మంచినీళ్ల కుండ
‘చదువని వాడజ్ఞుండగు! చదివిన సదసద్వివేక చతురత గలుగున్!’ అంటాడు పోతన తన ఆంధ్ర మహా భాగవతంలో. చదవకపోతే ఏమీ తెలీదు, చదువుకుంటేనే మంచీ చెడుల వివేకం కలుగుతుంది; అందుకే, ‘చదువంగ వలయు జనులకు! చదివించెద నార్యులొద్ద, చదువుము తండ్రీ!’ అని ప్రహ్లాదుడికి తండ్రి హిరణ్య కశ్యపుడితో చెప్పిస్తాడు. నిజంగానే ఆ గురువుల దగ్గరి చదువేదో పూర్తికాగానే, ‘చదివించిరి నను గురువులు! చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు! నే/ చదివినవి గలవు పెక్కులు! చదువులలో మర్మ మెల్ల చదివితి తండ్రీ!’ అని జవాబిస్తాడు ప్రహ్లాదుడు. కొడుక్కు కలిగిన వివేకం తండ్రి కోరుకున్నదేనా అన్నది పక్కనపెడితే, చదువనేది భిన్న ద్వారాలు తెరుస్తుందన్నది నిజం. ప్రహ్లాదుడు పుట్టు వివేకి కాబట్టి, తనకు కావాల్సిన సారాన్ని గ్రహించగలిగాడు. అందరికీ అలాంటి గుణం ఉంటుందా? అందుకే, ‘చదువులన్ని చదివి చాలవివేకియౌ/ కపటికెన్న నెట్లు కలుగు ముక్తి/ దాలిగుంటగుక్క తలచిన చందము’ అన్నాడు వేమన. ‘చదువులెల్ల చదివి సర్వజ్ఞుడై యుండి’నప్పుడు కూడా ఉండే బలహీనతలను ఎత్తిపొడిచాడు. ఆత్మసారం తెలుసుకోవడమే ముఖ్యమన్నాడు.
అతడు ‘బాగా చదువుకున్నవాడు’ అంటే లోకాన్ని బాగా అర్థం చేసుకున్నవాడు, పరిణత స్వభావం ఉన్నవాడు, గౌరవనీయుడు, ఒక్క మాటలో వివేకి అని! వివేకం అనేది ఎన్నో గుణాలను మేళవించుకొన్న పెనుగుణమే కావొచ్చు. అయినా అదొక్కటే చాలా? ‘చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా/ చదువు నిరర్థకమ్ము’ అన్నాడు భాస్కర శతక కర్త మారవి వెంకయ్య. ‘బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం/పొదవెడు నుప్పులేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!’ అని ప్రశ్నించాడు. కూరకు రుచి తెచ్చే ఉప్పులాగే జీవితంలో ‘యించుక’ రసజ్ఞత ఉండాలి. చాలామందిలో ఆ సున్నితం, ఆ సరస హృదయం లోపించడం వల్లే సంబంధాలు బండబారుతున్నాయి. అందుకే వివేకం, రసజ్ఞతలను పెంచే చదువు ముఖ్యం. ఈ చదువు తరగతి చదువు కాదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరగతి గదిలోనే ఇవి అలవడితే అంతకంటే కావాల్సింది ఏముంది! ప్రపంచంలోకి దారి చూపే చదువు, ప్రపంచాన్ని చేరువ చేసే చదువు సాహిత్య రూపంలో ఉంటుంది. ఆ సాహిత్యం మంచి పుస్తకం రూపంలో హస్తభూషణమై ఉంటుంది.
మనుషుల వివేకాన్ని కొలవదలిచినవాళ్లు ‘ఇప్పుడు ఏం చదువుతున్నారు?’ అని అడుగుతారు. చదవడం మాత్రమే సరిపోదు, ఆ చదువుతున్నది ఏమిటి? ‘నీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయన్నది విషయం కాదు, నీ దగ్గరున్న పుస్తకాలు ఎంత మంచివి అన్నదే ముఖ్యం’ అంటాడు గ్రీకు తత్వవేత్త సెనెకా. మంచిని ఎలా కొలవాలి? ‘మనల్ని గాయపరిచే, పోటుపొడిచే పుస్తకాలే మనం చదవాలి. తలమీద ఒక్క చరుపు చరిచి మేలుకొలపకపోతే అసలంటూ ఎందుకు చదవడం’ అంటాడు రచయిత ఫ్రాంజ్ కాఫ్కా. చదవడమే పెద్ద విషయం అయిన కాలంలో, దానికి ఇన్ని షరతులా అన్న ప్రశ్న రావడం సహజమే. ఎందుకంటే, ‘నేషనల్ లిటెరసీ ట్రస్ట్’ నివేదిక ప్రకారం, భారతీయ చిన్నారుల్లో చదవడం దాదాపు సంక్షోభం స్థాయికి పడిపోయింది. 5–18 ఏళ్లవారిలో కేవలం మూడింట ఒక్కరు మాత్రమే తమ ఖాళీ సమయంలో చదవడాన్ని ఆనందిస్తామని చెప్పారు. కేవలం 20 శాతం మంది మాత్రమే, ప్రతి రోజూ ఏదో ఒకటి చదువుతున్నామని జవాబిచ్చారు. చదివే అలవాటును పెంచకపోతే, వికాసానికి దార్లు మూస్తున్నట్టే!
ఆధునిక తరానికి చదవడం మీద ఉత్సాహం కలిగించేలా, అయోమయ తరానికి రసజ్ఞత పెంచేలా ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ డిసెంబర్ 19 నుంచి 29 వరకు పాటు కాళోజీ కళాక్షేత్రం (ఎన్టీఆర్ స్టేడియం)లో జరగనుంది. మధ్యాహ్నం పన్నెండు నుంచి రాత్రి తొమ్మిది వరకు ఇది కొనసాగుతుంది. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ, హిందీలో పేరున్న భిన్న ప్రచురణకర్తలు, విక్రేతలు, రచయితల స్టాళ్లు సుమారు 350 వరకు ఏర్పాటవుతాయి. నూతన పుస్తకాల ఆవిష్కరణలు, ఉపన్యాసాలు ఉంటాయి. 1985 నుంచి జరుగుతున్న ఈ బుక్ ఫెయిర్‌ను ఈసారి పదిహేను లక్షల మంది సందర్శిస్తారని అంచనా. ‘మనం అనేక పండుగలు చేసుకుంటాం. కానీ పుస్తకాల పండుగ ప్రత్యేకమైనది. పెద్ద జాతరలో మంచినీళ్ల కుండ లాంటిది బుక్ ఫెయిర్. ఏ రకమైనా కావొచ్చుగాక, అసలు పుస్తకాల వైపు రాగలిగితే మనిషికి వివేకం, వివేచన పెరుగుతాయి. జీవిత సారాన్ని అందించేదే కదా పుస్తకమంటే! ‘ఏడు తరాలు’ లాంటి నవలకు మనం ఎట్లా కనెక్ట్ అయ్యాం! పుస్తకాలు, అక్షరాలు లేకపోతే మనం ఎక్కడుండేవాళ్లం? అందుకే ఈసారి నచ్చిన, మెచ్చిన, ప్రభావితం చేసిన పుస్తకం అంటూ పుస్తకం కేంద్రకంగా కొన్ని సెషన్లు నిర్వహిస్తున్నాం’ అని చెబుతున్నారు బుక్ ఫెయిర్ అధ్యక్షుడు ‘కవి’ యాకూబ్. అయితే, పుస్తకాల దుకాణాల కన్నా, దగ్గర్లోని బజ్జీల బండికి గిరాకీ ఎక్కువ అనే వ్యంగ్యం మన దగ్గర ఉండనే ఉంది. అన్నింటిలాగే ఇదీ ఒక ఔటింగ్, ఒక వినోదం, బయటికి వెళ్లడానికి ఒక సాకు... లాంటి ప్రతికూల అభిప్రాయాలు ఉండనే ఉన్నాయి. ఏ వంకతో వెళ్లినా దేవుడి దగ్గరికి వెళ్లగానే భక్తిగా కళ్లు మూసుకున్నట్టు, పుస్తకం చూడగానే ఆర్తిగా చేతుల్లోకి తీసుకుంటున్నప్పుడు ఏ కారణంతో వెళ్తేనేం? కాకపోతే వ్యక్తిత్వానికి సరిపడే, వివేకం, రసజ్ఞతలను పెంచే పుస్తకాలను ఎంపిక చేసుకోవడమే పెద్ద పని. దానికోసం కొంత పొల్లు కూడా చదవాల్సి రావొచ్చు. కానీ క్రమంగా ఒక ఇంట్యూషన్ వృద్ధి అవుతుంది. అదే చదువరి పరిణతి.
(Sakshi: December 16th, 2024)
No comments:
Post a Comment