Friday, May 29, 2015

కథానేపథ్యం: రెక్కలపెళ్లాం

ప్రాతినిధ్య కథ- 2014 ఆవిష్కరణ
తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియం, హైదరాబాద్; మే 3, 2015
---------------------------------------------------------------

పెద్దలు, మిత్రులు...

రెండు పాయింట్లేవో రాసుకొచ్చాను.

కథకు నిజంగా నేపథ్యం చెప్పడం సాధ్యమేనా? నేనైతే చెప్పలేను. దీనివల్ల ఈ కథ రాశాను అనే కాంక్రీట్ సమాధానం నా దగ్గర ఉండదు. దీనికోసం ఈ కథ రాశాను అని కూడా నేను చెప్పలేను.
కథ అనేది మరీ భవననిర్మాణం లాంటిది కాదేమో! కాగితం మీదే తుది స్ట్రక్చర్ ఊహించే క్రాఫ్ట్ కాదు అది. కనీసం నా వరకు.

అనగనగా... అనే ఒక బేసిక్ ఫామ్లో కథ చెప్పాలి... అది నేరేటివ్ స్టోరీ అయివుండాలి... ఇది ఈ కథకు ఒక బేసిక్ ఐడియా. ఇలా చెప్పాలనే ఆలోచనకు ఏది మూలమో తెలీదు. బహుశా ఈమధ్య నేను చదువుతున్న పాతసాహిత్యం, జానపద సాహిత్యం కారణం కావొచ్చు. కథ వినే వయసుకు వస్తున్న నా పిల్లలు కూడా ఒక కారణం కావొచ్చు. ఇందులో ఏ కారణం పనిచేసినా ఇది ఒక ఐడియా. అంతే!

ఆటోమేటిగ్గా, అనగనగా... అనే రూపం తీసుకున్నప్పుడు మన ఊహ సామాజికం కానక్కర్లేదు. అంటే మరీ వాస్తవికంగా ఉండాల్సిన పనిలేదు. అందులో మన ఊహను ఎంతదూరమైనా తీసుకెళ్లొచ్చు. కాబట్టే ఇందులో మగవాళ్లకు తురాయిలు, ఆడవాళ్లకు రెక్కలు మొలుచుకొస్తాయి.

అలాగని నేనేమీ ఈ సమాజం నుంచి దూరంగా లేనుకదా! ఈ వాస్తవికత నన్ను అంత సులభంగా వదిలిపెట్టదు కదా! అందుకే ఇందులో మళ్లీ అస్తిత్వ పోరాటాలకు సంబంధించిన నా అవగాహన వచ్చిచేరింది. ఆ అవగాహన కోసమే ఈ కథ రాయకపోయినా నా వరకు ఇది చాలా కీలకమైన అంశం కథలో.

ఇక, ఈ రెక్కలకు, తురాయిలకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి? మనిషి తన భాగస్వామిలో ఒక దివ్యత్వాన్ని కోరుకుంటాడని నా నమ్మకం. ఎదుటివాళ్లలో ఆ దివ్యత్వం ఉందా? లేదా? ఉన్నా గుర్తించామా? గుర్తించలేకపోయామా? అనేది మళ్లీ ఆయా వ్యక్తుల మీద ఆధారపడివుంటుంది. ఈ కథలోని మగవాడు తన భార్యలోని దివ్యత్వాన్ని గుర్తించలేకపోవడం ఒక విషాదం.

నిజానికి, ఈ కథ ప్రారంభించినప్పుడు... నేను స్త్రీని ప్రతినాయికను చేద్దామనుకున్నాను. అంటే స్త్రీ వల్ల మగవాడు ధ్వంసం కావడం అనేదేదో చెప్పాలన్నట్టుగా లీలగా ఉండింది. కానీ రాస్తూపోతుంటే నాకు ఆ స్త్రీమూర్తి పాత్రలోకి విషాన్ని ఇంజెక్ట్ చేయడానికి ఒక్క కారణమూ దొరకలేదు. అందువల్ల పురుషుడే దివ్యాంధతకు లోనై మరణించాడు. ఒక విధంగా ఓడిపోయాడు. మళ్లీ తన స్వచ్ఛత వల్ల గెలిచాడు.
అలాగని ఆమెకు కూడా ముందునుంచీ దివ్యత్వం లేదు; తను సంపాదించుకోగలిగింది, అన్నట్టుగా దాన్నిచెప్పీచెప్పకుండా వదిలేశాను.

అందుకే నేను మొదట అన్నది ... కథ అనేది మరీ భవననిర్మాణం లాంటిది కాదు. అది ఎలా ఉండబోతుందో మనకు తెలీదు. ఆలోచనకూ తుదిరూపుకూ మధ్య ఏం జరుగుతుందో... ఏ రెక్కలు మొలుచుకువచ్చి మనం దాన్ని పూర్తిచేయగలుగుతామో... అదే ప్రతిరచయితలోనూ ఉండే దివ్యత్వం!

థాంక్యూ.
               

1 comment:

  1. Anonymous29.5.15

    రెక్కల పెళ్ళాం కథ ఇప్పుడర్థమైంది. థాంక్యూ.

    ReplyDelete