Friday, January 31, 2014

ఒక అభిమాన ఉత్తరం: ఉపోద్ఘాతం

ఇది అభిమాని రాసిన ఉత్తరం అనే బడాయిలోకి నేను పోదల్చుకోలేదు. అందుకే దీన్ని అభిమానంతో రాసిన ఉత్తరంగానే భావిస్తున్నాను.

2011 డిసెంబరు18న వీటిని(అవును, రెండూ) అందుకున్నాను. ఒకటి: "పదాలు-పెదాలు" శీర్షిక మొత్తం మీద తన అభిప్రాయం. రెండోది: రియాలిటీ చెక్ కోసం నేను రాసిన ఇరానీ హోటల్లో రెండున్నర గంటలు ఐటెమ్-ను అనుకరిస్తూ ఛాట్ మీద రాసి పంపింది. మనకు నచ్చినదాన్ని అనుకరిస్తూ రాసి పంపడం మన అభిమానాన్ని ప్రకటించడంలో ఒక అత్యున్నత విధానం అనుకుంటాను! ఇది ఉత్తరంలో వెల్లడైన భావమే! ఇదే ఛాట్ ఐటెమ్ గనక నేను రాయాల్సివస్తే- "పళ్ల మధ్య ఇరుక్కున్నదేదో నాలుకతో తీసే ప్రయత్నాల ఉబ్బు దవడలు" వాక్యాన్ని నేను పట్టుకోగలిగేవాణ్నా, అనిపించింది. ఇదేమీ modesty కాదు.

వీటిని రాసిన తేదీలు వేర్వేరు. మొదటిది: 7 డిసెంబరు 2011; రెండవది: 10 డిసెంబరు 2011.

ఇవి రాసిన అమ్మాయి పేరు అనన్యా రెడ్డి. ఆ పేరు వల్ల నేను అమ్మాయిగా భావిస్తున్నాను; నిజానికి పెద్దావిడ కూడా కావొచ్చు. (వాటిని అందుకున్నట్టు తెలియజేసిన తక్షణ స్పందనలో నేను 'గారు' అనే సంబోధించాను.) అయితే, ఉత్తరాల కింద సంతకం లేదు. బహుశా అమ్మాయిగా తను తీసుకున్న"జాగ్రత్త" కావొచ్చనుకున్నాను. లేదా, సంతకం పెట్టడానికి అంత ప్రాధాన్యత లేదనో!

వీటిని నేను మెయిల్ ద్వారా అందుకున్నాను. అంటే స్కాన్ చేసి మెయిల్ చేశారు. ముందుగా దేదీప్యారెడ్డి నుంచి నా మెయిల్ ఫార్వర్డ్ అయింది. అక్కణ్నుంచి అనన్య ద్వారా ఈ లేఖలు అందాయి. బహుశా, వీళ్లిద్దరూ కవలలేమో అని నాకు నేను అనుకున్నాను. వాళ్లను అడగలేదు.

ఈ ఉత్తరాలు వచ్చిన ఇరవై నెలల తర్వాత 'పదాలు-పెదాలు' ఒక విభాగంగా ఉన్న 'పలక-పెన్సిల్' పుస్తకం అచ్చయింది. వీళ్లకు ఒక కాపీ పంపుదామనుకున్నాను, నా కన్సెర్న్ చూపడం కోసం. అయితే అప్పటి మెయిల్ పనిచేయడం లేదు. అది అప్పటికప్పుడు క్రియేట్ చేసుకున్న మెయిలేమో(మెయిళ్లేమో) నేను చెప్పలేను. కాబట్టి వాళ్లకుగా నాకు టచ్-లోకి వస్తే తప్ప నేను వాళ్లను ట్రేస్ చేయలేను.

ఇంకోటేమిటంటే- అసలు దేదీప్యే వీటిని రాస్తే, అనన్య స్కాన్ చేసి పంపిందా? అన్న అనుమానమూ లేకపోలేదు. ఒకవేళ, ఇందులో ఉన్న అక్షరాలు ముఖ్యంగానీ కర్త ఎవరు అన్నదానికి నిమిత్తం లేకుండా చేయడానికి ఈ రెండు మెయిల్ల తమాషా ఏమైనా జరిగిందా?
ఇందులో ఏ తమాషా లేకపోతే గనక, నేను ముందు చెప్పినట్టు వీటి కర్తృత్వాన్ని అనన్యకే ఆపాదించాల్సి ఉంటుంది.

అయితే, వీటిని ఇప్పుడు ఎందుకు పోస్టు చేస్తున్నాను? కేవలం నాకుగా తెలియపరిచిన విషయాల్ని నేను ఇలా ప్రకటించవచ్చా? ఇది ఏమైనా తన ప్రైవసీని భంగపరచడం అవుతుందా?
ఇది అంత అనైతికమైన పని కాదేమోననే అనుకుంటున్నాను. విశ్లేషణగా మొదటిదాన్నీ, ఐటెమ్-గా రెండవదాన్నీ చూడవచ్చుకదా! నాకు రాయడమన్నది అటుంచితే, వీటిల్లో వీటిగా తీసుకోవలసిందేమైనా ఉందేమో కూడా కదా!!

రెండేళ్ల నాటి ఈ లేఖల్ని అప్పుడు ఎందుకు ప్రకటించాలని అనిపించలేదో అనిపించలేదు. ఇప్పుడు ఎందుకు అనిపించిందో అనిపించింది.
అయితే, ఈ రెంటిని ఒకే పోస్టుగా కాకుండా విడివిడిగా, కానీ వెన్వెంటనే పోస్టు చేస్తున్నాను.

1 comment:

  1. మీ రచనల్ని అంతలోతుగా, శ్రద్దగా చదివి పొద్దికైన అక్షరాలలో "ఓపికగా, తీరిక" చేసుకొని అన్ని వాక్యాల ఉత్తరాన్ని వ్రాయటం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. లబ్దప్రతిష్టులైన రచయితలకు పుంఖాను పుంఖాలుగా ఉత్తరాలు వస్తాయని వినటమే కానీ ఎప్పుడూ అనుభవంలోకి రాలేదు. మీ ద్వారా ఇలా చూడటం బాగుంది. ఆ ఉత్తరాలను మీరు స్వీకరించిన తీరు ( ఒక ట్రోఫీ లా కాక) ముచ్చట గొలిపింది. అభినందనలతో

    ReplyDelete