మధురాంతకం రాజారాం(1930–99) కథ ‘జీవన్ముక్తుడు’కు సంక్షిప్త రూపం ఇది. వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన రాజారాం సుమారు నాలుగు వందల కథలు రాశారు. నాకు నచ్చిన మధురాంతకం రాజారాం కథల్లో ఇదీ ఒకటి.
––––
జీవన్ముక్తుడు
మామంచిపురం నుంచి రామదుర్గం వెళ్లే అయిదు గంటల బస్సు ఆ సాయంకాలం గంట ఆలస్యంగా బయల్దేరింది. అప్పటికైనా బస్సు కదిలిందంటే అందుకు ముఖ్యకారకుడు బూరగమంద చెన్నారెడ్డి. రెడ్డి చెరువు క్రింద పొలంలో మడికోసి, బండపైన కుప్పలు పెట్టించి పదిరోజులయింది. కోసిననాటినుంచీ ఆకాశం చిల్లులు పడి పోయినట్టుగా జల్లులే జల్లులు. కరువులో అధికమాసం లాగా అర్జంటు కోర్టు పనొకటి అఘోరించింది. వాన తెరిపి ఇచ్చేది చూసుకుని, వాదె కొట్టి వడ్లు యింటికి చేర్చమని చెప్పిన తర్వాతనే బస్సెక్కాడు. పాలెర్లున్నూ నమ్మకస్తులే! (అయినా) అయిదారు వేల రూపాయల వరమానమాయె! రెడ్డి మనసు వడ్లరాశి చుట్టే గిరికీలు తిరుగుతోంది. ‘‘కేశవులూ! తొమ్మిదింటికల్లా నన్ను మా వూళ్లో దించేశావంటే నీ కొక కోడిపెట్ట ఇనాం’’ అంటూ డ్రయివరుకు బక్షీసు గూడా ప్రకటించాడు చెన్నారెడ్డి.
వరహాలయ్య ప్రాణం తుమ్మపాడులో, తన చిల్లరకొట్లో, మూడు నెలల క్రితం కొని స్టాకు చేసిన కొబ్బరికాయల చుట్టూ పల్టీలు కొడుతోంది.
నంగమంగలం సుబ్బానాయుడి పరిస్థితి దయనీయంగా వున్నట్టు ఒప్పుకోవాలి. మార్కెట్టు ‘డౌను’గా ఉన్నందువల్ల ఏడాదినుంచీ ఆయన దగ్గర నూరు మూటల చెరుకు బెల్లం నిలవ వుండిపోయింది. ఆ గదిలోకి, మిద్దె పైభాగంలోనుంచీ ఓ రంధ్రం వుంది. వాన కురుస్తున్నప్పుడు గంటసేపు గనక ఆదమరిస్తే, కడవల్లోకి తోడి దిబ్బల్లో పారబోయడానికి తప్పితే ఆ బెల్లం మరొక సత్కార్యానికి పనికిరాదు.
వేగిరపాటయితే లేకపోవచ్చుగానీ మిగిలినవాళ్లు గూడా ఏవో ముఖ్యమైన పనుల మీద ప్రయాణం కడుతున్నవారే. నందవరం సీతారామయ్య ఓ పెళ్లి సంబంధం చూచిరావడం కోసం రామదుర్గం వెళ్తున్నాడు. పులిచెరువు నాగప్ప గిత్త బేరం కోసం పైడిమర్రికి పయనమయ్యాడు. అల్లుడికి అనారోగ్యంగా వుందని తెలిసి మల్లెల గురుమూర్తి ముత్యాలరేవుకు ప్రయాణం పెట్టుకున్నాడు. పోగా బజారు పనిమీద పట్నానికి వచ్చి, తిరిగి వెళ్తున్న సమీప గ్రామాల వాళ్లు గూడా ఏడెనిమిది మంది దాకా బస్సులో ఉన్నారు.
వెళ్లడమా, మానడమా అన్న విచికిత్సలో బడి, మానుకోవడం వైపే మొగ్గుజూపుతూ టీస్టాల్లో బైటాయించిన కండక్టరు నారాయణ ఏకధాటిగా బస్ హారన్ గొంతు చించుకోడంతో త్రుళ్లిపడి, పరుగునా వచ్చి బస్సెక్కేశాడు.
ఊరి శివారు దాటుకునేసరికి బస్సు సవ్వడితో శ్రుతి కలుపుతూ వానజల్లు ప్రారంభమైంది. నల్లటి మబ్బుల ఆవరణ క్రింద చూస్తూ చూస్తూ వుండగానే ప్రపంచం చీకటిలో మునిగిపోయింది. కండక్టరు టికెట్లు ‘బుక్’ చెయ్యడం ముగించి, తెరలన్నీ దిగ విడిచి, వెళ్లి వెనకసీట్లో ఒంటిగా కూచున్నాడు.
బీభత్సంగా వున్న వాతావరణంలో నిమ్మకు నీరెత్తినట్టు కూచోవడం ప్రయాణీకులకు చేతగావడం లేదు. తుమ్మపాడు వరహాలయ్యకైతే ఎవరితోనైనా బిగ్గరగా మాట్లాడకపోతే మతిపోయేటట్టే వుంది. మాటల్లోకి దింపదగిన వ్యక్తికోసం చేస్తున్న అన్వేషణలో చూపులు మూడో వరసలో కూచున్న సన్యాసిపైకి వ్రాలాయి. బస్సంతా కలయజూచినప్పుడు సన్యాసి ఉనికిని ప్రస్ఫుటంగా తెలియజేస్తున్నవి అతడు ధరించిన కావి రంగు దుస్తులు. స్వాములవారిని దూరం నుంచి మాట్లాడించడం బాగుండదనిపించి వెళ్లి ఆయనకెదురుగా వున్న సీట్లో కూర్చున్నాడు.
‘‘స్వామీ! ఏ పని చేసుకోవడానికైనా యిబ్బందిగా వుంది. ఈ వానయోగం యింకెన్ని రోజులుంటుందంటారు?’’ సర్వప్రపంచానికి తానే ‘గార్డియన్‌షిప్’ పుచ్చుకున్నట్టుగా విజ్ఞాపన చేసుకున్నాడు వరహాలయ్య.
‘‘నాయనా! ఏదెప్పుడొస్తుందో, ఏదెప్పుడు పోతుందో చెప్పడానికి మనం కర్తలమా? అంతా వాడి లీల.’’
వాడి లీల కనీసం తమకైనా తెలియదా స్వామీ– అని మనసులోనే గింజుకున్న వరహాలయ్య ‘‘తమరెందాకా వెళ్తున్నారు స్వామీ’’ అంటూ ప్రసంగాన్ని యింకొక వైపు తిప్పాడు.
‘‘నువ్వెక్కడికి బాబూ?’’ ప్రశ్నకు ప్రశ్న ఎదురైంది.
‘‘నాగులేటికా ప్రక్కన తుమ్మపాడుంది గదండీ! అదే మా వూరు.’’
‘‘అయితే నీకీ బస్సు తుమ్మపాడు దాకా వెళ్తే చాలు. అంతే కదూ?’’
‘‘అంతేనండి. రోడ్డులో బస్సు దిగితే ఓ అరమైలు ఉంటుందండి. చక్కా నడచి వెళ్లిపోగలను’’
‘‘బస్సందాకా వెళ్తే చాలునని నువ్వనుకుంటావు. ఆ తరువాత యిదేమైపోయినా నీకు దిగులుండదు...’’
‘‘అబ్బే, నేను చెప్పడం...’’
‘‘ఉన్నమాట చెప్పుకోడానికి ఉలుకెందుకు? నువ్వే కాదు. మనుషులందరూ యింతే. ఏమంటావు పెద్దాయనా?’’
వరహాలయ్య కూచున్న సీట్లోనే ఓ మూలగా ఒదిగి కూర్చున్న ముసలి వ్యక్తి ఉలిక్కిపడ్డాడు. స్వాములవారు హఠాత్తుగా తన నిలా పలకరించే సరికి ఏం చెప్పాలో తోచక తడబడిపోతూ ‘‘స్వాములూ! మీరేం మాట్లాడుతున్నారో నాకు తెలీడం లేదండీ! నే నచ్చరం ముక్క రానోణ్ని. ఎద్దుల్ని కొట్టి, ముద్దలు తింటూ బతికినోణ్ని’’ అంటూ స్వవిషయం తేటతెల్లంగా చెప్పుకున్నాడు.
స్వాములవారితో తన ప్రసంగం సజావుగా కొనసాగేటట్టు లేదని, ప్రక్కన కూర్చున్న పామరుణ్ని మాటల్లోకి దించడమే వరహాలయ్యకు మేలనిపించింది. కొరకరాని కొయ్యకంటే చొప్పదంటయినా మేలే.
‘‘ఏమయ్యా పెద్దాయనా! ఏవూరు మీది?’’
‘‘నాదా బాబూ! పుట్టింది పెదరావూరు. పెరిగింది తిమ్మసముద్రం. పెళ్లాడింది పాతకోట. గంజి కరువొచ్చినప్పుడు వలసబోయింది తూరుపుగడ్డ. ఏవూరని యివరమడిగితే ఏం జెబుదును బాబయ్యా? కలిగిన మారాజుకైతే ఒకటే వూరు. లేని బీదోడికి ఎక్కడ పొట్ట గడిస్తే అదే వూరు...’’
ఇదేమీ చొప్పదంటు కాదురా బాబో అనుకున్నాడు వరహాలయ్య.
‘‘మరైతే అన్ని వూళ్లూ చెప్పావేగానీ, యిప్పుడెళ్తున్న దేవూరో చెప్పలేదే!’’
‘‘అదేదో మంచి వూరే బాబూ. నోటికి రావడం లేదు. ఎల్లమంద వెళ్లే బస్సెక్కితే పదిహేనో మైలురాయి కాడ వుంటుందండి. ఆ వూళ్లో రాంకోటిగారని... ఓ యబ్బో, పెద్ద సావుకోరంట, ఆయన కొబ్బరితోటలో కాపుదారిగా వుంటానికని వెళ్తున్నాను. రామ్మూర్తి పంతులుగారు సీటీ రాసిచ్చార్లెండి’’
దారి పొడుగునా దిగేవాళ్లేగానీ బస్సెక్కే ప్రయాణీకులు కానరావడం లేదు.
‘‘ఏమయ్యో కండక్టర్! లింగాలబావి దాటగానే చెప్పమన్నాను. నేను కుమ్మరోళ్ల సత్రం దగ్గర దిగెయ్యాలి’’ అంటూ ఒకరు–
‘‘ముదినేపాడు చెరువు మరవ దగ్గర నన్ను దింపుతావు గదూ’’ అంటూ వేరొకరూ–
‘‘అయ్యా, ప్యాసెంజర్లూ! అప్పటికి మీవి సాదా కళ్లున్నూ, నావి ఎక్స్‌రే కళ్లా? మిన్నూ మన్నూ నల్లటి తెర గుడ్డలా అలుక్కుపోయిందయ్యా! ఎవరు దిగాల్సినచోటు వాళ్లే గమనించుకోవడం మంచిది’’ కండక్టరు చిచ్చుబుడ్డిలా ప్రేలిపోయాడు.
జరుగుతున్న ప్రసంగం వల్ల వరహాలయ్య కొక విషయం తెలిసివచ్చింది. బస్సింకా లింగాలబావి, కుమ్మరోళ్ల సత్రం దాటలేదు. ఈ మసలోణ్ని యింకొక ట్రిప్పు మాటల్లోకి దింపితే నాలుగైదు మైళ్ల దూరం వెళ్లిపోవచ్చు.
‘‘అయ్యో పాపం. వయసుడిగిన రోజుల్లో పొట్టపూడ్చుకోడం కోసం ఊరు కాని వూరు వెళ్తున్నావు. నీకు నా అన్న వాళ్లెవరూ లేరేమయ్యా పెద్దాయనా?’’
పళ్లులేని బోసినోటితో ముసలతను నవ్వుకున్నాడు. ‘‘గంపెడు బిడ్డల గంగన్నను పట్టుకుని ఎంత మాటన్నారండీ బాబుగోరూ!’’
‘‘అట్లాగా! ఎందరయ్యా నీకు పిల్లలు?’’
‘‘పెద్దోడు వరదయ్య. పాణ్యం సిమెంటు పాక్టరీలో పన్జేసుకుంటున్నాడు. రెండోవోడు రామాంజులు. బండీ, కాడెద్దులు పెట్టుకుని సంత యాపారం జేస్తున్నాడు. మూడోవోడు నాదముని. కరెంటు పన్జేస్తాడు. నాలుగోవోడు దరమయ్య. తాలూకాఫీసులో బిళ్ల బంట్రోతు. కడగొట్టోడు ముక్కంటి. కొడుకుల సంగతి సెప్పానా! కూతుళ్లు ముగ్గురండి. పెద్ద కూతుర్నిచ్చింది చీనెపల్లె. రెండో కూతుర్ని కొండపాలెంలో యిచ్చాను. మూడో కూతుర్ని కాపురానికి పంపి ఆరునెల్లయింది.’’
చిక్కావురా మిడతంబొట్లూ అనుకున్నాడు వరహాలయ్య. ‘‘ఎందరుండి ఏంలాభం లేవోయ్ గంగన్నా?’’
‘‘బతికినంతకాలం ఒకిరికి పెట్టినోణ్నేగానీ, ఒకరి తిండి తిన్నోణ్నిగాను. వాళ్ల బతుకు వాళ్లు బతుక్కుంటున్నారు. జానెడు పొట్ట కోసం ఒకర్ని కాపెట్టుకుని కూచుంటామా?’’
వరహాలయ్య విస్తుపోయాడు. ‘ఇల్లు లేదు, వాకిలి లేదు, కట్టుకున్న పంచ, పైన వేసుకున్న గొంగడీ తప్పితే యింకొక బట్ట లేదు. అయినా ఈ ఎముకల గూడులో ఎంత ధీమా ఏడ్చిందిరా బాబూ!’
బస్సు ముదినేపాడు చెరువుకట్ట దాటుకునేసరికి వాన వెలిసిపోయింది. ఆకాశాన నక్షత్రాలు కూడా కానరాసాగాయి. ‘ఇంకెంతదూరం మూడు మైళ్లే గదా’ అనుకున్నాడు వరహాలయ్య. ఆ మూడు మైళ్ల దూరం గూడా పది నిమిషాల్లో గడిచిపోయింది.
డ్రయివరు నాగులేటిగట్టున బస్సు నిలబెట్టి ‘‘ఏటిలో నీళ్లొస్తున్నాయే’’ అన్నాడు.
‘‘ఫరవాలేదులే! వానవొస్తే ఏటికెల్లవ రావడం మామూలే. ఒక్క బిర్రున నువ్వు ముందుకు వెళ్లిపోవయ్యా కేశవులూ’’ హుషారిచ్చాడు చెన్నారెడ్డి.
‘‘అవునవును’’ అన్నాడు సుబ్బానాయుడు.
‘‘వరద ఎక్కువగావచ్చు. తొందరగా వెళ్లిపోవడం మంచిది.’’
‘‘తనకే తెంపుండాలిగానీ డ్రయివరుకు మనం ధైర్యం చెప్పాలంటే అవుతుందా?’’
– డ్రయివరు ఏదో పూనకం వచ్చినవాడిలా బస్సును స్టార్టు చేసి నీటిపైకి వదిలేశాడు. ‘పోనీ పోనీ, ఉండు వుండుండు’ గావుకేకల మధ్య బస్సు సుడిగుండంలో స్తంభించిపోయింది. ముందువైపు ఇంజనులోకి, వెనుక వైపున్న ప్రవేశద్వారం లోనుంచీ ప్రవాహజలం చొచ్చుకురాసాగింది. మృత్యుభయం శరీరంలోకి విద్యుత్తులాంటి శక్తిని రవాణా చేస్తుందేమో. ఏ దారిగుండా వెలుపలికి వచ్చారో, ఏవిధంగా పైకి పాకిపోయారో క్షణాలలోగా ప్రయాణీకులందరూ బస్సు టాపుపైన వున్నారు. తడి ఆరిపోయిన నాలుకలతో, నిలువునా కంపిస్తున్న శరీరాలతో. అర్ధరాత్రి కావొచ్చేసరికి నీటిమట్టం యింకొక అడుగు పైకి లేచింది.
‘‘ఈ చావు గడియల్లోనైనా ఒక మంచి మాట చెవిలో వేస్తారా స్వామీ’’ దీనంగా అర్థించాడు చెన్నారెడ్డి. స్వాములవారు ఆకాశం వైపు చూసారు.
‘‘ఏదైనా మంత్రోపదేశం చేసినా సరే. చివరి క్షణాల్లో జపిస్తూ కళ్లు మూస్తాము’’ నందవరం సీతారామయ్య మరింత ప్రయోజనకరమైన ప్రతిపాదన చేశాడు.
‘‘ఇదొకరు చెప్పగా యింకొకరు వినడానికి తగిన పరిస్థితి కాదు. మీ మీ తీరని కోరికలేవో చెప్పుకుంటే, ఆ బంధం నుంచి విముక్తి పొందవచ్చు.’’
‘‘రెండో పంట కోసం చెరువు క్రింద ఒక బావి తవ్వించి పంపుసెట్టు పెట్టించాలనుకున్నాను’’ చెన్నారెడ్డి.
‘‘కాశీ, రామేశ్వరం చూసి రావాలనుకున్నాను. నాకంత అదృష్టం గూడానా’’ సుబ్బానాయుడు.
ఒక్కొగానొక్క కూతురుకు కడుపున కాయగాయక పోవడం సీతారామయ్యకు తీరని చింత.
మడిచిన గొంగళి తలక్రింద పెట్టుకుని గంగన్న గుర్రుపెడుతూ గాఢంగా నిద్ర పోతున్నాడు.
‘‘మరైతే స్వామీ! తమ తీరని కోరికేమిటో’’
‘‘అబ్బే మాకేం కోరిక. మేం కోరుకునేది ముక్తి. ఈ కట్టె కడతేరిన తర్వాతనే గదా అది లభించేది’’ అన్నాడు.
‘‘బ్రతికుండగా ముక్తి లభించదా స్వామీ?’’
స్వాములవారు ఏదో చెప్పబోయి, గంగన్న ముఖంలోని ప్రశాంతతను గమనించినవారై మౌనముద్రలోకి జారిపోయారు.
తెల్లవారేటప్పటికి వరద తగ్గుముఖం పట్టింది. ‘ఏమయ్యా పెద్దాయనా! నిండుగా పారుతున్న ఏటిలో నీకెలా నిద్ర పట్టింది?’’ అని తోడి ప్రయాణీకుడెవరో ప్రశ్నిస్తే, గంగన్న సిగ్గుతో బుర్ర గోక్కుంటూ ‘‘పదిమందితో సావంటే, పెళ్లితో సమానం గదా’’ అంటుండటం వినిపించింది.
(సాక్షి సాహిత్యం; 13 ఆగస్ట్ 2018)