Friday, July 29, 2022

WANT TO GO


Our Film, Vellipovaali (WANT TO GO) is available with English Subtitles now.


WANT TO GO


‘వెళ్లిపోవాలి’కి సబ్‌టైటిల్స్‌ చేయడం అయ్యాక, సినిమా ఎలాంటి భావం కలిగిస్తుందా అని మ్యూట్‌లో పెట్టుకుని చూశాను. కొన్నిసార్లు మేము మరీ ఇంత లోతుగా మాట్లాడేశామా అనిపించింది. తెలుగులో మామూలు మాటలు కూడా ఆంగ్లంలో గంభీరంగా ధ్వనిస్తాయి. కొన్నిసార్లు సరదాగా ఉంది. కొన్నిసార్లు కండపోయిన ఎముకలా కూడా ఉంది. ఆ మాటల వేగానికి ఆ రాజీ తప్పదేమో. కానీ ఓ పది పన్నెండేళ్లుగా సబ్‌ టైటిల్స్‌ ఉన్నవే ఎక్కువ చూడటం అలవాటయ్యాక, మా సినిమాకు కూడా ఇవి పడటం ఆ చిట్టచివరి అలంకరణేదో పూర్తయినట్టుగా అనిపించింది. సబ్‌ టైటిల్స్‌ చేసిన మిత్రులందరూ ఎంత దగ్గరగా మా మాటలను తీసుకునివుంటారా అని తలుచుకుని సంతోషం కలిగింది.

మాటల్లో అంతగా తెలియదుగానీ నిశ్శబ్దంగా చూస్తే– టాల్‌స్టాయ్‌ కనబడ్డాడు. రష్యన్‌  అనువాద ప్రస్తావన వచ్చింది. ఫుకుఓకా వస్తాడు. లారీ బేకర్‌ వస్తాడు. నొరోవ్‌బాంజాద్‌ కనబడుతుంది. టాగూర్‌ ఉన్నాడు. రమణ మహర్షి ఉన్నాడు. ఇంక చలంను ఇంతగా తలుచుకున్నామా అనిపించింది. ఇప్పుడు ఇది పాన్‌ ఇండియా ఏం ఖర్మ, రియల్‌ వరల్డ్‌ సినిమా అయిపోయింది.

  

 

Wednesday, July 27, 2022

లేడీ కండక్టర్ల బస్సుల్లో ఒక రోజు



అదే పదివేలు
–––––––––

ఎఫ్బీలో పెట్టే పోస్టులు పెడుతూనే, ఇందులో ఎంతో కొంత మళ్లీ చదువుకునేట్టుగా ఉండేవాటిని బ్లాగులో కూడా పోస్టు చేస్తున్నాను. బ్లాగులోనైతే పద్ధతిగా వెతుక్కోవచ్చు. ఏదో లోకార్పణం చేసినట్టుగా పెడుతున్నాం గానీ, వీటిని ఎవరైనా చదువుతున్నారా అనే అనుమానం ఒకటి ఉంటుందిగా; ‘స్టాట్స్‌’లోకి వెళ్లి చూస్తే అత్యధికం అటూయిటూగా వంద దగ్గర ఊయలూగుతుంటాయి. ఏవో కొన్ని రెండు, మూడు వందల్లోకి పోతాయి. అరుదుగా నాలుగు, ఐదు, ఎనిమిది వందల దాకా పోయినవి కూడా ఉన్నాయి. అసలు ఈ పోస్టు రాయడానికి, ఈ లెక్కల వల్ల ఒకింత కంగారు పడటం కారణం. ఒకదానికి ‘9.8కె’ అని చూపించింది. ఇది నేను పెట్టిన పోస్టేనా, నా బ్లాగు ఏమైనా హాక్‌ అయిందా అని అనుమానం వచ్చింది. మళ్లీ మళ్లీ మార్చి చూస్తే, అది నిజమే. ఆ పోస్టు ఏమిటంటే, ‘లేడీ కండక్టర్ల బస్సుల్లో ఒకరోజు’. ఇది పెట్టినట్టే మర్చిపోయాను. ఎందుకంటే, 2011–13 ప్రాంతంలో రియాలిటీ చెక్‌ సీరీస్‌ రాశాక, 2013 డిసెంబరులో వాటిని గంపగుత్తగా బ్లాగులో గుమ్మరించేశాను. ఆ వెంటనే పుస్తకం రావడంతో వాటన్నింటినీ ‘డ్రాఫ్టు’లుగా మార్చేశాను. అందువల్ల అవి ఉన్న విషయం కూడా గుర్తులేదు. 

అయితే ఇప్పుడేంటి? పదివేల మంది చదవడం గొప్పా? ఏమో, ఒక వెబ్‌ మ్యాగజీన్‌ ఎడిటర్‌ ఓసారి నాతో అన్నాడు. బాగా చదివిందీ అనుకున్నదానికి వెయ్యి, రెండు వేల వ్యూస్‌ వస్తాయి; కాబట్టి, ఎక్కువమందికి రీచ్‌ కావడమే మన టార్గెట్‌ అయితే గనక, అది ఎంత తక్కువ సర్క్యులేషన్‌ ఉన్నదైనా సరే, ప్రింటే బెస్ట్‌ ఆప్షన్‌. అదింకా వెబ్‌ మ్యాగజీన్ల గురించి కదా చెప్పింది. కనీసం నలుగురి నోళ్లల్లో నానుతూ ఉంటాయవి. అట్లాంటిది ఒక ఇండిపెండెంట్‌ బ్లాగులో ఒక పోస్టును పదివేల మంది చదవడం ఒకింత కంగారు పెట్టింది. రీచ్‌ అవడానికి ఇంత పొటెన్షియల్‌ ఉందా అని సంతోషం కూడా వేసింది. ఈ శుభ సందర్భంగా ఆ డ్రాఫ్టును రీ–పోస్ట్‌ చేస్తున్నా. 

(ఎఫ్బీ కోసం రాద్దామని మొదలుపెట్టింది, బ్లాగు కోసం రాసినట్టుగా ముగిసింది.)
 
 

 

Tuesday, July 26, 2022

ఇరానీ హోటల్లో రెండున్నర గంటలు

 

 రియాలిటీ చెక్ పేరిట 2011 డిసెంబరు 4, ఫన్డే కోసం రాసిన మొదటి పీస్‌.
 

Saturday, July 16, 2022

పీటర్‌ బ్రూక్‌: విశ్వ భారతం

 


విశ్వ భారతం


తపోదీక్షలో ఉన్న వ్యాసుడికి ఉన్నట్టుండి సృజన ఉప్పొంగుతుంది. మానవజాతి చరిత్రను కావ్యరూపంలో రాయ సంకల్పించి, తనకు లేఖకుడిగా కౌమార బాలుడైన పరీక్షిత్తును ఉండమంటాడు. పరీక్షిత్తుకు తన పూర్వీకులను అతి దగ్గరగా పరిచయం చేయడం వ్యాసుడి ప్రాథమికోద్దేశం. మనుషుల అతి సంక్లిష్టమైన స్వభావాలను చిత్రించడం ద్వారా మానవజాతికి తమ ఉనికి పట్ల ఒక జాగరూకతను కలిగించడం పరమ లక్ష్యం. ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధం తర్వాత జరిగింది సర్వనాశనమే. ఇంతటి మహోన్నత కార్యం కాబట్టే, సాక్షాత్తూ దేవుడే(గణేశుడు) స్వయంగా వ్యాసుడికి లేఖకుడిగా కుదురుకుంటాడు. ఇటీవల మరణించిన రంగస్థల దిగ్గజం పీటర్‌ బ్రూక్‌ దర్శకత్వం వహించిన ‘ద మహాభారత’, తానూ ఒక పాత్రగా ఉన్న భారతాన్ని వ్యాసుడు రాయడానికి పూనుకోవడంతో ప్రారంభమవుతుంది. 

మనకు మహాభారతం కొత్తది కాదు. మన సారస్వతం మహాభారతంతో ప్రభవించింది. మన రంగస్థలం మహాభారతంతో సంపన్నమైంది. మన చిత్రసీమ మహాభారతంతో పదునెక్కింది. ‘తత్వజ్ఞులు ధర్మశాస్త్రంగా, ఆధ్యాత్మవిదులు వేదాంతంగా, నీతివిచక్షణులు నీతిశాస్త్రంగా, కవులు మహాకావ్యంగా, లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహంగా, పౌరాణికులు బహుపురాణ సముచ్ఛయంగా’ గౌరవించే ఇతిహాసం ఇది. ‘ఇందులో ఉన్నదే ప్రపంచంలో ఉన్నది. ఇందులో లేనిదేదీ ప్రపంచంలో లేదు.’ అందుకే బయట తలెత్తిన సమస్యకు మహాభారతంలో సమాధానం వెతకడానికి ప్రయత్నించాడు ఇంగ్లండ్‌కు చెందిన ‘పద్మశ్రీ’ పీటర్‌ బ్రూక్‌(1925–2022).

వియత్నాంతో అమెరికా యుద్ధం జరిగిన తర్వాతి విధ్వంసం బ్రూక్‌కు మహాభారతం మీద ఆసక్తిని కలిగించింది. ప్రతి పాత్రా రక్తమాంసాలతో, తనవైన బలహీనతలతో ఉండి, యుద్ధ బీభత్సాన్ని అనివార్యం చేస్తుంది. ప్రతి మనిషీ సృష్టి విధ్వంసంలో ఏదో ఒక మేరకు పాత్రను పోషిస్తూనే ఉంటాడు; అందుకే అందరూ ఈ ప్రపంచానికి ఉమ్మడిగా బాధ్యులేనని పీటర్‌కు నమ్మకం కలిగింది. దాన్నే విశ్వ యవనిక మీద ఎలుగెత్తి చాటాడు.

క్లాసిక్స్‌ను స్టేజీ మీదకు తేవడంలో రంగస్థలానికి ప్రమాణాలు నెలకొల్పిన పీటర్‌ బ్రూక్‌ ‘అవర్‌ గ్రేటెస్ట్‌ లివింగ్‌ థియేటర్‌ డైరెక్టర్‌’ అనిపించుకున్నాడు. భారతం కోసం ఫ్రెంచ్‌ రచయితలైన జాన్‌ క్లాడ్‌ కారియేరీ, మేరీ హెలెనా ఏస్తియన్‌తో జట్టు కట్టాడు. ఎనిమిదేళ్ల శ్రమ తర్వాత పన్నెండు గంటల నాటకంగా భారతం రూపొందింది. 1985లో తొలి ప్రదర్శన జరిగింది. పదహారు దేశాలకు చెందిన నటీనటులతో నాలుగేళ్లపాటు వీరి బృందం అమెరికా నుంచి ఆఫ్రికా గ్రామాల వరకూ పర్యటించింది. ముంబయి నగరానికీ వచ్చింది. తెలుపు, నలుపు, గోధుమ వర్ణాల నటులతో ఇది నిజంగానే ప్రపంచ నాటకంగా మారిపోయింది. ‘లార్డ్‌ ఆఫ్‌ ద ఫ్లైస్‌’ లాంటి సినిమాతో సినీ దర్శకుడిగానూ ప్రసిద్ధుడైన బ్రూక్‌ తన నాటకం ఆధారంగానే 1989లో ఐదున్నర గంటల టెలివిజన్‌ సిరీస్‌గా ‘ద మహాభారత’ రూపొందించారు. ఆయన్ని అంచనా కట్టడానికి మనకు ఇప్పుడున్న సోర్సు ఇదే! ‘మ..హా..భా..ర..త్‌..’ అంటూ దూరదర్శన్‌ ద్వారా 94 వారాల ధారావాహికను ఇంటింటికీ పరిచయం చేసిన బీఆర్‌ చోప్రాకు ముందు, లేదా సమాంతరంగా బ్రూక్‌ అనుసృజన మొదలైంది.

మొదటి సీన్‌ నుంచే మనకు అలవాటైన భారతాన్ని చూడటం లేదని అర్థమైపోతుంది. ఒక్క ద్రౌపది(మల్లికా సారాభాయి) తప్ప ఎవరూ భారతీయులు కాదు. సెట్టింగులు తక్కువ, ఆభరణాలు అత్యల్పం, కిరీటాలు లేవు, పరిచారికలు కనబడరు, జయజయ ధ్వానాలు శూన్యం, రాజకుమారులందరూ షేర్‌వానీలు తొడుక్కుంటారు. మహామహా యోధులు బారులు తీరిన చివరి యుద్ధ ప్రారంభ సూచికగా అర్జునుడు శంఖం ఊదినప్పుడు కనబడేది మహా అయితే రెండు తెల్ల గుర్రాలు మాత్రమే. ఒక భారీ విజువల్‌ ఫీస్ట్‌ దీన్నుంచి ఆశించలేం. కానీ పీటర్‌ బ్రూక్‌ గొప్పతనం ఎక్కడంటే, అవేవీ లేకుండానే ఆ ఉద్వేగాన్ని పలికించగలగడం. రంగస్థలం మీద ఒక ఖాళీ స్థలంలో నువ్వొక విశ్వాన్ని చూపగలవు; నటుడి చేతిలోని ఒక కర్ర, ఒక సీసా, లేదా ఖాళీ మద్య పాత్రతో ఎంతో చేయొచ్చునంటాడు బ్రూక్‌. ఆ స్ఫూర్తి ఇందులోనూ కనబడుతుంది. కథను వర్తమానంలో చూపడం కంటే జరిగిపోయినదాన్ని వ్యాసుడు నెరేటర్‌గా చెబుతుండటం వల్ల ఇందులో ఉన్నదేదీ ఇక లోపంగా కనబడదు.

కృష్ణుడు నీలవర్ణంలో ఉండకపోవడం, భీష్ముడంతటివాడిని కూడా మనవలు పేరు పెట్టి పిలవడం భారతీయ పద్ధతికి దూరం. గన్నేశా, సత్యవత్తి లాంటి ఉచ్ఛారణలు భారతీయేతరుల పరిమితి. వీటికంటే కూడా భారత వారసత్వాన్ని దొంగిలిస్తున్నాడని పీటర్‌ నిందలు ఎదుర్కొన్నాడు. అయితే, భారతం ప్రపంచానికి చెందినదని తన ప్రయత్నాన్ని సమర్థించుకున్నాడు.

మడుగులో నీళ్లు తాగడానికి అనుమతి ఇచ్చేముందు యక్షుడు అడిగే ప్రశ్న: ‘ఈ ప్రపంచానికి కారణం ఏమిటి?’ దానికి ధర్మరాజు సమాధానం: ‘ప్రేమ!’ ఇదే సర్వకాలావసరం. సాహిత్య ఆదాన ప్రదానాలకు కారణమయ్యే, అన్ని ప్రాంతాల వైవిధ్యమైన కథనాలను ప్రపంచం వినగలిగేట్టు చేసే సాంస్కృతిక దూతలు ఎప్పుడూ అవసరమే. మనుషులను అర్థం చేసుకోవడం ద్వారానే మనుషులు మారగలరు. 

(11-7-2022)

 

Sunday, June 26, 2022

గూడూరి సీతారాం కథా పురస్కార స్వీకరణ ప్రసంగం


నలిమెల భాస్కర్, ఆకునూరి శంకరయ్య, గూడూరి వేణు, జూలూరి గౌరీశంకర్, పూడూరి రాజిరెడ్డి, జుకంటి జగన్నాథం, గూడూరి రాఘవేంద్ర, గూడూరి ప్రవీణ్, పత్తిపాక మోహన్, ఎలగొండ రవి





 

గూడూరి సీతారాం కథా పురస్కార స్వీకరణ ప్రసంగం

సినారె విజ్ఞాన మందిరం, సిరిసిల్ల

ఉదయం 10:00; 19 జూన్‌ 2022

---------------------------------------------

ఇలా ఈ పురస్కారం తీసుకుంటున్నానని ఫేస్‌బుక్‌లో పెడితే, కొందరు మిత్రులు గూడూరి–పూడూరి మధ్య ఉన్న రైమింగ్‌ను ప్రస్తావించారు. నాకు తెలియకుండానే ఎప్పుడో గూడూరితో నా పేరు ముడిపడిపోయినట్టుగా ఉంది.

మామూలుగా ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటుంటారు కదా. సాహిత్యం అనేది గెలుపు ఓటములకు సంబంధం ఉన్నది కాదు. కానీ నన్ను నిజంగా ఎంతోకొంత సీరియస్‌గా చదివే ఎక్కువమంది ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నారనిపిస్తుంది. ఈ మాట అంటే మేము లేమా అని నామీద అభిమానంతో కోపానికి వచ్చే తెలంగాణవాళ్లు కూడా ఉన్నారని నాకు తెలుసు. కానీ నేను చెప్పేది, ఆ సంఖ్యతో పోల్చినప్పుడు. అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుండె... ఇక్కడ నన్ను నిజంగా చదువుతున్నారా, నిజంగా సాహిత్యం అనేదాన్ని అర్థం చేసుకునే పాఠకులున్నారా... వీళ్లకు అలవాటైన మూసలు దాటితే వీళ్లకు అర్థమైతదా... కానీ ఈ పురస్కారం వల్ల ఇక్కడ కూడా నన్ను చదువుతున్నారు, పట్టించుకుంటున్నారు అన్న చిన్న ఫీలింగ్‌ వచ్చింది. ఒక విధంగా ఇంట కూడా గెలిచిన ఫీలింగ్‌ వచ్చింది.

ఇంకోటి ఏంటంటే– నేను ఆరో తరగతి నుంచి ఊరికి దూరంగానే ఉంటున్నా. మేడ్చల్, కీసరగుట్ట, పటాన్‌చెరు, హైదరాబాద్‌... చదువు, ఉద్యోగం... ఏం చేసినా ఆల్మోస్ట్‌ ముప్పై ఏళ్లుగా నేను హైదరాబాద్‌లోనో, హైదరాబాద్‌తో సంబంధంలోనో ఉంటున్నా. దసరాకూ, సంక్రాంతికీ ఏదో పండుగకు ఊరికి వచ్చినట్టే అయిపోయింది. ఈ ఒకట్రెండేళ్ల నుంచే కొంచెం ఊరికి ఎక్కువ వచ్చిపోతున్నా, ఎక్కువ ఉంటున్నా కూడా. కరోనా వల్ల జరిగిన మంచి విషయాల్లో అదొకటి. నలభై ఐదు రోజులు వరుసగా, రెండు దఫాల్లో ఉండగలిగిన. ఎప్పుడు ఇట్ల వీలు గాలె. ఉరుకుడు, ఉరుకుడు... మూడ్రోజులు సెలవు పెట్టుకునుడు, ఆదివారం కలిసి వచ్చేటట్టు చూసుకునుడు... వచ్చుడు, పోవుడు ఇదే కథ... కానీ నేను ఎక్కడినుంచన్నా రానీ... ఈ సిద్దిపేట, సిరిసిల్ల మోపుకు రాంగనే... ఆ వాతావరణమే మారిపోతది. మన మనుషుల్ల పడ్డం అనిపిస్తది. వాళ్ల ఎవ్వరితోటి మనకు పరిచయం ఉండది. మనం పోయి మాట్లాడకపోవచ్చు. కానీ మనోళ్లు అని అనిపిస్తది. మన భూమితో, మన ప్రాంతంతో, మన ఊరితో ఉండే సంబంధం అది. ఏదో ఒక గుండె నిండినట్టు. అట్ల ఈ అవార్డు మన మనుషుల్ల తీసుకునుడు ఇంకొంచెం సంబురం.

సీతారాం గారిది హన్మాజీపేట అని తెలిసి అది ఇంకా పెరిగింది. ఇగ అది మన ఊళ్లే, మన ఇంట్ల తీసుకున్నట్టే.

నా బాధ్యత పెరిగింది, నేనేదో సమాజానికి ఏదో చేశాను ఇట్లాంటి మాటలేమీ చెప్పను. నా వరకు పురస్కారం అంటే ఏమిటంటే, అది ప్రశంసకు ఒక భౌతికరూపం ఇవ్వడం. మీరు రాసింది బాగుంది అంటే ఎట్లాంటి సంతోషం అనిపిస్తదో, అట్లాంటిదే ఇది కూడా.

అయితే అవార్డుల మీద నేను మరీ ఎక్కువేమీ ఆలోచించలేదుగానీ ఇవి తీసుకోవడం అనేది లేని బరువును మీద పెట్టుకున్నట్టు అవుతుందా? తెలియకుండానే దేనికో కమిట్‌ చేసుకోవడం లాంటిది అవుతుందా? అని కొంత సంశయించాను. మళ్లీ ఈ స్మారక అవార్డులు అంటే– వాళ్లు ఏ ఆదర్శానికో, ఏ భావజాలానికో నిలబడి ఉంటారు. నేను అట్లాంటి ప్రకటిత భావజాలాల్లోకి రాను. మన ధోరణికీ, వాళ్ల దానికీ మధ్య వైరుధ్యం ఉంటే ఇదొక ప్రశ్నను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవన్నీ నాకు అవసరమా అనుకున్నాను. అందుకే ఇట్లా పురస్కారం అని నాకు మొదటిసారి ఫోన్‌ చేసినప్పుడు– నా పేరు మీ దృష్టికి రావడం సంతోషమేగానీ వద్దులేవే అనే చెప్పాను. ఒక రెండు, మూడు వారాలకు మళ్లీ చేశారు. నాకు రకరకాల బలహీనతలు ఉన్నాయిగానీ ఈ పురస్కారాల లౌల్యం అయితే లేదనే అనుకుంటాను. కానీ రెండోసారి చేసినప్పుడు– నిరాకరించలేని మొహమాటం ఒకటి, రెండోది మర్యాద కూడా కాదనిపించింది. అందుకే ఇప్పుడు ఇలా మీ ముందున్నాను.

మనం ఒకరి పేరు మీద అవార్డు తీసుకుంటున్నప్పుడు వాళ్లు ఏమిటి అని తలుచుకోవడం ఒక సాహిత్య మర్యాద. నేను గూడూరి సీతారాం గారి కథలు మరీ ఎక్కువ చదవలేదు. అవైనా మనకంటే ముందుతరంలో రాసినవాళ్లు ఏం రాసివుంటారు అనే చిన్నపాటి కుతూహలంతో చదివినవే. అందుకే నేను చదివినవాటితో ఆయన నిజమైన ప్రతిభను అంచనా కట్టవచ్చా అన్నది చెప్పలేను. కానీ చదివినమేరకు కథకు ఉండే నిజమైన పొటెన్షియల్‌ను, విస్తృతిని ఆయన అందుకోలేదేమో అనిపించింది. కానీ ఆయన రాసిన కథలు చూస్తే– నారిగాని బతుకు, మారాజు ఇట్లాంటివి– 1954, 1957 ఇట్లా ఉన్నాయి అవి అచ్చయిన సంవత్సరాలు. 1936లో జన్మించారనుకుంటే– ఆయన ఎర్లీ ట్వెంటీస్‌లో, పచ్చి యువకుడిగా రాసిన కథలు. అంత చిన్న వయసులో ఆయన సాహిత్య రంగం మీదకు రావడం ఒక విశేషం... 

ఇంకా ముఖ్యంగా, ఇప్పుడు తెలంగాణ భాష కూడా ఒక కమర్షియల్‌ ఎలిమెంట్‌ స్థాయిని అందుకోవడం వల్ల ప్రధాన స్రవంతి టీవీ ఛానళ్లలో కూడా యధేచ్ఛగా మాట్లాడే పరిస్థితి వచ్చిందిగానీ... ఆ 1950, 60ల కాలంలో, అలాంటివి అచ్చుకు నోచుకోవడం చాలా కష్టమైన రోజుల్లో ఆయన తెలంగాణ మాండలికంలో రాయడం గొప్ప విషయం. బహుశా సీతారాం గారిని సాహిత్య లోకం తలుచుకుంటున్నది ఆయన కథల కంటే కూడా ఆయన భాష కోసం అనుకుంటున్నాను. ఈ అవార్డు పెట్టిన ఉద్దేశం కూడా తెలంగాణ భాషలో రాస్తున్నవాళ్లకు ఇవ్వడానికే.

అయితే భాష మీద నా వైఖరి కూడా చెప్తాను. రాతపూర్వక భాషకూ, మాట్లాడే భాషకూ కొంత తేడా ఉంటుందనీ, ఉండాలనీ అనుకుంటాను. అంటే, భాష కోసం భాష అని మరీ తెచ్చిపెట్టి కృతకం చేయను. కానీ తెలంగాణ ఫ్లేవర్‌ నా రైటింగులో చాలానే ఉంటుందనుకుంటాను. ఇంక స్పోకెన్‌ సందర్భాలు వచ్చినప్పుడు– రియాలిటీ చెక్‌ పుస్తకంలో చాలాచోట్ల... ఆజన్మం పుస్తకంలో కొన్ని చోట్ల... చింతకింది మల్లయ్య ముచ్చట, కాశెపుల్ల, చినుకు రాలినది, రెండో భాగం, గంగరాజం బిడ్డ, కొండ లాంటి కథల్లో సందర్భాన్ని బట్టి జీవితానికి చాలా దగ్గరగా ఉండే భాషను వాడగలిగానని అనుకుంటాను. అదొక్కటే నేను ఈ పురస్కారం అందుకోవడానికి అర్హత అనుకోగలిగేది.

గూడూరి సీతారాం పేరిట ఒక పురస్కారాన్ని ఏర్పాటుచేయడమూ, దాన్ని మొదటగా నాకే ఇవ్వడమూ చాలా సంతోషంగా ఉంది. ఇది ఫార్మాలిటీ మాటగా చెప్పేదే కావొచ్చు. కానీ ఆ ‘మొదటి’ అనే మాట సంతోషాన్ని రెట్టింపు కూడా చేస్తోంది. దీన్ని ఏర్పాటుచేసిన సీతారాం గారి సంతానం గూడూరి వేణు గారికీ, సీతారాం తమ్ముడు రాఘవేంద్ర గారికీ, నాకు ఈ పురస్కారం ఇవ్వడానికి చొరవ చూపిన పత్తిపాక మోహన్, జూకంటి జగన్నాథం గార్లకూ ధన్యవాదాలు. ఇంకా ఈ వేడుకలో భాగమైన జూలూరు గౌరీశంకర్‌ గారికీ, ఆకునూరి శంకరయ్య గారికీ, గూడూరి ప్రవీణ్‌ గారికీ, గరిపెల్లి అశోక్‌ గారికీ... నిర్వహణలో భాగం పంచుకున్న మానేరు రచయితల సంఘం కవులు ఎలగొండ రవి, జిందం అశోక్, గోనె బాల్‌రెడ్డి, ఆడెపు లక్ష్మణ్, బూర దేవానందం గార్లకూ ధన్యవాదాలు. ఇంకా దీన్ని ముఖ్యమైన ఈవెంట్‌గా తలచి వచ్చిన ‘మీ అందరికీ’ కూడా!


(ఫొటోలు పంపిన నాగేంద్ర శర్మ గారికి కృతజ్ఞతలు.)