Tuesday, December 13, 2022

క్రియతో సెల్ఫీ






క్రియతో సెల్ఫీ
పూడూరి రాజిరెడ్డి


కొత్తగూడెం బాలోత్సవ్‌గురించి వినడమేగాని ఎప్పుడూ పాల్గొనే అవకాశం రాలేదు. అది ఆగిపోయిన తర్వాత, దాని స్ఫూర్తితోనే కొనసాగుతున్న ‘క్రియ’ గురించి తెలిసిన ఏడాదే అనుకోకుండా అందులో పాల్గొనే అవకాశం కూడా వచ్చింది. అంతా రమణమూర్తి గారి చొరవ, నవీ¯Œ గారి కార్యదక్షత!

నాలుగు మాండలికాలనూ పలికిన ఒక పాప. కాగితంతో హంసకు జీవం పోసిన ఇంకో చిన్నారి. మట్టితో ఆకుల రేకులు తీర్చిన మరో ఆరింద. ‘మరేమో’ అంటూ ఊరిస్తూ కథ చెప్పిన ఒక బుడత. స్టేజంతా తనదిగా చేసుకుని నర్తించిన ఒక ముగ్ధ. నాన్న, నానమ్మల కష్టంలో ఎవరి కష్టం ఎక్కువ గొప్పదోనని యోచించే ఓ బాల తాత్వికుడు. జేఎన్‌టీయూకు వసంతం మూడు వారాల ముందే వచ్చింది; రెండ్రోజుల పాటు ఆవరణంతా చిన్నారి బాలలుగా పూచింది.

సముద్ర తీరంలో ఆరూ పంతొమ్మిదికి అయిన సూర్యోదయం, జాలార్లు అప్పటికే పట్టి ఒడ్డుకు చేర్చిన వలలో ఇంకా చురుగ్గా కదులుతున్న ఈల్‌చేపలు, మడ అడవుల్లో కలియ దిరుగుతున్న పసుప్పచ్చటి ఎండ్రకాయలు, గుత్తులుగా కాసి పచ్చివాసన వేస్తున్న మామిడి చెట్లు, బ్రహ్మ సమాజ భవనం, సుబ్బయ్య భోజనం, కోటయ్య కాజా; జీవితంలో మొదటిసారి వెళ్లిన కాకినాడలో ఇంకా చూడటానికి ఎంత మిగిలిపోయిందో, ఈ పిల్లల పండుగ కూడా అంతే మిగిలిపోయింది. ఎన్నో వేదికల మీద ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటే ఏవని ఎంపిక చేసుకోగలం; ఇది బాగుందనీ, ఇది బాలేదనీ తేల్చాల్సిన తియ్యటి నేరాన్ని ఎలా చేయగలం!

సింపుల్‌భోజనం, సింపుల్‌ మనుషులు, పనిలో భాగంగా హడావుడి పడటమేగానీ హడావుడి చేయడమే పనిగా పెట్టుకోని నిర్వాహకులు, మట్టితో బొమ్మలు చేసే పిల్లలకు ఎప్పటికప్పుడు తడి అవసరం పడుతుందన్న వివరంతో సహా గుర్తుంచుకుని నెమ్మదిగా వరుసల మధ్య కదిలే వలంటీర్లు; ఈ క్రియకు చాలా భవిష్యత్‌ ఉందన్న భరోసా ఇచ్చారు. చప్పట్ల మధ్య ఆ వేదిక ఎక్కి, ఆ వేదిక మీద బహుమతి ఇస్తున్నవారు ఎవరో తెలియకపోయినా కచ్చితంగా ఎవరో పెద్దమనిషే అయివుంటాడని నమ్మేంత వయసు చిన్నారులకు– బహుశా వాళ్లు పెద్దయ్యేదాకా ఈ  జ్ఞాపకం వెంబడి ఉంటుందేమో; వాళ్లు ఆరోగ్యకరంగా పెద్దవాళ్లు కావడంలో ఒక అదృశ్య శక్తిగా కూడా పనిచేస్తుందేమో. అందుకైనా ఇలాంటి బాలోత్సవాలూ, ఇలాంటి క్రియ పండుగలూ అంతటా, ఎప్పటికీ అవసరమేమో!

ప్రత్యేకించి జానపద విభాగంలో, సీనియర్లూ జూనియర్లూ రెండు కేటగిరిల్లోనూ తెలంగాణ పాటలకు ఆంధ్రీయులు డాన్స్‌  చేయడం ముచ్చటేసింది.  ఒకవేళ ఉంటేగింటే రాజకీయాల వల్ల ఏర్పడిన అంతరాలను పూడ్చగలిగే శక్తి బహుశా సాహిత్యానికి మాత్రమే ఉందని మరోసారి నిరూపితమైంది.  

మాకు బసగా ఏర్పాటైన వందేళ్ల నాటి కాస్మొపాలిటన్ క్లబ్, వస్తూపోతుంటే కనబడిన అంతకంటే పాతదైన మెక్‌లారెన్  హైస్కూలు పట్టణంలో ఆంగ్లేయుల పాదజాడలను పట్టించాయి. పేర్లు మాత్రమే తెలిసి ముఖాలుగా తెలియనివాళ్లు కలిసి, కలిసేదాకా మనం తెలుసని మనకు తెలియనివాళ్లు తెలిసి కొత్త జీవనోత్సాహాన్ని నింపారు. మనుషులుగా దాటలేని బలహీనతలు గమనింపులోకి రావడమూ, గమనిస్తూనే అందులో భాగం కావడమూ ఇంకొక తమాషా.

మూడో రోజు తెల్లారి– ఎంగిలి విస్తరాకులు, కుల్ఫీ పుల్లలు సహా మొత్తం అద్దంలా ఊడ్చి ఇచ్చేస్తారన్న భరోసాతో దీనికి వరుసగా వేదిక అవుతున్న జేఎన్‌టీయూ ఆవరణలో ఒకచోట ఫొటోలు, సెల్ఫీలు దిగే వీలుగా ఐ లవ్‌ జేఎన్‌టీయూకే అని ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ఐ లవ్‌ క్రియ అని పెట్టివుంటే గనక నా ఖాతాలోనూ ఒక సెల్ఫీ పడేది.

(మార్చ్‌ 2020)
 
 

Friday, November 4, 2022

కోటి రూపాయల బహుమతి ఇచ్చే ఊహయినా చేయగలమా?

అక్షర లక్షలు

దక్షిణాసియా సాహిత్యపు ప్రతిష్ఠను పెంచుతూ ఈ ఏటి బుకర్‌ పురస్కారాన్ని శ్రీలంకకు చెందిన సెహన్‌ తిలకరత్న గెలుచుకున్నారు. మరణానంతర థ్రిల్లర్‌ ‘ద సెవన్‌ మూన్స్‌ ఆఫ్‌ మాలీ అల్మీదా’ ఆయనకు ఈ పురస్కారం తెచ్చిపెట్టింది. ఉన్నట్టుండి ఒకరోజు చావు నుంచి మేల్కొన్న ఫొటోగ్రాఫర్‌ మాలీ అల్మీదా తను దాచిన ఛాయాచిత్రాలను సరైన మనిషి చేతుల్లో పెట్టడానికి చేసే ప్రయత్నం ఈ నవల. దానికిగానూ అతడికి ఉన్న కాలం కేవలం ఏడు చంద్రులు. ఈ ప్రయాణంలో భాగంగా 1980–90ల నాటి శ్రీలంక సంక్షుభిత కాలాన్ని, అంతర్యుద్ధం వల్ల జరిగిన మానవ నష్టాన్ని నవల చిత్రిస్తుంది. ఇంత కల్లోలంలోనూ ప్రతి మానవ జీవితమూ విలువైనదేనన్న ఒక ఆదర్శం కోసం అన్వేషించడం బుకర్‌ న్యాయనిర్ణేతలను కదిలించింది; షార్ట్‌లిస్టులో ఉన్న ఆరుగురు రచయితల్లోంచి కరుణతిలక వైపు మొగ్గేలా చేసింది. ఒక శ్రీలంక రచయిత ఈ బహుమతిని పొందడం ఇది రెండోసారి. మొదటి రచయిత కెనడాలో స్థిరపడిన మైకేల్‌ ఆండాట్జీ. 1992లో ‘ది ఇంగ్లిష్‌ పేషెంట్‌’ నవలకుగానూ ఆయన ఈ గౌరవం పొందారు. 

అక్టోబర్‌ నెలంతా సాహితీ మాసంగా గడిచిపోయింది. ఈ నెలలోనే అంతా ఎదురుచూసిన ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారం ఫ్రెంచ్‌ రచయిత్రి ఆనీ ఎర్నౌను వరించింది. ఆంగ్లంలో రాసిన, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ లేదా ఐర్లాండ్‌లో ప్రచురించిన పుస్తకాలు మాత్రమే అర్హమయ్యే బుకర్‌ ప్రైజ్‌ ‘పరిధి’ పరిమితమైనది అయినప్పటికీ, దీని కోసం కూడా సాహిత్య లోకం ఆసక్తిగా చూసింది. ఆంగ్ల భాషా వ్యాప్తి పెరుగుతూండటమూ, ఇతర భాషల సాహిత్యాలు కుంచించుకుపోతుండటమూ, ఇతర భాషీయులు కూడా ఆంగ్లాన్ని తమ మాతృభాషలాగే స్వీకరించి సాహిత్యపరమైన ఆలోచనను కూడా ఆ భాషలోనే చేస్తూండటమూ, ఆంగ్ల సాహిత్యం నిత్యనూతనంగా ఉంటుండటమూ, ఇలా చాలా కారణాల వల్ల బుకర్‌ ప్రైజ్‌ అచ్చమైన అంతర్జాతీయ అవార్డు స్థాయిని పొందింది. ఈ పురస్కార విజేతకు 50 వేల పౌండ్ల నగదు లభిస్తుంది. బ్రిటిష్‌ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, దీని విలువ సుమారు 47 లక్షల రూపాయలు!

బుకర్‌ ప్రైజ్‌ పేరుతో ఇస్తున్నప్పటికీ 1969–2001 వరకు మాత్రమే బ్రిటిష్‌ ఫుడ్‌ హోల్‌సేల్‌ ఆపరేటర్‌ అయిన ‘బుకర్‌ గ్రూప్‌ లిమిటెడ్‌’ ఈ అవార్డుకు నిధులు సమకూర్చింది. అది తప్పుకొన్న తర్వాత, 2002–19 వరకు ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ‘మ్యాన్‌ గ్రూప్‌’ ఇచ్చినందున మ్యాన్‌ బుకర్‌ ప్రైజ్‌ అని వ్యవహరించారు. 2019 నుంచి వెల్ష్‌ శ్రీమంతుడు మైకేల్‌ మోరిట్జ్‌ ఛారిటీ సంస్థ ‘క్రాంక్‌స్టార్ట్‌’ దీనికి నిధులు ఇస్తోంది. దాతలు మారుతున్నప్పటికీ, ‘అత్యధిక పారితోషికం గల సాహిత్య పురస్కారాల్లో ఇదీ ఒక’టన్న ప్రతిష్ఠకు మాత్రం లోటురావడం లేదు. తమాషా ఏమిటంటే, దీన్ని తలదన్నే మొత్తాన్ని ఇస్తున్న పురస్కారాలు కూడా ఉన్నాయి. 

యూఏఈకి చెందిన ‘మిలియన్స్‌ పొయెట్‌’ పోటీకి 50 లక్షల ధీరమ్స్‌(సుమారు 11 కోట్ల రూపాయలు) ఇస్తున్నారు. అరబిక్‌ దేశాల్లోని అత్యుత్తమ కవులను వెతికే ఈ రియాలిటీ టెలివిజన్‌ కవితల పోటీ ప్రసారమైనప్పుడు, టీఆర్‌పీ రేటింగ్స్‌లో ఫుట్‌బాల్‌నే వెనక్కి నెట్టేస్తుంది. నగదును టాప్‌–5 కవులకు పంచుతారు. ఇక స్పెయిన్‌లో ఇచ్చే ‘ప్రీమియో ప్లానెటా దె నావెలా’ ప్రైజ్‌మనీ పది లక్షల యూరోలు. అంటే సుమారు 8 కోట్ల రూపాయలు. ప్రపంచంలో ఆర్థిక పరంగా ప్రస్తుతం ఇదే అత్యంత ఘనత వహించిన అవార్డు. 1952లోనే ఇది మొదలైంది. పుస్తకాల ప్రచురణ కర్త ‘గ్రూపో ప్లానెటా’ దీన్ని బహూకరిస్తుండటం గమనార్హం. ఇక ‘ఆస్ట్రిడ్‌ లిండ్‌గ్రెన్‌ మెమోరియల్‌ అవార్డు’ పేరుతో స్వీడన్‌లో ఇచ్చే పురస్కార విలువ 50 లక్షల స్వీడిష్‌ క్రోనాలు(సుమారు 37 లక్షల రూపాయలు). గుర్తుంచుకోవాల్సింది స్వీడన్‌ జనాభా అక్షరాలా ఒక కోటి నలభై లక్షలు మాత్రమే. ఇక అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్‌ విజేతకు ఒక కోటి స్వీడిష్‌ క్రోనార్ల నగదు(సుమారు ఏడున్నర కోట్ల రూపాయలు)తోపాటు 18 క్యారెట్ల బంగారు పతకం బహూకరిస్తారు. మళ్లీ బుకర్‌ వద్దకే వస్తే– ఆంగ్లంలోకి అనువాదమైన ఇతర భాషా పుస్తకాల కోసం ప్రత్యేక విభాగంగా నెలకొల్పిన ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రైజ్‌ పురస్కార నగదు కూడా 50,000 పౌండ్లు. దీన్ని రచయిత, అనువాదకులకు సమంగా పంచుతారు. పోయినేడాది హిందీ నవలా రచయిత్రి గీతాంజలి శ్రీ, అనువాదకురాలు డైసీ రాక్‌వెల్‌తో పాటు గెలుచుకున్నది ఇదే.

ఇంతేసి పారితోషికాలు, ఒక పుస్తకం కోసం సాహిత్య లోకం ఎదురుచూడటాలు తెలుగు నేలకు ఏమాత్రం సంబంధం లేని వ్యవహారంగా కనిపించడం లేదూ! ఉమ్మడిగా రెండు రాష్ట్రాల జనాభా సుమారు తొమ్మిది కోట్లు. అయినా ఒక రచయిత తన సొంత ఖర్చుతో వేసుకునే వెయ్యి కాపీలు అమ్మడం కూడా దుర్భరం. ఇలాంటి వాతావరణానికి కారణాలు ఏమిటి? పఠనాన్ని తగ్గించాయని చెప్పే అన్ని కారణాలూ అన్ని దేశాలకూ వర్తిస్తాయి కదా. మరెక్కడుంది లోపం? మన సంస్కృతిలో. ‘చదవడం’ అంటే మనకు అర్థం వేరే. ‘ఒక దేశం తన కథకులను కోల్పోయిందంటే, తన బాల్యాన్ని కోల్పోయినట్టే’ అన్నాడు పీటర్‌ హాండ్కే. మన జీవితమంతా మన చిన్నతనంలోనే ఉండిపోయిందని పెద్దయినకొద్దీ అర్థమవుతూ వస్తుంది. డబ్బులు మాత్రమే సర్వస్వమా అంటే– అది మన సారస్వత నిర్మాతలను మనం ఎలా గౌరవించుకుంటున్నాం అన్నది తెలియజేస్తుంది. బాక్సాఫీస్‌ కలెక్షన్లలో వెయ్యి కోట్లు దాటే సినిమాలు తీస్తున్న తెలుగు నేల మీద, ఒక తెలుగు రచయితకు కోటి రూపాయల బహుమతి ఇచ్చే ఊహయినా చేయగలమా?

31st October 2022. Sakshi Monday Editorial.


 

Tuesday, November 1, 2022

చింతకింది... ఆవిష్కరణ సభలో

జి.ఉమామహేశ్వర్, పూడూరి రాజిరెడ్డి, నామాడి శ్రీధర్, మామిడి హరికృష్ణ, కృష్ణమెహన్‌ బాబు, జయంతి శ్రీనివాస్, సిద్ధార్థ

పూడూరి రాజిరెడ్డి, కాశిరాజు, ఆదిత్య కొర్రపాటి, మెహెర్, ?, కుమార్‌ కూనపరాజు
 




చింతకింది మల్లయ్య ముచ్చట ఆవిష్కరణ సభ
రవీంద్రభారతి మినీ హాల్‌
17 సెప్టెంబర్‌ 2017

మిత్రులు, పెద్దలు...

డిగ్రీ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు రామ్‌నగర్‌లో ఉన్నాను. ఏదైనా ఉద్యోగం చేయడమా, ఇంకేదైనా చదవడమా అనే కన్‌ఫ్యూజన్‌ దశ అది. రెండంతస్థుల ఇల్లు. గుండ్రంగా చుట్టూ పోర్షన్లు ఉంటాయి. నలుగురం ఉండెటోళ్లం. ఓనర్‌ పేరు కూడా గుర్తుంది. అర్జున్‌రావు. ఆ టైములో కలిగిన ఒక సడెన్‌ ఫీలింగ్‌ను ఒక చిన్న కథగా రాసుకున్న. దాని పేరు: ఆమె పాదాలు. చిన్నదంటే మరీ చిన్నది. ఒక పేజీ. అంతకుముందుకూడా ఏదో రాస్తూవున్నా. కానీ ఇది కొంచెం ముద్దుగా అనిపించింది. 1998 సంగతి. దాదాపు ఇరవై ఏళ్లు అవుతోంది.

రెండు మూడేళ్ల తర్వాత పటాన్‌చెరులో జాబ్‌ చేస్తున్నప్పుడు మరో చిన్న కథ రాసిన.

రెండే మాటలు చెప్పదలిచాను.

నిజానికి ఈ సంకలనాన్ని ఇప్పుడు తేవాలన్న ఆలోచన నాకు లేదు. ఎప్పుడో నేను రాయాల్సినవన్నీ రాశాక చివరి పుస్తకంగా ఇది తేవాలని అనుకున్నా. కథలు రాయడం అనేదే నా ప్రధానమైన విషయం కాదు. వచనం నా ప్రధానమైన సాధన. అందులో కథ కూడా ఒకటి.
కానీ మన దగ్గర సమస్యేమిటంటే, ‘‘అవన్నీ రాస్తున్నావు సరే, కథేదీ?’’ అంటారు.
కేవలం, కథకుడిగా నిరూపించుకుంటేనే ఈ సాహిత్యలోకం మనల్ని అర్హుడిగా లెక్కిస్తుందన్న భావన వల్ల కూడా ఈ సంకలనం వేయొద్దనుకున్నా. ఒక మొండితనంతో.

ఇంకో కారణం ఏమిటంటే, మన దగ్గర కథనే సాధన చేస్తూ కథకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నవాళ్లు కూడా ఇప్పటివరకూ సంకలనాలు తేలేదు. ఒక పుస్తకం దాటేన్ని కథలు వాళ్లు రాసినప్పటికీ. వాళ్లే తేలేదు, నేను తేవడమేంటనే గిల్టు వల్ల కూడా పుస్తకం ఇప్పుడప్పుడే వద్దనుకున్నాను.

కానీ కృష్ణమోహన్‌బాబు గారు రెండు మూడు సార్లు అన్నారు. మీ కథలు వేద్దాం అని. తెలుగులో పరిస్థితి మీకు తెలియనిది కాదు. పుస్తకం వేస్తామని పబ్లిషర్లు అడిగే రోజులు కావు. సీరియస్‌గానే అడుగుతున్నారు; కథలన్నీ ఒక దగ్గర పడుంటాయిగదా అనుకున్న. అందుకే ఇది నాది కాదు, పూర్తిగా కృష్ణమోహన్‌బాబు పుస్తకం. ఆయన చొరవతో ఆయన వల్ల వచ్చిన పుస్తకం. వాళ్ల మొదటి ప్రచురణగా నా కథలు ఎంచుకోవడం సంతోషం.

థాంక్యూ.


(ఛాయా ప్రచురణగా 2017లో వచ్చిన ‘చింతకింది మల్లయ్య ముచ్చట’ కథల సంపుటి ఆవిష్కరణ సభలో నేను మాట్లాడిన మాటలు.)

– నాకు సంబంధించిన అన్నీ ఇక్కడ పోస్టు చేయడంలో నాక్కూడా ఒక సౌలభ్యం ఉంది.

– మరో దేనికోసమో వెతుకుతుంటే, ఇది తగిలింది :–)





Thursday, October 20, 2022

మనోధర్మ పరాగం: రచయిత ‘గొంతులు’ వినేముందు

మధురాంతకం నరేంద్ర గారి మనోధర్మ పరాగం నవల మీద నా అభిప్రాయం.

-

రవి వీరెల్లి గారు కోరడంతో ‘ఆటా’(అమెరికా తెలుగు అసోసియేషన్‌) నవలల పోటీకి నేను కూడా ఒక న్యాయనిర్ణేతగా వ్యవహరించాను. నా మరో ముగ్గురు సహనిర్ణేతలు సాయి బ్రహ్మానందం గొర్తి, పి.సత్యవతి, శివకుమార్‌ తాడికొండ గార్లు. మొదటి బహుమతిని ఏకాభిప్రాయంతో మధురాంతకం నరేంద్ర గారి ‘మనోధర్మ పరాగం’కు ఇచ్చాం. అయితే నవలను అచ్చువేసేటప్పుడు మరెవరో ముందుమాట రాయడం కాకుండా, మా నలుగురినే మా అభిప్రాయాలను క్లుప్తంగానైనా రాసిమ్మని అడిగారు నరేంద్ర. అప్పుడు నేను రాసింది ఇది:


రచయిత ‘గొంతులు’ వినేముందు

పూడూరి రాజిరెడ్డి


ఈ నవల పీడీఎఫ్‌ నా చేతుల్లోకి వచ్చినప్పుడు ముందు దీని టైటిల్‌ భయపెట్టింది. పైగా కథను చెబుతున్నది ఎవరు? స్త్రీయా, పురుషుడా, లేక కాలమా అనేది స్పష్టత లేకపోవడం మరింత ఇబ్బంది పెట్టింది. కానీ దీన్ని పక్కన పెట్టనీయని ఏదో వెలుగు మాత్రం ఉందని తెలుస్తోంది. ఒక నవలల పోటీకి వచ్చిన రచనను పక్కన పెట్టే్ట ఆప్షన్‌ లేకపోయినా దాన్ని రాయడంలో రచయిత ఎఫర్ట్‌ ఎంత ఉంది, దాన్ని ఎంత సీరియస్‌గా చదవాలి అన్నది మనకు తెలుస్తూనే ఉంటుంది. రచయిత పేరు తెలియకుండా చదివిన ఈ నవల ఎవరో ‘రాయడం బాగా తెలిసినవాడు’ రాసినది అన్నది మాత్రం అర్థం అవుతోంది. ‘డు’ అనే ఎందుకు అంటే, ఇలాంటి సబ్జెక్టు ఒక మగ రచయితే రాయగలడు. భక్తిపారవశ్యంలో తేలి వచ్చే కీర్తనల్లో కూడా అంతఃగర్భితంగా వినబడే శృంగార భావనను ఒక మగ రచయితే పట్టుకోగలడని నా నమ్మకం.


పుస్తకం ముందుకు సాగకపోవడానికి మరో కారణం, దీని ఫార్మాట్‌. ఒక పాత్ర వచ్చి తన గురించి చెప్పుకుంటుంది, తర్వాత మరొక పాత్ర, తర్వాత మరో పాత్ర వచ్చి స్విచ్‌ వేసినట్టుగా తన తలపోత వినిపిస్తుంది. ఇది ఇక ఒక తంతుగా సాగుతున్నదే అనిపించేలోగానే నవల నూరు పేజీలకు చేరుకుంది. ఆ ఇద్దరు యువతులు ఒక తిరుగుబాటు చేద్దామని ఆ ఫొటో స్టూడియోకు వెళ్లే ఘట్టం ఎప్పుడైతే వచ్చిందో– అప్పటికే ఇది ఎవరినో మనసులో పెట్టుకుని రాస్తున్నాడని అస్పష్టంగా అనిపిస్తున్నది దీంతో స్పష్టమయ్యిందో– ఇక నవల ఎత్తుకుంది. చిత్రంగా అంతకు ముందటి అభిప్రాయాన్ని మార్చేస్తూ ఈ ఫార్మాటే దీనికి సరైనది అనిపించింది. ఇక్కడ నెరేటర్‌ పాత్రలకు పరిచితుడు కాదు. చారిత్రక ఆధారాలపై మాత్రమే కథనం ఆధారపడినప్పుడు ఈ ఇంటర్వ్యూ  తరహా దూరం తప్పదు. కానీ డీటెయిల్స్‌ను పూరించుకోవడంలో ఉన్నది రచయిత శక్తి. ప్రతి పాత్రా;  తంజావూరు, మధురై, మద్రాసు, కోయంబత్తూరుల్లోని ప్రతి వీధి  రచయితకు పరిచయం ఉన్నదే అనేంత దగ్గరికి వెళ్లగలిగాడు. అలాగే ఒక పాత్ర నుంచి మరో పాత్ర కథనానికి పాఠకుడిని సిద్ధం చేస్తున్న ప్రతిసారీ మధ్యలోకి నెరేటర్‌ను ప్రవేశపెట్టి, ఆ కాలపు సామాజిక రాజకీయ సాంస్కృతిక పరిణామాలను వివరించడం ఒక విరామంగానూ; ఆ పరిణామాల్లో ఈ పాత్ర ఎలా భాగంగా ఉందోనన్న అదనపు సమాచారం కోసమూ రచయిత వాడుకున్నాడు. అయితే ప్రదర్శన జరుగుతున్నప్పుడు చూడటం కాకుండా, జరిగిన అనంతరం దాని నెమరువేత శిల్పాన్ని ఎంచుకోవడం వల్ల కొన్ని సూక్ష్మ వివరాలను చెప్పడానికి అది బాగా కలిసొచ్చింది. అదే సమయంలో ఎక్కడైనా పెద్ద ఉద్వేగం వచ్చినప్పుడు అక్కడ కొంతసేపు నిలిచే అవకాశం లేకుండా పోయింది. మనకు తెలియని మనుషుల్ని అర్థం చేసుకోవడంలో, వాటి గురించిన సమాచార లభ్యతలో ఉన్న పరిమితే దానికి కారణం. కానీ ఈ ఫార్మాట్‌కు ఉన్న సానుకూలత ఏమిటంటే, మరిన్ని కొత్త ఆధారాలు బయటపడినప్పుడు మరో పాత్రని ప్రవేశపెట్టి ఆ వివరాలను కూడా రచయిత అందించగలడు. ఈ రచయిత ఎవరై ఉంటారన్న ప్రత్యేకమైన ఆసక్తి  నాకు ఎప్పుడు కలిగిందంటే– వాత్సాయన కామసూత్ర చదివితే  గొంతు మరింత విప్పారుతుందని అప్పుడప్పుడే ప్రసిద్ధురాలవుతున్న బ్రాహ్మణ గాయని కుంభకోణం మంగతాయారుకు ఒక పాతతరం దేవదాసీ గాయని సలహా ఇచ్చే సన్నివేశం ఎదురైనప్పుడు.


చిత్తూరు స్కంధ కుముదవల్లి, శ్రీరంగం అముదవల్లి, మధురై మోహనాంబ, తంజావూరు ధనకోటి, వేలూరు రామస్వామి పొన్న గాయత్రి– ఈ పాత్రలకు పెట్టిన పేర్లు నిండుగా నోటితో పలకాలి అనేంత బాగున్నాయి. ప్రధాన కథకు అంతగా సంబంధం లేకపోయినా వచ్చే సరళకుమారి లాంటి పాత్రలు రచయిత దృష్టి దేవదాసీ వ్యవస్థకు మాత్రమే పరిమితమై లేదనీ; మొత్తంగా భిన్న స్థాయుల్లోని స్త్రీ పురుష సంబంధాలను శృంగారంతో సహా వ్యాఖ్యానిస్తూ పరిధి విస్తరించుకున్నాడనీ అనిపించింది. పైగా 2020 సంవత్సరంలోనూ అలాంటి ‘పురుషాధిపత్య’ సమాజంలోనే ఉన్న సి.కె.నాగలక్ష్మి మునిమనవరాలిని కూడా కథనంలోకి తేవడం ద్వారా నవల రిలవెన్స్‌ మరింత పెరిగింది. రచయిత పూర్తి స్పృహతోనే ఇందులో ఏ ఒక్క మగ పాత్రకు గొంతు ఇవ్వలేదని కూడా నాకు అనిపించింది. నాగలక్ష్మి తమ్ముడు దండపాణిని వదిలేసి ఏ ప్రాముఖ్యతాలేని అతడి రెండో భార్య ద్వారా కథను నడపడం దీనికి నిదర్శనం. దీనివల్ల సి.కె.నాగలక్ష్మి యావజ్జీవితానికి సంబంధించిన ఎన్నో సమాధానాలను ఇవ్వగలిగే, ఎన్నో సందేహాలను తీర్చగలిగే విశ్వనాథన్‌ పాత్రను విస్మరించగలిగే సృజనాత్మక ఔచిత్యం ఏర్పడింది. ప్రశ్నలు రేపి, సమాధానాలు పూరించుకునేలా వదిలేయడంలోనే ఉంది రచయిత ప్రజ్ఞ.


(అక్టోబర్‌ 2020)




 

Tuesday, October 18, 2022

బాలసుబ్రహ్మణ్యం: అలవాటైన గొంతు

అలవాటైన గొంతు


నాకు సంగీతజ్ఞానం ఏమీ లేదు. అందరిలాగే నేను ఊరికే పాటలు వినేవాడిని అంతే. కాబట్టి బాలసుబ్రహ్మణ్యం గురించి ప్రత్యేకంగా ఏం చెప్తాను, ఏం అభిప్రాయం ఉంది నాకు?

ఈ బాలసుబ్రహ్మణ్యం, చిరంజీవి లాంటి వాళ్లు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు మన జీవితంలోకి వచ్చేశారో కూడా తెలియదు. మన అంటే 70, 80ల్లో జీవితాలు ప్రారంభించిన వాళ్ళని నా ఉద్దేశం. కొద్దిగా సినిమా అనే ఊహ తెలిసేనాటికే వాళ్ళు వాస్తవమై ఉన్నారక్కడ. చిరంజీవిని ఎందుకు కలిపి చెప్తున్నానంటే, నేను చిన్నప్పుడు ప్రతి సినిమాలోనూ చిరంజీవే ఉంటాడు అనుకునేవాణ్ణి. అట్లనే ప్రతి పాట బాలసుబ్రమణ్యం పాడతాడు అంతే. ఆ పేరు  తెలుసు అని కూడా కాదు, ఆ గొంతు తెలుసు. కాబట్టి వీళ్లు మనకు నచ్చడం, నచ్చకపోవడం అనే అవకాశమే లేదు. మనం ఎంపిక చేసుకోలేదు. సినిమా అనే మహత్తరమైన శక్తి మన కోసం ఎంపిక చేసి ఉంచిన  గొంతు బాలసుబ్రమణ్యం. అది ఎంతగా అలవాటైపోయింది అంటే, ఆ గొంతు ఒక స్టాండర్డ్‌. ఒక ప్రమాణం. అట్ల లేనిది ఇంకా గొంతు కాదు అనిపించేది. అబ్బా, ఈ బాలసుబ్రమణ్యం లేకపోతే ఈ పాటలన్నీ ఏమైపోయేవి అనిపించేది.

నాకు ఒకటి బాగా గుర్తుంది. జేసుదాసు గొంతు మొదటిసారి విన్నప్పుడు–  అది ఆస్తులు అంతస్తులో ఎర్రమందారమో– ఇదేంట్రా ఇట్లా ఉంది గొంతు అనుకున్నాను. నిజానికి అదొక అమృతధార అని తర్వాత, చాలా తర్వాత ఎప్పుడో తెలుసుకోగలిగాను. ఘంటసాలది కూడా అట్లనే. మరీ పాత పాటలు నేను చాలా ఆలస్యంగా విన్నాను. బాలును విన్న చెవులతో నాకు ఘంటసాలది కూడా ఆనలేదు. అదీ బాలు! అంతగా నా చెవులు, చేతన ఆక్రమించుకున్నాడు. అట్లా ఎన్నో ఏళ్లు మునిగి తేలి, మునిగి తేలిన తర్వాత బాలసుబ్రమణ్యం కాకపోతే చాలు ఆ పాట వినసొంపు అనేంతగా యాష్ట కూడా పెట్టాడు. చెవులకి ఎప్పుడూ ఒక కొత్త శబ్దం కావాలి మనకు. కొత్తదనమే అందం. కానీ అన్ని ఏండ్లు ఒక గొంతు ఉనికిలో ఉండగలగడం మాత్రం ఆశ్చర్యమే. తొందరగా గ్రహించగలగడం, గొంతు మార్చి పాడగలగడం ఇట్లా రకరకాల కారణాలు చెపుతారు. వాటన్నింటికీ అతీతమైనది ఏదో ఆయనకు ఆ స్థానం ఇచ్చి ఉంటుంది.

నాకున్న ఒక ప్రాబ్లం ఏంటంటే నాకు ట్యూన్‌ ముఖ్యం. మంచి ట్యూన్‌ పడినప్పుడు దానిలో ఎవరు పాడినా ఒకటే అనిపిస్తుంది. ‘నవమి నాటి వెన్నెల నీవు’ బాలు కాకుండా మనో పాడితే దాని సొంపు తగ్గుతుందా? కొన్ని మంచి సినిమాలు ఉంటాయి. అందులో అందుబాటులో ఉన్న మంచి నటుడు ఎవరు నటించినా ఒకటే. యాక్టర్‌ కూడా ప్లస్‌ కావడం అనేది అరుదుగా జరుగుతుంది. అలాగే నేను మాటలకి కూడా పెద్ద ప్రాధాన్యత ఇవ్వను. వినడానికి బాగుండాలి. కాబట్టి కేవలం సంగీతం వల్ల నాకు నచ్చిన పాటలు బోలెడున్నాయి. ఒక్కోసారి దీనికి భిన్నమైన అభిప్రాయం కూడా ఉంటుంది. ఉదాహరణకు శుభసంకల్పం సినిమాలో ‘హరిపాదాన పుట్టావంటే గంగమ్మ’ పాట మధ్య ఒక లేడీ వాయిస్‌ వస్తుంది. అట్లాగే కిల్లర్‌ సినిమాలో ‘పిలిచే కుహు కుహు వయసే’ ముందు ఒక హమ్మింగ్‌ లాగా ఉంటుంది. టైటానిక్‌ సినిమాలో లేడీ వాయిస్‌. ఇవి నాకు మళ్ళీ మళ్ళీ గుర్తు వస్తూ ఉంటాయి. ఈ చిన్న చిన్న బిట్స్‌ చాలా ఇంపార్టెంట్‌ నాకు. బాలసుబ్రహ్మణ్యం ఇట్లా నాకు ఎప్పుడు అనుభూతి కలిగించాడు! ఆయన గురించి చెప్పాలంటే అంతటా ఆయనే ఉన్నాడు, ఎక్కడా దొరకడం లేదు అనే సమస్య వస్తోంది.

అయితే ‘విధాత తలపున ప్రభవించినది’ ఈ పాట విన్నప్పుడు నాకు జీవిత ఉత్సాహం పొంగుకొస్తుంది. ఎందుకో తెలీదు. అందులోని మాటలకు మించి ఆ ఆరా  ఏదో నన్ను తాకింది. దానికి సిరివెన్నెలకు క్రెడిట్‌ ఇవ్వాలా, హరిప్రసాద్‌ చౌరాసియాకా, బాలసుబ్రహ్మణ్యంకా అర్థం కాదు. ఎందుకో అట్లా హృదయం గంతులేస్తుంది. అదే ‘ఆమని పాడవే హాయిగా’ అంటే నాకు నీరసం పుడుతుంది. ఈ మ్యాజిక్‌ ఏంటో అర్థం కాదు. అంటే మనకు తెలియకుండానే ఆ పాటకూ, నాకూ మధ్య ఏదో కుదిరింది. బాలసుబ్రహ్మణ్యంకూ, నాకూ కూడా అట్లా చాలా ఏళ్ళు చాలా చాలా సార్లు కుదిరింది.


(2020 అక్టోబర్‌)

(మోదుగుల రవికృష్ణ తెచ్చిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మృతి సంచిక కోసం పంపింది.)


 

Saturday, October 15, 2022

ఒంటరి సమూహం


ఒంటరి సమూహం

సుమారు ఆరు దశాబ్దాలుగా అలుపెరగకుండా రాస్తున్న ‘అత్యంత ప్రాధాన్యం గల స్త్రీవాద రచయిత్రి’ ఆనీ ఎర్నౌను 2022 నోబెల్‌ సాహిత్య పురస్కారం వరించింది. ఈ గౌరవం దక్కిన తొలి ఫ్రెంచ్‌ మహిళ ఆమె. ప్రపంచవ్యాప్తంగా ఈ పురస్కారం పొందిన పదిహేడో మహిళ.

సాహిత్యానికి తక్షణ ప్రయోజనం ఉండకపోవచ్చు; అయినా కూడా మహిళలు, అణిచివేతకు గురైనవారి పోరాట గాథలను సజీవంగా ఉంచుతున్నానంటారు 82 ఏళ్ల ఆనీ ఎర్నౌ. శరీరం, లైంగికత; సాన్నిహిత్య సంబంధాలు; సామాజిక అసమానతలు; చదువు ద్వారా వర్గాన్ని మార్చుకునే ప్రయత్నం ఆమె రచనల్లో కనబడతాయి.  

ఫ్రాన్స్‌లోని చిన్న పట్టణం నార్మండీలో వారి కుటుంబం నివసించింది. బతకడానికి నాకు పుస్తకాలు అక్కర్లేదని కరాఖండీగా చెప్పే తండ్రిని కలిగిన అతి సాధారణ నేపథ్యం. ఒక కెఫే యజమానిగా అలెగ్జాండర్‌ డ్యూమా, ఫ్లాబర్ట్, ఆల్బర్ట్‌ కామూ లాంటి రచయితలను చదవడం వల్ల తనకేం ఒరుగుతుందని ఆయన నిశ్చితాభిప్రాయం. కానీ ఆనీలో అది పూర్తి విరుద్ధంగా పనిచేసింది. పుస్తకాలు మాత్రమే తనకు అత్యంత ప్రీతికరమైనవనీ, ఎంత చెడ్డ జీవితంలోనూ తనను తాను ఒక ‘అ–పాఠకురాలిగా’ ఊహించలేననీ అంటారామె. ఆరేళ్ల వయసు నుంచే అక్షరంలోని గమ్మత్తుకు ఆకర్షితురాలయ్యారు. వందలాది పుస్తకాలను ఉచితంగా చదువుకోవడం కోసమే పుస్తకాల షాపులో పనిచేయాలని కలగన్నారు. ఒక శ్రామిక కుటుంబంలో పుట్టి, బుద్ధెరిగాక మధ్యతరగతి జీవితాలతో పోల్చుకున్నప్పుడు తమ పరిస్థితి పట్ల సిగ్గుపడిన ఆనీ ఎర్నౌ చదువుకోవడం ద్వారా జీవితాలను మార్చుకోగలమన్న అభిప్రాయానికి చాలా త్వరగా వచ్చారు. దానికి అనుగుణంగానే ముందు టీచర్‌గా, అనంతరం లిటరేచర్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు.

వర్జీనియా వూల్ఫ్‌ అంటే ఆనీకి పిచ్చి అభిమానం. సైమన్‌ ది బోవా ఆమె చైతన్యాన్ని విస్తృతపరిచారు. స్త్రీవాదం అనేది తప్పనిసరైనది అన్న అవగాహనతో ఇరవై ఏళ్ల వయసు నుంచే తన రచనా వ్యాసంగం మొదలుపెట్టారు. తన కుటుంబానికి తెలియకుండా చేయించుకున్న అవాంఛిత గర్భస్రావం గురించి ‘క్లీన్డ్‌ ఔట్‌’ రాశారు. ఆ అనుభవంలోని జుగుప్స, భయానకాలకు వెరవకుండా, దీన్నే పునర్దర్శనంలాగా ‘హ్యాపెనింగ్‌’ రాశారు. ఒక స్త్రీ తన శరీరం మీద తన నియంత్రణనూ, స్వాతంత్య్రాన్నీ స్థాపించుకోవడానికి సంబంధించిన అతిముఖ్యమైన నవలగా ఇది నిలిచిపోయింది. తను దాటివచ్చిన జీవిత దశలనే ఆనీ పుస్తకాలుగా మలిచారు. ఆమె కౌమార జీవితం ఒక పుస్తకం. వైవాహిక జీవితం ఒక పుస్తకం. తూర్పు యూరోపియన్‌ మనిషితో ప్రేమ వ్యవహారం(ప్యాషన్‌ సింపుల్‌) ఇంకో పుస్తకం. తల్లి మరణం ఒక పుస్తకం. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అనుభవాలు మరో పుస్తకం. ఫ్రాన్స్‌ చరిత్రతో ముడిపడిన ‘ది ఇయర్స్‌’ను ఆమె మ్యాగ్నమ్‌ ఓపస్‌గా పరిగణిస్తారు. ఉత్తమ పురుష(నేను) కథనాలకు భిన్నంగా దీన్ని థర్డ్‌ పెర్సన్‌లో రాశారు. 

ఏ వ్యక్తిగత అనుభవమో ‘పొరపాటున’ సాహిత్యంలోకి వస్తే– దానికీ, తనకూ ఏ సంబంధమూ లేదని ఒక డిస్‌క్లెయిమర్‌ లాంటిది ఆ రచయిత తగిలించడం కొత్త సంగతేం కాదు. మరీ ముఖ్యంగా సంక్లిష్ట కుటుంబ సంబంధాలు, సన్నిహిత మానవ సంబంధాలు వచ్చినప్పుడు ఈ జాగ్రత్తలు మరీ ఎక్కువ. ఇక వ్యక్తిగతం అన్నదే కొందరికి నిషిద్ధాక్షరి. వ్యక్తి నుంచి కూడా సమాజాన్ని దర్శించవచ్చునన్న అవగాహన ఉన్నవాళ్లు తక్కువ. కానీ ఆనీ ఎర్నౌ సాహిత్య సర్వస్వం ఆత్మకథాత్మకమే. ఇది కల్పన అని చెబితే రచయితకో రక్షణ కవచం ఉంటుందన్న ఆలోచన ఆమెకు లేక కాదు. కానీ అది మోసం చేయడంలా భావించారు. వ్యక్తిగత జీవితాన్ని ఒక ప్రయోగశాలలో పరీక్షించుకున్నంత కచ్చితత్వంతో తన అనుభవాలను నమోదు చేశారు. అందువల్లే ఆమె ‘గ్రేట్‌ ట్రూత్‌ టెల్లర్‌ ఆఫ్‌ ఫ్రాన్స్‌’గా నిలవగలిగారు. నార్మండీ లాంటి చిన్నపట్టణంలో తన జీవితాన్నీ, తండ్రితో తన సంబంధాన్నీ ‘ఎ మ్యాన్స్‌ ప్లేస్‌’గా రాస్తున్నప్పుడు తన రచనాపద్ధతిని గురించి ఆమె ఘర్షణపడ్డారు. తండ్రిని ఒక కాల్పనిక పాత్రగా మలవడంలో తన రచనా ఉద్దేశమే నెరవేరదని భావించారు. అందుకే ఉన్నది ఉన్నట్టే రాయడానికి సంకల్పించారు. అందుకే ఆమెను ఫిక్షన్‌ రచయిత అనాలా, నాన్‌–ఫిక్షన్‌ రచయిత అనాలా అన్న చర్చకూడా వచ్చింది. కొందరు ఆమెను ‘మెమొయిరిస్ట్‌’ (జ్ఞాపకాల రచయిత) అన్నారు. నవలగా, ఆత్మకథగా కాకుండా తన రచనలను ఆటోసోషియోబయోగ్రాఫికల్‌(సామాజిక ఆత్మకథ)గా మలవగలగడం ఆమె ప్రత్యేకత. చరిత్ర, ఆత్మకథల కలగలుపు ఆమె పద్ధతి. 

ఇంట్లో పుస్తకాలను చూసి, ఇవన్నీ చదువుతావా అని ఆశ్చర్యపోయిన తన కజిన్, పుస్తకాలతో మనుషులకేం పని అన్నట్టుగా బతికిన తన తండ్రిలాంటివాళ్లు నిజానికి తనకు ఎక్కువ స్ఫూర్తి కలిగించారని చెప్పే ఆనీ... మర్చిపోయి అంతర్ధానమయ్యే లోపల జ్ఞాపకాలను పదిలపరుస్తున్నానంటారు. ఫ్రాన్స్‌ ఉమ్మడి జ్ఞాపకాలను ఆమె తన ద్వారా వ్యక్తం చేస్తున్నారు. అనువాదాల ద్వారా అవి ప్రపంచ స్మృతులుగా కూడా మారాయి.

తన ప్రపంచంగా అనిపించని పారిస్‌ విలాసాలకు దూరంగా ప్రకృతి, నిశ్శబ్దాల కోసం సబర్బన్‌ ప్రాంతంలో నివసించే ఆనీ ఎర్నౌ... ఒక దశలో ‘మహిళా విప్లవం’ చూడకుండానే చచ్చిపోతానేమో అని భయపడ్డానంటారు. కానీ అబార్షన్‌ హక్కులు రావడానికీ, స్త్రీ శరీరం మీద మారుతున్న పురుష ప్రపంచ ధోరణికీ ఆమె కూడా ఒక కారణం అయ్యారు. సాహిత్యానికి తక్షణ ప్రయోజనం ఉండకపోవచ్చు; కానీ ప్రయోజనం లేకుండా మాత్రం ఉండదు.

(10th October 2022)
 


 

Thursday, October 13, 2022

పతంజలి శాస్త్రి: గొప్పదూరపు రచయిత

 గొప్పదూరపు రచయిత

పూడూరి రాజిరెడ్డి


పతంజలి శాస్త్రి గారిని తలుచుకోగానే నాకు గుర్తొచ్చిన కథ, గారడీ. ఆ పేరు కూడా కాదు; ఒక మగవాడి పుంసత్వపు నిస్సహాయతా, ఇక దానివల్ల గట్టిగా నోరెత్తలేని బలహీనతా. ఇలాంటి కథలు ఉంటే ఆ స్త్రీ కోణంలోనో, లేకపోతే ఆ అలవాటైనవాడి కోణంలోనో ఉంటాయి. కానీ ఇలాంటి కథ నేను ఎక్కడా చదవలేదు. ఏదో ఒక వయసులో, స్థాయిలో అన్ని రకాలుగానూ జీవితంలో వెనక్కి తగ్గడం ఎలా మొదలవుతుందో కూడా ఇందులో చూడొచ్చనుకుంటాను.

ఇలాంటి కథ నేను మరెక్కడా చదవలేదు అని చెప్పగలిగే ఇంకో కథ, వడ్ల చిలకలు. మధ్య తరగతి అనే ఒక బ్రహ్మ పదార్థం మీద చాలా నిరసన, ఏవగింపు, వ్యంగ్యం సాహిత్యంలో కనబడతాయి. కానీ అదేమిటి, దాని దృక్పథం ఎలా ఏర్పడుతుంది, దాని జీవితాన్ని మలిచే అంశాలేమిటి, అది ఏం మాట్లాడుకోవడానికి చెవులు రిక్కిస్తుంది, దాని కలలను ఎలా అణిచివేసుకుంటుంది, అసలు కలలు కనడానికి కూడా ఎలా వెనుకాడుతుంది– అని చెప్పడానికి ఈ కథను ఒక నమూనాగా చూపవచ్చు.

సంపాదకుడు శక్తిమంతుడు అని పత్రికవాళ్లకు తెలుసు. కానీ కంట్రిబ్యూటర్‌ శక్తిమంతుడని లోకానికి తెలుసు. అందుకే సంపాదకుడు చేయలేని పనిని కంట్రిబ్యూటర్‌ ఇట్టే చేసేయగలడు. ఇవొక చిత్రమైన పవర్‌ పాలిటిక్స్‌. దీన్నే పోలీసు వ్యవస్థ నేపథ్యంలో, ఏసీపీ మృదువుగా చేయలేని పనిని ఎస్సైతో మొరటుగా చేయించి చూపారు పతంజలి, ఎస్సై నవ్వేడు కథలో.

కనకం గట్టెక్కిన వైనము అనే ఇంకో కథలో, అదనపు డబ్బుల కోసం పుట్టింటికి తన కూతుర్ని తరిమికొట్టిన అల్లుడిని ఎదుర్కోలేని ఒక నిస్సహాయ కానిస్టేబుల్‌ మామ కోసం– కస్టడీలో ఉన్న దొంగ కొత్త సినిమా రిలీజు రోజు జేబులు కొట్టడం చూస్తాము. 

నడిపే బండి మీద, బతికే జీవితం మీద ఏకాగ్రత లేని ఒక పెళ్లయిన కొడుక్కు– జీవితంలో ఎలా మమేకం కావాలో అర్థం చేయించడానికి ప్రయత్నించే తండ్రి ‘జెన్‌’లో కనబడతాడు.

ఇంకా అతడి శీతువు, రామేశ్వరం కాకులు మంచి కథలు. లోలోపల గుబులును రేపే కథలు. తెలియని వ్యథను సున్నితంగా చెప్పే కథలు. ఇలా కథల్ని ఏకరువు పెడుతూ పోవాలని నేనేమీ అనుకోవడం లేదు. జీవన సాఫల్య పురస్కారం అందుకునే రచయితకు ఇవ్వాల్సిన సమీక్ష కాదు ఇది.

ప్రతిదాని మీదా స్పష్టమైన అభిప్రాయాలు ఉండేవాళ్లు నన్ను భయపెడతారు,  ముఖ్యంగా సాహిత్యంలో. జీవితం అర్థం కానిది అని మాత్రమే నేను అర్థం చేసుకోగలిగాను. ఆ అర్థంకానితనాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఆర్టిస్టు పడే తపన నన్ను ఆకట్టుకుంటుంది. అయితే, పతంజలి శాస్త్రిలో ఆ తెలియనితనం అంటూ ఏమీ కనబడదు. ఆయనకు అన్నీ తెలుసు అనిపిస్తుంది. అంటే, ఆయన పూర్తిగా ఏర్పడినాక, రూపుదిద్దుకున్నాక చేస్తున్న సృజన ఇది. కాబట్టి, దేనితోనూ గట్టి విభేదాల్లేవు, గట్టి పంతాల్లేవు, బయటపడిపోయే అమాయకత్వం అసలు లేదు. తన కుటుంబ నేపథ్యం వల్ల సమాజపు ఏ బరువూ ఆయన మీద లేని స్వేచ్ఛ ఉండటం కూడా దీనికి ఒక కారణమా అన్నది నేను చెప్పలేను. అయితే, ఈ పతంజలితో పోల్చుకుని తనను చిన్న పతంజలి అని చెప్పుకున్న కేఎన్‌వై పతంజలి ఒక మంచి మాటన్నారు: ‘ఉద్యమాలతో సంబంధం లేకనో, వాటితో విభేదించకుండానో కేవలం జీవితాన్ని మాత్రమే పట్టుకుని ప్రయాణించే సాహిత్యం ఎపుడూ ఉంటుంది. పతంజలిశాస్త్రి గారిది అలాంటి సాహిత్యం’.

అయితే పతంజలి శాస్త్రిని నేను ఎక్కువగా చదవలేదు. కారణాలేమిటో నాకూ తెలీదు. ఆయన ఒక ‘ఫోర్సు’గా నా దగ్గరిదాకా చొచ్చుకు రాలేదు. బహుశా చదవడం పట్ల నాకుగా ఉన్న చిత్రమైన అభిప్రాయాల వల్ల కావొచ్చు. రచయితలు వెల్లడి కాని రచనలు నాకు అభిమానాన్ని పుట్టించవు. తన గురించి ఏదోలాగానైనా చెప్పుకోవాలన్న లౌల్యం లేని రచయితలు నాకు దగ్గరివాళ్లుగా అనిపించరు. అలాగని ఆ లౌల్యమే ప్రధానమైతే ఇక ముందుకెళ్లను. కానీ తన రచనల్లో పతంజలి ఎక్కడున్నారో, ఏ పాత్రలో ఆయన్ని చూసుకోవాలో నాకు అంతుపట్టలేదు. ఇలా నిర్మమకారంగా రాసేవాళ్లు నిజానికి గొప్పవాళ్లు. కానీ నాకు దూరపువాళ్లు.

అయితే ‘ప్రగతిశీల’ ప్రయోజనం ఏమీ ఉండదని కొందరు రచయితలు కొన్ని రాయకుండా వదిలేస్తారు, ముఖ్యంగా ఒక ‘స్థాయి’కి వచ్చాక, ఇంకా ముఖ్యంగా తెలుగులో. కానీ వెన్నెల వంటి వెలుతురు గూడు రాయడం పతంజలిని ఈ మొత్తంనుంచి వేరుగా నిలబెడుతుంది. రైలు ప్రయాణంలో ఒక చిరు ఉద్వేగపు కల్లోలాన్ని చూపిన ఈ చిట్టి కథ గనక నేను చదవకపోయివుంటే ఆయనకు నేను ఇంకా దూరంగానే ఉండిపోయేవాడిని.


(2021 నవంబర్‌)

(పతంజలి శాస్త్రి గారికి అజో–విభో వారి జీవన సాఫల్య పురస్కారం ఇచ్చినప్పుడు ఆయన మీద వేసిన ప్రత్యేక సంచిక కోసం రాసింది.)


 

Monday, October 10, 2022

గన్స్, జెర్మ్స్‌ అండ్‌ స్టీల్‌: అసమాన ప్రశ్నలు

 


అసమాన ప్రశ్నలు

ఈ ప్రపంచం ఎందుకు ఇలా ఉంది? ఈ అసమానతలకు కారణం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు ఒక శాస్త్రవేత్తకు వస్తే? ఆయన చరిత్రకారుడు కూడా అయితే! జియాగ్రఫర్, ఆర్నిథాలజిస్ట్‌ లాంటి అదనపు అర్హతలు కూడా ఉంటే? ఇలాంటి ప్రశ్నలకు బహు వృత్తులు, ప్రవృత్తులు కలగలిసినవారే జవాబులు చెప్పగలరు. 

ఒకానొక సముద్రపు ఒడ్డు నడకలో అమెరికన్‌ రచయిత జేరెడ్‌ డైమండ్‌(జ.1937)ను ఒక నల్లజాతి యువకుడు, పాపువా న్యూ గినియా దీవులకు చెందిన ‘యాలి’ ఇలా నిలదీశాడు: ‘మీ తెల్లవాళ్ల దగ్గర అంత ‘కార్గో’(వస్తు సామగ్రి) ఉన్నప్పుడు, మా దగ్గర అది ఎందుకు లేదు?’ ఈ అన్వేషణలో భాగంగా ఏళ్లపాటు చేసిన పరిశోధనతో జేరెడ్‌ డైమండ్‌ రాసిన పుస్తకం ‘గన్స్, జెర్మ్స్‌ అండ్‌ స్టీల్‌: ద ఫేట్స్‌ ఆఫ్‌ హ్యూమన్‌ సొసైటీస్‌’. శీర్షికలోనే సమాధానాలను నిలుపుకున్న ఈ పుస్తకం సరిగ్గా పాతిక సంవత్సరాల క్రితం 1997లో వచ్చింది. ఆ తర్వాత దీని ఆధారంగానే ఇదే పేరుతో ‘ఎన్జీసీ’ ఛానల్‌ డైమండ్‌ హోస్ట్‌గా మూడు భాగాల డాక్యుమెంటరీ కూడా నిర్మించింది.

సులభంగా కనబడే ఈ ప్రశ్నలకు జవాబులు అంత సులభంగా దొరకవు. వీటికి సమాధానాలు కూడా వర్తమానమో, సమీప గతమో చెప్పలేదు. అందుకే చరిత్ర, పూర్వ చరిత్ర యుగంలోకి డైమండ్‌ మనల్ని తీసుకెళ్తారు. మనుషులందరూ ఆహార సేకరణ దశలోనే ఉన్న తరుణంలో పదమూడు వేల ఏళ్ల క్రితం ‘మధ్య ప్రాచ్యం’లో మొదటిసారి వ్యవసాయం మొదలైంది. బార్లీ, గోధుమ పండించారు. ఎప్పుడైతే మిగులు పంట సాధ్యమైందో అక్కడ మనుషుల వ్యాపకాలు ఇతరాల వైపు మళ్లాయి. అలా మానవాళి మొదటి నాగరికత నిర్మాణం జరిగింది. చిత్రంగా పాపువా న్యూ గినియాలో ఇప్పటికీ వ్యవసాయం మొదలుకాలేదు. దానికి కారణం, అక్కడివాళ్లు తెలివైనవాళ్లు కాదనా? ఏ చెట్టు ఏమిటో, ఏ పుట్టలో ఏముందో చెప్పగలిగేవాళ్లు; ఎంతదూరమైనా బాణాన్ని గురిచూసి కొట్టేవాళ్లు తెలివైనవాళ్లు కాకపోవడం ఏమిటి? ఏ పంటలైతే మధ్య ప్రాచ్యంలో నాగరికతకు కారణమయ్యాయో, అవి ఇక్కడ పెరగవు. ఆ భౌగోళిక పరిమితి వల్ల వాళ్లు ఇంకా ఆహార అన్వేషణ దశలోనే ఉన్నారు. అందుకే మనుషులను ‘అసమానంగా’ ఉంచుతున్న కీలక కారణం భౌగోళికత అంటారు డైమండ్‌. 

‘ఫెర్టయిల్‌ క్రెసెంట్‌’(సారవంతమైన చంద్రవంక)గా పిలిచే ఈ యురేసియా ప్రాంతంలోనే జంతువులను మచ్చిక చేసుకోవడం కూడా జరిగింది. ఇవి గొప్ప అదనపు సంపదగా పనికొచ్చాయి. ఆవు, ఎద్దు, గొర్రె, మేక, గుర్రం, గాడిద, పంది లాంటి పద్నాలుగు పెంపుడు జంతువుల్లో ఒక్క లామా(పొట్టి ఒంటె; దక్షిణ అమెరికా) తప్ప పదమూడు ఈ ప్రాంతం నుంచే రావడం భౌగోళిక అనుకూలతకు నిదర్శనంగా చూపుతారు డైమండ్‌. మనుషుల విస్తరణ కూడా సరిగ్గా ఆ భౌగోళిక రేఖ వెంబడి, అంటే ఏ ప్రాంతాలు వీటికి అనుకూలంగా ఉన్నాయో వాటివెంటే జరిగింది.
మరి ఒకప్పుడు మొదటి నాగరికత వర్ధిల్లిన మధ్య ప్రాచ్యం ఇప్పుడు ప్రపంచంలోనే సంపన్న ప్రాంతంగా ఎందుకు లేదు? భౌగోళికత ఒక కారణం అవుతూనే, దాన్ని మించినవి కూడా ఇందులో పాత్ర పోషిస్తున్నాయన్నది డైమండ్‌ సిద్ధాంతం. అయితే భౌగోళికత ప్రతికూలంగా కూడా పరిణమించవచ్చు. కరువు కాటకాలు ఓ దశలో మధ్య ప్రాచ్యాన్ని తుడిచిపెట్టాయి కూడా. 

వారికి తెలియకుండానే ఐరోపావాసుల పక్షాన పనిచేసినవి సూక్ష్మ క్రిములని చెబుతారు డైమండ్‌. ఇతర ప్రాంతాలకు విస్తరించే క్రమంలో జరిగిన పోరాటాల్లో, ఆ పోరాటాల కంటే ఎక్కువగా వీరి నుంచి వ్యాపించిన సూక్ష్మక్రిముల వల్ల ‘మూలజాతులు’ నశించాయి. దానిక్కారణం, వేల సంవత్సరాల జంతువుల మచ్చిక వల్ల వాటి నుంచి వచ్చే సూక్ష్మక్రిముల నుంచి వీరికి నిరోధకత ఏర్పడింది. కానీ అలాంటి సంపర్కం లేని అమెరికన్‌ జాతులు దాదాపు తొంభై ఐదు శాతం నశించిపోయాయి. ముఖ్యంగా ‘స్మాల్‌పాక్స్‌’(మశూచి) కోట్లాది మంది ప్రాణాలు తీసింది.

ఇంక ఎప్పుడైతే ఉక్కు వాడకంలోకి వచ్చిందో, ఆ ఉక్కుతో ముడిపడిన తుపాకులు రావడం ప్రపంచ గతినే మార్చేసింది. ఆ తుపాకుల వల్లే యూరప్‌ దేశాలు ప్రపంచాన్ని తమ కాలనీలుగా మార్చుకోగలిగాయి. ముఖ్యంగా ఆఫ్రికాలోని ప్రాచీన నాగరిక సమాజాలు, అవెంతటి ఘన సంస్కృతి కలిగినవి అయినప్పటికీ తుపాకుల ముందు నిలవలేకపోయాయి. అక్కడినుంచి ఎంతో అమూల్యమైన సంపద తరలిపోయింది.

మరి ఐరోపావాసులకు ప్రతికూలతలుగా పరిణమించినవి ఏవీ లేవా? ఏ భౌగోళిక రేఖ వెంబడి ప్రయాణిస్తూ వారికి అనుకూలమైన శీతోష్ణస్థితి ఉండే ‘కేప్‌ ఆఫ్‌ గుడ్‌ హోప్‌’(దక్షిణాఫ్రికా)లో మనగలిగారో, దాన్ని దాటి ఆఫ్రికాలోని ఉష్ణ మండలం వైపు విస్తరించినప్పుడు కేవలం మలేరియాతో కోట్లాదిమంది చచ్చిపోయారు.

ప్రపంచం స్థిరంగా ఆగిపోయేది కాదు. ప్రస్తుత భౌతిక ప్రమాణాల రీత్యా ప్రపంచంలో అసమానతలు స్పష్టంగా కనబడుతుండవచ్చు. కానీ మొన్న కోవిడ్‌ మహమ్మారి సమయంలో ఐరోపా, అమెరికా అల్లాడిపోయాయి. అదే పేద దేశాలు అంత ప్రభావితం కాలేదు. కాబట్టి అసమానత అనేది కూడా ఒక చరాంకం కావొచ్చు. ఒకే సమాజంలోనే కొందరు ధనికులుగా, ఇంకొందరు పేదవాళ్లుగా ఎందుకు ఉండిపోతున్నారు? ఒకే ఇంటిలోనే ఇద్దరన్నదమ్ములు భిన్న స్థాయుల్లోకి ఎందుకు చేరుతున్నారు? ఈ మొత్తంలో మానవ ప్రయత్నానికి ఏ విలువా లేదా? అందుకే డైమండ్‌ జవాబులు మరీ సరళంగా ఉన్నాయేమో అనిపించక మానదు. కానీ మార్గదర్శులు వాళ్ల జీవితాలను రంగరించి కొన్ని సమాధానాలు చెబుతారు. వాటి వెలుగులో సమాజం మరిన్ని జవాబులు వెతకాల్సి ఉంటుంది. ఎందుకంటే మానవ సమాజం అనేది మానవ స్వభావం అంత సంక్లిష్టమైనది.
 
(19th September 2022)


Friday, August 26, 2022

30 రోజుల్లో రచయిత

 


సమాజంలో భౌతికంగా మనిషి ఎదగగలిగే ఎన్నో హోదాలున్నాయి. కానీ ‘రచయిత’ కావడం అనేది వేరే లెవెల్‌. రాయడం వల్ల వచ్చే ‘రిటర్నులు’ ఏమిటనేవి ఇదమిద్దంగా ఎవరూ చెప్పలేరు. అయినాకూడా కొందరు రాస్తూనేవుంటారు. రాయడం అనేది వారికి గాలి వీచినంత, పూవు పూచినంత, ప్రవాహం సాగినంత సహజం. 

రచయిత అనే ట్యాగ్‌ మనం ఊహించలేనంత పెద్దది. రచయిత అనగానే ఒక మేధావి, ఒక ఆలోచనాపరుడు, జీవితంలో అన్నీ చూసినవాడు అనే ఇమేజ్‌ కదలాడుతుంది. ఆటోమేటిగ్గా అది ఒక ప్రత్యేక గౌరవానికి కారణం అవుతుంది. అయితే రాసేవాళ్లకు కొన్ని సమస్యలు ఉన్నాయి. చదివేవాళ్లు తగ్గిపోయారు, పుస్తకాలు అమ్ముడు కావడం లేదు, అసలు ఎవరికైనా కాంప్లిమెంటరీ కాపీ ఇచ్చినా దాన్ని ఆసాంతం చదువుతారన్న ఆశ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత స్థితప్రజ్ఞుడైనా కొంత నిరాశ పడక తప్పదు. మరి ఇలాంటప్పుడు ఎవరైనా ఎందుకు రాయాలి?

అసలు ఏ రచయితకైనా తన పుస్తకాన్ని పాఠకులు చదవాలి, పుస్తకం అమ్ముడు కావాలి అని అంత పట్టింపు ఎందుకు? అని ఎదురు ప్రశ్నిస్తారు దీపక్‌ విలాస్‌ పర్బత్‌. ‘వెల్‌ డన్‌! యు ఆర్‌ హైర్డ్‌’, ‘ఎ మాంక్‌ ఇన్‌ సూట్‌’ లాంటి రచనలు చేసిన దీపక్, అచ్చయ్యే పుస్తకాల్లో 60–70 శాతం చదవనివే ఉంటాయంటారు. అందుకే అమ్మడానికి బదులుగా ఫ్రీ గిఫ్ట్‌గా ఇవ్వడం ద్వారా పుస్తకానికి వచ్చే ఆ వందో, రెండు వందలో ఖరీదు కంటే కూడా ఎక్కువ సంపాదించవచ్చని చెబుతారు. ‘‘ఒక మోటివేషనల్‌ స్పీకర్‌గా మనం ఒక  కాలేజీకి వెళ్లి ప్రిన్సిపాల్‌కు ఏ విజిటింగ్‌ కార్డో, బ్రోషరో ఇస్తే– మనం అక్కడినుంచి వచ్చిన మరుక్షణం అది చెత్తబుట్టలో పడిపోవచ్చు. పైగా అలాంటివి ఎన్ని ఇచ్చినా మన గురించి వాళ్లకు ఒక సరైన అంచనా రాకపోవచ్చు. అదే ఒక పుస్తకం ఇస్తే? బ్రోషర్‌ కంటే తక్కువ ఖర్చుతో ప్రింటయ్యే పుస్తకం మన గురించిన అత్యుత్తమ పరిచయ పత్రం అవుతుంది. ఆయన చదవకపోవచ్చు, ఊరికే ర్యాకులో పెట్టేయొచ్చు; కానీ ఇచ్చివెళ్లినవాడు ఒక రచయిత అనే ఇమేజ్‌ పనిచేస్తుంది. ఆ సైకాలజీతోనే మనం ఆడుకోవాలి,’’ అంటారు.

ఆ కారణంగానే పుస్తకాన్ని మీ ఎదుగుదలకు ఒక పెట్టుబడిగా వాడుకోండి అని సలహా ఇస్తారు కైలాశ్‌ సి.పింజానీ. ‘డేట్‌ యువర్‌ క్లైంట్స్‌’, ‘క్యాచ్‌ ద షార్క్‌’ లాంటి రచనలు చేసిన కైలాశ్‌... ఏ ఫీల్డ్‌ వాళ్లయినా ఎదగడానికి పుస్తకాన్ని ఒక ఆయుధంగా మలుచుకోవచ్చునంటారు. ‘‘ఉజ్జాయింపుగా సమాజంలో తొంభై తొమ్మిది శాతం మంది రచయితలు కాలేరు. కాబట్టి, ఆ రాయగలిగేవాళ్లు అమాంతం ఆ ఒక్క శాతం బ్రాకెట్లోకి వచ్చేస్తారు. ఆ గుర్తింపే మిమ్మల్ని ప్రత్యేకంగా ఉంచుతుంది. మీరు రాకెట్‌ అనుకుంటే, పుస్తకం మీకు రాకెట్‌ లాంచర్‌ అవుతుంది,’’ అని చెబుతూ అర్జెంటుగా ఒక పుస్తకం రాసేయమని సలహా ఇస్తారు.

అంత అర్జెంటుగా ఎలా రాసేయడం? ముప్పై రోజుల్లో పుస్తకం ఎలా రాయాలో ఈ ఇరువురు సహచరులు ‘సూపర్‌ ఫాస్ట్‌ ఆథర్‌’ పేరుతో శిక్షణ ఇస్తుంటారు. ‘‘పుస్తకం నూటాయాభై పేజీలకు మించకూడదు. ఏ మనిషైనా రాయగలిగేవి మూడు ఏరియాలు: సొంతం జీవితంలోని డ్రామా, వృత్తిపరమైన అనుభవాలు, ప్రత్యేక ఇష్టాయిష్టాలు. పెద్దగా రీసెర్చ్‌ అవసరం లేని టాపిక్‌ ఎంచుకోండి. దాన్ని పది అధ్యాయాలుగా విభజించుకోండి. ప్రతి అధ్యాయానికీ పది ముఖ్యమైన ప్రశ్నలు వేసుకోండి. ఒక ప్రశ్నను ఒక పేరాగా విస్తరించండి. దానికి జవాబును మూడు పేరాల్లో రాయండి. అంటే పది అధ్యాయాల్లో వంద ప్రశ్నలకు నాలుగు వందల పేరాలు అవుతాయి. రోజుకు ఐదు ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. ఇరవై రోజుల్లో వంద ప్రశ్నలు పూర్తవుతాయి. ఐదు రోజులు రీసెర్చ్‌కు వదిలేస్తే, ఇంకో ఐదురోజుల్లో మార్పులు చేర్పులు, కరెక్షన్స్‌ చేయండి. ముప్పయ్యో నాటికి ఫస్ట్‌ డ్రాఫ్ట్‌ రెడీ! ఎగ్జామ్‌ హాల్లో ఇచ్చే మూడు గంటల సమయంలో మనకు ఇష్టం లేని పాఠాల మీద ఎన్నో అడిషనల్‌ పేపర్లు రాసివుంటాం. అలాంటప్పుడు మనకు ఇష్టమైన టాపిక్‌ మీద రాయడం ఎంత సులభం?’’ అంటారు కైలాశ్‌.

ఇలా మ్యాగీ నూడుల్స్‌లా వండే రచనలు ఎలా ఉంటాయో తెలీదు. బాగుండొచ్చు కూడా. అయితే కొందరు తెలుగు కవులు, రచయితలకు ఇవి కొత్త చిట్కాలు కాకపోవచ్చు. వాళ్లు ఇంతకంటే వేగంగా రాయగలరు; ఇంతకంటే బాగా ప్రమోట్‌ చేసుకోగలరు. తేడా అల్లా దీపక్, కైలాశ్‌ లాంటివాళ్లకు తమ విషయంలో ఒక పారదర్శకత ఉంది; మనవాళ్ల విషయంలో అదీ కనబడదు.

కేవలం నెమ్మదిగా రాయడం వల్లే ఒక రచన గొప్పదైపోదు. తన రాత మీద రచయిత ఎంత ప్రాణం పెడతాడన్నది ముఖ్యం. ‘యుద్ధము–శాంతి’ మహానవలను టాల్‌స్టాయ్‌ తొమ్మిదిసార్లు తిరగరాశాడట. ‘కరమజోవ్‌ బ్రదర్స్‌’ చదువుతున్నప్పుడు దోస్తోవ్‌స్కీ ఒక ఆధ్యాత్మిక జ్వర పీడితుడిలా కనబడతాడు. వాక్యంలో పెట్టాల్సిన ఒక్క కామా గురించి కూడా ఆస్కార్‌ వైల్డ్‌ తల బద్దలుకొట్టుకునేవాడట. యావజ్జీవితం సాహిత్యమే ఊపిరిగా బతికాడు చలం. జీవితకాలం రాసిన మొత్తం కూడా గట్టిగా ఒక పుస్తకానికి మించనివాళ్లు ఉన్నారు. వాళ్లు నిజంగా రచయితలు. కానీ ఇప్పుడు పుంఖానుపుంఖంగా వస్తున్న పుస్తకాలు కొన్ని చెట్ల ప్రాణాలు తీయడానికి తప్ప పనికిరావు. కాబట్టి రాసేవాళ్లందరూ రచయితలు కారు. వచ్చిన ప్రతిదీ పుస్తకం కాదు. దాన్ని వేరు చేసుకోగలగడమే పాఠకుల విజ్ఞత.

(సాక్షి ఎడిట్‌: 22 ఆగస్ట్‌ 2022)



Saturday, August 6, 2022

వ్యక్తి విషాదం


వ్యక్తి విషాదం


యుద్ధాన్ని నేను ద్వేషిస్తాను, అన్ని రూపాల్లోని యుద్ధాన్నీ నేను ద్వేషిస్తాను, అంటాడు ఆర్చెమ్‌ చపేయే. ఈ ఉక్రెయినియన్‌ రచయిత తనను తాను ‘పసిఫిస్ట్‌’ అని చెప్పుకొంటాడు. శాంతికాముకుడు అని ఈ మాటకు విస్తృతార్థం. యుద్ధం, హింస ఏ కోశానా సమర్థనీయం కావు అనేది ఇలాంటివాళ్ల భావన. పాపులర్‌ ఫిక్షన్, క్రియేటివ్‌ నాన్‌ఫిక్షన్‌ రచనలతో ఆర్చెమ్‌ ఉక్రెయిన్‌లో మంచి ఆదరణ ఉన్న రచయిత. నాలుగుసార్లు ‘బీబీసీ ఉక్రెయిన్‌ బుక్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డుకు ఫైనలిస్టు. ఫొటోగ్రఫీ, విజువల్‌ స్టోరీటెల్లింగ్‌ మీద కూడా ఈమధ్యే మక్కువ పెంచుకున్నాడు. ఈమధ్యే అంటే ఉక్రెయిన్‌ మీద రష్యా దాడికి దిగకముందు. రాజధాని నగరం కీవ్‌ మీద బాంబుల మోత మొదలుకాగానే ఆయన చేసిన మొదటి పని, ముందు తన కుటుంబాన్ని అక్కడినుంచి సురక్షిత చోటుకు తరలించడం. రెండోది, యుద్ధంలో చేరడానికి తన పేరును నమోదు చేసుకోవడం. యుద్ధం మీద ఆర్చెమ్‌ అభిప్రాయాలు ఏమీ మారలేదు. కానీ అణిచివేత తనమీద మోపిన యుద్ధం కాబట్టి దీన్నుంచి పారిపోలేనంటాడు.
ఓలెహ్‌ సెన్‌త్సోవ్‌– రచయిత, దర్శకుడు. ‘క్రిమియా’ ఆయన స్వస్థలం.  ఉక్రెయిన్‌లో భాగంగా ఉన్న క్రిమియాను రష్యా తన అనుబంధంగా మార్చుకున్నప్పుడు చేసిన నిరసనలకుగానూ తీవ్రవాద ఆరోపణల మీద అరెస్టయ్యాడు. ఐదేళ్లు జైల్లో ఉన్నాడు. (బలవంతపు సప్లిమెంట్స్, మెడికేషన్‌ కలుపుకొని) 145 రోజుల పాటు చేసిన నిరవధిక నిరశనకుగానూ దాదాపు చావుదాకా వెళ్లొచ్చాడు. 2019లో నేరస్థుల బదిలీ ఒప్పందం మీద ఉక్రెయిన్‌కు వచ్చాక దాడి నేపథ్యంలో ‘ద సెకండ్‌ వన్స్‌ ఆల్సో వర్త్‌ బైయింగ్‌’ అనే వ్యంగ్య నవల రాశాడు. ఉక్రెయిన్‌లో 1990ల నాటి నేరస్థుల గ్యాంగుల నేపథ్యంలో సాగే ‘రైనో’ సినిమా 2020లో విడుదలైంది. దానికి సానుకూల సమీక్షలు వచ్చాయి. అయితే, మళ్లీ యుద్ధం మొదలుకాగానే ప్రాదేశిక భద్రతా దళంలో చేరిపోయాడు. ఇంకా ఈ జాబితాలో స్తానిస్లావ్‌ అసెయేవ్, క్రిస్టియా వెంగ్రీనియుక్‌ లాంటి ఉక్రెయిన్‌ రచయితలూ ఉన్నారు.
అమెరికా రచయితలు ఎర్నెస్ట్‌ హెమింగ్వే, ఇ.ఇ.కమ్మింగ్స్, టి.ఇ.లారెన్స్, జె.ఆర్‌.ఆర్‌.టోల్కీన్‌ లాంటివాళ్లు మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. జె.డి.శాలింజర్‌ రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు. జార్జ్‌ ఆర్వెల్‌ స్పానిష్‌ సివిల్‌ వార్‌లో పాల్గొని గాయపడ్డాడు. తెలుగు కవి, కథకుడు శిష్టా›్ల ఉమామహేశ్వరరావు; మరో రచయిత అంగర వెంకట కృష్ణారావు కూడా యుద్ధ అనుభవం ఉన్నవారే. అసలు కవిగానో, రచయితగానో ఉండటమే దానికదే ఒక యుద్ధం కదా!
ఈ రచయితలు మనకు గుర్తున్నది వాళ్లు పట్టుకున్న ఆయుధం వల్ల కాదు, వారి రచనల వల్ల. కాకపోతే అది వారికి ఒక అనుభవంగా పనికివచ్చింది. కానీ ఆ ‘అనివార్యత’ ఎంత దుర్మార్గమైనది? రాసుకోగలిగేవాడు రాసుకునే, ఆనందంగా నర్తించే అమ్మాయి నర్తిస్తూ ఉండగలిగే ప్రపంచాన్ని కోరుకోవడం మరీ అంత పెద్ద కోరికా? లేక, ఇంకో తలంలో వీటన్నింటికీ కారణం అవుతున్న ‘ఇంకో’ మనిషి బుద్ధి అంత చిన్నదా?
యుద్ధం అనేది ఏ ఒక్క రూపంలోనో ఉండదని అందరికీ తెలుసు. నేరుగా సరిహద్దు యుద్ధాలు చేయకపోయినా, భిన్నరకాల యుద్ధాల్లో ఎందరు తెలుగు కవులు పాల్గొనలేదు! భావజాల పోరాటాలు మాత్రం యుద్ధం కాదా? సమస్య ఏమిటంటే– ఈ యుద్ధాలు గీతకు అటువైపు ఉన్నావా, ఇటువైపు ఉన్నావా అని తేల్చుకునే విపత్కర పరిస్థితిలోకి మనిషిని నెడతాయి. దీనికి స్పందించడం తప్ప ఇంకో మార్గం ఉండదు. అప్పుడు సమూహంగా మాట్లాడటం తప్ప వ్యక్తికి విడిగా చోటుండదు. వ్యక్తి అనేవాడు లేకుండాపోవడం కంటే బౌద్ధిక విషాదం ఏముంటుంది?
అవసరాన్ని బట్టి మనిషి వ్యక్తిగానూ, సమూహంగానూ ఉంటాడు. కానీ సరిగ్గా అదే సందర్భంలో గీతకు అటువైపు ఉన్నవాడు కేవలం విడి మనిషిగానే ఉండదలిస్తే! నేటికి సత్యాలుగా కనబడివి, రేపటికి మబ్బుల్లా కదిలిపోవని ఎవరూ చెప్పలేరు. కానీ యుద్ధాలు, భావజాలాల్లో వర్తమానపు కెలేటరల్‌ డామేజ్‌ అనబడే అనివార్య నష్టం లెక్కలోకి రాదు. వీళ్ల వల్ల గాయపడ్డ ఆ ‘ఎదుటి’ మనిషి ఎవరో వీరికి ఎప్పటికీ సంపూర్ణంగా తెలియకపోవచ్చు. నిరసనకారుల గుంపును చెదరగొట్టడానికి పోలీసులు చేసే లాఠీఛార్జీలో రెండు దెబ్బలు తినేవాడి నొప్పి ఎవరికీ పట్టదు. ఏ కోర్టులూ, ఏ ప్రజాసమూహాలూ దీనికి న్యాయం చేయలేవు. కానీ ఒక్కడు మాత్రం తన జీవితకాలం ఆ రెండు దెబ్బల బరువును మోయాల్సి వస్తుంది. ఆ చివరి మనిషి గాయానికి కూడా లేపనం పూయనంతవరకూ, అసలు ఆ మనిషికి గాయం కాని పరిస్థితులు వచ్చేంతవరకూ మనది నాగరిక సమాజం కాబోదు.
వేపచెట్టు మీద వాలి కూసేది ఒక కాకి కాదు. అది ‘ఫలానా’ కాకి మాత్రమే అవుతుంది. దాని కూతకు స్పందనగా వచ్చి జతకూడది కూడా ఇంకో కేవలం కాకి కాదు. అది మరో ఫలానా కాకి అవుతుంది. రెండూ వేర్వేరు కాకులు, ఇద్దరు వేర్వేరు సంపూర్ణ మనుషుల్లా. అవి వాలిన వేపచెట్టుకు కూడా మనం పేరు పెట్టివుండకపోవచ్చుగానీ అది కూడా దానికదే ప్రత్యేక యూనిట్‌. దానికదే యూనిక్‌. దాన్ని పోలిన చెట్టు, దానిలాగా కొమ్మలను విరుచుకున్న చెట్టు ఇంకోటి ఎక్కడా ఉండదు. మన ఇంట్లో మన కాళ్లకు తగిలే పిల్లిలాంటిది ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు. కానీ మనుషులే కేవలం సమూహ అస్తిత్వాలకు పరిమితమయ్యే పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నప్పుడు, ఇంక పక్షులు, జంతువులు, చెట్లూ చేమలను కూడా విడిగా గుర్తించాలంటే మనిషి ఎంత సున్నితం కావాలి! ఎంత సూక్ష్మం కావాలి!

(1st August, 2022)

Friday, July 29, 2022

WANT TO GO


Our Film, Vellipovaali (WANT TO GO) is available with English Subtitles now.


WANT TO GO


‘వెళ్లిపోవాలి’కి సబ్‌టైటిల్స్‌ చేయడం అయ్యాక, సినిమా ఎలాంటి భావం కలిగిస్తుందా అని మ్యూట్‌లో పెట్టుకుని చూశాను. కొన్నిసార్లు మేము మరీ ఇంత లోతుగా మాట్లాడేశామా అనిపించింది. తెలుగులో మామూలు మాటలు కూడా ఆంగ్లంలో గంభీరంగా ధ్వనిస్తాయి. కొన్నిసార్లు సరదాగా ఉంది. కొన్నిసార్లు కండపోయిన ఎముకలా కూడా ఉంది. ఆ మాటల వేగానికి ఆ రాజీ తప్పదేమో. కానీ ఓ పది పన్నెండేళ్లుగా సబ్‌ టైటిల్స్‌ ఉన్నవే ఎక్కువ చూడటం అలవాటయ్యాక, మా సినిమాకు కూడా ఇవి పడటం ఆ చిట్టచివరి అలంకరణేదో పూర్తయినట్టుగా అనిపించింది. సబ్‌ టైటిల్స్‌ చేసిన మిత్రులందరూ ఎంత దగ్గరగా మా మాటలను తీసుకునివుంటారా అని తలుచుకుని సంతోషం కలిగింది.

మాటల్లో అంతగా తెలియదుగానీ నిశ్శబ్దంగా చూస్తే– టాల్‌స్టాయ్‌ కనబడ్డాడు. రష్యన్‌  అనువాద ప్రస్తావన వచ్చింది. ఫుకుఓకా వస్తాడు. లారీ బేకర్‌ వస్తాడు. నొరోవ్‌బాంజాద్‌ కనబడుతుంది. టాగూర్‌ ఉన్నాడు. రమణ మహర్షి ఉన్నాడు. ఇంక చలంను ఇంతగా తలుచుకున్నామా అనిపించింది. ఇప్పుడు ఇది పాన్‌ ఇండియా ఏం ఖర్మ, రియల్‌ వరల్డ్‌ సినిమా అయిపోయింది.

  

 

Wednesday, July 27, 2022

లేడీ కండక్టర్ల బస్సుల్లో ఒక రోజు



అదే పదివేలు
–––––––––

ఎఫ్బీలో పెట్టే పోస్టులు పెడుతూనే, ఇందులో ఎంతో కొంత మళ్లీ చదువుకునేట్టుగా ఉండేవాటిని బ్లాగులో కూడా పోస్టు చేస్తున్నాను. బ్లాగులోనైతే పద్ధతిగా వెతుక్కోవచ్చు. ఏదో లోకార్పణం చేసినట్టుగా పెడుతున్నాం గానీ, వీటిని ఎవరైనా చదువుతున్నారా అనే అనుమానం ఒకటి ఉంటుందిగా; ‘స్టాట్స్‌’లోకి వెళ్లి చూస్తే అత్యధికం అటూయిటూగా వంద దగ్గర ఊయలూగుతుంటాయి. ఏవో కొన్ని రెండు, మూడు వందల్లోకి పోతాయి. అరుదుగా నాలుగు, ఐదు, ఎనిమిది వందల దాకా పోయినవి కూడా ఉన్నాయి. అసలు ఈ పోస్టు రాయడానికి, ఈ లెక్కల వల్ల ఒకింత కంగారు పడటం కారణం. ఒకదానికి ‘9.8కె’ అని చూపించింది. ఇది నేను పెట్టిన పోస్టేనా, నా బ్లాగు ఏమైనా హాక్‌ అయిందా అని అనుమానం వచ్చింది. మళ్లీ మళ్లీ మార్చి చూస్తే, అది నిజమే. ఆ పోస్టు ఏమిటంటే, ‘లేడీ కండక్టర్ల బస్సుల్లో ఒకరోజు’. ఇది పెట్టినట్టే మర్చిపోయాను. ఎందుకంటే, 2011–13 ప్రాంతంలో రియాలిటీ చెక్‌ సీరీస్‌ రాశాక, 2013 డిసెంబరులో వాటిని గంపగుత్తగా బ్లాగులో గుమ్మరించేశాను. ఆ వెంటనే పుస్తకం రావడంతో వాటన్నింటినీ ‘డ్రాఫ్టు’లుగా మార్చేశాను. అందువల్ల అవి ఉన్న విషయం కూడా గుర్తులేదు. 

అయితే ఇప్పుడేంటి? పదివేల మంది చదవడం గొప్పా? ఏమో, ఒక వెబ్‌ మ్యాగజీన్‌ ఎడిటర్‌ ఓసారి నాతో అన్నాడు. బాగా చదివిందీ అనుకున్నదానికి వెయ్యి, రెండు వేల వ్యూస్‌ వస్తాయి; కాబట్టి, ఎక్కువమందికి రీచ్‌ కావడమే మన టార్గెట్‌ అయితే గనక, అది ఎంత తక్కువ సర్క్యులేషన్‌ ఉన్నదైనా సరే, ప్రింటే బెస్ట్‌ ఆప్షన్‌. అదింకా వెబ్‌ మ్యాగజీన్ల గురించి కదా చెప్పింది. కనీసం నలుగురి నోళ్లల్లో నానుతూ ఉంటాయవి. అట్లాంటిది ఒక ఇండిపెండెంట్‌ బ్లాగులో ఒక పోస్టును పదివేల మంది చదవడం ఒకింత కంగారు పెట్టింది. రీచ్‌ అవడానికి ఇంత పొటెన్షియల్‌ ఉందా అని సంతోషం కూడా వేసింది. ఈ శుభ సందర్భంగా ఆ డ్రాఫ్టును రీ–పోస్ట్‌ చేస్తున్నా. 

(ఎఫ్బీ కోసం రాద్దామని మొదలుపెట్టింది, బ్లాగు కోసం రాసినట్టుగా ముగిసింది.)
 
 

 

Tuesday, July 26, 2022

ఇరానీ హోటల్లో రెండున్నర గంటలు

 

 రియాలిటీ చెక్ పేరిట 2011 డిసెంబరు 4, ఫన్డే కోసం రాసిన మొదటి పీస్‌.
 

Saturday, July 16, 2022

పీటర్‌ బ్రూక్‌: విశ్వ భారతం

 


విశ్వ భారతం


తపోదీక్షలో ఉన్న వ్యాసుడికి ఉన్నట్టుండి సృజన ఉప్పొంగుతుంది. మానవజాతి చరిత్రను కావ్యరూపంలో రాయ సంకల్పించి, తనకు లేఖకుడిగా కౌమార బాలుడైన పరీక్షిత్తును ఉండమంటాడు. పరీక్షిత్తుకు తన పూర్వీకులను అతి దగ్గరగా పరిచయం చేయడం వ్యాసుడి ప్రాథమికోద్దేశం. మనుషుల అతి సంక్లిష్టమైన స్వభావాలను చిత్రించడం ద్వారా మానవజాతికి తమ ఉనికి పట్ల ఒక జాగరూకతను కలిగించడం పరమ లక్ష్యం. ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధం తర్వాత జరిగింది సర్వనాశనమే. ఇంతటి మహోన్నత కార్యం కాబట్టే, సాక్షాత్తూ దేవుడే(గణేశుడు) స్వయంగా వ్యాసుడికి లేఖకుడిగా కుదురుకుంటాడు. ఇటీవల మరణించిన రంగస్థల దిగ్గజం పీటర్‌ బ్రూక్‌ దర్శకత్వం వహించిన ‘ద మహాభారత’, తానూ ఒక పాత్రగా ఉన్న భారతాన్ని వ్యాసుడు రాయడానికి పూనుకోవడంతో ప్రారంభమవుతుంది. 

మనకు మహాభారతం కొత్తది కాదు. మన సారస్వతం మహాభారతంతో ప్రభవించింది. మన రంగస్థలం మహాభారతంతో సంపన్నమైంది. మన చిత్రసీమ మహాభారతంతో పదునెక్కింది. ‘తత్వజ్ఞులు ధర్మశాస్త్రంగా, ఆధ్యాత్మవిదులు వేదాంతంగా, నీతివిచక్షణులు నీతిశాస్త్రంగా, కవులు మహాకావ్యంగా, లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహంగా, పౌరాణికులు బహుపురాణ సముచ్ఛయంగా’ గౌరవించే ఇతిహాసం ఇది. ‘ఇందులో ఉన్నదే ప్రపంచంలో ఉన్నది. ఇందులో లేనిదేదీ ప్రపంచంలో లేదు.’ అందుకే బయట తలెత్తిన సమస్యకు మహాభారతంలో సమాధానం వెతకడానికి ప్రయత్నించాడు ఇంగ్లండ్‌కు చెందిన ‘పద్మశ్రీ’ పీటర్‌ బ్రూక్‌(1925–2022).

వియత్నాంతో అమెరికా యుద్ధం జరిగిన తర్వాతి విధ్వంసం బ్రూక్‌కు మహాభారతం మీద ఆసక్తిని కలిగించింది. ప్రతి పాత్రా రక్తమాంసాలతో, తనవైన బలహీనతలతో ఉండి, యుద్ధ బీభత్సాన్ని అనివార్యం చేస్తుంది. ప్రతి మనిషీ సృష్టి విధ్వంసంలో ఏదో ఒక మేరకు పాత్రను పోషిస్తూనే ఉంటాడు; అందుకే అందరూ ఈ ప్రపంచానికి ఉమ్మడిగా బాధ్యులేనని పీటర్‌కు నమ్మకం కలిగింది. దాన్నే విశ్వ యవనిక మీద ఎలుగెత్తి చాటాడు.

క్లాసిక్స్‌ను స్టేజీ మీదకు తేవడంలో రంగస్థలానికి ప్రమాణాలు నెలకొల్పిన పీటర్‌ బ్రూక్‌ ‘అవర్‌ గ్రేటెస్ట్‌ లివింగ్‌ థియేటర్‌ డైరెక్టర్‌’ అనిపించుకున్నాడు. భారతం కోసం ఫ్రెంచ్‌ రచయితలైన జాన్‌ క్లాడ్‌ కారియేరీ, మేరీ హెలెనా ఏస్తియన్‌తో జట్టు కట్టాడు. ఎనిమిదేళ్ల శ్రమ తర్వాత పన్నెండు గంటల నాటకంగా భారతం రూపొందింది. 1985లో తొలి ప్రదర్శన జరిగింది. పదహారు దేశాలకు చెందిన నటీనటులతో నాలుగేళ్లపాటు వీరి బృందం అమెరికా నుంచి ఆఫ్రికా గ్రామాల వరకూ పర్యటించింది. ముంబయి నగరానికీ వచ్చింది. తెలుపు, నలుపు, గోధుమ వర్ణాల నటులతో ఇది నిజంగానే ప్రపంచ నాటకంగా మారిపోయింది. ‘లార్డ్‌ ఆఫ్‌ ద ఫ్లైస్‌’ లాంటి సినిమాతో సినీ దర్శకుడిగానూ ప్రసిద్ధుడైన బ్రూక్‌ తన నాటకం ఆధారంగానే 1989లో ఐదున్నర గంటల టెలివిజన్‌ సిరీస్‌గా ‘ద మహాభారత’ రూపొందించారు. ఆయన్ని అంచనా కట్టడానికి మనకు ఇప్పుడున్న సోర్సు ఇదే! ‘మ..హా..భా..ర..త్‌..’ అంటూ దూరదర్శన్‌ ద్వారా 94 వారాల ధారావాహికను ఇంటింటికీ పరిచయం చేసిన బీఆర్‌ చోప్రాకు ముందు, లేదా సమాంతరంగా బ్రూక్‌ అనుసృజన మొదలైంది.

మొదటి సీన్‌ నుంచే మనకు అలవాటైన భారతాన్ని చూడటం లేదని అర్థమైపోతుంది. ఒక్క ద్రౌపది(మల్లికా సారాభాయి) తప్ప ఎవరూ భారతీయులు కాదు. సెట్టింగులు తక్కువ, ఆభరణాలు అత్యల్పం, కిరీటాలు లేవు, పరిచారికలు కనబడరు, జయజయ ధ్వానాలు శూన్యం, రాజకుమారులందరూ షేర్‌వానీలు తొడుక్కుంటారు. మహామహా యోధులు బారులు తీరిన చివరి యుద్ధ ప్రారంభ సూచికగా అర్జునుడు శంఖం ఊదినప్పుడు కనబడేది మహా అయితే రెండు తెల్ల గుర్రాలు మాత్రమే. ఒక భారీ విజువల్‌ ఫీస్ట్‌ దీన్నుంచి ఆశించలేం. కానీ పీటర్‌ బ్రూక్‌ గొప్పతనం ఎక్కడంటే, అవేవీ లేకుండానే ఆ ఉద్వేగాన్ని పలికించగలగడం. రంగస్థలం మీద ఒక ఖాళీ స్థలంలో నువ్వొక విశ్వాన్ని చూపగలవు; నటుడి చేతిలోని ఒక కర్ర, ఒక సీసా, లేదా ఖాళీ మద్య పాత్రతో ఎంతో చేయొచ్చునంటాడు బ్రూక్‌. ఆ స్ఫూర్తి ఇందులోనూ కనబడుతుంది. కథను వర్తమానంలో చూపడం కంటే జరిగిపోయినదాన్ని వ్యాసుడు నెరేటర్‌గా చెబుతుండటం వల్ల ఇందులో ఉన్నదేదీ ఇక లోపంగా కనబడదు.

కృష్ణుడు నీలవర్ణంలో ఉండకపోవడం, భీష్ముడంతటివాడిని కూడా మనవలు పేరు పెట్టి పిలవడం భారతీయ పద్ధతికి దూరం. గన్నేశా, సత్యవత్తి లాంటి ఉచ్ఛారణలు భారతీయేతరుల పరిమితి. వీటికంటే కూడా భారత వారసత్వాన్ని దొంగిలిస్తున్నాడని పీటర్‌ నిందలు ఎదుర్కొన్నాడు. అయితే, భారతం ప్రపంచానికి చెందినదని తన ప్రయత్నాన్ని సమర్థించుకున్నాడు.

మడుగులో నీళ్లు తాగడానికి అనుమతి ఇచ్చేముందు యక్షుడు అడిగే ప్రశ్న: ‘ఈ ప్రపంచానికి కారణం ఏమిటి?’ దానికి ధర్మరాజు సమాధానం: ‘ప్రేమ!’ ఇదే సర్వకాలావసరం. సాహిత్య ఆదాన ప్రదానాలకు కారణమయ్యే, అన్ని ప్రాంతాల వైవిధ్యమైన కథనాలను ప్రపంచం వినగలిగేట్టు చేసే సాంస్కృతిక దూతలు ఎప్పుడూ అవసరమే. మనుషులను అర్థం చేసుకోవడం ద్వారానే మనుషులు మారగలరు. 

(11-7-2022)

 

Sunday, June 26, 2022

గూడూరి సీతారాం కథా పురస్కార స్వీకరణ ప్రసంగం


నలిమెల భాస్కర్, ఆకునూరి శంకరయ్య, గూడూరి వేణు, జూలూరి గౌరీశంకర్, పూడూరి రాజిరెడ్డి, జుకంటి జగన్నాథం, గూడూరి రాఘవేంద్ర, గూడూరి ప్రవీణ్, పత్తిపాక మోహన్, ఎలగొండ రవి





 

గూడూరి సీతారాం కథా పురస్కార స్వీకరణ ప్రసంగం

సినారె విజ్ఞాన మందిరం, సిరిసిల్ల

ఉదయం 10:00; 19 జూన్‌ 2022

---------------------------------------------

ఇలా ఈ పురస్కారం తీసుకుంటున్నానని ఫేస్‌బుక్‌లో పెడితే, కొందరు మిత్రులు గూడూరి–పూడూరి మధ్య ఉన్న రైమింగ్‌ను ప్రస్తావించారు. నాకు తెలియకుండానే ఎప్పుడో గూడూరితో నా పేరు ముడిపడిపోయినట్టుగా ఉంది.

మామూలుగా ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటుంటారు కదా. సాహిత్యం అనేది గెలుపు ఓటములకు సంబంధం ఉన్నది కాదు. కానీ నన్ను నిజంగా ఎంతోకొంత సీరియస్‌గా చదివే ఎక్కువమంది ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నారనిపిస్తుంది. ఈ మాట అంటే మేము లేమా అని నామీద అభిమానంతో కోపానికి వచ్చే తెలంగాణవాళ్లు కూడా ఉన్నారని నాకు తెలుసు. కానీ నేను చెప్పేది, ఆ సంఖ్యతో పోల్చినప్పుడు. అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుండె... ఇక్కడ నన్ను నిజంగా చదువుతున్నారా, నిజంగా సాహిత్యం అనేదాన్ని అర్థం చేసుకునే పాఠకులున్నారా... వీళ్లకు అలవాటైన మూసలు దాటితే వీళ్లకు అర్థమైతదా... కానీ ఈ పురస్కారం వల్ల ఇక్కడ కూడా నన్ను చదువుతున్నారు, పట్టించుకుంటున్నారు అన్న చిన్న ఫీలింగ్‌ వచ్చింది. ఒక విధంగా ఇంట కూడా గెలిచిన ఫీలింగ్‌ వచ్చింది.

ఇంకోటి ఏంటంటే– నేను ఆరో తరగతి నుంచి ఊరికి దూరంగానే ఉంటున్నా. మేడ్చల్, కీసరగుట్ట, పటాన్‌చెరు, హైదరాబాద్‌... చదువు, ఉద్యోగం... ఏం చేసినా ఆల్మోస్ట్‌ ముప్పై ఏళ్లుగా నేను హైదరాబాద్‌లోనో, హైదరాబాద్‌తో సంబంధంలోనో ఉంటున్నా. దసరాకూ, సంక్రాంతికీ ఏదో పండుగకు ఊరికి వచ్చినట్టే అయిపోయింది. ఈ ఒకట్రెండేళ్ల నుంచే కొంచెం ఊరికి ఎక్కువ వచ్చిపోతున్నా, ఎక్కువ ఉంటున్నా కూడా. కరోనా వల్ల జరిగిన మంచి విషయాల్లో అదొకటి. నలభై ఐదు రోజులు వరుసగా, రెండు దఫాల్లో ఉండగలిగిన. ఎప్పుడు ఇట్ల వీలు గాలె. ఉరుకుడు, ఉరుకుడు... మూడ్రోజులు సెలవు పెట్టుకునుడు, ఆదివారం కలిసి వచ్చేటట్టు చూసుకునుడు... వచ్చుడు, పోవుడు ఇదే కథ... కానీ నేను ఎక్కడినుంచన్నా రానీ... ఈ సిద్దిపేట, సిరిసిల్ల మోపుకు రాంగనే... ఆ వాతావరణమే మారిపోతది. మన మనుషుల్ల పడ్డం అనిపిస్తది. వాళ్ల ఎవ్వరితోటి మనకు పరిచయం ఉండది. మనం పోయి మాట్లాడకపోవచ్చు. కానీ మనోళ్లు అని అనిపిస్తది. మన భూమితో, మన ప్రాంతంతో, మన ఊరితో ఉండే సంబంధం అది. ఏదో ఒక గుండె నిండినట్టు. అట్ల ఈ అవార్డు మన మనుషుల్ల తీసుకునుడు ఇంకొంచెం సంబురం.

సీతారాం గారిది హన్మాజీపేట అని తెలిసి అది ఇంకా పెరిగింది. ఇగ అది మన ఊళ్లే, మన ఇంట్ల తీసుకున్నట్టే.

నా బాధ్యత పెరిగింది, నేనేదో సమాజానికి ఏదో చేశాను ఇట్లాంటి మాటలేమీ చెప్పను. నా వరకు పురస్కారం అంటే ఏమిటంటే, అది ప్రశంసకు ఒక భౌతికరూపం ఇవ్వడం. మీరు రాసింది బాగుంది అంటే ఎట్లాంటి సంతోషం అనిపిస్తదో, అట్లాంటిదే ఇది కూడా.

అయితే అవార్డుల మీద నేను మరీ ఎక్కువేమీ ఆలోచించలేదుగానీ ఇవి తీసుకోవడం అనేది లేని బరువును మీద పెట్టుకున్నట్టు అవుతుందా? తెలియకుండానే దేనికో కమిట్‌ చేసుకోవడం లాంటిది అవుతుందా? అని కొంత సంశయించాను. మళ్లీ ఈ స్మారక అవార్డులు అంటే– వాళ్లు ఏ ఆదర్శానికో, ఏ భావజాలానికో నిలబడి ఉంటారు. నేను అట్లాంటి ప్రకటిత భావజాలాల్లోకి రాను. మన ధోరణికీ, వాళ్ల దానికీ మధ్య వైరుధ్యం ఉంటే ఇదొక ప్రశ్నను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవన్నీ నాకు అవసరమా అనుకున్నాను. అందుకే ఇట్లా పురస్కారం అని నాకు మొదటిసారి ఫోన్‌ చేసినప్పుడు– నా పేరు మీ దృష్టికి రావడం సంతోషమేగానీ వద్దులేవే అనే చెప్పాను. ఒక రెండు, మూడు వారాలకు మళ్లీ చేశారు. నాకు రకరకాల బలహీనతలు ఉన్నాయిగానీ ఈ పురస్కారాల లౌల్యం అయితే లేదనే అనుకుంటాను. కానీ రెండోసారి చేసినప్పుడు– నిరాకరించలేని మొహమాటం ఒకటి, రెండోది మర్యాద కూడా కాదనిపించింది. అందుకే ఇప్పుడు ఇలా మీ ముందున్నాను.

మనం ఒకరి పేరు మీద అవార్డు తీసుకుంటున్నప్పుడు వాళ్లు ఏమిటి అని తలుచుకోవడం ఒక సాహిత్య మర్యాద. నేను గూడూరి సీతారాం గారి కథలు మరీ ఎక్కువ చదవలేదు. అవైనా మనకంటే ముందుతరంలో రాసినవాళ్లు ఏం రాసివుంటారు అనే చిన్నపాటి కుతూహలంతో చదివినవే. అందుకే నేను చదివినవాటితో ఆయన నిజమైన ప్రతిభను అంచనా కట్టవచ్చా అన్నది చెప్పలేను. కానీ చదివినమేరకు కథకు ఉండే నిజమైన పొటెన్షియల్‌ను, విస్తృతిని ఆయన అందుకోలేదేమో అనిపించింది. కానీ ఆయన రాసిన కథలు చూస్తే– నారిగాని బతుకు, మారాజు ఇట్లాంటివి– 1954, 1957 ఇట్లా ఉన్నాయి అవి అచ్చయిన సంవత్సరాలు. 1936లో జన్మించారనుకుంటే– ఆయన ఎర్లీ ట్వెంటీస్‌లో, పచ్చి యువకుడిగా రాసిన కథలు. అంత చిన్న వయసులో ఆయన సాహిత్య రంగం మీదకు రావడం ఒక విశేషం... 

ఇంకా ముఖ్యంగా, ఇప్పుడు తెలంగాణ భాష కూడా ఒక కమర్షియల్‌ ఎలిమెంట్‌ స్థాయిని అందుకోవడం వల్ల ప్రధాన స్రవంతి టీవీ ఛానళ్లలో కూడా యధేచ్ఛగా మాట్లాడే పరిస్థితి వచ్చిందిగానీ... ఆ 1950, 60ల కాలంలో, అలాంటివి అచ్చుకు నోచుకోవడం చాలా కష్టమైన రోజుల్లో ఆయన తెలంగాణ మాండలికంలో రాయడం గొప్ప విషయం. బహుశా సీతారాం గారిని సాహిత్య లోకం తలుచుకుంటున్నది ఆయన కథల కంటే కూడా ఆయన భాష కోసం అనుకుంటున్నాను. ఈ అవార్డు పెట్టిన ఉద్దేశం కూడా తెలంగాణ భాషలో రాస్తున్నవాళ్లకు ఇవ్వడానికే.

అయితే భాష మీద నా వైఖరి కూడా చెప్తాను. రాతపూర్వక భాషకూ, మాట్లాడే భాషకూ కొంత తేడా ఉంటుందనీ, ఉండాలనీ అనుకుంటాను. అంటే, భాష కోసం భాష అని మరీ తెచ్చిపెట్టి కృతకం చేయను. కానీ తెలంగాణ ఫ్లేవర్‌ నా రైటింగులో చాలానే ఉంటుందనుకుంటాను. ఇంక స్పోకెన్‌ సందర్భాలు వచ్చినప్పుడు– రియాలిటీ చెక్‌ పుస్తకంలో చాలాచోట్ల... ఆజన్మం పుస్తకంలో కొన్ని చోట్ల... చింతకింది మల్లయ్య ముచ్చట, కాశెపుల్ల, చినుకు రాలినది, రెండో భాగం, గంగరాజం బిడ్డ, కొండ లాంటి కథల్లో సందర్భాన్ని బట్టి జీవితానికి చాలా దగ్గరగా ఉండే భాషను వాడగలిగానని అనుకుంటాను. అదొక్కటే నేను ఈ పురస్కారం అందుకోవడానికి అర్హత అనుకోగలిగేది.

గూడూరి సీతారాం పేరిట ఒక పురస్కారాన్ని ఏర్పాటుచేయడమూ, దాన్ని మొదటగా నాకే ఇవ్వడమూ చాలా సంతోషంగా ఉంది. ఇది ఫార్మాలిటీ మాటగా చెప్పేదే కావొచ్చు. కానీ ఆ ‘మొదటి’ అనే మాట సంతోషాన్ని రెట్టింపు కూడా చేస్తోంది. దీన్ని ఏర్పాటుచేసిన సీతారాం గారి సంతానం గూడూరి వేణు గారికీ, సీతారాం తమ్ముడు రాఘవేంద్ర గారికీ, నాకు ఈ పురస్కారం ఇవ్వడానికి చొరవ చూపిన పత్తిపాక మోహన్, జూకంటి జగన్నాథం గార్లకూ ధన్యవాదాలు. ఇంకా ఈ వేడుకలో భాగమైన జూలూరు గౌరీశంకర్‌ గారికీ, ఆకునూరి శంకరయ్య గారికీ, గూడూరి ప్రవీణ్‌ గారికీ, గరిపెల్లి అశోక్‌ గారికీ... నిర్వహణలో భాగం పంచుకున్న మానేరు రచయితల సంఘం కవులు ఎలగొండ రవి, జిందం అశోక్, గోనె బాల్‌రెడ్డి, ఆడెపు లక్ష్మణ్, బూర దేవానందం గార్లకూ ధన్యవాదాలు. ఇంకా దీన్ని ముఖ్యమైన ఈవెంట్‌గా తలచి వచ్చిన ‘మీ అందరికీ’ కూడా!


(ఫొటోలు పంపిన నాగేంద్ర శర్మ గారికి కృతజ్ఞతలు.)



Friday, June 24, 2022

జీవన సంగీతం

 జీవన సంగీతం


ఒకప్పుడు ఏ ఊరికైనా వెళ్తే, ఆ ఊరు దానికదే ముచ్చటగా కనబడేది. ఆ ఇళ్ల నిర్మాణం, వాటి వాకిళ్లు, వాటి ముందరి చెట్లు, అవి పాకలే అయినా సరే భిన్నంగా ఉండేవి. కలిమీ లేమిల సమస్య కాదిది. ఈ భూప్రపంచంలో ఆ ఊరిని పోలిన ఊరు ఇంకోటి ఉండకపోయేది. అది దానికదే యూనిక్, స్పెషల్‌. ఇప్పుడు ఏ ఊరిని చూసినా అవే సిమెంటు పౌడరు అద్దుకున్న ముఖాల్లా ఉంటాయి. అంతవరకూ పోనీ అనుకుంటే, ఏ ఊరిలోనైనా ఒకేరకం బ్యానర్లు తగులుతాయి. మనం ఇంకో ఊరికి పోయామన్న అనుభూతే దొరకదు. పోనీ మనుషులను అయినా పలకరిద్దామా అంటే, వాళ్లందరూ ఒకే విషయాలు మాట్లాడుతుంటారు. మనం మన ఊరిలో మాట్లాడే విషయాలే ఆ పక్క ఊరిలో కూడా మాట్లాడుతుంటే వినడం ఎంత విసుగు! ఈ ‘ఒకే రకం’ అనేదే ఇప్పుడు పెద్ద సమస్య. ఏదీ ప్రత్యేకంగా ఉండదు, ఎందులోనూ జీవం తొణికిసలాడదు.

నాస్టాల్జియాను కలవరించడంలో అంత దోషమేమీ లేదు. అది మన విలువైన గతం. ప్రపంచంలో ఇలాంటి మనిషి ఒక్కడే ఉన్నాడు అని నమ్మకం కలిగించేట్టుగా ఎవరూ ఉండటం లేదు. అతనూ అదే పాపులర్‌ సినిమా గురించో, అవే రాజకీయాల గురించో మాట్లాడతాడు. కారణం ఏమంటే, అందరమూ ఒకే రకమైన సమాచారాన్ని డంప్‌ చేసుకుంటున్నాం. కెరియర్‌ వరకూ ఏమోగానీ, కరెంట్‌ ఎఫైర్స్‌లో మాత్రమే జీవితం లేదు. సమాచారం రోజురోజుకూ దొర్లిపోయేది. అందులో జీవిత కాలానికి స్వీకరించగలిగే బరువు ఉండదు. కానీ ప్రపంచమంతా అనుసంధానమయ్యాక అందరూ చూస్తున్నది ఒకటే, అందరూ చదువుతున్నది ఒకటే. వేరు చూపు లేదు, వేరు ఆలోచన లేదు, వేరుగా దర్శిస్తున్నది లేదు, మొత్తంగా ఒరిజినాలిటీ అనేది లేకుండా పోయింది. అసలు అనుభవాలే భిన్నంగా ఉండకపోయాక ఇంక ఒరిజినాలిటీ ఎక్కడినుంచి వస్తుంది?

కానీ ప్రకృతి మనిషినే కాదు, జీవరాశినే అలా పుట్టించలేదు. ప్రతిదీ దానికదే భిన్నమైనది. ఉదాహరణకు కంచర గాడిదల చర్మాలు జాగ్రత్తగా చూడండి. అన్నీ నలుపూ తెలుపూ చారలే. కానీ ఏ ఒక్క చార కూడా ఇంకో చారను పోలివుండదు. ఏ ఒక్కదాన్ని పోలిన చారలు ఇంకోదానికి ఉండవు. వాటిదైన చర్మపుముద్ర అది! ప్రతి చెట్టు, ఆకు, పువ్వు, ఏ ఒక్కటీ ఒకే రకంగా ఉండవు. కానీ స్థూలంగా అంతా ఒకటే. ఆ సూక్ష్మమైన తేడానే ఎవరికి వారిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. కానీ అదే పోగొట్టుకుంటున్నామా అని అనుమానం.

‘‘ప్రతిమనిషికంటూ ఉన్న తనదైన రహస్యం ఏదో మాయమైపోయి, అది కేవలం సమాచారంతో భర్తీ అయిపోయింది. జీవిత రహస్యానికీ, ఈ సమాచారానికీ ఏ సంబంధమూ లేదు. ఈ జీవిత రహస్యం అనేది కొంచెం సంక్లిష్టమైనదీ, సులభంగా అర్థం చేసుకోలేనిదీ. దాని చుట్టూ మనం నర్తించగలం, అబ్బురపడగలం. కానీ అది కిలోబైట్లు, గిగాబైట్ల సమాచారంతో మాత్రం భర్తీ చేసుకోలేనిది’’ అంటారు స్వెత్లానా అలెక్సీవిచ్‌. చెర్నోబిల్‌ దుర్ఘటన, సోవియట్‌ పతనం, సోవియట్‌–అఫ్గానిస్తాన్‌ యుద్ధం లాంటి బీభత్సాల అనంతరం మహిళలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు అందరితోనూ స్వెత్లానా మాట్లాడారు. బాధిత జనాల్ని ఇంటర్వ్యూలు చేస్తూ వెలువరించిన మౌఖిక చరిత్రలకుగానూ రష్యన్‌ భాషలో రాసే ఈ బెలారూస్‌ పాత్రికేయురాలు నోబెల్‌ గౌరవం పొందారు. ‘‘ప్రపంచంలో ఎటు చూసినా ఈ ‘బనాలిటీ’(ఒరిజినాలిటీ లేకుండాపోవడం) నిండిపోయివుంది. వారిదైన సొంత మాట మాట్లాడేస్థాయికి తేవాలంటే మనుషులలోని దీన్ని ఒలిచెయ్యాలి. అప్పుడు మాత్రమే వాళ్లు అంతకుముందు ఏ మనిషీ చెప్పలేని మాటలు చెబుతారు. మనుషులను ఆ స్థాయికి తీసుకెళ్లడం నాకు ముఖ్యం’’ అంటారు స్వెత్లానా. అప్పుడు మాత్రమే ‘‘నాకు అది తెలుసని నాక్కూడా తెలియదు’’ అని వాళ్లే ఆశ్చర్యపోతారు.

యుద్ధం లేదా అత్యంత విపత్కర పరిస్థితుల్లోనే మనిషి ఉద్వేగమూ, వివేకమూ పైస్థాయికి వెళ్తాయి. విషయం మొత్తాన్నీ చాలా పైచూపుతో చూడగలిగే దృష్టి అలవడుతుంది. ఆ స్థితిలో చేయగలిగే వ్యాఖ్యానం జీవితాన్ని దర్శింపజేస్తుంది. అందుకే ప్రపంచంలో చాలా కళాఖండాలు యుద్ధ ఫలితంగా పుట్టాయి. కానీ గొప్ప కళ సంభవించడం కోసం కల్లోలం జరగకూడదు. కళ కంటే కూడా ఏ కాలంలోనైనా ప్రాణం ముఖ్యం. అందుకే మామూలు జీవితాన్నే మహత్తరంగా మార్చుకోగలగడం తెలియాలి. ‘ఒక పువ్వు రంగును చూస్తూ శతాబ్దాలు బతుకుతా’నన్న కవీంద్రులం కావాలి.

జీవితంలో నలిగిపోయిన మనిషి మాట్లాడే తీరు వేరుగా ఉంటుంది. కానీ ఆ నలిగిన మనిషి ఎవరు? ఆ ప్రశ్నకు జవాబు: ఎవరు కాదు? ప్రతి ఒక్కరూ జీవితాన్ని గొప్ప దృష్టితో చూడగలగడానికి అర్హులే అయినప్పుడు మరి అందరూ ‘ఒకే రకం’ అన్న ఫిర్యాదు ఎటుపోయింది? సమాచార బదలాయింపు అనే అర్థంలేని మాటలకే మనం పరిమితమవుతున్నాం కాబట్టి. నిజంగా ఒక లోలోతైన సంభాషణ జరగడానికి అవకాశం ఇస్తున్నామా? మాట్లాడే మనుషులు ఉండటమే కాదు, ఆ మాటలకు అంతేస్థాయిలో ప్రతిస్పందించగలిగేవాళ్లు కూడా ఉన్నప్పుడే గొప్ప సంభాషణలు జరుగుతాయి. సాంకేతికంగా అవి ఎక్కడా రికార్డు కాకపోవచ్చుగాక. కానీ మూకుమ్మడి మానవాళి ఉద్వేగపు సంరంభంలో అజ్ఞాతంగా భాగమవుతాయి. వివేకపు రాశులుగా పోగుపడి మనల్ని వెనకుండి నడుపుతాయి. ఆ జీవన సంగీతం చాలా సున్నితమైనదీ, చెవి నుంచి చెవికి సోకేంత రహస్యమైనదీ, వెన్నెల కింద నానమ్మ పక్కన పడుకుని ఏమీ మాట్లాడకుండానే ఏదో అర్థం చేసుకోవడం లాంటిదీ! ఆ జీవన సంగీతమే ప్రపంచంలో తీవ్రంగా వ్యాపితమవుతున్న నిర్హేతుకత, మూర్ఖత్వాలకు జవాబు కాగలదు.

(జూన్‌ 20, 2022 నాటి సాక్షి ఎడిటోరియల్‌)
 

Wednesday, June 22, 2022

అవధుల్లేని కళ

 అవధుల్లేని కళ


గోవిందుని అరవిందన్‌ సినిమాల్లోకి రాకముందు కార్టూనిస్టుగా పనిచేశారు. ఆయన కార్టూన్‌ స్ట్రిప్‌ ‘చెరియ మనుష్యారుమ్‌ వలియ లోకవుమ్‌’ (చిన్న మనుషులు పెద్ద ప్రపంచం) దశాబ్దానికి పైగా మలయాళ వారపత్రిక మాతృభూమిలో వచ్చింది. దీన్ని ఆధారం చేసుకొనే తన మొదటి సినిమా ‘ఉత్తరాయణం’కు(1974) శ్రీకారం చుట్టారు. అప్పటికే నాటకరంగంలో కూడా చేస్తున్న కృషి ఆయన్ని చిత్రసీమలోకి అడుగుపెట్టేలా పురిగొల్పింది. స్వాతంత్య్ర సమర కాలంలో ఒక సాధారణ యువకుడి ద్వైదీ భావాలనూ, వేర్వేరు పోరాట మార్గాలనూ, కొందరు మనుషుల అవకాశవాదాన్నీ అతిసహజంగా చిత్రించిన ఈ సినిమా మలయాళ పరిశ్రమలో కొత్తగాలిలా వీచింది. అప్పుడప్పుడే మలయాళ చిత్ర పరిశ్రమ ఉత్తరాదిన వీస్తున్న సమాంతర సినిమా పవనాలకు పరిచయం అవుతోంది.
 
మున్ముందు జి.అరవిందన్‌గా సుప్రసిద్ధం కాబోతున్న గోవిందుని అరవిందన్‌(1935–1991) తర్వాతి సినిమాగా ‘కాంచనసీత’ ప్రారంభించారు. 1977లో వచ్చిన ఈ సినిమా చూస్తే గుప్పెడుమందితో, ఏ ఆర్భాటమూ హడావుడీ లేకుండా కూడా రామాయణాన్ని తెరకెక్కించవచ్చా అన్న సంభ్రమాశ్చర్యం కలుగుతుంది. తక్కువ మాటలు, శక్తిమంతమైన ప్రతీకలు, దృశ్యబలంతో ఉత్తర రామాయణాన్ని ఒక వ్యక్తిగత కవితా అభివ్యక్తిగా మలిచారు. ఇంకా దీని విశేషం ఏమిటంటే– తారలనూ, అలవాటుగా చూస్తున్న నునుపైన తెలుపు శరీరాలనూ పక్కనపెట్టి రాముడితో దగ్గరి సంబంధం ఉందని చెప్పుకొనే ‘రామచెంచు’ తెగవాళ్లతోనే ప్రధాన పాత్రలను పోషింపజేయడం! దీనివల్ల ఛాందసవాదుల నుంచి దైవదూషణ స్థాయి వ్యతిరేకతను కూడా ఎదుర్కొన్నారు. కానీ ఆయన వెనక్కి తగ్గలేదు. సినిమా పట్ల ఆయన దృక్పథం అంత బలమైనది. అందువల్లే మలయాళంలో సమాంతర సినిమాకు దారిచూపిన మొదటి వరుస చిత్రంగా కాంచనసీత చరిత్రకెక్కింది. ఈ సినిమా షూటింగ్‌ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో జరగడం వల్ల తెలుగువారికి కూడా దీంతో మరింత సంబంధం ఏర్పడింది.

అరవిందన్‌ తర్వాతి సినిమా 1978లో వచ్చిన ‘థంపు’. అంటే సర్కస్‌ డేరా. దీన్ని బ్లాక్‌ అండ్‌ వైట్‌లో తీయాలని పూనుకోవడానికి బహుశా జీవితపు నలుపూ తెలుపుల్నీ అత్యంత గాఢంగా చూపాలని కావొచ్చు. ఒక ఊరికి సర్కస్‌ వాళ్లు రావడంతో మొదలై, కొన్ని రోజులు చుట్టుపక్కల వాళ్లని ఊరించి, ఊగించి, తిరిగి ఏ ఆదరణా లేని దశకు చేరుకుని కొత్త ఊరిని వెతుక్కుంటూ పోయేదాకా కథ సాగుతుంది. ఏ కళకైనా అవధులు ఉన్నాయనీ, ఆకర్షణ ఎల్లవేళలా నిలిచేది కాదనీ చాటినట్టుగా ఉంటుంది. ఒక గొప్ప కళాకారుడు మాత్రమే కళకు పరిమితులు ఉన్నాయని గుర్తించగలడు. జీవిత రంగం నుంచి అందరమూ ఎప్పుడో ఒకప్పుడు నిష్క్రమించాల్సిన వాళ్లమేనన్న కఠోర సత్యాన్ని కూడా ఇది గుర్తు చేయొచ్చు. దాదాపుగా డాక్యుమెంటరీలా సాగే ఈ సినిమా సర్కస్‌ చూస్తున్న ప్రతి ఒక్కరి, ప్రతి ఒక్క హావభావాలను పట్టుకుంటుంది. మనుషుల మీద ఎంతో ప్రేమ ఉన్నవాళ్లు మాత్రమే ఇలాంటి సినిమాలు తీయగలరు.

ఒక మనిషి మానసికంగా కుప్పగూలే పరిస్థితులు ఎలా వస్తాయన్నది చూపిన చిత్రం ‘పోక్కువెయిల్‌’(సాయంసంధ్య–1981). చాలా నెమ్మదైన కథనం. కానీ ‘తీవ్రమైన నెమ్మదితనం’ అది. అందులోంచే ఉద్వేగాన్ని ఉచ్చస్థాయికి తీసుకెళ్తారు. సినిమా అనేది గిమ్మిక్కు కాదంటారు అరవిందన్‌. దీనితో ఏకీభావం ఉన్నవాళ్లకు ఇది గొప్ప అనుభవాన్ని ఇవ్వగలుగుతుంది. స్త్రీ పురుష సంబంధాలూ, ఆకర్షణల్లోని సంక్లిష్టతనూ, తదుపరి పర్యవసనాలూ, పశ్చాత్తాపాలనూ ఎంతో సున్నితంగా ఆవిష్కరించిన ‘చిదంబరం’(1985) ఆయన మాస్టర్‌పీస్‌. మొదటి సినిమా మినహా ఈ అన్నింటికీ మున్ముందు మలయాళంలో మరో ప్రసిద్ధ దర్శకుడిగా అవతరించనున్న షాజీ ఎన్‌.కరుణ్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయడం గమనార్హం.
 
56 ఏళ్ల వయసులోనే అర్ధాంతరంగా కన్నుమూసిన అరవిందన్‌ ఉన్ని, కుమ్మట్టి, ఎస్తప్పన్, వస్తుహార లాంటి సినిమాలు తీయడంతోపాటు ఆరో ఓరల్, పిరవి లాంటి చిత్రాలకు సంగీత దర్శకత్వం కూడా వహించారు. తన ప్రతి సినిమాకూ ఎప్పటికప్పుడు నెరేటివ్‌ శైలిని మార్చుకుంటూ ప్రతిదాన్నీ ఒక కొత్త ప్రయోగంగా చేయడం ఆయన ప్రత్యేకతగా విమర్శకులు చెబుతారు.

‘పాన్‌ ఇండియా’, ‘పాన్‌ వరల్డ్‌’ లాంటి మాటలు కేవలం వ్యాపార లెక్కలు. నిలిచిపోయే సినిమాలకు అవి కొలమానం కాకపోవచ్చు. కానీ ఇప్పుడు దేశంలో సినిమా ప్రేమికులు అత్యంత ఆసక్తి ప్రదర్శిస్తున్న సినీ పరిశ్రమ ఏదైనా ఉందంటే, అది మలయాళ చిత్రసీమే. ఒక నిబద్ధతతో వచ్చిన చిత్రాల ఒరవడిని అద్దుకున్న జీవితపు వాస్తవికతా, కథను చూడబుద్ధేసేట్టుగా చెప్పడంలో కమర్షియల్‌ సినిమా సాధించిన ఒక వేగపు లయా... ఈ రెండింటినీ మేళవించుకొని ఇండియా మొత్తాన్నీ తమవైపు తిప్పుకొంటోంది. దాని వెనక జి.అరవిందన్‌ లాంటి దర్శకుల స్ఫూర్తి విస్మరించలేనిది.

ప్రతి ఏడాదీ ప్రపంచ సినిమా జీవులు ఎంతో ఆసక్తి కనబరిచే ప్రతిష్ఠాత్మక కాన్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఫ్రాన్స్‌లో ముగిసింది. మే 17 నుంచి 28 వరకు జరిగిన 2022 సంవత్సరపు ఈ ఉత్సవం మిరుమిట్లు గొలిపే తారల మధ్య ఎంతో వైభవోపేతంగా జరిగింది. భారతదేశం తరఫున క్లాసిక్‌ విభాగంలో అక్కడ ప్రదర్శనకు నోచుకున్న సినిమాలు రెండే రెండు. ఒకటి, సత్యజిత్‌ రే ‘ప్రతిద్వంది’ కాగా, రెండవది జి.అరవిందన్‌ ‘థంప్‌’. (కొత్త వెర్షన్‌లో థంపును థంప్‌గా మార్చారు.) రెండు నిరాడంబర సినిమాలు ఆ ఆర్భాటపు పండుగలో ప్రదర్శన జరగడం విరోధాభాసే కావొచ్చుగానీ అదే జీవితపు తమాషా కూడా!
 
(మే 30, 2022 నాటి సాక్షి ఎడిటోరియల్‌)
 

Saturday, May 14, 2022

ఆశించని గౌరవం

 


(ఫొటో రైటప్‌: మేడి చైతన్య, శ్రీనివాస్‌ చౌదరి, పూడూరి రాజిరెడ్డి, మామిడి హరికృష్ణ, బి.అజయ్‌ ప్రసాద్, మెహెర్, శ్రీశాంతి)

 

ఏప్రిల్‌ 17, 2022
పైడి జైరాజ్‌ ప్రివ్యూ థియేటర్, రవీంద్ర భారతి, హైదరాబాద్‌


ఆశించని గౌరవం
-----------------------

మొన్న ఆదివారం ఏప్రిల్‌ 17న రవీంద్ర భారతిలోని పైడి జైరాజ్‌ ప్రివ్యూ థియేటర్‌లో మా ‘వెళ్లిపోవాలి’ సినిమాను ప్రదర్శించారు. పెద్దగా జనమేం రాలేదు. కానీ వచ్చినవాళ్లు మాత్రం సానుకూలంగా మాట్లాడారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ తరఫున ఈ థియేటర్‌లో మూడేళ్లుగా ‘సండే సినిమా’ పేరుతో ప్రపంచ సినిమాలను ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ విభాగంలో మొదటిసారి ఒక తెలుగు సినిమాను వేశారు. అది వెళ్లిపోవాలి కావడం ఆశ్చర్యానందం! సినిమా అయిన తర్వాత మమ్మల్ని మాట్లాడమన్నారు. నా స్పందన:

ఎక్కడో చదివాను, దోస్తోవ్‌స్కీ తన మొదటి నవలను పట్టుకెళ్లి ఒక సంపాదకుడికి ఇస్తాడు. ఆయన దాన్ని చదివి, ‘నువ్వేం చేశావో నీకు తెలుసా?’ అన్నాడట. సినిమా తీయడం సగం అయ్యాక మమ్మల్ని మేము బూస్టప్‌ చేసుకోవడానికి మెహెర్‌తో జోక్‌ చేశాను, ‘నువ్వేం చేస్తున్నావో నీకు తెలీదు’ అని. ఇంతా చేస్తే దోస్తోవ్‌స్కీ తొలి వర్క్‌కు వచ్చిన స్పందనే అది. సో Meher! నీ ‘కరమజోవ్‌ బ్రదర్స్‌’ ఇంకా ముందే ఉంది.

సినిమాను యూట్యూబ్‌లో పెట్టడానికి ముందు దీన్ని ఎక్కడైనా స్క్రీన్‌ చేస్తే బాగుండేమో అనుకున్నాం. కానీ మేమేమీ కమర్షియల్‌ సినిమా తీయలేదు. ఆ స్క్రీనింగ్‌ను పబ్లిసిటీగా వాడుకొని మనమేమీ డబ్బులు చేసుకోలేము. ఏదో అప్రిసియేషన్‌ కోసం చేశాము. ఇంకోటేందంటే, ఇట్లాంటి క్లెయిమ్‌కు రుజువులు చూపలేముగానీ బహుశా ప్రపంచంలో దీనంత మినిమలిస్ట్‌ సినిమా ఇంకోటి ఉండకపోవచ్చు. మరి ఒక్క షో స్క్రీన్‌ చేయడానికి పది, ఇరవై వేలు అవుతుందంటున్నారు. అలాంటప్పుడు సినిమాకు పెట్టిన ఖర్చు కంటే ఎక్కువ ఒక్క షో కోసం వెచ్చించడం అనేది దీని ఫిలాసఫీకే విరుద్ధం. అందుకే కామ్‌గా యూట్యూబ్‌లో పెట్టేశాం.

నేను నా మొబైల్‌ ఫోన్లో వంద సినిమాలు చూసివుంటాను. మంచి వరల్డ్‌ సినిమాలు! కాబట్టి పెద్ద స్క్రీన్‌ అనేదానికి ఇంకా అర్థం లేదు. కానీ శంఖంలో పోస్తే తీర్థం అయినట్టుగా, పెద్ద స్క్రీన్‌ మీద వస్తే సినిమా అయిపోతుంది. అట్లా దీన్ని ఇక్కడ ప్రదర్శించి సినిమా చేసిన, అదీ ఇంత మంచి స్లాట్‌లో వేసిన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సారథి Harikrishna Mamidi  గారికీ, సండే సినిమా నిర్వాహకుడు ప్రణయ్‌రాజ్‌ వంగరికీ, ఈ కార్యక్రమం జరగడానికి వారధిగా పనిచేసిన Akshara Kumarకూ మా టీమ్‌ తరఫున ధన్యవాదాలు.

Friday, May 13, 2022

సినిమాలు ఎలా చూస్తున్నాను?

 



ఫొటో రైటప్‌: 

(కింది వరుస) మహమ్మద్‌ ఖదీర్‌బాబు, కూనపరాజు కుమార్, వేమూరి సత్యనారాయణ, హెచ్చార్కె, వి.మల్లికార్జున్, అనిల్‌ అట్లూరి, రామరాజు, వి.రాజారాంమోహన్‌ రావు, సాయి పాపినేని.

(మెట్ల మీద కింది నుంచి పైకి) శాంత, జయ, సూజాత వేల్పూరి, ఉమా నూతక్కి, ప్రసాద్‌ సూరాడ, శ్రీనాథ్‌ రెడ్డి, శిఖామణి, మానస ఎండ్లూరి, రుబీనా పర్వీన్, చిలుకూరి రామ ఉమామహేశ్వర శర్మ, మనోజ్ఞ ఆలమూరు, పూడూరి రాజిరెడ్డి)

 


ఏప్రిల్‌ 16–17, 2022

‘శాంతారామ్‌’, మన్నెగూడ



సినిమాలు ఎలా చూస్తున్నాను?
----------------------------------------


(మొన్న శని, ఆదివారాలు– అంటే ఏప్రిల్‌ 16, 17 తేదీల్లో, మహమ్మద్‌ ఖదీర్‌బాబు నిర్వహణలో, మాజీ పోలీస్‌ అధికారి చిలుకూరి రామశర్మ– చదువరి శాంత దంపతుల ఆహ్వానం మేరకు వారింట్లో ఓ ఇరవై మంది మిత్రులం కలిశాం. పౌర్ణమి వెన్నెలను చూడటం అనేది దీనికి సాకు(1). ఇదొక ఉప రైటర్స్‌ మీట్‌ లాంటిది. అందుకే ప్రసంగాలు లేవు. ఒక్క హెచ్చార్కే గారూ(డయాస్పోరా సాహిత్యం), నేనూ మాత్రమే మాట్లాడాం. మా ‘వెళ్లిపోవాలి’ వచ్చిన తర్వాత, నన్నో సినిమాజీవిని చేసి, సినిమాల గురించి మాట్లాడమన్నారు. సాధికార వ్యాఖ్యానాలు నాకు చేతగావు కాబట్టి, నేను ఎలా సినిమాలను చూసుకుంటూ వచ్చానో చెప్పాను. రాత కొంత క్రమాన్ని డిమాండ్‌ చేస్తుంది కాబట్టి ఆ మేరకు స్వల్ప మార్పులు చేశాను. సారం మాత్రం అదే.)

నా తరఫు చాలామందిలాగే నేను కూడా చిన్నప్పుడు చిరంజీవి పిచ్చోణ్ని. ఆ పేరు తలుచుకుంటేనే వైబ్రేషన్‌ వచ్చిన రోజులున్నాయి. అసలు సినిమాలు బాగుండకపోవడం అనేది తెలీదు. బొమ్మ ఎదురుగా కనబడుతుంటే బాగోకపోవడం ఏంటి ఇంకా? ఇంటర్మీడియట్, డిగ్రీ దాకా రిలీజైన ప్రతి సినిమా చూడాలని అనుకునేవాణ్ని. అరే, వాళ్లు అన్ని లక్షలు ఖర్చు పెట్టి తీసినదాన్ని మనం పది రూపాయలు ఇచ్చి చూడగలుగుతున్నాం కదా అని సంబరపడేవాణ్ని. చేతివేళ్ల మీద– బాలకృష్ణ సినిమా ఇదొచ్చిందీ, వెంకటేశ్‌ సినిమా చూశాను, నాగార్జునది చూశాను, తర్వాత మోహన్‌బాబు, రాజశేఖర్‌... జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌... అయితే అన్నీ చూసేసినట్టే! సంవత్సరంలో నూరు నుంచి నూటాయాభై దాకా చూసిన రోజులున్నాయి. ప్రతి రెండు రోజులకో సినిమా అనుకోవచ్చు. అసలు నేను బయటి ఖర్చు అంటూ పెడితే అది సినిమాకే. మళ్లీ థియేటర్లో ఏ సమోసానో ఎప్పుడూ కొనలేదు.

నేను న్యూస్‌ పేపర్లలో విధిగా చదివిన వాటిల్లో ఒకటి, ఏ థియేటర్లో ఏ సినిమాలు నడుస్తున్నాయి అనే సమాచారం. అవి చూడకపోయినా ఊరికే చదవడం కూడా బాగుండేది. అట్లా ఒకసారి కాచిగూడ పరమేశ్వరిలో ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ ఉందని చూసి, పటాన్‌చెరు నుంచి పరుగెత్తుకొచ్చాను( అప్పటికి డిగ్రీ అయ్యి, తొలి ఉద్యోగంలో ఉన్నాను.) ఒక్క మార్నింగ్‌ షో మాత్రమే వేశారు. నేను రెండో రోజు వచ్చేసరికి అదీ తీసేశారు. ఎంత నిరాశపడ్డానో చెప్పలేను. ‘వేరే’ సినిమాలు అనుకునేవి కూడా చూడాలనే ఆకలి అప్పుడప్పుడే మొదలైంది. మణిరత్నం ఒక్కడే నేను అప్పటికి చూస్తున్న ‘వేరే’. సత్యజిత్‌ రే, శ్యామ్‌ బెనెగల్, ఇలాంటి పేర్లు తెలుసు. కానీ ఎప్పుడూ వాళ్ల సినిమాలు చూడలేదు. చూసే అవకాశం కూడా లేదు. కానీ లోలోన ఒక భయం ఉండేది. వీళ్ల సినిమాలు మనం చూడలేమేమో, మెల్లగా నడుస్తాయేమో, నచ్చకపోతే వాళ్లమీద గౌరవం పోతుందేమో అనుకునేవాణ్ని. కానీ ‘పథేర్‌ పాంచాలీ’ చూసిన తర్వాత, నా భ్రమలు పోయాయి. కమర్షియల్‌ సినిమాను ఎంతగా ఆనందించగలమో వీటిని కూడా అంతే హాయిగా చూడగలం అన్నది అర్థమైంది. వాటిని ఏ అంశాల్లో ఇవి అధిగమిస్తాయో, ఎందువల్ల ఇవి క్లాసిక్స్‌ అవుతాయో, ఎందుకు ఇలాంటివే ఒక దేశపు ప్రాతినిధ్య సినిమాలుగా నిలబడతాయో అన్నది మెల్లమెల్లగా తెలిసొచ్చింది.

జర్నలిజంలోకి వచ్చి, హైదరాబాద్‌లో ఉండటం మొదలుపెట్టాక ప్రత్యామ్నాయ సినిమాల తావులు తెలియడం మొదలైంది. గోథె జెంత్రమ్, అలయన్స్‌ ఫ్రాన్సైజ్, హైదరాబాద్‌ ఫిలిం క్లబ్‌... ఒకసారి ఓ ఇటాలియన్‌ సినిమాను లామకాన్‌లో వేస్తున్నారని తెలిసి వెళ్లాను. ఇలాంటి జాగాలు నాలాంటివాడివి కాదు అన్న బెరుకు ఎందుకో నన్ను వదలదు. స్క్రీనింగ్‌ ఎక్కడో అర్థం కావడం లేదు. బయట కనబడే తెర దగ్గర ఎవరూ లేరు. మొత్తానికి ఎవరినో అడిగితే, ముఖం విప్పార్చుకుని చూశాడు. తర్వాత అర్థమైందేమిటంటే, ఆయనే ప్రదర్శకుడూ, అప్పటిదాకా నేనే తొలి ప్రేక్షకుడినీ అని!

యూట్యూబ్‌ అనేది పెద్ద నిధి. బెర్గ్‌మన్‌ సర్వస్వం సహా నేను ఎన్నో అందులోనే చూశాను. సినిమా అనేది ఒక సముద్రం. వాటిల్లో ఏది ఎంపిక చేసుకోవాలి అనేదానికి నేను ఏం చేసేవాడినంటే, ఈ వందేళ్లలో వచ్చిన వంద గొప్ప సినిమాలు అని రకరకాల జాబితాలు ఉంటాయి. వాటి తోక పట్టుకుని పోయేవాడిని. రోజర్‌ ఎబర్ట్‌కు నచ్చిన సినిమాలు ఏమిటి? లేకపోతే ఏ స్కోర్సెసీ నోట్లోంచో ఫలానా సినిమా అని ఊడిపడితే అదేమిటో చూడాలనుకోవడం... ఇట్లా నాకు దొరికినవి చూసుకుంటూ వచ్చాను.

సినిమాలు చూడటంలో ఒక షిఫ్ట్‌ లాంటిది ఏమిటంటే– క్లాసిక్స్, ఇంగ్లిష్‌ సినిమాలు పక్కనపెట్టెయ్‌... ఒక దేశానికి సంబంధించిన ఒక్క సినిమా అయినా చూడాలి. అన్నా కరేనినా నవల చదివితే మనకు ఆ మనుషుల ఉద్వేగాలు, చింతన, మనకుగా రూపుకట్టే వారి ముఖాల నీడలు తెలుస్తాయి. కానీ నిజంగా రష్యాలో మనుషులు ఎలా ఉంటారు? వాళ్లు వేసుకునే బట్టలు ఎలా ఉంటాయి? వాళ్ల ఇండ్లు ఎలా ఉంటాయి? వీటిని సినిమాల్లోనే చూడగలం. సాహిత్యం మీద సినిమా పైచేయి సాధించే సందర్భం నా ఉద్దేశంలో ఇదొక్కటే. అందుకని టాంజానియా, నైజీరియా, ఇండోనేషియా, అజర్‌బైజాన్, అల్బేనియా, రొమేనియా, అర్మేనియా, ఇట్లా చూసుకుంటూ వస్తాను. వాటిల్లో కూడా మంచి సినిమాలు ఏమిటనేది వెతుక్కోవడానికి గూగుల్‌ ఉండనే ఉంది. చైనాలో కూడా భూమ్మీద గడ్డి మొలుస్తుంది, వాకిళ్లకు గేట్లుంటాయి, అక్కడక్కడా చిన్న నీటికుంటలుంటాయి అని అనుకోవడం వేరు, దృశ్యంగా చూడటం వేరు కదా. సినిమాలతో ఇంకో ఎడ్వాంటేజీ ఏమిటంటే, ఏ తైవాన్‌నో, వియత్నాంనో తెలుసుకోవడానికి అక్కడ వచ్చిన ఒక పుస్తకం చదవలేం. దానికి వెచ్చించాల్సిన టైము, ఓపిక ఎక్కువ. కానీ ఒక రెండు గంటల్లో ఒక సినిమా చూసేయగలం.

ఇవన్నీ చూసినదానికి బహుశా ఫలశ్రుతి లాంటిది మా ‘వెళ్లిపోవాలి’. ఇరానియన్‌ సినిమా, ముఖ్యంగా కియరొస్తామీ చూపిన అతి మామూలుతనం, టర్కీ దర్శకుడు న్యూరీ బిల్జే జైలన్‌ కదా క్లౌడ్స్‌ ఆఫ్‌ మేలో తన అమ్మానాన్న కజిన్లనే యాక్టర్లుగా వాడినట్టు తెలిసిన హింటూ, కొంత బ్రెస్సన్, కొంత ఎరిక్‌ రామర్‌... వీళ్లందరినీ మార్గదర్శకులుగా పెట్టుకొని, తీరా షూట్‌ సమయానికి వీళ్లందరినీ పక్కనపడేసి మాకు తోచినట్టు చేసుకుంటూపోతే తయారైన చిత్రరాజం వెళ్లిపోవాలి. మేము ఊహించని విధంగా తెలుగు సాహిత్యలోకం దాన్ని నెత్తిన పెట్టుకుంది. అందుకు చాలా హేపీ!

––––
ఫుట్‌నోట్‌:
(1). అయితే ఆరోజు అనూహ్యంగా ఆకాశం మబ్బుపట్టింది. అయినా మబ్బులు అంటేనే తేలిపోయేవి అని కదా. ఎవరైనా పిలవగానే బ్యాగును భుజాన వేసుకుని ఎగేసుకుని ఎందుకు పోతాము, అక్కడో పెద్దమనిషి తన హోదాను పక్కనబెట్టి చివరి కారు వచ్చేదాకా గేటు దగ్గర ఎందుకు నిలబడతాడంటే... ఏదో హ్యూమన్‌ ఇంటరాక్షన్‌ కోసం. ఇంకా ఏ రుబీనా పర్వీన్‌ లాంటివాళ్ల జీవితగాథో వినడం కొసరు.