Pages

నేను ఈ ప్రపంచాన్ని రెండు రకాలుగా విభజిస్తున్నా. నాలా ఉండగలిగేవాళ్లు, నాలా ఉండలేనివాళ్లు.

Friday 17 February 2012

మళ్లీ టైప్ చేసే పని తప్పింది!

నేను కంపోజ్ చేసిపెట్టే ఐటెమ్స్ కంటే, ఇమేజెస్-గా ఎక్కువ పోస్ట్ చేస్తూ ఉంటాను.
అయితే, కొన్ని రోజులుగా బ్లాగులో లైట్ బాక్స్ అని వస్తోంది. ఇమేజెస్ థంబ్ నెయిల్స్ లాగా వరుసగా డిస్ ప్లే అవుతాయి. అక్షరాలు మసగ్గా ఉంటాయి.
దానికి కంట్రోల్ ప్లస్ ప్లస్ అని జూమ్ చేసుకోవడమో, లేకపోతే ఇమేజ్-ను డెస్క్ టాప్ మీద కాపీ చేసుకుని చూడాల్సి రావడమో పరిష్కారంగా ఉండింది. అది కొంత అసౌకర్యం. దానివల్ల మిత్రులు చాలామంది ఇబ్బంది పడేవుంటారు. దాన్ని తొలగించేందుకు, మళ్లీ ఇవన్నీ రీ కంపోజ్ చేసి ఎలా పెట్టాలి, అనుకున్నా.
అయితే, బ్లాగు మిత్రురాలి సలహా (తను ఇంకెవరినో సలహా అడిగిందట) మేరకు ఆ లైట్ బాక్స్ ఇమేజెస్-ను డిజేబుల్ చేసేశాను. ఇప్పుడు ఇమేజెస్ రూపంలో ఉన్నది ఈజీగా చదువుకోవచ్చు.
చాలా ఈజీ పరిష్కారం ఇన్ని రోజులు తెలియనందుకు బాధ పడుతూనే, ఇప్పటికైనా తెలిసినందుకు ఆనందపడుతూ, ఇంకెవరికైనా పనికొస్తుందేమోనని ఈ లింకు దిగువన ఇస్తున్నా.
http://googlesystem.blogspot.in/2011/10/how-to-disable-bloggers-lightbox.html

Wednesday 15 February 2012

కొంచెం మధువు కొంచెం దరువు

ఇలాంటి ఒక స్థావరానికి సాధారణ స్థితిలో నేను వెళ్లేవాడినా?
వెళ్లకపోయేవాణ్ని అనేకంటే, వెళ్లలేకపోయేవాణ్ని అనొచ్చేమో!
"రియాలిటీ చెక్" కోసం జీవితంలో మొట్టమొదటిసారి ఒక 'పబ్'లో అడుగుపెట్టాను.
పబ్! ఏమిటీ పబ్?
బ్రిటన్ సంస్కృతిలో భాగమైన 'పబ్లిక్ హౌస్'కు పొట్టిరూపం పబ్. ఇక్కడ కూర్చుని మద్యం తాగుతారు. ఒకరకంగా మన కల్లుపాక లాంటిది. మరి కల్లుపాకలో డ్యాన్సులేంటి?
పాశ్చాత్యుల డిస్కోథెక్ కల్చర్ను మనవాళ్లు పబ్-తో కాక్టెయిల్ చేశారన్నమాట!
ఇప్పుడు మన దగ్గర పబ్ అంటే మ్యూజిక్-కు అనుగుణంగా డాన్స్ చేస్తూ, మద్యం సేవించడానికి అవకాశం ఇచ్చే చోటు! లేదూ, మద్యం సేవిస్తూ మధ్యమధ్యలో డాన్స్ చేయడానివి వీలుండే చోటు!

ఇలాంటి ప్రదేశానికి రాత్రి తొమ్మిదింటికి వెళ్లగానే-
ప్రవేశద్వారం ముందు నల్లప్యాంటు, నల్ల షర్టు వేసుకున్న ఇద్దరు వస్తాదులు (బౌన్సర్స్) కనిపించారు.
"గుడ్ ఈవినింగ్ సర్"
ఇంత దృఢకాయుడు ఇంత సౌమ్యంగా పలకరించడం వినడానికి మరింత బాగుంది.
ఈ బౌన్సర్ తన కళ్లతో కస్టమర్ను స్కాన్ చేస్తాడు. అంటే, 21 ఏళ్లు నిండాయా? ఎలాంటి దుస్తులు ధరించాడు? టక్ చేసుకున్నాడా? పబ్ వాతావరణానికి తగినంత ట్రెండీగా ఉన్నాడా? అని క్షణంలో పరీక్షిస్తాడు. నన్ను తిరస్కరించడానికి అతడికి ప్రాథమికంగా రెండు కారణాలున్నాయి. షూ వేసుకోలేదు, షేవ్ చేసుకోలేదు.
నిజానికి ఆ తర్వాత బౌన్సర్ మొయిన్-ను కదిల్చితే, నేను పోష్-గా కూడా లేనన్నాడు. మొదటి రెండంటే ఓకే. ఈ మూడోదాన్ని ఎలా సాధించగలం?
అయితే రిపోర్టర్ అడ్వాంటేజీ ఉందిగనక, నేను లోపలికి వెళ్లగలిగాను.

లోపలంతా మసకచీకటి. మెత్తని సోఫాలు. ఎత్తైన కుర్చీలు. పెద్ద టెలివిజన్ స్క్రీన్స్. అటెండ్ అవడానికి సిద్ధంగా ఉన్న స్టూయెడ్స్. బార్ లాగానే... కాకపోతే మరింత అందంగా అమర్చివున్న అన్ని రకాల గ్లాసులు, మద్యం సీసాలు. కౌంటర్ వెనక మద్యాన్ని కొలపాత్ర (పెగ్) ప్రకారం పోసిచ్చేందుకు ఒక బా(ర్)మన్. బార్ టెండర్ కూడా అనొచ్చు. అందరికంటే, అన్నింటికంటే ముఖ్యంగా డీజే (డిస్క్ జాకీ), అతడి 'కన్సోల్'.
సమ్బడీ ఈజ్ వాచింగ్ మి... పాట ప్లే అవుతోంది. "నేనొక సాధారణ మనిషిని, నాదో సాధారణ జీవితం..." అని రాక్ వెల్ బాధపడుతున్నాడు.
కానీ వీళ్లెవరూ సాధారణ 9-5 మనుషులుగా లేరే! చెవిపోగులు, బ్రాస్ లెట్లు, ఫ్రెంచ్ కట్లు, డైయింగులు, పిట్టగూడులు... హైహీల్సు, లిప్ స్టిక్కులు, నూడులు స్ట్రాపులు, మిడ్డీలు, చెడ్డీలు... జీన్సు ఎప్పుడో మన నేషనల్ డ్రెస్ అయిపోయింది కాబట్టి, వాటిని లెక్కించడం అనవసరం.
సూర్యాస్తమయంతోనే నిద్రలేచి, వయా బ్యూటీ పార్లర్ను టచప్ చేసుకుని వచ్చినట్టుగా... ఒక్కొక్కరే లేండ్ అవుతున్నారు. అల్ట్రా, హై-ఫై. హేయ్ డూడ్ అంటున్నారో, హాయ్ బేబీ అనుకుంటున్నారో ఆ హోరులో వినపడటం కష్టం. మర్యాదపూర్వక హగ్స్ మాత్రం కనిపిస్తున్నాయి. పేజ్-3 ఫొటోగ్రాఫర్ల కెమెరాలు క్లిక్కుమంటున్నాయి.
లడ్డూలు, పాలకోవాలు, బర్ఫీలు, జిలేబీలు... మనుషుల రూపంలో తిరుగుతున్న స్వీట్ హౌజ్ లా ఉన్నదీ పబ్!
వైన్, విస్కీ, బీర్, బ్రండీ, వోడ్కా సర్వ్ అవుతున్నాయి. అంతకంటే ఎక్కువగా కాక్ టెయిల్స్. స్లిప్పరీ నిపుల్, స్క్రీమింగ్ ఆర్గాజమ్, ఫ్రెంచ్ కిస్... తగిన పేర్లు! ఇవన్నీ బిగినర్స్ డ్రింకులు. ఆల్కహాల్ శాతం తక్కువ. పళ్లరసం, మూలికలు మిళితం చేస్తారు. ముఖ్యంగా పంచదార కలపడం వల్ల తియ్యగా ఉంటాయి. ఒక డ్రింకుకు 500 నుంచి 1000 వరకు చార్జ్ చేస్తారు. ఇంకా, పైస్థాయి కాక్ టెయిల్స్ ఉన్నాయి. వోడ్కాతో ఆరెంజ్ మిళితం చేస్తే స్క్ర డ్రైవర్ అవుతుంది. నిమ్మ రుచి వచ్చేట్టు చేస్తే బ్లూ లాగూన్. ఇంకేదో కలిపితే కాస్మొపాలిటన్ . విస్కీతో ఫలానాది కలిపి మన్ హటన్ చేయొచ్చు. జిన్-తో మార్టిని వస్తుంది. ప్రాథమిక ద్రవంగా ఆల్కహాల్... రెండోది, మూడోది, అవసరమైతే నాలుగోది మిళితం చేయడం ద్వారా కొత్త రుచి తెస్తారు. వేటిని వేటితో ఎంతెంత కలిపితే బాగుంటుందనేది ఒక సైన్సు! ఒక చరిత్ర!

మ్యూజిక్ 'ప్రైడా- మిరేజ్'లోకి మారింది. అటుపై 'డైడ్ మౌస్-ఆరల్ సినాప్స్'లోకి తిరిగింది.
చిన్నగా కాళ్లు కదులుతున్నాయి. చేతులు ఊగుతున్నాయి. నవ్వులే మంచింగ్ అవుతున్నాయి. సిగరెట్ల పొగ వ్యాపిస్తోంది. ఒక గై హుక్కా పీలుస్తున్నాడు. ఇంకొకమ్మాయి నోట్లో ఉన్న సిగరెట్-ను అబ్బాయి అంటిస్తున్నాడు. మామూలుగా మగవాళ్లు భార్యకో, ప్రియురాలికో తెలియకుండా తాగుతుంటారు కదా! వాళ్ల సమక్షంలో, వారితోనే తాగడమే ఆధునికతనుకుంటా!
నెమ్మదిగా చుక్కా చుక్కా ఆస్వాదిస్తూ బక్కపలుచటి అమ్మాయి డ్రింకు ఎంజాయ్ చేస్తోంది. ఇంత స్వీట్-గా ఉన్న అమ్మాయికి అంత చేదు ఎలా రుచిస్తోందబ్బా! ఇంతకంటే చేదు విషయాన్ని హోటల్ మేనేజ్మెంట్ చేసి స్టూయెడ్గా పనిచేస్తున్న ప్రేమ్ చెప్పాడు: "గ్రామీణ వాసనతో కనబడే వాళ్లను లోనికి అనుమతించరు (వాళ్లు కవర్ చార్జ్ అనబడే ప్రవేశ రుసం వెయ్యో, పదిహేను వందలో చెల్లించినా సరే). ఎందుకంటే, ఒక ప్రత్యేక సమూహాన్ని వాళ్ల ప్రెజెన్స్-తో పాడుచేస్తారని వీళ్లు భావిస్తారు. మాస్ క్రౌడ్ వస్తారని తెలిస్తే, క్లాస్ పీపుల్ రారు".
అబ్బా! గుండె పట్టేసినట్టయింది.
సృష్ట్యాదినుంచీ సమూహాలకూ సమూహాలకూ మధ్యన కొనసాగుతున్న అంతరం ఎప్పటికీ అంతరించదేమో! కొన్నిసార్లు కులం ఈ అంతరానికి కారణమౌతే, ఇక్కడ డబ్బు! సాధారణంగా వీళ్లను ఇంగ్లిష్ మీడియా 'పార్టీ యానిమల్స్'గా అభివరి్ణస్తుంటుంది. అది సార్థకమైనట్టే!
డీజే సందర్భానికి 'తగనట్టుగా' పాట వినిపిస్తున్నాడు. డేవిడ్ గెటా స్వరపరిచిన హౌజ్ మ్యూజిక్. "జస్ట్ ఎ లిటిల్ మోర్ లవ్ జస్ట్ ఎ లిటిల్ మోర్ పీస్"... "కొంత ప్రేమను, కొంత ఉపశాంతిని పొందుదాం... చేయిలో చేయి కలుపుకుందాం..."
ఇక చేయి ఎలా కలపగలను! ఈ ప్రవాహంలో కలిసిపోగల మానసిక సంసిద్ధత లేనందువల్ల స్వీయ వెలి భావనకు లోనయ్యాను. నావి కాని షూ వేసుకున్నంత అసౌకర్యం. (ఈ సమూహం తమను డిజ్ ఓన్ చేసుకోకుండా ఉండేందుకే, తమ అసలు పేర్లు మార్చుకునేవాళ్లు కూడా ఉంటారట. మల్లయ్య అంటే పిచ్చి పుల్లయ్యలా ఉంటుంది. అదే మలయ్ అంటే?) అంతకుముందు హుషారెత్తించిన సంగీతం ఇప్పుడు ఉత్తి చప్పుడులాగా తోచింది. ఆ మోతకు దూరంగా వస్తే, "ఆ సిగరెట్ ఇయ్ బే" అంటున్నాడొకతను, తన సహచరుణ్ని.
బార్ టెండర్, మేనేజర్, డీజే, స్టూయెడ్, ఆఖరికి ఓనర్ కూడా తెలుగువాడే అయినప్పటికీ, ఎవరూ తెలుగులో సంభాషించని ఈ ప్రదేశంలో ఆ మాట నాకు ఇంపుగా తోచింది.
ఓహొ, వీళ్లేమీ దైవదూతల భాష మాట్లాడుకోవడం లేదు. అయితే ఈ పోష్ నెస్ అనేది సామూహిక మేకప్ పొరే. కాస్త పరిచయమై, కాసిన్ని మాటలు నడిస్తే... మామూలు మనుషుల అతిమామూలు ఉద్వేగాలే వీళ్లకూ ఉంటాయని అర్థమవుతుందేమో! అలా కానంతవరకూ ఈ వాతావరణంలో నేను ఇమడలేనేమో!
సారీ డీజే! సందర్భానికి తగినట్టుగానే ప్లే చేస్తున్నావు. "ఐ వాంట్ యు టు టేక్ ఓవర్ కంట్రోల్" అంటోంది ఇవా సైమన్స్. "పద, అలా కారులో షికారు పొయొద్దాం... నేను నీ పక్కనే కూర్చుంటాను... బేబీ, అంతదూరం ఏమీ వెళ్లక్కర్లేదు, నువ్వేదైనా ఈ నగరానికి దూరంగా ప్రేమ పొదరిల్లు చూపించాలనుకుంటే తప్ప!"
చాలు, నువ్వు పక్కనుంటే నేను ఎక్కడైనా నాలా ఉండగలను ఇవా... చివరికి ఈ మూకలో కూడా!
"క్రౌడ్ గ్యాథెరింగ్ పెరిగినాకొద్దీ దానికి అనుగుణంగా పాటలు ప్లే చేస్తాం. ముందు కూల్ నంబర్స్. నెమ్మదిగా స్పీడ్ పెంచుతాం" అంటాడు డీజే విక్కీ. "క్రౌడ్ డిమాండ్-కు అనుగుణంగా కూడా ప్లే చేస్తుంటాం". అయితే తెలుగువి ఎప్పుడూ వేయరట. ఒక్కోసారి ఆదివారాలు మాత్రం బాలీవుడ్ గీతాలు వినిపిస్తారట.

సాధారణంగా వీకెండ్స్ రోజుల్లో రద్దీ ఎక్కువ. మామూలు రోజుల్లో కూడా లేట్ నైట్స్ లోనే బిజినెస్ జరుగుతుంది. మిగతా సమయాలను పూరించుకోవడానికి 'హ్యాపీ అవర్స్' ప్రకటిస్తుంటాయి పబ్బులు. కొంత డిస్కౌంటు ఇవ్వడం, అబ్బాయితో వెళ్లే అమ్మాయికి డ్రింకు ఉచితంగా ఇవ్వడం... కాకపోతే, 'బాధ్యతగా తాగండి, బాధ్యతగా జీవించండి' అని పోస్టర్లు మాత్రం అంటిస్తారు. మరి బాధ్యత మరిచిపోయి ఎవరైనా అతిగా తాగితే?
"సర్వసాధారణంగా గొడవలు జరగవు. ఎవరైనా కొంచెం తేడాగా ప్రవర్తిస్తే మాత్రం ఎత్తి బయట దించొస్తాం" అన్నాడు బౌన్సర్ మెయిన్.
ఈలోగా-
"ఐ వానా డాన్స్ విద్ సమ్ బడీ..." అంటోంది విట్నీ హూస్టన్.
పూర్తి డాన్స్ మూడ్లోకి వచ్చేసింది పబ్. రుద్దుకోవడం, ముద్దుకోవడం, ప్రేమగా గుద్దుకోవడం. పొడుగు కాళ్లు మరింత ఆకర్షణీయంగా కనబడుతున్నాయి. మరి ఎవరితో డాన్స్ చేయాలి?
అందుకే ఇక్కడికి, చాలా సందర్భాల్లో ఒంటికాయాలాగా(వీళ్లను ట్యాగ్స్ అంటారు) వెళ్తానంటే కుదరదు. మీ చేయికి తోడుగా ఒక నడుముండాలి. కేవలం పబ్బులో కంపెనీ కోసం కొంతమంది అబ్బాయిలు అమ్మాయిల్ని తెచ్చుకుంటారట. కొంత పైకం తీసుకొని, వాళ్లు డాన్స్ చేయడానికి సిద్ధంగా ఉంటారట. ఓ మై గాడెస్!
ప్రాచీన మానవుడు తన దాచుకోలేని సంతోషాన్ని వ్యక్తం చేయడానికి చూపిన అతి మామూలు స్పందన డాన్స్. నాగరికత ఒంటబట్టాక అది చాలామందికి దూరమైంది. మళ్లీ అత్యాధునిక నాగరీకులు మన పూర్వీకుల వైభవాన్ని కొనసాగిస్తున్నారనిపించింది. కాకపోతే వాళ్లు ఇన్ స్టింక్ట్సు ప్రేరేపిస్తే చేసిన పనుల్ని, వీళ్లు ఇన్-స్టింక్ట్సును ప్రేరేపించుకోవడానికి చేస్తున్నట్టుగా తోచింది.

సమూహంలోంచి బయటకు వచ్చి, ఒంటరిగా వెన్నెల్లో నడుస్తూ పబ్-లోని దృశ్యాల్ని మననం చేసుకున్నాను.
ఏయే ఎజెండాలతో, ఏయే సమస్యలతో, ఏయే కలలతో, ఏయే కోరికలతో ఇక్కడికి వచ్చినా... అందరి కాళ్లూ కదులుతున్నాయి, కళ్లు వెలుగుతున్నాయి, పెదాలు నవ్వుతున్నాయి.
కాలం ఐసుక్యూబులా కరిగిపోతోంది.
అందుకే ప్రియా! ఇరువురం చెంతనున్న ఈ క్షణం మరింత సంతోషంగా బతికేద్దాం. మరింత ఉత్సాహంగా, మరింత పారవశ్యంగా, మరింత తన్మయంగా జీవిద్దాం. కొన్ని అర్థంలేని పనులు చేస్తూనే అర్థవంతంగా గడిపేద్దాం!

Monday 13 February 2012

డైరెక్టర్ సుకుమార్ ఇన్నర్ వ్యూ



50 మంది బ్లాగు మిత్రులు

నా బ్లాగు ఫుకుఓకా ఫామ్-ను రీ డిజైన్ చేశాక-
మిత్రులుగా చేరడానికి పెట్టిన ఆహ్వానాన్ని స్వీకరించి ఇప్పటికి యాభై మంది మిత్రులుగా చేరారు.
ఇందులో నాకు ముఖపరిచయం ఉన్నవాళ్లు కేవలం నలుగురే. అంటే భౌతికంగా వాళ్ల ముఖం నేనూ, నా ముఖం వాళ్లూ చూసుకున్నవాళ్లం. ముఖ పరిచయం లేకపోయినా, అరే, నేనింకా వీళ్లను ఇప్పటిదాకా చూడలేదా... అనుకునేంత పరిచయం అయినవాళ్లు మరి ఆరేడుగురు. ఇంకా కొందరి తాలూకు పరిచయాలకు పూర్ణ రూపం రాకపోయినా, ఒక సంకేతమేదో వాళ్లను తలుచుకున్నప్పుడు నా మనసులో మెదులుతూ ఉంటుంది. మరికొందరు పూర్తి గుప్తంగా ఉండిపోయినవాళ్లు. అంటే వాళ్ల తాలూకు ఏ ఊహకీ అవకాశం ఇవ్వకుండా, బహుశా మౌనంగా నన్ను గమనిస్తున్నవాళ్లు.
ఎవరెవరు ఎక్కడెక్కడ, ఏయే పనుల్లో, ఏయే రాష్ట్రాల్లో, ఏయే దేశాల్లో ఉన్నారో... మీ అందరినీ ఒకసారి నేను పేరుపేరునా తలుచుకుంటున్నానని చెప్పడానికే ఈ పోస్టు.
అరవిందాచారి
సుధాకర్ శివరాత్రి
వాసు
బాలు
నాగ్
రమేష్
మూన్
సంతోష్ కుమార్
శాండీ
దాస్
అఫ్సర్
గీతిక
సాయి మహేశ్ రెడ్డి
రాజు
శివకాశి
విజయ మైమూన్
స్కైబాబా
ఎన్.రావు
హెచ్చార్కె
గురు
అక్షర
రమ
అంజిరెడ్డి ధర్మ
సుభాషిణి పోరెడ్డి
చక్రి
వై వనజ
బాలు-2
సూర్య
రామ్
అజయ్ త్రిపాఠి
అండెం లింగారెడ్డి
పాండురంగాచారి
మధురవాణి
అశోక్
తన్నీరు శశి
రవి మూత
బృహస్పతి
వినయ్
రఘు
పైడినాయుడు గవిడి
జ్వాల
ఎందుకో ఏమో
జోయెల్
కవి యాకూబ్
ఎం.సుధాకర్రెడ్డి
సతీష్ కుమార్
శరత్
అజయ్ గౌడ్
పవన్
విష్ణు కానుమతిరెడ్డి
Get Flower Effect