Saturday, March 10, 2018

ముచ్చట గొలిపిన కథలు



ఈ (చింతకింది మల్లయ్య ముచ్చట) కథలను చదివించడానికి నన్ను ఆకర్షించింది ముందుగా కథలకు పెట్టిన పేరు. ‘చింతచెట్టు’ వొక గొప్ప మెటఫర్‌గా మనకు కనబడుతుంది. గడిచిపోయిన, గడుస్తున్న కాలానికి మధ్య చింతచెట్టు వొక వంతెన. వొక చెట్టుగా కాకుండా అనేక పదుల, వందల చెట్లుగా (ఇది) విస్తరించింది. మన గ్రామీణ ముచ్చట్లన్నీ చెట్ల కిందే కదా పరుచుకొని సేద తీరుతుంటాయి. ఊరి చుట్టూ పరుచుకున్న నేలతో, దానిమీద వలయాలుగా తిరుగాడే ఆకుపచ్చటి వాసనలతో గుబురు చెట్ల కింద కనపడీ కనపడకా గొంగళ్ళు కప్పుకొని ముసురులో మునిమాపులో కథలూ, ముచ్చట్లూ చెప్పుకునే వచన రంగస్థలం ఊరు. ఈ పుస్తకంలోని కథలన్నీ కూడా మన పక్కన నడుస్తూ, ముచ్చట్లు పెడుతూ మనల్ని మనకు ఎరుక పరిచే కథలు.

చాలాసార్లు మనం చెప్పాలనుకున్న కథలు, చెప్పలేక దాచుకున్న కథలు ఎన్నో ఉంటాయి. కొన్ని అనివార్యంగా మన చేతిలోంచి జారి పుస్తకాల్లో పడిపోయి పలకరిస్తాయి. ఈ కథలన్నీ అలా ఉండనివ్వనితనంలోంచి జారిపడిన ముచ్చట్లు అనిపిస్తుంది. ఒక పాఠకుడిగా నాకు తెలిసినంతవరకు ఏ కథయినా మనకు నచ్చితే దానికి కారణం కథకుడి నిజాయితీయే కారణమని తోస్తుంది.రచయిత నిజాయితీ వల్ల రచనకుగానీ/ కథలకుగానీ అపురూపమయిన సౌందర్యాకర్షణ ఏర్పడుతుందేమో. ఈ ముచ్చట్లలో అలా చదివించగలిగే ఆకర్షణ అలరారింది. వొక మంచి కథను measure చేయడానికి ఏ స్కేలు ఉండదు. అది sixth senseకు సంబంధించిందని చాలాసార్లు పాఠకుడిగా నాకు ఎదురయిన అనుభవం. చాలావరకు రాజిరెడ్డి ఈ కథల్లో వొక non-personగా ఉంటూ కథ చెప్పుకొస్తాడు. మల్లయ్య వ్యక్తిత్వాన్ని పట్టుకొని కథాగమనంలోకి మళ్లించాలని ప్రయత్నిస్తాడు. మల్లయ్య వొక సజీవధార కాబట్టి ఆ ధారను సరిగ్గా పట్టుకోలేకపోయానని రచయిత failureని వ్యక్తం చేస్తాడు కూడా. కానీ పాఠకులు మాత్రం ఆ అసంతృప్తికి లోనుకారు. రచయితకు ఉండే aesthetic hunger వల్ల అలా అనుకుంటాడు. అంతే! 

ఈ కథలన్నీ కూడా మనల్ని మనకు చేరువగా చేర్చగలిగిన కథలు. ఈ కథలన్నింటిలోనూ తను ప్రత్యేకమయిన సింపుల్‌ అనుభవాలను విస్తృతానుభవంగా మేజికల్‌గా మార్చి అందించడంలో సఫలత చెందాడనీ, తన దాహాన్ని తీర్చుకున్నాడనీ నాకనిపించింది. రాజిరెడ్డి టెంపర్‌మెంటే ఈ కథలన్నింటికీ చదివించే గుణాన్ని ఇచ్చింది. అతను మాట్లాడే తీరే అతని శైలి. అతనితో మాట్లాడితే అతని ఊరుతో మాట్లాడినట్టే, అతని కథలతో మాట్లాడినట్టే ఉంటుంది. ఈ కథలన్నింటిలో ఉండే సంభాషణలు, పాత్రలు, వస్తువుల మధ్య డ్రమటిక్‌గా ఉండే గ్రామీణ మననం వొక ప్రత్యేకమయిన అంశంగా కనిపించింది. తను చెప్పాలనుకున్న కంటెంట్‌ని సారవంతమయిన సంభాషణలో ఇమిడ్చే ప్రయత్నం చేస్తాడు రచయిత. ఈ కథల్లో కొన్నింటిలో వ్యంగ్యం ఉంటుంది. అయితే ఈ సోషల్‌ సెటైర్‌ని పొలిటికల్‌ సెటైర్‌ దాకా తీసుకెళ్లకుండా వ్యక్తుల స్వభావ చింతన దగ్గర ఆగిపోతుండటం చూస్తాం. దానివల్ల కూడా పాఠకుడు, కథలకు మరింత దగ్గరగా రావటం చూస్తాం. ఇటువంటి బ్యాలెన్స్‌ పతంజలి గారి కథల్లో రుచి చూశాం. ఇందులోని సంఘటనలను పాత్రలే నిర్వహిస్తాయి. తమని తాము సంఘటనలకు అప్పజెప్పవు. మొత్తం కథాంతరంగాన్ని పాత్రలవైపు నుంచే రచయిత కథను నిర్వహించడం చింతకింది మల్లయ్య ముచ్చట్లలో కొత్తదనంగా తెలిసొచ్చింది. వొక నైసర్గిక గ్రామీణ ప్రాంతంలోని మల్లయ్య ముచ్చట మొత్తం కథలన్నింటిలోకి సారవంతంగా ప్రవహించింది కైనటిక్‌ ఎనర్జీ లాగ.
(ఆంధ్రప్రదేశ్‌ పత్రిక నవంబర్‌ 2017 సంచికలో వచ్చిన పరిచయం.)
– సిద్ధార్థ



No comments:

Post a Comment