చిన్న గుంట దగ్గర ఓ వంద గజాల మేర కాలవ తవ్వి గట్టు బాగు చెయ్యాలి. దొరికినంతమంది కూలీలను రాత్రి రాత్రి పోగుచేశాను. పనికాకపోతే కంట్రాక్టు డబ్బు ప్రభుత్వం వారు ఇవ్వరు.

ఎండిన కాలవ నీటికోసం దాహంగా ఉంది. ఇరుగట్లనీ పరువుకొచ్చిన మామిడికాయలు గుత్తులుగా వేళ్లాడుతున్నాయి. అప్పుడే తెల్లవారినా, రాబోయే గాడుపు వేడిగా సూచనగా తగులుతోనే ఉంది. కాలవ మధ్యని నీటిచెలమలో తప్ప కనుచూపు మేరలో నీరు లేదు.

నేను గట్టు మీద కూర్చుని నీరసంగా కూలివాళ్లని హెచ్చరిస్తున్నాను. ఎంత తొందరపెట్టినా మెల్లగానే పారలు వేసి తవ్వుతున్నారు. ఆడకూలీలు మెల్లగా తట్టలు నెత్తిమీద ఎత్తుకుని గట్టు తెగిపోయిన చోట పోస్తున్నారు. 

కూలివాళ్ల నల్లటి దేహాల మీద చెమట నిగనిగ మెరుస్తోంది. వాళ్ల కండలకి ఆ తడి ఓ వింతమెరుపు నిచ్చింది. ఆడ మగ మెల్లగా కబుర్లు చెప్పుకుంటో పని చేస్తున్నారు. బొద్దుమీసాల పెద్దవాడు అందరిలోకి సోమరిపోతు. అతని పేరు సత్తిరెడ్డి. కాని తెలివయిన వాడు. అతని కబుర్లలో పడి అంతా పని మరచిపోతారు. పావుగంట కొకసారి గునపం పాతుతుంటాడు. కాని బలమయినవాడు. పద్దెనిమిదేళ్ల పిల్ల అతను తవ్విన మట్టిబెడ్డలు తట్టలో వేసుకుంది. ఒక క్షణం అతని మాటలు వింటో నవ్వింది. తట్ట ఎత్తుకు వెళ్లిపోయింది. ఆమె పేరు రత్తి. తరవాత ముప్ఫయియేళ్ల పడుచు వచ్చింది. ఆమె పేరు చెల్లమ్మ.

‘‘యెయ్యి పిల్లా! సూడకు’’ అన్నాడు మీసాల పెద్ద.

‘‘నువ్వు పాడు’’ అంది ఆమె.

పొద్దు ముదురుతోంది. కూలివాళ్ల సంభాషణ రోదలాగ వినబడుతోంది. రత్తి కిచకిచ నవ్వుతోంది. ఆమె మొగుడు కుర్రతనపు గర్వంతో తవ్వుతున్నాడు. బూతుపాటలు పాడుతున్నాడు. అతన్ని ముసలయ్య అంటారు. ఏభయి ఏళ్ల గడ్డపు ముసిలి పద్దాలు వాళ్ల ఊళ్లో మావుళ్లమ్మ మహత్తు వర్ణిస్తున్నాడు.

ఎండ ముదురుతోంది. నేను కాలవగట్టు మీద నించి లేచి పక్కనే ఉన్న కరణంగారి ఇంటి అరుగు మీద కూర్చున్నాను. తాటాకు చూరు కింద పెద్ద వరికంకెల గుత్తి వేళ్లాడుతోంది. పిచికలు పక్కని ఏటవాలుగా వాలి గింజలు తింటున్నాయి. అరుగు ముందు చింతచెట్టు కింద ఆవు సగంనిద్రతో నిలబడి ఉంది. ముసిలి పద్దాలు చెపుతున్నాడు.

‘‘సంబరం నాడు పోతుని బలేత్తారు. ఒక్క యేటకి తల తెగెపోవాల. తప్పితే గండమన్నమాట. నెత్తురంతా పెద్ద మూకుళ్లో పడతారు.’’

పని అంతకంతకి వడి తగ్గింది. పొద్దు నడినెత్తికి ఎక్కుతోంది. ఊళ్లో జనసంచారం లేదు. కాకులు దాహంగా చెట్టుమీది నుంచి చెట్టుమీదికి ఎగురుతున్నాయి. చివరాకి మీసాలవాడు గునపం పాతి మళ్లీ పైకి ఎత్తలేదు. అంతా పని ఆపారు. గట్టు సగం అయింది. సత్తిరెడ్డి కాలవ దగ్గర ఒళ్లు కడుక్కుంటున్నాడు. రత్తి దగ్గరికి వెళ్లి నీళ్లిమ్మంది. అతను చేదతో నీళ్లు తీసి ఆమె ముఖం మీదికి చిమ్మాడు.

‘‘సచ్చినోడా’’ అంది రత్తి సరదాగా. రత్తి మొగుడు ముసలయ్య గుర్రుగా చూశాడు. సత్తిరెడ్డి నోట్లో నీళ్లు పోసుకున్నాడు. ‘‘థూ! ఉప్పనీల్లేసే’’ అని చీదరించుకున్నాడు. అంతా కాలవలో ఉన్న చెలమ దగ్గరికి పరుగెత్తారు.

ఒక గిన్నెలోనే రత్తీ, (ముసలయ్యా) తినడం మొదలుపెట్టారు. ఉప్పువేసిన గంజీ అన్నం, కక్కముక్కలు కొరుక్కుంటున్నారు. సత్తిరెడ్డి తన మూటలో ఉన్న ఊరగాయ అందరికీ కొంత కొంత పంచాడు. ఎక్కువభాగం రత్తికిచ్చాడు. చెల్లమ్మ సాభిప్రాయంగా చిరునవ్వు నవ్వింది. ముసలయ్య చెల్లమ్మ వేపు చూసి రత్తివేపు అనుమానంగా చూశాడు.

లోకమంతా ఏదో చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నట్టుగా దీనంగా ఉంది. నేను అరుగు మీద చాపమీద వెన్నువాల్చి ఏమీ చూడకుండా చూస్తున్నాను. కూలివాళ్లు తిని గిన్నెలు మెల్లగా కడుక్కున్నారు. ఆ గిన్నెలతోనే నీళ్లు సంతృప్తిగా తాగారు. చింతచెట్టు మొదట్లో చుట్టూ కూర్చున్నారు. తలగుడ్డల్లోంచీ, రొంటినించీ పొగాకు తీసి, కొంచెం నీళ్లతో తడిపి చుట్టలు చుట్టుకున్నారు.

పొద్దు తిరిగింది. కంగారుగా లేచి వాళ్లని హెచ్చరించాను. తొందరలేని స్థిమితంతో మెల్లగా లేచారు. తలపాగలు చుట్టుకున్నారు. నేలమీద తట్టలు ఎడమకాలితో లేవతన్ని ఎడమచేత్తో వంగకుండా పట్టుకున్నారు. తొందరలేని వేగంతో తవ్వు మళ్లీ ప్రారంభమయింది. మట్టిలో ఇసక పాలుంది. అంచేత పారలతో తవ్వవలసి వస్తోంది. సత్తిరెడ్డి గునపం పారేసి, తట్టల్లోకి పారలతో తవ్విపోస్తున్నాడు. తట్ట కాలితో వొడుపుగా రత్తి తన్ని పెట్టింది. యధాలాపంగా ఒక పార మట్టి రత్తి కాలి మీదకి సత్తిరెడ్డి విసిరాడు. తట్ట తన్నేసి చీదరగా కాళ్లు దులుపుకుంది. ముసలయ్య ఆవేపొక సారి చూశాడు.

పొద్దు వాలుతోంది. వాళ్ల తత్వాలని గురించి ఆలోచిస్తున్నాను. వాళ్లు చెయ్యాలంటే చేస్తారు. మనం తొందరపెట్టినా వాళ్లు తొందరపడరు. వాళ్లకి కాలం, తొందర అనేవి లేవు. అయినా వాళ్లకొక అంచనా ఉంది. పని అయిపోతుందని వాళ్లకి తెలుసు. అయిపోతుంది కూడాను. కాని వాళ్లు మన చేతుల్లో లేరు. మన అవసరాలన్నీ వాళ్ల చేతుల్లో కట్టుబడి ఉన్నాయి. వాళ్లకి మనం బానిసలం. వాళ్ల యెడల మన అంచనాలు పని చెయ్యవు.

చటుక్కుని ముసలయ్య తట్ట కుడిచేత్తో ఎత్తి రాక్షసిలాగ రత్తిమీద పడ్డాడు. తట్టతో నెత్తిమీద మోదాడు. చేతులతో కాసుకుంది. అంతా పని ఆపి ముసలయ్యని పట్టుకున్నారు. కోపంతో వణికిపోతో అన్నాడు, ‘‘సరసాలాడతంది నెంజ’’.

‘‘నేదండి బాబో! నేదండి’’ అని దీనంగా కంగారుగా సగం ఏడుస్తోంది రత్తి.

‘‘తోలు వొలిచేత్తాను’’ ముసలయ్య మళ్లీ విజృంభించబోయాడు. సత్తిరెడ్డి బలంగా అతన్ని పట్టుకున్నాడు. ‘‘ఏటబ్బా ఆ యిసురు? కూంత పరాసకాలాడితేనే అంత కోపమా? పారుచ్చుకో. పారుచ్చుకో. సందలడిపోతంది. రండల్లా రండి.’’ అంతా మళ్లీ పని ప్రారంభించారు. నా గుండెల్లో అదుటు పోలేదు. ఆమెను తరవాత ముసలయ్య ఏం చేస్తాడో.

గట్టు పూర్తి అయేసరికి పొద్దు కుంకింది. వెన్నెల కూడా వేడిగా వ్యాపిస్తోంది. గిన్నెల్లో మిగిలిన అన్నాలు మళ్లీ వాళ్లంతా తిన్నారు. నేను అనుమానంగా రత్తి వేపు చూస్తున్నాను. కూలీల్లో ఒకడు వచ్చి కొంత డబ్బు కావాలన్నాడు. అనుమానిస్తో ఇచ్చాను.

కరణం గారింట్లో భోజనం చేసి నేను వారిచ్చిన మంచం ఒకటి అరుగు పక్కని ఖాళీస్థలంలో వాల్చాను. గాలి కొంత చల్లబడుతోంది. కూలీలంతా ఎక్కడికో పోయారు. ముసలయ్య రత్తి ఎల్లాగ సమాధానపడతారో నని ఆందోళనగా పడుకున్నాను. ముసలయ్య ముఖంలో నాగరకతకు లొంగని పశుత్వం అప్పుడు చూశాను. రత్తిలో అసహాయమయిన దైన్యం చూశాను.

కూలీలు గొడవగా వచ్చారు. తాగి వచ్చారని గ్రహించాను. గట్టు మీద అల్లరి చిల్లరగా పడిపోయారు. ముసలయ్య తప్ప తాగాడు. రత్తీ బాగా తాగింది. ముసలయ్య పాట ప్రారంభించాడు. 

సింత కొమ్మల మీద సిరిబొమ్మ ఆడింది

పుంతలో ముసలమ్మ పురిటి కెల్లిందే

‘‘పురిటి కెల్లిందే’’ అంతా అందుకున్నారు. ఎవరికొచ్చింది వాళ్లు పాడారు. క్రమంగా గొంతుకలు సన్నగిల్లాయి. పాటలు ఆగిపోయాయి. 

నాకు మసగ్గా నిద్ర పడుతోంది. చటుక్కుని రెండు స్వరూపాలు ఏవో నడిచినట్టయింది. కళ్లు విప్పి కదలకుండా చూశాను. రెండు మూర్తులు ఒకళ్ల మీద ఒకళ్లు తూలుతూ నడుస్తున్నాయి. రత్తి. ముసలయ్య. ముసలయ్య రహస్యంగా అన్నాడు.

‘‘ఈ యరుగు మీద తొంగుందాం.’’

‘‘ఈ యెన్నిట్లోనే?’’

‘‘నడేశే’’ ఆమె నడుము పట్టుకున్నాడు. ఆమె తన్మయంగా అతని మీదికి వంగింది.

నేను మేలుకున్నాను. కాని కదలకుండా పడుకున్నాను. అతని ఈర్ష్య, కోపం, అంతా ఏమయింది? నాకా ప్రశ్న అర్థం కాలేదు కాని, నా మనస్సులో అనంతమయిన సంతృప్తి, ప్రశాంతి నిండుకున్నాయి. లోకం ఉండవలసినట్టుగానే ఉంది! నడవవలసినట్టుగానే నడుస్తోంది. నా కర్థం కాకపోతే మట్టుకు నష్టమేముంది? నాకు క్రమంగా నిద్ర పట్టింది.

ఏదో కలకలంతో మెలకువ వచ్చింది. కళ్లు నులుపుకుంటూ లేచి కూర్చున్నాను. కూలీలు హడావిడాగా తట్టలూ పారలూ గట్టుని పడేస్తున్నారు. కాలవలో అడుగుని సన్నగా నీటితడి ఆనింది. మనస్సు నిండిపోయినట్టయింది. చంద్రుడప్పుడే అస్తమించాడు. కూలీలు మళ్లీ నిద్రలో మునిగిపోయారు. అరుగుమీద చీకట్లో ఏమీ కనబడలేదు. కాని నాకు మాత్రం నిద్ర పట్టలేదు.


(సాక్షి సాహిత్యం; 2019 మార్చ్‌ 11)