Saturday, December 6, 2025

తమ్ముడి మరణం కథాపఠనం





Thammudi Maranam


మనకు తెలీకుండా మన కథను ఎవరైనా చదివారని తెలిసినప్పుడు– మనకు కనీసం చెప్పనైనా లేదే అన్న అది ఉంటుంది; వాళ్లు మన కథను సెలబ్రేట్‌ చేస్తున్నారన్న ఇదీ ఉంటుంది. ఈ ‘కథాకళ’ కోసం డాక్టర్‌ వారిజా రాణి గారు నా ‘తమ్ముడి మరణం’ చదివారు. ఈ మూడు కథల వీడియోలో మొదటి రెండు కథల్ని డాంజీ తోటపల్లి, చిట్టూరు సరస్వతి రాధ గార్లు చదివారు. తమ్ముడి మరణం మూడో కథ. 1:20 గంటల నుంచి ఆ కథాపఠనం ఉంది. నిర్వహణ: విజయ భాస్కర్‌ రాయవరం.

(25th March 2023)

Wednesday, December 3, 2025

నా కొత్త కథ

నా కొత్త కథ


ఈమాట నవంబర్‌ సంచికలో ప్రచురితమైన నా కొత్త కథ ‘తండ్రి’ ఈ లింకులో చదవొచ్చు.

 

తండ్రి  

Sunday, November 30, 2025

స్వామినాథన్‌ జీవిత చరిత్ర


 

ఎం.ఎస్‌.స్వామినాథన్‌:

ద మ్యాన్‌ హూ ఫెడ్‌ ఇండియా
(జీవిత చరిత్ర)
––––
రచన:
ప్రియంవద జయకుమార్‌



గొప్ప శాస్త్రవేత్త... చక్కటి వ్యవహర్త


ఉన్నత విద్యావంతులున్న ఉమ్మడి వ్యవసాయ కుటుంబంలో మోన్‌కోంబు సాంబశివన్‌ స్వామినాథన్‌ జన్మించారు(తమిళనాడు, 1925). తండ్రి బాటలో మెడిసిన్‌ చదివి కుంభకోణంలోని వాళ్ల హాస్పిటల్‌ను నడిపే అవకాశం; ఐపీఎస్‌కు ఎంపికైనందున అటు వైపుగానూ కెరీర్‌ మలుచుకునే వీలు ఆయనకు ఉండినాయి. కానీ లక్షల మంది చావులకు కారణమైన బెంగాల్‌ క్షామం(1943) వేసిన ముద్ర ఆయన్ని వ్యవసాయం వైపు నడిపించింది. వ్యవసాయ శాస్త్రవేత్తగా, జన్యుశాస్త్ర నిపుణుడిగా ఆయన చేసిన కృషిని చెప్పే పుస్తకం ‘ఎం.ఎస్‌.స్వామినాథన్‌: ద మ్యాన్‌ హూ ఫెడ్‌ ఇండియా’. ఇది ఆయన మేనకోడలు రాసిన ఆయన జీవిత కథ.

స్వాతంత్య్రానంతర భారతదేశం దశాబ్దాల పాటు ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య... తిండి గింజల కరువు. ‘ఏదైనా ఆగుతుంది కానీ వ్యవసాయం ఆగదు’ అన్నారు నెహ్రూ. సోమవారాలు పస్తులుండమని జనానికి పిలుపునిచ్చారు లాల్‌ బహదూర్‌ శాస్త్రి. ‘బ్లడీ అమెరికన్ల’ ముందు చేయి చాచకుండా ఉండే మార్గాల కోసం వెతికారు ఇందిరా గాంధీ. ఒక దశలో ‘పీఎల్‌ 480’ పథకం కింద అమెరికా పంపే గోధుమలే దిక్కు. ఓడలు దిగితేగానీ నోళ్లు ఆడని పరిస్థితి. ఈ దిగుమతులకు చెల్లించాల్సిన మూల్యం విదేశాంగ విధానంలో స్వతంత్రంగా నిలబడలేకపోవడం. అలాంటి స్థితిగతుల్లో ‘ఆకలి నుంచి స్వేచ్ఛే అన్నింటికన్నా గొప్ప స్వేచ్ఛ’ అన్నట్టుగా, స్వామినాథన్‌ దేశంలో హరిత విప్లవానికి బాటలు పరిచారు. ‘చరిత్ర ఆయనకు అవకాశం ఇచ్చింది, దాన్ని ఆయన రెండు చేతులా అందుకున్నారు’ అంటారు రచయిత్రి.

గాలికి పడిపోకుండా నిలబడే పొట్టి రకం గోధుమల మీద గామా కిరణాలతో ‘ఐండియన్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’లో స్వామినాథన్‌ ప్రయోగాలు చేశారు. దానికోసం ‘ఆటమిక్‌ ఎనర్జీ కమిషన్‌’ సాయంతో ‘గామా గార్డెన్‌’ ఏర్పాటుచేశారు. వ్యవసాయం కోసం అన్ని రంగాలు సహకరించుకోవాలంటారాయన. ఈ దశలోనే పొట్టి రకం హైబ్రిడ్‌ గోధుమలను మెక్సికోలో నార్మన్‌ బోర్లాగ్‌ విజయవంతంగా పరీక్షించారని తెలిసి, స్వామినాథన్‌ ఆయనకు ఉత్తరం రాశారు(1963). దానివల్ల పదేళ్ల కాలం కలిసొస్తుందనేది ఆయన ఆలోచన. ఇక వంద కేజీల చొప్పున వచ్చిన ఆ నాలుగు రకాల విత్తనాలను ఇక్కడి నేలలకు అనుగుణంగా కల్యాణ్‌ సోనా, సోనాలిక లాంటి విత్తనాలుగా మార్చి, వ్యవస్థలోని అన్ని అడ్డంకులను అధిగమించి, రైతుల అనుమానాలను తీర్చి, దిగుబడుల ‘చమత్కారాన్ని’ చూపించి, ఇండియా వచ్చిన నార్మన్‌ బోర్లాగ్‌నే ఆశ్చర్యపరిచేలా చేశారు స్వామినాథన్‌. నాలుగు హెక్టార్లతో మొదలైన ప్రయోగం, 1968 నాటికి పది లక్షల హెక్టార్లకు విస్తరించింది. ఈ మధ్యలోనే విక్రమ్‌ సారాభాయి సహకారంతో రైతుల కోసం దూరదర్శన్‌లో ‘కృషి దర్శన్‌’ మొదలైంది(1967). సైన్సు శక్తి, విధాన నిర్ణయం, రైతుల ఉత్సాహం– ఈ మూడూ కలగలిసి ‘యూఎస్‌ఎయిడ్‌’కు చెందిన విలియమ్‌ గాడ్‌ నోటి నుంచి తొలిసారిగా వెలువడిన మాట ‘గ్రీన్‌ రివొల్యూషన్‌’ అనేది విజయవంతమైంది. అయితే, దాని ప్రతికూల ప్రభావాలు కూడా ఎంఎస్‌కు తెలుసు. అందుకే ‘ఎవర్‌గ్రీన్‌ రివొల్యూషన్‌’ కావాలని కాంక్షించారు.

1981లో ఫిలిప్పైన్స్‌లోని ‘ఇంటర్నేషనల్‌ రైస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ డైరెక్టర్‌ జనరల్‌ పదవి ఆయన్ని వరించింది. ఆ స్థానంలోకి వెళ్లిన మొదటి ఆసియన్‌ ఆయన. ఐఆర్‌64 లాంటి పాపులర్‌ వరి రకం ఈ కాలంలోనే వచ్చింది. ప్రణాళికా సంఘం, వ్యవసాయ మంత్రిత్వ శాఖల్లోనూ పనిచేసిన స్వామినాథన్‌ పాత్ర ఇండియాకే పరిమితం కాలేదు. చైనా, పాకిస్తాన్, ఇండోనేషియా, మయన్మార్, ఈజిప్ట్, మడగాస్కర్, థాయిలాండ్, బంగ్లాదేశ్, టాంజానియా, ఇథియోపియా లాంటి ఎన్నో దేశాల్లో వరి పరిశోధనా కేంద్రాలు ఏర్పాటయ్యేలా సహకరించారు. టైమ్‌ మ్యాగజైన్‌ ప్రచురించిన అత్యంత ప్రభావశీల ఆసియన్ల జాబితాలోని ముగ్గురు భారతీయుల్లో స్వామినాథన్‌ ఒకరు (మిగిలిన ఇద్దరు: గాంధీజీ, టాగూర్‌). ‘పది జీవితాల్లో కూడా సాధించలేనిది ఆయన ఒక్క జీవితంలో సాధించారు’ అంటారు రచయిత్రి. ముగ్గురు కూతుళ్ల తండ్రిగా, స్వతంత్ర భావాలున్న భార్య మీనా భర్తగా ఆయన కుటుంబ విశేషాలు, ఆయన పదవిలో ఉన్నప్పుడు జరిగిన సంగతులను మేళవిస్తూ పది అధ్యాయాలుగా రాసిన పుస్తకమిది. గాంధేయవాదిగా, పర్యావరణవేత్తగా, వ్యవసాయంలో స్త్రీల పాత్ర తెలిసినవాడిగా ఆయనలోని బహుకోణాలు తెలుస్తాయి. ఫిలిప్పైన్స్‌ వదిలివచ్చేటప్పుడు టగలాంగ్‌లో వీడ్కోలు ఉపన్యాసం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు మీనా. రైతుల కోసం నియమించిన జాతీయ కమిషన్‌(స్వామినాథన్‌ కమిషన్‌గా పేరుపడింది)తో సహా కొన్ని పదుల కమిటీలకు చైర్మన్‌గా వ్యవహరించి; రామన్‌ మెగసెసే, వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్, భారతరత్న లాంటి ఎన్నో గౌరవాలు పొందిన ఎంఎస్‌ తన జీవితంతోనే ఆశ్చర్యపరిచారు.

(3-11-2025)
 

Thursday, November 27, 2025

నా పుస్తకాలు


 2008-2023: మధుపం, పలక- పెన్సిల్, రియాలిటీ చెక్, చింతకింది మల్లయ్య ముచ్చట, ఆజన్మం, గంగరాజం బిడ్డ

(రియాలిటీ, చింతకింది క్రమం ఫొటోలో మారింది.)

 

Monday, November 24, 2025

అసంపూర్ణ న్యాయమేనా?


 

అసంపూర్ణ న్యాయమేనా?


(ఇన్‌)కంప్లీట్‌ జస్టిస్‌?: ద సుప్రీం కోర్ట్‌ ఎట్‌ 75–– క్రిటికల్‌ రిఫ్లెక్షన్స్‌

సంపాదకుడు:
జస్టిస్‌ ఎస్‌.మురళీధర్‌


రాజ్యాంగ అవతరణ జరిగిన రెండు రోజులకు, అంటే 1950 జనవరి 28న భారత అత్యున్నత న్యాయస్థానం తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ 75 ఏళ్లలో ఎనిమిది మంది న్యాయమూర్తుల నుంచి 34 మంది న్యాయమూర్తులకు అది విస్తరించింది. భారతీయ న్యాయవ్యవస్థ పిరమిడ్‌ పైభాగాన ఉండే సుప్రీం కోర్టును ఢిల్లీలోని ఒక భవన సముదాయంగా పరిగణిస్తే– కోర్టు రూములు, వందలాది మంది కూర్చోగలిగే న్యాయవాదుల భిన్న ఛాంబర్లతో అది కళకళలాడుతుంటుంది. అక్కడ ప్రాక్టీస్‌ చేస్తున్న న్యాయవాదుల సంఖ్య 22,734. మరో 3,500 మంది ‘అడ్వకేట్స్‌ ఆన్‌ రికార్డ్‌’. స్టెనోగ్రాఫర్స్, రిజిస్ట్రార్స్, డ్రైవర్స్, ప్యూన్స్‌ లాంటి ఇతర సిబ్బంది 3,770. ఇక 2025 మే 31 నాటికి పెండింగ్‌ కేసులు 81,735. ప్రజాస్వామ్యానికి మూడో స్తంభంగా పరిగణించే న్యాయవ్యవస్థ ఈ 75 ఏళ్లలో ఎలాంటి ఎత్తుపల్లాలను చూసిందో లోతుగా చర్చించే పుస్తకం ‘(ఇన్‌)కంప్లీట్‌ జస్టిస్‌?’ శీర్షికే ఇది సంపూర్ణ న్యాయం చేకూర్చలేకపోయిందన్న భావన కలిగిస్తుంది. దాన్నే 24 మంది న్యాయనిష్ణాతులు తమ వ్యాసాలు, ఎడిటర్‌ స్వయంగా చేసిన ఇంటర్వ్యూల రూపంలో అభిప్రాయాలను పంచుకున్నారు.

‘అందరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కూడా మా స్థానిక హవల్దార్‌కు ఉన్నంత శక్తి లేదు’ అని 1992 నాటి కుమ్హేర్‌ ఊచకోత నుంచి బతికి బయటపడ్డ రాజస్థాన్‌కు చెందిన ‘చున్నీ లాల్‌ జాతవ్‌’ చెప్పిన మాటల్ని సీనియర్‌ జర్నలిస్ట్‌ పి.సాయినాథ్‌ ఉటంకిస్తారు. గ్రామాల్లోని అంచుల్లో ఉండేవాళ్లకు కోర్టుల్లోని న్యాయం ఎంత దూరమో ఆయన వివరిస్తారు. రాజ్యాంగానికి ‘ఫౌండింగ్‌ డాటర్‌’నని చెప్పుకొనే న్యాయవాది ఇందిరా జైసింగ్‌... సుప్రీంకోర్టులో, మొత్తంగా న్యాయస్థానాల్లో ఉండే లింగ వివక్షను, లైంగిక హింసను ఎత్తిచూపుతారు. కార్మిక చట్టాల కేసులతో పాటు, ప్రత్యేకంగా పురుష న్యాయమూర్తుల బాధితులుగా ఉన్న మహిళా న్యాయమూర్తుల కేసుల్ని వాదించిన జైసింగ్‌ ‘అది న్యాయవ్యవస్థ డర్టీ సీక్రెట్‌’ అంటారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తిని మరో కోర్టుకు బదిలీ చేయడం అర్థరహిత చర్య, అది ఇంకో కోర్టుకు చేస్తున్న అన్యాయం అంటారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్‌ లోకూర్‌. కొలీజియం పేరిట న్యాయమూర్తుల ఎంపికలో కార్యనిర్వాహక వ్యవస్థను మొత్తంగా పక్కనపెడితే, దాని ఆధిక్యాన్ని చాటుకోవడానికి కార్యనిర్వాహక వ్యవస్థ పలు దారులు వెతుకుతుందంటారు లా కమిషన్‌ మాజీ చైర్మన్‌ అజిత్‌ ప్రకాశ్‌ షా.

ఇన్ని లోపాలు ఉన్నప్పటికీ, సగటున అరవై ఏళ్ల వయసుండే ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒక్కోసారి రోజుకు 60–65 హియరింగ్స్‌తో వ్యవహరించాల్సి ఉంటుంది. అంటే వాటన్నింటికి సంబంధించిన పత్రాలను ముందుగా చదివుండటం తప్ప మార్గం లేదు. ‘ప్రపంచంలో ఏ సుప్రీం కోర్టు జడ్జికి కూడా ఇంతటి పని ఒత్తిడి ఉండదు’ అంటారు సీనియర్‌ అడ్వకేట్‌ శ్రీరామ్‌ పంచు. వర్చువల్‌ హియరింగ్స్‌కు ఆన్‌లైన్‌ ఫైలింగ్స్‌ను కూడా తప్పనిసరి చేయగలిగితే సుప్రీంకోర్టు సమర్థత పెరుగుతుందనీ, కోర్టు ప్రాంగణంలో మనుషుల తొక్కిడి ఉండదనీ సలహా ఇస్తారు సీనియర్‌ అడ్వకేట్‌ మీనాక్షి అరోరా. 2023 జూలై 30 నాటికి 4,40,47,503 పెండింగ్‌ కేసులున్న జిల్లా కోర్టుల్లో 20 శాతం పోస్టులు ఖాళీగా ఉండటాన్నీ, కొన్నిచోట్ల కనీసం సరైన ప్రింటర్‌ కూడా ఉండని వైనాన్నీ వివరిస్తారు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్‌.రవీంద్ర భట్‌. ఇంకా రాజు రామచంద్రన్‌(జడ్జీల తొలగింపు), ఉపేంద్ర బక్షి(పిల్స్‌), కె.చంద్రు(కార్మిక చట్టాలు), ఫైజాన్‌ ముస్తాఫా(ఆర్టికల్‌ 30) లాంటివాళ్లు భిన్న అంశాలను స్పృశిస్తారు. ఎన్నో తీర్పుల ఉటంకింపులతో సాగే ఈ వ్యాసాల్ని చదవడం సామాన్య పాఠకులకు కొంత ఇబ్బందే అయినా స్పిరిట్‌ అర్థం కాకుండా పోదు.


(13-10-2025)

Friday, November 21, 2025

Shattered Lands పరిచయం


(ఈమధ్య సాక్షి ఎడిటోరియల్‌ పేజీ కోసం కొన్ని ఆంగ్ల పుస్తకాల పరిచయాలు రాస్తున్నాను. రికార్డ్‌ కోసం వాటిని ఇక్కడ ఉంచుతున్నా. అందులో ఇది మొదటిది.)
 

పుస్తక ప్రపంచం


విభజన రేఖల చరిత్ర

భారతదేశ విభజన అంటే ‘హిందుస్థాన్‌’, పాకిస్తాన్‌గా విడిపోయిన నేల గురించే అనుకుంటాం. కానీ బ్రిటిష్‌ వారి పాలనలో, అదన్‌ రేవు (యెమెన్‌) నుంచి రంగూన్‌ వరకు, కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు అంతా ‘ఇండియన్‌ ఎంపైరే’! అందరూ ‘ఇండియన్సే’. రూపాయే అంతటా చెల్లుబాటయ్యేది. అంతటి నేల ఐదు సార్లు ఎలా విభజితమైందో చెప్పే పుస్తకం ‘షాటర్డ్‌ ల్యాండ్స్‌’. ఢిల్లీలో పెరిగిన స్కాట్‌లాండ్‌ చరిత్రకారుడు సామ్‌ డాల్రింపుల్‌ రచయిత.

గాంధీజీ అహింసా సిద్ధాంతాన్ని నమ్మిన బర్మా (బ్రహ్మదేశ్‌) నాయకుడు యు ఒట్టామా, బ్రిటిష్‌–బర్మా ‘అధిపతి’ బా మా భారత సామ్రాజ్యంలో బర్మా అంతర్భాగమని  పోరాడారు. కానీ స్వాతంత్య్రోద్యమ సెగ నుంచి తమను కాపాడుకోవడానికి, విభజన రాజకీయాల్లో భాగంగా బ్రిటిష్‌వారు 1937లో బర్మాను విడదీశారు. ‘ఆసియా రూపురేఖలను మార్చడానికి దేవుడు పంపిన మనిషి ముందు నేను మౌనంగా నిలబడ్డాను’ అంటాడు గల్ఫ్‌కు వచ్చిన గాంధీజీని చూస్తూ యెమన్‌ రచయిత మహమ్మద్‌ అలీ లుక్‌మాన్‌. కానీ తమను ‘మెయిన్‌ ల్యాండ్‌’ అంతగా పట్టించుకోవడం లేదన్న భావన అరబ్బుల్లో ఉండేది. ‘హిందూ జాతీయవాదుల’ దృష్టిలోనేమో పవిత్ర భరతభూమి అనుకునే భౌగోళిక హద్దుల్లో అరబ్బు ప్రాంతం లేదు. 1931లో అదన్‌ రేవును, 1947లో ‘పర్షియన్‌ గల్ఫ్‌’ను విడదీయడంతో ఆ బంధమూ ముగిసింది.

ఎన్నో రిఫరెన్సులతో ఒక ఉద్విగ్న చరిత్రను కళ్లముందు నిలబెట్టే ఈ 520 పేజీల పుస్తకం అధికంగా ఒక మాటగానైనా ఉనికిలో లేని ‘పాకిస్తాన్‌’ ఏర్పడటానికి దారితీసిన పరిస్థితులను చర్చిస్తుంది. వేల్స్, స్కాట్‌లాండ్‌ దేశాలు యూకేలో భాగమైనట్టుగానే, పాక్‌ కూడా ఇండియన్‌ యూనియన్‌లో స్వతంత్ర ప్రాంతంగా ఉండటానికి అంగీకరించిన జిన్నా తన మనసు మార్చుకోవడం, మత ద్వేషాలు కలగలిసి ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద మానవతా సంక్షోభం తలెత్తింది. రాడ్‌క్లిఫ్‌ లైన్‌ అన్న ఒక్క గీతతో జాతీయతలు మారిపోయాయి. లక్షలాది మంది మరణించారు, కోట్లాదిమంది నిరాశ్రయులయ్యారు.

చదరపు కిలోమీటరు విస్తీర్ణం కలిగిన అతిచిన్న సంస్థానాల నుంచి యూరప్‌ దేశాలంతటి పెద్దవైన సుమారు ఆరు వందల సంస్థానాలే ఇప్పటి ఇండియాకు ఈ రూపునిచ్చాయనేది వాస్తవం(నాలుగో విభజన–విలీనం). ‘శరీరం లేని రెండు రెక్కలతో’ మతం పేరుతో ఏర్పడిన పాకిస్తాన్‌ నుంచి భాష కారణంగా బంగ్లాదేశ్‌ విడిపోవడంతో పుస్తకం ముగుస్తుంది(ఐదో విభజన). 1931 నుంచి 1971 వరకు జరిగిన ఐదు విభజనలు ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మా, నేపాల్, భూటాన్,  యెమెన్, ఒమన్, యూఏఈ, ఖతార్, బహ్రయిన్, కువైట్‌ ఇప్పటి రీతిలో ఏర్పడటానికి కారణమైన పరిస్థితులను పుస్తకం లోతుగా వివరిస్తుంది. మనుషుల సూక్ష్మ వివరాలను జోడిస్తూ రాయడం వల్ల చారిత్రక నవలను చదివిన అనుభూతినిస్తుంది. ఈ ద్రవరూప సరిహద్దులు అనాదిగా ఇలాగే ఉన్నాయని నమ్మించడంలో రాజ్య ప్రయోజనాలు ఉన్నాయి; అందుకే గత ఉమ్మడి చరిత్ర పట్ల  దేశాలు మరుపును ప్రదర్శిస్తాయంటారు రచయిత. ఈ విభజనలకు బాధితులు మాత్రం ప్రజలు. ‘ఇండియన్స్‌’ తమ అవకాశాలను లాక్కుంటున్నారని బర్మాలో యు సా మొదలుపెట్టిన ప్రచారం హింసాత్మకమై లక్షలాది మంది కట్టుబట్టలతో ఆ నేలను వీడి వందల మైళ్లు నడుచుకుంటూ వచ్చారు. బెంగాలీ మహిళల మీద పాక్‌ సైన్యం జరిపిన అత్యాచారాల వల్ల 1,70,000 గర్భస్రావాలు జరగడం, 30,000 మంది ‘యుద్ధ శిశువులు’ పుట్టడం మానవత్వానికి మచ్చ. గల్ఫ్‌లోనూ జనాలు ఇబ్బందులు పడ్డారు.

కథ ఇక్కడితో ముగిసిందా? బెంగాల్‌ను ఒక దేశంగా చేయాలని సుహ్రవర్దీ పట్టుబట్టాడు. నాగాలాండ్‌ కోసం ఫిజో పోరాడాడు. ట్రావెన్‌కోర్, అండమాన్, ‘ప్రిన్సిస్థాన్‌’(సంస్థానాలన్నీ కలిపి), ‘అచ్యుతిస్థాన్‌(దళితుల కోసం) లాంటి దేశాలు కూడా ఒక దశలో ఆలోచనలుగా ఉన్నవే. కశ్మీర్, బలూచిస్తాన్, ‘రోహింగ్యా’ పోరాటాలు ఇప్పటి వాస్తవమే. కాబట్టి ఇది ఇంకా నడుస్తున్న చరిత్రే!


(8-9-2025)

 

Tuesday, November 18, 2025

పోయిన్నెల మా కరెంట్‌ బిల్లు 51 రూపాయలు!



పోయిన్నెల మా కరెంట్‌ బిల్లు 51 రూపాయలు!

2025 ఏప్రిల్‌ నెలకుగానూ హైదరాబాద్‌లోని మా (అద్దె) ఇంటికి వచ్చిన కరెంట్‌ బిల్లు 51 రూపాయలు. మేము ఏసీ, ఫ్రిజ్‌ లాంటివి వాడం కాబట్టి మామూలుగా బిల్లులు తక్కువగానే వస్తుంటాయి. ఆ తక్కువల్లోనూ ఇది ఇంకా తక్కువ. అది కూడా నడి ఎండాకాలంలో. నేను ఒక్కడినే ఉంటే గనక ఎంత వేడిగా ఉన్నా ఫ్యాను కూడా వేయను. శరీరాన్ని అట్లా అలవాటు చేయడానికి సాధన చేస్తున్న. వేసవి సెలవులకు మావాళ్లు ఊరికి వెళ్లడంతో ఇంక రాత్రిపూట కాసేపు ఒకట్రెండు బల్బులు; ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్‌, (వారానికోసారి) ట్రిమ్మర్ చార్జింగుల కోసం తప్ప ఇంక దేనికీ పెద్దగా కరెంట్‌ వాడింది లేదు. బిల్లు ప్రకారం 4 యూనిట్లు కాలింది. నాకు తెలిసిన ఒక మేడమ్‌ వాళ్లకు పోయిన్నెల పది వేల బిల్లు వచ్చిందంటే (అలాంటి వస్తువులూ, వాటికి తగిన వాడకమూ ఉన్నాయన్నారు) ఇది రాయబుద్ధయింది.

(20-5-2025 నాటి ఎఫ్బీ పోస్ట్‌)
 

Saturday, November 15, 2025

చెహోవ్‌ ‘విద్యార్థి’ కథ



చెహోవ్‌ ‘విద్యార్థి’ కథ నేను ఇంతకుముందు చదవలేదు(అంటోన్‌ చెకోవ్‌ కథలు–1; అనువాదం: అరుణా ప్రసాద్‌). చిన్న కథ. నాలుగు పేజీలు. పూర్తవుతూనే ఏడుపొచ్చింది. అలాగని అందులో నాటకీయత లేదు, హృదయ విదారక సన్నివేశాలు లేవు. ఒక యువకుడి తలపోత ముఖ్యంగా. అసలు ఆ చివరి వాక్యం పూర్తయ్యేవరకూ అలా కదిలిపోతానని నాకూ తెలీదు. మళ్లీ ఆ చివరి వాక్యంలోనే ఏదో ఉందని కాదు. మొత్తంగా కథే. ఎప్పుడో క్రీస్తు కాలం నుంచీ, ‘మానవ జీవితాలకు మార్గదర్శనం చేసిన సత్యం, సౌందర్యం యివాళ్టి వరకూ ఏ అంతరాయం లేకుండా మానవులను నడిపిస్తూనే ఉన్నా’యన్న స్పృహ కలగడం వల్ల వచ్చిన ఆనందోద్వేగం అది. నా పూర్వీకుల తాలూకు సుఖదుఃఖాల పరంపరకు నన్ను కొనసాగింపుగా చూసుకోవడం వల్ల; గతం, వర్తమానాలను ముడేస్తున్న ‘గొలుసు’ తాలూకు ‘రెండు చివరలూ’ కనబడటం వల్ల; 130 ఏళ్ల క్రితపు(కథ ప్రచురణ: 1894) యువ చెహోవ్‌ కరచాలన స్పర్శ నాకు స్పష్టంగా తెలియడం వల్ల వచ్చిన కన్నీళ్లు అవి.


(19-10-2024 నాటి ఎఫ్బీ పోస్ట్‌)
 

Wednesday, November 12, 2025

గంగరాజం బిడ్డ కోవెటుకొచ్చింది...





(26-3-2025 నాటి గంటా వెంకట్‌ రెడ్డి ఎఫ్బీ పోస్ట్‌)

 

గంగరాజం బిడ్డ కోవెటుకొచ్చింది.

వచ్చే బస్సు పొయ్యే బస్సు. ఏదీ ఎక్కకుండా నా మటుకు నేను ఖైతాన్ బస్టాప్ లో పుస్తకం చదువుతూ కూర్చున్నాను. అందరూ ఫోన్ స్క్రీన్లను తుడుస్తా వుంటే, విచిత్రంగా నేనొక్కణ్ణే పుస్తకం తిరగేస్తా ఉన్నట్టుంది, 'ఏం బుక్కు' ఆరా తీశాడు అక్కడ బస్సులను కంట్రోల్ చేసే ఈజిప్ట్ మనిషి.
'గంగరాజం బిడ్డ' ఆంటి.
'ఏంది గాంధీ బిడ్డనా' అన్నాడు అయోమయంగా నా ఇండియా మొఖాన్ని ఎగాదిగా చూస్తూ అరబ్బీలో. కాదు కథల పుస్తకమని చెప్పాను.
తన చేతికి పుస్తకాన్ని తీసుకుని బాక్ కవర్ ఫొటో తీసుకుని గూగుల్ సహాయంతో 'మొత్తం సృష్టి విన్యాసాన్ని వ్యాఖ్యానించడానికి నువ్వి క్కడ లేవు, సరిపోవు' అనే వాక్యాన్ని తన భాష లోకి తర్జుమా చేసుకుని 'అద్భుతం' అన్నాడు.
ఇందులోని కథలన్నీ అద్భుతమే!

గంగరాజానికీ నాకూ ఒకటే తేడా! గంగరాజం మస్కట్ బోతే నేను కోవెటొచ్చినా. నా ఎద్దులమ్ముకొని నేను విమానామెక్కితే, గాటి మీద కాడెద్దులు సచ్చిపోయిన గంగరాజం అనుమానంతో ఎవుర్నో జంపి జైలు పాలై ఊరిడిసిపాయ.
మనతో పాటు బడిలో చేరిన పిల్లతో చిన్నప్పుడు అరమరికలు లేకుండా చదువులో, ఆటపాటల్లో కలసిపోతాం. హైస్కూల్లోకి వెళ్లేసరికి పైకి ఏదో దూరం పెరిగినట్టనిపిస్తుంది కానీ, లోపల తెలియని ఆకర్షణ మొదలవుతుంది. ఉన్నఫలంగా అదృష్యమైన ఆ పిల్ల, వారం పది రోజుల్లో పచ్చిపసుపుకొమ్ములా పైటా పావడతో దర్శనమిస్తే, గుండె గొంతులోకొచ్చినట్టు, గుండెకాయకు చమట పట్టినట్టూ అనిపిస్తుంది. ఏమోయ్ అన్నట్టు ఆ పిల్ల నొసలు ఎగరేసినా నోరు పెగలదు.
గంగరాజం బిడ్డ కథలో పూర్ణలతను ఆ పిలగాడు మళ్ళీ కలవాలని కొటకలాడింది నా పానం.

ఇంకా 'ఎఱుక' 'చిన్న సమస్య' కథలు కూడా అప్పుడప్పుడే ముక్కుకింద మూతి నల్లబడి బాల్యం నుండి యవ్వనంలోకి అడుగు పెట్టే పిల్లవాని దృష్టితో రాసినవి.
యవ్వనంలో తన ప్రేమను వెల్లడించాలనుకుని తనకలాదే యువకుని కథ 'చిలుము'. ఐతే మనిషి మనసుకు పట్టిన చిలుము వదలడం కష్టం కదా!
అందీ అందని అందాల అతివ అధరాన్ని అందుకుందామని ఆశపడ్డ వేళ, ఆమె ఎదమింద మొగుడుగట్టిన తాళి కనిపించి కత్తిలా వీని గుండెల్లో దిగినట్టు, ఆమె తన భర్త, కూతురుతో దిగిన 'ఫ్యామిలీ ఫొటో' గోడమీద కనిపించి వెక్కిరిస్తే అది అద్భుతమైన కథవుతుంది.
ఎప్పుడో మాటకు మాట అనుకున్న వాళ్లు ఏదో ఫంక్షన్ లో కలిసి అన్నీ మర్చిపోయి ఓసారి ఇంటికి ఆహ్వానిస్తే ఎట్లుంటుంది. అక్కడొక మెరుపుతీగ కనపడి గుండె మెలితిప్పితే నీ మనసు 'బోర్లించిన చెప్పు' కథ చెప్తుంది.

ఉండూర్లో పెళ్లి జేసుకున్నోడు సగం సచ్చినట్టు, ఇల్లరికం పోయినోడు మొత్తం సచ్చినోని కింద లెక్కని మా ఊర్లో సామెత.
'కొండ' కథలో లింగయ్య, 'ఎడ్డి' కథలో సత్తెయ్యా ఇల్లరికమెల్లి సచ్చిపోయ్యిందాకా సచ్చినోళ్ల మాదిరి బతికిసచ్చిరి.
కొండలా అండగా ఉంటాడనుకున్న కొడుకు కొండంత బరువైతే, దాని జతకు ఇల్లరికమొచ్చిన మొగుణ్ణి మనిషిగా ఏనాడూ సూడని పెళ్ళాముంటే ఆ మొగోని యాష్ఠ ఏ దేవుడు తీర్సాల.
నోరు జచ్చిన సత్తెయ్య యాత్రకు తొడకపోయిన అత్తను అక్కన్నే దిగ్గులికి వచ్చిండని 'ఎడ్డి' గా మిగిలిపాయ.

సారా దుకాణం పెట్టి ప్రజారోగ్యం నాసినం జేసిన మొగుని సావుకు కారణమైన మనిషి నాయకునిగా ఎదిగి బ్రాందీ షాపు ప్రారంభిస్తే భార్య స్థానిక నాయకురాలి హోదాలో ఆ సభను అలంకరించడం. మరో అద్భుతమైన కథ 'రెండోభాగం'.
జీవిత తత్త్వమేదో ఎరుక పరచే 'జీవగంజి'.
శ్వాసమీద ద్యాసనిలిపి ఎంతగా మెడిటేషన్ చేద్దామన్నా 'ఎంత అనుభవించినా మిగిలిపోయే శరీరం గల ఆడమనిషి నడుస్తూ చూసిన చూపు' గుర్తుకొచ్చి గురి కుదరడం లేదు. మళ్ళీ చదవాలి 'మెడిటేషన్' కథను.

పిల్లతనం నుండి వృద్ధాప్యం వరకు మగవాని వివిధ దశల్లోని ఆలోచనలను, పెనుగులాటలను, అనుభూతులను, కోరికలను, ఆశలను, భయాలను ఇంత అద్భుతమైన కథలుగా శ్రీ పూడూరి రాజిరెడ్డి గారు మాత్రమే రాయగలనిపించింది. ఎన్నో వాదాలున్నట్లు ఇవి మగవాద కథలనొచ్చేమో!

శ్రీ పూడూరి రాజిరెడ్డి గారిని ప్రత్యక్షంగా కలవలేదు కానీ, మేము ఎప్పటినుండో ఫేస్బుక్ మిత్రులుగా వున్నాము. ఇన్నాళ్లకు వారి అద్భుతమైన కథలను చదవడం చాలా సంతోషంగా వుంది.
కథాభిమానులు తప్పకుండ చదవాల్సిన కథలివి.

- గంటా వెంకట్‌ రెడ్డి 

Sunday, November 9, 2025

చిరుస్పర్శల కథలు



(5-1-2025 నాటి స్వరూప్‌ తోటాడ ఎఫ్బీ పోస్ట్‌) 


ఈ పుస్తకంలో "మెడిటేషన్" అనే కథ కథలో ఆలోచనని అదుపు చేయాలని ప్రయత్నిస్తున్న మనిషి నియంత్రణ లోంచి తప్పించుకుని మనసు ఎన్ని గంతులు వేస్తుందో భలే వివరం ఉంటుంది. ఆ చిన్న చిన్న nuances of thoughts and feelings లోనే మనం కధల్లోకి ఎక్కవనుకునే ఎన్నో జీవితపు నీటి బుడగలు పేలుతాయి. "మట్టిపాము లా కనబడిన బుక్ షెల్ఫ్ చెదలు, క్రిస్మస్ ట్రీని తలపించే సీతాఫలం లోపలి తొడిమ" ప్రత్యేకంగా ప్రస్తావించబడి, ఆ వివరాల్ని ప్రత్యేకంగా దాచుకునే చిన్న మెదడు గదుల తలుపుల్ని తడతాయి. బ్రాడ్ బ్రష్ స్ట్రోక్స్ లో జీవితాల్ని జీవించేస్తూ ఈ వివరాల్ని కేవలం collateral, peripheral feelings గా అనుకుని మనం ముందుకెళ్ళిపోతుంటే ఇలాంటి చిరుస్పర్శల్ని గుచ్చి కథలు చెప్పే రచయిత ఈ micro-macro juxtaposition ని కాగితం మీదకి తెస్తాడు. ఐతే చిత్రంగా ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన కథ "ఎడ్డి" మళ్ళీ బ్రాడ్ స్ట్రోక్స్ ఎమోషనే. అవును, మనకు జీవితం మీద ఓవరాల్ వ్యాఖ్యానం చేసే కథలు కావాలి, ఆ కథ చెప్పే రచయితకు మన శరీరానిదో మనసుదో ఇంకా తేలని మన immediate senses స్పందన తాలూకు ఊగిసలాటలూ తెలియాలి. వీటన్నిటినీ కలిపి మూడేసుకోవాలనే మన ప్రయత్నమూ, నిస్సహాయతా జీవితమైతే వాటిని కలిపి ముద్ద తినిపించే కథలు ఒక ప్రత్యేకమైన రుచి.

- S


Thursday, November 6, 2025

ఫస్ట్ ప్లేస్ దేనికి...



(16-12-2024 నాటి వి.మల్లికార్జున్‌ ఎఫ్బీ పోస్ట్‌)


ఈ పుస్తకం గురించీ ఇందులోని రెండు కథల గురించీ ఈ మధ్య బాగా ఆలోచిస్తున్నా. మొన్ననే రాజిరెడ్డితో కూడా చెప్పానిది. కొండ, ఎడ్డి అని రెండు కథలుంటాయీ పుస్తకంలో. రాజిరెడ్డి రాసినవాటిల్లో ఈ రెండింటినీ టాప్-టూలో పెట్టి చూసుకుంటాను. ఫస్ట్ ప్లేస్ దేనికివ్వాలా అని నాతో నేనే గొడవ పడుతుంటాను. మొన్న ఒక రోజు ఎందుకో కొండ కథ గురించి ఆలోచిస్తూ ‘ఇదేనేమో బెస్ట్’ అనేసుకున్నా.

నేను చాలాసార్లు చెప్పినట్టు రాజిరెడ్డి ఇంతకుముందు రాసినవన్నీ ఒక ఎత్తు, ఈ పుస్తకంలోని పన్నెండు కథలు మాత్రం ఇంకో ఎత్తు. టాప్ క్లాస్ రైటింగ్. ‘అరె, ఇట్ల ఎట్ల రాసుంటడురా’ అనుకుంటుంటా ఈ కథల్ని ఎప్పుడు చదివినా.
అజు పబ్లికేషన్స్ ద్వారా ఈ పుస్తకాన్ని ప్రచురించే అవకాశం దక్కడం నేను మర్చిపోలేనివాటిల్లో ఒకటి. ఇవ్వాళ్టికి ఈ పుస్తకం బయటికొచ్చి ఏడాదయ్యింది. మీరింకా చదవకపోయి ఉంటే బుక్‌ఫెయిర్‌కి కొనాలనుకుంటున్న పుస్తకాల్లో ఒకటిగా ‘గంగరాజం బిడ్డ’ను చేర్చుకొండి.
I just want you all experience his writings.
All love Poodoori Rajireddy sir. 💙🤗

- వి.మల్లికార్జున్‌ 

Monday, November 3, 2025

యుగాంత రచయిత



యుగాంత రచయిత


ఆధునిక యూరప్‌ సాహిత్యంలోనైనా, ఏ తరపు యూరప్‌ సాహిత్యంలోనైనా విశిష్ట స్థానం ఉన్న హంగెరీ రచయిత లాస్లో క్రాస్‌నాహోర్‌కైయేను ఈ యేటి సాహిత్య నోబెల్‌ పురస్కారం వరించింది. ‘ప్రళయ భయాల మధ్యలోనూ కళాశక్తిని తిరిగి ధ్రువీకరించే... ఆకర్షణీయమైన, దూరదృష్టి గల సాహిత్య కృతుల సమాహారానికిగానూ’ 1954లో జన్మించిన ఈ 71 ఏళ్ల ‘హంగేరియన్‌ రుషి’కి ఈ గౌరవం దక్కింది. తన తొలి నవల ‘సాటాన్‌టాంగో’(1985)కు మూడు దశాబ్దాల తర్వాత వెలువడిన ఆంగ్లానువాదానికిగానూ 2015లో ‘మ్యాన్‌ బుకర్‌ ఇంటర్నేషనల్‌ ప్రైజ్‌’ అందుకున్న లాస్లో సరిగ్గా దశాబ్దం తర్వాత మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడే ఆయన ‘ద మెలంకలీ ఆఫ్‌ రెసిస్టెన్స్‌’ (1989), ‘వార్‌ అండ్‌ వార్‌’ (1999), ‘బారన్‌ వెంక్‌హెయిన్స్‌ హోమ్‌కమింగ్‌’ (2016) లాంటి ఇతర పోస్ట్‌మాడర్న్‌ నవలలు రాశారు.

కథకుడు కూడా అయిన లాస్లో క్రాస్‌నాహోర్‌కైయే ప్రధానంగా హంగేరియన్‌ భాషలోనూ, చాలాకాలంగా నివాసం ఉండటం వల్ల జర్మన్‌లోనూ రాస్తారు. ఆయన సాహిత్యంలో ప్రపంచం వల్ల గాయపడిన మనుషులు కనిపిస్తారు. భయ పీడనలను వాళ్లు తప్పించుకోలేరు. సామాజిక అభద్రత, అశాంతి, భరించలేని ఉక్కపోత, నియంతృత్వపు అరాచకాల ఈ అపసవ్య ప్రపంచంలో జరిగే కర్కశ పోరాటాలను ఆయన చిత్రించారు. అందానికీ అవినీతికీ, అమాయకత్వానికీ కపటానికీ, బలహీనతకూ మొరటు బలానికీ మధ్య జరిగే ఎడతెగని పోరు; ప్రతి ఎత్తునూ ఒక అగాథానికి లాగే, ప్రతి స్వర్గాన్నీ ఒక నరకానికి నేలకూల్చే దారుణాలు ఆయన వస్తువులు. అందుకే అమెరికన్‌ విమర్శకురాలు సూసన్‌ సోంటాగ్‌ ఆయన్ని యుగాంత సాహిత్యపు గురువుగా అభివర్ణించారు. ఆయన కళ ఎల్లప్పుడూ అసంబద్ధతకు ఆతిథ్యంగా నిలుస్తుంది– ప్రపంచం తానే ఒక వ్యక్తిత్వాన్ని సంతరించుకొని, దయలేని ప్రతిద్వంద్విగా మారే మార్గాలకు సదా తెరిచి ఉంటుందని వ్యాఖ్యానిస్తారు బ్రిటిష్‌ రచయిత ఆడమ్‌ థర్ల్‌వెల్‌.

కాఫ్కా ‘ద క్యాజిల్‌’, దోస్తోవ్‌స్కీ ‘ది ఇడియట్‌’ను అభిమానించే లాస్లో ఎన్నడూ రచయిత కావాలని అనుకోలేదు. 1970ల్లో ఆయన పాస్‌పోర్టును కమ్యూనిస్టు అధికారులు జప్తు చేశారు. దానివల్ల బొగ్గు గని కార్మికుడిగా పనిచేశారు. ఆవుల కొట్టాలకు రాత్రుళ్లు కావలి కాశారు. బార్లలో పియానో వాయించారు. గ్రామాల్లో పేదలతో కలిసి బతికారు. వీధుల్లోని జన భాషను ఒంటబట్టించుకున్నారు. మూడు నాలుగు నెలలకోసారి కొత్త పనులు వెతుక్కుంటూ తిరిగారు. ఈ అశాశ్వత ప్రపంచానికి కళ ఒక్కటే అతివిశిష్టమైన ప్రతిస్పందన అని నమ్మి రచనా వ్యాసంగం వైపు మళ్లారు. లాస్లో లాగే రాజ్య వ్యవస్థ బాధితుడైన హంగెరీ దిగ్దర్శకుడు బేలా టార్‌ ఆయనతో జట్టు కట్టడం యావత్‌ ప్రపంచ సినిమాకే మేలు చేసింది. బేలా టార్‌ను బేలా టార్‌గా నిలబెట్టిన సినిమాల రచయితగా లాస్లో పనిచేశారు. ‘డామ్నేషన్‌’, ‘ద లాస్ట్‌ బోట్‌– సిటీ లైఫ్‌’, ‘వెర్క్‌మెయిస్టర్‌ హార్మనీస్‌’, ‘ద ట్యూరిన్‌ హార్స్‌’తో పాటు ఏడు గంటల నిడివుండే ‘సాటాన్‌టాంగో’ వీరి కాంబినేషన్లో వెలువడ్డాయి. నలుపు తెలుపుల్లో తీయడం, దీర్ఘ షాట్లు, మౌనం మాట్లాడటం, ఏమీ జరగకుండానే ఎంతో జరిగినట్టనిపించడం వీటి ప్రత్యేకత.

లాస్లో వచనంలో అన్నీ గుక్క తిప్పుకోలేని దీర్ఘ వాక్యాలే. ఫుల్‌స్టాపులు దేవుడికి సంబంధించినవంటారాయన. గుర్రాలు, గ్రహణాలు, తిమింగళాలు, ఇంకా మానవ ఉనికితో సహా ఈ విశ్వంలోని ప్రతిదాన్నీ అందమైనదిగా, అద్భుతమైనదిగా విశ్వసించే సాధారణ మనుషులు ఆయన సాహిత్యంలో ఆశావహ ప్రపంచపు ప్రతినిధులుగా కనబడతారు. కానీ ఆ ఆశ అనేది ఎప్పటికీ భవిష్యత్తకు సంబంధించినదే; అలాంటి భవిష్యత్తుతో మనల్ని మనం భ్రమింపజేసుకుంటాం, ఆ భవిష్యత్తు ఎప్పటికీ రాదు; ఉన్నది వర్తమానం మాత్రమే అంటారు బౌద్ధ తాత్విక చింతనను ఇష్టపడే లాస్లో. యుగాంతం ఎప్పుడో సంభవించేది కాదనీ, అది ఇక్కడే ఉంది; అది సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ప్రక్రియ అనీ పాఠకులను అప్రమత్తం చేస్తారు. ఈ చీకటి యుగంలో బతకడానికి చదవడం మరింత శక్తినిస్తుందంటారు.

(13-10-2025)

Friday, October 31, 2025

నిద్రకళ


 ఆదిమ నిద్రకళ


నిద్ర అనే మాటే ఒక మత్తు, మహత్తు. అలసిన శరీరానికి హాయి... నిద్ర. గడిచిన దినానికి తీపి వీడ్కోలు... నిద్ర. నిద్ర పోవడం అనే దశ నుంచే శిశువు జీవితం ఆరంభమవుతుంది. రోజులో పదహారు గంటలు నిద్రపోతూనే దినదిన ప్రవర్ధమానమవుతాడు. ఏ పాటా రాని తల్లి కూడా పసివాడిని నిద్రపుచ్చడానికి ‘ఉళుళుళు హాయి’ అని లాలి రాగం తీస్తుంది. ఆ లెక్కన ప్రతి తల్లీ ఒక గాయనే అనుకోవాలి. నిద్ర అనేది మనిషికి ప్రకృతి ప్రసాదించిన చవకైన విలాసం.

నిద్ర అనేది నిజమైన సమవర్తి కూడా. ఏ మనిషైనా తన దగ్గర అన్ని కిరీటాలను పక్కన పెట్టాల్సిందే. కేవలం శ్వాసించే మాంసపు బంతులుగా ఆడాల్సిందే. ‘‘ఈ నీడల నాటకరంగం మీద జీవితపు మెరకపల్లాల్లోంచి వచ్చిన వాళ్లందరూ ఒకే హోదాతో నిలబడతారు. ఇక్కడ విభేదాలు లేవు. ఈ కౌగిలి అందరికీ ఒకేరకపు శాంతినిస్తుంది. ఇక్కడ యాచన లేదు. లేదనటం లేదు. అవమానం లేదు. ఈ వాకిలి దగ్గరకు వచ్చినవాడెవ్వడూ ఉత్త చేతులతో తిరిగి వెళ్లడు’’ అంటాడు కథక కవి ఆలూరి బైరాగి. నిద్ర అనేది దివ్యలోకాలకు తలుపులు తెరిచే సాధనం. ఏ మనిషికా మనిషి సమాంతర ప్రత్యేక లోకాలను ఆవిష్కరించుకోగలిగే తరుణోపాయం. కలల రెక్కల మీద ప్రతి జీవీ అక్కడ ఎల్లలు లేకుండా తిరుగుతాడు. తెల్లారేసరికి ఏమీ ఎరగనట్టే మామూలుగా ఉండిపోతాడు.

మనిషికి ఉన్నవి రెండే స్థితులు: పగలు పని, రాత్రి నిద్ర. అవి తారుమారవ్వడం ఆధునిక పరిణామం. ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదంటారు. నిద్రలోంచి లేవడమంటే దాదాపు చచ్చి మళ్లీ బతికినట్టే. అందుకే కొందరు నిద్ర లేవగానే కృతజ్ఞతగా దేవుడికి దండం పెట్టుకుంటారు. కానీ అదంతా కాయకష్టం చేసిన రోజుల్లో. ఇప్పుడు మనిషి స్థానాన్ని యంత్రం ఆక్రమించాక, నడుం వంచడం అనేదే పెద్ద పనైపోయింది. లక్షల ఏళ్ల మనిషి నాగరికతా ప్రస్థానంలో 10,000 ఏళ్ల నుంచే మనుషులు నగరాల్లో జీవించడం మొదలుపెట్టారు. పంతొమ్మిదో శతాబ్దం చివరలోనే కరెంట్‌ మనిషి జీవితంలోకి వచ్చింది. 1970ల తర్వాతే కంప్యూటర్లు ఇళ్లల్లోకి ప్రవేశించాయి. వీటన్నింటికీ మనిషి మెదడు సర్దుకుపోతూ వచ్చింది.

ఈ క్రమంలో చరిత్ర పూర్వ మనుషులు ఎలా నిద్దరోయారు అనేది ఒక ఆసక్తి. చెట్టు కొమ్మలనే పాన్పులుగా చేసుకుని అదే చెట్ల మీద పడుకోవడమూ ఉండేది. ఎటో జారిపోతున్న భావన కలిగి ఉన్నట్టుండి మనం ఇప్పుడు నిద్రలోంచి మేల్కొనడం అనేది మన పూర్వీకుల చెట్ల నిద్ర తాలూకు అవశేషం మన రక్తంలోకి ఇంకిపోవడం వల్ల జరుగుతున్నదని నిద్రా నిపుణులు చెబుతుంటారు. అలా జారిపోతున్న సంవేదన ఆ ఆదిమ మానవులకు ఒక రక్షాకవచంలా పనిచేసి, క్రూర మృగాల పట్ల అప్రమత్తతతో ఉంచింది. అయితే, రెండు లక్షల ఏళ్ల క్రితమే మనుషులకు ‘మంచం’ లాంటిది ఏర్పాటు చేసుకోవడం తెలుసు అంటారు ‘హౌ టు స్లీప్‌ లైక్‌ ఎ కేవ్‌మాన్‌: ఏన్షియెంట్‌ విజ్‌డమ్‌ ఫర్‌ ఎ బెటర్‌ నైట్స్‌ రెస్ట్‌’ రచయిత డాక్టర్‌ మెరిజిన్‌ వాన్‌ డె లార్‌. పట్టు పాన్పు, మబ్బు దుప్పట్లు లేకపోయినా, మట్టిని బల్లపరుపుగా చేసుకొని, దాన్ని మరిన్ని పొరలుగా ఉబ్బుగా దిద్దుకుని, దాన్ని కొమ్మలు, గడ్డి, ఆకులతో మెత్తబరుచుకొని పడుకునేవాళ్లు. పురుగూ పుట్రను తరిమికొట్టే మొక్కలను అక్కడ ఉంచేవాళ్లు. పక్కనే క్యాంప్‌ ఫైర్‌ ఉండనే ఉంటుంది. అదే మంటతో ఆ మంచాన్ని నియమిత సమయాల్లో కాల్చుతుండేవాళ్లు. దానివల్ల కూడా పురుగూ పుట్రా ఆ దరికి చేరకుండా ఉండేవి. అవే మంచాలను బహుముఖంగా పని ప్రదేశాలుగానూ, పని ముట్లను సాఫుచేసుకోవడానికీ వాడుకునేవాళ్లు. అందుకే చరిత్ర పూర్వ మనుషులనగానే అనాగరికమైన ఊహ రావడాన్ని వ్యతిరేకిస్తారు వాన్‌ డె లార్‌. నిద్ర, తిండి విషయంలో వాళ్లు అత్యంత వివేకంతో వ్యవహరించారన్నది నెదర్లాండ్స్‌కు చెందిన ఈ ‘స్లీప్‌ సైంటిస్ట్‌’ వాదన. వ్యాయామం ఉండటం, తిండిలో చక్కెర లేకపోవడం అనే రెండు కారణాల వల్ల వాళ్లకు ఇట్టే నిద్రపట్టేది. ఆ రెండు రివర్సు కావడం వల్ల ఇప్పుడు నిద్ర కరవవుతోంది. వీటినే సూచనలుగా స్వీకరిస్తే మనం కోల్పోతున్న నిద్రను మళ్లీ పొందొచ్చేమే!

(15-9-2025)

Wednesday, October 29, 2025

కుక్క కథ



కుక్క కథ


కుక్కల మీద మనిషికి ఎప్పుడూ సదభిప్రాయం ఉన్నట్టు లేదు. ‘కుక్క’ అనే మాటనే తిట్టుగా వాడగలడు. కుక్క బుద్ధి అని నిందించగలడు. కుక్కల కొట్లాట అని దూషించగలడు. కుక్క బతుకు అని బాధపడగలడు. కుక్క మూతి పిందెలు అని తూలనాడగలడు. కుక్క కాటుకు చెప్పుదెబ్బ అని దెప్పిపొడవగలడు. ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి అని వెక్కిరించగలడు. ‘కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టి’ అని పాడగలడు. ఆఖరికి కుక్క చావును తనకు ఇష్టంలేని మనిషి జీవితయాత్రకు భరత వాక్యంగా జోడించగలడు.

కుక్కలను వాటిమానాన వాటిని అడవిలో మననీయకుండా ఇంటిదాకా తెచ్చుకున్నది మనిషే. సుమారు 15,000 సంవత్సరాల క్రితమే మనిషి దాన్ని మచ్చిక చేసుకున్నాడు. మానవులు తొట్టతొలిగా మచ్చిక చేసుకున్న జంతువు కుక్కేనంటారు. కాదు, గొర్రె అని మరో వాదన. ఏమైనా మనిషితో తొట్టతొలిగా స్నేహం చేసిన జంతువుల్లో కుక్క అగ్రభాగాన ఉందన్నది సత్యం. అప్పటినుంచీ అది మనిషికి వేటలో సాయపడింది. పంటలను కాపు కాసింది. మంచులో స్లెడ్జ్‌ బళ్లను లాగింది. దొంగలు, హంతకుల జాడను పసిగట్టింది. బాంబులను గుర్తించింది. ఒంటరి జీవులకు తోడుగా నిలిచింది. ‘దేవదాసు’లకు సాంత్వననిచ్చింది. తెగించి యజమానుల ప్రాణాలను కాపాడింది. మనిషి నాగరికతా ప్రస్థానంలో తనకు తెలియకుండానే విశ్వసనీయమైన పాత్రను పోషించింది. దాని తోక మాత్రమే వంకర కావొచ్చుగానీ దాని పనికి ఏ వంకా లేదు. అంతెందుకు, 1957లో రష్యన్లు ‘స్పుత్నిక్‌’లో తొట్టతొలిగా ఒక జీవిని అంతరిక్షంలోకి పంపాలనుకున్నప్పుడు వాళ్లు ఎంచుకున్నది కూడా ఒక కుక్కనే. అది మాస్కో వీధుల్లో తిరుగాడిన మూడేళ్ల ఆడ ఊరకుక్క. పేరు లైకా. అది ప్రాణాలతో తిరిగిరాదని దానికి తప్ప శాస్త్రవేత్తలందరికీ తెలుసు!

జపాన్‌లో హచికో కుక్కది మరో కథ. తన యజమాని టోక్యో యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసేవాడు. విధులు ముగించుకుని ఆయన సాయంత్రం షిబూయా రైల్వే స్టేషన్‌లో రైలు దిగేవాడు. అప్పటికి రెండేళ్ల వయసున్న హచికో అతడి కోసం అక్కడ వేచివుండేది. ఒకరోజు ఉన్నట్టుండి ఆ ప్రొఫెసర్‌ విధుల్లోనే బ్రెయిన్‌ స్ట్రోక్‌తో కుప్పకూలి చనిపోయాడు. ఇదేమీ తెలియని హచికో రోజులాగే యజమాని కోసం స్టేషన్‌కు వచ్చింది. తెల్లారీ వచ్చింది. మరునాడూ వచ్చింది. క్రమం తప్పకుండా వస్తూనే ఉంది, ఎదురుచూస్తూనే ఉంది. అప్పటికిగానీ స్థానికులు దాన్ని గుర్తించలేదు. తనని ప్రేమించిన యజమాని కోసం, తాను ప్రేమించిన యజమాని కోసం 1925– 1935 కాలంలో అది చనిపోయేదాకా సుమారు పదేళ్లపాటు ఆ స్టేషన్‌లో ఎదురుచూసింది. జపాన్‌లో ఇప్పుడు హచికో ఒక సాంస్కృతిక చిహ్నం. కుక్క అంటే విశ్వాసం అనే పేరు దానికి ఊరకే రాలేదు. వేల ఏళ్లుగా లక్షలాది కుక్కలు సమష్టిగా సముపార్జించుకున్న ఘనత అది.

ప్రపంచంలో సుమారు 360 రకాల కుక్కలున్నాయి. వీటన్నింటినీ తిరిగి ఇంటికుక్క, ఊరకుక్క అని రెండు రకాలుగా విభజించవచ్చు. ఈ రెండింటికీ మధ్య ఉన్నది స్వల్ప భేదమే. ఇది జాతిపరమైనది కాదు. పెంచుకుంటే ఇంటి కుక్క. ఎవరికీ పట్టనిది ఊర కుక్క. ‘మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు, కుక్కను మనిషి కరిస్తే వార్త’ అని జర్నలిజంలో ఒక తొలి పాఠం చెబుతుంటారు. కానీ మనుషులను కుక్క కరిచినా వార్త అవుతుండటం కుక్క కాట్ల తీవ్రతను తెలియజేస్తోంది. ఇది అత్యంత ఆందోళనకరంగా పరిణమించడం వల్లే ఊరకుక్కలను ఊళ్లో ఉంచాలా వద్దా అనే చర్చ దేశమంతా నడుస్తోంది; వాటికి అనుగుణంగా, వ్యతిరేకంగా ఎన్నో వాదనలు వినబడుతున్నాయి.
 
జాక్‌ లండన్‌ రాసిన ‘కాల్‌ ఆఫ్‌ ద వైల్డ్‌’ నవలలోని బక్‌ కుక్క ‘దుడ్డుకర్ర చేతగలవాడిది పైచేయి’ అని ఇట్టే అర్థం చేసుకుంటుంది. ఆ పాఠాన్ని జీవితంలో ఎన్నడూ మరవదు. మనిషి సాధారణంగా ద్వంద్వ జీవి. దుడ్డుకర్రతో కుక్కలకు ‘ఆటవిక శాసనాన్ని’ పరిచయం చేయగలడు; లైకా అంతరిక్షంలో విలవిల్లాడి చచ్చిపోయిందంటే జీర్ణం చేసుకోలేక దాన్ని గ్రహాంతరవాసులు కాపాడినట్టు ప్రత్యామ్నాయ సాహిత్యాన్ని సృజించుకోగలడు(ఉదా: జూలియన్‌ మే రాసిన ‘ఇంటర్వెన్షన్‌’). ‘పాతాళ్‌ లోక్‌’ వెబ్‌సిరీస్‌లో హథోడా త్యాగీకి తన గురువు ఒక మాట చెబుతాడు: ఒక మనిషి మంచివాడా కాదా అన్నది తెలుసుకోవడానికి అతడు కుక్కలతో ఎలా ఉంటున్నాడో చూడమంటాడు. దేశంలో సుమారు ఆరు కోట్ల ఊరకుక్కలున్నాయట. మనం వద్దనగానే అవి మాయం కావు. ఈ భూమ్మీది నుంచి ఎక్కడికీ పోవు. వాటిని మననిస్తూ, మనం ఇబ్బందిపడకుండా ఏ శాస్త్రీయ మార్గాలున్నాయో అన్వేషించడమే ఉత్తమ మార్గం. ప్రతి కుక్కకూ ఒక రోజంటూ ఉండాలిగా!

(18-8-2025; Sakshi)

Friday, August 1, 2025

ఏఐ కృత్రిమ రచన


 

కృత్రిమ రచన


ఆత్మ అనేది కేవలం స్వర్గలోక సంబంధి కాదు. దానికి భౌతిక ఉనికి లేనంతమాత్రాన అది భావవాదులకు మాత్రమే చెందినది కాదు. అదేంటో చూపలేకపోయినా, అది లేకపోవడమంటే ఏమిటో మనకు తెలుసు. ఈ మెటీరియలిస్టు ప్రపంచంలో ఆత్మగల్ల మనుషులను వెతికే ప్రయత్నం కాదిది.  కృత్రిమ మేధ (ఏఐ) సందర్భంలో ఆత్మ ప్రాధాన్యతను అర్థం చేయించాలన్న ఆరాటం. మానవీయ సహజ మేధనూ, యాంత్రిక కృత్రిమ మేధనూ విడదీస్తున్నది ముఖ్యంగా ఆ ఒక్కటే!

‘ఈ కంప్యూటర్‌ కాలంలో’ అని చెప్పడం నుంచి, ‘ఈ కృత్రిమ మేధ కాలంలో’ అనడం వరకు పయనించాం. మానవ నాగరికత ఒక క్రమ పరిణామమే అయినా, అది ఒక్కోసారి పెద్ద అంగ వేస్తుంది. నిప్పును పుట్టించడం, విద్యుత్‌ను కనుగొనడం, ఇంటర్నెట్‌ లాంటి మరో విప్లవాత్మకమైన మార్పు కృత్రిమ మేధ అని పండితులు అంటున్నారు. మనిషి తాను ఎదిగే క్రమంలో ఎన్నో ఉపకరణాలనూ, సాంకేతిక పరిజ్ఞానాలనూ రూపొందించుకున్నాడు. ఆ ఉపకరణాలు, పరిజ్ఞానాల ఊతంగా మరింత ఎదిగాడు. కానీ ఏఐ కేవలం మనిషి చేతిలో మరో పనిముట్టు కాదు, మరో అదనపు పరిజ్ఞానం అంతకన్నా కాదు. అంతకు మించి! పర్యావరణ పరిష్కారాలు సూచిస్తుందంటున్న ఏఐ టెక్నాలజీ నిజానికి అత్యధిక కార్బన్‌ ఫుట్‌ప్రింట్స్‌కు కారణమవుతోందనీ, జలవనరులను విపరీతంగా తోడేస్తోందనీ పర్యావరణవేత్తలు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. కానీ ఇవేవీ ఏఐని వ్యతిరేకించడానికి తక్షణ కారణాలు కాదు. ఇతర పరిజ్ఞానాలు కనీసం మన అంచనాలో మనిషిని సుఖపెట్టడానికి రూపొందినవి. కానీ ఏఐ ఏం చేయనుందో మనకు ఏ అంచనా లేదు!

సాహిత్య ప్రపంచంలో కొంతకాలంగా ఉన్న భయం ఈ మధ్య ఒక ‘ఓపెన్‌ లెటర్‌’ రూపం దాల్చింది. యంత్రాలు సృష్టించిన పుస్తకాలను విడుదల చేయకూడదంటూ ఈ జూన్‌ నెలలో పదుల కొద్దీ రచయితలు అమెరికాలోని పెంగ్విన్‌ రాండమ్‌హౌజ్, హార్పర్‌ కొలిన్స్‌ లాంటి ప్రచురణకర్తలకు బహిరంగ లేఖ రాశారు. ఏఐ–కల్పిత పుస్తకాలను విడుదల చేయడానికి ‘రచయితల’ను సృష్టించబోమనీ, ఒకవేళ మానవ రచయితలే అలాంటివి కల్పిస్తే వాటిని ‘మారుపేర్ల’తో అనుమతించబోమనీ, ఈ ‘దొంగతనానికి’ ఏ విధంగానూ మద్దతివ్వబోమనీ ప్రచురణకర్తలు ప్రతిన బూనాలని వారు కోరారు. ఒక పుస్తకం తుదిరూపు వరకు భాగమయ్యే మనుషుల ఉద్యోగాలను ఏఐ టూల్స్‌కు బలిపెట్టకూడదనీ అడిగారు. ఘంటాలను దాటి, పెన్నుకు బదులుగా టైప్‌ రైటర్‌నో, కంప్యూటర్‌నో వాడటం లాంటి పరిణామం కాదిది. ఏకంగా రచయితనే పక్కకు తప్పించేది! అందుకే రచయితల అనుమతి లేకుండా, రాయల్టీలు చెల్లించకుండా రూపొందిన కృత్రిమ మేధను ప్రచురణకర్తలు వాడకూడదనే విన్నపం కూడా వీటిల్లో ఉంది. ఎటూ ‘దోపిడీ’కి గురవుతున్న శ్రమకు పరిహారం కోరుకోవడం ఇది!

సాహిత్యం అంటేనే మానవ అనుభవం. లోలోపలి తరంగం, అంతరంగ జ్వలనం, ఆనంద చలనం. అవేమీ లేని ఏఐ ఎలా రాస్తుంది? ‘ఎలక్ట్రిక్‌ గొర్రెలను కలగంటుందా ఏఐ?’ అని అడుగుతాడు కవి డేవిడ్‌ స్టీర్‌. ‘ఒక రచన చేస్తున్నప్పుడు రచయిత రాస్తున్న ప్రతి పదాన్నీ తెలిసో, తెలియకో ఎంపిక చేసుకుంటాడు. పది వేల పదాల కథకు పది వేల ఎంపికలు. అలాంటి స్పృహ లేనందువల్ల కృత్రిమ మేధ ‘కళ’ను సృష్టించలేదంటాడు అమెరికన్‌ సైన్స్‌ ఫిక్షన్‌ రచయిత టెడ్‌ చియాంగ్‌. ‘‘ఒక మనిషి మీకు ‘ఐ యామ్‌ సారీ’ అని చెప్పినప్పుడు, గతంలో ఇతర జనాలు క్షమాపణ కోరుకున్నారన్నది విషయం కాదు; ‘ఐ యామ్‌ సారీ’ అనేది పరిగణించాల్సినంతటి అసాధారణమైన పద బంధం కాదన్నది విషయం కాదు. ఒకవేళ ఒకరు నిజాయితీగా చెబితే, ఆ క్షమాపణ విలువైనదీ, అర్థవంతమైనదీ అవుతుంది; అలాంటి క్షమాపణలు గతంలో చెప్పివున్నప్పటికీ.’’ ఒక రచయిత రాసేది అతడిదైన లోలోపలి వాక్యం. అది అతడికి మాత్రమే ప్రత్యేకం. అతడి అనుభవమే ఆ వాక్యం రాయడానికి పురిగొల్పుతుంది. యజమానిని చూడగానే కుక్క ప్రేమగా తోక ఊపుతుంది. దాని అన్ని కండరాలూ సంతోషంతో నర్తించడాన్ని ఆ తోక ఊపు సంకేతిస్తుంది. ఇలాంటి చిరు ఉద్వేగపు అనుభవం కూడా ఉండని ఏఐ ఏం రాయగలదు? ప్రదేశాలు, వస్తువులు మనిషి ఉనికితో ముడిపడి ప్రత్యేకమవుతాయి. ఏఐకి లేనిదే ఆ మహత్తర మానవీయ స్పర్శ.  కేవలం అన్నింటినీ రుబ్బి, ‘అలాగరిథమ్‌’ వండివార్చే రచనలో ఆత్మ ఎలా ఉంటుంది? మరి, ఎటూ కళ కాకుండాపోయే ఆ ఏఐ కల్పిత కృత్రిమ రచనల పట్ల భయం దేనికి అనేది ప్రశ్న. సగటు పాఠకుడికి ఆ మీడియోకర్‌ రచనే బాగుందనిపించొచ్చు. ఇక అదే ప్రమాణం అయ్యి, ‘అసలు’ది తీర్పునకు లోనవుతుందేమోనని ఒక సృజనాత్మక భయం!

త్రిపురనేని గోపీచంద్‌ నవల ‘పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా’లో ఒక పాత్రను ‘సజ్జలు సజ్జలు’ అని వెక్కిరిస్తారు అతడి సాహిత్య మిత్రులు. కోడి సజ్జలు తిని సజ్జలు విసర్జిస్తుంది, ఏమీ జీర్ణం చేసుకోకుండానే. ఎంతో మేధావిగా కనబడే ఆ రచయిత, ఏదీ తనలోకి ఇంకించుకోకుండానే మాటలు వల్లెవేస్తుంటాడని వారి ఉద్దేశం అనుకోవాలి. ఏఐ రచనలకు ఈ ఉదాహరణ బాగా పనికొస్తుంది. అయితే, అసలు ఇప్పుడు ఉన్నది ఇంకా ‘ఆదిమ’ ఏఐ మాత్రమేననీ, మున్ముందు ఇంకా ఆధునికం అవుతుందనీ చెబుతున్నారు. అప్పుడు అది ఏ రూపం తీసుకుంటుందో! ప్రస్తుత భయం రచయితను పక్కనపెట్టడం గురించే. మున్ముందు మనిషినే పక్కన పెట్టడం అవుతుందేమో! అప్పుడు సమస్త మానవాళి మరొక బహిరంగ లేఖ రాసుకోవాల్సి ఉంటుంది!

(21-7-25)

Tuesday, July 29, 2025

పేరు - చెడ్డపేరు



పేరుకు చెడ్డపేరు?


వేసుకుంటే పాత ప్రశ్నే. పేరులో ఏమున్నది? గులాబీకి ఆ పేరు లేకపోయినా అది గులాబీ అయ్యేది కాదా? ఆ పువ్వుకు అంత అందం వచ్చేది కాదా?  పేరు వల్ల కూడా అందం ఇనుమడిస్తుంది. పేరులో ఏమున్నది అనుకుంటే అందమైన పేర్ల కోసం ఆధునిక తల్లిదండ్రులు అంతగా ప్రయత్నించరు. ఈ అందం అనేది ఒక్కోసారి సాపేక్షం. అన్ని మతాల్లోనూ, సమాజాల్లోనూ పిల్లలకు పేరు పెట్టడం అనేది అనాదిగా పెద్ద పండుగ. నామకరణం తర్వాతే శిశువు నిజంగా ఈ భూమ్మీద ‘ఉనికి’లోకి వచ్చినట్టు!

మనిషికి పేరు అనేది దానికదే ఒక చిరునామా. ఎవరికైనా తన పేరును మించిన అందమైన పిలుపు మరొకటి ఉండదు, అంతకంటే మంచి కవితను ఇంకే కవీ రాయలేడు. పేరు అనేది మనిషిని ఎప్పటికీ వదలని హేంగోవర్‌. ఆ పేరులోని ప్రత్యేకత కంటే, ఆ పేరును మళ్లీ మళ్లీ వినడం వల్ల అది వారికి ప్రత్యేకమైపోతుంది. శిశువు ఈ భూమ్మీదకు రాగానే కూడగట్టుకోగలిగే తొలి సొంత ఆస్తి కూడా ఈ పేరే. ఇంక దాన్ని పెంచుకోవడం, తగ్గించుకోవడం అన్నది ఒక జీవితకాల ప్రయాణం తర్వాతే తేలుతుంది. ప్రాచీన రోమన్‌ సామ్రాజ్యంలో శుద్ధీకరణ పేరుతో నామకరణోత్సవం జరిగేది. ఆడశిశువులకు ఎనిమిదో రోజున, మగపిల్లలకు తొమ్మిదో రోజున పేర్లు పెట్టేవారు. ఆడపిల్లలు మగపిల్లల కంటే త్వరగా ఎదిగి పరిపూర్ణత్వాన్ని పొందుతారనేది ఈ తేడాకు కారణం.

పెట్టిన పేర్లు తికమకగా మారిపోవడం ఒక తమాషా. సుగుణ ఎంతటి గుణవంతురాలో మనకు తెలియదు. కోమలిది ఎలాంటి రూపమో ఊహించలేము. బలవంతరావు బలహీనంగా ఉండకూడదనేం లేదు. పేరుకు తగ్గట్టుగా మనిషి ప్రవర్తనను ఆశించడం కొన్నిసార్లు ఆశాభంగం కావొచ్చు. హరిశ్చంద్రుడు అబద్ధాలకోరు అవ్వకూడదనే కోరుకుంటాం. ధర్మరాజు అవినీతికి పాల్పడితే మరీ ఎక్కువ బాగోదు. పెట్టిన పేరుకు తగ్గట్టుగా ఉండలేక పిల్లలు సతమతమవడం మరో కోణం. కొన్ని పేర్లను కొందరు కుట్రపూరితంగా కూడా వాడుకోవచ్చు. ఉదాహరణకు మోసం. కానీ దాన్ని వాళ్లు ప్రేమ అనొచ్చు, స్నేహం అని పిలవొచ్చు. ఒక యుద్ధానికి ఏం పేరు పెడదామని అమెరికా అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌ సలహా అడిగితే, ‘అనవసర యుద్ధం’ అందామని సలహా ఇచ్చారట బ్రిటన్‌ ప్రధాని చర్చిల్‌. తగిన పేరు!

జనాలు తాము ఉన్నదాన్ని బట్టి తమ పేర్లను అందమైనవిగానో, వికారమైనవిగానో చేస్తారు అంటారు కెనడా రచయిత ఎల్‌.ఎమ్‌.మాంటొగోమెరీ. అది చాలావరకు నిజమే అయినా అన్నిసార్లూ నిజం కాదు. సూర్యకాంతం అంటే మనకు ఇప్పుడు ఒక పేరు కాదు. ఒక గయ్యాళి ముసలి. గిరీశం అంటే నక్కజిత్తులవాడే! భగవంతరావు అని వచ్చిందంటే ఒక స్థాయి మనిషి అనే అర్థం. పరమానందయ్య అనగానే వాలుకుర్చీలో విశ్రాంతిగా కూర్చునే సగటు మధ్యతరగతి మానవుడే. సాహిత్యమో, సినిమానో వేసే ముద్రలవల్ల కూడా పేర్ల స్వభావాలు మారిపోతాయి. కన్యాశుల్కం ఎంత గొప్ప నాటకమైనా లుబ్ధావధాన్లు, సౌజన్యారావు అంటూ పాత్రల పేర్లను వారి స్వభావాలకు తగ్గట్టుగా పెట్టడం కొంతమందికి నాటకీయంగా అనిపించింది. పాత్రకు తగ్గ పేరు పెట్టడం సహజం కాకపోయినా, ఔచిత్యం అనుకున్నారు మన రచయితలు. లేదంటే జనాలే పాత్రల పేర్లను మార్చేయొచ్చు. ఉదాహరణకు మహాభారతంలో ‘దుర్యోధనుడి’ పేరును సుయోధనుడు అనుకోనివాళ్లే ఎక్కువ. పిల్లల పేర్ల కోసం తల్లిదండ్రులు కొన్నిసార్లే తలలు బద్దలు కొట్టుకుంటారు. కానీ రచయితలు తాము సృష్టించే ప్రతి పాత్ర కోసం ఆ ‘పురిటి నొప్పులు’ పడాల్సిందే!

‘డ్రాకులా’ అనగానే దవడల పక్కన తెరుచుకున్న కోరలతో, మెడను కొరికి పచ్చినెత్తురు తాగే భయానక ఆకారం గుర్తొస్తుంది. అన్ని సాహిత్య రూపాల్లో అత్యధికసార్లు (700కు పైన) పునరావృతం అయిన పాత్రగా ఇది గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కింది. గాతిక్‌ శైలిలో నిర్మితమైన మధ్య యుగాల యూరోపియన్‌ భవనాలను ఒక వాతావరణం కోసం వాడుకుంటూ రాసిన గాతిక్‌ హారర్‌ సాహిత్యంలో ‘డ్రాకులా’ పేరుతోనే వచ్చిన నవల ఒక క్లాసిక్‌. సుమారు 125 ఏళ్ల క్రితం, 1897 మే 26న డ్రాకులా విడుదలైంది. అలాంటి గాతిక్‌ హారర్‌ సాహిత్యాన్ని డ్రాకులాకు ముందూ, తర్వాతా అని విభజిస్తారు వెండీ డోనిగర్‌. ఈ పాత్ర సృష్టికర్త లండన్‌లో స్థిరపడిన ఐరిష్‌ రచయిత బ్రామ్‌ స్టోకర్‌ (1847–1912) అనబడే అబ్రహామ్‌ స్టోకర్‌. ప్రపంచంలో డిటెక్టివ్‌ పాత్రలకు మోడల్‌గా నిలిచే షెర్లాక్‌ హోమ్స్‌ను సృష్టించిన ఆర్థర్‌ కానన్‌ డాయిల్‌ ఈయనకు దూరపు బంధువు కూడా. ‘ద ఫేట్‌ ఆఫ్‌ ఫెనెల్లా’(1891) పేరుతో 24 మంది రచయితలు రాసిన ఒక గొలుసు కట్టు నవలలో వీళ్దిద్దరూ కూడా భాగమయ్యారు. ఒకసారి లైబ్రరీలో బ్రామ్‌ స్టోకర్‌ ఏ పుస్తకాలో తిరగేస్తూవుంటే ‘డ్రాకులా’ అనే పేరు కంటబడింది. ఆ పేరులో ఆయనకు నిలువెల్లా దుష్టత్వం కనబడటమే కాక, దానికి అలాంటి అర్థమే ఉంటుందనుకున్నాడు. అందుకే ఆ పేరునే తన ప్రతినాయకుడికీ, నవలకూ వాడుకున్నాడు. ఇంతాచేస్తే ఈ డ్రాకులా అనేది ఒక వంశనామం. ఆగ్నేయ యూరప్‌ దేశమైన రొమేనియా పాలకుడు... వ్లాద్‌ డ్రాకులా. 15వ శతాబ్దిలో రొమేనియాను పాలించాడు. ఆయన్ని ఆ దేశ జాతీయ హీరోగా ఆరాధిస్తారు. ఈయన డ్రాకులా వంశంలో మూడోవాడు. ఈయన తండ్రి రెండో వ్లాద్‌ డ్రాకులా. అలాంటి పేరుకు ఈ నవల మచ్చ తెచ్చిందో, ఆ పేరును ఎప్పటికీ నిలిచేలా చేసిందో తీర్పునివ్వడం కష్టం. గులాబీకి గులాబీ అనే తగిన పేరు ఉండటం వల్లే అది పూరాణిగా రాణించిందా, ‘డ్రాకులా’కు డ్రాకులా అని పెట్టడం వల్లే అది ఒక పాత్రగా ఇంతగా నాటుకుపోయిందా చెప్పడం కష్టం. అది ఒక మనిషిని తన పేరుకు బదులుగా ఇంకొకటి చెప్పుకొమ్మనడం లాంటిది.

(23rd June 2025)

Saturday, July 26, 2025

బాను ముష్తాక్‌కు ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రైజ్‌



కథకు దక్కిన గౌరవం


కన్నడ రచయిత్రి బాను ముష్తాక్‌ తన ‘హార్ట్‌ ల్యాంప్‌’(హృదయ దీపం) కథాసంపుటికిగానూ ‘ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రైజ్‌’ గెలుచుకోవడం చాలా విధాలుగా ప్రత్యేకమైనది. ఇది కర్ణాటకకే కాదు, దక్షిణ భారతదేశానికే దక్కిన తొలి గౌరవం. బుకర్‌ చరిత్రలో ఒక కథల సంపుటికి ఈ పురస్కారం దక్కడం ఇదే ప్రథమం. ఇది గెలుచుకున్న అత్యంత ఎక్కువ వయసువాళ్లలో(77) ఆమె ఒకరు(ఫిలిప్‌ రాత్‌కు ఇచ్చినప్పుడు 78). ఆంగ్లంలో రాసిన పుస్తకాలకు ఇచ్చే ‘బుకర్‌ ప్రైజ్‌’ను కొంతమంది భారతీయ, భారత సంతతి రచయితలు ఇంతకుముందు గెలుచుకున్నారు; వాటి గొప్పతనం వాటిదే. కానీ ఆంగ్లంలో రాయనక్కర్లేకుండా తమకు చేరువైన భాషలో రాస్తూనే అంతర్జాతీయ ఖ్యాతి పొందవచ్చని ఈ గౌరవం చెబుతోంది. భిన్న భారతీయ భాషల్లో వస్తున్న శ్రేష్ఠమైన సాహిత్యాన్ని ఆంగ్ల ప్రపంచ గుమ్మంలోకి ప్రవేశపెట్టే చొరవ చూపేలా ఈ విజయం ప్రచురణకర్తలకు ప్రేరణనిస్తోంది. గట్టిగా ఆంగ్ల భాష తలుపు కొట్టగలిగితే, ఇతర భాషల కిటికీలు వాటికవే తెరుచుకుంటాయి.

రచయిత్రి, పాత్రికేయురాలు, కార్యకర్త, న్యాయవాది అయిన బాను ముష్తాక్‌ ఆరు కథా సంపుటాలు, ఒక వ్యాసాల సంకలనం, ఒక కవిత్వ సంపుటి, ఒక నవల వెలువరించారు. పురుషాధిపత్య సమాజంలో ముస్లిం మహిళల జీవన వ్యథలను ఆమె చిత్రించారు. ఆమె పాత్రలు కన్నడ, దక్కనీ ఉర్దూ, అరబిక్‌ మాట్లాడుతాయి. 1990–2023 మధ్యకాలంలో ఆమె రాసిన 50కి పైగా కథల్లోంచి 12 కథలను కూర్చడంతోపాటు, వాటిని ఆంగ్లంలోకి అనువదించిన దీపా భాస్తి ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రైజ్‌ గెలుచుకున్న తొలి భారతీయ అనువాదకురాలు అయ్యారు. ‘‘మహిళ రాసి, మహిళ సంపాదకత్వం వహించి, మహిళ అనువదించిన పుస్తకం హార్ట్‌ ల్యాంప్‌’’ అన్నారు బెంగాలీ అనువాదకుడు అరుణవ సిన్హా. ఈ పురస్కారాన్ని 2022లో తొలిసారిగా ఇండియా నుండి హిందీ రచయిత్రి గీతాంజలి శ్రీ గెలుచుకోవడానికి కారణమైన అనువాదకురాలు డైసీ రాక్‌వెల్‌ ఒక అమెరికన్‌ అని తెలిసిందే. అవార్డు కింద నగదుగా ఇచ్చే యాభై వేల పౌండ్లను నియమాల మేరకు బాను, దీపా సమానంగా పంచుకుంటారు. భారతీయ భాషల్లోని మంచి సాహిత్యాన్ని మరో దరికి చేర్చాలన్న అనువాదకుల పూనికకు ఇది గట్టి ప్రోత్సాహం కాగలదు.

1970–80ల్లో కర్ణాటకలో మొదలైన బండాయ సాహిత్యోద్యమం దళితులు, ముస్లింలు తమ కథలను తామే రాసుకునే ప్రేరణనిచ్చింది. మంచి ముస్లిం బాలికలు ఉర్దూలో ఖురాన్‌ చదవగలిగితే చాలు అనే సామాజిక వాతావరణంలో తొలుత ఉర్దూలో చదవడం ప్రారంభించి, తండ్రి (ఎస్‌.ఎ.రహమాన్, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌) ప్రోద్బలంతో కన్నడ మాధ్యమంలోకి మారిన బాను ఆ భాషనే తన రచనా వాహికగా ఎంచుకున్నారు. ‘‘నాకు అక్షరాలు వచ్చినప్పటినుంచీ రాయడం మొదలుపెట్టాను’’ అంటారామె. రష్యన్‌ రచయిత ఫ్యోదర్‌ దోస్తోవ్‌స్కీ, కన్నడ రచయిత దేవనూర్‌ మహదేవను అభిమానించే ఆమె ‘నాను అపరాధియే?’ పేరుతో తొలి కథ రాశారు. తన స్నేహితురాళ్లు చిన్ననాటనే పెళ్లిళ్లు చేసుకుని జీవితంలో నిలిచిపోతున్నా ఆమె ఆగకుండా పైచదువులకు వెళ్లారు. సినిమాకు వెళ్లడం మీద ఒక ముస్లిం యువతిని అడ్డుకున్న ఉదంతం గురించి ఆమె రాసిన తొలి వ్యాసం చర్చనీయాంశం కావడంతోపాటు ఆమెను ‘లంకేశ్‌ పత్రికే’ జర్నలిస్టుగా మార్చింది. 26 ఏళ్ల వయసులో ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ, వివాహానంతరం బురఖా ధరించాలనీ, ఇంటి పనులకే పరిమితం కావాలనీ అత్తవారింటి నుంచి ఒత్తిడి వచ్చింది. చేస్తున్న హైస్కూల్‌ టీచర్‌ ఉద్యోగం మానాల్సి వచ్చింది. ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి కలిగాక ఒక దశలో నిరాశా నిస్పృహలతో వైట్‌ పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకోబోయారు. మూడేళ్ల పాపను ఆమె కాళ్ల దగ్గర పెట్టి, అలా చేయొద్దంటూ ఆమె భర్త ముష్తాక్‌ మొహియుద్దీన్‌ ఆమెను హత్తుకున్నారు. అప్పట్నించీ ఆమెకు అన్నింటా అండగా నిలిచారు.

స్త్రీల వేదన, నిస్సహాయత తన మీద లోతైన ప్రభావం చూపి, రాయక తప్పని స్థితిని కల్పించాయంటారు బాను. ‘‘నువ్వు ఈ ప్రపంచాన్ని మళ్లీ నిర్మించదలిస్తే, మగవాళ్లనూ ఆడవాళ్లనూ సృష్టించదలిస్తే అనుభవం లేని కుమ్మరిగా ఉండకు. ప్రభూ, ఈ భూమ్మీదకు ఒక్కసారి ఆడదానిగా రా!’’ అని అడుగుతుంది ‘ఓ దేవుడా, ఒక్కసారి ఆడదానిగా ఉండు’ కథ. ‘‘మతం, సమాజం, రాజకీయాలు స్త్రీలనుంచి ప్రశ్నించకూడని విధేయతను డిమాండ్‌ చేస్తాయి. ఈ క్రమంలో అమానవీయ క్రూరత్వాన్ని మోపుతాయి’’ అంటారామె. మసీదుల్లో స్త్రీలకు ప్రార్థించే హక్కు ఉండాలంటారు ఈ ‘ఫైర్‌బ్రాండ్‌’. సొంత సమాజం మీద ఉమ్మివేయడం ద్వారా బయట జేజేలు కొట్టించుకుంటోందన్న నిందలు మోశారు. ఒక దశలో ఆమె మీద కత్తి దాడి యత్నం జరిగింది. అయితే దాడి చేసిన వ్యక్తిని ఆమె క్షమించారు. మున్సిపల్‌ కౌన్సిల్‌ సభ్యురాలిగా రెండుసార్లు ఎన్నికయ్యారు. ‘మన ముక్కులు కోపిస్తుంది’ అని ఆమె తండ్రితో ఆమె కుటుంబ సభ్యులు సరదాగా అనేవాళ్లట. బదులుగా ఇప్పుడు అందరిలోనూ వాళ్లంతా ముఖాలు ఎత్తి నిలబడేలా చేయగలిగారు. ఇంతటి ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకోవడాన్ని ‘ఒక్క ఆకాశాన్ని వెయ్యి మిణుగురులు వెలిగించినట్టుగా’ ఆమె అనుభూతి చెందారు. ‘ప్రతీ గొంతుకను వినే, ప్రతీ కథకు మన్నన దక్కే, ప్రతీ మనిషి మరొకరికి చెందే ప్రపంచాన్ని సృష్టించాలి’ అని తన పురస్కార అంగీకారోపన్యాసంలో కోరారు. అదే నిజమైతే, మిణుగురులు ఆకాశాన్ని వెలిగించే అనుభూతి ప్రతి ఒక్కరికీ సాక్షాత్కరిస్తుంది.

(26th May 2025)

Wednesday, July 23, 2025

కేరళ సాహిత్య యాత్ర


మలబారు యాత్ర


వైకోం మహమ్మద్‌ బషీర్‌ తమ ఇంటిముందున్న వంగమామిడి చెట్టుకింద కూర్చుని రాసేవారట. ఆ చెట్టు గాలిని పీల్చే ‘మా తాతకో ఏనుగుండేది’,  ‘చిన్ననాటి నేస్తం’, ‘గోడలు’ లాంటి ఆయన రచనలు ఊపిరి పోసుకున్నాయి. బషీర్‌ అభిమానులకు ఆ చెట్టును చూడటం గొప్ప సంతోషం. అంతేనా? ఆయన విన్న గ్రామ్‌ఫోన్‌ రికార్డు, ఆయన సేదతీరిన ఆరాం కుర్చీ కూడా ప్రత్యేకమే. బషీర్‌ను ఆయన జన్మించిన బేపూర్‌ను బట్టి బేపూర్‌ సుల్తాన్‌ అంటారు. ఆయన వస్తువులు, ఆయన జీవితాన్ని తెలియజెప్పే విశేషాలతో ఆ ఊళ్లో కేరళ ప్రభుత్వం ఒక మెమోరియల్‌ నిర్మిస్తోంది. బషీర్‌ క్లాసిక్‌ అయిన ‘ప్రేమలేఖనం’ నవలలో దంపతులు తమ చిన్నారికి పెట్టుకున్న ఆకాశమిఠాయి పేరునే ఈ స్మారక కేంద్రానికి ఉంచారు. ఒక రచయితకు మెమోరియల్‌ నిర్మించడం దానికదే విశేషమే అయినా, నిత్య సాహిత్య రాష్ట్రమైన కేరళ తన సాహిత్య స్పృహను మరో స్థాయికి తీసుకెళ్లింది. రచయితల మెమోరియల్స్‌ను కలుపుతూ దేశంలోనే తొట్టతొలి సాహిత్య యాత్రకు శ్రీకారం చుడుతోంది. ‘మలబార్‌ లిటెరరీ టూరిజం సర్క్యూట్‌’ పేరుతో ఈ యాత్ర కోళికోడ్, మలప్పురం, పాలక్కాడ్‌ జిల్లాలను కవర్‌ చేస్తుంది.

మలయాళ సాహిత్యంలో ప్రాచీన కవిత్రయంలో ఒకరిగా పిలిచే, ఆధునిక మలయాళ సాహిత్య పితామహుడిగానూ కొలిచే 16వ శతాబ్దపు కవి, భాషావేత్త తుంచాత్తు రామానుజన్‌ ఎలుత్తాచ్చన్‌ గ్రామమైన తుంజన్‌ పరంబు మలబారు ప్రాంతంలోనే ఉంది. విజయదశమి రోజున చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల అక్షరాభ్యాసం కోసం ఈ గ్రామాన్ని దర్శించుకుంటారు. ఈ మలబారు ప్రాంతంలోనే జ్ఞానపీuЇ పురస్కార గ్రహీత ఎం.టి.వాసుదేవన్‌ నాయర్‌; రచయిత, కార్టూనిస్ట్‌ ఒ.వి.విజయన్‌; ప్రఖ్యాత యాత్రాసాహిత్య కర్త ఎస్‌.కె.పొట్టెక్కాట్‌; మరో కవి, జ్ఞానపీఠ గ్రహీత అఖితం అచ్యుతన్‌ నంబూద్రి లాంటివారి స్మారక కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ఇవి భిన్న దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వాటన్నింటినీ అభిమానులు కలయదిరిగేలా, రచయితల పుస్తకంలో ప్రాణం పోసుకున్న ప్రాంతాలను ప్రత్యక్షంగా అనుభవించేలా, మానవ ఉద్వేగాలన్నీ కాగితాల్లోకి ఎలా బదిలీ అయ్యాయో తెలుసుకునేలా కేరళ పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. 2021లోనే ఈ ప్రాజెక్టుకు బడ్జెట్‌ కేటాయింపులు జరపగా, ఈ సంవత్సరం మధ్యకల్లా దీన్ని ప్రారంభించే అవకాశం ఉంది. కోళికోడ్‌ను యునెస్కో భారతదేశ తొట్టతొలి సాహిత్య నగరంగా గుర్తించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ వల్ల ఆ నగర ఘనత మరింతగా ఇనుమడిస్తుంది.

లండన్‌లోని షేక్‌స్పియర్‌ స్మారక కేంద్రాన్ని ఏటా పాతిక లక్షల మంది సందర్శిస్తారు. యూకేలో భిన్న లిటెరరీ సర్క్యూట్స్, వాటికి తగిన ఏర్పాట్లు ఉన్నాయి. దక్షిణ అమెరికాలోని కొలంబియాలో మ్యూజియంగా మార్చిన గాబ్రియేల్‌ గార్సియా మార్క్వేజ్‌ ఇల్లు, ఆయన చదివిన పాఠశాల, ఆయన వెళ్లిన గ్రంథాలయం... ఇలా ఆయన ‘వన్‌ హండ్రెడ్‌ ఇయర్స్‌ ఆఫ్‌ సాలిట్యూడ్‌’కు ప్రేరణగా నిలిచిన అన్ని ప్రదేశాలను కలుపుతూ ప్రయాణించవచ్చు. ప్రముఖ మలయాళ సాహిత్యకారులకు కూడా జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు ఉంది. వీళ్ల రచనలు భిన్న భారతీయ భాషలతో పాటు, ఆంగ్లం, ఇతర ప్రపంచ భాషల్లోకి అనువాదమయ్యాయి. దానికి తగ్గ ఉత్సాహం, ప్రోత్సాహం అక్కడ ఉన్నాయి. అందుకే సందర్శకులు భిన్న ప్రాంతాల నుంచి వచ్చే అవకాశం ఉంది. మరి తెలుగు రచయితల పరిస్థితి ఏమిటి? ముందు తెలుగు రచయితలను తెలుగువాళ్లకు పరిచయం చేయడమే పెద్ద సవాలు కావొచ్చు.

వైజాగ్‌ వైపు వెళ్లే కొందరు సాహిత్యాభిమానులు ప్రత్యేకించి భీమిలి వెళ్లొస్తారు చలం ఇంటి కోసం. విజయనగరం వైపు పోయేవాళ్లు గురజాడ గృహాన్ని దర్శించవచ్చు. అదే విశాఖపట్నానితో ముడిపడిన శ్రీశ్రీ, రావిశాస్త్రిలను ముడేస్తూ, అటుగా శ్రీకాకుళంలోని కథానిలయంతో కరచాలనం చేసేలా ఉత్తరాంధ్ర సాహితీయానం చేయగలిగితే ఎలా ఉంటుంది? పోతన, దాశరథి, కాళోజీ లాంటి వాళ్లను తలుచుకోగలిగే వరంగల్‌ సాహిత్య టూర్‌ ఎందుకు ఉండకూడదు? రచయితలను ప్రాంతాల వారీగానో, జిల్లాల వారీగానో అనుసంధానం చేసే సాహిత్య టూర్లను ఆశించడం తెలుగు నేల మీద మరీ అత్యాశా? కానీ ఎంతమంది రచయితలకు మెమోరియల్స్‌ ఉన్నాయి? కనీసం విగ్రహాలైనా ఉన్నాయా? కువెంపు విమానాశ్రయం(శివమొగ్గ) అని కన్నడవాళ్లు పెట్టుకున్నట్టుగా తెలుగు నేల మీద అలా ఒక రచయితకు గౌరవం దక్కుతుందా?

ప్రాచీన ప్రపంచంలో ఈజిప్టులోని అలెగ్జాండ్రియా లైబ్రరీ ఒక జ్ఞానధామం. క్రీ.పూ. మూడో శతాబ్దానికి చెందిన ఇది ఆ కాలపు గొప్ప పండితులందరికీ నిత్య సందర్శనా స్థలం. అమెజాన్‌ కంపెనీ తన వర్చువల్‌ అసిస్టెంట్‌ను ప్రారంభించినప్పుడు దాని పేరును అలెగ్జాండ్రియాకు నివాళిగా ఎన్నుకుంది. అట్లా ‘అలెక్సా’ చాలామంది జీవితాలకు చేరువైంది. సాహిత్యంతో పరిచయం లేదనుకునేవాళ్లు కూడా దాని ఫలాలను ఇంకో రూపంలో అనుభవిస్తూనే ఉంటారు. ‘పోషణ, ఆవాసం, సాహచర్యం తర్వాత ఈ ప్రపంచంలో మనకు అత్యంతగా కావాల్సింది కథలు’ అంటాడు ఫిలిప్‌ పుల్‌మాన్‌. ‘రచయితలో కన్నీళ్లు లేకపోతే పాఠకుడిలో కన్నీళ్లు లేవు. రచయితలో ఆశ్చర్యం లేకపోతే పాఠకుడిలో ఆశ్చర్యం లేదు’ అంటాడు రాబర్ట్‌ ఫ్రాస్ట్‌. రచయితలో ఉన్నదే పాఠకుడికి అందుతుంది. రచయితలో ఉన్నదంతా కూడా పాఠకుడికి బదిలీ అవుతుంది. సాహిత్యం అనేది మన అంతరాత్మలను వెలిగించే అదృశ్య దివ్వె. అందుకే సాహిత్య సృష్టికర్తలను తలుచుకునే ఏ ప్రయత్నం అయినా ప్రాధాన్యత కలిగినదే, దానికోసం తీసుకునే ఏ చొరవైనా విలువైనదే!

(సాక్షి, ఏప్రిల్‌ 28, 2025)
 

Sunday, July 20, 2025

హర్షణీయం పాడ్‌కాస్ట్‌



నిజంగా హర్షణీయం!


కోవిడ్‌ మహమ్మారి ప్రపంచాన్ని సమూలంగా మార్చేసింది. దాని పర్యవసానాల్లో ఒకటి, బయటికి వెళ్లే పనిలేకుండా చేయగలిగే పనుల గురించి ఆలోచించడం. అలాంటి ఒక కారణంతో మొదలైన ‘హర్షణీయం’ తెలుగు పాడ్‌కాస్ట్, సమస్త సాహిత్య ప్రపంచాన్ని తెలుగు గడపలోకి తెచ్చిపెట్టింది. అంతేనా? అనువాద ప్రపంచంలోకి అడుగుపెట్టాలనుకునే ఏ భాషవారికైనా ఒక ఆన్‌లైన్‌ నిధిగా రూపొందింది. 2020 మార్చ్‌లో ముందు తెలుగులో ప్రారంభమై, తర్వాత తెలుగు– ఆంగ్లంగా మారి, అటుపై ఆంగ్లంలోకి కూడా వ్యాపించిన ఈ పాడ్‌కాస్ట్‌ ‘నూరు మంది అనువాదకుల’ సిరీస్‌ను ఇటీవలే ముగించుకుంది. ఇందులో మలయాళం, తమిళం, కన్నడం, గుజరాతీ లాంటి భారతీయ భాషల్లోంచి ఆంగ్లంలోకి అనువదిస్తున్నవారితో పాటు– థాయి, ఉజ్బెక్, వియత్నమీస్, హంగేరియన్, తుర్కిష్, నార్వేజియన్, మంగోలియన్, కిస్వాహిలీ లాంటి భాషల ఆంగ్లానువాదకుల ఇంటర్వ్యూలు ఉన్నాయి. దోస్తోవ్‌స్కీ ఉపరితల అంశాల మీద సమయం వృథా చేయరని చెబుతారు, గతేడాదే ‘బ్రదర్స్‌ కరమజోవ్‌’కు మరో ఆంగ్లానువాదం వెలువరించిన మైకేల్‌ ఆర్‌. కట్జ్‌. మనిషిని మలిచే కీలక క్షణాలు, విశ్వాసం, నైతికత, హింస, తీవ్రోద్వేగాల మీద దోస్తోవ్‌స్కీ దృష్టి ఉంటుందని అంటారు. పంతొమ్మిదో శతాబ్దపు రష్యన్‌ సాహిత్యాన్ని బోధించే మైకేల్‌ సుమారు 20 రష్యా నవలల్ని అనువదించారు. దోస్తోవ్‌స్కీ ‘నోట్స్‌ ఫ్రమ్‌ అండర్‌గ్రౌండ్‌’లోని తొలి 30 పేజీలు అనువాదానికి అసలు లొంగనివని ఆయన అభిప్రాయం. ఒక పుస్తకం పుట్టించే తక్షణ స్పందనే దాన్ని అనువాదానికి పూనుకునేలా చేస్తుందని చెబుతారు అరుణవ సిన్హా. పదహారేళ్ల కాలంలో సుమారు 80 పుస్తకాల్ని బంగ్లా నుంచి ఆయన ఆంగ్లంలోకి అనువదించారు. సగటున ఏడాదికి ఐదు పుస్తకాలు! ఒక దానిలో దిగితే అందులో మునిగిపోవడమే ఇంత వేగంగా అనువదించడానికి కారణమంటారు. ఫుట్‌నోట్‌ ఇవ్వాల్సి రావడాన్ని ఒక వైఫల్యంగా చూస్తారు హిందీ, ఉర్దూ నుంచి అనువాదాలు చేసే అమెరికన్‌ డైసీ రాక్‌వెల్‌. భాషల మీద ప్రేమతో ఆమె దాదాపు పదిహేను భాషలు నేర్చుకున్నారు. ఇంకా, కరీమ్‌ అబ్దుల్‌ రహమాన్‌(కుర్దిష్‌), జెస్సికా కోహెన్‌(హీబ్రూ), లోలా రోజర్స్‌ (ఫిన్నిష్‌) లాంటివాళ్లు ఈ పాడ్‌కాస్ట్‌లో తమ ఆలోచనలను పంచుకున్నారు. అనువాద క్రాఫ్ట్‌తో పాటు మొత్తంగా అనువాద ఎకో సిస్టమ్‌ గురించి ఇంత విస్తారంగా ఒకేచోట మాట్లాడిన పాడ్‌కాస్ట్‌ ప్రపంచంలో ఇంకోటి లేదని ఐస్‌లాండిక్‌ అనువాదకురాలు విక్టోరియా క్రిబ్‌ కితాబునివ్వడం హర్షణీయం అందుకున్న ప్రశంసల్లో ఒకానొకటి.

మూడు దశాబ్దాలుగా స్నేహితులైన ఇంజినీరింగ్‌ క్లాస్‌మేట్లు హర్ష, అనిల్, గిరి ఉద్యోగాలు చేస్తూనే, పాఠకులుగా తమ అభిరుచితో ‘హర్షణీయం’ మొదలుపెట్టారు. ఇందులో హర్ష కథకుడు, అనిల్‌ అనువాదకుడు, గిరి సాంకేతిక నిపుణుడు. వక్తలను ఎంచుకోవడం, ప్రశ్నలు కూర్చుకోవడం ముగ్గురూ కలిసి చేస్తారు. ఎడిటింగ్‌ బాధ్యత కుదిరినవాళ్లు తీసుకుంటారు. ఇంటర్వ్యూలు మాత్రం అనిల్‌ చేస్తారు. సాహితీవేత్తలను ఇంటర్వ్యూలు చేయడంలో ప్రొఫెసర్‌ మృణాళిని ‘అక్షర యాత్ర’ తమకు స్ఫూర్తి అంటారు. ముందు తెలుగు రచయితల సంభాషణలతో మొదలుపెట్టి, తర్వాత ఇరవై నాలుగు రాష్ట్రాల్లోని పర్యావరణవేత్తల అభిప్రాయాలకు వేదికై, బిభూతీభూషణ్‌ బంధోపాధ్యాయ ‘వనవాసి’ నవలను యాభై వారాలు ఆడియోగా ఇచ్చి, తర్వాత అనువాదకుల వైపు మళ్లారు. లోప్రొఫైల్‌లో ఉండే అనువాదకుల మెయిల్స్, కాంటాక్ట్‌ నంబర్స్‌ సంపాదించడం, వాళ్లకు తమ వివరాలు చెబుతూ సందేశాలు పంపడం, ఒక్కోసారి ఎనిమిది నెలల తర్వాత కుదురుతుందని చెబితే వేచివుండి(ఉదా: మైకేల్‌ కట్జ్‌) మళ్లీ సంప్రదించడం, ప్రశ్నలు ముందే పంపడం, విదేశీయుల సమయాన్ని బట్టి రాత్రుళ్లు మాట్లాడటం, వివాదాల జోలికి పోకుండా పుస్తకాల మీదే ఫోకస్‌ పెట్టడం వీళ్ల పనితీరు. ఎక్కువ అనువాదాలు జరిగే ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్‌ అనువాదకులు కూడా సహజంగానే ఈ పాడ్‌కాస్ట్‌లో చోటుచేసుకున్నారు. ‘ది హర్షణీయం పాడ్‌కాస్ట్‌ అండ్‌ ఇట్స్‌ ఇటాలియన్‌ లిటరేచర్‌ ఇన్‌ ట్రాన్స్‌లేషన్‌’ పేరుతో ‘ద గ్లోబల్‌ లిటరేచర్‌ ఇన్‌ లైబ్రరీస్‌ ఇనీషియేటివ్‌’ 2024 నవంబర్‌లో వీళ్ల పాడ్‌కాస్ట్‌ను ప్రస్తావించడం విశేషం. కొన్నింటికి కాలం కూడా కలిసిరావాలి. ఇంకో కాలంలో అయితే ఇలాంటిది జరిగే అవకాశం లేదు.  కొన్ని మెయిల్స్‌తో, ఒక్క ఫోన్‌ కాల్‌తో ప్రపంచంలో ఎక్కడో ఉన్నవారితో సంభాషించడం ఎలా సాధ్యం? కాని కలిసొచ్చే కాలంలో కూడా ఎంతమంది ఇలాంటి పనికి పూనుకున్నారు? అందుకే వీళ్ల పని హర్షణీయం.

తెలుగు భాషలోని 56 అక్షరాలన్ని దేశాల వారితోనైనా మాట్లాడాలని సరదాగా వీళ్లు పెట్టుకున్న లక్ష్యం నెరవేరింది. అనువాదకుల సిరీస్‌లో భాగంగా, గతేడాది ప్రతిష్ఠాత్మక బుకర్‌ ఇంటర్నేషనల్‌ ప్రైజ్‌ లాంగ్‌లిస్ట్‌లోని పదముగ్గురు అనువాదకులతోనూ సంభాషించారు. ఈ ఏడాది లాంగ్‌లిస్ట్‌లోని రిఫరెన్సుల్ని సాక్షాత్తూ ‘ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రైజ్‌’ అడ్మినిస్ట్రేటర్‌ ఫియమెత్తా రోకో ఇచ్చి ఇంటర్వ్యూలకు సహకరించడం వీళ్ల విశ్వసనీయతకు చిహ్నం. ఈ సంభాషణలు ఈ ఏప్రిల్‌లోనే ప్రసారం అవుతాయి. అక్కడివాళ్లను ఇక్కడికి తెస్తున్నారు సరే, తెలుగువాళ్లు అటుపోయే మార్గమేమిటి? ‘తెలుగులో గొప్ప రచయితలు చాలామంది ఉన్నారు. కానీ ముందు ఆంగ్లంలోకి అనువాదం కావడం; ముఖ్యంగా యూకే, యూఎస్‌లో ప్రచురితం కావడం అతిపెద్ద సవాలు. దానికి నాణ్యమైన అనువాదకులతో పాటు నిబద్ధత ఉన్న ప్రచురణకర్తలు అవసరం’ అని చెబుతారు అనిల్‌. తెలుగు సాహిత్యంలో ఆ వాతావరణం క్రమంగా చోటుచేసుకుంటోందనీ, రెండేళ్లలో సానుకూల మార్పు చూడబోతున్నామనీ అంటారు. ఇది ఇంకోరకంగా హర్షణీయం.


(సాక్షి, మార్చ్‌ 31, 2025)
 

Sunday, March 16, 2025

పర్సనల్‌ లైబ్రరీ



వ్యక్తిగత ప్రపంచం


‘ఒక గ్రంథాలయం, ఒక గార్డెన్‌ ఉందంటే నీకు కావాల్సినవన్నీ ఉన్నట్టే’ అన్నారు రోమన్‌ తత్వవేత్త సిసిరో. ఆ రెండింటితో పాటు ఇంకా ఎన్నో ఉన్నప్పటికీ, కేవలం గ్రంథాలయం గురించే ముచ్చటగా తలుచుకున్నారు ఇటీవల ముగిసిన ‘జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌’లో తల్లి, రచయిత్రి సుధామూర్తితో సంభాషిస్తూ అక్షతామూర్తి(బ్రిటన్‌ మాజీ ప్రధాని రిషి సునాక్‌ భార్య). తల్లికీ, తండ్రి(నారాయణమూర్తి)కీ విడి పర్సనల్‌ లైబ్రరీలు ఉండేవనీ; తల్లి దగ్గర సాహిత్యం, చరిత్ర పుస్తకాలుంటే, తండ్రి దగ్గర సైన్సు, టెక్నాలజీ పుస్తకాలుండేవనీ; తానూ, తమ్ముడు రోహన్‌ రెంటినీ కలగలిపి చదివేవారమనీ చెప్పారు. అన్నట్టూ, రోహన్‌ మూర్తి పూనికతో 2015లో ప్రారంభమైన ‘మూర్తి క్లాసికల్‌ లైబ్రరీ ఆఫ్‌ ఇండియా’ భారత సాహిత్యంలోని అన్ని క్లాసిక్స్‌ ఆంగ్లానువాదాలను ప్రచురిస్తోంది. ఏమైనా ఈ ‘ఇన్ఫోసిస్‌’ కుటుంబం పర్సనల్‌ లైబ్రరీ అనే భావనను మరోసారి సాహిత్య పాఠకులకు తియ్యగా గుర్తుచేసింది.

వ్యక్తిగత లైబ్రరీ అనేదానికి నిర్దిష్ట కొలతలు లేవు. అన్ని సైజుల్లో, షేపుల్లో ఉంటుంది. అసలు ఏ ఆకృతి లేకుండా కేవలం పుస్తకాల దొంతర రూపంలోనూ ఉండొచ్చు. ఒంటరి పాఠకుడిగానూ, జీతం లేని లైబ్రేరియన్‌గానూ ద్విపాత్రాభినయం చేసే ఒకరి లైబ్రరీ ఇంకొకరి లైబ్రరీలా ఉండదు. అది వారి అభిరుచికి, సౌకర్యానికి అద్దం. పుస్తకాలను అక్షర క్రమంలో పెట్టుకుంటామా, సైజుల వారీగానా, వర్గీకరణ పరంగానా, రచయితల పరంగానా అన్నది వారి వారి ఛాయిస్‌. ఠక్కున తీసి చదువుకోగలిగే ఫేవరెట్స్‌ ఎక్కడ పెట్టుకోవాలో, రిఫరెన్స్‌ కోసం అవసరమయ్యే పుస్తకాలు ఎటువైపుంచాలో, ఎప్పుడోగానీ తీయమని తెలిసేవి ఎటు పక్కుంచాలో, అసలు ప్రతిపూటా తీయడం వల్ల నలిగిపొయ్యే నిఘంటువుల లాంటివి ఎక్కడ ఉంచితే మేలో, కొనడమేగానీ ఎన్నడూ పేజీ తిప్పన పాపానపోని పుస్తకాలను ఏం చేయాలో ఎవరిది వారికే తెలుస్తుంది. ఏ పుస్తకం పక్కన ఏది వస్తే చెలిమి చేసినట్టుంటుందో, దేని పక్కన ఏది రాకుండా చూసుకుంటే గొడవ తప్పించినట్టు అవుతుందో కూడా చూసుకోవాలి. లైబ్రరీ అనేది భిన్న రూపాలుగా విస్తరించి ఉంటుందనేది నిజమే అయినా, ప్రాథమికంగా అది అచ్చు పుస్తకాల నిలయం. అమెరికా రచయిత్రి సూసన్‌ సోంటాగ్‌ దగ్గర 15,000 పుస్తకాల భారీ భాండాగారం ఉండేది. వాటిని ఆమె ఆర్ట్, ఆర్కిటెక్చర్, తత్వశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, చరిత్ర, మతం... ఇలా ప్రక్రియలుగా విభజించి పెట్టుకునేవారు. అర్జెంటీనా–కెనడా రచయిత ఆల్బెర్టో మాంగ్యూల్‌ దగ్గర ఏకంగా 35,000 పుస్తకాలు ఉన్నాయి. వాటిని ఎక్కడా సరిగ్గా సర్దుకోలేక ఫ్రాన్స్‌లో అవి పట్టేంతటి ఒక పాత భవంతి దొరికితే దాన్ని ఆయన కొనేశారు. ఇక అబ్బురపరిచే మేధానిధి లాంటి ‘బాబాసాహెబ్‌’ అంబేడ్కర్‌ తన జీవితకాలంలో తన నివాసం ‘రాజగృహ’లో సుమారు యాభై వేల పుస్తకాలను సేకరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యక్తిగత గ్రంథాలయాల్లో ఇదీ ఒకటి. వందల నుంచి వేల పుస్తకాల ఇంటి లైబ్రరీలు ఉన్న రచయితలు, సాహిత్య ప్రేమికులు తెలుగులోనూ గురజాడ అప్పారావు నుంచి మొదలుకొని ఎందరో ఉన్నారు.

ఏ సాహిత్య వాసన ఉన్నవారికైనా ఒకరి ఇంటికెళ్తే ముందు చూపు పడేది వారింట్లో ఉన్న పుస్తకాలపైనే. అది సంభాషణకు మంచి ఊతం కాగలదు. కానీ అన్నీ మూటగట్టేసి అటకమీద పెట్టేసే జీవితపు కరుకు వాస్తవంలోకి మనుషులు జారిపోతున్నారు. అందుకే కనీసం ప్రదర్శన నిమిత్తం అయినా లైబ్రరీలు ఇళ్లల్లో ఆకర్షణగా ఉండటం లేదు. చేతిలో పుస్తకంతో కనబడటం పాత వాసనగా మారిపోయింది. కలిసి ఒక సినిమాకో, షాపింగ్‌కో వెళ్లినట్టుగా స్నేహంగా లైబ్రరీకి వెళ్లడం అనేది ట్రెండీగా ఉండటం లేదు. అందుకే పర్సనల్‌ లైబ్రరీలు అటుండనీ, అసలు లైబ్రరీలే తగ్గిపోతున్నాయి. పుస్తకాలను చదవడం బరువైపోతోంది, వాటిని నిర్వహించడం భారమైపోతోంది. ‘‘గత పాతికేళ్లుగా మనం చదివిన స్కూల్‌ లైబ్రరీలోని తెలుగు పుస్తకాలు చదివినవాళ్లు లేరుట. తీసేస్తున్నారని తెలిసి కొంచెం సొమ్ము ఇచ్చి కొనేసాను’ అంటూ విశ్వం నుంచి మెసేజ్‌’’ అని మొదలవుతుంది విజయ కర్రా రాసిన ‘ఆ ఒక్కటి’ కథ. కథానాయకుడు పదో తరగతిలో ఉన్నప్పుడు రాసిన ప్రేమలేఖను ఆ అమ్మాయికి ఇచ్చే ధైర్యం లేక ఒక పుస్తకంలో పెడతాడు. ఇన్నింట్లో ఆ పుస్తకం ఏమిటో ఇన్నేళ్ల తర్వాత వెతకడం ఇందులో కథ. అయితే, ఆ పుస్తకాల డబ్బాలు విప్పుతున్నప్పుడు బయటపడే తెలుగు, బెంగాలీ, సంస్కృత, రష్యన్‌ రచయితల పేర్లు బయటికి చదువుకోవడం పుస్తక ప్రేమికులకు మాత్రమే అర్థమయ్యే సంతోషం. చివరకు ‘భ్రమరవాసిని’ నవల ఆఖరు పేజీలలో ఆ ప్రేమలేఖ బయటపడుతుంది. అలా ‘మన జాతి సంపద’ ఏమిటో కూడా తెలుస్తుంది.

ఇటాలియన్‌ రచయిత అంబెర్తో ఎకో వ్యక్తిగత గ్రంథాలయంలో ముప్పై వేలకు పైగా పుస్తకాలు ఉండేవి. ఇందులో చాలా పుస్తకాలు చదవనివి ఉంటాయని దీన్ని ‘యాంటీ–లైబ్రరీ’ అని అభివర్ణించారు లెబనీస్‌–అమెరికన్‌ వ్యాసకర్త నసీమ్‌ నికోలస్‌ తలాబ్‌. ఒక్క క్లిక్‌ దూరంలో వందల ఈ–బుక్స్‌ అందుబాటులో ఉన్న సాంకేతిక యుగంలో, అవసరమైనది ఇట్టే బ్రౌజ్‌ చేయడం వీలుకాక పుస్తకాల దొంతరలన్నీ తిప్పి తిప్పలు పడాల్సిన పరిస్థితిలో... మన ఇంట్లో ‘స్పేస్‌’ ఇవ్వాల్సివచ్చే భౌతిక పుస్తకం విలువైనది అయివుండాలి. కానీ పుస్తకాలంటూ ఇంట్లో ఉండాలి. ఎందుకంటే డిజిటల్‌ పుస్తకం చదివిన ఫీలివ్వదు; పుస్తకంలోని విషయమే తప్ప, ఆ పుస్తకం బయటి వ్యవహారంతో ముడిపడే జ్ఞాపకాన్నివ్వదు. మనసుకు నచ్చే కొన్ని పుస్తకాలతో అయినా ఇంటిని అలంకరించుకుందాం. గుండెల్లో భౌతిక పుస్తకాన్ని పదిలపరుచుకుందాం.

(Sakshi, March 3rd 2025)