Wednesday, November 12, 2025

గంగరాజం బిడ్డ కోవెటుకొచ్చింది...





(26-3-2025 నాటి గంటా వెంకట్‌ రెడ్డి ఎఫ్బీ పోస్ట్‌)

 

గంగరాజం బిడ్డ కోవెటుకొచ్చింది.

వచ్చే బస్సు పొయ్యే బస్సు. ఏదీ ఎక్కకుండా నా మటుకు నేను ఖైతాన్ బస్టాప్ లో పుస్తకం చదువుతూ కూర్చున్నాను. అందరూ ఫోన్ స్క్రీన్లను తుడుస్తా వుంటే, విచిత్రంగా నేనొక్కణ్ణే పుస్తకం తిరగేస్తా ఉన్నట్టుంది, 'ఏం బుక్కు' ఆరా తీశాడు అక్కడ బస్సులను కంట్రోల్ చేసే ఈజిప్ట్ మనిషి.
'గంగరాజం బిడ్డ' ఆంటి.
'ఏంది గాంధీ బిడ్డనా' అన్నాడు అయోమయంగా నా ఇండియా మొఖాన్ని ఎగాదిగా చూస్తూ అరబ్బీలో. కాదు కథల పుస్తకమని చెప్పాను.
తన చేతికి పుస్తకాన్ని తీసుకుని బాక్ కవర్ ఫొటో తీసుకుని గూగుల్ సహాయంతో 'మొత్తం సృష్టి విన్యాసాన్ని వ్యాఖ్యానించడానికి నువ్వి క్కడ లేవు, సరిపోవు' అనే వాక్యాన్ని తన భాష లోకి తర్జుమా చేసుకుని 'అద్భుతం' అన్నాడు.
ఇందులోని కథలన్నీ అద్భుతమే!

గంగరాజానికీ నాకూ ఒకటే తేడా! గంగరాజం మస్కట్ బోతే నేను కోవెటొచ్చినా. నా ఎద్దులమ్ముకొని నేను విమానామెక్కితే, గాటి మీద కాడెద్దులు సచ్చిపోయిన గంగరాజం అనుమానంతో ఎవుర్నో జంపి జైలు పాలై ఊరిడిసిపాయ.
మనతో పాటు బడిలో చేరిన పిల్లతో చిన్నప్పుడు అరమరికలు లేకుండా చదువులో, ఆటపాటల్లో కలసిపోతాం. హైస్కూల్లోకి వెళ్లేసరికి పైకి ఏదో దూరం పెరిగినట్టనిపిస్తుంది కానీ, లోపల తెలియని ఆకర్షణ మొదలవుతుంది. ఉన్నఫలంగా అదృష్యమైన ఆ పిల్ల, వారం పది రోజుల్లో పచ్చిపసుపుకొమ్ములా పైటా పావడతో దర్శనమిస్తే, గుండె గొంతులోకొచ్చినట్టు, గుండెకాయకు చమట పట్టినట్టూ అనిపిస్తుంది. ఏమోయ్ అన్నట్టు ఆ పిల్ల నొసలు ఎగరేసినా నోరు పెగలదు.
గంగరాజం బిడ్డ కథలో పూర్ణలతను ఆ పిలగాడు మళ్ళీ కలవాలని కొటకలాడింది నా పానం.

ఇంకా 'ఎఱుక' 'చిన్న సమస్య' కథలు కూడా అప్పుడప్పుడే ముక్కుకింద మూతి నల్లబడి బాల్యం నుండి యవ్వనంలోకి అడుగు పెట్టే పిల్లవాని దృష్టితో రాసినవి.
యవ్వనంలో తన ప్రేమను వెల్లడించాలనుకుని తనకలాదే యువకుని కథ 'చిలుము'. ఐతే మనిషి మనసుకు పట్టిన చిలుము వదలడం కష్టం కదా!
అందీ అందని అందాల అతివ అధరాన్ని అందుకుందామని ఆశపడ్డ వేళ, ఆమె ఎదమింద మొగుడుగట్టిన తాళి కనిపించి కత్తిలా వీని గుండెల్లో దిగినట్టు, ఆమె తన భర్త, కూతురుతో దిగిన 'ఫ్యామిలీ ఫొటో' గోడమీద కనిపించి వెక్కిరిస్తే అది అద్భుతమైన కథవుతుంది.
ఎప్పుడో మాటకు మాట అనుకున్న వాళ్లు ఏదో ఫంక్షన్ లో కలిసి అన్నీ మర్చిపోయి ఓసారి ఇంటికి ఆహ్వానిస్తే ఎట్లుంటుంది. అక్కడొక మెరుపుతీగ కనపడి గుండె మెలితిప్పితే నీ మనసు 'బోర్లించిన చెప్పు' కథ చెప్తుంది.

ఉండూర్లో పెళ్లి జేసుకున్నోడు సగం సచ్చినట్టు, ఇల్లరికం పోయినోడు మొత్తం సచ్చినోని కింద లెక్కని మా ఊర్లో సామెత.
'కొండ' కథలో లింగయ్య, 'ఎడ్డి' కథలో సత్తెయ్యా ఇల్లరికమెల్లి సచ్చిపోయ్యిందాకా సచ్చినోళ్ల మాదిరి బతికిసచ్చిరి.
కొండలా అండగా ఉంటాడనుకున్న కొడుకు కొండంత బరువైతే, దాని జతకు ఇల్లరికమొచ్చిన మొగుణ్ణి మనిషిగా ఏనాడూ సూడని పెళ్ళాముంటే ఆ మొగోని యాష్ఠ ఏ దేవుడు తీర్సాల.
నోరు జచ్చిన సత్తెయ్య యాత్రకు తొడకపోయిన అత్తను అక్కన్నే దిగ్గులికి వచ్చిండని 'ఎడ్డి' గా మిగిలిపాయ.

సారా దుకాణం పెట్టి ప్రజారోగ్యం నాసినం జేసిన మొగుని సావుకు కారణమైన మనిషి నాయకునిగా ఎదిగి బ్రాందీ షాపు ప్రారంభిస్తే భార్య స్థానిక నాయకురాలి హోదాలో ఆ సభను అలంకరించడం. మరో అద్భుతమైన కథ 'రెండోభాగం'.
జీవిత తత్త్వమేదో ఎరుక పరచే 'జీవగంజి'.
శ్వాసమీద ద్యాసనిలిపి ఎంతగా మెడిటేషన్ చేద్దామన్నా 'ఎంత అనుభవించినా మిగిలిపోయే శరీరం గల ఆడమనిషి నడుస్తూ చూసిన చూపు' గుర్తుకొచ్చి గురి కుదరడం లేదు. మళ్ళీ చదవాలి 'మెడిటేషన్' కథను.

పిల్లతనం నుండి వృద్ధాప్యం వరకు మగవాని వివిధ దశల్లోని ఆలోచనలను, పెనుగులాటలను, అనుభూతులను, కోరికలను, ఆశలను, భయాలను ఇంత అద్భుతమైన కథలుగా శ్రీ పూడూరి రాజిరెడ్డి గారు మాత్రమే రాయగలనిపించింది. ఎన్నో వాదాలున్నట్లు ఇవి మగవాద కథలనొచ్చేమో!

శ్రీ పూడూరి రాజిరెడ్డి గారిని ప్రత్యక్షంగా కలవలేదు కానీ, మేము ఎప్పటినుండో ఫేస్బుక్ మిత్రులుగా వున్నాము. ఇన్నాళ్లకు వారి అద్భుతమైన కథలను చదవడం చాలా సంతోషంగా వుంది.
కథాభిమానులు తప్పకుండ చదవాల్సిన కథలివి.

- గంటా వెంకట్‌ రెడ్డి 

No comments:

Post a Comment