(హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో నచ్చిన/ప్రభావితం చేసిన పుస్తకం గురించి ఒక పది నిమిషాలు మాట్లాడమని కవిమిత్రుడు ఒద్దిరాజు ప్రవీణ్ కాల్ చేశారు. రోజూ ఒక ధారావాహికగా చాలామంది రచయితలు పాల్గొన్న కార్యక్రమం అది. నాకు డిసెంబర్ 26న వీలు కుదిరింది. వర్షం పడి కార్యక్రమం కొంత ఆగం అయింది. అనుకున్న పది నిమిషాల్లో కూడా కోత పడింది. ఆలస్యంగానైనా మొత్తానికి బాగానే జరిగింది. అయితే, అందరూ ఏకధారగా మాట్లాడితే నేను సహజంగానే తట్టుకుంటూ మాట్లాడాను. నేను అక్కడ చెప్పాలనుకున్నది ఇక్కడ పోస్టు చేస్తున్నా.)
నచ్చిన/ప్రభావితం చేసిన పుస్తకం
హైదరాబాద్ బుక్ ఫెయిర్
డిసెంబర్ 26; సాయంత్రం 6 గం.
పూడూరి రాజిరెడ్డి
అందరికీ నమస్తే.
ఇది చూస్తుంటే గుళ్లల్లో ప్రవచనం చెప్పడం గుర్తొస్తుంది. ప్రవచనం నడుస్తూనే ఉంటుంది, ఎవరి మానాన వాళ్లు పోతూనే ఉంటారు. కానీ ఆ పోతున్న క్రమంలోనే ఏ ఒక్క మంచి మాటైనా చెవిలో పడకపోతుందా అని ఆశ. బహుశా బుక్ ఫెయిర్ నిర్వాహకులు కూడా అలాంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటుచేసివుంటారు. అందులో నన్ను కూడా భాగం చేసినందుకు థాంక్యూ.
28 ఏళ్లకు మనిషి ఏర్పడిపోతాడు అంటాడు బుచ్చిబాబు. అంటే ఇంక ఆ తర్వాత మనిషి మారేది పెద్దగా ఉండదు. అందుకే వయసు పెరిగినాకొద్దీ ఆల్రెడీ ఉన్న అభిప్రాయాలను బలపరుచుకోవడానికి పనికొచ్చేవే ఎక్కువ చదువుతాం తప్ప, ఫ్రీగా, ఓపెన్‌గా ఉండి చదవం. మూవ్ అవడానికి సిద్ధంగా ఉండే వయసులో చదివేదే చదువు అనుకుంటాను. అందుకే నా డిగ్రీ నుంచి నేను జర్నలిజంలోకి వచ్చిన కొత్త వరకు చదివిందే అసలైన చదువు. డిగ్రీలో రెండు రోజులకొక్కటి చదవాలన్నంత ఆబగా చదివాను. జర్నలిజం వారానికో పుస్తకం కచ్చితంగా చదవాలని నియమం ఉండేది. ఇప్పుడు పుస్తకం మీద అలాంటి పాషన్ లేదు. కాబట్టి నాలాంటివాడు ఇప్పుడు పుస్తకం గురించి మాట్లాడటం రాంగ్ ఛాయిస్. కానీ సోషల్ మీడియా మీద విరక్తి కలిగాక మళ్లీ అలాంటి పాషన్ వస్తుందని ఆశిస్తున్నా.
నచ్చిన పుస్తకాలు ఉంటాయి. మన వ్యక్తిత్వానికి సరిపడే పుస్తకం మనకు నచ్చుతుంది. ఆ పుస్తకంలో మనకు ఏది నచ్చడానికి కారణం అవుతున్నదో అది మనలోపల ఆల్రెడీ ఉంటుంది. మనం గుర్తించకపోవచ్చు, ఉన్నట్టు తెలియకపోవచ్చు. కానీ ప్రభావితం చేసిన పుస్తకాలు ఉంటాయా? ఉంటే వాటి ప్రభావం నిజంగా ఎంత? దానివల్ల మన జీవితమే మొత్తంగా మారిపోయేంత ప్రభావం ఉంటుందా? మారిపోయింది అని చెప్పనుగానీ, వాటి ఎసెన్స్ నాలోకి ఎంతో కొంత ఇంకిపోయిన పుస్తకాలు కొన్ని ఉన్నాయి. ఒక్కదాని గురించి మాత్రం ఇక్కడ చెప్తాను. జపాన్ శాస్త్రవేత్త మసనోబు ఫుకుఓకా తన వ్యవసాయ అనుభవాలతో రాసిన ‘గడ్డి పరకతో విప్లవం’ అది.
గడ్డి పరకతో విప్లవం పుస్తకం జపనీస్ నుంచి ఇంగ్లీషులోకి ‘వన్ స్ట్రా రివొల్యూషన్’గా వచ్చింది. 1990లో దీన్ని తెలుగులో ‘టింబక్టు కలెక్టివ్’ వాళ్లు ప్రచురించారు. అనువాదం: సురేశ్, సంపత్.
నేను ఏ ఒక్క రచయిత ఫొటోను కూడా ఇంట్లో పెట్టుకోలేదు. కానీ నాకు ఫుకుఓకా ఇష్టం అని తెలిసిన కొందరు మిత్రులు ఇలాంటి ఒక సాహిత్య సమావేశం జరిగినప్పుడు ప్రెజెంట్ చేశారు. అది నాకు రోజూ చూసే ముఖం అయిపోయింది. ఇప్పుడు అందరూ సహజ వ్యవసాయం, ఆర్గానిక్ ఫుడ్స్, ప్రకతి పరిరక్షణ అని మాట్లాడుతున్నారు. కానీ ఎన్నో ఏళ్ల క్రితమే, రసాయనిక ఎరువులు వేయకుండా, క్రిమి సంహారకాలు ఉపయోగించకుండా, కనీసం నేలను దున్నకుండా వ్యవసాయం చేశాడు ఫుకుఓకా. ఆ తర్వాత నాకు ఇలాంటి వ్యవసాయ పద్ధతులు, ఇలాంటి ప్రకతి ఆహారానికి సంబంధించిన ఆసక్తుల వెనుక ఈ పుస్తకం ఉంది. డక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ, ఖాదర్‌వలీ, సుభాష్ పాలేకర్, సెంటర్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్, తాజాగా ఆర్గానిక్ మండ్య... ఇట్లాంటివి ఫాలో కావడానికి ఈ పుస్తకం నాలో నింపిన ప్రకృతి స్పృహ కారణం. కనీసం మా ఇంటివరకైనా నేను స్వయంగా చిరుధాన్యాలు, వడ్లు ఒక ఆరేడేళ్లు పండించేంత దూరం కూడా ప్రయాణించాను. అది ఇంకా ముందుకుపోతుందా, ఆగుతుందా, ఇంకా సీరియస్‌గా టేకప్ చేస్తానా తెలీదు.
గాంధీజీ దక్షిణాఫ్రికాలో వ్యవసాయం చేసినప్పుడు ఆ వ్యవసాయ క్షేత్రానికి పెట్టిన పేరు ‘టాల్‌స్టాయ్ ఫామ్’. నేను అంత సీరియస్‌గా వ్యవసాయం చేయకపోయినా కనీసం నా బ్లాగు రాతలకు పెట్టకున్న పేరు ‘ఫుకుఓకా ఫామ్’.
అయితే, ఆరోగ్య స్పృహ పెరిగినప్పటి నుంచీ నాకు అనారోగ్యం పెరిగిందనుకోండి! అంటే తిండి అనగానే కలిగే ఎక్సైట్‌మెంట్ స్థానంలోకి ఒక సంశయం వచ్చి చేరుతుంది. దేన్నీ మనస్ఫూర్తిగా తిననీయదు. కానీ ఇది పుస్తకం సమస్య కాదు. నా సమస్య. మన సమస్య. ఆహారం మొత్తంగా కలుషితమైపోయిన సామాజిక సమస్య. మళ్లీ దీనికి పరిష్కారం ఫుకుఓకా దగ్గరే, ప్రకృతి వ్యవసాయం దగ్గరే ఉంది.
ఫుకుఓకా కేవలం వ్యవసాయం గురించి మాత్రమే మాట్లాడితే, ఈ పుస్తకం నాకు నచ్చిన పుస్తకం కాకపోయేదేమో! వ్యవసాయం అనేది కేవలం పంటలు పండించడం కాదు, అదొక జీవన సాధన, అదొక ఆధ్యాత్మిక ప్రగతి అంటాడు ఫుకుఓకా. ఈ జనన మరణ చక్రంలో ఇష్టంగా బందీ కావడం గురించి మాట్లాడుతాడు. ఈ ఇష్టంగా బందీ కావడం అనేది ఒక యోగి మాత్రమే చెప్పగలిగే మాట. జీవితం మొత్తాన్నీ అర్థం చేసుకుని, ఒక పూర్ణ మానవుడు తన తుది మాటగా వెల్లడించిన సత్యంలా ఇది నాకు అనిపిస్తుంటుంది. జీవితంలోకి తెచ్చుకోగలిగే నెమ్మదితనం గురించీ, జీవితాన్ని తేలిక చేసుకోవడం గురించీ కూడా ఈ పుస్తకం చెబుతుంది.
జీవితం ఎప్పుడు తేలికవుతుంది? పొరలు ఎప్పుడు విడిపోతాయి? మనం చేసే ఏ పనికీ అర్థం లేదంటాడు ఫుకుఓకా. ‘నా ఉనికి సైతం ఉత్త భ్రమే’ అన్న జ్ఞానోదయం ఫుకుఓకాకు కలిగింది. నా లాంటి సాధారణ మనిషికి అది కలగడం లేదు. అందుకే నేను దీనితో స్ట్రగుల్ అవుతున్నాను. 2006లో పుస్తకాన్ని మొదటిసారి చదివినప్పుడు ఏదైతో నచ్చిందో, 2024కు వచ్చేసరికల్లా ఎదురు తిరుగుతోంది. బహుశా పెరుగుతున్న వయసు ఈ జీవితానికి ఒక అర్థాన్ని, చేస్తున్న ప్రతి పనికి ఒక ప్రయోజనాన్ని కోరుకుంటున్నది కావొచ్చు. అలాగని ఈ భావనకు వ్యతిరేకమైనదేదీ నా దగ్గర లేదు. అనంత విశ్వంలో ధూళికణం లాంటి మనిషి జీవితానికి ఏ ఉద్దేశం ఉంది?
టాల్‌స్టాయ్ ప్రస్తావన ఇంతకు ముందు వచ్చింది కదా! అన్నా కరేనినా నవలలో లేవిన్ చిట్టచివరకు నేను ఇలాగే ఉంటాను, బండి వాడి మీద ఇలాగే అరుస్తాను, అనుకుంటాడు. ఎన్ని చేసినా మనం ఏమీ మారం అనేది కూడా చాలా పెద్ద అవగాహన నా వరకూ. ఇది చాలా పెద్ద బ్యాగేజీని మన మీది నుంచి దింపేస్తుంది. అన్నీ చూసి, అన్నీ తెలుసుకుని, ఒక దగ్గర మన మనసును స్థిరం చేసుకోవడం. అది ఏదో ఒక దగ్గర స్థిరం చేసుకోవడం కాదు. మన వ్యక్తిత్వానికి సరిగ్గా దగ్గరగా, మన అత్యంత సమీపానికి మనం చేరుకోవడం అది. మనం నిజంగా ఏమిటో అర్థం చేసుకోవడం. మనం ఏమిటో తెలుసుకోవడం అనేది చిన్న విషయం కాదని అందరికీ తెలుసనుకుంటున్నా.
ఫుకుఓకాకు బోధపడినట్టుగా నా నిజమైన ప్రకృతి ఏమిటో నేను ఇంకా కనుక్కోవలసే ఉంది. బహుశా దానిక్కూడా మళ్లీ ఆయన పుస్తకమే నాకు దారి చూపుతుందనుకుంటాను. ఎందుకంటే, చదివినప్పుడల్లా నాకు మళ్లీ మళ్లీ ఇంకేదో కొత్త విషయం అది చెబుతూనే ఉన్నది.
No comments:
Post a Comment