Thursday, September 14, 2023

‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’ కోసం నా మాటలు







ఫొటో రైటప్‌ (తలల క్రమం): ఆదిత్య, మంజుల, రహ్మానుద్దీన్‌ షేక్, సంవరుణ్‌(?), ఆదిత్య 2, మాధవ్, రాజిరెడ్డి, ‘కవనమాలి’, పవన్, పవన్‌ 2, శ్రీరామ్, శివగణేశ్, శ్రవణ్‌



ఆదిత్య అన్నావఝల, పూడూరి రాజిరెడ్డి


(నోట్‌ 1: ఎంచుకున్న వేదిక చాలా లైవ్లీగా ఉంది. అక్కడ, అక్కడి నుంచి చూస్తే కనబడేదంతా పాత హైదరాబాద్‌ నగరపు ఈస్తటిక్స్‌కు పూర్తి భిన్నం. ఇది నయా హైదరాబాద్‌. ఇలా కూడా బాగుంది.

నోట్‌ 2: పోగైంది అతి చిరు సమూహమే కాబట్టి, దాదాపు ముఖాముఖిలా నడిచింది. అందరూ నా పుస్తకాల గురించి ఎంత బాగా మాట్లాడారంటే, నేను వాటి గురించి చెబుదామనుకుని రాసుకెళ్లింది ఇక అనవసరమని వదిలేశాను.)


మీట్‌ అండ్‌ గ్రీట్‌

నిర్వహణ: ద తెలుగు కలెక్టివ్‌

ఆదివారం, 10 సెప్టెంబర్‌ 2023

మధ్యాహ్నం: 3– 6

స్థలం: WE హబ్- తెలంగాణ, అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ

ఆవరణ, హైదరాబాద్‌


స్పోకెన్‌ ప్రసంగాలు నేను చేయలేను; రిటెన్‌ ప్రసంగాలే నాకు చేతనవును.

‘నేను ఒక ఉపన్యాసం అయితే ఇవ్వను; ఊరికే ఎవరైనా అడిగితే దానికి నాకు తోచింది చెప్తాను, ఊరికే ఒక చిట్‌చాట్‌లాగా’ అన్న ప్రీ–కండిషన్‌ మీదే ఇక్కడికి రావడానికి ఒప్పుకున్నాను. కానీ తీరా ఆ ఇన్విటేషన్‌ పోస్టులో రాసిన భారీ మాటలు చూసి భయమేసింది. సాహిత్య ప్రస్థానం... రైటింగ్‌ స్టైల్‌... సహ రచయితలకు సూచనలు... బాబోయ్‌!

వచ్చి ఉత్త వెర్రిమొహం వేసుకుని కూర్చోకుండా ఈ నాలుగు మాటలు సిద్ధం చేసుకుని వచ్చాను.


మీట్‌ అండ్‌ గ్రీట్‌

ఒక వ్యవహారంగా మనుషులతో కలవాలంటే నాకు తెలియని భయం ఉంటుంది. పోయి ఆధార్‌ కార్డులో అడ్రస్‌ మార్పించడం, బండిని సర్వీస్‌కు ఇవ్వడం... అవెంత మామూలు విషయాలైనా సరే, నాకు చిన్న దడ ఉంటుంది లోపల. చాలామందికి మహా అయితే చిన్న చిరాకు ఉంటుంది కావొచ్చు, కానీ నాకు నిజంగా అదొక పెద్ద ఇష్యూ.

మనుషులతో ఏ వ్యవహారమూ లేక, ఊరికే రికామీగా కలవడం అయితే నాకు ఎప్పుడూ ఇంట్రెస్టింగే. ఎంతసేపైనా మాట్లాడగలను.

నేను ఇక్కడికి ఎందుకొచ్చాను అంటే– ఒక కొత్త గ్రూపుతో పరిచయం అవుతుంది. మనకు ఏమాత్రం తెలియని మనుషులు మనతో ఏం మాట్లాడదామని వచ్చివుంటారు? వాళ్లు ఏం చదువుతున్నారు? అసలంటూ ఏమైనా చదువుతున్నారా? నన్ను చదివితే, వాళ్లు ఆ విషయాలను ఎలా చూస్తున్నారు? ఇవన్నీ నాకు ఎక్కువ కుతూహలం. మీట్‌ అండ్‌ గ్రీట్‌ అని–– ‘ఇక్కడ’ కూర్చునేవాడి కోణంలో పెట్టివుంటారు గానీ నా ఉద్దేశంలో అక్కడ కూర్చునేవాళ్లను నేను మీట్‌ అయ్యి, గ్రీట్‌ చేద్దామని వచ్చాను.


నేను రచయితనేనా?

నన్ను నేను రచయితను అనుకోవచ్చా? టాల్‌స్టాయ్, చలం, భైరప్ప... ఇట్లాంటివాళ్లు రచయితలు అయినప్పుడు, మనల్ని మనం కూడా రచయితలం అని చెప్పుకోవచ్చా? అలా అనుకున్నప్పుడు ఎందుకు రాస్తున్నట్టు? 

ప్రపంచంలోని ప్రతివాడూ తన కథ చెప్పుకోవడానికి అర్హుడే. లేదా తనకు తెలిసిన కథ చెప్పడానికి అర్హుడే. ఎన్ని కథలు చెప్తాం, ఎంత బాగా చెప్తాం, ఎంతమంది వాటిల్లో తమను తాము చూసుకునేట్టుగా చెప్తాం అనేది వేరే చర్చ. కథ అంటే ఇక్కడ ఒక ప్రక్రియ అనుకోవద్దు. ఒక ఊసు. ఒక సంగతి. ఒక ముచ్చట. ఒక మనిషి, ఇంకో మనిషితో చెప్పుకోగలిగేది.

అది ఎవరైనా చెప్పొచ్చు. అట్లా నేనూ చెప్తున్నాను. మౌఖిక సాహిత్య దశలో లేము కాబట్టి, వాటిని రాస్తున్నాము. రాసే ప్రతి ఒక్కరినీ ఇప్పటి అర్థంలో రచయితే అంటున్నాం, కాబట్టి, నేనూ రచయితనే! సో, టాల్‌స్టాయ్‌ రచయితే, రాజిరెడ్డీ రచయితే. టాల్‌స్టాయ్‌ రాయనిది నేను ఏం రాయగలను?

చిన్న ఉదాహరణ చెప్తాను.

మామూలుగా బైక్‌ మీద లెఫ్ట్‌ టర్న్‌ అయితే షార్ట్‌ కర్వ్‌ తీసుకుంటాం. అదే రైట్‌ టర్న్‌ అయితే, లాంగ్‌ కర్వ్‌ చేయాలి. ఒకసారి ‘నవోదయ కాలనీ’లో పోతున్నప్పుడు, షార్ట్‌ కర్వ్‌లో మలిగేశాను. ఎదుటినుంచి వస్తున్నవాళ్లకు ఎదురెళ్లినట్టయింది. ట్వెంటీస్‌లో ఉన్నట్టున్నారు ఇద్దరు. వెనక ఉన్నతను, ‘అన్నా, నువ్వు అట్ల పోవాలి’ అన్నాడు. నేను అంతకుముందు నాకు తెలియకుండానే అట్లాగే చేస్తున్నాను కావొచ్చు, కానీ అది స్పృహతో చేసింది కాదు. ఇది జరిగిన తరవాత– అరే అవును కదా, ఇతను చెప్పింది నిజం, అనుకున్నా. చాలా చిన్న విషయమే కావొచ్చు, కానీ అది అప్పటినుంచీ నా వివేకంలోకి చేరింది. ఇంత అల్ప విషయమా అనుకోవచ్చు. ఇలాంటి అల్ప విషయాలే మన జీవితాన్ని అర్థవంతం చేస్తాయని నా నమ్మకం. అందుకే ఎంత చిన్న అనుభవానికైనా దానిదైన విలువ ఉంటుంది. ఇదెందుకు చెప్తున్నానంటే– సాహిత్యంలో అందరూ అన్నీ మాట్లాడేశారని అనుకుంటాం. కానీ ఎందరు ఎన్ని మాట్లాడినా ఇంకేదో మాట్లాడటానికి మిగిలిపోతూనే ఉంటుంది. 

అసందర్భమే కావొచ్చు. ఇంకో విషయం చెప్తాను. ఒకసారి లామకాన్‌లో ఒక స్వీడిష్‌ సినిమా వేశారు. కొత్త సినిమా. 2014లో వచ్చింది. స్వీడన్‌ అంటేనే బెర్గ్‌మన్‌ కదా. ఆయన అన్ని తీసిన తర్వాత, ఇంకా వీళ్లు ఏం తీసివుంటారా అన్న కుతూహలంతో వెళ్లాను. ఆ సినిమా పేరు: ఫోర్స్‌ మజూర్‌. ఇది కూడా బాగుంది. కాబట్టి ప్రతి రచయితా, ఆర్టిస్టు ఆ కాలానికి రిలవెంటే.


మానవోద్వేగ మహాసముద్రం

సాహిత్యం హ్యూమన్‌ కండిషన్‌ గురించి మాట్లాడుతుందంటారు కదా. అంటే ఏమిటి? నీకూ నాకూ మధ్య ఏం జరుగుతోంది? నాకూ ఇంకొకతనితో ఏం జరుగుతోంది? మనకు అయినవాళ్లు, బంధువులు, స్నేహితులు, పరిచితులు, కొన్నిసార్లు అపరిచితులతో కూడా కావొచ్చు... ప్రతి మనిషికీ, ఇంకో మనిషికీ మధ్య ఒక నిరంతర డ్రామా నడుస్తూనే ఉంటుంది. ఇంకో మనిషితో అన్నానుగానీ, మనిషి కూడా కానక్కరలేదు. మనిషితో ముడిపడినదైతే చాలు... కుక్క, చెట్టు, చెరువు... శ్రీశ్రీ అననే అన్నాడు కదా: అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల అని! ఈ డ్రామాలో వందలు, వేలు, లక్షలు, కోట్ల ఉద్వేగాలకు సంభావ్యత ఉంది. ఇది అసలు అనంతం. భూమి పుట్టినప్పటినుంచో, భూమ్మీద మనుషులు నడుస్తున్నప్పటినుంచో, లేదా మనుషులకు ఈ రకమైన స్పృహ వచ్చినప్పటినుంచో మనిషికీ మనిషికీ మధ్య ఎంత తమాషా నడిచివుంటుంది! ఇదంతా సాహిత్యంగా రావలసిందే. అది ఏ ప్రక్రియల రూపంలో వస్తుందనేది అంత ముఖ్యం కాదు. కానీ వచ్చింది, వస్తూనే ఉంది, వస్తూనే ఉంటుంది.

మొత్తం సాహిత్యాన్ని నేనొక మానవోద్వేగాల మహాసముద్రంగా చూస్తాను. ఒక ఊహ చేయండి! మొత్తం ఇప్పటిదాకా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ రాసిన సాహిత్య పుస్తకాలన్నీ ఒక నీటి బిందువుల రూపంలోకి కరిగిపోయి, అలలుగా తేలియాడుతూ, ఎల్లలు లేని సముద్రంగా పరుచుకుని ఉంటే ఎలా ఉంటుంది? కానీ ఈ మహాసముద్రం ఎంత పోసినా నిండేది కాదు; ఇంక చాలు అనేది కాదు. మనుషులు ఉన్నంతవరకూ వాళ్ల మధ్యలో సంభవించే సకల ఉద్వేగాలను ఇందులో పోయొచ్చు. ఒకరికి ఏం జరిగిందో ఇంకొకరికి తెలుస్తూనే ఉండాలి కదా. అట్లా తెలుసుకోవాలన్న కుతూహలం మానవ సహజం కదా. అందుకే మనం రాస్తుంటాం. రచయిత అనేవాడు రాస్తుంటాడు. వాడు మహారచయిత అయితే ఆ మానవోద్వేగ మహాసాగరంలోకి బిందెలు, ట్యాంకర్లతో ఉద్వేగ జలాన్ని కుమ్మరిస్తుంటాడు. నేను మరీ చంచాతో కాకపోయినా ఒక టీ గ్లాసుతో పోస్తుంటాను.

అట్లా పోసిన తర్వాత ఇవన్నీ ఏమవుతాయి? సముద్రంలో నీళ్లు ఆవిరై తిరిగి వానరూపంలో నేల మీద కురిసినట్లు, ఈ ఉద్వేగాలన్నీ సామూహిక వివేకంగా మారి మానవ హృదయ సీమల మీద కురుస్తాయని అనుకుంటే ఈ ఉద్వేగాల పోలికకు ఒక లాజికల్‌ కంక్లూజన్‌ వస్తుంది.


నాకేం ఫిలాసఫీ ఉంది?

రచయిత అన్నాక ఒక ధార ఏదో ఉండాలి. చాలామందికి ఒక ఫిలాసఫీ ఉంటుంది. గట్టి అభిప్రాయాలు, నిశ్చిత అభిప్రాయాలు ఉంటాయి. నాకు మొదటినుంచీ ఉన్నది ఏమిటంటే, గందరగోళం, డోలాయమానం. ఎవరు ఏది చెప్తే అందులోనూ కొంత పాయింట్‌ ఉందనిపిస్తుంది. నేను ఎప్పుడూ ఒక ఫ్లోటింగ్‌ స్థితిలోనే ఉంటాను. ఇది స్థిరం, ఖాయం, కచ్చితం అనేది ఉండదు. స్థిరత్వం లేకపోవడం అంటే నా అభిప్రాయాలు బలహీనమైనవని కాదు, గాలివాటం అని కాదు. నా ఆలోచనలు ఎప్పుడూ తర్కానికి లోనవుతూనే ఉంటాయి. అదీ, ఇదీ అని లోపల చింతన నడుస్తూనే ఉంటుంది. ఇదీ అని ఒకటి గట్టిగా పైకి తేలదు. ఇప్పుడు ఒకటి ఇటు మాట్లాడుతుండగానే, ఇంకొకటి లోపల ఫామ్‌ అవుతూ ఉంటుంది. కాబట్టి, ఏ పాయింట్‌ దగ్గర నేను నిలబడాలి? 

నేను ఫలానా అని ఒక వాదంలోకి పోలేకపోవడానికి ఇదీ కారణం అనుకుంటాను. అందుకే నా రచనల్లో అన్ని వాదాల ప్రతిఫలనాలు ఉంటాయి. లేదా ఏ వాదాలు లేకపోవచ్చు. ఉన్నవాటికి వ్యతిరేకంగా కూడా ఉండొచ్చు. కానీ రాజిరెడ్డి ఏమిటి? దేనికి నిలబడతాడు? మీకు తెలుసో లేదోగానీ... మన విమర్శకులు, కవులు... ఫలానా రచయిత ఎటువైపున్నాడు? అని అడుగుతుంటారు. ప్రజల వైపున్నాడా? పేదల వైపున్నాడా? అని మాటల్లో ఉంటుంది. మాటలు చాలా ట్రిక్కీగా ఉంటాయి. పేదల వైపు ఉండను, మంచి వైపు ఉండను అని ఎవడైనా చెప్తాడా, చెప్పగలడా? కానీ ‘సారం’గా వాళ్ల దిక్కున్నామా లేదా; ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వాళ్లు బలపరిచే రాజకీయాలకు మనం మద్దతిస్తున్నామా లేదా అని చూడటమే వాళ్లు అడిగే ప్రశ్నకు అసలైన అంతరార్థం. ఆ అర్థంలో అయితే నేను ఎటువైపూ ఉండను. నా అనుభవంలో, నా తర్కంలో అప్పటికి నాకు నిగ్గుదేలింది మాత్రమే నా సత్యం. ఆ సత్యాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాను.

ఇంకా ముఖ్యమైనది, మనుషులు! మనుషులు ఎట్లా అంటే, మనం ఎంతో గొప్ప వాదం అనుకున్నదాన్ని కూడా ఎడమకాలితో తంతుంటారు. జీవితం చాలా రకాలుగా ఉంటుంది. ఆ మనుషుల బహుముఖీనతను, జీవితపు సంక్లిష్టతను, అర్థం కాలేకపోవడాన్ని పట్టుకోవడం నాకు ఇష్టం.


ఎలా రాస్తే బాగుంటుంది?

పాలన్నీ ఒక్కటే, అన్నీ తెల్లగా ఉంటాయి అని మనకు చిన్నప్పుడు చెప్పారు. అందులోని సారం గ్రహించడం వరకు సరే. కానీ పెద్దయ్యేకొద్దీ అర్థమవుతుంటుంది– ఏ బర్రెపాలు ఇంకో బర్రెలా ఉండవు, ఏ బాయి నీళ్లు ఇంకో బాయిలా ఉండవు. అట్లాగే మనిషి కూడా. ఆ లిటిల్‌ డిఫరెన్స్‌ ఏమిటనేదే మనకు ముఖ్యం.

ప్రజల పక్షం, పేదల పక్షం అన్నప్పుడు– ఆ ప్రజలు అనేవాళ్లు ఎవరూ నీ కథల్లోకి రారు. వచ్చేది ఒకటో రెండో ముఖ్య పాత్రలు. వాళ్లను ప్రజలు అందామా అంటే కుదరదు. అయితే ఆయన చింతకింది మల్లయ్య అవుతాడు. లేదంటే లింగయ్య కొడుకు బుచ్చిరెడ్డి అవుతాడు. వాళ్లు వాళ్ల లెక్కనే ప్రవర్తిస్తారు గానీ ప్రజల్లా కాదు. ప్రజలు అనేది రాజకీయాల్లో నిజం కావొచ్చు గానీ, సాహిత్యంలో మాయ.

ఒక కమ్యూనిటీకి ప్రాతినిధ్య పాత్రలు ఉండటం దోషం కాదు. కానీ అప్పుడు కూడా అతడు ప్రజల్లో భాగం కాకుండా, విడిగా అతడిలాగే ఉంటాడు. నిర్దుష్టంగా అతడిలాగే ప్రవర్తిస్తాడు. దీనికోసం డీటెయిల్స్‌ ముఖ్యమవుతాయి. ఇవే ఏ పాత్రకైనా ప్రాణం. ఈ హాల్‌కు చేరడానికి అందరమూ ఒకే దారిలో వచ్చివుండొచ్చు. కానీ ‘ఆదిత్య’ను మన నుంచి వేరు చేసేది ఏమిటి? అది పట్టుకోవాలి. తను మాత్రమే గ్రహించగలిగింది రాయడం ద్వారా అది సాధ్యమవుతుంది.

ఆర్కే నారాయణ్‌ ఎక్కడో అన్నది చదివాను: ఒక దొంగ పాత్ర గురించి రాస్తుంటే నాకు ఆ పాత్ర మీద కూడా ప్రేమ కలుగుతుందీ అని. ఇలా దుష్టపాత్ర మీద ప్రేమ కలగడం మంచిదేనా? దీన్ని ఇంకోరకంగా చూడాలి. నీకు ఇష్టం లేని పాత్రకు కూడా ఇవ్వాల్సిన స్కోప్‌ ఇవ్వడం. అట్లా నేను రాస్తున్నానో లేదో నాకు తెలీదుగానీ, ఏకపక్షంగా ఒక్క వైపుకే కథను మళ్లించకుండా రాసేవాళ్లు నాకు ఇష్టం.


ఇవి సూచనలా?

వాదంలో రాయడం తేలిక, సోమరితనం. పైగా ఎంతోకొంత పేరు కూడా వస్తుంది. ఎందుకంటే, ఆల్రెడీ ఫ్రేమ్స్‌ ఫిక్స్‌ అయివున్నాయి. మీరు రాయగానే మన గ్రూపులోకి ఒకరు వచ్చారని ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ అది మీదా? మీ అనుభవం కూడా అదే చెప్తోందా? మీ సత్యం భిన్నంగా ఉంటే దానికి ఎదురు నడవగలరా? ఈ ప్రశ్నల మీద మీ సాహిత్యాన్ని మలుచుకుంటే... కనీసం మీకు మిమ్మల్ని ఒక కానుక చేసుకున్నవాళ్లవుతారు. ఇదొక్కటే ఎవరైనా రాయాలనుకుంటే నేను ఇవ్వగలిగే సలహా.


థాంక్యూ

నేను పొద్దున్నే పిల్లల్ని స్కూలు బస్సెక్కించడానికి వెళ్తాను. వస్తూ వస్తూ ఏవో కూరగాయలు తెస్తుంటాను. అప్పుడప్పుడూ గిర్నీకి వెళ్లి పిండి పట్టిస్తుంటాను. కత్తులు మొండిపోతే దారు పట్టించడానికి వెళ్తాను. నా భార్య ‘లైనింగ్‌’ క్లాత్స్‌ తీసుకుంటుంటే రోడ్డు మీద నిలబడి ఉంటాను. కుట్టు మిషన్‌ పాడైతే రిపేరుకు తీసుకెళ్తాను. ఈ ఏ సందర్భంలోనూ నేను రచయితను కాదు. ఒక సినిమా నటుడు సెట్‌లోనూ నటుడిగానే ఉంటాడు; రోడ్డు మీదికి వచ్చినా నటుడిగానే ఉంటాడు. కానీ రచయితలు అలాక్కాదు. 99 శాతం జీవితంలో రచయితగా ఉండం. ఆ మిగిలిన ఒక్క శాతం సందర్భం ఇలాంటి మీట్స్, గ్రీట్స్‌. నా రచయిత మూమెంట్‌ను సెలబ్రేట్‌ చేయడానికి సంకల్పించిన ఆదిత్య(అన్నావఝల)కూ, ‘ద తెలుగు కలెక్టివ్‌’ టీమ్‌కూ, ఇక్కడికి వచ్చి నన్ను విలువైన మనిషిని చేసిన యువ మిత్రులందరికీ నా ధన్యవాదాలు. తెలుగు కలెక్టివ్‌ యానివర్సరీ ఈవెంట్‌కు నన్ను ప్రత్యేకంగా ఎంచుకోవడం నాకు మరింత గౌరవం. థాంక్యూ ఎగైన్‌.

No comments:

Post a Comment