Tuesday, July 29, 2025

పేరు - చెడ్డపేరు



పేరుకు చెడ్డపేరు?


వేసుకుంటే పాత ప్రశ్నే. పేరులో ఏమున్నది? గులాబీకి ఆ పేరు లేకపోయినా అది గులాబీ అయ్యేది కాదా? ఆ పువ్వుకు అంత అందం వచ్చేది కాదా?  పేరు వల్ల కూడా అందం ఇనుమడిస్తుంది. పేరులో ఏమున్నది అనుకుంటే అందమైన పేర్ల కోసం ఆధునిక తల్లిదండ్రులు అంతగా ప్రయత్నించరు. ఈ అందం అనేది ఒక్కోసారి సాపేక్షం. అన్ని మతాల్లోనూ, సమాజాల్లోనూ పిల్లలకు పేరు పెట్టడం అనేది అనాదిగా పెద్ద పండుగ. నామకరణం తర్వాతే శిశువు నిజంగా ఈ భూమ్మీద ‘ఉనికి’లోకి వచ్చినట్టు!

మనిషికి పేరు అనేది దానికదే ఒక చిరునామా. ఎవరికైనా తన పేరును మించిన అందమైన పిలుపు మరొకటి ఉండదు, అంతకంటే మంచి కవితను ఇంకే కవీ రాయలేడు. పేరు అనేది మనిషిని ఎప్పటికీ వదలని హేంగోవర్‌. ఆ పేరులోని ప్రత్యేకత కంటే, ఆ పేరును మళ్లీ మళ్లీ వినడం వల్ల అది వారికి ప్రత్యేకమైపోతుంది. శిశువు ఈ భూమ్మీదకు రాగానే కూడగట్టుకోగలిగే తొలి సొంత ఆస్తి కూడా ఈ పేరే. ఇంక దాన్ని పెంచుకోవడం, తగ్గించుకోవడం అన్నది ఒక జీవితకాల ప్రయాణం తర్వాతే తేలుతుంది. ప్రాచీన రోమన్‌ సామ్రాజ్యంలో శుద్ధీకరణ పేరుతో నామకరణోత్సవం జరిగేది. ఆడశిశువులకు ఎనిమిదో రోజున, మగపిల్లలకు తొమ్మిదో రోజున పేర్లు పెట్టేవారు. ఆడపిల్లలు మగపిల్లల కంటే త్వరగా ఎదిగి పరిపూర్ణత్వాన్ని పొందుతారనేది ఈ తేడాకు కారణం.

పెట్టిన పేర్లు తికమకగా మారిపోవడం ఒక తమాషా. సుగుణ ఎంతటి గుణవంతురాలో మనకు తెలియదు. కోమలిది ఎలాంటి రూపమో ఊహించలేము. బలవంతరావు బలహీనంగా ఉండకూడదనేం లేదు. పేరుకు తగ్గట్టుగా మనిషి ప్రవర్తనను ఆశించడం కొన్నిసార్లు ఆశాభంగం కావొచ్చు. హరిశ్చంద్రుడు అబద్ధాలకోరు అవ్వకూడదనే కోరుకుంటాం. ధర్మరాజు అవినీతికి పాల్పడితే మరీ ఎక్కువ బాగోదు. పెట్టిన పేరుకు తగ్గట్టుగా ఉండలేక పిల్లలు సతమతమవడం మరో కోణం. కొన్ని పేర్లను కొందరు కుట్రపూరితంగా కూడా వాడుకోవచ్చు. ఉదాహరణకు మోసం. కానీ దాన్ని వాళ్లు ప్రేమ అనొచ్చు, స్నేహం అని పిలవొచ్చు. ఒక యుద్ధానికి ఏం పేరు పెడదామని అమెరికా అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌ సలహా అడిగితే, ‘అనవసర యుద్ధం’ అందామని సలహా ఇచ్చారట బ్రిటన్‌ ప్రధాని చర్చిల్‌. తగిన పేరు!

జనాలు తాము ఉన్నదాన్ని బట్టి తమ పేర్లను అందమైనవిగానో, వికారమైనవిగానో చేస్తారు అంటారు కెనడా రచయిత ఎల్‌.ఎమ్‌.మాంటొగోమెరీ. అది చాలావరకు నిజమే అయినా అన్నిసార్లూ నిజం కాదు. సూర్యకాంతం అంటే మనకు ఇప్పుడు ఒక పేరు కాదు. ఒక గయ్యాళి ముసలి. గిరీశం అంటే నక్కజిత్తులవాడే! భగవంతరావు అని వచ్చిందంటే ఒక స్థాయి మనిషి అనే అర్థం. పరమానందయ్య అనగానే వాలుకుర్చీలో విశ్రాంతిగా కూర్చునే సగటు మధ్యతరగతి మానవుడే. సాహిత్యమో, సినిమానో వేసే ముద్రలవల్ల కూడా పేర్ల స్వభావాలు మారిపోతాయి. కన్యాశుల్కం ఎంత గొప్ప నాటకమైనా లుబ్ధావధాన్లు, సౌజన్యారావు అంటూ పాత్రల పేర్లను వారి స్వభావాలకు తగ్గట్టుగా పెట్టడం కొంతమందికి నాటకీయంగా అనిపించింది. పాత్రకు తగ్గ పేరు పెట్టడం సహజం కాకపోయినా, ఔచిత్యం అనుకున్నారు మన రచయితలు. లేదంటే జనాలే పాత్రల పేర్లను మార్చేయొచ్చు. ఉదాహరణకు మహాభారతంలో ‘దుర్యోధనుడి’ పేరును సుయోధనుడు అనుకోనివాళ్లే ఎక్కువ. పిల్లల పేర్ల కోసం తల్లిదండ్రులు కొన్నిసార్లే తలలు బద్దలు కొట్టుకుంటారు. కానీ రచయితలు తాము సృష్టించే ప్రతి పాత్ర కోసం ఆ ‘పురిటి నొప్పులు’ పడాల్సిందే!

‘డ్రాకులా’ అనగానే దవడల పక్కన తెరుచుకున్న కోరలతో, మెడను కొరికి పచ్చినెత్తురు తాగే భయానక ఆకారం గుర్తొస్తుంది. అన్ని సాహిత్య రూపాల్లో అత్యధికసార్లు (700కు పైన) పునరావృతం అయిన పాత్రగా ఇది గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కింది. గాతిక్‌ శైలిలో నిర్మితమైన మధ్య యుగాల యూరోపియన్‌ భవనాలను ఒక వాతావరణం కోసం వాడుకుంటూ రాసిన గాతిక్‌ హారర్‌ సాహిత్యంలో ‘డ్రాకులా’ పేరుతోనే వచ్చిన నవల ఒక క్లాసిక్‌. సుమారు 125 ఏళ్ల క్రితం, 1897 మే 26న డ్రాకులా విడుదలైంది. అలాంటి గాతిక్‌ హారర్‌ సాహిత్యాన్ని డ్రాకులాకు ముందూ, తర్వాతా అని విభజిస్తారు వెండీ డోనిగర్‌. ఈ పాత్ర సృష్టికర్త లండన్‌లో స్థిరపడిన ఐరిష్‌ రచయిత బ్రామ్‌ స్టోకర్‌ (1847–1912) అనబడే అబ్రహామ్‌ స్టోకర్‌. ప్రపంచంలో డిటెక్టివ్‌ పాత్రలకు మోడల్‌గా నిలిచే షెర్లాక్‌ హోమ్స్‌ను సృష్టించిన ఆర్థర్‌ కానన్‌ డాయిల్‌ ఈయనకు దూరపు బంధువు కూడా. ‘ద ఫేట్‌ ఆఫ్‌ ఫెనెల్లా’(1891) పేరుతో 24 మంది రచయితలు రాసిన ఒక గొలుసు కట్టు నవలలో వీళ్దిద్దరూ కూడా భాగమయ్యారు. ఒకసారి లైబ్రరీలో బ్రామ్‌ స్టోకర్‌ ఏ పుస్తకాలో తిరగేస్తూవుంటే ‘డ్రాకులా’ అనే పేరు కంటబడింది. ఆ పేరులో ఆయనకు నిలువెల్లా దుష్టత్వం కనబడటమే కాక, దానికి అలాంటి అర్థమే ఉంటుందనుకున్నాడు. అందుకే ఆ పేరునే తన ప్రతినాయకుడికీ, నవలకూ వాడుకున్నాడు. ఇంతాచేస్తే ఈ డ్రాకులా అనేది ఒక వంశనామం. ఆగ్నేయ యూరప్‌ దేశమైన రొమేనియా పాలకుడు... వ్లాద్‌ డ్రాకులా. 15వ శతాబ్దిలో రొమేనియాను పాలించాడు. ఆయన్ని ఆ దేశ జాతీయ హీరోగా ఆరాధిస్తారు. ఈయన డ్రాకులా వంశంలో మూడోవాడు. ఈయన తండ్రి రెండో వ్లాద్‌ డ్రాకులా. అలాంటి పేరుకు ఈ నవల మచ్చ తెచ్చిందో, ఆ పేరును ఎప్పటికీ నిలిచేలా చేసిందో తీర్పునివ్వడం కష్టం. గులాబీకి గులాబీ అనే తగిన పేరు ఉండటం వల్లే అది పూరాణిగా రాణించిందా, ‘డ్రాకులా’కు డ్రాకులా అని పెట్టడం వల్లే అది ఒక పాత్రగా ఇంతగా నాటుకుపోయిందా చెప్పడం కష్టం. అది ఒక మనిషిని తన పేరుకు బదులుగా ఇంకొకటి చెప్పుకొమ్మనడం లాంటిది.

(23rd June 2025)

No comments:

Post a Comment