Monday, January 17, 2022

నిజంగానే నాకు మేలు జరుగుతుందా?


ఫొటో: చార్‌మినార్‌ లోపలి భాగం
 



 నిజంగానే నాకు మేలు జరుగుతుందా?


ఆఫీసుకు వస్తుంటే మెహిదీపట్నం దగ్గర్లో ఒకాయన లిఫ్ట్‌ కావాలన్నట్టుగా చేయెత్తాడు. ఆయన మాసాబ్‌ట్యాంక్‌ వైపు పోయేవాడు కాదని నిర్ధారించుకోవడానికి నేను బంజారాహిల్స్‌ వైపు పోతున్నానని చెప్పాను. ఎన్‌ఎండీసీ దగ్గర దింపితే చాలన్నాడు. ఎటువైపు పోయేదైనా ఫర్లేదన్నమాట.


ముస్లింగా ఉండటం వేరు; ముస్లిం అని తెలియడం వేరు. ఆ బట్టలూ, టోపీ ఆయన ఒక అస్తిత్వాన్ని తెలియజేస్తున్నాయి. నవ్వు ముఖం. యాభై దాటి ఉండొచ్చు. అసలే హెల్మెట్‌లో ఉన్నాను; ముక్కుకు అడ్డంగా కర్చీఫ్‌ కూడా కట్టుకున్నాను కాబట్టి, నా రూపురేఖ ఆయనకు తెలిసే అవకాశం లేదు. నా అస్తిత్వాన్ని నా ముఖం మీద ప్రకటించుకునేవాడిని కాదు కాబట్టి, నేనెవరై ఉంటానన్నది ఆయనకు తెలిసే అవకాశం లేదు. సరే, దగ్గరే కాబట్టి దింపాక ఆయన ‘షుక్రియా’ అని ఊరుకుంటే నాకిది రాయాలన్న ఆలోచన రాకపోయేది. ‘అల్లాహ్‌ మీకు మేలు చేస్తాడు’ అన్నట్టుగా ఇంకో వాక్యాన్ని కూడా జతచేశాడు.

పుట్టుకతో నేను హిందువును అయినప్పటికీ– దేవుడు, ఆధ్యాత్మిక ప్రశ్నల్ని వెతుక్కునే క్రమంలో అన్ని మతగ్రంథాలనూ కొద్దికొద్దిగానైనా చదవడానికి ప్రయత్నిస్తున్నాను. అట్లా ముస్లింల పవిత్ర గ్రంథం కూడా చదువుతున్నాను.

‘అల్లాహ్‌ దాస్యమే చేయాలనీ, ఆయనకే విధేయులై ఉండాలనీ మరియు కేవలం ఆయననే ఆరాధించాలనీ’ మానవజాతి అల్లాహ్‌కు ఇచ్చిన ప్రమాణం(అహ్‌ దుల్లహి) అంటుంది దివ్య ఖుర్‌ఆన్‌. ‘ప్రభూ! భూమిపై ఈ అవిశ్వాసులలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టకు’మని కోరుతుంది. ఈ విధేయత ప్రకటించనివారిని– నూహ్, ఆద్, సమూద్, అర్‌–రస్స్‌ లాంటి జాతులకు జాతుల్నే అంతం చేసినట్టుగా చెబుతుంది. ఎప్పుడో చరిత్రలో జరిగిపోయిన వివరం కాబట్టి, ఆ చావులన్నీ ఏకవాక్యాల్లోకి కుదించబడి ఉంటాయి. ‘ఎవరు అల్లాహ్‌ మార్గంలో తమ ఇండ్లను వదలి (వలస) పోయి, ఆ తరువాత చంపబడతారో లేదా మరణిస్తారో, వారికి అల్లాహ్‌ (పరలోకంలో) శ్రేష్ఠమైన ఉపాధిని ప్రసాదిస్తా’డంటుంది. ‘ఈ గ్రంథాన్ని తిరస్కరించేవారి వ్యవహారాన్ని నాకు వదిలెయ్యి; వారికి ఏమాత్రం తెలియనివిధంగా మేము వారిని క్రమేణా వినాశం వైపునకు తీసుకుపోతా’మంటుంది. దేన్నయినా అల్లాహ్‌ క్షమిస్తాడుగానీ, అల్లాహ్‌కు సాటిగా ఇంకో దేవుడిని నిలబెట్టడం క్షమించలేని మహాపాపం(షిర్క్‌) అంటుంది. ‘మీరు మరియు మీ రాళ్ళదేవతలు నరకాగ్నికి ఇంధనం అవుతా’రని హెచ్చరిస్తుంది.

అలాంటప్పుడు నాలాంటి వాడికి కూడా అల్లాహ్‌ మేలు చేస్తాడా? మరి ఆ లిఫ్టు తీసుకున్నాయన అలా అన్నాడేమిటి? వందల ఏళ్ల క్రితపు పుస్తకంలోని వాక్యాల్ని యధాతథంగా తీసుకోవడం దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం అవుతుందా? మరి ఎప్పుడో రాయబడిన మనుధర్మ శాస్త్రాన్ని మన మేధావులు వారంలో రెండుసార్లు తగలబెడుతుంటారే!

ఇది రాస్తున్నప్పుడు కొంతమంది ముస్లిం స్నేహితులు నా మనసులో మెదులుతున్నారు. వీళ్లను ఎంత ముస్లింలుగా లెక్కించాలి అనేది ఒక సమస్య. అంటే, నేను ఎంత హిందువునో వీళ్లు అంత ముస్లింలు అయివుండాలి. లేదా, నేను ఎంత హిందువును కాదో వాళ్లు అంత ముస్లింలు కాకపోయివుండాలి. ఇంకొక మతంలో ఉండటం అన్నది తప్పితే, వాళ్లు దాదాపుగా లేదా పూర్తిగా నాలాంటివాళ్లే. ఏ మతగ్రంథాలనైనా ఆ మతస్థులు విధిగా చదవకపోవచ్చు. అసలు మన ఉనికి కేవలం మన మతం కాకపోవచ్చు. పుట్టుక వల్ల మాత్రమే ఎవరైనా ఆ మతంలో ఉంటుండటం జరుగుతుండవచ్చు. మతగ్రంథాల వల్ల కాకుండా, మిగతా ఇంకేవో బయటి గాలులు పీల్చడం వల్లనే మనుషులం ఈ మాత్రం మనుషులుగా ఉన్నామనిపిస్తుంది. సమాజం ఉమ్మడిగా ప్రోది చేసుకుంటున్న విలువలు దాదాపుగా ఏ మతంవారికైనా వర్తిస్తాయి. కాబట్టే, మతాలన్నీ మంట గలిసినా మానవత్వానికి వచ్చే ప్రమాదం ఏమీ ఉండకపోవచ్చు. ‘మధువు తాగు, ఖురాను కాల్చు, మక్కాను కూల్చు, విగ్రహాలను పూజించు, మనిషిని మాత్రం హింసించకు’ అంటాడు ఫార్సీ కవి ఖాజా హఫీజ్‌. ఇంత ఉదారత ఈ హఫీజ్‌ చదివి ఉంటాడనుకుంటున్న గ్రంథంలో కనబడకపోయినా– మతాలు, వాదాల కంటే మనుషులే గొప్ప అని నమ్మేవాడిని కాబట్టి, లిఫ్టు తీసుకున్నాయన ఆశీర్వచనమే ఆయన నమ్మే గ్రంథానికంటే బలమైనది అనుకుంటున్నా.

(ఆధార గ్రంథాలు: 1.దివ్య ఖుర్‌ఆన్‌ సందేశం తెలుగు భాషలో; అను: డాక్టర్‌ అబ్దుర్‌–రహీమ్‌ బిన్‌ ముహమ్మద్‌ మౌలానా. 2. దివ్య ఖుర్‌ఆన్‌ భావానువాదం; అను: మౌలానా సయ్యద్‌ అబుల్‌ ఆలా మౌదూది, షేక్‌ హమీదుల్లా షరీఫ్‌.)

(Published in Saaranga on Jan 1, 2022)

Tuesday, January 11, 2022

మావాడు ఈదిన (అతడే ఒక) సముద్రం

 








అతడే ఒక సముద్రం పుస్తకం చదివి పెద్దోడు రాసిన అభిప్రాయం ఇక్కడ పోస్టు చేస్తున్నా. దీన్ని జూన్‌ 2021లో ఎఫ్బీలో షేర్‌ చేస్తూ పుస్తక అనువాదకుల్లో ఒకరైన రవి వీరెల్లి ఇలా రాశారు:

'అతడే ఒక సముద్రం' పుస్తకం చదివి 'శివ తాత్విక్ పూడూరి' ఈ వ్యాసాన్ని రాసాడు. ఒక్క వరుస కూడా వదలకుండా చేనుకు నీళ్లు కట్టినట్టు ఎంత నిదానంగా, ఎంత కుదురుగా కథ చెప్పాడో చూడండి.
శివ హైదరాబాద్ లో ఇప్పుడు ఏడవ తరగతి చదువుతున్నాడు. శివ వాళ్ళ నాన్న కూడా అప్పుడప్పుడు కథలు రాస్తాడు. 🙂
లవ్ యు శివ! ❤️

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

అతడే ఒక సముద్రం

ఈ అతడే ఒక సముద్రం పుస్తకాన్ని ఎర్నెస్ట్‌ హెమింగ్వే రాసాడు. హెమింగ్వే తనకి జరిగినవన్నీ కూడా కలిపి ఈ పుస్తకం రాసాడు. ఈ కథలో ఒక ముసలాయన ఉంటాడు. అతనికి ఒక బాబు పరిచయం. ఆ బాబు ఎప్పుడు ఈ ముసలాయన కోసం తినేటివి, ఇంకా కావలసినవన్నీ తెస్తూ ఉంటాడు. ఈ బాబుకు ముసలాయన పడవ నడపడం, చేపలు పట్టడం అన్నీ నేర్పిస్తాడు. ఎందుకంటే ఈ ముసలాయన ఒక మత్స్యకారుడు.
ఒకసారి మత్స్యకారుడు సముద్రంలోకి ఒక చేపను పడదామని వెళుతాడు. ముసలాయనకు ఒక పెద్ద చేప చిక్కుతుంది. దానితో అలా మూడు రోజుల దాకా గడుపుతాడు. ఈయన దాన్ని తమ్ముడుగా అది బతికినంత కాలం గడుపుతా ననుకుంటాడు. మధ్యలో అతనికి తెలుస్తుంది, అది ఒక మహా బ్లూ మార్లిన్‌. అది ఒక్కసారిగా పైకి దూకుతుంది. అప్పుడే ముసలాయన దాని వెన్నుముక్క దగ్గర గురిచూసి పంట్రకోలను గుచ్చుతాడు. దాన్ని ఇంకా రెండు సార్లు మళ్లీ కుచ్చి చంపేస్తాడు.
అతను అనుకుంటాడు: నేను స్వయంగా నా తమ్ముడిని చంపేసానే అని. కానీ ఏం చేసేది లేక దానికి ఉచ్చు బిగించి నోరును కట్టేసి తాడుతో దాన్ని పడవకు కట్టేసి బయలుదేరుతాడు.
వెళ్లేదారిలో అతను దాని ధర గురించి ఆలోచించుతాడు. కానీ అప్పుడే సొరచేప ముసలాయన పట్టిన బ్లూ మార్లిన్‌ తోకను కొరుకుతుంది. దాని వల్ల బ్లూ మార్లిన్‌ నుండి రక్తం కారుతుంది. ఇక ఆ రక్తం వల్ల ఇంకెన్ని సొరచేపలు వస్తాయో అని అనుకుంటాడు.
అప్పుడు అతను పంట్రకోలను పట్టకుని వచ్చిన ప్రతిదానిలోకి దాన్ని గుచ్చుతాడు. కానీ ఎంత చేసినా ఆ బ్లూ మార్లిన్‌ నుండి మాంసాన్ని తింటూనే ఉంటాయి. పాపం ఇక దానిలో సగం కన్నా తక్కువ భాగం మిగిలివుంది.
అతను తనకు తాను చెప్పుకుంటాడు: అవి నన్ను నాశనం చేయగలవు కానీ ఓడించలేవు అని.
తరువాత ఆ మిగిలిన భాగంతోనే తిరిగి వెళ్లిపోతాడు.
అక్కడ బాబు ముసలాయన కోసం వేడి వేడి కాఫీ పట్టుకొస్తాడు. తరువాత ముసలయాన పడుకుంటాడు. పిల్లాడు పడవ దగ్గరికి వెళతాడు. అంతే అప్పుడే అంతా జనం దాని చుట్టూ మూగి దాన్ని చూస్తారు.
పిల్లాడు ఇంటికి తిరిగివెళ్లి ముసలాయనతో మాట్లాడుతాడు. తరువాత ఆ ముసలాయన మళ్లీ నిద్రలోకి జారుతాడు. పిల్లాడు అలా అతని ముందు కూర్చుంటాడు.
–––– ––– ––– ––––
ఈ పుస్తకం వల్ల ఎర్నెస్ట్‌ హెమింగ్వేకు నోబెల్‌ బహుమతి అందుతుంది.

– పూడూరి శివతాత్విక్


--
1.. దీన్నే ఆగస్ట్‌ 2021 భూమిక మాసపత్రికలో పిల్లల భూమిక విభాగంలో పునర్ముద్రించారు.

2. తానా జనవరి 2022 సంచికలోనూ పునర్ముద్రించారు.

కొండవీటి సత్యవతి గారికీ, సాయి బ్రహ్మానందం గొర్తి గారికీ ధన్యవాదాలు.
 

3. ఎర్నెస్ట్‌ హెమింగ్వే ‘ది ఓల్డ్‌మాన్‌ అండ్‌ ద సీ’ నవలను అతడే ఒక సముద్రం పేరుతో తెలుగులోకి అనువదించినవారు రవి వీరెల్లి, స్వాతికుమారి.

 







Sunday, January 9, 2022

రియాలిటీ చెక్‌ మీద మా పెద్దోడి అభిప్రాయం








(పెద్దోడు రియాలిటీ చెక్‌ చదివి తన అభిప్రాయాన్ని ఇలా రాశాడు. పుస్తకంలోని పాత్రే లేచి నడిచొచ్చినట్టుగా ఉందని దీన్ని ఎఫ్బీలో జూన్‌ 2021లో పోస్టు చేసినప్పుడు రాశాను.)


రియాలిటీ చెక్‌ 

------------------


ఈ పుస్తకాన్ని రాసింది మా నాన్న పి.రాజిరెడ్డి. ఈ పుస్తకంలో చుట్టుపక్కవాళ్ల వ్యవహారం గురించి, ఇంకా మా నాన్న వాళ్లతో సంభాషించింది ఉంది. దీనిలో అరవై టాపిక్స్‌ ఉన్నాయి. వీటిలో కొన్ని బాధ కలిగించాయి, మరికొన్ని జాలి కలిగించాయి, ఇంకొన్ని నవ్వు కలిగించాయి. నాకు దీనిలో ‘‘హిజ్డాలతో ఒక ఆత్మీయ సంభాషణ’’, ఇంకా ‘‘ప్రతీక్‌ లేని ఇల్లు’’ చదివితే బాధ కలిగింది.

ఇంకా నాకు ‘‘స్కేరీ హౌజ్‌’’ నవ్వు కలిగించింది. అప్పటినుండి నేను నాన్నతో కలిసి అక్కడికి వెళదామని ఒక కోరిక కలిగింది. కానీ పన్నెండేళ్ల లోపు వాళ్లకు నో ఎంట్రీ. ‘‘లక్ష ప్రశ్నల ఉదయం’’ చదివితే నాకు నేను ఇలా ఇన్ని ప్రశ్నలు అడిగానా అనిపించింది.

వీటికోసం మా నాన్న కొన్ని చోట్లకెళ్లి, అక్కడి వాటిని చూసి, దానిలోని చెప్పదలచింది, దానిలోని బాధను, ఇంకా వాటి కష్టాల్ని గురించి తెలిపారు.

నాకు ముందుగా కొన్ని టాపిక్స్‌ అర్థం కాలేవు. కానీ చదువుతుండగా నాకు అవి అర్థం అయ్యాయి. 

నాకు ముందు ఈ పుస్తకం ముందున్న ఫొటో అర్థం కాలేదు. కానీ తరువాత అదే రియాలిటీ అని తెలిసింది.

రియాలిటీ చెక్, అబ్బా! రియాలిటీ చెక్కే! 



 

Friday, January 7, 2022

2021లో చూసిన సినిమాలు



ఈ సంవత్సరం చదివిన పుస్తకాలు అని ఇచ్చేంత జాబితా లేదు. కానీ ఒకట్రెండేళ్లుగా మళ్లీ సినిమాల మీద ఆసక్తి పెరిగి బాగానే చూస్తున్నా. అంటే, అంతకుముందు ఇప్పుడు పుస్తకాల మీదున్న అనాసక్తి లాంటిది సినిమాల మీద ఉండింది. అయితే, ఇప్పుడు సినిమాల మీదున్న ఆసక్తి లాంటిది తిరిగి పుస్తకాల మీద కలగాలన్న ఆశ అయితే బలంగా ఉంది.

చూసినవాటిని డైరీ వెనకాల వరుసగా తేదీలు వేసి రాసుకుంటాను కాబట్టి, ఈ జాబితా తయారు చేయడానికి పెద్ద సమయమేమీ పట్టలేదు. తేదీలు మినహాయించి అదే వరుసలో ఈ సంవత్సరం చూసిన సినిమాలు:
(ప్రతిదానికీ కామెంట్‌ రాయలేదు. టైప్‌ చేస్తున్నప్పుడు ఏం తోచిందో అదే పక్కన రాశానంతే. ఈ నాలుగైదు రోజుల్లో ఏమన్నా చూస్తే కామెంట్లో యాడ్‌ చేస్తా. ఉచ్చారణల్లో లోపాలను సవరించవచ్చు.)

1. సెన్స్‌ అండ్‌ సెన్సిబిలిటీ
2. మ్యాగ్నోలియా
3. అమ్మా ఆరియన్‌(జాన్‌ అబ్రహాంతో ఇదే పరిచయం.)
4. మైండ్‌స్పేస్‌ గైడ్‌ టు మెడిటేషన్‌(యానిమేషన్‌ ఇంత బాగా చేయొచ్చా!)
5. ఎపిలోగ్‌(టామ్‌ టిక్వెర్‌ షార్ట్‌ ఫిలిం)
6. ఆరిరంగ్‌(పోయినేడాది ఇదే డిసెంబర్లో చనిపోయిన సౌత్‌ కొరియా దర్శకుడు కిమ్‌ కి డుక్‌కు నివాళిగా చూశాను.)
7. వైట్‌ టైగర్‌
8. ఏకే వర్సెస్‌ ఏకే
9. రెయిజ్‌ ద రెడ్‌ లాంటెర్న్‌(ఝాంగ్‌ యీమో మామూలువాడు కాదు.)
10. ప్యారడిసో
11. ఈప్‌ అల్లే ఊ
12. ద మ్యాన్‌ వితౌట్‌ గ్రావిటీ
13. ద ప్రెస్టీజ్‌
14. గ్జువాన్‌ జాంగ్‌(?)(మనకు హ్యూయన్‌ త్సాంగ్‌గా తెలిసిన చైనా యాత్రికుడి జీవిత చరిత్ర)
15.టు లివ్‌.(చైనీస్‌. ఝాంగ్‌ యీమో దర్శకుడు.)
16. ఓయ్‌ వెయ్‌! మై సన్‌ ఈజ్‌ గే!!
17. రతి కామదేవ్‌(శీష్‌మహల్‌ థియేటర్‌ కోసం. రోహిత్, శశి కోసం.)
18. ద సెంట్‌ ఆఫ్‌ గ్రీన్‌ పపాయా(వియత్నాం సినిమా. బ్యూటిఫుల్‌.)
19. లిటిల్‌ బుద్ధ
20. ద ఫౌండర్‌
21. ద లయన్‌ ఆఫ్‌ ద డిజెర్ట్‌
22. కోర్ట్‌(రీ)
23. మదామ్‌ క్లాడ్‌
24. పర్సూట్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌(రీ)
25. ద డిసైపుల్‌ (చైతన్య తమానే సినిమా. దీనిమీద రాశాను.)
26. జగమేతాండిరం (హింస)
27. గైడ్‌ టు స్లీప్‌
28. కౌంట్‌డౌన్‌ టు డెత్‌(పాబ్లో ఎస్కోబార్‌ మీద డాక్యుమెంటరీ.)
29. నటసామ్రాట్‌
30. నయాత్తు
31. వై వాజ్‌ ఐ బర్న్‌(చైనీస్‌)
32. సినిమాబండి
33. ఉప్పెన
34. మైనారిటీ రిపోర్ట్‌
35. స్టోరీ డిస్కషన్‌–2 (దీని మీద రాశాను.)
36. సెక్స్‌ అండ్‌ ద లవ్‌ అరౌండ్‌ ద వరల్డ్‌(ఇలాంటివి నాకు ఇంట్రెస్టే.)
37. లంచ్‌బాక్స్‌(ఇర్ఫాన్‌ ఖాన్‌ చనిపోయాక మళ్లీ చూడబుద్ధేసింది.)
38. క్లోజప్‌(రీ; అబ్బాస్‌ కియరొస్తామీ దర్శకుడు. దీని గురించి వచ్చిన టాపిక్‌ నుంచే మా ‘వెళ్లిపోవాలి’ సినిమాకు బీజం పడిందనుకోవచ్చు.)
39. క్లౌడ్స్‌ ఆఫ్‌ మే(టర్కీ దర్శకుడు న్యూరీ బిల్గే జైలన్‌ సినిమా. మా ‘వెళ్లిపోవాలి’ మేకింగ్‌కు ఒక రిఫరెన్స్‌ ఫిలిం.)
40. లార్జెంట్‌(రాబర్ట్‌ బ్రెసన్‌ ఫ్రెంచ్‌ సినిమా. సినిమాలోకి దిగేముందు కియరొస్తామీ, జైలన్, బ్రెసన్‌... ఈ ముగ్గురి పద్ధతులతో పాటు మరికొన్ని ఈ కోవలోని సినిమాలను అధ్యయనం చేద్దామని ఒక క్రాష్‌ కోర్స్‌ ఇచ్చాడు మెహెర్‌.)
41. డిస్టంట్‌(నా వరకూ జైలన్‌ బెస్ట్‌ మూవీ. దీని తర్వాత ద వైల్డ్‌ పియర్‌ ట్రీ వస్తుంది.)
42. క్లైమేట్స్‌(జైలన్‌; లవ్లీ)
43. వివా సే వివ్రే (గొడార్డ్‌ సినిమా)
44. మూషే (బ్రెసన్‌ సినిమా)
45. నేకెడ్‌(మైక్‌ లీ సినిమా)
46. ఫైవ్‌ ఈజీ పీసెస్‌
47. ఐ స్టాండ్‌ అలోన్‌(వైల్డ్‌)
48. సీక్రెట్స్‌ అండ్‌ లైస్‌(మైక్‌ లీ; ఇంగ్లండ్‌ను ఎంత చేరువగా తెచ్చాడో!)
49. ద గ్రీన్‌ రే(ఫ్రెంచ్‌; ఎరిక్‌ రోమర్‌ దర్శకుడు. పై సినిమాల కన్నా కూడా ఈయన సంభాషణల పద్ధతి మాకు బాగా పనికొస్తోంది.)
50. గర్ల్‌ఫ్రెండ్స్‌
51. ఫ్రాన్సెస్‌ హా(గ్రెటా జెర్విగ్‌ ఎనర్జీ చూడాలి.)
52. నిజాన్‌ ప్రకాశన్‌
53. ఫాస్‌బిండర్‌: టు లవ్‌ వితౌట్‌ డిమాండ్‌(డాక్యుమెంటరీ)
54. జాంబీరెడ్డి
55. జాతిరత్నాలు
56. పిట్ట కథలు
57. బ్యాటిల్‌ ఆఫ్‌ అల్జీ్జర్స్‌(రీ)
58. ఎ బ్రైట్‌ సమ్మర్‌ డే(తైవానీస్‌; యాంగ్‌; ఒక టీన్‌ మర్డర్‌ మీద ఒక చరిత్రను చూపించొచ్చు.)
59. యాన్‌ ఆటమ్‌ ఆఫ్టర్‌నూన్‌(ఓజు కోసం మళ్లీ.)
60. ఇకిరు(కురసోవాను నేను ఎక్కువ చూడలేదని...)
61. రాన్‌ (కురసోవా)
62. ఉమన్‌ ఇన్‌ ద డ్యూన్స్‌(ఆ విజువల్స్‌!)
63. 18 అవర్స్‌(మలయాళం)
64. ద లారెన్స్‌ ఆఫ్‌ అరేబియా
65. మెర్రీ క్రిస్‌మస్, మిస్టర్‌ లారెన్స్‌
66. టాక్సీ, తెహ్రాన్‌(ఫనాహీ; సినిమా తీయడం చాలా ఈజీ.)
67. ద టైమ్‌ టు లివ్‌ అండ్‌ ద టైమ్‌ టు డై(తైవానీస్‌; ఎ సిటీ ఆఫ్‌ శాడ్‌నెస్‌ చూశాక నేనుగా కనుక్కున్న మాస్టర్‌ హౌ హొసియే హొసియెన్‌.)
68. డస్ట్‌ ఇన్‌ ద విండ్‌
69. ద నైట్‌ ఆఫ్‌ ద హంటర్‌
70. నవరస
71. అస్మా(ఈజిప్ట్‌ సినిమా. నేను ప్రపంచ సినిమా చూడటానికి ఒక కారణం, ఆ ఇంటీరియర్స్‌ కోసం. పుస్తకాలు ఎంత చదివినా ఆ మొహాలు, ఆ ముక్కులు, ఆ ఇండ్లను బొమ్మ కట్టినట్టుగా ఊహించుకోలేం. అవి సినిమాల్లోనే బాగా తెలుస్తాయి. పుస్తకం మీద సినిమా పైచేయి సాధించే ఏకైక సందర్భం ఇదే.)
72. అపోలో 13
73. రివిజన్‌ (జర్మన్‌ డాక్యుమెంటరీ)
74. చాకొలేటా
75. నైట్‌ అండ్‌ ఫాగ్‌(రీ)
76. అగ్లీ ట్రూత్‌(లేటుగా చూశా.)
77. ఫార్గో (కోయెన్‌ బ్రదర్స్‌ నాకు నచ్చుతున్నారు.)
78. స్పిరిట్‌ ఆఫ్‌ ద బీహైవ్‌
79. మీన్‌టైమ్‌
80. బ్లడ్‌ సింపుల్‌
81. ఇడా
82. ఇన్‌సైడ్‌ లూయిన్‌ డేవిస్‌
83. హజ్బెండ్స్‌ అండ్‌ వైవ్స్‌(వుడీ అలెన్‌ కోసం.)
84. ద అన్‌నోన్‌ సెయింట్‌(మొరాకో)
85. పారిస్, టెక్సాస్‌
86. నైట్‌ అండ్‌ డే
87. ఆర్డెట్‌(క్లాసిక్‌)
88. జర్నీ టు ఇటలీ
89. వుమన్‌ ఈజ్‌ ద ఫ్యూచర్‌ ఆఫ్‌ మ్యాన్‌
90. బ్లాక్‌ బాక్స్‌ జర్మనీ
91. Bulbul Can Sing
92. వరుణ్‌ డాక్టర్‌
93. బిరియానీ(మలయాళం; సాజిన్‌ బాబు దర్శకుడు. కనీ కుసృతి(?) నటి. ఇండియన్‌ సినిమాల్లో ఇంత బోల్డ్‌ సినిమా చూడలేదు.)
94. ద బ్యాలడ్‌ ఆఫ్‌ నరయామా(మనుషులూ జంతువులే. జీవితం ఇలా కూడా ఉంటుంది.)
95. స్కార్‌ఫేస్‌
96. సాల్ట్‌ ఆఫ్‌ దిస్‌ సీ
97. ఎలినా(రష్యన్‌)
98. తిమ్మరుసు
99. ద బాయ్‌ ఇన్‌ ద స్ట్రైప్‌డ్‌ పైజామాస్‌
100. ద సీక్రెట్‌ లైఫ్‌ ఆఫ్‌ పెట్స్‌
 

Wednesday, January 5, 2022

సాహిత్యంలో సున్నితమైన గమనింపులు





 

రైటర్స్‌ మీట్‌

మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం, హైదరాబాద్‌
11–12 డిసెంబర్‌ 2021

(రైటర్స్‌ మీట్‌ నిర్వహించిన రెండు రోజుల శీతాకాల కథా ఉత్సవంలో సాహిత్యంలో సున్నితమైన గమనింపుల మీద మాట్లాడమన్నారు. ప్రత్యేకంగా ప్రిపేర్‌ అయ్యి, ఏవో పేపర్లు సమర్పించేలాంటి సమావేశాలు కావు కాబట్టి, ఆ ఉన్న సమయంలో నాకు గుర్తొచ్చిన మేరకు చెప్పాను. ‘కావు’ అని వాటి విలువను తగ్గించడం కోసం అనలేదు. వాటి ఉద్దేశమే ఇన్‌ఫార్మల్‌గా మాట్లాడుకోవడం. అది నాకు సౌకర్యం కూడా.
ఇందులో కొన్ని తప్పులు ఏమైనా ఉండొచ్చు కూడా. యధాతథ వాక్యాలు ఏమిటో తర్వాతైనా వెతికే పని పెట్టుకోలేదు. నేను మాట్లాడింది మాట్లాడినట్టే ఉంచేస్తున్నా. దీనివల్ల ఒక పాఠకుడి మెమరీ పరిమితులను కూడా అర్థం చేసుకోవచ్చు.)



సాహిత్యంలో సున్నితమైన గమనింపులు
----------------------------------------------------



ఎంత అసాంఘికంగానైనా మాట్లాడొచ్చు కదా.

ఫైట్‌క్లబ్‌ మీలో చాలామంది చూసేవుండొచ్చు. చూడనివాళ్లకు రికమెండ్‌ చేయదగిన సినిమా.
అమెరికా వాళ్లు మనకంటే ముందే మేల్కున్నారు కాబట్టి, ఈ ఆధునికత మీదా,  తెలియకుండానే ఆఫీసుల్లో క్యూబికల్స్‌కు పరిమితమైపోవడం మీదా, రిలేషన్స్‌లో ఏ ఉద్వేగాలూ లేకపోవడం మీదా, మనుషులు మనుషులుగా కాకుండా కేవలం వినియోగదారులుగా మారిపోవడం మీదా, గొప్ప వ్యాఖ్యానం అది.

అందులో ఒక సీన్‌ ఉంటుంది. టైలర్‌ డర్డెన్‌ ఫ్లైట్లో ఎయిర్‌ హోస్టెస్‌ను దాటుకుంటూ వెళ్లాల్సివచ్చినప్పుడు– ఆ సీట్ల మధ్యలో ఉండే చిన్న ఇరుకులో– ముందు వైపు భాగాన్ని రుద్దుకుంటూ వెళ్లడం మర్యాదనా, వెనకవైపు భాగాన్ని రాసుకుంటూ వెళ్లడం మర్యాదనా అని అడుగుతాడు.
(నౌ, ఎ క్వశ్చన్‌ ఆఫ్‌ ఎటికెట్‌. యాస్‌ ఐ పాస్, డు ఐ గివ్‌ యూ ది ఆస్‌ ఆర్‌ ద క్రోచ్‌?)

సినిమా మొదటిసారి చూసినప్పుడు ఎంత థ్రిల్‌ అయ్యానో చెప్పలేను. ఈ సినిమా ఎంత గుర్తుందో, ఈ ఒక్క ఎక్స్‌ప్రెషన్‌ అంతే గుర్తుంది. ఒక చిన్న వాక్యం ఆ మొత్తం సినిమాకు ఈక్వేట్‌ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. ఆ రైటర్‌ ఎట్లా పట్టుకోగలిగాడు ఈ వాక్యాన్ని అని.
(ఈ సినిమాకు మూలమైన నవల– దాని పేరు కూడా ఫైట్‌ క్లబ్‌– అది నేను చదవలేదు– కానీ దాని రైటర్‌ చక్‌ పాలనిక్‌ రాసిన వాక్యాలే సినిమాలోకి కూడా వచ్చాయి.)

ది ఓల్డ్‌మాన్‌ అండ్‌ ద సీ– ఇందులో ముసలాయన చేపల వేటకు వెళ్లి వస్తూ, ఇసిరెలను అక్కడే పడవ దగ్గర పడేద్దామనుకుంటాడు. కానీ దొంగతనాన్ని చేయాలన్న టెంప్టేషన్‌ చూసినవారికి ఎందుకు పుట్టించాలని మనసు మార్చుకుని వాటిని పట్టుకెళ్లిపోతాడు.
తర్వాత జరిగిన పోరాటం, ఇవన్నీ సరే, కానీ ఈ ఒక్క వివరం హెమింగ్వేను నా వరకూ ఒక మెట్టు మీద ఉంచింది.

ఇది కుప్రిన్‌ రాళ్లవంకీ కథాసంపుటి అనుకుంటున్నా. ఇందులో కథనాయకుడు ఆమె ఇంటిముందు ఆగివుంటాడు. గుర్రం ఇంటిముందు నిలిపివుంటుంది. గుర్రపు డెక్కల అడుగుల్లో నిలిచిన నీటిలో చంద్రుడు కనబడుతుంటాడు. ఒక్కసారి గుర్రం కదలడం వల్ల చంద్రుడి నీడ ఆ నీటిలో చెదురుతుంది. ఎంత అందంగా చంద్రుణ్ని చూపించాడా అనిపించింది. ఆ రాత్రిపూట, చీకటి, ఇదంతా నాకు అట్లా గుర్తుండిపోయింది.

అన్నా కరేనినాలో డాలీ పిల్లాడిని తయారుచేస్తుంటుంది. చలికోటు గుండీ ఏదో ఊడివుంటే దాన్ని పీక్కుంటూ పిల్లాడు ఆడుతూవుంటాడు. ఒకసారి వారించి, రెండోసారికి దాన్ని తీసి తన జేబులో వేసుకుంటుంది డాలీ. ఈ దృశ్యాన్ని మామూలుగా కూడా రాయొచ్చు. ఒక తల్లి తన పిల్లాడిని తయారుచేస్తున్నట్టు. దీనివల్ల కథకు వచ్చే ఇబ్బంది ఏమీ వుండదు. ఇది లేకుండా కూడా ఆ లవ్‌స్టోరీ, ఆ డిస్కషన్‌ అంతా కూడా చేయొచ్చు. కానీ ఆ గమనింపు వల్ల ఆ సీన్‌కు జీవితం అనేది మరింత సన్నిహితంగా వస్తుంది. టాల్‌స్టాయ్‌ లాంటివాడు అట్లా కాకుండా రాస్తాడా?

చలం– జీవితాదర్శంలో– దేశికాచారి బీచిలో నడుచుకుంటూ వస్తాడు.
అంతకుముందు మాట్లాడిన మాటలకు జవాబుగా ఉన్న నవ్వుమొహంతో వచ్చాడంటాడు చలం. ఈ గమనింపును చలం ఎట్లా పట్టుకున్నాడా అనిపిస్తుంది. నన్ను చలానికి హుక్‌ అయ్యేట్టు కూడా చేసిన వాక్యం అనుకోవచ్చు.

కుటుంబరావు చదువు నవలలో– సుందరం తన స్నేహితుడు శివుడిని ఇంటికి రమ్మని పిలుస్తాడు. శివుడికి కూడా తనన్ని మార్కులు వస్తాయి కాబట్టి తనంతవాడు అనుకుంటాడు. కానీ తన కులం వల్ల తన పరిమితులు తెలిసినవాడు కాబట్టి శివుడు ఇంట్లోకి రావడానికి మొహమాటపడతాడు, దగ్గరికి వచ్చాక వాళ్లమ్మ చెరొక అప్పా ఏదో చేతిలో పెడుతుంది. ఆ మేరకే అయితే ఇది మామూలు విషయమే. కానీ శివుడి చేతిలో ఉన్నది కొద్దిగా మాడివుంటుంది. వివక్షను ఎత్తిచూపడానికి పెద్ద ఆర్భాటం చేయనక్కరలేదు. ఈ చిన్న వివరం మనసు చివుక్కుమనేలా చేస్తుంది.

అజయ్‌ ప్రసాద్‌ రాసిన ‘చల్లపరెడ్డి’ పాత్రగా ఉండే కథ– ఊళ్ల గురించి తెల్సినవాళ్లకు మాత్రమే అనుభవంలో ఉండే విషయం. ఊళ్లల్లో రాత్రిపూట సద్దు అనేది మణగదు. చిమ్మటలు, కప్పల రొద ఉంటూనే ఉంటుంది. ఇతను రాత్రి మూత్రానికని బయటకు వెళ్లి, మూత్రం పోస్తాడు. ఆ ధార కిందపడగానే ఒక్కసారి వాటి శబ్దం ఆగి, మళ్లీ మొదలవుతుంది. ఇలాంటి వ్యక్తీకరణ నేను ఇంకెక్కడా చదవలేదు. అజయ్‌ లోయ కథలన్నీ ఒకెత్తు, ఈ ఒక్క గమనింపు నా వరకూ ఒకెత్తు అనిపించింది.

ఖదీర్‌ పెండెం సోడా సెంటర్‌ కథలో– ఆ ఉప్పునీటి వాతావరణానికీ, ఆ కొత్తగా వచ్చిన సోడాకూ ఎలా మైత్రి కుదిరిందో చెబుతాడు. ఇలాంటి వాక్యం కథకు అదనపు విలువను జత చేస్తుంది. సబ్జెక్టు మీద కథకుడి పట్టు ఏమిటో చెబుతుంది.

మెహెర్‌ కథ– నాకు పేరు గుర్తులేదు. బయటి నుంచి పడుతున్న ఎండను కిటికీ వడగడుతున్నదని రాస్తాడు. ఆ ఊహే అనూహ్యం అనిపిస్తుంది. కిటికీలోంచి లోపలికి వచ్చే వెలుతురు మొత్తాన్ని నాకు ఒక బొమ్మ కట్టి చూపించినట్టుగా అనిపిస్తుంది.

శిరీష్‌ ఆదిత్య రాసిన 90స్‌ బ్లూస్‌ కథలో– చాలా ఏళ్ల తర్వాత కలిసిన వాళ్ల మామయ్యలో పెద్దతనం వచ్చిందని చెప్పడానికి ఆ పిల్లాడు చెంపల అంచుల్లో వచ్చిన సన్న ముడతలను గమనిస్తాడు (క్రోస్‌ ఫీట్‌). ఆ పరిణామాన్ని భలే పట్టుకున్నాడు కదా అనిపించింది.

వినడం వల్ల, జ్ఞానం వల్ల ఇలాంటి వ్యక్తీకరణలు రావు. గమనింపు వల్ల, ఆ అనుభవంలో ఉండటం వల్ల మాత్రమే సాధ్యమవుతాయి. ఇవి లేకుండా కూడా ఆ విషయ బలం వల్ల మంచి కథ రాయొచ్చు. కానీ ఈ వివరాల వల్లే నాకు ఒక రచయిత శక్తి తెలుస్తుంది. వాళ్లు చదవాల్సిన వాళ్లా, మున్ముందు పక్కన పెట్టాల్సినవాళ్లా అనేది అర్థం అవుతుంది

పొద్దున లేచేసరికి గ్రెగర్‌ జామ్జా ఒక పెద్ద పురుగుగా మారిపోయివున్నాడన్న కాఫ్కా మెటమార్ఫసిస్‌లో రాసిన మొదటివాక్యం చదవగానే– బోర్హెస్‌? మార్క్వెజ్‌? ... ఇట్లా కూడా రాయొచ్చా అని ఆశ్చర్యపోయాడంటారు. అంటే రాయడానికి సంబంధించిన ఒక సంకెళ్లు ఏవో తెగిపోయినట్టు ఆయన ఫీలయివుంటాడు.

రాయడానికి సంబంధించి నాకు అంత మేలుకొలుపు అని చెప్పనుగానీ –
క్యాచర్‌ ఇన్‌ ద రై నవలలో హోల్డెన్‌ కింది పెదవును పైకి వంచి గాలి ఊదుతూ దుర్వాసనను చెక్‌ చేసుకుంటాడు. ఇట్లాంటిది కూడా రాయొచ్చా అనిపించింది.
ఇంత చిన్న విషయానికి, ఇంత సూక్ష్మమైన వివరానికి కూడా సాహిత్యంలో పట్టింపు ఉంటుంది, దానికి మనం విలువను ఇవ్వొచ్చు, అది విస్మరించాల్సిన విషయం ఏమీ కాదు అని ఒక నమ్మకం కుదిరింది. ఈ పుస్తకం మొత్తంగా కూడా అద్భుతం. ఇది వన్‌ ఆఫ్‌ మై ఫేవరిట్‌ బుక్స్‌ కూడా.

ఇది మన వాక్యం అన్నది ఒక్కటైనా రాయకుండానే మెడలో పది పురస్కారాలు పడినవాళ్లు ఉండొచ్చు. కానీ అట్లాంటివాళ్లు రచయితలుగా నా వరకూ ఏమీకారు. ఇట్లాంటి వాక్యం రాసినవాడు ఏ గుర్తింపు లేకుండా కూడా ఉండొచ్చు. ఇలాంటివాళ్లే నా హీరోలు.

(మీకు బాగా నచ్చిన గమనింపులను సెలబ్రేట్ చేయవచ్చు కామెంట్లలో👍)