Wednesday, July 23, 2025

కేరళ సాహిత్య యాత్ర


మలబారు యాత్ర


వైకోం మహమ్మద్‌ బషీర్‌ తమ ఇంటిముందున్న వంగమామిడి చెట్టుకింద కూర్చుని రాసేవారట. ఆ చెట్టు గాలిని పీల్చే ‘మా తాతకో ఏనుగుండేది’,  ‘చిన్ననాటి నేస్తం’, ‘గోడలు’ లాంటి ఆయన రచనలు ఊపిరి పోసుకున్నాయి. బషీర్‌ అభిమానులకు ఆ చెట్టును చూడటం గొప్ప సంతోషం. అంతేనా? ఆయన విన్న గ్రామ్‌ఫోన్‌ రికార్డు, ఆయన సేదతీరిన ఆరాం కుర్చీ కూడా ప్రత్యేకమే. బషీర్‌ను ఆయన జన్మించిన బేపూర్‌ను బట్టి బేపూర్‌ సుల్తాన్‌ అంటారు. ఆయన వస్తువులు, ఆయన జీవితాన్ని తెలియజెప్పే విశేషాలతో ఆ ఊళ్లో కేరళ ప్రభుత్వం ఒక మెమోరియల్‌ నిర్మిస్తోంది. బషీర్‌ క్లాసిక్‌ అయిన ‘ప్రేమలేఖనం’ నవలలో దంపతులు తమ చిన్నారికి పెట్టుకున్న ఆకాశమిఠాయి పేరునే ఈ స్మారక కేంద్రానికి ఉంచారు. ఒక రచయితకు మెమోరియల్‌ నిర్మించడం దానికదే విశేషమే అయినా, నిత్య సాహిత్య రాష్ట్రమైన కేరళ తన సాహిత్య స్పృహను మరో స్థాయికి తీసుకెళ్లింది. రచయితల మెమోరియల్స్‌ను కలుపుతూ దేశంలోనే తొట్టతొలి సాహిత్య యాత్రకు శ్రీకారం చుడుతోంది. ‘మలబార్‌ లిటెరరీ టూరిజం సర్క్యూట్‌’ పేరుతో ఈ యాత్ర కోళికోడ్, మలప్పురం, పాలక్కాడ్‌ జిల్లాలను కవర్‌ చేస్తుంది.

మలయాళ సాహిత్యంలో ప్రాచీన కవిత్రయంలో ఒకరిగా పిలిచే, ఆధునిక మలయాళ సాహిత్య పితామహుడిగానూ కొలిచే 16వ శతాబ్దపు కవి, భాషావేత్త తుంచాత్తు రామానుజన్‌ ఎలుత్తాచ్చన్‌ గ్రామమైన తుంజన్‌ పరంబు మలబారు ప్రాంతంలోనే ఉంది. విజయదశమి రోజున చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల అక్షరాభ్యాసం కోసం ఈ గ్రామాన్ని దర్శించుకుంటారు. ఈ మలబారు ప్రాంతంలోనే జ్ఞానపీuЇ పురస్కార గ్రహీత ఎం.టి.వాసుదేవన్‌ నాయర్‌; రచయిత, కార్టూనిస్ట్‌ ఒ.వి.విజయన్‌; ప్రఖ్యాత యాత్రాసాహిత్య కర్త ఎస్‌.కె.పొట్టెక్కాట్‌; మరో కవి, జ్ఞానపీఠ గ్రహీత అఖితం అచ్యుతన్‌ నంబూద్రి లాంటివారి స్మారక కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ఇవి భిన్న దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వాటన్నింటినీ అభిమానులు కలయదిరిగేలా, రచయితల పుస్తకంలో ప్రాణం పోసుకున్న ప్రాంతాలను ప్రత్యక్షంగా అనుభవించేలా, మానవ ఉద్వేగాలన్నీ కాగితాల్లోకి ఎలా బదిలీ అయ్యాయో తెలుసుకునేలా కేరళ పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. 2021లోనే ఈ ప్రాజెక్టుకు బడ్జెట్‌ కేటాయింపులు జరపగా, ఈ సంవత్సరం మధ్యకల్లా దీన్ని ప్రారంభించే అవకాశం ఉంది. కోళికోడ్‌ను యునెస్కో భారతదేశ తొట్టతొలి సాహిత్య నగరంగా గుర్తించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ వల్ల ఆ నగర ఘనత మరింతగా ఇనుమడిస్తుంది.

లండన్‌లోని షేక్‌స్పియర్‌ స్మారక కేంద్రాన్ని ఏటా పాతిక లక్షల మంది సందర్శిస్తారు. యూకేలో భిన్న లిటెరరీ సర్క్యూట్స్, వాటికి తగిన ఏర్పాట్లు ఉన్నాయి. దక్షిణ అమెరికాలోని కొలంబియాలో మ్యూజియంగా మార్చిన గాబ్రియేల్‌ గార్సియా మార్క్వేజ్‌ ఇల్లు, ఆయన చదివిన పాఠశాల, ఆయన వెళ్లిన గ్రంథాలయం... ఇలా ఆయన ‘వన్‌ హండ్రెడ్‌ ఇయర్స్‌ ఆఫ్‌ సాలిట్యూడ్‌’కు ప్రేరణగా నిలిచిన అన్ని ప్రదేశాలను కలుపుతూ ప్రయాణించవచ్చు. ప్రముఖ మలయాళ సాహిత్యకారులకు కూడా జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు ఉంది. వీళ్ల రచనలు భిన్న భారతీయ భాషలతో పాటు, ఆంగ్లం, ఇతర ప్రపంచ భాషల్లోకి అనువాదమయ్యాయి. దానికి తగ్గ ఉత్సాహం, ప్రోత్సాహం అక్కడ ఉన్నాయి. అందుకే సందర్శకులు భిన్న ప్రాంతాల నుంచి వచ్చే అవకాశం ఉంది. మరి తెలుగు రచయితల పరిస్థితి ఏమిటి? ముందు తెలుగు రచయితలను తెలుగువాళ్లకు పరిచయం చేయడమే పెద్ద సవాలు కావొచ్చు.

వైజాగ్‌ వైపు వెళ్లే కొందరు సాహిత్యాభిమానులు ప్రత్యేకించి భీమిలి వెళ్లొస్తారు చలం ఇంటి కోసం. విజయనగరం వైపు పోయేవాళ్లు గురజాడ గృహాన్ని దర్శించవచ్చు. అదే విశాఖపట్నానితో ముడిపడిన శ్రీశ్రీ, రావిశాస్త్రిలను ముడేస్తూ, అటుగా శ్రీకాకుళంలోని కథానిలయంతో కరచాలనం చేసేలా ఉత్తరాంధ్ర సాహితీయానం చేయగలిగితే ఎలా ఉంటుంది? పోతన, దాశరథి, కాళోజీ లాంటి వాళ్లను తలుచుకోగలిగే వరంగల్‌ సాహిత్య టూర్‌ ఎందుకు ఉండకూడదు? రచయితలను ప్రాంతాల వారీగానో, జిల్లాల వారీగానో అనుసంధానం చేసే సాహిత్య టూర్లను ఆశించడం తెలుగు నేల మీద మరీ అత్యాశా? కానీ ఎంతమంది రచయితలకు మెమోరియల్స్‌ ఉన్నాయి? కనీసం విగ్రహాలైనా ఉన్నాయా? కువెంపు విమానాశ్రయం(శివమొగ్గ) అని కన్నడవాళ్లు పెట్టుకున్నట్టుగా తెలుగు నేల మీద అలా ఒక రచయితకు గౌరవం దక్కుతుందా?

ప్రాచీన ప్రపంచంలో ఈజిప్టులోని అలెగ్జాండ్రియా లైబ్రరీ ఒక జ్ఞానధామం. క్రీ.పూ. మూడో శతాబ్దానికి చెందిన ఇది ఆ కాలపు గొప్ప పండితులందరికీ నిత్య సందర్శనా స్థలం. అమెజాన్‌ కంపెనీ తన వర్చువల్‌ అసిస్టెంట్‌ను ప్రారంభించినప్పుడు దాని పేరును అలెగ్జాండ్రియాకు నివాళిగా ఎన్నుకుంది. అట్లా ‘అలెక్సా’ చాలామంది జీవితాలకు చేరువైంది. సాహిత్యంతో పరిచయం లేదనుకునేవాళ్లు కూడా దాని ఫలాలను ఇంకో రూపంలో అనుభవిస్తూనే ఉంటారు. ‘పోషణ, ఆవాసం, సాహచర్యం తర్వాత ఈ ప్రపంచంలో మనకు అత్యంతగా కావాల్సింది కథలు’ అంటాడు ఫిలిప్‌ పుల్‌మాన్‌. ‘రచయితలో కన్నీళ్లు లేకపోతే పాఠకుడిలో కన్నీళ్లు లేవు. రచయితలో ఆశ్చర్యం లేకపోతే పాఠకుడిలో ఆశ్చర్యం లేదు’ అంటాడు రాబర్ట్‌ ఫ్రాస్ట్‌. రచయితలో ఉన్నదే పాఠకుడికి అందుతుంది. రచయితలో ఉన్నదంతా కూడా పాఠకుడికి బదిలీ అవుతుంది. సాహిత్యం అనేది మన అంతరాత్మలను వెలిగించే అదృశ్య దివ్వె. అందుకే సాహిత్య సృష్టికర్తలను తలుచుకునే ఏ ప్రయత్నం అయినా ప్రాధాన్యత కలిగినదే, దానికోసం తీసుకునే ఏ చొరవైనా విలువైనదే!

(సాక్షి, ఏప్రిల్‌ 28, 2025)
 

No comments:

Post a Comment