Friday, July 9, 2010

నా చదువు ముచ్చట్లు అనబడే ఓ ఇంటర్వ్యూ.

అప్పుడెప్పుడో దుప్పల రవిగారు తన బ్లాగు కోసం కొన్ని ప్రశ్నలు పంపి జవాబు రాయమని అడిగారు. అది ఇంటర్వ్యూ అని కూడా చెప్పారు. స్కూలు పిల్లాడిలా బుద్ధిగా రాసిచ్చాను.
దాన్ని కూడా నా బ్లాగులో చెప్పవచ్చని నిన్నే ఆలోచన వచ్చింది. అందుకే ఈ దిగువ లింకు ఇస్తున్నాను.
అయితే, రవిగారు అందులో ఓ సస్పెన్సు ఏదో పెట్టారు. కాని అది ఇక్కడ బ్రేక్ అవుతోంది. నాకు ఇంతకంటే మార్గం లేదు కూడా.
ఇవీ నా చదువు ముచ్చట్లు.

తెలుగు దినపత్రికల లోకంలో ఒక విచిత్రమైన వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో “సాక్షి” రావడంతో ఇటు జర్నలిస్టుల, అటు నాన్-జర్నలిస్టుల జీవితాలు బాగుపడడం మొదట కనిపించిన మార్పు. ‘అవతలి కోణం’ ఇప్పుడు పాఠకులకు తెలియరావడం రెండో సంగతి. అంతర్జాతీయ స్థాయి జర్నలిజపు, పత్రికా మేకప్పూ తదితర హంగులు, రూపులూ మనకు కూడా తెలియడం మూడో ముచ్చట. వీటన్నింటిని పక్కనపెడితే వార్తలను, ఫీచర్లను కలగలిపేసిన తెలుగు పాత్రికేయాన్ని ఆ చెరనుంచి రక్షించ ప్రయత్నం చేస్తోంది సాక్షి”. అందుకు ఉదాహరణలుగా నిలుస్తున్న కలాలే ఖదీర్ బాబు, యాసీన్, యాకూబ్ పాషా, మాధవ్ శింగరాజు, మాధవీకళ, తదితరులు. ఈ కుర్ర హీరోల పేర్ల జాబితాలో నేను కావాలని వదిలేసిన పేరోదో మీరు చెప్పుకోండి. ప్రతి మాటలోనూ భావుకత, లాలిత్యం ఉట్టిపడేలా అక్షరాలను చెక్కే ఆ యువ రచయిత చదువు ముచ్చట్లు ఈ వారం మీకోసం… (పేరు ప్రశ్నజవాబుల కిందనుంది – ముందు జవాబులు చదివి తర్వాతే పేరు చూడండేం!)

1. మీకు బాగా బోర్ కొట్టించిన పుస్తకం, రచయిత ఎవరు? (ఎందుకు చదివానురా బాబూ అనిపించాలి)

కొన్ని బోర్ కొడుతూనే ఉంటాయి. ఆ పుస్తకం చదవడం నాకు లక్ష్యమైతే, భరించి చదువుతా. లేదంటే పక్కన పడేస్తా. కాబట్టి సరైన జవాబివ్వలేను.

2. ఇటీవల కొన్న పుస్తకం, చదవడం పూర్తి చేసిన పుస్తకమేది?

మరీ ముఖ్యం అనుకుంటే తప్ప పుస్తకం కొనట్లేదు. నా చేతికొచ్చినవి మాత్రం చదువుతాను. అయితే, ఇటీవల వైజాగ్ వెళ్లినప్పుడు భీమిలిలోని సౌరిస్ ఆశ్రమంలో కొన్ని పుస్తకాలు కొన్నా. చలం మిత్రులు, భగవాన్ పాదాలముందు, స్త్రీ, మహేంద్ర, సుధాచలం, చలం-భగవద్గీత. (ఒకేరోజు తీసుకున్నవి కాబట్టి ఒక్క పేరు చెప్పలేకపోతున్నా.) నిన్నే చదవడం పూర్తి చేసింది – ముళ్లపూడి ‘కోతి కొమ్మచ్చి’.

3. మీ లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయి?

నా వ్యక్తిగత లైబ్రరీలో ఎన్ని ఉన్నాయో సరిగ్గా చెప్పలేను. చెత్తాపుత్తడీ కలిపి ఓ 300?

సారీ సారీ… ఇంటర్నెట్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్నవీ – పుస్తకాకారంలో ఉండనివీ – మరో 100 – 150 అయినా ఉంటాయి.

4. చాలా రోజులుగా చదవాలనుకుంటూ చదవలేకపోతున్న పుస్తకాలు ఏమిటి?

అట్లాంటివి ఏమీ ఉన్నట్టు లేదు. ముందు జవాబులోని డౌన్ లోడెడ్ ‘బుక్స్’ చదవడానికి టైమ్ చాలక, చదవలేకపోతున్నా.

5. మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు? పుస్తకాల పేర్లు చెప్పండి.

బుచ్చిబాబు, చలం, గోపీచంద్, కుటుంబరావు, రావిశాస్త్రి, యండమూరి, టాల్ స్టాయ్…

అల్పజీవి, అసమర్థుని జీవయాత్ర, చదువు, చివరికి మిగిలేది, అన్నా కరేనినా, గడ్డిపరకతో విప్లవం, అంతర్ముఖం, గోదాన్, ఏడుతరాలు, గోపాత్రుడు, ఓల్గానుంచి గంగకు, రైలుబడి, పురూరవ, విరాట్

6. మీ స్నేహితులకు ఈ ఏడాది ఎన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు? మీరెన్ని పుచ్చుకున్నారు?

ఐదిచ్చాను. ఒక్కటి పుచ్చుకున్నాను. (నష్టమే!)

(ఒక జర్నలిస్టుగా వచ్చే కాంప్లిమెంటరీ కాపీలను ఇందులోంచి మినహాయించాను. దాని లెక్కలు వేరు కాబట్టి)

7. ఇపుడున్న పత్రికలలో మీరు నచ్చే పత్రిక ఏది? మెచ్చని పత్రిక ఏది?

నచ్చే పత్రిక ‘హిందూ’. హడావుడి చెయ్యదు. తనదైన మార్గంలో వెళ్లిపోతుంటుంది. నాకు పెద్దగా పత్రికలు చదివే అలవాటు లేదు. కాబట్టి, నచ్చని పత్రిక గురించి చెప్పలేను.

8. జనం ఎంతో సీనిచ్చినా, మీకంతగా నచ్చని రచన ఏది?

బోల్డు. చిల్లరదేవుళ్లు, హిమవర్ష. (ఆ(.. ఇప్పుడు గుర్తొస్తోంది. లాంగ్ బ్యాక్… చండీదాస్ ‘అనుక్షణికం’ చదవలేక, బోరుకొట్టి వదిలేశాను. నిజానికి బోరు కూడా కాదేమో! ఒకలాంటి ఏహ్యభావం.)

అయితే ఈ ప్రశ్నకు జవాబివ్వడం ఇలా కాదనుకుంటా. ఫరెగ్జాంపుల్ ‘కన్యాశుల్కం’. అది చదవడానికి బాగుంటుంది. కానీ తెలుగు సాహిత్యానికి అదో… అదంటే నాకు చీమ కుట్టినట్టయినా ఉండదు. మైదానం క్లాసిక్ అంటారు. నాకు దానితో విభేదాలున్నాయి.

ఈ నచ్చడం, నచ్చకపోవడం మీదే ఇంకొంచెం వివరణ ఇవ్వాలనిపిస్తోంది. చండీదాస్ వి నచ్చలేదని అన్నానా! కాని, ఇన్ని రోజులు గుర్తుంచుకున్నానంటేనే, వాటికి ఏదో ప్రత్యేకత ఉందనేమో! నేను తొమ్మిదో క్లాసులో ఉన్నప్పుడు ‘సమర్పణ’ అనే ఓ అనామక సినిమా చూశాను. అది చూశాక ఏమనుకున్నానంటే, ఇంతవరకూ నా జీవితంలో చూసిన అత్యంత చెత్త సినిమా ఇదేనని. కాని దాన్ని మరిచిపోలేదు. మేకింగ్ పరంగా, ఇతరత్రా ఏ కారణాలతో చూసినా అది నాణ్యమైన సినిమా ఏంకాదు. అయినా అది నన్ను హాంట్ చేస్తూనే ఉంది. ఆఖరికి దశాబ్దం తర్వాత – ఆ సినిమాలోని క్రూడ్ రియాలిటీని నేను అంగీకరించే మానసిక స్థితికి వచ్చాక ఆ సినిమాను, దాని దర్శకుడు లోక్ చందర్ (ఈ మ్మీద ఇంకెవరికైనా ఇలాంటి పేరున్న దర్శకుడు ఉన్నాడని తెలుసో లేదో!)ను గౌరవించడం మొదలుపెట్టాను.

9. ప్రస్తుతం చదువుతున్న పుస్తకమేమిటి?

ఇవ్వాళ పొద్దున మొదలుపెట్టింది – “మహేంద్ర”.

10. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకాలేవి?

గడ్డిపరకతో విప్లవం, అన్నా కరేనినా. (ఇవి రెండూ నిజానికి నన్ను ప్రత్యేకంగా ప్రభావితం చేసిన పుస్తకలు కాదు. నాలో ఉన్నఏన్నో అభిప్రాయాలను బలపరిచినవి. లేదూ ఇవన్నీ నావే అని నన్ను నాతోనే గుర్తించేలా చేసినవి).

2 comments:

  1. చండీదాస్ నవల్లు నచ్చలేదా? ఆశ్చర్యమే.

    ReplyDelete
  2. కొత్తపాళీ గారు,
    అది నచ్చకపోవడం కూడా కాదు. దాని దగ్గరకు పోవడానికి కూడా ఇష్టపడనటువంటి రోత లాంటిదేదో! అందుకే దాన్ని అంతగా విడమరిచి చెప్పానక్కడ. కాని ఆశ్చర్యంగా నాకు చండీదాసు అంటే చాలా అభిమానం ఉంది. అది ఆయన రచనలకంటే, ఆయన గడిపిన మార్మిక జీవితం వల్ల కావొచ్చు.

    ReplyDelete