Friday, June 12, 2026

ఒక వృద్ధుడు మరియు ఒక భారీ వాహనం


ఓర్కెనీ ఇస్త్వాన్‌

ఓర్కెనీ ఇస్త్వాన్‌ కథ ‘ది ఓల్డ్‌మాన్‌ అండ్‌ ద గ్రేట్‌ బిగ్‌ ఆటోమొబైల్‌’కు అనువాదం ఇది.. ఓర్కెనీ(1912–1979) ఇరవయ్యో శతాబ్దపు ప్రసిద్ధ హంగరీ రచయితల్లో ఒకరు. కథలు, నాటకాలు రాశారు. ఒక చిన్న సందర్భంలోంచే గొప్ప సత్యాలను వెలికితీసే రచయితగా పేరొందారు. ‘వన్‌ మినట్‌ స్టోరీస్‌’ పేరుతో ఆయన తన కథలు ప్రచురించారు. ఇవి చదవటానికి ఒక్క నిమిషమో, రెండు నిమిషాలో పట్టొచ్చుగానీ ఇవి నిమిషాల్లో మరిచిపోయే కథలు మాత్రం కావు. ద తోథ్‌ ఫ్యామిలీ, ద క్యాట్స్‌ ప్లే ఆయన పేరొందిన నాటకాలు.

ప్రపంచం తలకిందులైపోవడం అంటారే, అలాంటి అనుభవాల్ని కనీసం రెండు సార్లు భరించాడు ఓర్కెనీ. హంగరీ రాజధాని బుడపెస్ట్‌లో ఓ యూదు కుటుంబంలో జన్మించిన ఓర్కెనీ, యుద్ధంలో సైనికుడిగా రష్యాలో పట్టుబడి, నిర్బంధ కార్మిక శిబిరంలో కొంతకాలం పాటు బంధించబడినారు. అలాగే, 1956 హంగరీ ‘విప్లవం’ తర్వాత ప్రచురించకుండా ప్రభుత్వం ఆయన మీద నిషేధం విధించింది. 1960ల్లో తిరిగి ఓర్కెనీ రాయడం ఆరంభించారు. కనీసం రెండు పత్రికలకు సంపాదకుడిగా పనిచేశారు. తొలినాళ్లలో వీర కమ్యూనిస్టుగా ఉండి, అటుపై తప్పుదోవ పట్టానని బహిరంగంగా ఒప్పుకున్నారు. జర్మన్‌ రచయిత ఫ్రాంజ్‌ కాఫ్కా, మరో ప్రసిద్ధ హంగరీ రచయిత డెజో కొస్తొలాన్యీ అంటే అభిమానం. 2004లో ఒక థియేటర్‌కు అధికారికంగా ఆయన పేరు మీదుగా ఓర్కెనీ థియేటర్‌ అని నామకరణం చేసింది అక్కడి ప్రభుత్వం.


ఒక్క నిమిషంలో చదివే కథ

ఒక వృద్ధుడు మరియు ఒక భారీ వాహనం


ఇప్పుడు చెప్పబోయే కథ నిజం కాకపోవచ్చు, కానీ నిజం కాని కథల పట్ల కూడా మనం గొప్ప ఆసక్తిని కలిగుండాలి, ఎందుకంటే ఆ కథలు చెప్పే విధానం వల్ల ఒక గొప్ప వెలుగు మనలోకి ప్రసరించవచ్చు. ఎవరైనా ఇదే కథను ఒక ఐదేళ్ల కింద గనక చెప్పివుంటే దాన్ని ఈ విధంగా చెప్పేవాళ్లు:

కాళ్లకు కనీసం చెప్పులైనా లేని, చింపిరిగుడ్డలు వేసుకున్న ఒక ముసలాయన బాలటాన్‌(హంగరీలోని ప్రసిద్ధ సరస్సు) నుంచి రోడ్డు మీద నడుస్తున్నాడు. కాసేపైన తర్వాత ఉన్నట్టుండి అతడు తన చేయిని ఆపమన్నట్టుగా ఊపడం మొదలుపెట్టాడు. అదే తోవలో దూరంగా ఒక భారీ వాహనమేదో వస్తూ కనబడింది. దగ్గరికి వస్తూనే ఆ భారీ వాహనం ఆగుతుంది, డ్రైవరు డోర్‌ తీస్తాడు.

‘‘కామ్రేడ్‌(మిత్రుడు/సహచరుడు), ఎందుకు బండిని ఆపావు?’’ అడిగాడు అతను.

‘‘ఎందాకా మీ ప్రయాణం?’’ ముసలాయన వాకబు చేశాడు.

‘‘మేము దగ్గర దగ్గర బుడపెస్ట్‌ దాకా వెళ్లాలి, కామ్రేడ్‌.’’

‘‘దయచేసి నన్ను అందులో కొంచెం ఎక్కించుకుంటారా?’’ అడిగాడు ముసలాయన.

‘‘కానీ లోపల జాగా లేదు, కామ్రేడ్,’’ డ్రైవర్‌ జవాబిచ్చి, డోర్‌ మూసి, గేరు మార్చాడు.

ఈపాటికల్లా కొంత ఎండ వచ్చింది, ఆ ఎండలో నీలిరంగు సరస్సు తళుకులీనుతోంది. పొద్దుపోవడానికి మనకు మనం ఎన్నో గొప్ప కథలు చెప్పుకుంటున్నాం. ఈ కథ కూడా మళ్లీ మన మధ్యకు వచ్చింది, కాకపోతే కొత్త రూపంలో:

కాళ్లకు కనీసం చెప్పులైనా లేని, చింపిరిగుడ్డలు వేసుకున్న ఒక ముసలాయన బాలటాన్‌ నుంచి రోడ్డు మీద నడుస్తుండగా, అదే తోవలో ఒక భారీ వాహనమేదో వస్తూ కనబడింది. వృద్ధుడిని సమీపించగానే ఆ భారీ వాహనం ఆగుతుంది, డ్రైవర్‌ డోర్‌ తెరుస్తాడు.

‘‘ఓ పెద్దాయనా, బుడపెస్ట్‌ దిక్కేనా నువ్వు పోవడం?’’ అడిగాడు అతను.

‘‘ఔను,’’ జవాబిచ్చాడు వృద్ధుడు.

‘‘దా, ఎక్కు, నిన్ను అక్కడ దిగబెడతాం,’’ స్నేహపూర్వకమైన నవ్వుతో అన్నాడు డ్రైవర్‌.

ముసలాయన లోపలికి ఎక్కి, కిటికీకి తల ఆనించి, నిదానంగా అడుగుతాడు:

‘‘లోపల రేడియో ఏమీ లేదా?’’

రెండు కథలూ బానేవున్నాయి, కానీ రెండూ నిజం కాదు. నిజం ఎంతవరకూ అంటే, ఆ కాళ్లకు కనీసం చెప్పులైనా లేని, చింపిరిగుడ్డలు వేసుకున్న ముసలయాన రోడ్డు మీద నడుస్తుండగా అదే తోవన ఒక భారీ వాహనం ఏదో వస్తూ కనిపించడం. కానీ దానివైపు చెయ్యెత్తి ఆపాలని ఎప్పటికీ ఆ ముసలాయనకు తోచదు, ఆ పెద్దాయన్ని చూడగానే ఆపాలని ఆ డ్రైవరుకు ఏనాటికీ  అనిపించదు.

ఇదీ నిజమైన కథ. కానీ మనలో మన మాట, ఈ కథ ఆ రెండింటికంటే పెద్ద గొప్పగా ఏం లేదు.


(సాక్షి సాహిత్యం; 9 డిసెంబర్‌ 2019)


 

No comments:

Post a Comment