తన కొడుకు చాలా పెద్దపేరున్నవాడు అవుతాడని సర్రియలిజంగా చెప్పదలిచిందేమో, పాబ్లోకు డోనా ఇలా నామకరణం చేసింది: పాబ్లితో డీగో జోస్ శాంటియాగో ఫ్రాన్సిస్కో డి పాలా జువాన్ నెపోమ్యూసినో క్రిస్టీస్ క్రిస్పియానో డి లాస్ రెమెడియోస్ సిప్రియానో డి ల శాంటిసియా ట్రినిడాడ్ రూయిజ్ బ్లాస్కో వై పికాసో లోపెజ్.
పూర్వీకులు, బంధుమిత్రులు, క్రైస్తవ సన్యాసులు అందరినీ తన పేరులో కలుపుకున్న పికాసో– మాటలు రాకముందే బొమ్మలు గీయడం మొదలుపెట్టాడు. చిన్నవయసులోనే ఏ చిత్రాన్నైనా నకలు చేయగలిగేవాడు. అతడికి తండ్రి బ్లాస్కోనే తొలిగురువు. బ్లాస్కో పావురాల్ని పెంచేవాడు. వాటిని చూస్తూ కుమారుణ్ని గీయమనేవాడు. స్పెయిన్ సాంస్కృతిక ఉత్సాహంలో భాగమైన గుర్రాల్ని, బుల్‌ఫైట్ దృశ్యాల్ని కొడుక్కు చూపించేవాడు. ఇవన్నీ పికాసో భావి జీవితాన్ని ప్రభావితం చేశాయి. అలాగే తనతో ఆడిపాడిన చెల్లెలి మరణం కూడా! అందుకే దేవుడు దయ్యంగా కనబడటం మొదలైంది. ‘మనం ఏది చిత్రించాలి? ముఖం మీద కనిపిస్తూ ఉన్నదా? ముఖం లోపల ఉన్నదా? ముఖం వెనుక ఉన్నదా?’ అన్న మథనం మొదలైంది.
పికాసో కౌమారంలోకి అడుగిడగానే జన్మదిన కానుకగా, వాళ్ల నాన్న తాను వాడే కుంచెలు, రంగులు, పేలెట్ బహుమతిగా ఇచ్చాడు. బ్లాస్కో మళ్లీ బొమ్మల జోలికి పోలేదు. ‘నా చిన్నప్పుడు మా అమ్మ ఓ మాట అంటుండేది. నువ్వు సైనికుడివైతే జనరల్‌వు అవుతావు. సన్యాసివైతే పోప్ అవుతావు అని. కానీ నేను చిత్రకారుణ్నయి పికాసోనయ్యాను,’ అన్నాడు సగర్వంగా. ‘శాస్త్రం – దాతృత్వం’, ‘తొలి ప్రార్థన’, ‘ముసలి గిటారిస్టు’, ‘పైప్‌తో పిల్లాడు’, ‘అవెన్‌యాన్ వేశ్యలు’ లాంటి ఎన్నో చిత్రాలు గీశాడు. అంతర్యుద్ధ సమయంలో స్పెయిన్ వినాశనాన్ని ప్రతిబింబిస్తూ ‘గుయెర్నికా’ (1937) వేశాడు. ఫ్రాంకో, జర్మన్ మిత్రపక్షాలు గుయెర్నికా అనే పట్టణంపై మూడు గంటలపాటు జరిగిన బాంబులదాడిలో సుమారు రెండువేల మంది చనిపోయారు. వందలమంది గాయపడ్డారు. వీరిలో వృద్ధులు, మహిళలు, పిల్లలు ఉన్నారు. ఎడ్లను సైనికులుగా దౌర్జన్యానికీ, గుర్రాలను ప్రజానీకంగా దుఃఖానికీ ప్రతీకలుగా 7.8 మీటర్ల వెడల్పు, 3.5 మీటర్ల ఎత్తుతో నలుపు, తెలుపుల్లో వేసిన ఈ పెయింటింగు– ఇరవయ్యవ శతాబ్దపు అత్యున్నత చిత్ర సృష్టిగా ప్రశంసలందుకుంది. అయితే, ఈ ప్రతీకలు విమర్శకులు ఊహించినవే తప్ప పికాసో నిర్ధారించలేదు. ఎద్దు ఎద్దే, గుర్రం గుర్రమే... కళను కళగానే చూడమన్నాడు. ఆయనే అన్నట్టు, ‘కళ ఒక అబద్ధం. అయితే సత్యాన్వేషణలో అది మనకు సాయం అందిస్తుంది.’ ‘ఆత్మమీద పేరుకుపోయిన రోజువారీ జీవితపు దుమ్మూ, ధూళిని పరిశుభ్రం చేస్తుంది’.
పికాసో చిత్రకళను సాధారణంగా ఏడు దశలుగా చెబుతారు. బ్లూ పీరియడ్, రోజ్ పీరియడ్, న్యూడ్, క్యూబిజం, ఆఫ్రికన్ ప్రభావం, క్లాసికల్, సర్రియలిజం. నీలిదశలోని చిత్రాలన్నీ నీలిరంగు నేపథ్యాన్ని కలిగివుంటాయి. ఉదాసీనతకూ, విచారానికీ ప్రతీకగావుండే నీలిరంగులోంచి తర్వాత గులాబీ దశలోకి మరలాడు. ఇదంతా ఉత్సాహపూరిత కాలం. అటుపై తానే మూలస్తంభంగా నిలిచి, ప్రచారంలోకి తెచ్చిన సరికొత్తశైలి క్యూబిజంలోకి వచ్చాడు. ఆఫ్రికన్ కళను అనాగరికంగా భావిస్తున్న రోజుల్లో వారి కళాత్మకతను అర్థం చేసుకుని ఆ ప్రభావంలో గీశాడు. ‘అల్ప కళాకారులు అరువు తెచ్చుకుంటారు; గొప్ప కళాకారులు దొంగిలిస్తారు,’ అని గడుసుగా కూడా ఒక మారు చెప్పుకున్నాడు.
ఆయన చిత్రకళలో ఏడు దశలున్నట్టే, ఆయన జీవితంలోనూ ఏడుగురు స్త్రీలున్నారు. పడతులపట్ల తన మోహాన్ని పికాసో ఏనాడూ దాచుకోలేదు. ఫెర్నాండో ఓలివేర్, ఎవా గూల్, మేరీ వాల్టర్, డోరా మార్, జాక్వెలిన్ రోకో... ‘నేను ఎవరితో ఉండాలీ అనే అంశాన్ని తేల్చటం కోసం ఇద్దరు ఆడవాళ్లు కొట్టుకోవటం నా జీవితంలో అత్యంత మధురమైన సందర్భం’ అని చమత్కరించాడు. కొన్ని గాఢమైన క్షణాలు, తీవ్రమైన కౌగిళ్ల తర్వాత ఆ ప్రేమలన్నీ ఎడబాటుకే దారితీసేవి. వారి ప్రేమకు శాశ్వతత్వం లేకపోయినా, తన చిత్రాల ద్వారా ప్రియురాళ్లకు శాశ్వతత్వం కల్పించాడు. గుయెర్నికాలో డోరా మార్ కనబడుతుంది. ఇంకా ఆయా దశల్లోని చిత్రాల్లో ఆయా కాలాల ప్రేయసులు దర్శనమిస్తారు.
చిత్రకళలోనే కాదు, శిల్పంలో కూడా అసాధారణ ప్రతిభను చూపాడు పికాసో. కాగితంపైనే కాకుండా కుండలు, కలప, చర్మం, పింగాణిని కూడా మాధ్యమంగా ఉపయోగించుకున్నాడు. శాంతికి చిహ్నంగా ప్రపంచం గుర్తిస్తున్నది పికాసో పావురాన్నే!
అయితే, ఆయన చిత్రాల్లో అర్థం కానివే ఎక్కువ. ‘సమకాలీన ప్రపంచంలో ఏదీ అర్థం కాదు, మరి అర్థమయ్యే పెయింటింగు నేనెందుకు వెయ్యాలి?’ అని ఎదురు ప్రశ్నించాడు. అయినా కూడా ఒక యుగపురుషుని కీర్తి తన జీవితకాలంలోనే వచ్చిపడింది. కోట్ల రూపాయలకు పెయింటింగ్స్ అమ్ముడుకావడం మొదలైంది. వేలంవెర్రిగా జనం అభిమానిస్తుండటం చూసి, నా చిత్రాల్లో మీరు ఊహించుకుంటున్నదేదీ లేదు, అని కూడా చిరాకుపడ్డాడోసారి.
మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన పికాసో నిరాడంబరంగా బతికాడు. సాదాసీదాగా నిక్కరుమీదే పనిచేసుకునేవాడు. సందర్శకులనూ అలాగే కలిసేవాడు. స్పెయిన్‌లో పుట్టి, ఫ్రాన్స్‌లో స్థిరపడిన పికాసో చిత్రకారుడికి పర్యాయపదంగా నిలిచాడు.
––––––––––––––––––––––––––––––––––––
అక్టోబర్ 25న చిత్రకారుడు పికాసో(1881–1973) జయంతి
(ఫన్ డే, అక్టోబర్ 2014)
No comments:
Post a Comment