హిందూకు 50
నాకు 25?నిన్న (3rd Sep) పొద్దున్నే హిందూతోపాటు ఓ కట్ట పేపర్లొస్తే, ఇంకేదైనా పేపర్ పొరపాటుగా వేశారేమో అనుకున్నా. కాదు, మూడు అదనపు సప్లిమెంట్లూ వాళ్లవే. హిందూ హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభమై(సెప్టెంబర్ 3, 1976) 50 ఏళ్లు పూర్తయిందట! ఏడాది ఇటూఅటుగా అది నా వయసు. మహానుభావులంతా సెప్టెంబర్‌లోనే జన్మెత్తుతారని తెలుసుగా! కానీ హిందూ పాఠకుడిగా, బహుశా నాకు 25 ఏళ్లు వచ్చివుంటాయి. అంటే దాన్ని సిద్దిపేటలో డిగ్రీ చదువుతున్నప్పుడు ఏ టీ స్టాల్లోనో అటూయిటూ తిప్పడంలా కాకుండా, కొంటూ చదవడానికి అన్నేళ్లు.
కాంపిటీటివ్ పరీక్షల్లో విజయం సాధించాలంటే చదవాల్సిన జాబితాలో హిందూ పేరు వస్తుండటం అప్పుడప్పుడే చూస్తున్నా. విద్యార్థులుగా సహజంగానే చాలామంది అప్పటికివుండే రెండు ఆసక్తులు– అటు క్లాసిఫైడ్స్ కోసం, ఇటు సినిమాల కోసం– డీసీని ప్రిఫర్ చేస్తుండేవాళ్లు. నేనూ కొన్నాళ్లు చదివాను గానీ, దాన్ని కంటిన్యూ చేయలేదు. టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా నాకెందుకో పెద్దగా ఆనలేదు. వాటి మేకప్ ఎందుకో నాకు సెట్ కాలేదు. కానీ హిందూను చూశాక, ఇది నాకు తగినదనిపించింది. చూడటానికి హాయిగా ఉంటుంది. ఇంక అది అలా కంటిన్యూ అవుతోంది. నాకు లేఅవుట్ నీటుగా దీర్ఘచతురస్రాలు, చతురస్రాలుగా మాత్రమే కనబడాలి. అలా లేకపోతే నేను చదవలేను.
నేను జర్నలిజంలో చేరేనాటికి కూడా హిందూ బ్లాక్ అండ్ వైట్‌లోనే వచ్చేది. లేదా ఫ్రంట్ పేజీలో ఒక ప్రత్యేకమైన ఫొటో వరకు బ్లాక్ అండ్ వైట్‌లో వేసేవాళ్లో! రాజకీయాలకు సంబంధం లేని ఒక హ్యూమన్ ఎసెన్స్ ఫొటో లాంటిది. నా బ్యాచ్‌మేట్ రవితో అబ్దుల్లాపూర్‌మెట్ నుండి రామోజీ ఫిలింసిటీ వైపు నడుచుకుంటూ వెళ్తూ, రేపు వీళ్లు ఏం ఫొటో వేస్తారా అని మాట్లాడుకున్నది నా తొలినాళ్ల హిందూకూ, ఇప్పుడు లేని రవికీ సంబంధించిన ఉమ్మడి జ్ఞాపకం. హిందూలో ఫొటోలకు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా, వాళ్ల పేర్లు కూడా ఇస్తారు కాబట్టి, పి.వి.శివకుమార్ నుంచి ‘మొదలుపెట్టి’ ఇప్పటి నగర గోపాల్‌దాకా అందులోని ప్రతీ ఫొటోగ్రాఫర్ పేరు తెలుసు. వైజాగ్ నుంచి వచ్చిందంటే అది కె.ఆర్. దీపక్. జమ్ము కశ్మీర్ నుంచయితే నిస్సార్ అహ్మద్. ఇక రిపోర్టర్లు ప్రవీణ్ స్వామి నుంచి శివ్ సహాయ్ సింగ్ దాకా; నిస్తులా హెబ్బర్ నుంచి ప్రబాలికా ఎం. బోరా దాకా... హిందూవాళ్లంటే అంతెత్తు మనుషులేమో అనుకోవడం!
(కరుణానిధి చనిపోయినప్పుడు వచ్చిన మూడు నాలుగు నివాళి వ్యాసాల్లో ఒక పీస్ ఉంటుంది. చిన్నది. కానీ అది ఎంత చిక్కగా ఉంటుందంటే ఇంత ముక్కలో ఇంత చెప్పొచ్చా అనిపించింది. ఎవరో సురేశ్ నంబత్ అని కొత్తాయన రాశాడనుకున్నా. తీరా చూస్తే ఆయన ఎడిటర్ అయ్యాడు తర్వాత.)
ఒక తీపిచేదు జ్ఞాపకం ఏమిటంటే, హిందూకు కొనసాగింపుగా కొన్ని రోజులు ఫ్రంట్‌లైన్ ‘కొని’ చదివేవాడిని. టి.కె.రాజలక్ష్మి, ప్రఫుల్ బిద్వాయ్, ఎ.జి.నూరానీ, జయతి ఘోష్ లాంటి పేర్లు అలా తెలుసు. కానీ అందులో చదవడానికి ఎంత మెటీరియల్ ఉండేదంటే, ఒక ఇష్యూ అయిపోయేసరికి ఇంకో ఇష్యూ రెడీగా ఉండేది. అంటే, అప్పట్లో ప్రతీ పేజీ చదవాలన్నంత చాదస్తం ఉండేది. ఈ పట్టింపు వల్ల దీన్ని కాదని నాకు నచ్చే ఇంకో పుస్తకం చదవడానికి వీలు లేకపోయేది. ఇంక దీన్ని మానేయడం తప్ప మార్గం లేదని వదిలించేసుకున్నాను. అలా ఒక పది పదిహేనేళ్లు దానికి దూరమైపోయి, మళ్లీ ఓ ఏడాదిగా డిజిటల్ వరకు, ముఖ్యంగా అనసూయ ముఖర్జీ, ఆనంద్ మిశ్రా, జినయ్ జోస్ పి. రాసే న్యూస్‌లెటర్స్ వరకు చదువుతున్నా. Jinoy Jose P నా ఇటీవలి అబ్బురం!

(Posted on FB on 4th September 2026)

No comments:
Post a Comment