Monday, January 17, 2022

నిజంగానే నాకు మేలు జరుగుతుందా?


ఫొటో: చార్‌మినార్‌ లోపలి భాగం
 



 నిజంగానే నాకు మేలు జరుగుతుందా?


ఆఫీసుకు వస్తుంటే మెహిదీపట్నం దగ్గర్లో ఒకాయన లిఫ్ట్‌ కావాలన్నట్టుగా చేయెత్తాడు. ఆయన మాసాబ్‌ట్యాంక్‌ వైపు పోయేవాడు కాదని నిర్ధారించుకోవడానికి నేను బంజారాహిల్స్‌ వైపు పోతున్నానని చెప్పాను. ఎన్‌ఎండీసీ దగ్గర దింపితే చాలన్నాడు. ఎటువైపు పోయేదైనా ఫర్లేదన్నమాట.


ముస్లింగా ఉండటం వేరు; ముస్లిం అని తెలియడం వేరు. ఆ బట్టలూ, టోపీ ఆయన ఒక అస్తిత్వాన్ని తెలియజేస్తున్నాయి. నవ్వు ముఖం. యాభై దాటి ఉండొచ్చు. అసలే హెల్మెట్‌లో ఉన్నాను; ముక్కుకు అడ్డంగా కర్చీఫ్‌ కూడా కట్టుకున్నాను కాబట్టి, నా రూపురేఖ ఆయనకు తెలిసే అవకాశం లేదు. నా అస్తిత్వాన్ని నా ముఖం మీద ప్రకటించుకునేవాడిని కాదు కాబట్టి, నేనెవరై ఉంటానన్నది ఆయనకు తెలిసే అవకాశం లేదు. సరే, దగ్గరే కాబట్టి దింపాక ఆయన ‘షుక్రియా’ అని ఊరుకుంటే నాకిది రాయాలన్న ఆలోచన రాకపోయేది. ‘అల్లాహ్‌ మీకు మేలు చేస్తాడు’ అన్నట్టుగా ఇంకో వాక్యాన్ని కూడా జతచేశాడు.

పుట్టుకతో నేను హిందువును అయినప్పటికీ– దేవుడు, ఆధ్యాత్మిక ప్రశ్నల్ని వెతుక్కునే క్రమంలో అన్ని మతగ్రంథాలనూ కొద్దికొద్దిగానైనా చదవడానికి ప్రయత్నిస్తున్నాను. అట్లా ముస్లింల పవిత్ర గ్రంథం కూడా చదువుతున్నాను.

‘అల్లాహ్‌ దాస్యమే చేయాలనీ, ఆయనకే విధేయులై ఉండాలనీ మరియు కేవలం ఆయననే ఆరాధించాలనీ’ మానవజాతి అల్లాహ్‌కు ఇచ్చిన ప్రమాణం(అహ్‌ దుల్లహి) అంటుంది దివ్య ఖుర్‌ఆన్‌. ‘ప్రభూ! భూమిపై ఈ అవిశ్వాసులలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టకు’మని కోరుతుంది. ఈ విధేయత ప్రకటించనివారిని– నూహ్, ఆద్, సమూద్, అర్‌–రస్స్‌ లాంటి జాతులకు జాతుల్నే అంతం చేసినట్టుగా చెబుతుంది. ఎప్పుడో చరిత్రలో జరిగిపోయిన వివరం కాబట్టి, ఆ చావులన్నీ ఏకవాక్యాల్లోకి కుదించబడి ఉంటాయి. ‘ఎవరు అల్లాహ్‌ మార్గంలో తమ ఇండ్లను వదలి (వలస) పోయి, ఆ తరువాత చంపబడతారో లేదా మరణిస్తారో, వారికి అల్లాహ్‌ (పరలోకంలో) శ్రేష్ఠమైన ఉపాధిని ప్రసాదిస్తా’డంటుంది. ‘ఈ గ్రంథాన్ని తిరస్కరించేవారి వ్యవహారాన్ని నాకు వదిలెయ్యి; వారికి ఏమాత్రం తెలియనివిధంగా మేము వారిని క్రమేణా వినాశం వైపునకు తీసుకుపోతా’మంటుంది. దేన్నయినా అల్లాహ్‌ క్షమిస్తాడుగానీ, అల్లాహ్‌కు సాటిగా ఇంకో దేవుడిని నిలబెట్టడం క్షమించలేని మహాపాపం(షిర్క్‌) అంటుంది. ‘మీరు మరియు మీ రాళ్ళదేవతలు నరకాగ్నికి ఇంధనం అవుతా’రని హెచ్చరిస్తుంది.

అలాంటప్పుడు నాలాంటి వాడికి కూడా అల్లాహ్‌ మేలు చేస్తాడా? మరి ఆ లిఫ్టు తీసుకున్నాయన అలా అన్నాడేమిటి? వందల ఏళ్ల క్రితపు పుస్తకంలోని వాక్యాల్ని యధాతథంగా తీసుకోవడం దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం అవుతుందా? మరి ఎప్పుడో రాయబడిన మనుధర్మ శాస్త్రాన్ని మన మేధావులు వారంలో రెండుసార్లు తగలబెడుతుంటారే!

ఇది రాస్తున్నప్పుడు కొంతమంది ముస్లిం స్నేహితులు నా మనసులో మెదులుతున్నారు. వీళ్లను ఎంత ముస్లింలుగా లెక్కించాలి అనేది ఒక సమస్య. అంటే, నేను ఎంత హిందువునో వీళ్లు అంత ముస్లింలు అయివుండాలి. లేదా, నేను ఎంత హిందువును కాదో వాళ్లు అంత ముస్లింలు కాకపోయివుండాలి. ఇంకొక మతంలో ఉండటం అన్నది తప్పితే, వాళ్లు దాదాపుగా లేదా పూర్తిగా నాలాంటివాళ్లే. ఏ మతగ్రంథాలనైనా ఆ మతస్థులు విధిగా చదవకపోవచ్చు. అసలు మన ఉనికి కేవలం మన మతం కాకపోవచ్చు. పుట్టుక వల్ల మాత్రమే ఎవరైనా ఆ మతంలో ఉంటుండటం జరుగుతుండవచ్చు. మతగ్రంథాల వల్ల కాకుండా, మిగతా ఇంకేవో బయటి గాలులు పీల్చడం వల్లనే మనుషులం ఈ మాత్రం మనుషులుగా ఉన్నామనిపిస్తుంది. సమాజం ఉమ్మడిగా ప్రోది చేసుకుంటున్న విలువలు దాదాపుగా ఏ మతంవారికైనా వర్తిస్తాయి. కాబట్టే, మతాలన్నీ మంట గలిసినా మానవత్వానికి వచ్చే ప్రమాదం ఏమీ ఉండకపోవచ్చు. ‘మధువు తాగు, ఖురాను కాల్చు, మక్కాను కూల్చు, విగ్రహాలను పూజించు, మనిషిని మాత్రం హింసించకు’ అంటాడు ఫార్సీ కవి ఖాజా హఫీజ్‌. ఇంత ఉదారత ఈ హఫీజ్‌ చదివి ఉంటాడనుకుంటున్న గ్రంథంలో కనబడకపోయినా– మతాలు, వాదాల కంటే మనుషులే గొప్ప అని నమ్మేవాడిని కాబట్టి, లిఫ్టు తీసుకున్నాయన ఆశీర్వచనమే ఆయన నమ్మే గ్రంథానికంటే బలమైనది అనుకుంటున్నా.

(ఆధార గ్రంథాలు: 1.దివ్య ఖుర్‌ఆన్‌ సందేశం తెలుగు భాషలో; అను: డాక్టర్‌ అబ్దుర్‌–రహీమ్‌ బిన్‌ ముహమ్మద్‌ మౌలానా. 2. దివ్య ఖుర్‌ఆన్‌ భావానువాదం; అను: మౌలానా సయ్యద్‌ అబుల్‌ ఆలా మౌదూది, షేక్‌ హమీదుల్లా షరీఫ్‌.)

(Published in Saaranga on Jan 1, 2022)

No comments:

Post a Comment