ఎవరో గల్లీకుర్రాడు వేసుకున్న టీ షర్ట్ మీద మీకు ఈ పేరు కనిపించివుండొచ్చు: క్యాల్విన్ క్లెయిన్! సంక్షిప్తంగా సి.కె. అదేమిటో కూడా తెలియకుండానే, ఒప్పందం కుదుర్చుకోని మోడల్‌గా మారిపోయాడు కుర్రాడు. ‘ఫ్యాషన్ బిజినెస్ ఇక ఎంతమాత్రమూ స్థానికమైనది కాదు; అది ప్రపంచ వ్యాపారం’ అని చెప్పే అమెరికన్ ఫ్యాషన్ డిజైనర్ క్యాల్విన్ క్లెయిన్... ప్రపంచం మీదకు చొచ్చుకువచ్చిన తీరుకు ఇది అద్దం పడుతుంది.
పచారీ కొట్టు నడిపే తండ్రికి 1942 నవంబరు 19న జన్మించిన క్లెయిన్... ఐదేళ్లప్పుడు వాళ్ల చెల్లెలి బొమ్మలకు బట్టలు కుట్టాడు. నెమ్మదిగా అది ఆడవాళ్ల దుస్తుల మీద ప్రత్యేక ఆసక్తికి కారణమైంది. 60ల చివర్లో సొంత స్టోర్ ప్రారంభించాడు. ర్యాంగ్లర్, లీవై, లీ లాంటి ‘సంప్రదాయ జీన్సు తయారీదార్ల’కు పోటీగా, ‘మా ఉత్పత్తులకు మాదైన తంత్రం, మాదైన తత్వం అద్దుతాం,’ అని బరిలోకి దిగాడు.
‘నాకూ క్యాల్విన్స్‌కు మధ్యన ఏముందో తెలుసుకోవాలనుందా? ఏమీలేదు’ అంటూ తొలియౌవనంలో ఉన్న బ్రూక్ షీల్డ్స్‌తో ఊహకు అవకాశమిచ్చేలా డైలాగ్ చెప్పించాడు. ‘నీకు పూర్తిగా తగినది కనుక్కో’మని ఊరిస్తూ, కౌమారంలోకి అడుగిడుతున్న అమ్మాయిలను ఆకట్టుకున్నాడు. ‘ఇంతకుముందుకంటే మనుషులు మరింత చక్కటి ఆకృతుల్లో ఉంటున్నారు. కొంచెం శ్రద్ధ పెడితే మీరు బాగా కనబడతారు. దుస్తులు ధరించినప్పుడు యౌవనపు అనుభూతి కలగాలి. అవి మీ ధోరణిని ప్రతిబింబిస్తాయి’ అని చెప్పాడు.
‘ఆధునిక సొగసు’కు మాస్టర్ డిజైనర్‌గా పేరొందిన సి.కె. తన పేరునే బ్రాండ్‌నేమ్ చేసుకున్నాడు. కోట్లు, జీన్సు, అండర్‌వేర్, స్పోర్ట్స్ వేర్, హ్యాండ్ బ్యాగ్స్, పెర్ఫ్యూమ్స్, కాస్మెటిక్స్, బెడ్ షీట్స్, డైనింగ్ టేబుట్స్, డిషెస్, గ్లాస్‌వేర్... ఇలా అన్నింటా విస్తరిస్తూ వచ్చాడు. ‘ఎంతకాలం మన్నుతుంది, అనేదాన్నిబట్టి జీన్సు ధర నిర్ణయమవదు; దాన్ని ఉత్పత్తి చేయడంలో ఎంత శ్రమ దాగుంది? డిజైన్ సామర్థ్యం, వాష్ ఎంత అసలైనది... ఇలాంటివి ధరను నిర్ణయిస్తాయి’ అంటాడు. క్యాల్విన్ అన్ని సందర్భాల్లోనూ ఉత్పత్తిదారు కాదు. తన స్పెసిఫికేషన్స్‌కు తగ్గట్టుగా ఉత్పత్తుల్ని రూపొందించేలా ఇతర కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. అమ్మకాల మీద రాయల్టీలు పొందుతాడు.
ఎన్ని రకాల డిజైన్లు చేసినప్పటికీ, తనను తాను తొలుత విమెన్ డిజైనర్‌గా భావిస్తాడు. మహిళల శరీరాలు, వాటి ధర్మాలు, వారి కోరికలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ‘వాళ్లకు సంబంధించిన ప్రతిదీ, ఇన్నర్‌వేర్, ఔటర్‌వేర్ ఏదైనా తేడా లేదు’; వాళ్లు అన్నీ అందంగానే ఉండాలని కోరుకుంటారంటాడు. ‘ఉత్పత్తికి సంబంధించిన ప్యాకేజింగ్, దాని వాణిజ్య ప్రకటన అన్నీ ఆ ఉత్పత్తిని ప్రతిబింబించాలి... అయితే, సెలబ్రిటీలకు నా బ్రాండ్ దుస్తులను తొడిగించడంలో ఏనాడూ ఆసక్తిలేదు; ఆధునిక అమెరికా మహిళ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోడ్రన్ వర్కింగ్ వుమెన్... ఆమె యాక్టివ్, యంగ్, తనకో కుటుంబం ఉంటుంది, బిజీగా ఉంటుంది... స్త్రీగా ఉండటాన్ని ఆనందిస్తూనే కేవలం ఫ్యాషన్ బొమ్మగా పరిగణించడాన్ని సహించదు... వాళ్లు సోషలైట్స్ కానక్కర్లేదు... అలాంటివాళ్లకు డిజైన్ చేయడం’లో తనకు ఆనందం ఉందంటాడు.
అయితే వాణిజ్య ప్రకటనల్ని‘సెక్సీ’గా రూపొందించడం ద్వారా చాలాసార్లు విమర్శల పాలయ్యాడు. అలాగే, సౌష్టవమైన దేహంకన్నా బక్కపలుచటి మోడల్ కేట్‌మాస్‌ను వినియోగించినప్పుడు కూడా, ‘అస్తవ్యస్త పోషణ’కు కారణమయ్యాడంటూ విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే, చక్కటి ఆకృతిలో ఉండటానికిగానూ వ్యాయామం చేసేలా ప్రేరేపిస్తోందికదా, అని నవ్వేస్తాడు. మద్యపానం, మాదకద్రవ్యాలు, బై సెక్సువల్ ఇమేజీ కూడా ఆయన్ని చాలాకాలం ప్రతికూల వార్తల్లో ఉంచాయి.
తన ఉత్పత్తులకు తరచూ మోడళ్లను రిపీట్ చేస్తాడు క్యాల్విన్. దానిలో ఉన్న సానుకూల అంశం ఏమిటంటే, ‘అది ఉత్పత్తికి సంబంధించిన కొనసాగింపు’ను సూచిస్తుందంటాడు. తన ఉత్పత్తులకు మోడళ్లనే ఎక్కువగా వినియోగించడానికి కారణం, ‘మోడల్ ఎంతో చెప్పగలుగుతుంది. అదే సెలబ్రిటీలు, నటులు వారిదైన మనుషులు’ అంటాడు. అందుకే, ప్రయాణిస్తున్నప్పుడు దారిలో కనబడిన మనిషి దగ్గర తన కారు ఆపుకొని అతణ్ని ఎంపిక చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి(ఉదా: టామ్ హింట్‌నౌస్).
తనను మరొకరు కాపీ కొట్టడం సంతోషమేనని చెబుతాడు. ‘ఫ్యాషన్ పరిశ్రమ అనేది కొత్తది కనుక్కోవడం కాదు’, ఉన్నదాన్ని మెరుగుపరుచుకుంటూ వెళ్లేదే! ‘అసలు ఎవరైనా మనల్ని కాపీ కొట్టకపోతేనే సమస్య. మనం సరైనది ఇవ్వనట్టు లెక్క’ అంటాడు. ఫ్యాషన్ గురించి చక్కటి ముక్తాయింపు ఇస్తాడు. ‘ఒకరిని అందంగా కనిపింపజేయడంలో సహాయపడటానికి మించిన ఉత్సాహవంతమైన పని ఇంకేముంటుంది?’
(ఫన్ డే, నవంబర్ 2014)
No comments:
Post a Comment