Sunday, July 16, 2023

సినిమా మ్యూజింగ్స్‌

 అమాంతం కాకుండా కొంచెం కొంచెంగా ‘సినిమా మ్యూజింగ్స్‌’ పూర్తిచేశాను. అంతటి గాఢత అలాంటి విరామాన్ని కోరుతుంది. ఇంతకుముందు కొన్ని విడి పీసులుగా చదివినవే. అయినా పుస్తకంలో మళ్లీ కొత్తగా చదువుతున్నట్టే అనిపించింది. కొన్నాళ్లుపోయాక మళ్లీ చదివినా ఇవి ఇంతే ఫ్రెష్షుగా ఉంటాయనుకుంటాను. క్లాసిక్‌ మెటీరియల్‌కు మాత్రమే ఇలాంటి పొటెన్షియల్‌ ఉంటుంది. తనకు నచ్చిన సినిమాల ఆధారంగా జీవితపు లోతునూ, విస్తృతినీ, సంక్లిష్టతనూ అద్భుతమైన వచనంతో దర్శింపజేశాడు స్వరూప్‌.( Swaroop Thotada ) పేరుకు సినిమా వ్యాసాలేగానీ, మన లోపలి సంచలనాలకు అనుగుణంగా కొత్త కిటికీలు తెరవగలిగే పుస్తకం ఇది.

(Posted in fb on 12th July, 2023)




Sunday, June 25, 2023

బైండింగు: పుస్తక మర్యాద


 

పుస్తక మర్యాద


ఒక పుస్తకాన్ని చదవడం వేరు, ఆ పుస్తకాన్ని అపురూపంగా చూడటం వేరు. చాలామంది పుస్తకాలను అమర్యాదగా చదువుతారు. అంతే సమానంగా వాటిపట్ల అజాగ్రత్తగా ఉంటారు. పుస్తకాలను వాటి మర్యాదకు తగినట్టుగా గౌరవించడం కూడా ఒక సంస్కృతి! పుస్తకం పేజీలు తీయడం కూడా కొందరు సుతారంగా తీస్తారు; పేజీలు నలగకుండా దాన్నొక పువ్వులా హేండిల్‌ చేస్తారు. కొందరు నీటుగా బుక్‌ మార్క్స్‌ సిద్ధం చేసుకుంటారు. కొందరు చదవడం ఆపిన చోట పేజీ కొసను చిన్నగా మలుచుకుంటారు. ఇక కొందరి పుస్తకం చదవడం పూర్తయ్యేసరికి ఒక బీభత్సం జరిగివుంటుంది. అలాగని పుస్తకం చదువుతూ రాసుకునే నోట్సు దీనికి భిన్నం. అది పుస్తకంతో ఎవరికి వారు చేసుకునే వ్యక్తిగత సంభాషణ. కొందరు కేవలం అండర్‌లైన్‌ చేసుకుంటారు. కొందరు పుస్తకం చివర నచ్చిన పేజీ తాలూకు నంబర్‌ వేసుకుని దానికి సంబంధించిన వ్యాఖ్యో, పొడి మాటో రాసుకుంటారు. ఇలాంటివారికి పుస్తకంలో చివర వచ్చే తెల్ల కాగితాలు చాలా ఉపయుక్తం. పఠనానుభవాన్ని పెంపు చేసుకునేది ఏదైనా పుస్తకాన్ని గౌరవించేదే. అయితే, పుస్తకాన్ని గౌరవిస్తున్నారని చూడగానే ఇట్టే తెలియజేసే అతి ముఖ్యమైన భౌతిక రూప చర్య– దాన్ని బైండు చేయడం. ఈ బైండు చేయించడంలో, స్వయంగా తామే చేసుకోవడంలో కూడా ఎవరి అభిరుచి వారిది. అలాగే పుస్తక తరహాను బట్టి కూడా ఇది మారొచ్చు. అలాగే బైండింగుకు వాడే మెటీరియల్, అది చేసే పద్ధతులు కూడా చాలా రకాలు.æఏమైనా బైండింగు కూడా దానికదే ఒక కళ. అది కొందరికి బతుకుదెరువు అనేది కూడా ఒక వాస్తవమే. కానీ ప్రపంచంలో గొప్ప బైండింగు కళాకారుల పనితనాన్ని తెలియజేసే పుస్తకాలు కూడా కొన్ని చోట్ల ప్రదర్శనకు ఉన్నాయి. పుస్తకం లోపల వ్యక్తమయ్యే భావాలకు అనుగుణంగా దాన్ని తీర్చిదిద్దాలంటే ఆ బైండరు కూడా మంచి కళాకారుడు అయివుండాలి.

ఫ్యోదర్‌ దోస్తోవ్‌స్కీ నవల ‘ద పొసెస్డ్‌’లో జరిగే ఈ ఆసక్తికర సంభాషణ పుస్తకాల పట్ల ప్రపంచం ఇంకా ఎక్కడుందో తెలియజేస్తుంది. ఈ నవలకే వాటి అనువాదకులను బట్టి ‘డెమన్స్‌’, ‘డెవిల్స్‌’ అని మరో రెండు పేర్లున్నాయి. జీవితంలో ఎన్నో దెబ్బలు తిని, వాస్తవాల చేదును గ్రహించి, బండి బాడుగ కూడా ఇవ్వలేని స్థితిలో చివరకు తానే వదిలేసిన భర్త దగ్గరకు మళ్లీ చేరుతుంది మేరీ. బతకడానికి ఏదైనా మార్గం గురించి ఆలోచిస్తూ, ‘పోనీ పుస్తకాల బైండింగు చేస్తాను’ అంటుంది. అప్పుడు ఆమె భర్త, నవలలో అన్ని విధాలా సంయమనం కలిగిన మనిషి, ‘ఆదర్శాల్లోని’ నిగ్గును తేల్చుకున్న ఇవాన్‌ షతోవ్‌ ఆమె భ్రమలు తొలిగేలా ఇలా చెబుతాడు: ‘‘పుస్తకాలను చదవడం, వాటిని బౌండు చేయించడం అనేవి అభివృద్ధికి సంబంధించిన రెండు పూర్తి భిన్న దశలు. మొదట, జనాలు నెమ్మదిగా చదవడానికి అలవాటు పడతారు, దీనికి సహజంగానే శతాబ్దాలు పడుతుంది; కానీ వాళ్లు తమ పుస్తకాలను కాపాడుకోరు, వాటిని నిర్లక్ష్యంగా పడేస్తారు. పుస్తకాలను బౌండు చేయించడం అనేది పుస్తకాల పట్ల గౌరవానికి సంకేతం; అది ప్రజలు పుస్తకాలను చదవడానికి ఇష్టపడటమే కాదు, వాళ్లు దాన్ని ఒక ప్రధాన వృత్తిగా భావిన్నారని సూచిస్తుంది. రష్యాలో ఎక్కడా అలాంటి దశకు చేరుకోలేదు. యూరప్‌లో కొంతకాలంగా తమ పుస్తకాలను బైండింగ్‌ చేయిస్తున్నారు’’.
1871–72 కాలంలో రాసిన ఈ నవలలో, సాహిత్యం అత్యంత ఉచ్ఛస్థితిని అందుకొందనుకునే రష్యానే ఒక దేశంగా చదివే సంస్కృతిలో వెనుకబడి ఉందన్నట్టుగా రాశారు దోస్తోవ్‌స్కీ. ఇంక మిగతా దేశాల పరిస్థితి?

ఒక సమాజపు అత్యున్నత స్థితిని కొలవగలిగే ప్రమాణాలు అక్కడి కళలు, వాటి పట్ల జనాల వైఖరి మాత్రమే. దీనికి కూడా ఈ నవలలో దోస్తోవ్‌స్కీ ద్వారా సమాధానం దొరుకుతుంది. అప్పటి కాలానికి తనను తాను అభ్యుదయ రచయితగా భావించుకొనే పీటర్‌ వెర్కోవెన్‌స్కీ ఇలా ఆవేశపడతాడు: ‘‘బానిసల(సెర్ఫులు) దాస్య విమోచన కంటే కూడా షేక్‌స్పియర్, రఫేల్‌ అధికోన్నతులని నేను ఘోషిస్తున్నాను; జాతీయత కంటే అధికోన్నతులు, సామ్యవాదం కంటే అధికోన్నతులు, యువతరం కంటే అధికోన్నతులు, రసాయన శాస్త్రం కంటే అధికోన్నతులు, దాదాపు మానవాళి మొత్తంకంటే అధికోన్నతులు; ఎందుకంటే వాళ్లు ఇప్పటికే సమస్త మానవాళి సాధించిన ఫలం, నిజమైన ఫలం, బహుశా ఇంకెప్పటికీ సాధ్యం కానంతటి అత్యున్నత ఫలం!’’ అలాంటి ఒక కళోన్నత స్థితి లేని సమాజంలో తాను జీవించడానికి కూడా సమ్మతించకపోవచ్చునంటాడు వెర్కోవెన్‌స్కీ. ఇది ఆర్ట్‌ అనేదానికి అత్యున్నత స్థానం ఇచ్చే సాంస్కృతిక కులీనుల అతిశయోక్తి మాటలా కనబడొచ్చు. కానీ కళ అనేదాన్ని మినహాయిస్తే మన జీవితాల్లో మిగిలేది ఏమిటి? మహాశూన్యం. గాఢాంధకారం. అందుకే తమ జీవితాల్లో ఏదో మేరకు కళను సజీవంగా నిలుపుకొన్నవాళ్లు అదృష్టవంతులు. అది తమకు నచ్చిన సీరియళ్లను ఒక పుస్తకంగా కుట్టుకోవడం, తమకు నచ్చిన పుస్తకాలను బైండు చేయించుకోవడం కూడా కావొచ్చు.

ఏ రూపంలో ఉన్న అతివాదాన్నయినా దాని మూలాలను, అది పాతుకుపోవడానికి దారితీసే పరిస్థితులను, ఒకప్పుడు తమ వర్గం వాడే అయినా కేవలం ఇప్పుడు ఆ వాదంలోంచి బయటపడ్డాడన్న కారణంగా చంపడానికీ వెనుకాడని మూక మనస్తత్వాన్ని–– ఒక శక్తిమంతమైన సూక్ష్మదర్శినిలో చూసినట్టుగా చిత్రించిన విషాదాంతంగా ముగిసే సామాజిక, రాజకీయ వ్యాఖ్యాన నవల ‘పొసెస్డ్‌’ కూడా బైండు చేసుకుని దాచుకోవాల్సిన పుస్తకం. అదే అనితర సాధ్యుడైన దోస్తోవ్‌స్కీ లాంటి రచయితకు ఇవ్వగలిగే ఉచిత మర్యాద!

(19-6-23)

Sunday, May 28, 2023

ఫ్యూచర్‌ లైబ్రరీ


 


భావి ఫలం


పాత కథే. కానీ కొత్త విషయానికి ప్రారంభంగా పనికొస్తుంది. చావు దగ్గరపడిన ఓ ముసలాయన ఎంతో శ్రద్ధగా మొక్క నాటడాన్ని చూసిన  బాటసారి నవ్వడం మనకు తెలుసు. అది ఎప్పటికి పెరిగేనూ, ఎప్పటికి కాసేనూ! ప్రతి పనినీ మన కోసమే చేయం. ముందు తరాలకు పనికొచ్చేట్టుగా చేస్తాం. అదే వాళ్ల పూర్వీకులుగా మనం ఇవ్వగలిగే కానుక! బాటసారిలో గౌరవం పెరిగేలా వృద్ధుడు ఇదే చెబుతాడు. సరిగ్గా ఇలాంటి భావనతోనే నార్వేలో ‘ఫ్యూచర్‌ లైబ్రరీ ప్రాజెక్ట్‌’ ప్రారంభమైంది. దీనికి శ్రీకారం చుట్టింది స్కాట్‌లాండ్‌కు చెందిన విజువల్‌ ఆర్టిస్ట్‌ కేటీ పేటర్సన్‌. ఈమె వయసు 41 ఏళ్లు.

ఈ భవిష్యత్‌ గ్రంథాలయ ప్రాజెక్టు 2014లో ప్రారంభమైంది. వందేళ్ల పాటు అంటే 2114 వరకూ కొనసాగుతుంది. ఒక్కో ఏడాదికి ఒక్కో రచయిత తన సరికొత్త అముద్రిత రచనను ఈ గ్రంథాలయానికి బహూకరిస్తారు. మొదటి రచనగా 2014 సంవత్సరానికి మార్గరెట్‌ అట్‌వుడ్‌ (కెనడా) తన ‘స్క్రిబ్లర్‌ మూన్‌’ సమర్పించారు. 2015కు డేవిడ్‌ మిషెల్‌(ఇంగ్లండ్‌) తన ‘ఫ్రమ్‌ మి ఫ్లోస్‌ వాట్‌ యు కాల్‌ టైమ్‌’ను ఇచ్చారు. 2016కు షివోన్‌(ఐస్‌లాండ్‌), 2017కు ఏలిఫ్‌ షాఫక్‌(టర్కీ) తమ రచనలు బహూకరించారు. 2018కి హాన్‌ కాంగ్‌(దక్షిణ కొరియా), 2019కి కార్ల్‌ ఊవ్‌ నాస్‌గార్డ్‌(నార్వే), 2020కి ఓసియన్‌ వువాంగ్‌(వియత్నాం) ఇచ్చారు. ఈ రచనలన్నీ ఆంగ్లంలోనే ఉన్నాయని కాదు, అలా ఇవ్వాలని కూడా లేదు. సౌకర్యార్థం శీర్షికల వరకు ఆంగ్లంలో అనువదించి ఉంచారు.

విశేషం ఏమంటే– ఇందులోకి చేరే ‘పుస్తకాలు’ ఏమిటో కేటీకి గానీ, ఈ లైబ్రరీని నిర్వహించడానికి నెలకొల్పిన ‘ద ఫ్యూచర్‌ లైబ్రరీ ట్రస్టు’కు గానీ తెలీదు. సాహిత్యానికి గానీ కవిత్వానికి గానీ అద్భుతమైన చేర్పు అయిన, భవిష్యత్‌ తరాల ఊహలను అందుకోగలిగే శక్తి సామర్థ్యాలున్న రచయితను ఆ సంవత్సరపు రచయితగా ఎంపిక చేసుకుంటారు. వారు అంగీకరించాక, అది రాయడానికి ఒక ఏడాదైనా పడితే, ఆ పూర్తయిన రాతపత్రిని నార్వేలో జరిపే ప్రత్యేక వేడుక ద్వారా స్వీకరిస్తారు. అందుకే 2021కి గానూ సిత్సి దాంగెరెంబ్గా(జింబాబ్వే) ‘నారిని అండ్‌ హర్‌ డాంకీ’ని 2022లో ఇచ్చారు. 2022 సంవత్సరానికి జుడిత్‌ షలన్‌స్కీ (జర్మనీ) ఈ జూన్‌లో అందజేస్తారు. ఆ రాతప్రతిని ప్రత్యేకమైన వస్త్రాల్లో చుట్టి, ఓస్లో ప్రజా గ్రంథాలయంలో ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన గదిలో ఉంచుతున్నారు. ఇవి వందేళ్ల తర్వాత ప్రచురితమవుతాయి. మరో విశేషం ఏమంటే, ఈ పుస్తకాలను అచ్చు వేయడానికే వెయ్యి చెట్లను ప్రత్యేకంగా అక్కడి నార్డ్‌మార్కా అటవీ ప్రాంతంలో పెంచుతున్నారు. ఈ వంద చేతిరాత ప్రతులను ఈ చెట్లతో తయారుచేసిన కాగితాలతో లిమిటెడ్‌–ఎడిషన్‌గా ప్రచురిస్తారు. అందుకే దీన్ని ప్రపంచపు అత్యంత రహస్య గ్రంథాలయం అని గార్డియన్‌ పత్రిక అభివర్ణించింది. అయితే వందేళ్ల పాటు వీటిని చదవకుండా పాఠకులకు దూరంగా ఉంచుతున్నారన్న విమర్శలు కూడా వచ్చాయి.

వందేళ్ల నాటికి ఈ ప్రాజెక్టును ప్రారంభించిన వాళ్లుగానీ, దీనికి పుస్తకాలు సమర్పించిన చాలామంది రచయితలుగానీ ఉండరు. మార్గరేట్‌ అట్‌వుడ్‌ వయసు 83 ఏళ్లు. అంతెందుకు, ఈ ప్రాజెక్టు రచయితలుగా పరిగణనలోకి వచ్చిన టోమాస్‌ ట్రాన్స్‌ట్రోమార్‌(స్వీడన్‌), ఉంబెర్టో ఎకో(ఇటలీ) ఇప్పటికే మరణించారు కూడా. ‘‘అప్పటికి దీర్ఘకాలంగా నిశ్శబ్దంగా ఉన్న నా గొంతుక ఉన్నట్టుండి, ఒక వందేళ్ల తర్వాత మేల్కొంటుందన్న ఆలోచనే చిత్రంగా ఉంది. ఆ కంటెయినర్‌ లోంచి ఆ పుస్తకంలోని మొదటి పేజీ తెరిచే ఇప్పటికింకా శరీరంగా రూపుదిద్దుకోని ఆ చేతికి ఆ గొంతుక ఏం చెబుతుంది?’’ అని ఉద్విగ్నంగా మాట్లాడారు మార్గరేట్‌ అట్‌వూడ్‌. ‘‘భవిష్యత్తులో ఎప్పుడో చదువుతారని ఆశిస్తున్న ఒక రాతప్రతిని రాయడమనే ఆలోచనే ఒక ఉత్తరం రాసి నదిలో వేయడం లాంటిది. అది ఎటు పోతుందో మనకు తెలీదు, ఎవరు చదువుతారో తెలీదు– ఆ కాలప్రవాహాన్ని విశ్వసించడమే’’ అన్నారు ‘ద బాస్టర్డ్‌ ఆఫ్‌ ఇస్తాంబుల్‌’, ‘ద ఫార్టీ రూల్స్‌ ఆఫ్‌ లవ్‌’ లాంటి నవలలు రాసిన ఎలిఫ్‌ షఫాక్‌. ఆమె ఇచ్చిన ‘ద లాస్ట్‌ టాబూ’ కాల ప్రవాహంలో ఏ మలుపులు తీసుకుంటుందో!

‘‘నేనెట్లాగూ మరో వందేళ్లు ఉండను. నేను ప్రేమించేవాళ్లు కూడా ఉండరు. ఈ కనికరం లేని వాస్తవం నా జీవితంలోని అత్యంత ముఖ్యమైన విషయం గురించి ఆలోచించేట్టు చేసింది. నేనెందుకు రాస్తాను? నేను రాస్తున్నప్పుడు ఎవరితో సంభాషిస్తున్నాను? ఆ తర్వాత నేను ఒక ప్రపంచాన్ని ఊహించాను, అక్కడ నేను ప్రేమించేవాళ్లు ఎవరూ ఉండరు. కానీ ఆ ప్రపంచంలో నేను బతికివుండగా కలిసిన నార్వేలోని చెట్లు ఇంకా ఉంటాయి. మనుషులకూ, చెట్లకూ మధ్య ఉన్న స్పష్టమైన ఈ అంతరం నన్ను తాకింది. ఈ ధ్యానం ఎంత తీవ్రమైనదంటే, మన నశించిపోయే జీవితాల అశాశ్వతత్వానికీ, విలువైన పెళుసుదనాల మన జీవితాలకూ నేరుగా కళ్లు తెరిపించింది’’ అంటారు దక్షిణ కొరియా రచయిత్రి హాన్‌ కాంగ్‌. ‘‘ఈ ఆలోచన అద్భుతం. ఇప్పటికింకా పుట్టని పాఠకులకు మన కాలం నుంచి వారి కాలానికి ఒక చిన్న పడవను పంపడమే ఇది’’ అన్నారు కార్ల్‌ ఓవ్‌ నాస్‌గార్డ్‌.

ఇప్పుడు పెరుగుతున్న ఈ చెట్ల నుంచి కాయనున్న పుస్తకాలను ఆరగించడానికి ప్రపంచంలోని ఏ మూలల్లో మనుషులు జీవం పోసుకోనున్నారో! వందేళ్ల తర్వాత ఏం జరుగుతుందో చూడాలని ఇప్పుడే కుతూహలంగా లేదూ!

22nd May 2023
Sakshi Edit Page

Thursday, May 25, 2023

ఆజన్మం ఆడియో బుక్‌


ఓ నెల రోజుల వ్యవధి, ఏడు సిట్టింగులు, మూడు ప్యాచప్‌ సిట్టింగులతో ఈ స్టోరీటెల్‌ ఆజన్మం ఆడియో బుక్‌ పూర్తయ్యింది. దీన్ని చదవడం దీనికిదే ఒక మంచి అనుభవం. 

#Storytel #Aajanmam

Link:

  ఆజన్మం ఆడియో బుక్‌

జేసీబీ ప్రైజ్‌


 


ఆంగ్లంలోకి ఎత్తిపోయాలి!


అవార్డు వచ్చిందే అత్యుత్తమ రచన కాకపోవచ్చు. అత్యుత్తమ రచనలన్నింటికీ అవార్డులు రాకపోవచ్చు. కానీ అవార్డు వచ్చింది సాధారణంగా మంచి పుస్తకమే అయివుండొచ్చు. ఒకవేళ ఈ వాక్యాలతో ఏమైనా విభేదించే అవకాశం ఉన్నా, అవార్డు వచ్చిన పుస్తకం ఎంతోకొంత ఆసక్తి కలిగింపజేస్తుందనే విషయంలో మాత్రం ఏ విభేదం లేదు. అవార్డు ఎంత పెద్దదైతే, అంత ఆసక్తి. ఆ భారీతనం వరుస సంవత్సరాలుగా ఇస్తుండటం వల్ల వచ్చిన ప్రతిష్ఠరూపంలో ఉండొచ్చు, లేదా పారితోషికం రూపంలో ఉండొచ్చు. ఏమైనా ప్రస్తుతం, ‘భారతదేశపు అత్యంత విలువైన సాహిత్య బహుమానం’గా ‘జేసీబీ ప్రైజు’ను పేర్కొంటున్నారు. అక్షరాలా ఈ పురస్కార విలువ పాతిక లక్షల రూపాయలు. గొప్ప భారతీయ రచనలను ఉత్సవం చేయాలనే ఉద్దేశంతో నెలకొల్పిన ‘ద జేసీబీ ప్రైజ్‌ ఫర్‌ లిటరేచర్‌’ ప్రత్యేకతలు ఏమంటే, ఇంగ్లిష్‌ రచనలకే బహుమానం ఇస్తున్నప్పటికీ, ఇంగ్లిష్‌ అనువాదాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం; ఇంకా ఆసక్తికరమైనది, ఒకవేళ అనువాద రచన బహుమానం గెలుచుకుంటే, అనువాదకులకు అదనంగా మరో పది లక్షలు ఇవ్వడం.

‘‘గతంలో ఒక కొత్త ఉర్దూ నవల విడుదలయ్యిందంటే– విద్యార్థులు, అధ్యాపకులు దాని గురించి చర్చించుకునేవాళ్లు. ఇప్పుడు, దానికొక అవార్డు వచ్చి కొంత పాపులర్‌ అయితే తప్ప ఎవరూ పట్టించుకోవడం లేదు. అదొక ధోరణిలా మారిపోయింది. విశ్వవిద్యాలయాలు ఒకప్పుడు జ్ఞానాన్ని సృష్టించేవి. ఇప్పుడవి కేవలం పంపిణీ చేస్తున్నాయి,’’ అంటారు ఉర్దూ నవలా రచయిత ఖాలిద్‌ జావేద్‌. 2022లో ‘ద ప్యారడైజ్‌ ఆఫ్‌ ఫుడ్‌’ నవలకుగానూ ఆయన ‘జేసీబీ ప్రైజ్‌’ను స్వీకరించారు. ‘నేమత్‌ ఖానా’ పేరుతో వచ్చిన ఈ ఉర్దూ మూల నవలను బరన్‌ ఫారూఖీ ఇంగ్లిష్‌లోకి అనువదించారు. ఖాలిద్‌ ఆవేదన ఉర్దూ సాహిత్య రంగం గురించినదే అయినప్పటికీ అది దేశంలోని అన్ని భాషలకూ వర్తిస్తుంది. అందుకే అవార్డులు, పురస్కారాలు అనేవి సాహిత్యంలో ఎంతోకొంత ఊపును సృష్టించగలుగుతాయి. వాటి పరిమితులను మినహాయిస్తే, అదొక సానుకూలాంశం. అందువల్లే వంటిల్లు నేపథ్యంలో జరిగే అధికార క్రీడనూ... కత్తులు, మంట వంటి ప్రమాదకర ఆయుధాలను కలిగివుండే చోటునూ చిత్రించిన ఖాలిద్‌ ఉర్దూ నవల విస్తృత పాఠకలోకంలో చర్చనీయాంశంగా మారగలిగింది.

నిర్మాణ పనుల్లో; తవ్వకం, ఎత్తిపోత, కూల్చివేతల్లాంటి పనుల్లో వాడే ‘జేసీబీ’ గురించి మనకు తెలుసు. ఈ జేసీబీ అనేదే ఆ యంత్రానికి ఒక పేరులా స్థిరపడిపోయిందిగానీ అది ఒక సంస్థ పేరు. ఇంగ్లండ్‌ వ్యాపారవేత్త జోసెఫ్‌ సిరిల్‌ బామ్‌ఫోర్డ్‌ (జేసీబీ) తన పేరుతోనే నెలకొల్పిన కంపెనీ ఈ జేసీబీ. 2018 నుంచి ఈ సంస్థ భారతీయ రచనలకు బహుమానాలు ఇస్తోంది. మార్చ్‌ నెలలో ఎంట్రీలను ఆహ్వానిస్తారు. ఏప్రిల్‌ 30 ఈ యేటి ఎంట్రీలు పంపడానికి ఆఖరి తేది. వారి వెబ్‌సైట్‌లో అన్ని వివరాలూ లభిస్తాయి. కథలు, కవిత్వ సంపుటాలు కాకుండా ‘యూనిఫైడ్‌ వర్క్‌’ మాత్రమే దీనికి పంపాలి. సాధారణంగా సెప్టెంబర్‌లో లాంగ్‌ లిస్ట్‌ విడుదలవుతుంది. అంటే వచ్చిన రచనల్లో తొలి వడపోతలో మిగిలిన పదింటిని ప్రకటిస్తారు. అక్టోబర్‌లో షార్ట్‌ లిస్ట్‌ వస్తుంది. అప్పటికి ఐదు నవలలు తుది పోటీలో ఉంటాయి. నవంబర్‌లో విజేతను ప్రకటిస్తారు. దీనికిగానూ ప్రతి యేటా ఒక స్వతంత్ర జ్యూరీ ఏర్పాటు అవుతుంది.

ఇప్పటికి మూడు సంవత్సరాలు ముగ్గురు మలయాళ రచయితలు ఈ బహుమానం గెలుచుకోవడం విశేషం. మలయాళ చిత్ర పరిశ్రమలాగే, మలయాళ సాహిత్యం కూడా వర్ధిల్లుతోందని చెప్పడానికి ఇదొక సాక్ష్యం. కాదు, మలయాళ సాహిత్యం వర్ధిల్లుతున్నందుకే మలయాళ చిత్రసీమ వర్ధిల్లుతున్నదని అనాలేమో! తన ‘జాస్మిన్‌ డేస్‌’ నవలకుగానూ బెన్యామిన్‌ 2018లో ‘జేసీబీ’ తొలి బహుమానాన్ని గెలుచుకున్నారు. దీన్ని షెహనాజ్‌ హబీబ్‌ ఆంగ్లంలోకి అనువదించారు. 2020 సంవత్సరానికి ‘ముస్టాష్‌’ నవలకుగానూ ప్రైజ్‌ గెలుచుకున్న ఎస్‌.హరీశ్‌ ఇటీవలి మలయాళ కళాఖండం అనదగిన సినిమా ‘నన్‌పగల్‌ నేరత్తు మయక్కమ్‌’(పగటి వేళ మైకం)కు రచయిత కావడం విశేషం. హరీశ్‌ తన నవలను ‘మీస’ పేరుతో తన మాతృభాషలోనే రాశారు. అది ఆయన తొలి నవల కూడా. 2021లో మరో మలయాళ నవల ‘ఢిల్లీ: ఎ సాలిలాకీ’ని కూడా ఈ ప్రైజ్‌ వరించింది. రచయిత ఎం.ముకుందన్‌. 2019లో ‘ద ఫార్‌ ఫీల్డ్‌’ నవలకుగానూ మాధురీ విజయ్‌ గెలుచుకున్నారు. ఈమె కర్ణాటకకు చెందినవారు. కానీ ఆంగ్లంలో రాస్తారు.

పేరుకు రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయిగానీ ఈ ఐదేళ్లలో ఏ ఒక్క తెలుగు పుస్తకం షార్ట్‌లిస్టు అటుండనీ, లాంగ్‌లిస్టులోకి కూడా రాలేదు. అసలు ఏ ఒక్కటైనా పోటీకి పంపారా అన్నదీ అనుమానమే. అంతకంటేముందు అసలు ఏ పుస్తకాలైనా ఇంగ్లిష్‌లోకి వెళ్తున్నాయా? పోనీ, వెళ్లాల్సినంతగా వెళ్తున్నాయా? అసలు మొత్తంగానే తెలుగు నవల భారతీయ పాఠకుల మనస్సులు గెలుచుకునేంత కళాత్మకంగా ఉంటోందా? ఉంటే, దాన్ని ఇంగ్లిష్‌లోకి చేర్చడంలో ఉన్న అడ్డంకులేమిటి? ఈ బహుమానం అనే కాదు, మన విలువను కట్టడానికి మరొకటైనా పరమ ప్రమాణం కాకపోవచ్చు. కానీ ఆ ‘గేమ్‌’లో మనం అసలంటూ ఎందుకు లేము? దక్షిణాది వరకే పరిమితం అవుతే– కన్నడ, తమిళం, మలయాళం అనగానే కొందరు రచయితల పేర్లయినా జాతీయ స్థాయిలో తెలుస్తాయి. అలా తెలిసే తెలుగు రచయితలు ఎవరున్నారు, ఎందరున్నారు? ఇలాంటివి జరగాలంటే ఎలాంటి సంస్థలు, వ్యవస్థలు చొరవ చూపాలి? ఇవన్నీ మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు. సావధానంగా జవాబులు వెతుక్కోవాల్సిన ప్రశ్నలు!

24th April 2023
Sakshi Edit Page