ఇది కొంచెం ఇబ్బందేనబ్బా!
"ఇది బాగుంది' అన్నామంటే, ఎంతయినా స్నేహితుడిది కదా, బాగాలేదని ఎలా చెబుతాడూ అనే అవకాశం ఉంది.
కాబట్టి మిత్రుడి వర్కుని జడ్జి చేయటం కష్టమే. నిజానికి, జడ్జ్ చేయడం కష్టం కాకపోవచ్చు, చేసిందాన్ని నిజంగానే బాగాచెప్పాడు అనిపించేట్టుగా ఎదుటివాళ్లను మెప్పించడం కష్టం.
నా మిత్రుడు క్రాంతి తీసిన కాలాచష్మా షార్ట్ ఫిలిం గురించి నాలుగు మాటలు చెబుదామనుకున్నప్పుడు ఎదురైన సమస్య ఇది.
మొన్న హైదరాబాద్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ జరగబోతోందని అనౌన్స్ మెంట్ రాగానే సాక్షి తరఫున పంపిన నాలుగు లఘుచిత్రాల్లో ఒకదానికి దర్శకత్వం వహించే అవకాశం క్రాంతికి వచ్చింది. సాక్షి టీవీ తొలి యానివర్సరీ సహా కొన్ని ప్రోమోస్ చేసిన ప్రొడ్యూసర్-గా తనకు అది సహజం కూడా.
అప్పట్నుంచి, స్టోరీ గురించి ఎక్సయిటింగుగా చర్చించడం, ఏ షాట్ ఏ యాంగిల్లో తీయబోతున్నాడో చెప్పడం, క్యాస్టింగ్ గురించి వెతకడం, ఎప్పుడో తెలిసిన వెంకన్నను తండ్రి పాత్రకు కరెక్టు అనుకోవడం, పిల్లాడి వేషం కోసం ఒకట్రెండు డిజప్పాయింటుమెంట్లు కావడం, లొకేషన్ బాగా దొరికిందని సంబరంగా చెప్పడం, డబ్బింగ్ చెప్పించడం, పోస్టర్లు వేయించడం... 'అన్నయ్యా, అనుకున్నట్టుగా వస్తోంది' అని మధ్యమధ్యలో ఉద్వేగంగా పంచుకోవడం... ప్రతి దశా నాకు తెలుసు.
కాగితం మీద ఉన్నప్పుడే నాకు సినిమా ఏంటో తెలుసు కాబట్టి, అంతా అయ్యి, నాకు ఎడిటింగ్ రూమ్-లో ప్రత్యేకంగా చూపిస్తే, నేనేమీ ఎక్సయిట్ అవ్వలేదు. ఇలాగే చేస్తాడని నాకు తెలుసు కదా!
పైన పెట్టిన టైటిల్ ఈ ఫిలింలోని పిల్లవాడు అలీకి, దర్శకుడు క్రాంతికీ ఇద్దరికీ వర్తిస్తుంది.
కళ్లద్దం పగులుతుంది. దానిలాగే ఈ కలా పగిలింది. ఏదీ? ఏదో విభాగంలోనైనా తనకు అవార్డు వస్తుందని క్రాంతి ఎదురుచూశాడు. వచ్చిన 285 ఎంట్రీల్లో స్క్రీనింగుకు సెలక్టు అయిన 50లో ఉండటం ఒక విజయమే, కాబట్టి, అవార్డు రాలేదని బాధపడటం అనవసరం అని ఓదార్చాల్సి వచ్చింది. అంత చిన్న పిల్లాడిలా తను బాధపడటం అవసరం లేదుగానీ, తన వర్కుని తాను అంతగా ప్రేమించాడు. అదీ సమస్య!
ఎంత ప్రేమించాడో ఈ లింకులో చూడొచ్చు.
దర్శకుడిగా మనకు ఏం తెలుసో, ఏం తెలియదో, తెలుసుకునే అవకాశాన్ని ఇలాంటి లఘుచిత్రాలు ఇస్తాయి. కాబట్టి, ఈ 'ఏడు నిమిషాలకు మించనిది' మొదటి రీలే. ఇంకా పదమూడు తీయాల్సి ఉంది మిత్రమా, సాగిపో!
No comments:
Post a Comment