Tuesday, July 29, 2025

పేరు - చెడ్డపేరు



పేరుకు చెడ్డపేరు?


వేసుకుంటే పాత ప్రశ్నే. పేరులో ఏమున్నది? గులాబీకి ఆ పేరు లేకపోయినా అది గులాబీ అయ్యేది కాదా? ఆ పువ్వుకు అంత అందం వచ్చేది కాదా?  పేరు వల్ల కూడా అందం ఇనుమడిస్తుంది. పేరులో ఏమున్నది అనుకుంటే అందమైన పేర్ల కోసం ఆధునిక తల్లిదండ్రులు అంతగా ప్రయత్నించరు. ఈ అందం అనేది ఒక్కోసారి సాపేక్షం. అన్ని మతాల్లోనూ, సమాజాల్లోనూ పిల్లలకు పేరు పెట్టడం అనేది అనాదిగా పెద్ద పండుగ. నామకరణం తర్వాతే శిశువు నిజంగా ఈ భూమ్మీద ‘ఉనికి’లోకి వచ్చినట్టు!

మనిషికి పేరు అనేది దానికదే ఒక చిరునామా. ఎవరికైనా తన పేరును మించిన అందమైన పిలుపు మరొకటి ఉండదు, అంతకంటే మంచి కవితను ఇంకే కవీ రాయలేడు. పేరు అనేది మనిషిని ఎప్పటికీ వదలని హేంగోవర్‌. ఆ పేరులోని ప్రత్యేకత కంటే, ఆ పేరును మళ్లీ మళ్లీ వినడం వల్ల అది వారికి ప్రత్యేకమైపోతుంది. శిశువు ఈ భూమ్మీదకు రాగానే కూడగట్టుకోగలిగే తొలి సొంత ఆస్తి కూడా ఈ పేరే. ఇంక దాన్ని పెంచుకోవడం, తగ్గించుకోవడం అన్నది ఒక జీవితకాల ప్రయాణం తర్వాతే తేలుతుంది. ప్రాచీన రోమన్‌ సామ్రాజ్యంలో శుద్ధీకరణ పేరుతో నామకరణోత్సవం జరిగేది. ఆడశిశువులకు ఎనిమిదో రోజున, మగపిల్లలకు తొమ్మిదో రోజున పేర్లు పెట్టేవారు. ఆడపిల్లలు మగపిల్లల కంటే త్వరగా ఎదిగి పరిపూర్ణత్వాన్ని పొందుతారనేది ఈ తేడాకు కారణం.

పెట్టిన పేర్లు తికమకగా మారిపోవడం ఒక తమాషా. సుగుణ ఎంతటి గుణవంతురాలో మనకు తెలియదు. కోమలిది ఎలాంటి రూపమో ఊహించలేము. బలవంతరావు బలహీనంగా ఉండకూడదనేం లేదు. పేరుకు తగ్గట్టుగా మనిషి ప్రవర్తనను ఆశించడం కొన్నిసార్లు ఆశాభంగం కావొచ్చు. హరిశ్చంద్రుడు అబద్ధాలకోరు అవ్వకూడదనే కోరుకుంటాం. ధర్మరాజు అవినీతికి పాల్పడితే మరీ ఎక్కువ బాగోదు. పెట్టిన పేరుకు తగ్గట్టుగా ఉండలేక పిల్లలు సతమతమవడం మరో కోణం. కొన్ని పేర్లను కొందరు కుట్రపూరితంగా కూడా వాడుకోవచ్చు. ఉదాహరణకు మోసం. కానీ దాన్ని వాళ్లు ప్రేమ అనొచ్చు, స్నేహం అని పిలవొచ్చు. ఒక యుద్ధానికి ఏం పేరు పెడదామని అమెరికా అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌ సలహా అడిగితే, ‘అనవసర యుద్ధం’ అందామని సలహా ఇచ్చారట బ్రిటన్‌ ప్రధాని చర్చిల్‌. తగిన పేరు!

జనాలు తాము ఉన్నదాన్ని బట్టి తమ పేర్లను అందమైనవిగానో, వికారమైనవిగానో చేస్తారు అంటారు కెనడా రచయిత ఎల్‌.ఎమ్‌.మాంటొగోమెరీ. అది చాలావరకు నిజమే అయినా అన్నిసార్లూ నిజం కాదు. సూర్యకాంతం అంటే మనకు ఇప్పుడు ఒక పేరు కాదు. ఒక గయ్యాళి ముసలి. గిరీశం అంటే నక్కజిత్తులవాడే! భగవంతరావు అని వచ్చిందంటే ఒక స్థాయి మనిషి అనే అర్థం. పరమానందయ్య అనగానే వాలుకుర్చీలో విశ్రాంతిగా కూర్చునే సగటు మధ్యతరగతి మానవుడే. సాహిత్యమో, సినిమానో వేసే ముద్రలవల్ల కూడా పేర్ల స్వభావాలు మారిపోతాయి. కన్యాశుల్కం ఎంత గొప్ప నాటకమైనా లుబ్ధావధాన్లు, సౌజన్యారావు అంటూ పాత్రల పేర్లను వారి స్వభావాలకు తగ్గట్టుగా పెట్టడం కొంతమందికి నాటకీయంగా అనిపించింది. పాత్రకు తగ్గ పేరు పెట్టడం సహజం కాకపోయినా, ఔచిత్యం అనుకున్నారు మన రచయితలు. లేదంటే జనాలే పాత్రల పేర్లను మార్చేయొచ్చు. ఉదాహరణకు మహాభారతంలో ‘దుర్యోధనుడి’ పేరును సుయోధనుడు అనుకోనివాళ్లే ఎక్కువ. పిల్లల పేర్ల కోసం తల్లిదండ్రులు కొన్నిసార్లే తలలు బద్దలు కొట్టుకుంటారు. కానీ రచయితలు తాము సృష్టించే ప్రతి పాత్ర కోసం ఆ ‘పురిటి నొప్పులు’ పడాల్సిందే!

‘డ్రాకులా’ అనగానే దవడల పక్కన తెరుచుకున్న కోరలతో, మెడను కొరికి పచ్చినెత్తురు తాగే భయానక ఆకారం గుర్తొస్తుంది. అన్ని సాహిత్య రూపాల్లో అత్యధికసార్లు (700కు పైన) పునరావృతం అయిన పాత్రగా ఇది గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కింది. గాతిక్‌ శైలిలో నిర్మితమైన మధ్య యుగాల యూరోపియన్‌ భవనాలను ఒక వాతావరణం కోసం వాడుకుంటూ రాసిన గాతిక్‌ హారర్‌ సాహిత్యంలో ‘డ్రాకులా’ పేరుతోనే వచ్చిన నవల ఒక క్లాసిక్‌. సుమారు 125 ఏళ్ల క్రితం, 1897 మే 26న డ్రాకులా విడుదలైంది. అలాంటి గాతిక్‌ హారర్‌ సాహిత్యాన్ని డ్రాకులాకు ముందూ, తర్వాతా అని విభజిస్తారు వెండీ డోనిగర్‌. ఈ పాత్ర సృష్టికర్త లండన్‌లో స్థిరపడిన ఐరిష్‌ రచయిత బ్రామ్‌ స్టోకర్‌ (1847–1912) అనబడే అబ్రహామ్‌ స్టోకర్‌. ప్రపంచంలో డిటెక్టివ్‌ పాత్రలకు మోడల్‌గా నిలిచే షెర్లాక్‌ హోమ్స్‌ను సృష్టించిన ఆర్థర్‌ కానన్‌ డాయిల్‌ ఈయనకు దూరపు బంధువు కూడా. ‘ద ఫేట్‌ ఆఫ్‌ ఫెనెల్లా’(1891) పేరుతో 24 మంది రచయితలు రాసిన ఒక గొలుసు కట్టు నవలలో వీళ్దిద్దరూ కూడా భాగమయ్యారు. ఒకసారి లైబ్రరీలో బ్రామ్‌ స్టోకర్‌ ఏ పుస్తకాలో తిరగేస్తూవుంటే ‘డ్రాకులా’ అనే పేరు కంటబడింది. ఆ పేరులో ఆయనకు నిలువెల్లా దుష్టత్వం కనబడటమే కాక, దానికి అలాంటి అర్థమే ఉంటుందనుకున్నాడు. అందుకే ఆ పేరునే తన ప్రతినాయకుడికీ, నవలకూ వాడుకున్నాడు. ఇంతాచేస్తే ఈ డ్రాకులా అనేది ఒక వంశనామం. ఆగ్నేయ యూరప్‌ దేశమైన రొమేనియా పాలకుడు... వ్లాద్‌ డ్రాకులా. 15వ శతాబ్దిలో రొమేనియాను పాలించాడు. ఆయన్ని ఆ దేశ జాతీయ హీరోగా ఆరాధిస్తారు. ఈయన డ్రాకులా వంశంలో మూడోవాడు. ఈయన తండ్రి రెండో వ్లాద్‌ డ్రాకులా. అలాంటి పేరుకు ఈ నవల మచ్చ తెచ్చిందో, ఆ పేరును ఎప్పటికీ నిలిచేలా చేసిందో తీర్పునివ్వడం కష్టం. గులాబీకి గులాబీ అనే తగిన పేరు ఉండటం వల్లే అది పూరాణిగా రాణించిందా, ‘డ్రాకులా’కు డ్రాకులా అని పెట్టడం వల్లే అది ఒక పాత్రగా ఇంతగా నాటుకుపోయిందా చెప్పడం కష్టం. అది ఒక మనిషిని తన పేరుకు బదులుగా ఇంకొకటి చెప్పుకొమ్మనడం లాంటిది.

(23rd June 2025)

Saturday, July 26, 2025

బాను ముష్తాక్‌కు ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రైజ్‌



కథకు దక్కిన గౌరవం


కన్నడ రచయిత్రి బాను ముష్తాక్‌ తన ‘హార్ట్‌ ల్యాంప్‌’(హృదయ దీపం) కథాసంపుటికిగానూ ‘ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రైజ్‌’ గెలుచుకోవడం చాలా విధాలుగా ప్రత్యేకమైనది. ఇది కర్ణాటకకే కాదు, దక్షిణ భారతదేశానికే దక్కిన తొలి గౌరవం. బుకర్‌ చరిత్రలో ఒక కథల సంపుటికి ఈ పురస్కారం దక్కడం ఇదే ప్రథమం. ఇది గెలుచుకున్న అత్యంత ఎక్కువ వయసువాళ్లలో(77) ఆమె ఒకరు(ఫిలిప్‌ రాత్‌కు ఇచ్చినప్పుడు 78). ఆంగ్లంలో రాసిన పుస్తకాలకు ఇచ్చే ‘బుకర్‌ ప్రైజ్‌’ను కొంతమంది భారతీయ, భారత సంతతి రచయితలు ఇంతకుముందు గెలుచుకున్నారు; వాటి గొప్పతనం వాటిదే. కానీ ఆంగ్లంలో రాయనక్కర్లేకుండా తమకు చేరువైన భాషలో రాస్తూనే అంతర్జాతీయ ఖ్యాతి పొందవచ్చని ఈ గౌరవం చెబుతోంది. భిన్న భారతీయ భాషల్లో వస్తున్న శ్రేష్ఠమైన సాహిత్యాన్ని ఆంగ్ల ప్రపంచ గుమ్మంలోకి ప్రవేశపెట్టే చొరవ చూపేలా ఈ విజయం ప్రచురణకర్తలకు ప్రేరణనిస్తోంది. గట్టిగా ఆంగ్ల భాష తలుపు కొట్టగలిగితే, ఇతర భాషల కిటికీలు వాటికవే తెరుచుకుంటాయి.

రచయిత్రి, పాత్రికేయురాలు, కార్యకర్త, న్యాయవాది అయిన బాను ముష్తాక్‌ ఆరు కథా సంపుటాలు, ఒక వ్యాసాల సంకలనం, ఒక కవిత్వ సంపుటి, ఒక నవల వెలువరించారు. పురుషాధిపత్య సమాజంలో ముస్లిం మహిళల జీవన వ్యథలను ఆమె చిత్రించారు. ఆమె పాత్రలు కన్నడ, దక్కనీ ఉర్దూ, అరబిక్‌ మాట్లాడుతాయి. 1990–2023 మధ్యకాలంలో ఆమె రాసిన 50కి పైగా కథల్లోంచి 12 కథలను కూర్చడంతోపాటు, వాటిని ఆంగ్లంలోకి అనువదించిన దీపా భాస్తి ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రైజ్‌ గెలుచుకున్న తొలి భారతీయ అనువాదకురాలు అయ్యారు. ‘‘మహిళ రాసి, మహిళ సంపాదకత్వం వహించి, మహిళ అనువదించిన పుస్తకం హార్ట్‌ ల్యాంప్‌’’ అన్నారు బెంగాలీ అనువాదకుడు అరుణవ సిన్హా. ఈ పురస్కారాన్ని 2022లో తొలిసారిగా ఇండియా నుండి హిందీ రచయిత్రి గీతాంజలి శ్రీ గెలుచుకోవడానికి కారణమైన అనువాదకురాలు డైసీ రాక్‌వెల్‌ ఒక అమెరికన్‌ అని తెలిసిందే. అవార్డు కింద నగదుగా ఇచ్చే యాభై వేల పౌండ్లను నియమాల మేరకు బాను, దీపా సమానంగా పంచుకుంటారు. భారతీయ భాషల్లోని మంచి సాహిత్యాన్ని మరో దరికి చేర్చాలన్న అనువాదకుల పూనికకు ఇది గట్టి ప్రోత్సాహం కాగలదు.

1970–80ల్లో కర్ణాటకలో మొదలైన బండాయ సాహిత్యోద్యమం దళితులు, ముస్లింలు తమ కథలను తామే రాసుకునే ప్రేరణనిచ్చింది. మంచి ముస్లిం బాలికలు ఉర్దూలో ఖురాన్‌ చదవగలిగితే చాలు అనే సామాజిక వాతావరణంలో తొలుత ఉర్దూలో చదవడం ప్రారంభించి, తండ్రి (ఎస్‌.ఎ.రహమాన్, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌) ప్రోద్బలంతో కన్నడ మాధ్యమంలోకి మారిన బాను ఆ భాషనే తన రచనా వాహికగా ఎంచుకున్నారు. ‘‘నాకు అక్షరాలు వచ్చినప్పటినుంచీ రాయడం మొదలుపెట్టాను’’ అంటారామె. రష్యన్‌ రచయిత ఫ్యోదర్‌ దోస్తోవ్‌స్కీ, కన్నడ రచయిత దేవనూర్‌ మహదేవను అభిమానించే ఆమె ‘నాను అపరాధియే?’ పేరుతో తొలి కథ రాశారు. తన స్నేహితురాళ్లు చిన్ననాటనే పెళ్లిళ్లు చేసుకుని జీవితంలో నిలిచిపోతున్నా ఆమె ఆగకుండా పైచదువులకు వెళ్లారు. సినిమాకు వెళ్లడం మీద ఒక ముస్లిం యువతిని అడ్డుకున్న ఉదంతం గురించి ఆమె రాసిన తొలి వ్యాసం చర్చనీయాంశం కావడంతోపాటు ఆమెను ‘లంకేశ్‌ పత్రికే’ జర్నలిస్టుగా మార్చింది. 26 ఏళ్ల వయసులో ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ, వివాహానంతరం బురఖా ధరించాలనీ, ఇంటి పనులకే పరిమితం కావాలనీ అత్తవారింటి నుంచి ఒత్తిడి వచ్చింది. చేస్తున్న హైస్కూల్‌ టీచర్‌ ఉద్యోగం మానాల్సి వచ్చింది. ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి కలిగాక ఒక దశలో నిరాశా నిస్పృహలతో వైట్‌ పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకోబోయారు. మూడేళ్ల పాపను ఆమె కాళ్ల దగ్గర పెట్టి, అలా చేయొద్దంటూ ఆమె భర్త ముష్తాక్‌ మొహియుద్దీన్‌ ఆమెను హత్తుకున్నారు. అప్పట్నించీ ఆమెకు అన్నింటా అండగా నిలిచారు.

స్త్రీల వేదన, నిస్సహాయత తన మీద లోతైన ప్రభావం చూపి, రాయక తప్పని స్థితిని కల్పించాయంటారు బాను. ‘‘నువ్వు ఈ ప్రపంచాన్ని మళ్లీ నిర్మించదలిస్తే, మగవాళ్లనూ ఆడవాళ్లనూ సృష్టించదలిస్తే అనుభవం లేని కుమ్మరిగా ఉండకు. ప్రభూ, ఈ భూమ్మీదకు ఒక్కసారి ఆడదానిగా రా!’’ అని అడుగుతుంది ‘ఓ దేవుడా, ఒక్కసారి ఆడదానిగా ఉండు’ కథ. ‘‘మతం, సమాజం, రాజకీయాలు స్త్రీలనుంచి ప్రశ్నించకూడని విధేయతను డిమాండ్‌ చేస్తాయి. ఈ క్రమంలో అమానవీయ క్రూరత్వాన్ని మోపుతాయి’’ అంటారామె. మసీదుల్లో స్త్రీలకు ప్రార్థించే హక్కు ఉండాలంటారు ఈ ‘ఫైర్‌బ్రాండ్‌’. సొంత సమాజం మీద ఉమ్మివేయడం ద్వారా బయట జేజేలు కొట్టించుకుంటోందన్న నిందలు మోశారు. ఒక దశలో ఆమె మీద కత్తి దాడి యత్నం జరిగింది. అయితే దాడి చేసిన వ్యక్తిని ఆమె క్షమించారు. మున్సిపల్‌ కౌన్సిల్‌ సభ్యురాలిగా రెండుసార్లు ఎన్నికయ్యారు. ‘మన ముక్కులు కోపిస్తుంది’ అని ఆమె తండ్రితో ఆమె కుటుంబ సభ్యులు సరదాగా అనేవాళ్లట. బదులుగా ఇప్పుడు అందరిలోనూ వాళ్లంతా ముఖాలు ఎత్తి నిలబడేలా చేయగలిగారు. ఇంతటి ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకోవడాన్ని ‘ఒక్క ఆకాశాన్ని వెయ్యి మిణుగురులు వెలిగించినట్టుగా’ ఆమె అనుభూతి చెందారు. ‘ప్రతీ గొంతుకను వినే, ప్రతీ కథకు మన్నన దక్కే, ప్రతీ మనిషి మరొకరికి చెందే ప్రపంచాన్ని సృష్టించాలి’ అని తన పురస్కార అంగీకారోపన్యాసంలో కోరారు. అదే నిజమైతే, మిణుగురులు ఆకాశాన్ని వెలిగించే అనుభూతి ప్రతి ఒక్కరికీ సాక్షాత్కరిస్తుంది.

(26th May 2025)

Wednesday, July 23, 2025

కేరళ సాహిత్య యాత్ర


మలబారు యాత్ర


వైకోం మహమ్మద్‌ బషీర్‌ తమ ఇంటిముందున్న వంగమామిడి చెట్టుకింద కూర్చుని రాసేవారట. ఆ చెట్టు గాలిని పీల్చే ‘మా తాతకో ఏనుగుండేది’,  ‘చిన్ననాటి నేస్తం’, ‘గోడలు’ లాంటి ఆయన రచనలు ఊపిరి పోసుకున్నాయి. బషీర్‌ అభిమానులకు ఆ చెట్టును చూడటం గొప్ప సంతోషం. అంతేనా? ఆయన విన్న గ్రామ్‌ఫోన్‌ రికార్డు, ఆయన సేదతీరిన ఆరాం కుర్చీ కూడా ప్రత్యేకమే. బషీర్‌ను ఆయన జన్మించిన బేపూర్‌ను బట్టి బేపూర్‌ సుల్తాన్‌ అంటారు. ఆయన వస్తువులు, ఆయన జీవితాన్ని తెలియజెప్పే విశేషాలతో ఆ ఊళ్లో కేరళ ప్రభుత్వం ఒక మెమోరియల్‌ నిర్మిస్తోంది. బషీర్‌ క్లాసిక్‌ అయిన ‘ప్రేమలేఖనం’ నవలలో దంపతులు తమ చిన్నారికి పెట్టుకున్న ఆకాశమిఠాయి పేరునే ఈ స్మారక కేంద్రానికి ఉంచారు. ఒక రచయితకు మెమోరియల్‌ నిర్మించడం దానికదే విశేషమే అయినా, నిత్య సాహిత్య రాష్ట్రమైన కేరళ తన సాహిత్య స్పృహను మరో స్థాయికి తీసుకెళ్లింది. రచయితల మెమోరియల్స్‌ను కలుపుతూ దేశంలోనే తొట్టతొలి సాహిత్య యాత్రకు శ్రీకారం చుడుతోంది. ‘మలబార్‌ లిటెరరీ టూరిజం సర్క్యూట్‌’ పేరుతో ఈ యాత్ర కోళికోడ్, మలప్పురం, పాలక్కాడ్‌ జిల్లాలను కవర్‌ చేస్తుంది.

మలయాళ సాహిత్యంలో ప్రాచీన కవిత్రయంలో ఒకరిగా పిలిచే, ఆధునిక మలయాళ సాహిత్య పితామహుడిగానూ కొలిచే 16వ శతాబ్దపు కవి, భాషావేత్త తుంచాత్తు రామానుజన్‌ ఎలుత్తాచ్చన్‌ గ్రామమైన తుంజన్‌ పరంబు మలబారు ప్రాంతంలోనే ఉంది. విజయదశమి రోజున చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల అక్షరాభ్యాసం కోసం ఈ గ్రామాన్ని దర్శించుకుంటారు. ఈ మలబారు ప్రాంతంలోనే జ్ఞానపీuЇ పురస్కార గ్రహీత ఎం.టి.వాసుదేవన్‌ నాయర్‌; రచయిత, కార్టూనిస్ట్‌ ఒ.వి.విజయన్‌; ప్రఖ్యాత యాత్రాసాహిత్య కర్త ఎస్‌.కె.పొట్టెక్కాట్‌; మరో కవి, జ్ఞానపీఠ గ్రహీత అఖితం అచ్యుతన్‌ నంబూద్రి లాంటివారి స్మారక కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ఇవి భిన్న దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వాటన్నింటినీ అభిమానులు కలయదిరిగేలా, రచయితల పుస్తకంలో ప్రాణం పోసుకున్న ప్రాంతాలను ప్రత్యక్షంగా అనుభవించేలా, మానవ ఉద్వేగాలన్నీ కాగితాల్లోకి ఎలా బదిలీ అయ్యాయో తెలుసుకునేలా కేరళ పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. 2021లోనే ఈ ప్రాజెక్టుకు బడ్జెట్‌ కేటాయింపులు జరపగా, ఈ సంవత్సరం మధ్యకల్లా దీన్ని ప్రారంభించే అవకాశం ఉంది. కోళికోడ్‌ను యునెస్కో భారతదేశ తొట్టతొలి సాహిత్య నగరంగా గుర్తించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ వల్ల ఆ నగర ఘనత మరింతగా ఇనుమడిస్తుంది.

లండన్‌లోని షేక్‌స్పియర్‌ స్మారక కేంద్రాన్ని ఏటా పాతిక లక్షల మంది సందర్శిస్తారు. యూకేలో భిన్న లిటెరరీ సర్క్యూట్స్, వాటికి తగిన ఏర్పాట్లు ఉన్నాయి. దక్షిణ అమెరికాలోని కొలంబియాలో మ్యూజియంగా మార్చిన గాబ్రియేల్‌ గార్సియా మార్క్వేజ్‌ ఇల్లు, ఆయన చదివిన పాఠశాల, ఆయన వెళ్లిన గ్రంథాలయం... ఇలా ఆయన ‘వన్‌ హండ్రెడ్‌ ఇయర్స్‌ ఆఫ్‌ సాలిట్యూడ్‌’కు ప్రేరణగా నిలిచిన అన్ని ప్రదేశాలను కలుపుతూ ప్రయాణించవచ్చు. ప్రముఖ మలయాళ సాహిత్యకారులకు కూడా జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు ఉంది. వీళ్ల రచనలు భిన్న భారతీయ భాషలతో పాటు, ఆంగ్లం, ఇతర ప్రపంచ భాషల్లోకి అనువాదమయ్యాయి. దానికి తగ్గ ఉత్సాహం, ప్రోత్సాహం అక్కడ ఉన్నాయి. అందుకే సందర్శకులు భిన్న ప్రాంతాల నుంచి వచ్చే అవకాశం ఉంది. మరి తెలుగు రచయితల పరిస్థితి ఏమిటి? ముందు తెలుగు రచయితలను తెలుగువాళ్లకు పరిచయం చేయడమే పెద్ద సవాలు కావొచ్చు.

వైజాగ్‌ వైపు వెళ్లే కొందరు సాహిత్యాభిమానులు ప్రత్యేకించి భీమిలి వెళ్లొస్తారు చలం ఇంటి కోసం. విజయనగరం వైపు పోయేవాళ్లు గురజాడ గృహాన్ని దర్శించవచ్చు. అదే విశాఖపట్నానితో ముడిపడిన శ్రీశ్రీ, రావిశాస్త్రిలను ముడేస్తూ, అటుగా శ్రీకాకుళంలోని కథానిలయంతో కరచాలనం చేసేలా ఉత్తరాంధ్ర సాహితీయానం చేయగలిగితే ఎలా ఉంటుంది? పోతన, దాశరథి, కాళోజీ లాంటి వాళ్లను తలుచుకోగలిగే వరంగల్‌ సాహిత్య టూర్‌ ఎందుకు ఉండకూడదు? రచయితలను ప్రాంతాల వారీగానో, జిల్లాల వారీగానో అనుసంధానం చేసే సాహిత్య టూర్లను ఆశించడం తెలుగు నేల మీద మరీ అత్యాశా? కానీ ఎంతమంది రచయితలకు మెమోరియల్స్‌ ఉన్నాయి? కనీసం విగ్రహాలైనా ఉన్నాయా? కువెంపు విమానాశ్రయం(శివమొగ్గ) అని కన్నడవాళ్లు పెట్టుకున్నట్టుగా తెలుగు నేల మీద అలా ఒక రచయితకు గౌరవం దక్కుతుందా?

ప్రాచీన ప్రపంచంలో ఈజిప్టులోని అలెగ్జాండ్రియా లైబ్రరీ ఒక జ్ఞానధామం. క్రీ.పూ. మూడో శతాబ్దానికి చెందిన ఇది ఆ కాలపు గొప్ప పండితులందరికీ నిత్య సందర్శనా స్థలం. అమెజాన్‌ కంపెనీ తన వర్చువల్‌ అసిస్టెంట్‌ను ప్రారంభించినప్పుడు దాని పేరును అలెగ్జాండ్రియాకు నివాళిగా ఎన్నుకుంది. అట్లా ‘అలెక్సా’ చాలామంది జీవితాలకు చేరువైంది. సాహిత్యంతో పరిచయం లేదనుకునేవాళ్లు కూడా దాని ఫలాలను ఇంకో రూపంలో అనుభవిస్తూనే ఉంటారు. ‘పోషణ, ఆవాసం, సాహచర్యం తర్వాత ఈ ప్రపంచంలో మనకు అత్యంతగా కావాల్సింది కథలు’ అంటాడు ఫిలిప్‌ పుల్‌మాన్‌. ‘రచయితలో కన్నీళ్లు లేకపోతే పాఠకుడిలో కన్నీళ్లు లేవు. రచయితలో ఆశ్చర్యం లేకపోతే పాఠకుడిలో ఆశ్చర్యం లేదు’ అంటాడు రాబర్ట్‌ ఫ్రాస్ట్‌. రచయితలో ఉన్నదే పాఠకుడికి అందుతుంది. రచయితలో ఉన్నదంతా కూడా పాఠకుడికి బదిలీ అవుతుంది. సాహిత్యం అనేది మన అంతరాత్మలను వెలిగించే అదృశ్య దివ్వె. అందుకే సాహిత్య సృష్టికర్తలను తలుచుకునే ఏ ప్రయత్నం అయినా ప్రాధాన్యత కలిగినదే, దానికోసం తీసుకునే ఏ చొరవైనా విలువైనదే!

(సాక్షి, ఏప్రిల్‌ 28, 2025)
 

Sunday, July 20, 2025

హర్షణీయం పాడ్‌కాస్ట్‌



నిజంగా హర్షణీయం!


కోవిడ్‌ మహమ్మారి ప్రపంచాన్ని సమూలంగా మార్చేసింది. దాని పర్యవసానాల్లో ఒకటి, బయటికి వెళ్లే పనిలేకుండా చేయగలిగే పనుల గురించి ఆలోచించడం. అలాంటి ఒక కారణంతో మొదలైన ‘హర్షణీయం’ తెలుగు పాడ్‌కాస్ట్, సమస్త సాహిత్య ప్రపంచాన్ని తెలుగు గడపలోకి తెచ్చిపెట్టింది. అంతేనా? అనువాద ప్రపంచంలోకి అడుగుపెట్టాలనుకునే ఏ భాషవారికైనా ఒక ఆన్‌లైన్‌ నిధిగా రూపొందింది. 2020 మార్చ్‌లో ముందు తెలుగులో ప్రారంభమై, తర్వాత తెలుగు– ఆంగ్లంగా మారి, అటుపై ఆంగ్లంలోకి కూడా వ్యాపించిన ఈ పాడ్‌కాస్ట్‌ ‘నూరు మంది అనువాదకుల’ సిరీస్‌ను ఇటీవలే ముగించుకుంది. ఇందులో మలయాళం, తమిళం, కన్నడం, గుజరాతీ లాంటి భారతీయ భాషల్లోంచి ఆంగ్లంలోకి అనువదిస్తున్నవారితో పాటు– థాయి, ఉజ్బెక్, వియత్నమీస్, హంగేరియన్, తుర్కిష్, నార్వేజియన్, మంగోలియన్, కిస్వాహిలీ లాంటి భాషల ఆంగ్లానువాదకుల ఇంటర్వ్యూలు ఉన్నాయి. దోస్తోవ్‌స్కీ ఉపరితల అంశాల మీద సమయం వృథా చేయరని చెబుతారు, గతేడాదే ‘బ్రదర్స్‌ కరమజోవ్‌’కు మరో ఆంగ్లానువాదం వెలువరించిన మైకేల్‌ ఆర్‌. కట్జ్‌. మనిషిని మలిచే కీలక క్షణాలు, విశ్వాసం, నైతికత, హింస, తీవ్రోద్వేగాల మీద దోస్తోవ్‌స్కీ దృష్టి ఉంటుందని అంటారు. పంతొమ్మిదో శతాబ్దపు రష్యన్‌ సాహిత్యాన్ని బోధించే మైకేల్‌ సుమారు 20 రష్యా నవలల్ని అనువదించారు. దోస్తోవ్‌స్కీ ‘నోట్స్‌ ఫ్రమ్‌ అండర్‌గ్రౌండ్‌’లోని తొలి 30 పేజీలు అనువాదానికి అసలు లొంగనివని ఆయన అభిప్రాయం. ఒక పుస్తకం పుట్టించే తక్షణ స్పందనే దాన్ని అనువాదానికి పూనుకునేలా చేస్తుందని చెబుతారు అరుణవ సిన్హా. పదహారేళ్ల కాలంలో సుమారు 80 పుస్తకాల్ని బంగ్లా నుంచి ఆయన ఆంగ్లంలోకి అనువదించారు. సగటున ఏడాదికి ఐదు పుస్తకాలు! ఒక దానిలో దిగితే అందులో మునిగిపోవడమే ఇంత వేగంగా అనువదించడానికి కారణమంటారు. ఫుట్‌నోట్‌ ఇవ్వాల్సి రావడాన్ని ఒక వైఫల్యంగా చూస్తారు హిందీ, ఉర్దూ నుంచి అనువాదాలు చేసే అమెరికన్‌ డైసీ రాక్‌వెల్‌. భాషల మీద ప్రేమతో ఆమె దాదాపు పదిహేను భాషలు నేర్చుకున్నారు. ఇంకా, కరీమ్‌ అబ్దుల్‌ రహమాన్‌(కుర్దిష్‌), జెస్సికా కోహెన్‌(హీబ్రూ), లోలా రోజర్స్‌ (ఫిన్నిష్‌) లాంటివాళ్లు ఈ పాడ్‌కాస్ట్‌లో తమ ఆలోచనలను పంచుకున్నారు. అనువాద క్రాఫ్ట్‌తో పాటు మొత్తంగా అనువాద ఎకో సిస్టమ్‌ గురించి ఇంత విస్తారంగా ఒకేచోట మాట్లాడిన పాడ్‌కాస్ట్‌ ప్రపంచంలో ఇంకోటి లేదని ఐస్‌లాండిక్‌ అనువాదకురాలు విక్టోరియా క్రిబ్‌ కితాబునివ్వడం హర్షణీయం అందుకున్న ప్రశంసల్లో ఒకానొకటి.

మూడు దశాబ్దాలుగా స్నేహితులైన ఇంజినీరింగ్‌ క్లాస్‌మేట్లు హర్ష, అనిల్, గిరి ఉద్యోగాలు చేస్తూనే, పాఠకులుగా తమ అభిరుచితో ‘హర్షణీయం’ మొదలుపెట్టారు. ఇందులో హర్ష కథకుడు, అనిల్‌ అనువాదకుడు, గిరి సాంకేతిక నిపుణుడు. వక్తలను ఎంచుకోవడం, ప్రశ్నలు కూర్చుకోవడం ముగ్గురూ కలిసి చేస్తారు. ఎడిటింగ్‌ బాధ్యత కుదిరినవాళ్లు తీసుకుంటారు. ఇంటర్వ్యూలు మాత్రం అనిల్‌ చేస్తారు. సాహితీవేత్తలను ఇంటర్వ్యూలు చేయడంలో ప్రొఫెసర్‌ మృణాళిని ‘అక్షర యాత్ర’ తమకు స్ఫూర్తి అంటారు. ముందు తెలుగు రచయితల సంభాషణలతో మొదలుపెట్టి, తర్వాత ఇరవై నాలుగు రాష్ట్రాల్లోని పర్యావరణవేత్తల అభిప్రాయాలకు వేదికై, బిభూతీభూషణ్‌ బంధోపాధ్యాయ ‘వనవాసి’ నవలను యాభై వారాలు ఆడియోగా ఇచ్చి, తర్వాత అనువాదకుల వైపు మళ్లారు. లోప్రొఫైల్‌లో ఉండే అనువాదకుల మెయిల్స్, కాంటాక్ట్‌ నంబర్స్‌ సంపాదించడం, వాళ్లకు తమ వివరాలు చెబుతూ సందేశాలు పంపడం, ఒక్కోసారి ఎనిమిది నెలల తర్వాత కుదురుతుందని చెబితే వేచివుండి(ఉదా: మైకేల్‌ కట్జ్‌) మళ్లీ సంప్రదించడం, ప్రశ్నలు ముందే పంపడం, విదేశీయుల సమయాన్ని బట్టి రాత్రుళ్లు మాట్లాడటం, వివాదాల జోలికి పోకుండా పుస్తకాల మీదే ఫోకస్‌ పెట్టడం వీళ్ల పనితీరు. ఎక్కువ అనువాదాలు జరిగే ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్‌ అనువాదకులు కూడా సహజంగానే ఈ పాడ్‌కాస్ట్‌లో చోటుచేసుకున్నారు. ‘ది హర్షణీయం పాడ్‌కాస్ట్‌ అండ్‌ ఇట్స్‌ ఇటాలియన్‌ లిటరేచర్‌ ఇన్‌ ట్రాన్స్‌లేషన్‌’ పేరుతో ‘ద గ్లోబల్‌ లిటరేచర్‌ ఇన్‌ లైబ్రరీస్‌ ఇనీషియేటివ్‌’ 2024 నవంబర్‌లో వీళ్ల పాడ్‌కాస్ట్‌ను ప్రస్తావించడం విశేషం. కొన్నింటికి కాలం కూడా కలిసిరావాలి. ఇంకో కాలంలో అయితే ఇలాంటిది జరిగే అవకాశం లేదు.  కొన్ని మెయిల్స్‌తో, ఒక్క ఫోన్‌ కాల్‌తో ప్రపంచంలో ఎక్కడో ఉన్నవారితో సంభాషించడం ఎలా సాధ్యం? కాని కలిసొచ్చే కాలంలో కూడా ఎంతమంది ఇలాంటి పనికి పూనుకున్నారు? అందుకే వీళ్ల పని హర్షణీయం.

తెలుగు భాషలోని 56 అక్షరాలన్ని దేశాల వారితోనైనా మాట్లాడాలని సరదాగా వీళ్లు పెట్టుకున్న లక్ష్యం నెరవేరింది. అనువాదకుల సిరీస్‌లో భాగంగా, గతేడాది ప్రతిష్ఠాత్మక బుకర్‌ ఇంటర్నేషనల్‌ ప్రైజ్‌ లాంగ్‌లిస్ట్‌లోని పదముగ్గురు అనువాదకులతోనూ సంభాషించారు. ఈ ఏడాది లాంగ్‌లిస్ట్‌లోని రిఫరెన్సుల్ని సాక్షాత్తూ ‘ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రైజ్‌’ అడ్మినిస్ట్రేటర్‌ ఫియమెత్తా రోకో ఇచ్చి ఇంటర్వ్యూలకు సహకరించడం వీళ్ల విశ్వసనీయతకు చిహ్నం. ఈ సంభాషణలు ఈ ఏప్రిల్‌లోనే ప్రసారం అవుతాయి. అక్కడివాళ్లను ఇక్కడికి తెస్తున్నారు సరే, తెలుగువాళ్లు అటుపోయే మార్గమేమిటి? ‘తెలుగులో గొప్ప రచయితలు చాలామంది ఉన్నారు. కానీ ముందు ఆంగ్లంలోకి అనువాదం కావడం; ముఖ్యంగా యూకే, యూఎస్‌లో ప్రచురితం కావడం అతిపెద్ద సవాలు. దానికి నాణ్యమైన అనువాదకులతో పాటు నిబద్ధత ఉన్న ప్రచురణకర్తలు అవసరం’ అని చెబుతారు అనిల్‌. తెలుగు సాహిత్యంలో ఆ వాతావరణం క్రమంగా చోటుచేసుకుంటోందనీ, రెండేళ్లలో సానుకూల మార్పు చూడబోతున్నామనీ అంటారు. ఇది ఇంకోరకంగా హర్షణీయం.


(సాక్షి, మార్చ్‌ 31, 2025)