(మే 2016 చినుకు మాసపత్రిక కోసం జి.లక్ష్మీనరసయ్య గారు రాసిన ప్రత్యేక వ్యాసం)
తన మిత్రుడూ, నోబెల్ కవీ అయిన W.B.Yeatsను
పరామర్శిస్తూ, How are you అని అడుగుతాడు O’Connor. బదులుగా Not very well, I can
only write prose అంటాడు Yeats. కవులకి వచనం అంటే ఎంత చులకన భావమో సూచిస్తుందిది. తెలుగులో
కూడా త్రి.శ్రీ. లాంటివాళ్లు ‘వచనమై తేలిపోతావ్’లాంటి అభివ్యక్తి ద్వారా వచనాన్ని
పలచనజేస్తూ మాట్లాడారు. దీనికి భిన్నంగా వచనాన్ని ఒక Civil art లాగా an affair of
good mannersగా వర్ణించాడు Somerset Maugham. ఇంకాస్త ముందుకుపోయి The Poet gives
us his essence; but prose takes the mould of the body and mind entire అంటుంది
Virginia Woolf. మంచి వచన ప్రాముఖ్యత గురించి కొ.కు., చే.రా.లు కూడా సానుకూల వాదన చేశారు.
ఇలా కవులూ, రచయితలూ వారి వారి ప్రక్రియల్ని వెనకేసుకు రావటం మామూలే. కాని మంచి వచనం
రాసిన కవులు ప్రపంచ వ్యాపితంగా ఉన్నారు. Shelley, Coleridge, T.S.Eliot, W.H.Auden,
ఇంకా W.B.Yeats కూడా తమ సమకాలీనుల కంటే మంచి వచనం రాశారు. మన శ్రీశ్రీ, శివసాగర్, శివారెడ్డి,
హెచ్చార్కె, సీతారాం, సతీష్ చందర్‌లు కవులుగా ఉంటూనే చక్కని వచనాన్ని రాశారు. అలాగే
తమ వచనంలో కవిత్వాన్ని పండించిన వచన రచయితలూ ఉన్నారు. James Joyce, Vladimir Nabokov, Miller, Soyinka,
Ben Okri లాంటివాళ్లూ, తెలుగులో చలం, రావిశాస్త్రి, పతంజలి, స్వామి, గోపిని కరుణాకర్,
వి.ఆర్.రాసాని, నామిని తమ వచనంలో చిక్కని కవిత్వాన్ని నిర్మించిన రచయితలు. ప్రస్తుతం
ఈ కోవలోకి పూడూరి రాజిరెడ్డి కూడా వచ్చాడు.
గత పది సంవత్సరాల నుంచి తెలుగు సాహిత్యంలో
సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తున్న రచయిత పూడూరి రాజిరెడ్డి. ఒకటి తరువాత ఒకటిగా
‘మధుపం’(2009), ‘పలక–పెన్సిల్’(ఆగస్ట్ 2013), రియాలిటీ చెక్ (డిశంబర్ 2013) పుస్తకాల్ని
విడుదల చేసి తెలుగువారి మనసుల్ని కొల్లగొట్టాడు ఈ రచయిత. ఇంకా తను రాసిన ఏడు కథలు కూడా
ఆయనకు ప్రత్యేక గుర్తింపును ఇవ్వటం సాహితీ ప్రియులకు తెలుసు. ‘‘నేను కొన్ని కథలు రాసినప్పటికీ,
ప్రక్రియల మూసల్లో ఇమడని వాక్యం నాకిష్టం. ఏ రూపంలోనైనా నన్ను నేను వ్యక్తం చేసుకోవడం
నాకిష్టం. కథకుడిగా కన్నా ప్రోజ్ రాసేవాడిగా నన్ను నేను భావిస్తాను’’ అంటాడు రాజిరెడ్డి.
ఏది ఏమయినా ఈయన రాకతో తెలుగు వచనం ఫేస్ వాల్యూ పెరిగింది. కొత్త రక్తం ఎక్కి నవనవ
మెరిసిపోతుంది.
ఒక పేజీ బతికున్న వచనాన్ని రాయగలిగిన ఏ రచయితయినా
మన జీవితానికి కొంత సమకూర్చినట్లే. అట్లాంటిది ఏకంగా ఏడెనిమిది వందల పేజీల్ని జీవంతో
తొణికిసలాడే మాటలు, పదాలుగా, వెరసి వైబ్రేటింగ్ వాక్యాలుగా మలచటం మామూలు పని కాదు.
ఈయన వాక్యాన్ని ‘మోహపరిచే వాక్యమనీ’, ‘వెంటాడే వాక్యమనీ’ గుడిపాటి సరిగానే వర్ణించాడు.
సుధామయి ‘మనసున్న వాక్యం’ అని పిలిచారు. రాజిరెడ్డి వాక్యంలో ‘కత్తిలోతు’ ఉందని అఫ్సర్
అంటాడు. ఇది ‘యూత్‌ఫుల్ ఎక్స్‌ప్రెషన్’ అని రఘోత్తమ రెడ్డి మెచ్చుకుంటాడు. అతని వాక్యాల్లో
‘పొట్టి కవితలు’న్నాయని విహారి పరిశీలన. చింతపట్ల సుదర్శన్ ప్రకారం ‘వాక్యాన్ని ఎన్ని
రకాలుగా సుసంపన్నం చేయొచ్చో అన్ని రకాలూ చేశాడు రాజిరెడ్డి’. మాధవ్ శింగరాజుకయితే
అతని వాక్యం ‘స్ప్రయిట్’. నా మటుకు నాకు ఇతని వాక్యాలు బతికున్న వాక్యాలు. అర్థంతో
జవజవలాడే వాక్యాలు. మభ్యపెట్టే మధుర వాక్యాలు. వాక్యాలకు సంబంధించి ఇంతగా ఆకర్షించిన
రచయిత ఇటీవలి కాలంలో లేడని చెప్పాలి. ఇంత ఆకర్షణకి కారణమేంటని ఆలోచిస్తే మూస శైలిని
బద్దలు కొట్టుకుని బయటపడటమే అని తేలుతుంది.
ప్రక్రియా పరంగా చూసినా రాజిరెడ్డిది నమూనాలో
ఇమడలేనితనం. అది కథా, కవిత్వమా, గల్పికా, మ్యూజింగా, మెమొయిరా, ప్రేమలేఖా, స్కెచ్చా,
రిపోర్టా– లేక అన్నో, కొన్నో కలిసిన ప్రక్రియా అని స్పష్టంగా చెప్పలేని స్థితి. ఏదయినా
ఉండొచ్చూ ఏదయినా లేకపోవచ్చు. అమలులోని ప్రక్రియా నియమాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఫ్లెక్సిబుల్‌గా
సాగిపోవడం వల్ల రూపొందిన శిల్పమే ఇది. ఈ శిల్పమే అతని వ్యక్తిత్వాన్నీ, వస్తు వైవిధ్యాన్నీ
ప్రతిఫలిస్తుంది. Technique is the key to understand the అని Ezra Pound అందుకే అంటాడు. మూసలో ఇమడలేని స్వేచ్ఛాకాంక్ష, సిద్ధమయి
ఉన్న బట్టల్లోకి దూరిపోలేని తనం, లిబరేటెడ్ రీతి సిద్ధాంతాల, వాదాల చట్రంలో ఇరుక్కోకుండా
జీవిత వాస్తవికత ప్రాతిపదికగా తను చేసిన ఆలోచనల్లో, చింతనలో ప్రతిఫలించటం మనం గమనిస్తాం.
సిసలయిన అనుభవాల తాకిడికి సిద్ధాంతాల పదును
తగ్గిపోతుంది. అసలయిన అనుభూతుల సమక్షంలో అతిశయవాదాలు వెలవెలబోతాయి. చూసిన దాన్ని గురించే
రాయడు రాజిరెడ్డి. చూసిన దాని గురించి ఏం ఫీలయ్యాడు, అట్లాగే అనుభవంలోకి వచ్చినదాన్ని
గురించి ఏ స్పందనలు పొందాడు, ఆ క్రమంలో అతనిలో పనిజేసిన లాజిక్ ఏంటి, రీజన్ ఏంటి,
వాటితో ప్రయాణిస్తూ తాను చేసిన తాత్విక ప్రయాణం ఏంటి, ఇవీ రాజిరెడ్డి రచనల్లో మనకు
కనిపించే విషయాలు. రోజువారీ అనుభవాలనుంచీ ఈతి బాధలనుంచీ ఆచరణాత్మక పాఠాల్నీ, సమీక్షల్నీ
పోగుచేసుకుంటూ పాఠకులకు ఒక Practical wisdomని సరళంగా సాంద్రంగా అందిస్తూ పోతాడు. ఒక
నైతిక విచికత్సకు తాను గురవుతూ మనల్నీ గురిచేస్తాడు. శైలిలో స్థిరత్వం లేనట్లే వస్తు
ఎన్నికలో కూడా అతనికి స్థిరత్వం లేదు. ఒకానొక సందర్భంలో Pablo Picasso అన్నట్లు, He
just goes on trying other things. ఈ స్వభావమే పబ్లిక్ టేస్ట్‌ని హిట్ చేసింది.
వస్తు రూపాల్లోని ఈ ప్రవాహ శీలతతో పాటు దాపరికం
లేనితనం కూడా ఇతన్ని పాఠకులకు సన్నిహితుణ్ణి చేసింది. అసాధారణ విషయాల గురించి ఇతను
మాట్లాడడు. సాధారణ విషయాల్ని గురించి అసాధారణంగా విశ్లేషిస్తాడు. అందరి అనుభవాల్లో
గమనింపులో ఉన్న వాటికి భిన్నంగా స్పందించటం వీలుంటే దానికొక తాత్విక ముగింపు ఇవ్వటం.
ఇలాంటి పనుల్ని కొ.కు., చలం చేసి ఉన్నారు. గోర్కీ, రాహుల్ సాంకృత్యాయన్‌లు కూడా ఇదే
చేశారు. ఎంత కాదనుకున్నా వీరిది బోధనా శైలి. వీరు ఉపదేశాలిస్తున్నట్లుంటుంది. రాజిరెడ్డి
ఆలోచన రేకెత్తించే మాటలు చెబుతున్నట్లుంటుంది. సూత్రీకరణలతో కాక సంస్కారంతో తర్కాన్ని
బేరీజు వేసినట్లుంటుంది. పైవారిని పెద్దలుగా గుర్తించి గౌరవించాలనిపిస్తుంది. రాజిరెడ్డిని
మనలోని తడి ఉన్న చింతనాపరుడిగా గుర్తించి అక్కున చేర్చుకోవాలనిపిస్తుంది. గొంతులో ఎక్కడా
చదువరులకంటే ఒక మెట్టు పైనున్న స్పృహలేని చెలిమిపూర్వకమయిన శైలి పాఠకుల్ని ఇతని వశం
చేస్తుంది. అందుకే ఇతని దారి పాలొ కొయిలొ దారికి దగ్గరగా ఉంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా
Like the Flowing River, Thoughts and Reflectionsకి చెందిన కొయిలొతో ఎక్కువ దగ్గరితనం
కనిపిస్తుంది.
స్త్రీ ఆధారంగా ‘పురుషుడికి సంబంధించిన ఎన్నో
ఎమోషన్సును’ పాఠకులకు పట్టించడానికే తాను ప్రయత్నిస్తున్నట్లు ‘మధుపం’లో ప్రకటించాడు
రచయిత. ఆఫీసులో, ఇంట్లో, సమాజంలో పురుషులు స్త్రీ ద్వారా పొందే ఎన్నో రకాల స్పందనలనీ,
భావోద్వేగాలనూ హేతుబద్ధమయిన రొమాంటిసిజమ్‌తో బయటపెడతాడీ పుస్తకంలో. పురుషుడు స్త్రీ
పట్ల ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటున్నాడు, దాంపత్యంలో భార్యాభర్తల మధ్య నడుస్తున్నదేంటి
నడవాల్సిందేంటి, సంసార స్వభావం ఏంటి, ఇట్లాంటి విషయాల్ని డీల్ చేస్తూ సంబంధిత సన్నివేశాల్నీ,
పాత్రల్నీ, సంభాషణల్నీ నాటకీయతనీ ప్రవేశపెడుతూ ఈ విషయాలకు చెంది పాఠకుల్లో ఉన్న సానుకూల
వాతావరణాన్ని సౌందర్యీకరిస్తూ లేనిదాన్ని వారి ఎరుకలోకి తెచ్చే ప్రయత్నంలో సాగిపోతాడు
రచయిత. ‘నాకో ప్రేమలేఖ రాయవూ’ అని అడుగుతూ, ‘జీతం సంపాదించటం కాదురా, జీవించటం నేర్చుకో,
బీ రొమాంటిక్. కొంచెం పొయెటిక్‌గా ఉండు ప్లీజ్’ అని భర్తకు భార్య పెట్టుకున్న రిక్వెస్టు
ద్వారా సాటి మగవాడికి యాంత్రికంగా ఉండొద్దని చేసే హెచ్చరిక ఉంది. ‘ముసుగులు లేకుండా
మాట్లాడితేనే నేను సేద తీరుతాను’ అని మరోచోట భార్యతో అనిపిస్తూ మగవాడి అసహజ ప్రవర్తనని
సూచిస్తాడు. ‘మన జీవితంలో భార్యాపిల్లలున్నారు తప్ప మనం లేము’ అని మగవాడి ఎరుకలోకి
ఒక నిజాన్ని పట్టుకొస్తాడు. మాయ చేసైనా భార్యను సంతోష పెట్టటానికి అవసరమయిన మార్గాల్ని
సూచిస్తాడు. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఎంత సజీవంగా ఉన్నాడో భర్త అయిన తరువాత కూడా భార్యతో
ఆ సై్టల్‌లోనే ఉండమంటాడు. కారణం? ‘బ్రహ్మచారి తనలోకి భావుకుడి దీపాన్ని కొడిగట్టనివ్వకుండా
వెలిగించుకుంటూ ఉంటాడు’. ఇంకా ముందుకుపోయి ‘కుతూహలం పోవడమే జీవితంలో నిరాసక్తతకి కారణం’
అంటాడు. ‘మగటిమి’ని ఎద్దేవా చేస్తూ ‘మనం సీతయ్యలం. ఎవరి మాటా వినం’ అని మగవాళ్లకు చురక
పెడతాడు.
స్త్రీలను ఉద్దేశించి ‘మీరు దేవతలు’ అన్న
పేరుతో బ్రిలియంట్ కన్ఫెషనల్ కవిత్వం రాశాడు. ‘మా చెప్పులు తెగితే మీ రక్తనాళాలు
తెగినట్లుగా, మాకు తలపోటు వస్తే మీకు గుండెపోటు వచ్చినంతగా విలవిల్లాడతారు’ అంటూ స్త్రీలముందు
భేషజాల్ని వదిలి మోకరిల్లిన ఇతన్ని ఇష్టపడని పాఠకులుంటారా. చివరికి నేనెవరు అని ప్రశ్నించి
‘నేనంటే నేనే. లేదా కొందరి సమ్మేళనాన్ని. వాళ్లలోంచి వడగట్టిన భావసారాన్ని’ అని ముగించటం
విజ్ఞాన దాయకం. ఇలా ‘మధుపం’లో స్త్రీ పురుష సంబంధాలకు ప్రాముఖ్యత కనపడినా దాన్ని వెన్నంటి
ఒక తాత్విక చింతనా ధార నడుస్తూనే ఉంది.
‘పలక–పెన్సిల్’ అనే పుస్తకంని ‘ఒక మగవాడి
డైరీ’గా చెప్పుకున్నాడు రచయిత. దీన్ని ‘అనుదిన తాత్వికుడి డైరీ’ అని కరెక్టుగా వర్ణించాడు
అఫ్సర్. ఇది చదువుతూ ఉంటే Pablo Neruda ‘Memoirs’తో పాటు చలం ‘మ్యూజింగ్స్’ గుర్తుకొస్తాయి.
బాల్యం నుంచి నేటివరకూ గడిపిన జీవితం దాని తాలూకు జ్ఞాపకాలూ, ఘటనలూ, ఊరు, బంధుజనం,
కుటుంబం– వాటినుంచి ఉత్పన్నమయిన ఆలోచనలూ, తాత్వికత ఇందులో కనిపిస్తాయి. Thanks for
the memories అంటాడు Leo Robin. Storing up few memories is my only chance to
collect a past అంటాడు P.G.Wodehouse. ‘మన ఆస్తి మనం పోగేసుకున్న జ్ఞాపకాలేనని ఇప్పటికీ
నమ్ముతాను’ అని పై ఇద్దరికంటే ఇంకా అందంగా చెబుతాడు రాజిరెడ్డి. ‘మా ఊరి ముచ్చట’ అంటూ
తన ఊరి జ్ఞాపకాల్ని ముచ్చటిస్తాడు. ‘అంగీ విప్పితేనే హీరో’ అనుకున్న రోజుల్లోని అందమయిన
జ్ఞాపకాల్ని వర్ణిస్తాడు. నామిని స్ఫూర్తితో స్కూలు రోజుల్లోకి వెళతాడు. పికాసో తరహా
అర్థంకాని బొమ్మల్ని గీసిన జ్ఞాపకంతో ‘అర్థం వెతక్కుండానే జీవితంలో కొన్నింటిని ఆనందించవచ్చు’
అని వ్యాఖ్యానిస్తాడు.
ఇట్లా మొదలయిన చింతన చిక్కని తాత్వికతగా రూపొందుతుంది.
ఒక పని చేసినందుకూ బాధపడటం, చేయనందుకూ బాధపడటమనే మనిషి స్వభావాన్ని స్పష్టత రాహిత్యానికి
నిదర్శనంగా చూపుతాడు. ‘అటా? ఇటా? అదా? ఇదా?’ అనుకుంటూ సందిగ్ధంలో గడిపే అనివార్యతని
జీవితానికి సహజమయినదిగా సూచిస్తాడు. ‘అది తప్పే కదా మరి’ అని తేల్చడం కన్నా కూడా మనల్ని
మనం శాంతిగా ఎలా ఉంచుకోవాలన్నదే ముఖ్యం అని అంతా పర్‌ఫెక్ట్‌గా సాగాలనుకునే వాళ్లకు
చెబుతాడు. Then Note Books అన్న పుస్తకంలో Every fulfilment is Slavery. It drives
us to a higher fulfilment అని Albert Camus అభిప్రాయ పడతాడు. ఇలాంటి భావననే రాజిరెడ్డి
ఎంత పాజిటివ్‌గా తీసుకొస్తాడో చూడండి: ‘తనకు తానే వృత్తం గీసుకుంటూ, తిరిగి ఆ వృత్తాన్ని చెరిపేసి కొత్త పరిధిని శాసించుకుంటూ,
మళ్లీ తనను తాను కొత్త విలువలకు ట్యూన్ చేసుకుంటూ వెళ్లడమే మనుషులు చేసేది, చేయాల్సింది,
చేయగలిగేది’ అని ఊరుకోకుండా, ‘మనిషి సంతృప్తిగా బతకడానికి ఉన్న ఏకైక మార్గం ఈ తదుపరి
విలువల్ని చేరుకోవడంలో మాత్రమే లేదు. అది చేరుకోవడానికి చేసే ప్రయత్నంలో కూడా మామూలుగా
ఉండగలగడం అత్యావశ్యం. ఎందుకంటే ప్రతిచోటా ఉన్నది జీవితమే.’ మనిషి ప్రవర్తనకీ, పరుగుకీ
సంబంధించిన భౌతిక పరిస్థితుల ప్రభావాన్ని విస్మరించకుండానే తనను తాను సంభాళించుకోవటం
అనేది తన చేతిలోనే ఉందని సూచిస్తాడిక్కడ.
‘రియాలిటీ చెక్’ని కొన్ని ‘కిటికీ ప్రయాణాలు’గా
క్యాప్షన్ పెట్టుకోవడానికి కారణం వాటి పరిమితిని సూచించడానికేనని వివరణ ఇస్తాడు. తను
జీవితం అనడం అంటే ఒక ‘జీవిత శకలమే’ అనడంలోనూ ఈ పరిమితి వ్యక్తమయింది. ‘నాకు కనిపించిందీ,
నాకు అనిపించిందీ’; ఇదే పుస్తక సారాంశంగా స్పష్టం చేస్తాడు. ఇందులో పాఠకుల్ని పూర్తి
అవుట్‌డోర్ వాతావరణానికి తీసుకెళ్లడం వల్ల పుస్తకం లావుగా ఉన్నా బోరు కొట్టదు. వర్ణన
శైలీ, చెబుతున్న విషయాలూ చాలావరకు యూత్‌తో కనెక్టివిటీ కలిగి ఉంటాయి. తుమ్మేటి రఘోత్తమ
రెడ్డి అన్నట్లు ‘జీవితంలోని చీకటి కోణాల్లోకి వెలుతురు ఫోకస్ చేస్తాడు’. ఇక్కడే ఉంది
దీని ఆకర్షణ. రోడ్డు ప్రమాదాల్లో పోయే ప్రాణాల గురించీ, పోలీస్ స్టేషన్ల గురించీ,
ఇరానీ హోటల్ల గురించీ, హిజ్డాల గురించీ, వ్యభిచారుల గురించీ, అడ్డా కూలీల గురించీ,
మార్కెట్ల గురించీ, ఇందిరా పార్కుల గురించీ– ఇలా అనేక ప్రదేశాలతో ముడిపడిన విభిన్న
సన్నివేశాల్నీ, సందర్భాల్నీ, మనకు చూపిస్తూ తన dispersed meditationsని (Francis
Bacon తన వ్యాసాల గురించి అన్న మాటల్నుంచి) మనమీద కురిపిస్తూ పోతాడు. మంగలి సామాన్ని
దగ్గర పెట్టుకోని రష్యాని తెలుసుకోవడానికి సంచరిస్తాడు మాక్జిమ్ గోర్కీ. డబ్బు అవసరపడిన
ప్రతిసారీ జనానికి క్రాఫులూ, గడ్డాలూ చసి విరామంలో సంచరిస్తూ అన్వేషిస్తూ ఆ అనుభవాల్ని
తాత్విక సాహిత్య ముక్కలుగా లోకానికందించాడు. మన సాంకృత్యాయన్ కూడా సంచార రచయితే. ఎందులో
భాగంగా చేసినా ఈ పుస్తకంలో రాజిరెడ్డి చేసింది సంచార రచనే.
సృష్టి యథాతథ స్థితిని అంగీకరించేలా ఇతన్ని
పురికొల్పుతున్న ప్రతిదీ దేన్నీ ప్రశ్నించలేని మౌనిగా నిలబెడుతుంది. ‘‘తనను తాను పెంపుచేసుకుని,
శిఖర సమానమైన, అధిరోహించలేనంత ఎత్తున నిలబడే ఆయా ప్రతికూల భావనలకూ, వాటిని జయించలేని
మనిషి అశక్తతకూ, అలా నిర్దేశించిన సృష్టికర్త సృజనకూ... చేతులెత్తేస్తూ, చేతులెత్తి
మొక్కుతూ’’ అన్నప్పుడు ఆ మౌనితనానికి చెందిన ఆధ్యాత్మికత వ్యక్తమవుతుంది. Human
life begins on the other side of despair అని Sartre అభిప్రాయపడినట్లు, నిర్వేదం నుంచి
ఆధ్యాత్మిక జీవితం వైపు చూస్తున్నాడా ఈ రచయిత అని కొంతమంది కనిపించవచ్చు. ఇతని నిర్వేదం
తాత్కాలికమే. ‘నువ్వు విజేతవైనప్పుడు, పక్కవాడు పరాజితుడు కాని రోజున ఈ ప్రపంచం మరింత
బాగుంటుంది’ అని సెలవు తీసుకుంటాడు.
మానవ పరిమితుల్ని గుర్తిస్తూ, పరిమితులు ఉండటమే
మానవ మస్తిష్కపు ప్రత్యేకతగా అంగీకరిస్తూ సాగిపోయే రాజిరెడ్డి Celia Green తన
Aphorismsలో చెప్పినట్లు The remarkable thing about the human mind is it’s range
of limitations అని మనకు గుర్తు చేస్తున్నట్లుంటుంది.
మధ్యతరగతి ప్రజల్ని ఉద్దేశించి రాస్తూ Michael
Green బల్లగుద్ది చెబుతున్నట్లుగా ఇలా రాస్తాడు: Happiness is never really so
welcome as changelessness. సంతోషం కంటే యథాతథ స్థితే మెరుగనుకోవడం వల్ల మధ్యతరగతి
ప్రజలు ఇలా అనుకుంటారని రచయిత ఉద్దేశ్యం. ‘యథాతథస్థితిలోనే ఒక ప్రశాంతత దొరకాలి. నా
తక్షణ లక్ష్యం ఈ రోజు హాయిగా నిద్రపోవడం’ అంటాడు మన రాజిరెడ్డి. మిడిల్ క్లాస్ సైకీకి
బాగా అప్పీలయ్యే ధోరణిది. ఈ ధోరణి సామాజిక పురోగతికి ఆటంకమేమో అని నాలాంటివాళ్లకు అనిపిస్తుంది.
అలాగే యథాతథ స్థితిలో ప్రశాంతత దొరికే అవకాశం ఉందా? అలాంటి ప్రశాంతత దొరకగలిగినప్పుడు
రచయితే ఎన్నోచోట్ల ఎన్నో సందర్భాల్లో ఎందుకు అశాంతికి గురికావాల్సి వచ్చింది? ఇలాంటి
కొన్ని సందేహాలు నాకు కలిగాయి. ఇవి పొరపాటు కావచ్చేమో నాకు తెలీదు. అలాగే కొన్నిచోట్ల
సింప్లిస్టిక్ అనిపించే స్టేట్‌మెంట్సు కూడా రాజిరెడ్డి చేస్తూ ఉంటాడు: ‘పిల్లాడు
తప్పుగా మాట్లాడితే మనకు కోపం రాదు. వాడింకా మాటలు నేర్చుకుంటున్నాడని అనుకుంటాం. అలాగే
ఈ జనమంతా ఇంకా బతకడం నేర్చుకుంటున్నారనుకోవచ్చు కదా!’. పిల్లల తప్పులకీ పెద్దవాళ్ల
తప్పులకీ తేడా లేదా? ఉన్నప్పుడు ఇద్దరి పట్లా ఒకే రకంగా ఎలా వ్యవహరిస్తాం? ‘ఈ ప్రపంచం ఇంకా నేర్చుకుంటూనే ఉందేమో. పర్‌ఫెక్ట్
అవడానికి సమయం పడుతుందేమో’ అనే ధోరణి సమాజాన్ని మార్చుకోవటానికి జరిగే ఉద్యమాలకు సానుకూలం
అనిపించదు. ప్రపంచాన్ని మార్చాలని పూనుకున్నవాళ్లను తప్పు పట్టొద్దని తను చెప్పినప్పటికీ,
మార్పు పట్ల వ్యక్తమయిన ధోరణి మాత్రం కొంత ప్రశ్నించదగినదే.
ప్రక్రియాపరంగా నమూనాల నడుములిరచగలిన రాజిరెడ్డి
విషయపరంగా చాలావరకు మధ్యతరగతి నమూనాలో చిక్కుకుపొయ్యాడా అనికూడా నాకినిపిస్తుంది. మర్యాదా,
మప్పితం, శాంతీ, సౌందర్యం, సృజన, ఊహాత్మకత, తర్కం, తత్వం, వివేకం, హేతుబద్ధత– ఇలాంటి
విషయాల గురించి అద్భుతంగా స్పందనాత్మక విశ్లేషణ చేయగలిగిన రచయిత సామాజిక అసమానత్వాలూ,
అన్యాయాలూ, అధికార సంబంధాలూ లాంటి విషయాల గురించి పెద్దగా స్పందించకపోవటం మధ్యతరగతి
పరిమితికి లోబడే తన రచన సాగించాడనేదానికి నిదర్శనం. ఇదేదో తప్పని చెప్పటం ఇక్కడ నా
ఉద్దేశ్యం కాదు. నిజానికి తన రచనా పరిమితుల్ని రచయితే నిజాయితీగా చెప్పుకున్నాడు కనుక
నేనిక్కడ రంధ్రాన్వేషణ చేయనక్ఖర్లేదు.
రాజిరెడ్డి పుస్తకాల్ని రెండు మూడు సార్లు
చదవగలిగాను. కొన్ని ఖండికల్ని ఇంకా ఎక్కువసార్లు చదివాను. ఇన్నిసార్లు చదివించటంలోనే
మంచి సాహిత్య లక్షణం ఉందని చెప్పకనే చెప్పొచ్చు. ఆలోచనా, అనుభూతి– వివేచనా, ఉద్వేగం
సమపాళ్లలో కలిసిన unified sensibility (ఎలియట్ భాషలో) చిక్కగా పరుచుకుపోయిన కారణంగా
ఈ పుస్తకాలు ప్రాణంతో నిండిన మంచి సాహిత్యంగా తెలుగులో నిలిచిపోతాయి. Poetry is to
prose as dancing is to walking అంటాడు John Wain. రాజిరెడ్డి సాహిత్యంలో వాకింగ్,
డాన్సింగ్ కలిసి దొరకటం మన అదృష్టం. ఈ రచయితని తెలుగు పాలొ కొయిలొ అని పిలవడానికి
గర్వపడుతున్నాను.
ఇంత విశేషంగా, విశ్లేషణాత్మకంగా, విపులంగా రాజిరెడ్డిగారి గురించి ఇంతకు ముందు చదవలేదు. జిఎల్లెన్ గారికి, నా అభిమాన వచన కవి పుడూరి వారికి 🙏
ReplyDelete