Tuesday, November 21, 2017

మంట రాజేసే కథలు

పూడూరి రాజిరెడ్డి జీవితంలోని అనేకానేక ఇతర జీవితానుభవాలకు అక్షర రూపం ‘చింతకింది మల్లయ్య ముచ్చట’ కథాసంపుటి. ఇందులోని పన్నెండు కథలూ రచయిత అనుభవాలలోని ప్రాపంచిక సత్యాన్ని ఎటువంటి సుత్తీ, సోదీ లేకుండా సూటిగా పరిచయం చేస్తాయి. క్లుప్తత కథలకు ప్రాణశక్తి. నిజానికి ఇందులోని కథలన్నీ రచయిత తనతో తాను భిన్న కాల్పనిక వ్యక్తిత్వాలతో జరుపుకున్న ఆత్మకథాత్మక సంభాషణలు. ఈ సంభాషణల్లో అధిక భాగం ప్రశ్నలే కావడం ఒక విశేష వైచిత్రి. సమకాలీన తెలుగు కథకుల్లా తెచ్చిపెట్టుకున్న ఆవేశమూ, సైద్ధాంతిక  కాల్పనికతా, కృత్రిమ కల్పనలూ ఈ కథల్లో కనబడవు. రచయిత అస్తిత్వంలోని ఒక దుఃఖపూరిత తాత్విక  అన్వేషణేదో కథలను హుందాగా, అమాయకంగా నడిపిస్తూ వుంటుంది. ఆ తాత్వికతే నిరలంకార  సత్యంగా కథల నిండా పరుచుకుని ప్రకాశిస్తుంది. అనామక బైరాగి గానంలా సాగిపోయే ఈ కథలను విడివిడిగా వివరించడం వల్ల ప్రయోజనం లేదు. ఒకటో రెండో తప్ప సంపుటిలోని కథలన్నీ పాఠకుల్లో ఆలోచనను రేకెత్తిస్తాయి. దశాబ్దాలుగా తెలుగు కథల్లో లోపించిన ప్రయోగాత్మకత అనేదొకటి ఉందని గుర్తుచేస్తాయి. మరణ లేఖలు, చినుకు రాలినది, రెక్కల పెళ్లాం, కాశెపుల్ల, తమ్ముడి మరణం వంటి కథల్లోని ప్రయోగాత్మకత పాఠకుల్ని ఆకర్షిస్తుంది. చైతన్య స్రవంతి ధోరణిలో సాగే ‘మంట’ కథలోని నిజాయితీ సో కాల్డ్ మర్యాదస్థులను ఆందోళనకు గురిచేస్తుంది. సత్యప్రకటనలో, నిజాయితీలో యూరోపియన్ కథలకు దీటుగా నిలబడుతుంది. ప్రజలు అత్యంత సహజంగా రోజువారీగా వాడే భాషను నిర్భయంగా రాయడానికి చాలా ధైర్యమే కావాలి. తెలుగులో ఆధునిక పూర్వ దిగులును అక్షరమయం చేసిన ఆధునిక కథలు ‘చింతకింది మల్లయ్య ముచ్చట’.

చింతకింది మల్లయ్య ముచ్చట
పూడూరి రాజిరెడ్డి
పేజీలు: 154, వెల: రూ.144
ప్రతులకు: నవోదయ, 040-2465 2387

 
- లెనిన్ ధనిశెట్టి

(అక్టోబర్ 8, 2017 నాటి ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో ప్రచురితం.)

No comments:

Post a Comment