Friday, August 1, 2025

ఏఐ కృత్రిమ రచన


 

కృత్రిమ రచన


ఆత్మ అనేది కేవలం స్వర్గలోక సంబంధి కాదు. దానికి భౌతిక ఉనికి లేనంతమాత్రాన అది భావవాదులకు మాత్రమే చెందినది కాదు. అదేంటో చూపలేకపోయినా, అది లేకపోవడమంటే ఏమిటో మనకు తెలుసు. ఈ మెటీరియలిస్టు ప్రపంచంలో ఆత్మగల్ల మనుషులను వెతికే ప్రయత్నం కాదిది.  కృత్రిమ మేధ (ఏఐ) సందర్భంలో ఆత్మ ప్రాధాన్యతను అర్థం చేయించాలన్న ఆరాటం. మానవీయ సహజ మేధనూ, యాంత్రిక కృత్రిమ మేధనూ విడదీస్తున్నది ముఖ్యంగా ఆ ఒక్కటే!

‘ఈ కంప్యూటర్‌ కాలంలో’ అని చెప్పడం నుంచి, ‘ఈ కృత్రిమ మేధ కాలంలో’ అనడం వరకు పయనించాం. మానవ నాగరికత ఒక క్రమ పరిణామమే అయినా, అది ఒక్కోసారి పెద్ద అంగ వేస్తుంది. నిప్పును పుట్టించడం, విద్యుత్‌ను కనుగొనడం, ఇంటర్నెట్‌ లాంటి మరో విప్లవాత్మకమైన మార్పు కృత్రిమ మేధ అని పండితులు అంటున్నారు. మనిషి తాను ఎదిగే క్రమంలో ఎన్నో ఉపకరణాలనూ, సాంకేతిక పరిజ్ఞానాలనూ రూపొందించుకున్నాడు. ఆ ఉపకరణాలు, పరిజ్ఞానాల ఊతంగా మరింత ఎదిగాడు. కానీ ఏఐ కేవలం మనిషి చేతిలో మరో పనిముట్టు కాదు, మరో అదనపు పరిజ్ఞానం అంతకన్నా కాదు. అంతకు మించి! పర్యావరణ పరిష్కారాలు సూచిస్తుందంటున్న ఏఐ టెక్నాలజీ నిజానికి అత్యధిక కార్బన్‌ ఫుట్‌ప్రింట్స్‌కు కారణమవుతోందనీ, జలవనరులను విపరీతంగా తోడేస్తోందనీ పర్యావరణవేత్తలు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. కానీ ఇవేవీ ఏఐని వ్యతిరేకించడానికి తక్షణ కారణాలు కాదు. ఇతర పరిజ్ఞానాలు కనీసం మన అంచనాలో మనిషిని సుఖపెట్టడానికి రూపొందినవి. కానీ ఏఐ ఏం చేయనుందో మనకు ఏ అంచనా లేదు!

సాహిత్య ప్రపంచంలో కొంతకాలంగా ఉన్న భయం ఈ మధ్య ఒక ‘ఓపెన్‌ లెటర్‌’ రూపం దాల్చింది. యంత్రాలు సృష్టించిన పుస్తకాలను విడుదల చేయకూడదంటూ ఈ జూన్‌ నెలలో పదుల కొద్దీ రచయితలు అమెరికాలోని పెంగ్విన్‌ రాండమ్‌హౌజ్, హార్పర్‌ కొలిన్స్‌ లాంటి ప్రచురణకర్తలకు బహిరంగ లేఖ రాశారు. ఏఐ–కల్పిత పుస్తకాలను విడుదల చేయడానికి ‘రచయితల’ను సృష్టించబోమనీ, ఒకవేళ మానవ రచయితలే అలాంటివి కల్పిస్తే వాటిని ‘మారుపేర్ల’తో అనుమతించబోమనీ, ఈ ‘దొంగతనానికి’ ఏ విధంగానూ మద్దతివ్వబోమనీ ప్రచురణకర్తలు ప్రతిన బూనాలని వారు కోరారు. ఒక పుస్తకం తుదిరూపు వరకు భాగమయ్యే మనుషుల ఉద్యోగాలను ఏఐ టూల్స్‌కు బలిపెట్టకూడదనీ అడిగారు. ఘంటాలను దాటి, పెన్నుకు బదులుగా టైప్‌ రైటర్‌నో, కంప్యూటర్‌నో వాడటం లాంటి పరిణామం కాదిది. ఏకంగా రచయితనే పక్కకు తప్పించేది! అందుకే రచయితల అనుమతి లేకుండా, రాయల్టీలు చెల్లించకుండా రూపొందిన కృత్రిమ మేధను ప్రచురణకర్తలు వాడకూడదనే విన్నపం కూడా వీటిల్లో ఉంది. ఎటూ ‘దోపిడీ’కి గురవుతున్న శ్రమకు పరిహారం కోరుకోవడం ఇది!

సాహిత్యం అంటేనే మానవ అనుభవం. లోలోపలి తరంగం, అంతరంగ జ్వలనం, ఆనంద చలనం. అవేమీ లేని ఏఐ ఎలా రాస్తుంది? ‘ఎలక్ట్రిక్‌ గొర్రెలను కలగంటుందా ఏఐ?’ అని అడుగుతాడు కవి డేవిడ్‌ స్టీర్‌. ‘ఒక రచన చేస్తున్నప్పుడు రచయిత రాస్తున్న ప్రతి పదాన్నీ తెలిసో, తెలియకో ఎంపిక చేసుకుంటాడు. పది వేల పదాల కథకు పది వేల ఎంపికలు. అలాంటి స్పృహ లేనందువల్ల కృత్రిమ మేధ ‘కళ’ను సృష్టించలేదంటాడు అమెరికన్‌ సైన్స్‌ ఫిక్షన్‌ రచయిత టెడ్‌ చియాంగ్‌. ‘‘ఒక మనిషి మీకు ‘ఐ యామ్‌ సారీ’ అని చెప్పినప్పుడు, గతంలో ఇతర జనాలు క్షమాపణ కోరుకున్నారన్నది విషయం కాదు; ‘ఐ యామ్‌ సారీ’ అనేది పరిగణించాల్సినంతటి అసాధారణమైన పద బంధం కాదన్నది విషయం కాదు. ఒకవేళ ఒకరు నిజాయితీగా చెబితే, ఆ క్షమాపణ విలువైనదీ, అర్థవంతమైనదీ అవుతుంది; అలాంటి క్షమాపణలు గతంలో చెప్పివున్నప్పటికీ.’’ ఒక రచయిత రాసేది అతడిదైన లోలోపలి వాక్యం. అది అతడికి మాత్రమే ప్రత్యేకం. అతడి అనుభవమే ఆ వాక్యం రాయడానికి పురిగొల్పుతుంది. యజమానిని చూడగానే కుక్క ప్రేమగా తోక ఊపుతుంది. దాని అన్ని కండరాలూ సంతోషంతో నర్తించడాన్ని ఆ తోక ఊపు సంకేతిస్తుంది. ఇలాంటి చిరు ఉద్వేగపు అనుభవం కూడా ఉండని ఏఐ ఏం రాయగలదు? ప్రదేశాలు, వస్తువులు మనిషి ఉనికితో ముడిపడి ప్రత్యేకమవుతాయి. ఏఐకి లేనిదే ఆ మహత్తర మానవీయ స్పర్శ.  కేవలం అన్నింటినీ రుబ్బి, ‘అలాగరిథమ్‌’ వండివార్చే రచనలో ఆత్మ ఎలా ఉంటుంది? మరి, ఎటూ కళ కాకుండాపోయే ఆ ఏఐ కల్పిత కృత్రిమ రచనల పట్ల భయం దేనికి అనేది ప్రశ్న. సగటు పాఠకుడికి ఆ మీడియోకర్‌ రచనే బాగుందనిపించొచ్చు. ఇక అదే ప్రమాణం అయ్యి, ‘అసలు’ది తీర్పునకు లోనవుతుందేమోనని ఒక సృజనాత్మక భయం!

త్రిపురనేని గోపీచంద్‌ నవల ‘పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా’లో ఒక పాత్రను ‘సజ్జలు సజ్జలు’ అని వెక్కిరిస్తారు అతడి సాహిత్య మిత్రులు. కోడి సజ్జలు తిని సజ్జలు విసర్జిస్తుంది, ఏమీ జీర్ణం చేసుకోకుండానే. ఎంతో మేధావిగా కనబడే ఆ రచయిత, ఏదీ తనలోకి ఇంకించుకోకుండానే మాటలు వల్లెవేస్తుంటాడని వారి ఉద్దేశం అనుకోవాలి. ఏఐ రచనలకు ఈ ఉదాహరణ బాగా పనికొస్తుంది. అయితే, అసలు ఇప్పుడు ఉన్నది ఇంకా ‘ఆదిమ’ ఏఐ మాత్రమేననీ, మున్ముందు ఇంకా ఆధునికం అవుతుందనీ చెబుతున్నారు. అప్పుడు అది ఏ రూపం తీసుకుంటుందో! ప్రస్తుత భయం రచయితను పక్కనపెట్టడం గురించే. మున్ముందు మనిషినే పక్కన పెట్టడం అవుతుందేమో! అప్పుడు సమస్త మానవాళి మరొక బహిరంగ లేఖ రాసుకోవాల్సి ఉంటుంది!

(21-7-25)

No comments:

Post a Comment