Friday, July 23, 2010

అసలు లవ్ కెమిస్ట్రీ ఎలా కుదురుతుంది?

మనుషులు ఎందుకు ప్రేమించుకుంటారు?
ప్రేమలో నిండా మునిగినవారు కూడా దీనికి సమాధానం చెప్పలేకపోవచ్చు. దేవులపల్లి అంతటివాడే-

సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు?
చంద్రికల నేల వెదజల్లు చందమామ?
ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?
ఏల నా Hruదయంబు ప్రేమించు నిన్ను?

అన్నారు.

చూడకుండా నిమిషమైనా ఉండలేమన్నంతగా, దూరమైతే క్షణం కూడా బతకలేమన్నంతగా ఎదుటివారిలో ఏం నచ్చిందీ అని నిలదీసి అడిగితే, కారణాలు చెప్పడం ఎవరికైనా కష్టమే. ఇతరులకు కనబడని ప్రత్యేకమైందేదో మనకు మాత్రమే కనబడిందని కన్విన్స్ చేయడం కత్తిమీద సామే. అందుకే ప్రేమలో లాజిక్కులు, రీజనింగులు పనిచేయవు. ప్రేమ వెర్బా... నౌనా... అన్న పట్టింపులుండవు. అదో జరిగి తీరాల్సిన ప్రక్రియలా ప్రేమలో పడొచ్చు.

అయితే ప్రేమలో ఎందుకు పడతారు? అప్పుడు ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నలకు శరీరంలోని రసాయనాలు పెట్టే గిలిగింతలే కారణమంటున్నారు శాస్త్రవేత్తలు. అపోజిట్ సెక్సుని చూసినప్పుడు చెమట పట్టడం, గొంతు తడారిపోవడం, ఎటూ తోచక పోవడం జరుగుతుంది. వీటినే లవ్ సింప్టమ్స్ అంటారు. శరీరంలో విడుదలయ్యే పెనీలిథాలమైన్ ఈ ప్రేమజబ్బుకు కారణం. ఇక ఇది ఆరంభమైందంటే చాలు...

ఆమె దగ్గర్లో కూర్చుంటే అటువైపు ముఖం తిప్పకుండా ఏ శక్తీ ఆపలేదు. అడ్రెనలిన్ ఉప్పెనలా ఎగజిమ్మి అటు చూసేట్టుగా బలవంతపెడుతుంది మరి! దీనితో నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంకానికి తెరలేస్తుంది. అంటే మూగసైగలు... ఓరచూపులు... అన్నమాట! ఈ ప్రత్యేక భాష ఫెరోమైన్స్ వల్ల పుడుతుంది. చూడ్డంతోనే ఆగిపోతే లవ్ స్టోరీ ఏముంటుంది?

దగ్గరగా కూర్చోవాలనిపిస్తుంది. తాకాలనిపిస్తుంది. ఏదో మిషమీద పైన చేయి వేయాలనిపిస్తుంది. ఈ చిలిపి చేష్టలన్నింటికీ ఆక్సిటోసిన్-దే తప్పు. అమ్మాయి కలలోకొచ్చినా, అదోలా చూసినా, తను మన పరిసరాల్లోనే ఉందని తెలిసినా ఇది విడుదలైపోతుంది. అక్కడికి పరుగెత్తిస్తుంది.

గంటల తరబడి మాట్లాడటం, విషయం ఏం లేకపోయినా పడీపడీ నవ్వుకోవడం, ఎంతకీ చాలనిపించకపోవడం, ఎదుటివారు చెప్పింది చాలా గొప్ప విషయంగా తోచడం, ఆవలింత కూడా అందంగా కనబడటం... ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటే ఆ క్రెడిట్ తీసుకోవాల్సింది నోరెపైనేఫెరైన్. ఈ లక్షణాలు మరీ ఎక్కువ కనిపిస్తున్నాయంటే శుభలేఖలు అచ్చు వేయించాల్సిందే.

ఇక పెళ్లయిన కొత్తలో ఉక్కిరిబిక్కిరి చేసే విరహానికి కారణం డోపమైన్. ఆ హనీమూన్ కాస్తా అయిపోయిందంటే దీని విడుదల ఆగిపోతుంది. భాగస్వామిపై విపరీతమైన కాంక్షను కలిగించడంలో టెస్టోస్టిరాన్ కూడా ఏం తక్కువ తిన్లేదు.

ఇక ఒకరిని వదిలిపెట్టి మరొకరిని చూసుకోవాలనే ఉబలాటానికి బ్లేమ్ చేయాల్సింది వాసోప్రెస్సిన్ రసాయనాన్నే. ఇది మనలో చాలా తక్కువగా ఉంది. ఒకరిని ఒక్కరికే కట్టడి చేయగలిగే మహత్తర శక్తి ప్రపంచంలో దీనికే మాత్రమే ఉందిట!
అయితే బియ్యం పాతబడ్డకొద్దీ అన్నం ఎదిగివచ్చినట్టు కాలం గడుస్తున్నకొద్దీ అనుబంధం బలోపేతమవుతుంది. దీనికి ఎండార్ఫిన్స్ కీలకం. ప్రేమించిన వ్యక్తి దూరమైనప్పుడు తట్టుకోలేక ఏడ్చెయ్యడానికి కారణమివే!

...........................................
(అదీ సంగతి!)
(ఈ ఐటెమ్ నేను 2005లో ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రేమికుల రోజు కోసం రాసిన చిన్న బాక్స్. అప్పటి హెడ్డింగ్: లవ్ కెమిస్ట్రీ. మెయిన్ ఐటెమ్ నా కొలీగ్ స్వాతి(ప్రస్తుతం హిందూలో చేస్తోంది) రాసింది.)
(గతంలో ఇది ఈ బ్లాగులోనే ఇమేజ్ రూపంలో ఉండేది. దాన్ని తొలగించి ఇలా రీ-పోస్టు చేస్తున్నా.)

3 comments:

 1. రాజిరెడ్డి గారూ,
  మీ 'చినుకు రాలినది' కథకు పరామర్శ - ఆగస్టు కౌముది కథాసాగరం లో ఉంది. చూశారా?
  www.koumudi.net choodandi....
  - సత్యాజీ.

  ReplyDelete
 2. సత్యాజీ,
  ఆ పరామర్శ చదివాను. అయినా, సమాచారం తెలిపినందుకు థాంక్యూ.

  ReplyDelete
 3. Anonymous9.2.13

  lifelo blog choodatam ide modatisaari. prema gurinchi meeru raasindi aksharaalaa nijamanipistondi... kaakapothe nenu ammaayini, premani alaa andukunnatte andukuni pogottukunnaa

  ReplyDelete