Friday, December 19, 2025

కోఫోర్జ్‌ పబ్లిక్‌ లైబ్రరీ


 

కార్పొరేట్‌ ‘స్వర్గం’


‘‘నేను ఎప్పుడూ స్వర్గం అనేది ఒక గ్రంథాలయంలా ఉంటుందని ఊహిస్తాను’’ అన్న అర్జెంటీనా రచయిత జార్జ్‌ లూయీ బోర్హెస్‌ ప్రసిద్ధ వ్యాఖ్యానపు స్ఫూర్తిని స్వీకరిస్తూ, పబ్లిక్‌ లైబ్రరీలకు శ్రీకారం చుట్టింది ‘కోఫోర్జ్‌’ సంస్థ. మూడు దశాబ్దాల క్రితం ‘నిట్‌’ పేరుతో ప్రారంభమై, 2020లో ‘కోఫోర్జ్‌’గా రీబ్రాండ్‌ అయిన ఈ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కంపెనీ తన ‘కార్పొరేట్‌ సోషల్‌ రెస్సాన్సిబిలిటీ’లో భాగంగా దేశవ్యాప్తంగా గొలుసుకట్టు గ్రంథాలయాలకు నడుం బిగించింది. 2024 ఫిబ్రవరిలో నోయిడాలో, 2025 జూన్‌లో గురుగ్రామ్‌లో ప్రారంభమైన ఈ గ్రంథాలయపు మూడో శాఖ 15,000 పుస్తకాలతో ఈ అక్టోబర్‌లో హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ప్రారంభమైంది. ఉదయం 9 నుంచి రాత్రి 8 దాకా సంవత్సరంలో 365 రోజులూ తెరిచి ఉండటం వీటి ప్రత్యేకత.

ఫిక్షన్, హిస్టరీ, సెల్ఫ్‌ హెల్ప్, రిలిజియన్‌ అండ్‌ స్పిరిచ్యువాలిటీ, సైకాలజీ, ఫిలాసఫీ, సైన్స్, పాలిటిక్స్, మేనేజ్‌మెంట్, రిఫరెన్స్‌ లాంటి విభాగాలతో ప్రధానంగా ఆంగ్ల పుస్తకాలతోపాటు కొద్దిస్థాయిలో హిందీ, తెలుగు విభాగాలను కూడా హైదరాబాద్‌లో ఏర్పాటుచేశారు. ఉర్దూ విభాగానికి కూడా డిమాండ్‌ వస్తోందని చెబుతున్నారు. కావాల్సిన పుస్తకపు అందుబాటును అక్కడ ఏర్పాటుచేసిన రెండు పెద్ద టచ్‌ స్క్రీన్స్‌ మీద వెతుక్కోవచ్చు. ‘చిల్డ్రెన్స్‌ సెక్షన్‌’ విడిగా ఉండటం చిన్నారులను ఉత్సాహపరుస్తుంది. ది ఇల్లూమినేటెడ్‌ రూమి; డేనియల్స్‌ ఇండియా: వ్యూస్‌ ఫ్రమ్‌ ద ఎయిటీన్త్‌ సెంచరీ; ఎండేంజర్డ్‌ లాంగ్వేజెస్‌ ఇన్‌ ఇండియా; ద లైఫ్‌ అండ్‌ వర్క్స్‌ ఆఫ్‌ వాన్‌ గో; బిబేక్‌ దేబ్‌రాయ్‌ పది వాల్యూముల మహాభారతం; హాన్‌ కాంగ్‌ ‘ద వైట్‌ బుక్‌’తో పాటు ‘బిగ్‌ ఐడియాస్‌ ఎక్స్‌ప్లెయిన్డ్‌ సిరీస్‌’లో ద మూవీ, ద హిస్టరీ, ది ఎకనామిక్స్, ది ఆర్ట్‌ లాంటివెన్నో అందుబాటులో ఉన్నాయి.

‘యోచన ముఖ్యమైనదే కానీ అసలు ప్రాధాన్యం ఉన్నది ఆచరణకే’ అని సంస్థ సీఈఓ సుధీర్‌ సింగ్‌ నమ్మకం. అందుకే కాబోలు, మనకు అనుభవంలో ఉండే గ్రంథాలయాల ముతకదనానికి భిన్నంగా కార్పొరేట్స్‌కే సాధ్యమయ్యే ఒక సోఫిస్టికేషన్‌ ఇక్కడ కనబడుతుంది. చదవడానికి తగినంత నిశ్శబ్దం, తీర్చిదిద్దినట్టున్న ర్యాకులు, పుస్తకాలను గుట్టలుగా పోయకుండా తగినంత డిస్‌ప్లేకు ఇచ్చిన అవకాశం– బయట వేగంగా పరుగెడుతూ అద్దాల్లోంచి దూరంగా కనబడుతున్న వాహనాల హడావుడి ప్రపంచానికి భిన్నంగా, రెండు అరచేతుల్లో నెమ్మదిగా విప్పారే అక్షరాలు చూపించే లోకాలను ఇక్కడ అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. ‘విద్య వలన వినయం పుట్టును, వినయం వలన యోగ్యత కలుగును’ అని వేమన; ‘పదవులు, సంపదలు నశించును గాని జ్ఞానమనే సంపద నశించదు’ అంటూ పోతన; ‘పుస్తకాలు చదివే అలవాటులేనివాడికి అక్షర జ్ఞానం లేనివాడిమీద అదనపు అడ్వాంటేజీ ఏమీ ఉండ’దనే మార్క్‌ ట్వెయిన్‌ కవ్వింపు, ‘ఒక పాఠకుడు చనిపోయేలోపు వెయ్యి జీవితాలు జీవిస్తాడు, అదే ఎప్పుడూ చదవనివాడు ఒక్క జీవితమే జీవిస్తాడు’ అనే ఆర్‌.ఆర్‌. మార్టిన్‌ ఉడికింపు బోర్డులు గ్రంథాలయ సందర్శకులను ఇట్టే పుస్తకం పట్టేలా ప్రేరేపిస్తాయి.

కృత్రిమ మేధ సృష్టించిన కవర్‌ పేజీల వాడకం వల్ల ఈ నవంబర్‌లో రెండు పుస్తకాలు ఒక పోటీకి అనర్హత పొందడం సాహితీ ప్రపంచంలో సంచలనానికి కారణమైంది. 65,000 డాలర్ల నగదు బహుమతితో కూడిన న్యూజిలాండ్‌ ప్రతిష్ఠాత్మక ‘ఆక్‌హామ్‌ అవార్డ్‌’ కోసం వచ్చిన ఆబ్లిగేట్‌ కార్నివోర్‌ (స్టెఫానీ జాన్సన్‌ కథల సంపుటి), ఏంజిల్‌ ట్రెయిన్‌(ఎలిజబెత్‌ స్మితర్‌ నాలుగు గొలుసు నవలికలు) పుస్తకాలకు ఏఐ గీసిన ముఖచిత్రాలను వాడినట్టు గుర్తించడంతో నిర్వాహకులు వాటిని పోటీనుంచి తప్పించారు. సాహిత్య లోకంలోకి కూడా ఏఐ చొచ్చుకువచ్చి, అంతటా డిజిటల్‌ జపం జరుగుతున్న కాలంలో, ప్రత్యేకించి ఒక కార్పొరేట్‌ సంస్థ భౌతిక పుస్తకాలను అందుబాటులోకి తేవడానికి పూనుకోవడం అభినందనీయం. మున్ముందు ఢిల్లీ, పుణె, బెంగళూరు నగరాలకూ లైబ్రరీని విస్తరించే యోచన జరుగుతోంది. సాంకేతిక పరిణామాలు, వ్యాపార నమూనాలు మారినా ఎప్పటికీ నిలబడి ఉండే దీర్ఘకాలిక సామాజిక మౌలిక వసతులుగా ప్రజా గ్రంథాలయాలను  చూస్తున్నామని ‘కోఫోర్జ్‌’ చెబుతోంది. శుభం.

(December 8th, 2025)

Wednesday, December 17, 2025

మరపురాని ప్రయాణ కథల సంకలనం



‘ప్రయాణంలో మొదలై ప్రయాణంలో ముగిసే’ నియమంతో ఎంపిక చేసిన కథల సంకలనం ‘మరపురాని ప్రయాణ కథలు’. ఖదీర్‌బాబు గారు తెచ్చిన ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన కథకుల్లో ఒకరైన మధురాంతకం రాజారాం గారి కథతో పాటు నా కథా ఉండటం సంతోషం. ఈ ఇరవై కథల సంకలన ప్రచురణ: ఆన్వీక్షికి.

Monday, December 15, 2025

BBLF: ఒక గుర్తు


2025 ఆగస్ట్‌లో జరిగిన (రెండవ) బుక్‌ బ్రహ్మ లిటరేచర్‌ ఫెస్టివల్‌లో ఇలా ఏర్పాటుచేసిన ‘చదువరి’ దగ్గర నా మధుపం పుస్తకం కనబడటంతో కవిమిత్రుడు అనిల్‌ డానీ ఫొటో తీసి పంపారు. అదే ఇక్కడ ఒక గుర్తుగా...

Friday, December 12, 2025

ప్రియమైన జ్ఞాపకం


(జయమోహన్, అరంగసామి, మానస చామర్తి, పూడూరి రాజిరెడ్డి) 

ఈ ఫొటో నాకెంతో ప్రియమైన జ్ఞాపకంగా గుర్తుండిపోతుంది. నాకిష్టమైన ఇద్దరు రచయితల పక్కన. ఈ లోకం మర్చిపోయినట్టు సంభాషణలో మునిగిపోయి ఉండటాన్ని, అంతే భద్రంగా, అంతే అందంగా, నాకొక జ్ఞాపకంగా ఇచ్చారు భాస్కర్. ఇలాంటి ఫొటో ఒకటి తీస్తున్నారని కూడా తెలీదు నాకు. రాజిరెడ్డి కథల్లో లేయర్స్ గురించి మాట్లాడారని చెప్పాను కదా. ఈ ఫొటో ఆయనకు పంపిస్తే, ఫొటోలో కూడా లేయర్స్ ఉన్నాయ్ అన్నారు. 

🙂 ఆ రోజు ఉదయం నుండి, సాయంకాలపు మసక వెలుతుర్ల దాకా - వెల్లువెత్తిన సంతోషాల నుండి - రెండు అరచేతుల మధ్య భద్రంగా ఇష్టంగా పట్టుకుని వదిలేసిన వీడ్కోలు తాలూకు పల్చని దిగుళ్ళ దాకా - అన్నింటికి కలిపి ఒకే జ్ఞాపకంగా ❤️


(19-8-2024 నాటి మానస చామర్తి ఎఫ్బీ పోస్ట్‌)

 ----------------------------------------------------


ఫొటో నేపథ్యం:

2024 ఆగస్ట్‌లో బుక్‌ బ్రహ్మ లిటరేచర్‌ ఫెస్టివల్‌కు వెళ్లినప్పుడు, అది జరిగే మూడ్రోజుల్లో ఒక్కసారైనా జయమోహన్‌ను కలిసే అవకాశం రాకపోతుందా అనుకున్నా. ఆశ్చర్యంగా మొదటి రోజు పరిచయమైన మొదటి మనిషి ఆయనే. నేను ఎప్పటికో క్లైమాక్స్‌ టార్గెట్‌ లాగా పెట్టుకున్నది టైటిల్స్‌లోనే జరిగిపోయినట్టయింది. నా పేరులోని స్త్రీత్వపు ధ్వని గురించి మళ్లీ మళ్లీ అడిగారు.

నేను బెంగళూరు వస్తున్నట్టు తెలుసు కాబట్టి, ఒక్కరోజైనా ఇంటికి రావాల్సిందేనని మానస చామర్తి పిలవడంతో తెల్లారి వాళ్లింటికి వెళ్లాను. మరునాడు ఇద్దరమూ తిరిగి వచ్చాక, ఆ కార్యక్రమాలన్నీ ఉత్సాహంగా చుట్టేస్తూ పిల్లల కోడిలా తిరుగుతున్న జయమోహన్‌కు ఎదురుపడ్డాం. ఆయన మమ్మల్ని కూడా కాఫీకి వెంటబెట్టుకెళ్లారు. అవినేని భాస్కర్‌ సహజంగానే తోడయ్యారు. అప్పుడు జయమోహన్‌తో మామూలుగా మాట్లాడిన మాటలే, తర్వాత మానస రాతలో పద్ధతిగా ‘వివిధ’లో వచ్చాయి.

ఈ ఫొటో నాకెంతో ప్రియమైన జ్ఞాపకంగా గుర్తుండిపోయింది.

Tuesday, December 9, 2025

పిల్లల కథ


 బాలోత్సవం


కథ పుట్టడమూ, పిల్లల కథ పుట్టడమూ వేరుగా జరిగివుండదు. పిల్లల కంటే బాగా ‘ఊ’కొట్టగలిగేవారెవరు! పిల్లలను మైమరిపించడానికే పెద్దలు కథలు అల్లివుంటారు. ఆ వంకతో తమ చిన్నతనంలోకీ జారుకునివుంటారు! చిన్నతనానికీ పెద్దరికానికీ ఉన్న స్పష్టమైన తేడా: బాల్యంలో ఊహలకు సంకెళ్లుండవు. తార్కిక పరిమితి కలలను అణిచివేయదు. ఎంత సాగితే అంత, ఎంత చూస్తే అంత, ఎంత కావాలనుకుంటే అంత. అక్కడ ఆశలు అనంతం. రెక్కలు అమాంతం. కప్పలు పకపకా నవ్వొచ్చు. కుందేళ్లు చకచకా మాట్లాడొచ్చు. కాకులు నీతులు చెప్పొచ్చు. జింకలు కోతలు కోయొచ్చు.

పిల్లల కథ అనేది మబ్బుల్లోకి గెంతించే మాయా కిటికీ. సముద్రం అడుగుకు ఈదనిచ్చే గాలి పడవ. ప్రతి తరమూ తర్వాతి తరానికి అవసరమయ్యే వివేకపు రాశిని కథల రూపంలోనే బదిలీ చేస్తుంది. లోకాన్ని ఎదుర్కోవడానికి అవసరమయ్యే కాఠిన్యాన్ని అందులోనే కూరి ఉంచుతుంది. ఈసప్‌ కథలు, పంచతంత్రం కథలు, వెయ్యొన్నొక్క రాత్రుల అరేబియన్‌ కథలు, జంగిల్‌ బుక్, కాంచన ద్వీపం, గలివర్‌ సాహసయాత్రలు, ‘చందమామ’ కథల నుంచి; టామ్‌ శాయర్, నొప్పి డాక్టర్, లిటిల్‌ ప్రిన్స్, హాబిట్, హారీ పాటర్‌ దాకా పిల్లల మనో ప్రపంచపు ఎల్లలను విశాలపరిచినవే! కథల వల్ల పిల్లలకు ఊహాశక్తి పెరుగుతుంది, సమస్యా పరిష్కారం తెలుస్తుంది, భాష అబ్బుతుంది, వ్యక్తీకరణ అలవడుతుంది, లోకరీతి అర్థమవుతుంది, ప్రపంచపు భిన్నత్వం పట్ల అవగాహన కలుగుతుంది, సాటి జీవుల పట్ల సానుభూతి కలుగుతుంది, తమ సాంస్కృతిక వారసత్వపు గొప్పతనం అనుభవంలోకి వస్తుంది, అన్నింటికీ మించి అమితమైన ఆనందం దొరుకుతుంది. జీవితపు సంరంభంలోంచి వచ్చే ఆనందానికి అదనంగా, మనిషికి ఉన్న మరో ఆనందపు వనరు కథలు కాక మరేమిటి?

అసలు పిల్లల కథలు పిల్లలకు కలిగించే ప్రయోజనాలన్నీ పెద్దలకు కూడా కలిగిస్తాయి. ఏం పెద్దల్లో మాత్రం పిల్లలు బజ్జునిలేరా? అంతెందుకు, ఆరిస్టాటిల్‌ లాంటి తత్వవేత్త కూడా నిజమైన మంచి జీవితం గడపడం కోసం కాల్పనికత అవసరాన్ని సమర్థించాడు. అసలు సాధ్యం కానిది కూడా ఊహించగలగడం అవసరమని ఆయన వాదించాడు. టాల్‌స్టాయ్‌ లాంటి మహారచయిత కూడా పిల్లల కోసం కథలు రాశాడు. కాకపోతే ఇదీ నీతి అంటూ ప్రత్యేకంగా చెప్పకూడదనీ, కథ ద్వారా పిల్లలు తమకు కావాల్సింది తాము తీసుకుంటారనీ అన్నాడు. మీరు ఎంతపెద్దవాళ్లయినా బాలసాహిత్యాన్ని చదవాలంటుంది కాథెరీన్‌ రండెల్‌ అనే బాలసాహిత్య రచయిత్రి. పిల్లల పుస్తకాలు మనం మర్చిపోయిన విషయాలనే కాదు, మనం మర్చిపోయామని మర్చిపోయిన విషయాలను కూడా గుర్తుచేస్తాయంటుందామె.

లండన్‌లోని థేమ్స్‌ నదిలో పడవ షికారుకు పోయినప్పుడు తన వెంటున్న స్నేహితుడి ముగ్గురు కూతుళ్లకు ఓ కథ చెప్పాడట లూయిస్‌ కరోల్‌. అందులో అలీస్‌ లిడ్డెల్‌ అనే పదేళ్ల పాప కూడా ఉంది. ఒక రోజు నది ఒడ్డున విసుగ్గా కూర్చున్న ‘అలీస్‌’కు కోటు తొడుక్కుని, గడియారం పెట్టుకున్న ఒక తెల్ల కుందేలు కనబడటమూ, దానివెంట ఆమె ఆ కుందేలు బొరియలోకి పోవడమూ, అక్కడ్నుంచి వింతలూ విచిత్రాలూ... వాహ్‌! విన్నవెంటనే దాన్ని తనకోసం రాసిపెట్టమందట అలీస్‌. అట్లా ‘అలీస్‌(స్‌) అడ్వెంచర్స్‌ ఇన్‌ వండర్‌లాండ్‌’ పుస్తకంగా రూపుదాల్చింది. 1865 నవంబర్‌లో తొలిసారి ప్రచురితమైన దీనికి ఈ నెలలోనే 160 ఏళ్లు వచ్చాయి. జంతువులు జంతువుల్లా ఉండకుండా, మనుషులు మనుషుల్లా కాకుండా ప్రవర్తించే సాహిత్యాన్ని ‘నాన్సెన్స్‌ లిటరేచర్‌’ అని వర్గీకరించడం ఉంది. దాన్ని నిరర్థకమైనదని కాకుండా, హేతువుకు అందని అర్థవంతమైన సాహిత్యం అన్న అర్థంలో చూడాలి. అందుకేనేమో, ఇకనుంచీ బాల సాహిత్యానికీ తమ అవార్డు ఇవ్వనున్నట్టు బుకర్‌ ఫౌండేషన్‌ ఇటీవలే ప్రకటించింది. 8–12 ఏళ్ల  చిన్నారులను ఉద్దేశించి రాసే ఉత్తమ రచనకు ‘చిల్డ్రెన్స్‌ బుకర్‌ ప్రైజ్‌’ పేరుతో యాభై వేల పౌండ్లు ఇవ్వనున్నారు. బాలసాహిత్యం అనేది తీసేయదగినది కాదనీ, బాలసాహితీవేత్తలు తక్కువ రచయితలేమీ కారనీ చెప్పే ఘనమైన వార్త ఇది. కాదామరి... నేటి బాలలే రేపటి ప్రపంచ నిర్మాతలు.

(10-11-2025)

Saturday, December 6, 2025

తమ్ముడి మరణం కథాపఠనం





Thammudi Maranam


మనకు తెలీకుండా మన కథను ఎవరైనా చదివారని తెలిసినప్పుడు– మనకు కనీసం చెప్పనైనా లేదే అన్న అది ఉంటుంది; వాళ్లు మన కథను సెలబ్రేట్‌ చేస్తున్నారన్న ఇదీ ఉంటుంది. ఈ ‘కథాకళ’ కోసం డాక్టర్‌ వారిజా రాణి గారు నా ‘తమ్ముడి మరణం’ చదివారు. ఈ మూడు కథల వీడియోలో మొదటి రెండు కథల్ని డాంజీ తోటపల్లి, చిట్టూరు సరస్వతి రాధ గార్లు చదివారు. తమ్ముడి మరణం మూడో కథ. 1:20 గంటల నుంచి ఆ కథాపఠనం ఉంది. నిర్వహణ: విజయ భాస్కర్‌ రాయవరం.

(25th March 2023)

Wednesday, December 3, 2025

నా కొత్త కథ

నా కొత్త కథ


ఈమాట నవంబర్‌ సంచికలో ప్రచురితమైన నా కొత్త కథ ‘తండ్రి’ ఈ లింకులో చదవొచ్చు.

 

తండ్రి