ఎం.ఎస్.స్వామినాథన్:
(జీవిత చరిత్ర)
––––
రచన:
ప్రియంవద జయకుమార్
ఉన్నత విద్యావంతులున్న ఉమ్మడి వ్యవసాయ కుటుంబంలో మోన్‌కోంబు సాంబశివన్ స్వామినాథన్ జన్మించారు(తమిళనాడు, 1925). తండ్రి బాటలో మెడిసిన్ చదివి కుంభకోణంలోని వాళ్ల హాస్పిటల్‌ను నడిపే అవకాశం; ఐపీఎస్‌కు ఎంపికైనందున అటు వైపుగానూ కెరీర్ మలుచుకునే వీలు ఆయనకు ఉండినాయి. కానీ లక్షల మంది చావులకు కారణమైన బెంగాల్ క్షామం(1943) వేసిన ముద్ర ఆయన్ని వ్యవసాయం వైపు నడిపించింది. వ్యవసాయ శాస్త్రవేత్తగా, జన్యుశాస్త్ర నిపుణుడిగా ఆయన చేసిన కృషిని చెప్పే పుస్తకం ‘ఎం.ఎస్.స్వామినాథన్: ద మ్యాన్ హూ ఫెడ్ ఇండియా’. ఇది ఆయన మేనకోడలు రాసిన ఆయన జీవిత కథ.
స్వాతంత్య్రానంతర భారతదేశం దశాబ్దాల పాటు ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య... తిండి గింజల కరువు. ‘ఏదైనా ఆగుతుంది కానీ వ్యవసాయం ఆగదు’ అన్నారు నెహ్రూ. సోమవారాలు పస్తులుండమని జనానికి పిలుపునిచ్చారు లాల్ బహదూర్ శాస్త్రి. ‘బ్లడీ అమెరికన్ల’ ముందు చేయి చాచకుండా ఉండే మార్గాల కోసం వెతికారు ఇందిరా గాంధీ. ఒక దశలో ‘పీఎల్ 480’ పథకం కింద అమెరికా పంపే గోధుమలే దిక్కు. ఓడలు దిగితేగానీ నోళ్లు ఆడని పరిస్థితి. ఈ దిగుమతులకు చెల్లించాల్సిన మూల్యం విదేశాంగ విధానంలో స్వతంత్రంగా నిలబడలేకపోవడం. అలాంటి స్థితిగతుల్లో ‘ఆకలి నుంచి స్వేచ్ఛే అన్నింటికన్నా గొప్ప స్వేచ్ఛ’ అన్నట్టుగా, స్వామినాథన్ దేశంలో హరిత విప్లవానికి బాటలు పరిచారు. ‘చరిత్ర ఆయనకు అవకాశం ఇచ్చింది, దాన్ని ఆయన రెండు చేతులా అందుకున్నారు’ అంటారు రచయిత్రి.
గాలికి పడిపోకుండా నిలబడే పొట్టి రకం గోధుమల మీద గామా కిరణాలతో ‘ఐండియన్ అగ్రికల్చర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’లో స్వామినాథన్ ప్రయోగాలు చేశారు. దానికోసం ‘ఆటమిక్ ఎనర్జీ కమిషన్’ సాయంతో ‘గామా గార్డెన్’ ఏర్పాటుచేశారు. వ్యవసాయం కోసం అన్ని రంగాలు సహకరించుకోవాలంటారాయన. ఈ దశలోనే పొట్టి రకం హైబ్రిడ్ గోధుమలను మెక్సికోలో నార్మన్ బోర్లాగ్ విజయవంతంగా పరీక్షించారని తెలిసి, స్వామినాథన్ ఆయనకు ఉత్తరం రాశారు(1963). దానివల్ల పదేళ్ల కాలం కలిసొస్తుందనేది ఆయన ఆలోచన. ఇక వంద కేజీల చొప్పున వచ్చిన ఆ నాలుగు రకాల విత్తనాలను ఇక్కడి నేలలకు అనుగుణంగా కల్యాణ్ సోనా, సోనాలిక లాంటి విత్తనాలుగా మార్చి, వ్యవస్థలోని అన్ని అడ్డంకులను అధిగమించి, రైతుల అనుమానాలను తీర్చి, దిగుబడుల ‘చమత్కారాన్ని’ చూపించి, ఇండియా వచ్చిన నార్మన్ బోర్లాగ్‌నే ఆశ్చర్యపరిచేలా చేశారు స్వామినాథన్. నాలుగు హెక్టార్లతో మొదలైన ప్రయోగం, 1968 నాటికి పది లక్షల హెక్టార్లకు విస్తరించింది. ఈ మధ్యలోనే విక్రమ్ సారాభాయి సహకారంతో రైతుల కోసం దూరదర్శన్‌లో ‘కృషి దర్శన్’ మొదలైంది(1967). సైన్సు శక్తి, విధాన నిర్ణయం, రైతుల ఉత్సాహం– ఈ మూడూ కలగలిసి ‘యూఎస్‌ఎయిడ్’కు చెందిన విలియమ్ గాడ్ నోటి నుంచి తొలిసారిగా వెలువడిన మాట ‘గ్రీన్ రివొల్యూషన్’ అనేది విజయవంతమైంది. అయితే, దాని ప్రతికూల ప్రభావాలు కూడా ఎంఎస్‌కు తెలుసు. అందుకే ‘ఎవర్‌గ్రీన్ రివొల్యూషన్’ కావాలని కాంక్షించారు.
1981లో ఫిలిప్పైన్స్‌లోని ‘ఇంటర్నేషనల్ రైస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’ డైరెక్టర్ జనరల్ పదవి ఆయన్ని వరించింది. ఆ స్థానంలోకి వెళ్లిన మొదటి ఆసియన్ ఆయన. ఐఆర్64 లాంటి పాపులర్ వరి రకం ఈ కాలంలోనే వచ్చింది. ప్రణాళికా సంఘం, వ్యవసాయ మంత్రిత్వ శాఖల్లోనూ పనిచేసిన స్వామినాథన్ పాత్ర ఇండియాకే పరిమితం కాలేదు. చైనా, పాకిస్తాన్, ఇండోనేషియా, మయన్మార్, ఈజిప్ట్, మడగాస్కర్, థాయిలాండ్, బంగ్లాదేశ్, టాంజానియా, ఇథియోపియా లాంటి ఎన్నో దేశాల్లో వరి పరిశోధనా కేంద్రాలు ఏర్పాటయ్యేలా సహకరించారు. టైమ్ మ్యాగజైన్ ప్రచురించిన అత్యంత ప్రభావశీల ఆసియన్ల జాబితాలోని ముగ్గురు భారతీయుల్లో స్వామినాథన్ ఒకరు (మిగిలిన ఇద్దరు: గాంధీజీ, టాగూర్). ‘పది జీవితాల్లో కూడా సాధించలేనిది ఆయన ఒక్క జీవితంలో సాధించారు’ అంటారు రచయిత్రి. ముగ్గురు కూతుళ్ల తండ్రిగా, స్వతంత్ర భావాలున్న భార్య మీనా భర్తగా ఆయన కుటుంబ విశేషాలు, ఆయన పదవిలో ఉన్నప్పుడు జరిగిన సంగతులను మేళవిస్తూ పది అధ్యాయాలుగా రాసిన పుస్తకమిది. గాంధేయవాదిగా, పర్యావరణవేత్తగా, వ్యవసాయంలో స్త్రీల పాత్ర తెలిసినవాడిగా ఆయనలోని బహుకోణాలు తెలుస్తాయి. ఫిలిప్పైన్స్ వదిలివచ్చేటప్పుడు టగలాంగ్‌లో వీడ్కోలు ఉపన్యాసం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు మీనా. రైతుల కోసం నియమించిన జాతీయ కమిషన్(స్వామినాథన్ కమిషన్‌గా పేరుపడింది)తో సహా కొన్ని పదుల కమిటీలకు చైర్మన్‌గా వ్యవహరించి; రామన్ మెగసెసే, వరల్డ్ ఫుడ్ ప్రైజ్, భారతరత్న లాంటి ఎన్నో గౌరవాలు పొందిన ఎంఎస్ తన జీవితంతోనే ఆశ్చర్యపరిచారు.










