Friday, November 21, 2025

Shattered Lands పరిచయం


(ఈమధ్య సాక్షి ఎడిటోరియల్‌ పేజీ కోసం కొన్ని ఆంగ్ల పుస్తకాల పరిచయాలు రాస్తున్నాను. రికార్డ్‌ కోసం వాటిని ఇక్కడ ఉంచుతున్నా. అందులో ఇది మొదటిది.)
 

పుస్తక ప్రపంచం


విభజన రేఖల చరిత్ర

భారతదేశ విభజన అంటే ‘హిందుస్థాన్‌’, పాకిస్తాన్‌గా విడిపోయిన నేల గురించే అనుకుంటాం. కానీ బ్రిటిష్‌ వారి పాలనలో, అదన్‌ రేవు (యెమెన్‌) నుంచి రంగూన్‌ వరకు, కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు అంతా ‘ఇండియన్‌ ఎంపైరే’! అందరూ ‘ఇండియన్సే’. రూపాయే అంతటా చెల్లుబాటయ్యేది. అంతటి నేల ఐదు సార్లు ఎలా విభజితమైందో చెప్పే పుస్తకం ‘షాటర్డ్‌ ల్యాండ్స్‌’. ఢిల్లీలో పెరిగిన స్కాట్‌లాండ్‌ చరిత్రకారుడు సామ్‌ డాల్రింపుల్‌ రచయిత.

గాంధీజీ అహింసా సిద్ధాంతాన్ని నమ్మిన బర్మా (బ్రహ్మదేశ్‌) నాయకుడు యు ఒట్టామా, బ్రిటిష్‌–బర్మా ‘అధిపతి’ బా మా భారత సామ్రాజ్యంలో బర్మా అంతర్భాగమని  పోరాడారు. కానీ స్వాతంత్య్రోద్యమ సెగ నుంచి తమను కాపాడుకోవడానికి, విభజన రాజకీయాల్లో భాగంగా బ్రిటిష్‌వారు 1937లో బర్మాను విడదీశారు. ‘ఆసియా రూపురేఖలను మార్చడానికి దేవుడు పంపిన మనిషి ముందు నేను మౌనంగా నిలబడ్డాను’ అంటాడు గల్ఫ్‌కు వచ్చిన గాంధీజీని చూస్తూ యెమన్‌ రచయిత మహమ్మద్‌ అలీ లుక్‌మాన్‌. కానీ తమను ‘మెయిన్‌ ల్యాండ్‌’ అంతగా పట్టించుకోవడం లేదన్న భావన అరబ్బుల్లో ఉండేది. ‘హిందూ జాతీయవాదుల’ దృష్టిలోనేమో పవిత్ర భరతభూమి అనుకునే భౌగోళిక హద్దుల్లో అరబ్బు ప్రాంతం లేదు. 1931లో అదన్‌ రేవును, 1947లో ‘పర్షియన్‌ గల్ఫ్‌’ను విడదీయడంతో ఆ బంధమూ ముగిసింది.

ఎన్నో రిఫరెన్సులతో ఒక ఉద్విగ్న చరిత్రను కళ్లముందు నిలబెట్టే ఈ 520 పేజీల పుస్తకం అధికంగా ఒక మాటగానైనా ఉనికిలో లేని ‘పాకిస్తాన్‌’ ఏర్పడటానికి దారితీసిన పరిస్థితులను చర్చిస్తుంది. వేల్స్, స్కాట్‌లాండ్‌ దేశాలు యూకేలో భాగమైనట్టుగానే, పాక్‌ కూడా ఇండియన్‌ యూనియన్‌లో స్వతంత్ర ప్రాంతంగా ఉండటానికి అంగీకరించిన జిన్నా తన మనసు మార్చుకోవడం, మత ద్వేషాలు కలగలిసి ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద మానవతా సంక్షోభం తలెత్తింది. రాడ్‌క్లిఫ్‌ లైన్‌ అన్న ఒక్క గీతతో జాతీయతలు మారిపోయాయి. లక్షలాది మంది మరణించారు, కోట్లాదిమంది నిరాశ్రయులయ్యారు.

చదరపు కిలోమీటరు విస్తీర్ణం కలిగిన అతిచిన్న సంస్థానాల నుంచి యూరప్‌ దేశాలంతటి పెద్దవైన సుమారు ఆరు వందల సంస్థానాలే ఇప్పటి ఇండియాకు ఈ రూపునిచ్చాయనేది వాస్తవం(నాలుగో విభజన–విలీనం). ‘శరీరం లేని రెండు రెక్కలతో’ మతం పేరుతో ఏర్పడిన పాకిస్తాన్‌ నుంచి భాష కారణంగా బంగ్లాదేశ్‌ విడిపోవడంతో పుస్తకం ముగుస్తుంది(ఐదో విభజన). 1931 నుంచి 1971 వరకు జరిగిన ఐదు విభజనలు ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మా, నేపాల్, భూటాన్,  యెమెన్, ఒమన్, యూఏఈ, ఖతార్, బహ్రయిన్, కువైట్‌ ఇప్పటి రీతిలో ఏర్పడటానికి కారణమైన పరిస్థితులను పుస్తకం లోతుగా వివరిస్తుంది. మనుషుల సూక్ష్మ వివరాలను జోడిస్తూ రాయడం వల్ల చారిత్రక నవలను చదివిన అనుభూతినిస్తుంది. ఈ ద్రవరూప సరిహద్దులు అనాదిగా ఇలాగే ఉన్నాయని నమ్మించడంలో రాజ్య ప్రయోజనాలు ఉన్నాయి; అందుకే గత ఉమ్మడి చరిత్ర పట్ల  దేశాలు మరుపును ప్రదర్శిస్తాయంటారు రచయిత. ఈ విభజనలకు బాధితులు మాత్రం ప్రజలు. ‘ఇండియన్స్‌’ తమ అవకాశాలను లాక్కుంటున్నారని బర్మాలో యు సా మొదలుపెట్టిన ప్రచారం హింసాత్మకమై లక్షలాది మంది కట్టుబట్టలతో ఆ నేలను వీడి వందల మైళ్లు నడుచుకుంటూ వచ్చారు. బెంగాలీ మహిళల మీద పాక్‌ సైన్యం జరిపిన అత్యాచారాల వల్ల 1,70,000 గర్భస్రావాలు జరగడం, 30,000 మంది ‘యుద్ధ శిశువులు’ పుట్టడం మానవత్వానికి మచ్చ. గల్ఫ్‌లోనూ జనాలు ఇబ్బందులు పడ్డారు.

కథ ఇక్కడితో ముగిసిందా? బెంగాల్‌ను ఒక దేశంగా చేయాలని సుహ్రవర్దీ పట్టుబట్టాడు. నాగాలాండ్‌ కోసం ఫిజో పోరాడాడు. ట్రావెన్‌కోర్, అండమాన్, ‘ప్రిన్సిస్థాన్‌’(సంస్థానాలన్నీ కలిపి), ‘అచ్యుతిస్థాన్‌(దళితుల కోసం) లాంటి దేశాలు కూడా ఒక దశలో ఆలోచనలుగా ఉన్నవే. కశ్మీర్, బలూచిస్తాన్, ‘రోహింగ్యా’ పోరాటాలు ఇప్పటి వాస్తవమే. కాబట్టి ఇది ఇంకా నడుస్తున్న చరిత్రే!


(8-9-2025)

 

No comments:

Post a Comment