Tuesday, August 13, 2024

వడ్ల గింజలు


శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి 


శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి (1891–1961) ‘వడ్లగింజలు’ కథ ఇది. 1941లో ప్రచురితమైంది. 73 పేజీల కథని కేవలం 950 పదాలకు కుదించాను. కథక చక్రవర్తి అనిపించుకున్న శ్రీపాద ఆత్మకథ ‘అనుభవాలూ జ్ఞాపకాలూను’ తెలుగులోని గొప్ప పుస్తకాల్లో ఒకటి. ఇటుక మీద ఇటుక పేర్చి ఇల్లు కట్టినట్టుగా, వాక్యం మీద వాక్యం చేర్చుతూ కథను నిర్మించే శైలి శ్రీపాదది. ఆయన్ని ఎప్పుడు తలుచుకున్నా ఎందుకో ఒక రుమాలు చుట్టుకున్న రచయిత ఇమేజ్‌ నా మనసులో కదలాడుతుంది, గిడుగు రామ్మూర్తి పంతులు లాగా!

––

వడ్ల గింజలు


‘‘రాజద్వారే, రాజగృహే సర్వదా దిగ్విజయోస్తు. వేదోక్తం పరిపూర్ణమా–’’

ద్వారంలోంచే ఆశీర్వచనం ప్రారంభించిన తంగిరాల శంకరప్పకు ఠాణేదారు గభీమని అడ్డం వచ్చి ‘‘ఫో– మళ్లీ వచ్చావూ?’’ అంటూ ‘‘ఏయ్, జవాన్లూ?’’ అని కరుగ్గా పిలిచాడు.

‘‘చిత్తం బాబయ్యా, మేమడ్డుపెడుతూనే వుండగా, జలగలాగ జారి వచ్చేస్తున్నారండి’’ అంటూ శంకరప్ప అంగాస్త్రపు కొంగులు పట్టుకున్నారు.

‘‘దివాన్జీగా రుండగా మధ్య మీరు ఎవరయ్యా?’’ అంటూ శంకరప్ప బింకంగా ముందుకు రాబోయాడు. ‘‘నేను డబ్బు కోసం రాలేదు’’ అని యేదో చెప్పబోయాడు.

అప్పటికి తెరిపయిన దివాన్జీ ‘‘యేమిటా అల్లరి?’’ అని నిదానంగా అడిగాడు.

‘‘ఎవరో పిచ్చిబ్రాహ్మడు మహాప్రభూ! ఏలినవారి దర్శనం కావాలని నానా అల్లరీ చేస్తున్నా డండి.’’

‘‘ఒక రూపాయి చేతిలో పెట్టి పొమ్మనలేక పోయావా?’’

‘‘నేను కార్యార్థిని గాని, పిచ్చివాణ్ణి కాను మహాప్రభూ!’’ శంకరప్ప కేక వేశాడు.

‘‘యెదటికి రప్పించు’’ అన్నాడు దివాన్జీ.

శంకరప్ప మొగంమీద బ్రహ్మతేజస్సు వెలిగిపోతోంది.

‘‘ఏమిటి పని?’’

‘‘మహారాజులుంగారి దర్శనం చేసుకుందామని వచ్చాను.’’

‘‘ఈ వేషంతోటే?’’ అనే మాటలు దివాన్జీ నాలుక చివరనుంచి జారిపోయాయి.

‘‘విద్వత్తు వున్నచోట వేషం అక్కర్లేదండి’’ శంకరప్ప బదులు చెప్పాడు. ‘‘శ్రీ వత్సవాయి చతుర్భుజ తిమ్మజగపతి మహారాజులుంగారంటే చదరంగం ఆటలో నిధి అని దిగ్ధంతులు ఘోష పెడుతూ వుండడం వల్ల– ఒక్క ఆట వారితో ఆడాలని–’’

దివాన్జీకి అభిజాత్యం తోచింది. ‘‘చదరంగం ఆడకూడదని నిశ్చయించుకున్నారు ప్రభువు’’ అని మాట జారి వచ్చేసింది.

‘‘ఎంచేతో?’’

‘‘తగిన వుజ్జీ దొరక్క... ఆట కట్టడం మాట దేవు డెరుగును, నాలుగైదు యెత్తులయినా పొంకంగా వెయ్యగలవాడు కనబడలేదు పృథివి మీద.’’

‘‘విపులా చ పృథ్వీ!’’

దివాన్జీ వులిక్కిపడ్డాడు. వుగ్రుడైనాడు. ‘‘బతకతలుచుకోలేదూ?’’

‘‘నా విద్వత్తుకి వినియోగం కనబడలేదు. ఇక బతికేం ప్రయోజనమూ? మొండిపట్టు పట్టి ఆటలో కూచుని వోడిపోతే, మహారాజులుంగారు వచ్చినవాడి తలకొట్టించి కోట కొమ్ములకు కట్టించడానికి శపథం పట్టారని తెలుసు. సిద్ధపడే వచ్చేశాను.’’

తన అంతస్తు స్మరించుకుని ఈ దరిద్రుడి మీద పడి మొట్టాలన్నంత ఆవేశం వచ్చింది దివాన్జీకి. ‘‘ఇక దయ చెయ్యి.’’

‘‘నాకేమి చెప్పినట్టూ?’’ ముదలకించాడు శంకరప్ప.

‘‘ఏయ్‌ జవాన్లూ!’’ దురుసుగా పిలిచాడు దివాన్జీ.

‘‘ఏం జరిగింది నాయనా?’’ ఆత్రంగా అడిగింది పేదరాసి పెద్దమ్మ.

‘‘వ్యవహారం అంతా తల్లకిందులయి పోయింది పెద్దమ్మా’’ అంటూ చతికిలబడ్డాడు శంకరప్ప.

నిరాశా, వుడుకుమోత్తనమూ, దుఃఖమూ అతని శరీరంలో ప్రతీ అణుమాత్ర భాగంలోనూ నిండి చిప్పిలిపోతూ వున్నాడు. ముప్ఫయేళ్ల శంకరప్ప పెద్దమ్మ అడ్డాల్లో బిడ్డ అయిపోయినాడు. 

‘‘విద్వాంసుల మంటూ వచ్చేవాళ్లని చాలామందిని చూశాను; అందరూ యిలాగే లౌక్యం సుతరామూ లేక...’’

‘‘ఆ పెద్దమనిషి మొదటే హేళనలోకి దిగాడు.’’

‘‘మరి విను. ఇప్పటిదాకా రాజదర్శనానికి నువు తిప్పలుపడ్డావు. ఇక నీ దర్శనం కోసం రాజే తిప్పలుపడాలి.’’

‘‘నీళ్లముంచినా పాలముంచినా– పెద్దమ్మా, నేను నీ కొడుకుని’’ అంటూ ఆమె పాదాలు పట్టుకున్నాడు.

‘‘ఇంత వెర్రిబాగుల నాయనవు, చదరంగంలో నీకింత నేర్పెలా వచ్చిందోయ్‌?’’

‘‘దాని కంతకీ కారణం యీశ్వరానుగ్రహం.’’

ఒక్కమాటు పైకి చూసి ‘‘పెద్దాపురప్పట్నం అంతా యెప్పుడైనా చూశావా?’’ అని అడిగింది.

‘‘సెబాస్‌’’ అంటూ లేచి, గుమ్మంలోకి వొక్కటే వురక. అక్కణ్ణుంచి వీధిలోకి వొక్కటే అంగ.

శంకరప్ప సందు మళ్లాటప్పటికొక పెద్ద భవంతి కనపడింది. మండువా వాకట్లోనుంచి చదరంగానికి సంబంధించిన ఘర్షణ వినవచ్చింది.

లోపల యిద్దరు బ్రాహ్మణ యువకులు చదరంగం ఆడుతున్నారు. వారికిద్దరికీ చెరో సలహాదారూ దగ్గిరసా కూచుని వున్నారు. ఒక్కమాటు నలుగురి మొగాలూ చూశాడు. బలమున్నూ చూశాడు. స్తంభానికానుకు నుంచున్నాడు. అరగడియ గడిచినా యెత్తు పడలేదు. శంకరప్ప విసిగిపోయాడు. ‘‘ఏమండీ, యెత్తు వెయ్యరేం?’’ అని సరసంగానే అడిగాడు. 

‘‘నీకెందుకయ్యా మా గొడవ’’ అని సలహాదారు మిడుతూ చూసి కొంచెం విసుక్కున్నాడు.

‘‘మీ గొడవ నా కెందుకూ? ఆట గొడవ అడుగుతున్నాను.’’

‘‘నాలుగ్ఘళ్ల పొద్దెక్కేటప్పటికి ఆట యీ స్థితికి వచ్చింది.’’

‘‘ఇంతమంది– యింతసేపు– యిందులో యేం వుందీ?’’

ఆటకాడి కిది కొట్టినంత పని చేసింది. బుస్సుముంటూ మొగం పైకెత్తి ‘‘చదరంగం అంటే మీ కేమయినా తెలుసా?’’ అని అడిగాడు.

ఆటగాడి మొగం మీద చక్కని వర్ఛస్సు కనపడింది శంకరప్పకి. ‘‘ఇతగాణ్ణి భృత్యుణ్ణి చేసుకుతీరాలి’’ అని నిశ్చయించుకున్నాడు. ‘‘వారి ఆట నేను కట్టిస్తాను. నేను చెప్పినట్టెత్తు వెయ్యండి’’ అన్నాడు.

‘‘అయితే సలహా చెప్పు’’ అని బల్లకేసి తిరిగా డాటగాడు.

‘‘ఎన్ని యెత్తుల్లో ఆట కట్టమంటారు?’’

‘‘సొరకాయలు నరుకుతున్నావే!’’

‘‘మీ నల్లగది శకటు వారి గుర్రం ముందు వెయ్యండి’’అన్నాడు శంకరప్ప. చెప్పినట్టు వేశాడు ఆటకాడు.

‘‘వోస్‌! అయితే, మరి, గుర్రం యిక్కడ వేశాను’’ అన్నాడు ప్రతిపక్షి.

‘‘ఆ బంటుతో మీరు తోసిరాజనండీ!’’

‘‘అరే, అరే’’ అంటూ ఆటగాడు ఆశ్చర్యపడ్డాడు. ‘‘మహానుభావా’’ అని శంకరప్పను కౌగిలించుకున్నాడు. 

‘‘అయ్యా, యీపూట మీరు భోజనానికి మా యింటికి దయచెయ్యాలి’’ అని ఆహ్వానించాడు సలహాదారు.

‘‘మీ అనుగ్రహానికి సంతోషం. నే నింతలో యీవూరు విడిచివెళ్లను. ఇప్పటికి నన్ను విడిచి పెట్టండి.’’ అని శంకరప్ప చెయ్యి విడిపించుకున్నాడు.

దాంతో రామశాస్త్రీ, యాజులూ ఆయన సహచరులయ్యారు.

తర్వాతి ఆట పంతులుతో. మరో ఆట రాజుతో. ఒక తెలగా, ఒక వైశ్యుడూ, ఒక బ్రాహ్మడూ.

‘‘మూడెత్తుల్లో ఆట కట్టేస్తారు వీరు’’ అని శంకరప్పను పరిచయం చేయసాగారు శాస్త్రీ, యాజులూ.

‘‘అంత సమర్థులా వారు’’ అని ఎదుటివారు అనుమానపడటమూ, తర్వాత నోరు కుట్టేసుకోవడమూ.

మరో ఆట భీమరాజుతో. ఇంకో ఆట కృష్ణంరాజు గారితో. అటుపై దుర్వాసుల ఆదివారాహ మూర్తితో.

‘‘కుడివైపునున్న మన యేనుగుని వారి శకటు దగ్గిరగా వేయించండి.’’ 

‘‘మన యెర్రగది శకటు రాజుకి అయిమూల గదిలో పడెయ్యండి.’’

పెద్దాపురంలో పేరుపడ్డ ఆటగాళ్లు చిత్తయిపోయారు. తంగిరాల శంకరప్ప పేరు చుట్టుపట్ల రామనామం అయిపోయింది. అనేకులు పట్టంచుల చాపు లివ్వ వచ్చారు. ఉప్పాడ జరీజామార్లు కట్టబెట్టపోయారు. బరంపురం తాపితాలు సమర్పించపోయారు. కాశ్మీర శాలువాలు కప్పపోయారు. శంకరప్ప వొకటీ పుచ్చుకోలేదు.

సామంతులూ, సేనాధిపతులూ, రాజబంధువులూ, రాజపురుషులూ, సంపన్నులూ, సరసులూ కోరి శంకరప్పతో ఆడి, ఆట కట్టించుకుని, అదే తమకొక గొప్పగా ఆనందించసాగారు. పాలకీ, పదహారుగురు బోయీలు, పది పదిహేనుగురు భటులు ‘‘చామర్లకోట శ్రీ రావు రాయడప్ప రంగా రాయణింగారి మనుష్యులం’’ అంటూ వచ్చారు. రాజనర్తకి అలివేణి, మహారాజు సన్నిధిని వుండవలసిన నలుగురు వేశ్యలలోనూ వొకతె రంగనాయిక కూడా శంకరప్ప ప్రతిభను చూసి ‘ధన్యులు’ అయినారు. 

‘‘పట్నంలో కెవరో అసాధ్యపు ఆటకాడు వచ్చారుట, మీ కేమయినా జాడ?’’

‘‘లేదు మహాప్రభూ!’’

రాజ కార్యాలన్నీ ముగించుకుని, పెద్దాపురం కోటలో, మహా రాజాధిరాజ, పేషణి హనుమంత, నెలవోలు గండాంక శ్రీ వత్సవాయి చతుర్భుజ తిమ్మజగపతి మహారాజు లక్కమేడ వసారాలో పచారుజేస్తున్నారు. కాగితాలు చేత పట్టుకుని దివాన్జీ మాట్టాడుతున్నాడు.

‘‘ఊరంతా కోడయికూస్తోందిట– మీకు తెలవకపోవడం యేమిటండీ?’’ మహారాజు అసంతృప్తి కనపరిచాడు.

దివాన్జీ వెళ్లిపోయిన తర్వాత, ఆట దగ్గర కూర్చోకుండానే ‘‘గోడ అవతల నుంచుని నాలుగెత్తుల్లో’’ ఆట కట్టించిన శంకరప్ప గొప్పతనాన్ని వివరించింది ‘రంగి’.

ఈలోగా దాట్ల అప్పలనరసింహరాజు లోగిట్లో వత్సవాయి విజయరామరాజుతో ఆడుతుండగా– ప్రౌఢ, మధ్య, ముగ్ధలు చిలకలు చుడుతూ, విసనకర్ర విసురుతూ, బంగారపు గంధపు గిన్నెలతో యేకాగ్రత భంగపరిచేందుకు ప్రయత్నించినా వికారం యేమీ కనబరచకుండా శంకరప్ప నెగ్గాడు. ‘‘తమ రొక్కమాటు మహారాజులుంగారితో ఆడాలండీ!’’

పాలకీ కోటగుమ్మంలోకి వెళ్లింది. శంకరప్పకు ఠాణేదారు నమస్కరించాడు. దివాన్జీ ఆహ్వానించాడు. మహారాజుకి శంకరప్ప దగ్గిర మహేశ్వరాంశ కనబడింది. మహారాజు దగ్గిర శంకరప్పకి విష్ణ్వంశ ద్యోతకం అయింది.

రంగ నాయిక బలం సద్ది వుంది. ఒక పక్షానికి కెంపులూ, వొక పక్షానికి పచ్చలూ పొదిగిన బంగారపు బలం అది. పచ్చల వేపు శంకరప్ప, కెంపుల వేపు మహారాజు. ఆ నడకే కొత్తగా సాగింది. దిగ్ధంతుల ద్వంద్వయుద్ధం భయంకరమే. అయినా ద్రష్టలకు దర్శనీయమే. తాపీగా ప్రారంభం అయిన ఆట నాలుగ్ఘడియలు గడిచేటప్పటికి ‘‘యెత్తు పడదేం?’’ అన్న స్థితికి వచ్చింది. మరో గడియ. మన్నాడు. తరువాత. వారాలు, మాసాలు. ‘‘నెగ్గేశాం పెద్దమ్మా. ఆరుమాసాలకయినా ఆట కట్టిందని మహారాజు వొప్పుకోవలసిందే.’’ 

ఠాణేదారుకి దేవిడిమన్నా అయిపోయింది. పెద్దాపురంలో ఉండటానికే లేదు. దివాన్జీ మీద వీరభద్రావతారం తాల్చేశారు మహారాజు. 

చివరికి ఒకరోజు మహారాజు శంకరప్పని కౌగలించుకున్నాడు. ‘‘చదరంగంలో నాకిదే మొదటి వోటమి. ఇంతటి ఉత్కటానందం నాకింతవరకు కలగలేదు. పెద్దాపురం రాజ్యంలో వున్నది యేమయినా సరే తమకి సమర్పించుకుంటాను, సెలవిప్పించండి.’’

‘‘చదరంగానికి అరవై నాలుగు గదులు. మొదటి గదిలో వొక వడ్లగింజ వుంపించండి. తరవాత రెండో గదిలో రెండు, మూడో గదిలో నాలుగు, నాలుగో గదిలో యెనిమిది– యిలాగా వెళ్లినకొద్దీ రెట్టింపుచేయిస్తూ నాకు వడ్లగింజలు దయచేయించండి మహాప్రభూ!’’

విషయం ఎవరికీ బోధపడినట్టులేదు.

‘‘ఏమి, లెక్క తేలిందా?’’ అడిగాడు మహారాజు.

‘‘మహాప్రభూ! వారి కోరిక తీర్చాలంటే పెద్దాపురం రాజ్యంలోనే కాదు, త్రిలింగ దేశం అంతటా వరాసగా నూరు సంవత్సరాలు పండిన ధాన్యం అయినా చాలదు’’ అంటూ షరాబు కాగితం మహారాజు కందించాడు. 

రాజ్యమే సమర్పించుకునేందుకు మహారాజు సిద్ధపడ్డాడు. శంకరప్ప అంగీకరించలేదు. చివరకు సర్వలక్షణ సంపన్నమైన అగ్రహారం, పెద్దమ్మకు సాలీనా నూటాపదహారు రూపాయల బహుమానం, శాస్త్రీ, యాజుళ్లకు చెరొక నూటపదహారు రూపాయల బహుమానం ఏర్పాటు చేసి, శంకరప్పను దగ్గిర వుండి గజారోహణం చేయించాడు మహారాజు.


(సాక్షి సాహిత్యం; 2019 జూన్‌ 24)

 

No comments:

Post a Comment