రైటర్స్ మీట్
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం, హైదరాబాద్
11–12 డిసెంబర్ 2021
(రైటర్స్ మీట్ నిర్వహించిన రెండు రోజుల శీతాకాల కథా ఉత్సవంలో సాహిత్యంలో సున్నితమైన గమనింపుల మీద మాట్లాడమన్నారు. ప్రత్యేకంగా ప్రిపేర్ అయ్యి, ఏవో పేపర్లు సమర్పించేలాంటి సమావేశాలు కావు కాబట్టి, ఆ ఉన్న సమయంలో నాకు గుర్తొచ్చిన మేరకు చెప్పాను. ‘కావు’ అని వాటి విలువను తగ్గించడం కోసం అనలేదు. వాటి ఉద్దేశమే ఇన్‌ఫార్మల్‌గా మాట్లాడుకోవడం. అది నాకు సౌకర్యం కూడా.
ఇందులో కొన్ని తప్పులు ఏమైనా ఉండొచ్చు కూడా. యధాతథ వాక్యాలు ఏమిటో తర్వాతైనా వెతికే పని పెట్టుకోలేదు. నేను మాట్లాడింది మాట్లాడినట్టే ఉంచేస్తున్నా. దీనివల్ల ఒక పాఠకుడి మెమరీ పరిమితులను కూడా అర్థం చేసుకోవచ్చు.)
సాహిత్యంలో సున్నితమైన గమనింపులు
----------------------------------------------------
ఎంత అసాంఘికంగానైనా మాట్లాడొచ్చు కదా.
ఫైట్‌క్లబ్ మీలో చాలామంది చూసేవుండొచ్చు. చూడనివాళ్లకు రికమెండ్ చేయదగిన సినిమా.
అమెరికా వాళ్లు మనకంటే ముందే మేల్కున్నారు కాబట్టి, ఈ ఆధునికత మీదా, తెలియకుండానే ఆఫీసుల్లో క్యూబికల్స్‌కు పరిమితమైపోవడం మీదా, రిలేషన్స్‌లో ఏ ఉద్వేగాలూ లేకపోవడం మీదా, మనుషులు మనుషులుగా కాకుండా కేవలం వినియోగదారులుగా మారిపోవడం మీదా, గొప్ప వ్యాఖ్యానం అది.
అందులో ఒక సీన్ ఉంటుంది. టైలర్ డర్డెన్ ఫ్లైట్లో ఎయిర్ హోస్టెస్‌ను దాటుకుంటూ వెళ్లాల్సివచ్చినప్పుడు– ఆ సీట్ల మధ్యలో ఉండే చిన్న ఇరుకులో– ముందు వైపు భాగాన్ని రుద్దుకుంటూ వెళ్లడం మర్యాదనా, వెనకవైపు భాగాన్ని రాసుకుంటూ వెళ్లడం మర్యాదనా అని అడుగుతాడు.
(నౌ, ఎ క్వశ్చన్ ఆఫ్ ఎటికెట్. యాస్ ఐ పాస్, డు ఐ గివ్ యూ ది ఆస్ ఆర్ ద క్రోచ్?)
సినిమా మొదటిసారి చూసినప్పుడు ఎంత థ్రిల్ అయ్యానో చెప్పలేను. ఈ సినిమా ఎంత గుర్తుందో, ఈ ఒక్క ఎక్స్‌ప్రెషన్ అంతే గుర్తుంది. ఒక చిన్న వాక్యం ఆ మొత్తం సినిమాకు ఈక్వేట్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. ఆ రైటర్ ఎట్లా పట్టుకోగలిగాడు ఈ వాక్యాన్ని అని.
(ఈ సినిమాకు మూలమైన నవల– దాని పేరు కూడా ఫైట్ క్లబ్– అది నేను చదవలేదు– కానీ దాని రైటర్ చక్ పాలనిక్ రాసిన వాక్యాలే సినిమాలోకి కూడా వచ్చాయి.)
ది ఓల్డ్‌మాన్ అండ్ ద సీ– ఇందులో ముసలాయన చేపల వేటకు వెళ్లి వస్తూ, ఇసిరెలను అక్కడే పడవ దగ్గర పడేద్దామనుకుంటాడు. కానీ దొంగతనాన్ని చేయాలన్న టెంప్టేషన్ చూసినవారికి ఎందుకు పుట్టించాలని మనసు మార్చుకుని వాటిని పట్టుకెళ్లిపోతాడు.
తర్వాత జరిగిన పోరాటం, ఇవన్నీ సరే, కానీ ఈ ఒక్క వివరం హెమింగ్వేను నా వరకూ ఒక మెట్టు మీద ఉంచింది.
ఇది కుప్రిన్ రాళ్లవంకీ కథాసంపుటి అనుకుంటున్నా. ఇందులో కథనాయకుడు ఆమె ఇంటిముందు ఆగివుంటాడు. గుర్రం ఇంటిముందు నిలిపివుంటుంది. గుర్రపు డెక్కల అడుగుల్లో నిలిచిన నీటిలో చంద్రుడు కనబడుతుంటాడు. ఒక్కసారి గుర్రం కదలడం వల్ల చంద్రుడి నీడ ఆ నీటిలో చెదురుతుంది. ఎంత అందంగా చంద్రుణ్ని చూపించాడా అనిపించింది. ఆ రాత్రిపూట, చీకటి, ఇదంతా నాకు అట్లా గుర్తుండిపోయింది.
అన్నా కరేనినాలో డాలీ పిల్లాడిని తయారుచేస్తుంటుంది. చలికోటు గుండీ ఏదో ఊడివుంటే దాన్ని పీక్కుంటూ పిల్లాడు ఆడుతూవుంటాడు. ఒకసారి వారించి, రెండోసారికి దాన్ని తీసి తన జేబులో వేసుకుంటుంది డాలీ. ఈ దృశ్యాన్ని మామూలుగా కూడా రాయొచ్చు. ఒక తల్లి తన పిల్లాడిని తయారుచేస్తున్నట్టు. దీనివల్ల కథకు వచ్చే ఇబ్బంది ఏమీ వుండదు. ఇది లేకుండా కూడా ఆ లవ్‌స్టోరీ, ఆ డిస్కషన్ అంతా కూడా చేయొచ్చు. కానీ ఆ గమనింపు వల్ల ఆ సీన్‌కు జీవితం అనేది మరింత సన్నిహితంగా వస్తుంది. టాల్‌స్టాయ్ లాంటివాడు అట్లా కాకుండా రాస్తాడా?
చలం– జీవితాదర్శంలో– దేశికాచారి బీచిలో నడుచుకుంటూ వస్తాడు.
అంతకుముందు మాట్లాడిన మాటలకు జవాబుగా ఉన్న నవ్వుమొహంతో వచ్చాడంటాడు చలం. ఈ గమనింపును చలం ఎట్లా పట్టుకున్నాడా అనిపిస్తుంది. నన్ను చలానికి హుక్ అయ్యేట్టు కూడా చేసిన వాక్యం అనుకోవచ్చు.
కుటుంబరావు చదువు నవలలో– సుందరం తన స్నేహితుడు శివుడిని ఇంటికి రమ్మని పిలుస్తాడు. శివుడికి కూడా తనన్ని మార్కులు వస్తాయి కాబట్టి తనంతవాడు అనుకుంటాడు. కానీ తన కులం వల్ల తన పరిమితులు తెలిసినవాడు కాబట్టి శివుడు ఇంట్లోకి రావడానికి మొహమాటపడతాడు, దగ్గరికి వచ్చాక వాళ్లమ్మ చెరొక అప్పా ఏదో చేతిలో పెడుతుంది. ఆ మేరకే అయితే ఇది మామూలు విషయమే. కానీ శివుడి చేతిలో ఉన్నది కొద్దిగా మాడివుంటుంది. వివక్షను ఎత్తిచూపడానికి పెద్ద ఆర్భాటం చేయనక్కరలేదు. ఈ చిన్న వివరం మనసు చివుక్కుమనేలా చేస్తుంది.
అజయ్ ప్రసాద్ రాసిన ‘చల్లపరెడ్డి’ పాత్రగా ఉండే కథ– ఊళ్ల గురించి తెల్సినవాళ్లకు మాత్రమే అనుభవంలో ఉండే విషయం. ఊళ్లల్లో రాత్రిపూట సద్దు అనేది మణగదు. చిమ్మటలు, కప్పల రొద ఉంటూనే ఉంటుంది. ఇతను రాత్రి మూత్రానికని బయటకు వెళ్లి, మూత్రం పోస్తాడు. ఆ ధార కిందపడగానే ఒక్కసారి వాటి శబ్దం ఆగి, మళ్లీ మొదలవుతుంది. ఇలాంటి వ్యక్తీకరణ నేను ఇంకెక్కడా చదవలేదు. అజయ్ లోయ కథలన్నీ ఒకెత్తు, ఈ ఒక్క గమనింపు నా వరకూ ఒకెత్తు అనిపించింది.
ఖదీర్ పెండెం సోడా సెంటర్ కథలో– ఆ ఉప్పునీటి వాతావరణానికీ, ఆ కొత్తగా వచ్చిన సోడాకూ ఎలా మైత్రి కుదిరిందో చెబుతాడు. ఇలాంటి వాక్యం కథకు అదనపు విలువను జత చేస్తుంది. సబ్జెక్టు మీద కథకుడి పట్టు ఏమిటో చెబుతుంది.
మెహెర్ కథ– నాకు పేరు గుర్తులేదు. బయటి నుంచి పడుతున్న ఎండను కిటికీ వడగడుతున్నదని రాస్తాడు. ఆ ఊహే అనూహ్యం అనిపిస్తుంది. కిటికీలోంచి లోపలికి వచ్చే వెలుతురు మొత్తాన్ని నాకు ఒక బొమ్మ కట్టి చూపించినట్టుగా అనిపిస్తుంది.
శిరీష్ ఆదిత్య రాసిన 90స్ బ్లూస్ కథలో– చాలా ఏళ్ల తర్వాత కలిసిన వాళ్ల మామయ్యలో పెద్దతనం వచ్చిందని చెప్పడానికి ఆ పిల్లాడు చెంపల అంచుల్లో వచ్చిన సన్న ముడతలను గమనిస్తాడు (క్రోస్ ఫీట్). ఆ పరిణామాన్ని భలే పట్టుకున్నాడు కదా అనిపించింది.
వినడం వల్ల, జ్ఞానం వల్ల ఇలాంటి వ్యక్తీకరణలు రావు. గమనింపు వల్ల, ఆ అనుభవంలో ఉండటం వల్ల మాత్రమే సాధ్యమవుతాయి. ఇవి లేకుండా కూడా ఆ విషయ బలం వల్ల మంచి కథ రాయొచ్చు. కానీ ఈ వివరాల వల్లే నాకు ఒక రచయిత శక్తి తెలుస్తుంది. వాళ్లు చదవాల్సిన వాళ్లా, మున్ముందు పక్కన పెట్టాల్సినవాళ్లా అనేది అర్థం అవుతుంది
పొద్దున లేచేసరికి గ్రెగర్ జామ్జా ఒక పెద్ద పురుగుగా మారిపోయివున్నాడన్న కాఫ్కా మెటమార్ఫసిస్‌లో రాసిన మొదటివాక్యం చదవగానే– బోర్హెస్? మార్క్వెజ్? ... ఇట్లా కూడా రాయొచ్చా అని ఆశ్చర్యపోయాడంటారు. అంటే రాయడానికి సంబంధించిన ఒక సంకెళ్లు ఏవో తెగిపోయినట్టు ఆయన ఫీలయివుంటాడు.
రాయడానికి సంబంధించి నాకు అంత మేలుకొలుపు అని చెప్పనుగానీ –
క్యాచర్ ఇన్ ద రై నవలలో హోల్డెన్ కింది పెదవును పైకి వంచి గాలి ఊదుతూ దుర్వాసనను చెక్ చేసుకుంటాడు. ఇట్లాంటిది కూడా రాయొచ్చా అనిపించింది.
ఇంత చిన్న విషయానికి, ఇంత సూక్ష్మమైన వివరానికి కూడా సాహిత్యంలో పట్టింపు ఉంటుంది, దానికి మనం విలువను ఇవ్వొచ్చు, అది విస్మరించాల్సిన విషయం ఏమీ కాదు అని ఒక నమ్మకం కుదిరింది. ఈ పుస్తకం మొత్తంగా కూడా అద్భుతం. ఇది వన్ ఆఫ్ మై ఫేవరిట్ బుక్స్ కూడా.
ఇది మన వాక్యం అన్నది ఒక్కటైనా రాయకుండానే మెడలో పది పురస్కారాలు పడినవాళ్లు ఉండొచ్చు. కానీ అట్లాంటివాళ్లు రచయితలుగా నా వరకూ ఏమీకారు. ఇట్లాంటి వాక్యం రాసినవాడు ఏ గుర్తింపు లేకుండా కూడా ఉండొచ్చు. ఇలాంటివాళ్లే నా హీరోలు.
(మీకు బాగా నచ్చిన గమనింపులను సెలబ్రేట్ చేయవచ్చు కామెంట్లలో)
No comments:
Post a Comment