(జయమోహన్, అరంగసామి, మానస చామర్తి, పూడూరి రాజిరెడ్డి)
ఈ ఫొటో నాకెంతో ప్రియమైన జ్ఞాపకంగా గుర్తుండిపోతుంది. నాకిష్టమైన ఇద్దరు రచయితల పక్కన. ఈ లోకం మర్చిపోయినట్టు సంభాషణలో మునిగిపోయి ఉండటాన్ని, అంతే భద్రంగా, అంతే అందంగా, నాకొక జ్ఞాపకంగా ఇచ్చారు భాస్కర్. ఇలాంటి ఫొటో ఒకటి తీస్తున్నారని కూడా తెలీదు నాకు. రాజిరెడ్డి కథల్లో లేయర్స్ గురించి మాట్లాడారని చెప్పాను కదా. ఈ ఫొటో ఆయనకు పంపిస్తే, ఫొటోలో కూడా లేయర్స్ ఉన్నాయ్ అన్నారు.
ఆ రోజు ఉదయం నుండి, సాయంకాలపు మసక వెలుతుర్ల దాకా - వెల్లువెత్తిన సంతోషాల నుండి - రెండు అరచేతుల మధ్య భద్రంగా ఇష్టంగా పట్టుకుని వదిలేసిన వీడ్కోలు తాలూకు పల్చని దిగుళ్ళ దాకా - అన్నింటికి కలిపి ఒకే జ్ఞాపకంగా ![]()
(19-8-2024 నాటి మానస చామర్తి ఎఫ్బీ పోస్ట్)
----------------------------------------------------
ఫొటో నేపథ్యం:
2024 ఆగస్ట్‌లో బుక్ బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్‌కు వెళ్లినప్పుడు, అది జరిగే మూడ్రోజుల్లో ఒక్కసారైనా జయమోహన్‌ను కలిసే అవకాశం రాకపోతుందా అనుకున్నా. ఆశ్చర్యంగా మొదటి రోజు పరిచయమైన మొదటి మనిషి ఆయనే. నేను ఎప్పటికో క్లైమాక్స్ టార్గెట్ లాగా పెట్టుకున్నది టైటిల్స్‌లోనే జరిగిపోయినట్టయింది. నా పేరులోని స్త్రీత్వపు ధ్వని గురించి మళ్లీ మళ్లీ అడిగారు.
నేను బెంగళూరు వస్తున్నట్టు తెలుసు కాబట్టి, ఒక్కరోజైనా ఇంటికి రావాల్సిందేనని మానస చామర్తి పిలవడంతో తెల్లారి వాళ్లింటికి వెళ్లాను. మరునాడు ఇద్దరమూ తిరిగి వచ్చాక, ఆ కార్యక్రమాలన్నీ ఉత్సాహంగా చుట్టేస్తూ పిల్లల కోడిలా తిరుగుతున్న జయమోహన్‌కు ఎదురుపడ్డాం. ఆయన మమ్మల్ని కూడా కాఫీకి వెంటబెట్టుకెళ్లారు. అవినేని భాస్కర్ సహజంగానే తోడయ్యారు. అప్పుడు జయమోహన్‌తో మామూలుగా మాట్లాడిన మాటలే, తర్వాత మానస రాతలో పద్ధతిగా ‘వివిధ’లో వచ్చాయి.
ఈ ఫొటో నాకెంతో ప్రియమైన జ్ఞాపకంగా గుర్తుండిపోయింది.

No comments:
Post a Comment