(5 నవంబరున ఎప్భీలో చేసిన పోస్టు)
నన్ను నేను పేదవాడిగా ఎప్పుడూ భావించుకోలేదు. రెండేళ్లు మినహా నా చదువంతా జరిగింది గవర్నమెంటు స్కూళ్లు, కాలేజీల్లోనే అయినప్పటికీ నేను పేదవాడినని అనుకోలేదు. డిగ్రీకొచ్చేదాకా నేను స్లిప్పర్లు వేసుకుని కాలేజీకి పోయినప్పటికీ నేను పేదవాడినని అనుకోలేదు. దేనికైనా నూరు రూపాయలు అడిగితే మా బాపు ముందు అరవై సరిపోవా అనేవాడు; తరువాత ఎనభైకి వచ్చేవాడు; సరిగ్గా ఆ క్షణానికి వచ్చేసరికి ఆ నూరు రూపాయల నోటేదో చేతిలో పెట్టేవాడు. కాబట్టి నాకు డబ్బుల లేమి అనేది ఎప్పుడూ తెలియలేదు.
నన్ను నేను పేదవాడిగా ఎప్పుడూ భావించుకోలేదు. రెండేళ్లు మినహా నా చదువంతా జరిగింది గవర్నమెంటు స్కూళ్లు, కాలేజీల్లోనే అయినప్పటికీ నేను పేదవాడినని అనుకోలేదు. డిగ్రీకొచ్చేదాకా నేను స్లిప్పర్లు వేసుకుని కాలేజీకి పోయినప్పటికీ నేను పేదవాడినని అనుకోలేదు. దేనికైనా నూరు రూపాయలు అడిగితే మా బాపు ముందు అరవై సరిపోవా అనేవాడు; తరువాత ఎనభైకి వచ్చేవాడు; సరిగ్గా ఆ క్షణానికి వచ్చేసరికి ఆ నూరు రూపాయల నోటేదో చేతిలో పెట్టేవాడు. కాబట్టి నాకు డబ్బుల లేమి అనేది ఎప్పుడూ తెలియలేదు.
ఇప్పుడు మా(నా) ఇంట్లో సన్నటి పెద్ద టీవీ లేదు, కొనగలగడం కన్నా అద్దింట్లో ఆ ఉన్న టీవే ఎక్కువ అనిపించడం వల్ల. చేతుల్తోనే ఉతుక్కుంటాం కాబట్టి వాషింగ్ మెషీన్ లేదు. ఫ్రిజ్లో పెట్టదగినదంటూ ఒకటి ఇంట్లో ఉండదనే నమ్మకంతో ఫ్రిజ్ కొనలేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్టును నమ్ముకున్నవాడిని కాబట్టి వ్యక్తిగత వాహనం లేదు. మానసికంగా నాకో స్థిరత్వం రాలేదు కాబట్టి సొంతింటి గురించి ఆలోచన చేయలేదు. ఇలాంటి లక్షణాలున్నప్పటికీ నన్ను నేను పేదవాడినని ఎప్పుడూ అనుకోలేదు. నాకు అవసరమైన డబ్బులు నా దగ్గర ఎప్పుడూ ఉన్నాయి. డబ్బులు లేక నేను ఫలానాది కొనడాన్ని ఎప్పుడూ వాయిదా వేయలేదు. నేను అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఏ స్నేహితుడో ఫోన్ చేసి, అర్జెంటుగా ఓ నాలుగు వేలు ఉన్నయా అంటే ఇవ్వడానికి నా దగ్గర ఎప్పుడూ డబ్బులున్నాయి.
నా దగ్గర తగినన్ని డబ్బులు ఉన్నప్పటికీ నాలో ఒక ఊరితనం ఉంటుంది. ఆ ఊరితనం గమనింపులోకి వస్తుందేమో అనుకునే ప్రతిచోటునీ నేను వెళ్లకుండా అవాయిడ్ చేస్తాను. అందుకే హైదరాబాద్లో చాలా చోట్లు నాకు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అందుకే మా పిల్లలను నా మానసిక స్థితికి ఇబ్బందికాని బళ్లలోనే వేశాను. కానీ అది మళ్లీ ఒక న్యూనత కలిగిస్తుంది. నేను దాటలేని అవరోధాల వల్ల పిల్లల్ని సరైన స్కూళ్లలో వేయలేదేమో, వాళ్లకు తగిన చదువును నేను ఇవ్వలేకపోతున్నానేమో, చేజేతులా వాళ్లకు అన్యాయం చేస్తున్నానేమో అని విచారం కలుగుతుంది.
ఇంక దాన్ని దాటి తీరాలని నిశ్చయించుకుని, చాలా రకాలుగా సెర్చ్ చేసి ఎంపిక చేసుకుని, ఇవ్వాళ ఒక స్కూలుకు వెళ్లాను. వాళ్లు చెప్పిన ఫీజు అక్షరాలా రెండు లక్షల యాభై ఎనిమిది వేలు. దీన్నో మూడు దఫాల్లో కట్టొచ్చు. ట్రాన్సుపోర్టుకు ఒక నలభై నాలుగు వేలు. దీన్ని రెండు దఫాల్లో కట్టొచ్చు. ఇంకా యూనిఫామ్స్, పుస్తకాలు ఈ ఖర్చులో లేవు. ఒక పిల్లాడు స్కూలుకు వెళ్తున్నాడంటే ఇంకా ఇతరత్రా ఖర్చులు ఎలా వస్తుంటాయో పిల్లల్ని బళ్లకు పంపే తల్లిదండ్రులకు తెలిసేవుంటుంది. కొంత కాషన్ డిపాజిట్ కూడా ఉందిగానీ అది పిల్లాడిని మాన్పించినప్పుడు మనకు తిరిగిచ్చేస్తారు. ఈ వివరాలను వాళ్లు చెబుతున్నప్పుడు, రేపు పొద్దున్నే వచ్చి ఏక మొత్తంలో చెల్లించేవాడిలాగా బయటపడకుండా మేనేజ్ చేశాను.
నేను పోయిన స్కూల్ దగ్గరలోనే ఇంకోటి కనబడింది. దాని గురించీ కొంత వినివున్నాను కాబట్టి, ఎటూ ఇంతదూరం వచ్చానుకదా అని అక్కడికీ వెళ్లాను. వాళ్లు ఒక లక్ష డెబ్బై వేల ఫీజు, నలభై వేల ట్రాన్సుపోర్టు అన్నారు.
జీవితంలోని అత్యంత రసహీన క్షణాలు ఏమైనా ఉన్నాయంటే అది డబ్బుల గురించి మాట్లాడుకోవడం అని నేను అనుకుంటాను. అందుకే నీకు జీతం ఎంతొస్తుంది, ఈ సంవత్సరం ఎంత పెరిగింది లాంటి ప్రశ్నల్ని నేను నా నోటితో ఎవరినీ అడగను. నేనేమీ ఇవ్వాళే గుడ్డులోంచి బయటికి వచ్చి లోకాన్ని చూస్తున్నవాణ్ని కాదు. ఎంతెంత మంది ఎంతెంత తక్కువ సంపాదనలతో బతుకులను వెళ్లదీస్తున్నారో నా అవగాహనలో లేని విషయమూ కాదు, ప్రైవేటు బళ్లలో ఫీజులు ఎలా ఉంటున్నాయనే విషయం నాకు ఇంతకుముందు తెలియదనీ కాదు. ఇప్పుడు చెప్పిన దానికి కనీసం నాలుగు రెట్లు ఎక్కువ ఫీజులున్న స్కూళ్లు కూడా నాకు తెలుసు. కానీ ఆ వాస్తవం మీది నుంచి నేను దొర్లుకుంటూ వెళ్లిపోయేవాణ్ని. అది నా కంఫర్ట్ ఏరియా కాదనుకున్నాను కాబట్టి అటువైపు వెళ్లలేదూ, వాటిగురించి పట్టించుకోలేదూ.
నేను ఇద్దరు పిల్లల తండ్రిని. నా పెద్దకొడుకును ఆర్టిస్ట్ అండ్ పొయెట్ అనుకుంటాను. నా చిన్నకొడుకును స్పోర్ట్స్ మన్ అనుకుంటాను. కానీ ఒక్కసారిగా– నువ్వేమి చేసీ కనీసం ఆ రెండో స్కూల్లోనైనా నీ ఒక్క పిల్లాణ్ని కూడా చేర్పించలేవూ, ఇదంతా నువ్వు అంగీకరించి తీరవల్సిన వాస్తవమూ అనిపించేసరికి జీవితంలో మొట్టమొదటిసారిగా నాకు నిరుపేదరికం అనుభవంలోకి వచ్చింది.
test comment
ReplyDeleteఎండాకాలం సాయంత్రం. జనాలు ఆఫీసులనుండి ఇళ్ళకి తిరిగెళుతూ రైతు బజారుకి వచ్చారు. మనుషుల మాటలతో, కదలికలతో, వాసనలతో ప్రాంగణం కిటకిటలాడుతోంది. బయట పూల వ్యాపారులు. వాళ్ళళ్ళో పెద్ద బొట్టు, కొప్పులో పచ్చని చామంతి, దవడలో ఆకు పెట్టుకొని, ఒక చిన్న స్టూల్ మీద కూర్చొని ముందు గంపలో నీటి బిందువులతో మెరుస్తున్న కనకాంబరాలని మాలలా కడుతున్న అవ్వ. బేరాన్ని బట్టి మూరల్ని కొలిచి, తెంపి, కాగితంలో చుట్టి ఇస్తోంది. జాజిమల్లెలు తీసుకెళదామని అక్కడికి వచ్చిన కొత్త వరుడొకడు, జీవంలేని కెంపుల కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ మెరుస్తున్న కనకాంబరాలని చూసి, చిరునవ్వుతో హారాన్ని కడుతున్న అవ్వమీద మమకారం కలిగి, ఒకటి, కాదు, రెండు, లేద్లేదు, నాలుగు మూరలు తీసుకున్నాడు. ఆ రాత్రి మేడ మీద జాబిలిలో వాళ్ళిద్దరూ కంచాల ముందు కూర్చొని మాటలతో కడుపు నింపుకుంటున్నప్పుడు, ఆమె జడలో నిండుగా పొదిగివున్న పూలని చూసి, ఆమె గాజుల సవ్వడి వింటున్నప్పుడు వాడి అదృష్టం మీద వాడికే కృతజ్ఞత పుట్టింది.
ReplyDeleteజారిపోతున్న వేల ఆలోచనలను, భాషలో కట్టిపడేయటానికి వీలుకాని, ముట్టుకుంటే కందిపోతాయేమోననిపించేటి లేత అనుభవాలను పూల హారాల్లా చుట్టి నాలాంటి వాళ్ళకి ప్రసాదంలా ఇస్తున్నారు.
ఈ ప్రస్తావనలో మీ సందిగ్ధాల గురించి నేనేం చెప్పలేను కానీ ఒక్కటి మాత్రం నిజం- మీ లాంటి తండ్రి పెంపకంలో పెరగడం నిజంగా ఆ పిల్లల అదృష్టం.
మహేష్ బాబు గారి పిల్లలు చదివే స్కూల్ లో అయితే మీరు చెప్పిన రేట్లు ఉంటాయి. యండమూరి గారి కొడుకు చదివిన స్కూల్ లో లక్ష కూడా మించదు. పైగా మధ్యాహ్నపు భోజనం కూడా ఉంటుంది. తాహతుకి మించి చదివిస్తే మేధావులవుతారని గ్యారెంటీ కూడా లేదు.
ReplyDelete// “ కొంత కాషన్ డిపాజిట్ కూడా ఉందిగానీ అది పిల్లాడిని మాన్పించినప్పుడు మనకు తిరిగిచ్చేస్తారు.“ //
ReplyDeleteఇవి ఫీజుల గురించి చెప్పినప్పుడు స్కూలు వాళ్ళు చెప్పే పడికట్టు మాటలు. నిజంగా తిరిగివ్వకపోవడమే ఆనవాయితీ అని నా స్వానుభవం.
మహేష్ బాబులు, వెంకటేష్ బాబులు, మరో బాబులు వాళ్ళ వాళ్ళ పిల్లల్ని చదివించే స్కూళ్ళల్లో ఫీజులు పైన చెప్పిన మొదటి రకం స్కూలు కన్నా కూడా చాలా ఎక్కువుంటాయి. దాదాపు ఐదు లక్షలు ఫీజున్న స్కూలొకటి హైదరాబాదులోనే ఉంది.
// “..... నాకు నిరుపేదరికం అనుభవంలోకి వచ్చింది.“ // అని పైన ఈ బ్లాగర్ గారు చెప్పినది ఈనాడు చాలా మందికి కలిగే నిస్పృహతో కూడిన ఫీలింగే.